వ‌ర్రీ వ‌ద్దు వంటిల్లు ఉందిగా...

27 Jan, 2019 00:23 IST|Sakshi

కవర్‌ స్టోరీ

జడివానలో తడిసినప్పుడు జలుబు దగ్గు చేసినా, ఎండ ధాటికి తలనొప్పి వచ్చినా, చలి తాకిడికి చర్మం పొడిబారినా, బరువులు మోయడం వల్ల చేతులు గుంజినా, తడి నేల మీద పొరపాటున జారడం వల్ల కాలు బెణికినా.. ఇలాంటి చిన్నా చితకా సమస్యలు ఏవి తలెత్తినా ఇటీవలి తరానికి చెందిన జనాలు వైద్యుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. చిన్న చిన్న జబ్బులకు కూడా పెద్ద పెద్ద ల్యాబుల్లో నానా పరీక్షలూ చేయించుకుంటున్నారు. వ్యాధులు నయం కావడం సరే, జేబులకు భారీ చిల్లులు పడుతున్నందుకు కుమిలిపోతున్నారు. ఇదివరకటి కాలంలోనూ ఎండా వానా చలీ ఉండేవి. రుతువులు మారినప్పుడల్లా కాలానుగుణమైన జబ్బులు మనుషులను ఇబ్బందిపెట్టేవి. అలాగని నాటి తరం వాళ్లెరూ చిన్నా చితకా సమస్యలకు ఆస్పత్రుల చుట్టూ పరుగులు తీసేవారు కాదు. ఎందుకంటే, అప్పట్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ అనుభవంతో తలలు పండిన బామ్మలు ఉండేవాళ్లు. పోపుల డబ్బానే మెడికల్‌ కిట్‌లా, వంటింటినే క్లినిక్‌లా ఉపయోగించేవాళ్లు. చిన్నా చితకా సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేవాళ్లు. నిన్న మొన్నటి తరం వరకు ఇళ్లల్లో బామ్మలే డాక్టర్లు. వాళ్ల చిట్కాలను మీరూ పాటిస్తే ప్రతి చిన్న సమస్యకూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. రోజువారీ జీవితంలో తలెత్తే చిన్నా చితకా ఆరోగ్య సమస్యలకు  డాక్టర్‌ బామ్మల చిట్కాలు కొన్ని మీ కోసం...

తలనొప్పి
చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరికైనా తరచుగా ఎదురయ్యే సమస్య తలనొప్పి. రకరకాల కారణాల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది మెడికల్‌ షాపుల్లో దొరికే పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. సింపుల్‌గా శొంఠికొమ్ముతో సరిపోయే దానికి మెడికల్‌ షాపుల వరకు వెళ్లడం సరికాదు. శొంఠికొమ్మును నీటితో తడిపి సానరాయి మీద బాగా అరగదీసి, ఆ గంధాన్ని తలనొప్పి ఉన్న ప్రదేశంలో బాగా పట్టిస్తే చాలు. ఆ గంధం గాలికి ఆరిపోయే లోగానే తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. తలనొప్పి నివారణ కోసం శొంఠికొమ్ము కషాయాన్ని కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిలో రెండు గ్రాముల శొంఠికొమ్మును బాగా నలగ్గొట్టి వేసి, ఆ నీరు సగం అయ్యేంత వరకు మరిగించాలి. అలా తయారు చేసిన కషాయాన్ని వడగట్టి, అందులో పటికబెల్లం కలుపుకొని తాగితే తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది.  కొందరు పార్శ్వపు తలనొప్పితో బాధపడుతుంటారు. ‘మైగ్రేన్‌’ అనే ఈ పార్శ్వపు తలనొప్పి ఒక పట్టాన వదలదు. దీర్ఘకాలం వేధించే మైగ్రేన్‌కూ శొంఠికొమ్ములతోనే చక్కని విరుగుడు ఉంది. వంద గ్రాముల శొంఠికొమ్ములను తీసుకుని, నేతిలో దోరగా వేయించుకోవాలి. వేగిన శొంఠికొమ్ములను బాగా దంచి, వస్త్రఘాళితం పట్టాలి. మెత్తగా తయారైన ఈ శొంఠిపొడిలో రెండువందల గ్రాముల పాతబెల్లం కలిపి బాగా దంచాలి. దీనిని ఒక గాజు లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ రెండు పూటలా భోజనానికి ముందు ఐదు గ్రాముల చొప్పున తీసుకుని, కాసేపు చప్పరిస్తే చాలు. ఎలాంటి దోషం వల్ల తలెత్తిన తలనొప్పి అయినా మటుమాయం కావాల్సిందే. అంతేకాదు, శొంఠి–బెల్లం కలిపి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తినడం వల్ల అరుచి పోయి, బాగా ఆకలి కూడా కలుగుతుంది.
     
