మహిళల హక్కులకు రెక్కలు

8 Mar, 2020 10:33 IST|Sakshi

‘అన్నయ్య, నువ్వు...  ఇద్దరూ సరిగ్గా చదవట్లేదు. చదువుకోకపోతే అంతే!  పెద్దయ్యాక వాడు కార్లు తుడుచుకుంటాడు..  నువ్వేమో అంట్లు తోముకుందువుగానీ..’  ఒక అమ్మమ్మ అయిదేళ్ల పిల్లతో.  ‘నేనెందుకు అంట్లు తోముతా... నేను కూడా కార్లే తుడుస్తా...’ అమ్మమ్మకు చెప్పింది అయిదేళ్ల ఆ పిల్ల. ఫేస్‌బుక్‌లోని ఒక పోస్ట్‌ ఇది. ఆ చిన్నపిల్ల జవాబు నవ్వు తెప్పించడమే కాదు.. ఆలోచననూ కలిగిస్తుంది. మనలో జీర్ణించుకుపోయిన జెండర్‌ ఇన్‌సెన్సిటివిటీనీ ప్రశ్నిస్తుంది. 

చదువుకోకుండా చేసే పనులకే కాదు చదువుకొని చేసే పనులకూ అంటగట్టిన లింగవివక్ష గత ఇరవైఏళ్లుగా ఎక్కడో ఒక చోట ఎంతోకొంత బ్రేక్‌ పడుతోంది. ముఖ్యంగా ఈతరం ఆ ప్రయత్నం పట్ల మొండిగానే ఉంది. భవిష్యత్తుకి ఆశ ఆ అయిదేళ్ల అమ్మాయే. ఒకరకంగా చెప్పాలంటే జెండర్‌ ఈక్వాలిటీకి సంబంధించి అంతకుముందు జరిగిన అనేక పోరాటాల ఫలితమే ఈ రెండు దశాబ్దాల కాలం. భారత స్వాతంత్య్ర సముపార్జనా సమరంలో మహిళలది సమ భాగస్వామ్యం. స్త్రీల విద్య, హక్కుల కోసమూ అంకురార్పణ జరిగిందప్పుడే. వాటి కోసం సావిత్రబాయి పూలే, అనీబిసెంట్,  రాజారామ్మోహన్‌ రాయ్, కందుకూరి వీరేశలింగం, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వంటి వాళ్లెందరో నడుం బిగించారు. అప్పటిదాకా ఆచారాలు, సంప్రదాయాలుగా ఉన్న ఎన్నో దారుణాలను రూపుమాపేందుకు కృషి చేశారు. ఆ నేపథ్యంలోనే మహిళలు చదువుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రాపంచిక జ్ఞానం ఉండాల్సిన అవసరాన్నీ గ్రహించారు. తమ ఒంటి మీది బంగారం కన్నా సామాజిక స్పృహకు విలువెక్కువని గుర్తెరిగారు. వంటింట్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ నిర్ణయాధికారం కావాలని నిశ్చయించుకున్నారు. అయితే స్వాతంత్య్రం సిద్ధించాక ఈ స్ఫూర్తి సున్నా అయింది. మళ్లీ మొదటికి వచ్చింది ఆడవాళ్ల పరిస్థితి. స్వాతంత్య్రానంతరమూ అదలాగే కొనసాగితే  నేడు మన దేశ మహిళా ప్రగతి సుస్థిరంగా నిలిచేది. 

లేట్‌ ఈజ్‌ బెటర్‌దేన్‌ నెవర్‌.. 
జీరో అయిన జెండర్‌ ఈక్వాలిటీ స్ఫూర్తి స్వాతంత్య్రానంతరమూ పిడికిలి బిగించింది. హక్కుల కోసం, సమానత్వం కోసం మళ్లీ పోరాటం మొదలుపెట్టింది. విద్యావకాశాలతో అక్షరాభ్యాసం చేసి.. వైద్య, విజ్ఞాన, వాణిజ్య, సైనిక, న్యాయ, ప్రభుత్వ పాలన, రాజకీయ, సృజనా రంగాల్లో ఉద్యోగాలు సరే.. ఏకంగా నాయకత్వం కోసమే పోటీపడే స్థాయికి ఎదిగింది. దక్కిన అవకాశాలతోనే సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అదేమీ ఆషామాషీ ప్రస్థానం కాదు. ఉన్నత చదువుల కోసం.. మెరుగైన ఉపాధి కోసం ఈ రోజు అమ్మాయిలు అవలీలగా సరిహద్దులను దాటగలుగుతున్నారంటే..  ఆ దారి చూపించిన మజిలీయే. వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన మహిళలు ప్రపంచ నాయకులుగా నిలబడ్డారంటే.. ఆ పోరాటం పంచిన ప్రేరణే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు విజయం సాధించిన ప్రతి వనితను వెన్నుతట్టి ముందుకు తోసింది ఆ నాటి పిడికిలి బలమే. 

