ప్రయాణం

3 Mar, 2019 00:31 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘బాబూ.. కారు ఆపు...’’ దాదాపు అరిచినంత పనిచేశాడు సృజన్‌. ఆ కేకకు నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచింది అలేఖ్య. సడెన్‌ బ్రేక్‌ వేశాడు డ్రైవర్‌. ‘‘వాట్‌ హ్యాపెండ్‌ సృజన్‌’’ గాబరాగా అడిగింది. ఆ మాట వినిపించుకోకుండానే.. ‘‘కాస్త వెనక్కి పోనియ్‌’’ చెప్పాడు డ్రైవర్‌కి. మెల్లగా రివర్స్‌ పోనిచ్చాడు డ్రైవర్‌. ‘‘ఆ..ఆ...స్టాప్‌.. స్టాప్‌. ఇక్కడ ఆపు’’ సృజన్‌.కారు ఇంకా పూర్తిగా ఆగకముందే హడావిడిగా డోర్‌ తెరుచుకుని దిగేశాడు. విస్తుపోతోంది అలేఖ్య భర్త ప్రవర్తన చూసి. కారు ఆగాక తనూ దిగింది. కారుకు రెండు అడుగుల దూరంలో ఉన్న ఓ వ్యక్తి వైపు పరిగెత్తాడు సృజన్‌. ‘‘నమస్కారం సర్‌..’’ అన్నాడు.ఆ వృద్ధుడు వణుకుతున్న చేతిని నుదుటికి అడ్డం పెట్టుకుంటూ పరీక్షగా చూశాడు సృజన్‌ను. ‘‘సర్‌.. నేను.. సృజన్‌ను. సాయిలు చిన్న కొడుకును’’ అతనికి జ్ఞప్తికి తెప్పించే ప్రయత్నం చేశాడు.‘‘ఏ సాయిలు? పెద్ది సాయిలా?’’ సృజన్‌ను పరీక్షగా చూస్తూ అన్నాడు ఆ పెద్ద మనిషి. ‘‘ఆ... అవును సర్‌. పెద్ది సాయిలు కొడుకునే..’’ వినమ్రంగా చెప్పాడు ‘‘కెనడాలో ఉంటున్నావట కదా..?’’ పెద్ద మనిషి.ఎండ మండిపోతోంది. అలేఖ్యకు చిరాగ్గా ఉంది. ‘‘సృజన్‌...’’ పిలిచింది. ఆమె వైపు తిరిగి ‘‘ఇటు రా’’ అన్నట్టు సైగ చేసి.. ‘‘అవును సర్‌.. కెనడాలో ఉంటున్నాను. ఆరేళ్లవుతోంది’’ అన్నాడు. ఈలోపే అలేఖ్యవాళ్లను చేరింది. ‘‘సర్‌.. అలేఖ్య.. నా భార్య’’ అంటూ ఆమెను పరిచయం చేశాడు. ‘‘నమస్తే’’ చెప్పింది అలేఖ్య ముభావంగానే. ‘‘నమస్తే బేటా..’’ వృద్ధుడు. ‘‘ఓకే..’’ అని చిన్నగా ఆమెతో చెప్పి.. ‘‘సర్‌.. ఎండలో ఇలా నిలబడ్డారు..’’ అడిగాడు సృజన్‌. ‘‘బంధువులదేదో పంచాయితీ ఉంటే.. రామాయంపేట్‌ వచ్చినా.. ఇప్పుడు ఇక్కడి నుంచి సదాశివ్‌నగర్‌వెళ్లాలే.చుట్టపాయన దింపిండు ఇక్కడ బస్‌దొరుకుతదని. ఒక్క బస్‌ ఆప్తలేరు బాబూ’’ అన్నాడు నీరసంగా వృద్ధుడు.‘‘రండి.. సర్‌.. మేం నిజామాబాద్‌ పోతున్నాం. దార్లోనే కదా.. సదాశివ్‌ నగర్‌లో దింపుతాం’’ అన్నాడు సృజన్‌. ‘‘మీకు ఇబ్బందేం లేదు కదా..’’ అన్నాడు. ‘‘అయ్యో.. ఏం లేదు సర్‌ రండి’’ అంటూ అతని బ్యాగ్‌ భుజాన వేసుకొని నడిపించుకుంటూ కారు దగ్గరకు తీసుకొచ్చాడు సృజన్‌. వెనకాలే అలేఖ్య. అయిష్టంగా. సృజన్‌ ఏం చెప్పబోతున్నాడో అర్థమై ముందు సీట్లో కూర్చుంది. వెనక సీట్లో ఆ వృద్ధుడు, సృజన్‌ కూర్చున్నారు. కారు స్టార్ట్‌ అయింది. సృజన్‌ బాల్య జ్ఞాపకాల వాక్ప్రవాహమూ మొదలైంది. ‘‘సర్‌.. మీరు అప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉండేవారు?! మీ వల్లే మా జనరేషన్‌ అంతా అవేర్‌ అయింది’’ అని ఆ వృద్ధుడితో అని వెంటనే ముందు సీట్లో ఉన్న అలేఖ్య భుజం మీద తడుతూ ‘‘అలేఖ్యా.. నీకుతెల్సా..  మాయలు, మంత్రాలు, చేతబడులు లేవని అవన్నీ మ్యాజిక్‌ ట్రిక్స్‌ అని మా ఊళ్లో వాళ్లకు ఎక్స్‌ప్లెయిన్‌ చేయడానికి  సర్‌.. ఎవ్రీ సండే పంచాయితీ ఆఫీస్‌ దగ్గర మ్యాజిక్‌ షో చేసేవారు’’ అంటూ ఉత్సాహంగా చెప్తున్నాడు సృజన్‌. 

మొహమాటానికి నవ్వుతూ వింటోంది అలేఖ్య. సృజన్‌ తనకు పరిచయమైన నాలుగేళ్లలో ఈ విషయాలను లక్షాతొంభైసార్లు విన్నది. ఇప్పుడు లక్షాతొంభై ఒకటవ సారి వింటోంది. కాకపోతే సృజన్‌ ఎడ్మైర్‌ చేసే వ్యక్తి సమక్షంలో. తన భర్త ఎంత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాడంటే.. ఆ సర్‌ గురించి తనకు ఎన్నోమార్లు చెప్పిన విషయాన్ని  ఇప్పుడు పరిచయంలో యాది మరిచిపోయేంతగా.  సృజన్‌ మళ్లీ ఆ పెద్ద మనిషి వైపు తిరిగి.. ‘‘సర్‌.. మీకు గుర్తుందా? ఊర్లో సన్న మల్లేశం వాళ్ల అమ్మకు దయ్యం పట్టిందని అందరూ అంటే.. దయ్యాల్లేవ్‌.. భూతాల్లేవ్‌... కావాలంటే చూడండి.. నేను ఈ రాత్రికి శ్మశానంలో పడుకుంటా.. అని చాలెంజ్‌ చేసి మరీ మీరు ఆ రాత్రి శ్మశానంలో పడుకున్నారు. ఊరు ఊరంతా భయపడ్డది.. రాత్రికిరాత్రే మీకు ఏదో అయిపోతుందని. తెల్లవారి మీరు ఊళ్లోకి వచ్చి పంచాయితీ ఆఫీస్‌ దగ్గర మీటింగ్‌ పెడితే కూడా భయపడి ఎవ్వరూ రాలే. తర్వాత మీరే అందరి ఇళ్లకు పోయి.. దయ్యాల్లేవ్‌ ఏమి లేవు. రాత్రి నేను శ్మశానంలో నిక్షేపంగా పడుకొని వచ్చా.. ఆరోగ్యంగా ఉన్నా’’అని చెప్పారు... గుర్తుందా సర్‌!! సర్‌.. నిజంగా మీరు గ్రేట్‌. మీరంటే నాకెంత ఇన్సిపిరేషనో.. చెప్పలేను’’ సృజన్‌ కళ్లల్లో ఆ పెద్దాయన పట్ల ఆరాధన.. మాటల్లో గౌరవం పొంగిపొర్లుతున్నాయి. 