తలనొప్పికి విరుగుడుగా ‘చల్ల చల్లని... కూల్‌ కూల్‌...’ తలనూనెల కోసం దుకాణాలపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చక్కని తలనొప్పి నివారణ తైలాన్ని తయారు చేసుకోవచ్చు. పావుకిలో నువ్వులనూనెను మూకుడులో వేసి, పొయ్యిమీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన శొంఠి ముక్కలు, వస వేరు ముక్కలు, అతిమధురం వేరు ముక్కలు... ఒక్కొక్కటి పాతిక గ్రాముల చొప్పున వేసి, గరిటెతో కలియదిప్పుతూ వేయించుకోవాలి. ఇవి నల్లగా మారగానే, పాత్రను దించేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను వడగట్టి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటూ ఉంటే ఎలాంటి తలనొప్పులైనా నయమవుతాయి.

జలుబు – దగ్గు
ప్రతి ఒక్కరికీ తప్పని సమస్య జలుబు. సాధారణంగా రుతువులు మారే సమయంలో జలుబు, ముక్కదిబ్బడ పట్టి పీడిస్తాయి. జలుబు చేసిన వెంటనే మెడికల్‌ షాపుల్లో దొరికే మాత్రలు వేసుకుంటారు చాలామంది. ఇవి జలుబును తక్షణమే తగ్గించలేవు. జలుబు పూర్తిగా తగ్గడానికి కొన్ని రోజులు పడుతుంది. మందు మాకులు వాడినా, వాడకపోయినా సర్వసాధారణంగా ఒక వారం రోజుల్లో జలుబు దానంతట అదే నయమవుతుంది. అలాంటి దానికి మెడికల్‌ షాపుల వరకు వెళ్లకుండా, వంటింటి సామగ్రితో ఉపశమనం పొందడమే మేలు. పసుపు కొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే జలుబు వల్ల కలిగే ముక్కుదిబ్బడ కొంత వరకు నయమవుతుంది.  ఉల్లిరసం, అల్లంరసం, తేనె సమపాళ్లలో కలిపి మూడుపూటలా రెండేసి చెంచాల చొప్పున సేవిస్తే జలుబు, రొంప నుంచి ఉపశమనం దొరుకుతుంది.  దనియాల చూర్ణం, మెత్తగా దంచిపెట్టుకున్న పటిక బెల్లం సమపాళ్లలో కలిపి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, ముక్కదిబ్బడ లక్షణాలు కొంత త్వరగా నయమవుతాయి.జలుబు ఎక్కువై, గొంతులో కఫం చేరినట్లయితే చెంచాడు తేనెలో అరచెంచా కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.   శొంఠి, మిరియాలు, పసుపు కొమ్ములు సమపాళ్లలో తీసుకుని, వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకుని మూడుపూటలా తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.

జలుబుతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా బాధిస్తున్నట్లయితే తులసిపాకంతో ఉపశమనం పొందవచ్చు. తాజా తులసి ఆకులను బాగా నూరి, ఆ ముద్దను శుభ్రమైన వస్త్రంలో మూటలా ఉంచి రసం పిండుకోవాలి. వంద గ్రాముల తులసి రసంలో వంద గ్రాముల పటిక బెల్లం, పాతిక గ్రాముల అల్లం రసం, పది గ్రాముల మిరియాల పొడి చేర్చి, ఒక పాత్రలో వేసుకుని సన్ననిమంట మీద నీరంతా ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. పూర్తిగా నీరింకిన తర్వాత పాత్రను దించేసి, చల్లారిన తర్వాత పాకాన్ని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పాకాన్ని చెంచా నుంచి రెండు చెంచాల వరకు కప్పు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి తాగుతున్నట్లయితే త్వరగా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం దొరుకుతుంది. తులసిపాకం సేవిస్తున్నట్లయితే అలర్జీ వల్ల కలిగే దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