మార్కెట్‌ చెప్తోంది మారిన తీరు... 
‘ఎన్నింటికి వస్తున్నావ్‌?’ ఆఫీస్‌లో ఉన్న భార్యకు ఫోన్‌ చేశాడు భర్త.  తను ఇల్లు చేరే టైమ్‌ చెప్పింది భార్య. ఆమె వచ్చేసరికల్లా  వంట వండి.. టేబుల్‌ మీద సర్ది.. కలిసి భోంచేయడం కోసం వెయిట్‌ చేస్తూంటాడు భర్త. 
∙∙ 
‘అబ్బాయి బాగున్నాడు. మంచి ఉద్యోగం.  ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి. అతనితో పెళ్లికి ఎందుకు అభ్యంతరం?’ కూతురుకి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు తల్లిదండ్రులు. 
‘మూడేళ్ల తర్వాత చేసుకుంటాను’ చెప్తుంది కూతురు. 
‘మూడేళ్లా?’ నోరు వెళ్లబెట్టారు పేరెంట్స్‌. 
‘వాటన్నిటినీ నేనూ సంపాదించాలిగా!’  నింపాదిగా జవాబు ఇచ్చింది అమ్మాయి. 
∙∙ 
చామనచాయ కంటే తక్కువ రంగున్న అమ్మాయి డ్రెసింగ్‌ టేబుల్‌ సొరుగులో ఫెయిర్‌నెస్‌ క్రీములు ఉండవు.. ఆమె మెదడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. రోజూ అద్దంలో చూసుకుంటూ తన ఒంటి రంగు గురించి దిగులు పడదు.. తన కెరీర్‌లో ఒడిదుడుకులను బేరీజు వేసుకుంటూ పనితీరును మెరుగుపరుచుకుంటూంటుంది. ఆమె..ఆధునిక యువతులకు ప్రతినిధి. 
పైన ఉదహరించినవన్నీ యాడ్‌ ఫిల్మ్సే. ఆయా కంపెనీల ప్రొడక్ట్స్‌ను ప్రమోట్‌ చేసేవి. ఈ యాడ్స్‌ను ఇలా చూపించడానికి కారణం మారిన ఆలోచనల తీరే. దాని మీద మార్కెట్‌ శక్తులు జరిపిన పరిశోధనల ఫలితం. ఒక సమాజపు సంస్కృతి, సంప్రదాయాలు, అభిరుచులు, విశ్వాసాలు, జీవనశైలులను మార్కెట్‌ కన్నా ముందుగా మార్కెట్‌ కన్న అందంగా ఎవరు చెప్పగలరు? అందుకే ఉత్పత్తుల ప్రమోషన్లు ఈ రకమైన ఫ్రేమ్‌లోకి మారాయి. అంటే మూసకు చెక్‌ పడ్డట్టే. పెళ్లి, కెరీర్‌ వంటి వాటిల్లో నేటి అమ్మాయిలకు స్పష్టత ఉన్నట్టే. ఇదీ సాధికారతలో భాగమే. 

చదువుల తల్లులు
ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసింది భావన. పీహెచ్‌డీ కోసం విదేశీ యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకుంది. అమెరికా, లండన్‌... రెండు చోట్లా సీటు దొరికింది. అప్పుడే ఒక ఐఏఎస్‌ సంబంధమూ వచ్చింది. కూతురి ఆశ, ఆశయం తెలిసిన, అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆ పెళ్లి సంబంధం గురించి భావనను ఒత్తిడి చేయలేదు. నిర్ణయాన్ని ఆమెకే వదిలేశారు. తన పీహెచ్‌డీకే ప్రాధాన్యమిచ్చి లండన్‌ వెళ్లిపోయింది భావన. పిల్లల అభిప్రాయాలకు విలువనిచ్చే కుటుంబానికి, అమ్మాయి నిర్ణయాధికారానికి ఒక ఎగ్జాంపుల్‌ ఇది. 
 ఇంకో కుటుంబంలో అమ్మాయి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లిచేశారు. తన లక్ష్యం గురించి భర్తకు చెప్పింది. అర్థం చేసుకొని ఆమెను ప్రోత్సహించాడు భర్త. తర్వాత తన భార్య ఉద్యోగం చేయడాన్నీ ఇష్టపడ్డాడు. ఇంటి పనుల్లో పాలు పంచుకున్నాడు. యువతలో వచ్చిన మార్పుకు, మహిళా హక్కుల పోరాటంతో పురుషులు గ్రహించిన బాధ్యతకు నిదర్శనం ఇది. 