చర్మ జుట్టు సమస్యలు
కాలుష్యం పెరుగుతున్నందు ఇటీవలి కాలంలో చర్మ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, చర్మం పొడిబారడం లేదా అతిగా జిడ్డుగా మారడం, ముఖంపై మచ్చలు ఏర్పడటం, జుట్టు రాలడం వంటి సమస్యలు యువతను మానసికంగా కూడా కుంగదీస్తున్నాయి. బజారులో దొరికే క్రీములు, లోషన్లు ఎన్ని వాడినా ఈ సమస్యలు పూర్తిగా సమసిపోవు. మంచి ముఖవర్చస్సు కోరుకునేవారు ఇంట్లోనే చక్కని ఔషధ లేపనాన్ని తయారు చేసుకోవచ్చు.తెల్ల ఆవాలు, కలువపూల రేకులు, తామరపూల రేకులు, అతిమధురం, లొద్దుగ చెక్క, కస్తూరి పసుపు, మంచిపసుపు ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కొద్ది పరిమాణం నీటితో మెత్తని గుజ్జుగా రుబ్బుకోవాలి. ఈ గుజ్జులో నాలుగువందల గ్రాముల ఆవునెయ్యి కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక మందపాటి పాత్రలో వేసుకుని సన్నని మంటపై నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత దీనికి రెండువందల గ్రాముల తేనెమైనాన్ని కలిపి ఆరబెట్టాలి. పూర్తిగా చల్లారిన లేపనాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు ఈ లేపనాన్ని ముఖానికి పట్టించి, బాగా చర్మంలోకి ఇంకేలా మర్దన చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద మచ్చలు మాయమవుతాయి. శరీరం మీద ఎక్కడ మచ్చలు ఉన్నా ఈ లేపనాన్ని ఉపయోగించుకోవచ్చు.
     
జీలకర్ర, పటికబెల్లం సమభాగాలుగా తీసుకోవాలి. జీలకర్రను సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. ఇప్పడు జీలకర్రను, పటికబెల్లాన్ని కలిపి మెత్తని పొడిగా చేసుకోవాలి. ప్రతిరోజూ రెండుపూటలా బోజనానికి ముందు ఈ చూర్ణాన్ని ఒక చెంచాడు చొప్పున నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉన్నట్లయితే జుట్టురాలడం తగ్గుతుంది. కాంతిహీనంగా మారిన జుట్టుకు తిరిగి జీవకళ వస్తుంది.ఎండిన పొగాకును సన్నని ముక్కలుగా చేసి, మూకుడులో వేసి, పెద్దమంట మీద పెట్టాలి. మంట వేడికి పొగాకు మాడిపోయి బూడిదలా తయారవుతుంది. ఈ బూడిదను వస్త్రఘాళితం చేసుకుని, అందులో తగినంత కొబ్బరినూనె వేసి లేపనంలా తయారు చేసుకోవాలి. తామర తదితర ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నచోట ఈ లేపనాన్ని పూస్తున్నట్లయితే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. బూరుగు పూలు, గులాబి రెక్కలు, కస్తూరి పసుపు సమపాళ్లలో తీసుకుని, వాటిని విడివిడిగా ఆరబెట్టుకుని, పొడి చేసుకోవాలి. ఈ మూడింటి పొడిని వస్త్రఘాళితం చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పాలమీగడలో కలిపి రాత్రివేళ ముఖానికి పట్టించి, ఉదయం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద మొటిమలు, నల్లమచ్చలు వంటివి తొలగిపోతాయి.అరలీటరు కొబ్బరినూనెలో, ఐదు నిమ్మకాయల రసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై నిమ్మరసం ఇగిరిపోయి కొబ్బరినూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజూ దీనిని తలకు రాసుకుంటున్నట్లయితే చండ్రు, జుట్టురాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఒంటి, కీళ్ల నొప్పులు
దెబ్బలు తగలడం మాత్రమే కాకుండా నానా కారణాల వల్ల కీళ్లనొప్పులు, ఒంటినొప్పులు, వస్తుంటాయి. ఇలాంటి నొప్పులకు పెయిన్‌ కిల్లర్స్‌పై ఆధారపడకుండా ఇంట్లోనే తగిన ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఆముదపు గింజలను తెచ్చి వాటిని చితక్కొట్టి పైపెంకును తీసేసి, లోపలి పప్పును వంద గ్రాములు తీసుకోవాలి. దీనికి వంద గ్రాముల శొంఠి, వంద గ్రాముల పటికబెల్లం చేర్చి మెత్తగా దంచుకోవాలి. రెండుపూటలా కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు క్రమంగా నయమవుతాయి.దోరగా వేయించిన శొంఠిపొడి, అశ్వగంధ పొడి, నల్లనువ్వుల పొడి, పటికబెల్లం పొడి సమపాళ్లలో తీసుకుని, నాలుగింటినీ కలిపి వస్త్రఘాళితం చేసుకోవాలి. మూడు పూటలా భోజనం చేసేటప్పుడు ఈ పొడిని రెండు చెంచాల ఆవునేతితో కలిపి తీసుకుంటే నడుము నొప్పి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఒంటికి బలం వస్తుంది.శొంఠి పది గ్రాములు, వాయు విడంగాలు (మిరియాల్లాగే ఉంటాయి) పది గ్రాములు పొడిలా దంచుకుని, ఈ పొడిని ఒక పాత్రలో వేసి, రెండు కప్పుల నీటిలో సన్నని మంటపై మరిగించుకోవాలి. నీరు సగానికి సగం ఇగిరిపోయి కషాయం తయారయ్యాక అందులో ముప్పయి గ్రాముల పాతబెల్లం కలిపి రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటే, మహిళలకు వచ్చే నడుమునొప్పి తగ్గిపోతుంది.నిమ్మరసం పావులీటరు, నువ్వులనూనె పావులీటరు, వెల్లుల్లి గుజ్జు పావుకిలో తీసుకుని, ఈ మూడింటినీ కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించుకోవాలి. చల్లారిన తర్వాత నూనెను వడగట్టి, అందులో యాభై గ్రాముల ముద్ద కర్పూరం కలిపి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్న చోట ఈ నూనెతో మర్దన చేస్తున్నట్లయితే త్వరలోనే ఉపశమనం దొరుకుతుంది.