వ్యాపారమణులు
‘సర్‌... మన సేల్స్‌ పెరగాలంటే ఫలానా ఉచితం, ఫలానా శాతం డిస్కౌంట్‌ అని పెడదాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అందాం...’ అంటూ ఆ చిట్టా చెప్పుకుపోతూనే ఉన్నాడు యజమానితో మేనేజర్‌. 
పక్కనే ఉన్న ఆమె నవ్వింది. నవ్వుతూనే ఉంది.  ‘ఏమమ్మాయ్‌... ఎందుకలా నవ్వుతున్నావ్‌?’అడిగాడు యజమాని కోపంగా. 
‘పావలా కోడికి ముప్పావలా మసాలా అంటే ఇదే’ అంది నవ్వుతూనే. 
‘అమ్మాయ్‌...’ కోపం, అవమానంతో యజమాని. 
‘క్షమించండి... మీ లాభాలకన్నా ఈ స్కీమ్‌ల ఖర్చే ఎక్కువుండేట్టుంది. దాని బదులు మా దగ్గర కొన్న సరుకుల్లో ఒక్క చచ్చు, బెడ్డ, పుచ్చునైనా  పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్‌ పెట్టండి. నాణ్యమైన సరుకును అమ్మండి.. ఎందుకు సేల్స్‌ పెరగవూ’ అని సలహా ఇస్తుంది ఆ అమ్మాయి సీరియస్‌గా. 
ఆ ప్లాన్‌ పారుతుంది. సేల్స్‌ పెరుగుతాయి. అన్నపూర్ణ ఫుడ్స్‌ అనే ఆ కంపెనీకి ఆమే మేనేజింగ్‌ డైరెక్టర్‌ అవుతోంది. ఇది ‘మిస్టర్‌ పెళ్లాం’ సినిమా సన్నివేశమే అయినా... నిజ జీవితంలోని స్త్రీల వ్యాపార దక్షతకూ చిహ్నమే. చురుకుదనం, సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగల తెగువతో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్నీ ఏలుతున్నారు మన మహిళామణులు. ఇంద్ర నూయి, కిరణ్‌ మజుందార్‌ షా పాతవాళ్లే అని కొట్టి పారేయకండి. వీరే.. వందనా లూత్రా, సుచి ముఖర్జీ, రిచా కర్‌ వంటి కొత్తరక్తానికి రోల్‌మోడల్స్‌. 

ఆర్థిక సిరులు..
‘నాకు బైక్‌ కావాలి’ కొడుకు డిమాండ్, ‘నేను ఫలానా కోర్స్‌లో జాయిన్‌ కావాల్సిందే’ కూతురి అవసరం, ‘ఒరేయ్‌.. గుండె దడగా ఉంటోందిరా.. చెకప్‌కి తీసుకెళ్తావా?’ అమ్మ ఆరోగ్య భయం, ‘అన్నయ్యా.. మీ బావగారు కొత్తగా బిజినెస్‌ పెడ్తున్నాడు ఎంతో కొంత సర్దగలవా?’ చెల్లి అభ్యర్థన... మతి పోయింది అతనికి. ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌ రాగానే సరిపోదు నాన్నా.. పెట్రోల్‌ ఖర్చును భరించే ఉద్యోగమూ కావాలి. అప్పుడు ఆలోచిద్దాం బైక్‌ గురించి సరేనా?’ అంటూ కొడుకును వెనక్కి లాగి, ‘తప్పకుండా జాయిన్‌ కావాలి.. ముందు కొంత కట్టి.. తర్వాత వాయిదాల మీద కడతామని మాట్లాడు’ కూతురి అవసరాన్ని సర్దుబాటు చేసి, ‘అత్తయ్యా.. రాత్రికి పెందళాడే తినండి.. ఉదయం, సాయంకాలం నాతోపాటు కాస్త వాకింగ్‌కు రండి’ అంటూ అత్తగారి గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ను అర్థం చేసుకొని, ‘నెల జీతం తెచ్చుకునే మీ అన్నయ్యకు మీ ఆయన వ్యాపారంలో హెల్ప్‌ చేసేంత సీనా పిల్లా’ అంటూ ఆడపడచు దగ్గర చెడ్డరికమై.. తన ఇంటి బడ్జెట్‌కు  ఒడిదుడుకుల్లేకుండా చూసుకునే  నేర్పరి ఆమె. అందుకే దేశమనే ఉమ్మడి కుటుంబ ఆర్థిక బాధ్యతనూ మహిళకే (నిర్మలా సీతా రామన్‌) అప్పగించారు. బ్యాంక్‌ (ఎస్‌బీఐ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య) స్టాక్‌ మార్కెట్‌ (చిత్రా రామకృష్ణ) నిర్వహణా భారాన్నీ  ఆడవాళ్ల మీదే పెట్టారు. 

ప్రభుత్వ పాలనా విధులు...
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్న పురుష ఐఏఎస్‌ అధికారుల గురించి సినిమాలు వచ్చాయి కాని అలా తెర మీదకు రాని వృత్తి నిబద్ధులైన మహిళా ఐఏఎస్‌లు మనకు చాలా మందే ఉన్నారు. భూ ఆక్రమణ దారులను పరిగెత్తించి, మహిళా సంస్కరణలను చేపట్టిన ఘనతను సొంతం చేసుకున్న ఐఏఎస్‌లలో టీవీ అనుపమ, స్మితా సబర్వాల్, శ్రీదేవసేన వంటి వాళ్లెందరో లెక్కకు మిక్కిలి. 
రాణి ముఖర్జీ నటించిన మర్దానీ, మర్దానీ–2 సినిమాలు సూపర్‌ హిట్‌. అందులోని ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడని అభిమానుల్లేరు. ఆ రీల్‌కు రియల్‌ లైఫ్‌ ఇన్‌స్పిరేషన్‌ మీరా బొరాంకర్‌ అనే ఐపీఎస్‌ ఆఫీసర్‌. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆమె దావూద్‌ ఇబ్రహీం, ఛోటా రాజన్‌ గ్యాంగ్స్‌కు వణుకు పుట్టించింది. ముంబైలో అందరూ ఆమెను ‘లేడీ సూపర్‌కాప్‌’ అని గౌరవంగా పిలుచుకుంటారు. మెరిన్‌ జోసెఫ్, సంజుక్తా పరాశర్‌ వంటి సూపర్‌ కాప్స్‌ ఉన్నారు!  

విజ్ఞాన ఖనులు.. 
ఇల్లు, సంసారమే కాదు సైన్సూ మాకు మచ్చికే అంటున్నారు మనవాళ్లు. అద్దంలో చంద్రుడిని చూపించి పిల్లలకు అన్నం తినిపించినంత తేలికగా చంద్రుడి మీద అధ్యయనం చేసేందుకు శాటిలైట్లనూ పంపారు. ‘చంద్రయాన్‌’ వంటి భారీ ప్రాజెక్ట్‌లను సక్సెస్‌ చేశారు. ఇంకెన్నో ప్రయోగాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరెన్నో పరిశోధనలకు నడుం బిగిస్తున్నారు. టెస్సీ థామస్, ఎమ్‌.వనిత, రితూ కరీదార్‌లు ఉదాహరణలు మాత్రమే. 

వైద్యవెలుగులు
సహనం.. వైద్యుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అది స్త్రీ నైజం. సేవాతత్పరత ఆమె ఆభరణం. అందుకేనేమో.. చదువు ఆమె చెంతకు చేరిననాటి నుంచీ వైద్యవిద్య వాళ్ల ఐచ్ఛిక విషయమైంది. ఈ రంగంలో తొలి నుంచి పురుషులకు దీటుగానే రాణిస్తున్నారు. గైనకాలజీయే కాదు, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఏదైనా సరే.. అందులో నైపుణ్యాన్ని ఇంటిపేరుగా స్థిరం చేసుకుంటున్నారు. 