దంత సమస్యలు
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది దంత సమస్యలతో బాధపడుతుంటారు. అతిగా శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లకు అలవాటు పడటం, దంతాలకు అంటుకుపోయే పిజ్జా, బర్గర్‌ వంటి జంక్‌ఫుడ్‌ పదార్థాలు తరచుగా తీసుకోవడం వంటి కారణాల వల్ల చిగుళ్ల వాపు, దంతాలు వదులవడం, పిప్పిపళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తగిన ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.తుమ్మకట్టెలను కాల్చి తయారు చేసిన బొగ్గులు వంద గ్రాములు, సన్నని మంటపై పొంగించిన పటిక వంద గ్రాములు, సైంధవ లవణం వంద గ్రాములు.. ఈ మూడింటినీ మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే పళ్లపొడిగా వాడుతున్నట్లయితే దంతాలకు దృఢత్వం కలుగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి.

వంద గ్రాముల సుద్దపొడిలో నలభై గ్రాముల ఏలక గింజల పొడి, అరవై గ్రాముల సైంధవ లవణం పొడి కలిపి వస్త్రఘాళితం చేసుకుని, నిల్వ ఉంచుకోవాలి. రోజూ ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా తయారవుతాయి. నోటి దుర్వాసన వంటి సమస్యలు మటుమాయమవుతాయి.పటికను పొంగించి పొడిగా చేసుకోవాలి. సైంధవ లవణాన్ని దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి. తుమ్మబొగ్గులను పొడిగా చేసుకోవాలి. మూడింటినీ సమపాళ్లలో తీసుకుని వస్త్రఘాళితం చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంటాయి.

కంటి సమస్యలు
టీవీలు, స్మార్ట్‌ఫోన్లు వచ్చాక చిన్నారులు సైతం కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంటి చూపు మందగించకుండా ఉండటానికి, చిన్నా చితకా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే చక్కని ఔషధాలను తయారు చేసుకోవచ్చు. పిప్పళ్లు, వాయు విడంగాలు, అతి మధురం, శొంఠి, సైంధవలవణం.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మర్నాటి ఉదయం వీటిని గుజ్జులా నూరుకోవాలి. ఒక మూకుడులో అరలీటరు నువ్వులనూనె, అరలీటరు మేకపాలు వేసి, అందులో ఈ గుజ్జును వేసి సన్నని మంటపై వేడి చేయాలి. బాగా ఉడికిన తర్వాత మూకుడును దించేసి, చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టిన తైలాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ముక్కులో నాలుగు చుక్కల చొప్పున వేసుకుని నశ్యంలా పీలుస్తుంటే కంటికైన గాయాలు, కంటిలో ఏర్పడి పుండ్లు తగ్గుతాయి.
     