పాత్రికేయ పరాశక్తులు..
యుద్ధ విశేషాలను సామాన్యుల గడపల్లోకి చేర్చే చొరవ పత్రికలు, టీవీ చానళ్లదే. ఆ కవరేజ్‌ దొరికేది ఎక్కువగా పురుష పాత్రికేయులకే. ‘మేమెందుకు వెళ్లకూడదు?’అని ప్రశ్నించిన ప్రభాదత్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంత పూచీకత్తుతో యుద్ధ వార్తలను రాయడానికి వెళ్లి విజయవంతం అయింది. ఆ స్ఫూర్తి, ధైర్యం, వారసత్వం ఈ తరానికీ సాగింది. యుద్ధ వార్తలను మాత్రమే కాదు.. దేశంలో జరుగుతున్న అన్యాయాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు చేరవేసి.. వాళ్లను చైతన్యవంతులను చేసే సీరియస్‌ జర్నలిజానికి అంకితమయ్యారు.. బర్ఖాదత్, ఫేయ్‌ డిసూజా, రానా ఆయూబ్, నేహా దీక్షిత్, మస్రత్‌ జహ్రా వంటి పరాశక్తులెందరో. 

రాజకీయ రారాణులు
ఈ స్ఫూర్తి మాత్రం స్వాతంత్య్ర పూర్వం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. నాడు జాతీయ కాంగ్రెస్‌కు సరోజినీ నాయుడు అధ్యక్షురాలయితే.. ఈ తరంలో సోనియా గాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌ అయింది. సుచేతా కృపలానీ పరంపరా కొనసాగుతోంది. జయలలిత, మాయావతి, వసుంధరరాజే, మమతా బెనర్జీల పాలనతో. ఇందిరా గాంధీ తర్వాత ప్రధాని ఎవరూ కాలేకపోయినా ప్రతిభా పాటిల్‌ను  రాష్ట్రపతిని చేసి అగ్రరాజ్యం అమెరికా సాధించలేని ఘనతనూ సొంతం చేసుకుంది మన దేశం. అయితే ఇది సరిపోదు.. చట్టసభల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. దానికీ పోరాటాలు జరుగుతున్నాయి. విజయమూ వరిస్తుంది.  

మిలటరీ టాస్క్‌...
వంట కన్నా ఈజీ.. చేసి చూపించారు కూడా. కనుకే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.. ఆర్మీలోనూ కమాండ్‌ పోస్టులు స్త్రీలకు ఇవ్వాలి అని. వ్యూహం, ప్రతివ్యూహం, సునిశిత దృష్టి, మనో నిబ్బరం.. ఇవన్నీ ఆడవాళ్ల సహజలక్షణాలు. ఆర్మీకి కావల్సిన క్వాలిఫికేషన్స్‌ కూడా. మరి ఇందులో వీళ్లను బీట్‌ చేసేదెవరు? ఆలస్యంగా ప్రవేశం దొరికినా.. సంఖ్య పరిమితంగా ఉన్నా .. కనబరచిన ప్రతిభ అసామాన్యం. గరిటనే కాదు.. ఫైటర్‌ ఫ్లయిట్‌నూ తిప్పగలమని గుంజన్‌ సక్సేనా వంటి వారు ఇప్పటికే నిరూపించారు.  

ఉద్యమ శక్తులు.. 
అత్తమామలు ఆరళ్లు పెట్టినా, భర్త కొట్టినా, కొడుకు తిండి పెట్టకపోయినా.. మౌనంగా భరిస్తూ బతుకంతా పరాధీనంగా వెళ్లదీసిన గతం గడిచిపోయింది. నోరు విప్పితే కాపురం గడపదాటుతుందనే భయమూ వదిలిపోయింది. నాకు నేను ముఖ్యం.. నాకూ వ్యక్తిత్వం ఉంది.. అమ్మానాన్నలు, అత్తామామలు, భర్త, పిల్లలు ఎవరి దగ్గరి నుంచైనా గౌరవం పొందే హక్కు నాకూ ఉంది అన్న చైతన్యం వచ్చింది. తన శరీరం మీద తనదే హక్కు అనీ  గ్రహించారు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారు. జరిగిన అన్యాయాన్ని ‘మీ టూ’ అంటూ బయటపెట్టడం తెలుసుకున్నారు. ఈ క్రమంలో నేరాల నమోదు పెరగడం శుభ సూచకం. పోరాడితే దక్కేవి మన హక్కులే అన్న సత్యం అవగతమైంది. బడిలో, గుడిలో, ఆఫీసుల్లో, ప్రభుత్వాల్లో, రాజకీయాల్లో, మిలిటరీలో, వ్యాపారాల్లో అన్నింటిలోనూ సమానస్థాయి కోసం పోటీ పెరిగింది. ప్రపంచంలోకెల్లా వర్కింగ్‌ విమెన్‌ జనాభా ఎక్కువగా ఉన్న దేశం మనదే. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు మొదలైన ప్రొఫెషనల్స్‌లో మన వాళ్లే ఎక్కువట.