కంటిచూపు క్షీణించకుండా ఉండటానికి త్రిఫలాఘృతం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కరక్కాయల బెరడు, గింజలు తీసేసిన ఉసిరికాయ ముక్కలు, తానికాయ ముక్కలు.. ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పన తీసుకుని, వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పాత్రలో మూడు లీటర్ల నీరు తీసుకుని, నూరుకున్న త్రిఫలాల పొడిని నీట్లో వేసి, లీటరు కషాయం మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకొని, అందులో అరలీటరు ఆవుపాలు, పావులీటరు ఆవునెయ్యి వేసి నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇలా తయారైన త్రిఫలా ఘృతాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకుని, ప్రతిరోజూ పది గ్రాముల చొప్పున భోజనానికి ముందు సేవిస్తున్నట్లయితే కంటిచూపు మెరుగుపడుతుంది.

జీర్ణ  సమస్యలు
ఫాస్ట్‌ఫుడ్‌ సంస్కృతి పెరిగాక అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కడుపులో ఏకాస్త ఇబ్బంది తలెత్తినా ఎడాపెడా యాంటాసిడ్‌ సిరప్‌లు, పౌడర్లు వాడేస్తూ ఉంటారు చాలామంది. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వంటింటి సామగ్రిని సజావుగా ఉపయోగించుకున్నట్లయితే, యాంటాసిడ్లతో పనే ఉండదు.శొంఠికొమ్ములను, మిరియాలను, శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న వేపచెట్టు బెరడును సమపాళ్లలో దోరగా వేయించుకుని మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకొని పరగడుపున తీసుకుంటున్నట్లయితే ఎసిడిటీ, పులితేన్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కరక్కాయ, పిప్పళ్లు, శొంఠి, వాము, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల పరిమాణం చొప్పున తీసుకోవాలి. వీటిలో వాము, శొంఠి, పిప్పళ్లను దోరగా వేయించుకోవాలి. వీటికి సైంధవ లవణాన్ని, కరక్కాయలను చేర్చి మెత్తని పొడిగా చేసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఈ పొడిని అరచెంచా చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకుంటున్నట్లయితే మందగించిన ఆకలి మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.

నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి, ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన తాజా అల్లం ముక్కలను వారం రోజులను నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం ముక్కలను ఎండబెట్టాలి. ఈ అల్లాన్నే ‘భావన అల్లం’ అంటారు. ‘భావన అల్లం’ ముక్కలను ఒక అరచెంచాడు నోట్లో వేసుకుని నమిలితే అరుచి తగ్గి, ఆకలి పుడుతుంది.  ‘భావన అల్లం’ తయారు చేసుకున్నట్లే నిమ్మరసం సైంధవ లవణాలతో జీలకర్రను కలిపి, వారం రోజులు నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టిన జీలకర్రను ‘భావనజీర’గా తయారు చేసుకోవచ్చు. ‘భావన జీర’ కూడా జీర్ణకోశ సమస్యలకు మంచి విరుగుడుగా పనిచేస్తుంది.రెండు చిటికెల ఇంగువ, పావుచెంచా వాము దోరగా వేయించి, పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం దొరుకుతుంది.  తాజా కరివేపాకును మెత్తగా రుబ్బుకొని, ఆ ముద్దను వస్త్రంలో వేసుకుని రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకు రసం రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. రక్తహీనత తగ్గుతుంది.

చిన్న కరక్కాయలు యాభై గ్రాములు, సోంపు గింజలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, సైంధవ లవణం పది గ్రాములు ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి. వీటికి ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లంరసం కలిపి, ఎండబెట్టాలి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మెత్తని పొడిగా చేసుకుని గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. చెంచాడు తేనెలో ఈ చూర్ణాన్ని అరచెంచాడు కలిపి రెండుపూటలా తీసుకుంటన్నట్లయితే అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.దానిమ్మగింజలను ఎండబెట్టి, వంద గ్రాముల పొడి తయారు చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి యాభై గ్రాముల పొడిని తయారు చేసుకోవాలి. వీటికి పాతిక గ్రాముల సైంధవ లవణం పొడిని జత చేసి మూడింటినీ వస్త్రఘాళితం చేయాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం తర్వాత ఈ పొడిని అరచెంచాడు చొప్పున కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల నుంచి కడుపునొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. 

మరిన్ని వార్తలు