సవాళ్లు.. 
ఇన్ని విజయాలు సాధించినా ఇంకా కొన్ని సవాళ్లు మిగిలిపోయాయి. వాటినీ ఎదుర్కోవాలి. ముఖ్యంగా హింస, దాడులను అరికట్టే విషయంలో. చట్టాలు సహాయపడుతున్నా.. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఇంకా శక్తి కావాల్సి వస్తోంది. వాటిల్లో ముఖ్యమైనది.. ప్రమాదకరమైనది.. మగపిల్లలతో సమానంగా లేని ఆడపిల్లల సంఖ్య. త్వరలోనే ఇదీ పరిష్కారమవ్వాలి. ప్రగతిని సుస్థిరం చేసుకోవాలి. మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారనడంలో సందేహం లేదు. ఆమె హక్కులను అర్థం చేసుకోలేని పురుషులే వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. తెలివిడి తెచ్చుకోవాల్సింది మగవాళ్లే. అప్పుడే సాధ్యమవుతుంది స్త్రీ, పురుష  సమానత్వం  

లింగ వివక్షను రూపుమాపడం ఈ కాలంలోనూ సాధించాల్సిన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితీ అంగీకరించింది. ఈ అంశంపై ‘ది అన్‌ఫినిష్డ్‌ బిజినెస్‌ ఆఫ్‌ అవర్‌ టైమ్‌’ శీర్షికన తన అధికారిక వెబ్‌సైట్‌లో ఒక సమగ్ర వ్యాసాన్నే ప్రచురించింది. ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 195 సభ్య దేశాల్లో 143 దేశాలు మాత్రమే తమ రాజ్యాంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్నాయి. వాటిల్లో కూడా చాలా దేశాల్లో .. మహిళల సమాన హక్కులకు ఆచరణ యోగ్యం లేదు. రాజ్యాంగాలకు, చట్టాలకే పరిమితమై ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2010 జూలై 2న ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ మహిళల కోసం ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫలితంగా అప్పటి వరకు ఐక్యరాజ్య సమితిలోనే ఉన్న ‘యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ ఫర్‌ విమెన్‌’ (యునిఫెమ్‌), ‘డివిజన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌’ (డీఏడబ్ల్యూ), ‘ఆఫీస్‌ ఆఫ్‌ ది స్పెషల్‌ అడ్వైజర్‌ ఆన్‌ జెండర్‌ ఇష్యూస్‌’, ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌’ మొదలైన సంస్థలన్నీ విలీనమై.. మహిళల సాధికారిత, స్వావలంబన కోసం ఏకైక సంస్థగా మారి.. ‘యుఎన్‌ విమెన్‌’గా అవతరించింది. 

ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు :
పార్లమెంటులో
మన పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో  పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగానే  పెరిగింది. స్వాతంత్య్రం వచ్చాక 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పది మంది మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. 

కార్పొరేట్‌ రంగంలో...
దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్న కార్పొరేట్‌ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ నామమాత్రంగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ రంగంలో మహిళల ఉనికి లేదనే చెప్పొచ్చు. ఇటీవలి కాలంలోనే కొంత మార్పు వచ్చింది. కార్పొరేట్‌ సంస్థల ఎండీ, సీఈవో స్థాయి పదవుల్లో 3.69 శాతం మంది మహిళలు ఉన్నారు. 

దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్న కార్పొరేట్‌ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ నామమాత్రంగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ రంగంలో మహిళల ఉనికి లేదనే చెప్పొచ్చు. ఇటీవలి కాలంలోనే కొంత మార్పు వచ్చింది. కార్పొరేట్‌ సంస్థల ఎండీ, సీఈవో స్థాయి పదవుల్లో 3.69 శాతం మంది మహిళలు ఉన్నారు. పోలీసు, రక్షణ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పోలీసు బలగాల్లో మహిళలు 7.28 శాతం. వీరిలో కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగులే ఎక్కువ. అధికారం గల పోలీసు ఉద్యోగాల్లో మహిళలు ఒక శాతం లోపే. రక్షణ బలగాల్లోని త్రివిధ దళలనూ చూసుకుంటే వైమానిక దళంలోనే మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వైమానిక దళంలో 13.09 శాతం, నావికా దళంలో 6 శాతం, సైనిక దళంలో 3.8 శాతం మహిళలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కమాండ్‌ పోస్టుల్లో మహిళల నియామకాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునివ్వడం ఆశాజనకమైన పరిణామం.
 – సరస్వతి రమ

మరిన్ని వార్తలు