ఇదంతా ఆ పెద్దాయనకూ ఇబ్బందిగానే ఉంది. అందుకే సృజన్‌ వాగ్ధాటికి అడ్డుకట్ట వేస్తూ.. ‘‘ఇప్పుడు నా గురించి ఎందుకులే కానీ.. నీ గురించి చెప్పు సృజన్‌. కెనడాలో ఏం చేస్తున్నావ్‌?’’ అడిగాడు.‘‘రీసెర్చ్‌ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను.. సర్‌.. నాకు సైన్స్‌ మీద ఇష్టం పెరగడానిక్కూడా మీరే కారణం.. ’’ మళ్లీ అభిమానం కురిపించబోయాడు.‘‘సరే..సరే గానీ.. పెళ్లెప్పుడు అయింది? చాలా రోజుల తర్వాత ఇండియా వస్తున్నట్టున్నావ్‌?’’ పెద్దాయన.‘‘అవున్సార్‌. కెనడా వెళ్లినప్పటి నుంచి ఇదే ఫస్ట్‌ టైమ్‌ రావడం. సర్‌.. నాది లవ్‌మ్యారేజ్‌. పెళ్లై వన్‌ ఇయర్‌ అవుతోంది. పేరెంట్స్‌ ఒప్పుకోక.. ఇంటికి రాలేదు. ఇప్పుడిప్పుడే మాటలు కలిశాయి. అందుకే అమ్మవాళ్లను కలవడానికి వస్తున్నాం..’’ అన్నాడు. అలేఖ్య వెనక్కి తిరిగి ఆ పెద్దాయనను చూసి మర్యాదపూర్వకంగా నవ్వింది. ‘‘బాగుంది సృజన్‌.. మీ జంట.. నా ఆశీర్వాదాలు..’’ అన్నాడు ఆ పెద్దాయన సృజన్‌ భుజమ్మీద చేయి వేస్తూ. ‘‘సృజన్‌.. సదాశివనగర్‌ బోర్డ్‌ ...’’ మాటల్లో పడి అసలు విషయం మరిచిపోయిన భర్తకు గుర్తుచేసింది ఆ బోర్డ్‌ను చూపిస్తూ. ‘‘ఆ.. కొంచెం.. ముందుకు పోయాక ఆపయ్యా...’’ డ్రైవర్‌కు చెప్పాడు పెద్దాయన. ‘‘అయ్యో.. రోడ్డు మీదెందుకు సర్‌.. ఎక్కడికి వెళ్లాలో చెప్తే అక్కడే దింపేస్తాం..’’ అన్నాడు సృజన్‌. ‘‘పర్లేదు.. ఇక్కడి నుంచి దగ్గరేనడుస్తూ వెళ్లిపోతా’’ నిశ్చయంగా చెప్పాడు తర్వాత వాదనకు తావివ్వకుండా పెద్ద మనిషి. మాటల్లో గమ్యం రానే వచ్చింది. పెద్ద మనిషి దిగాడు. సెండాఫ్‌ ఇవ్వడానికి సృజన్, అలేఖ్యా కూడా దిగారు.ఆయన వెనుతిరగగానే ఇద్దరూ వెనక సీట్లో సర్దుకున్నారు. కారు దూసుకెళ్లింది. 

అలేఖ్యను ఆప్యాయంగానే ఆహ్వానించారు సృజన్‌ కుటుంబ సభ్యులు. స్నానాలు.. భోజనాలు అన్నీ అయ్యాయి. కెనడా నుంచి తెచ్చిన కానుకలు ఒకొక్కటే ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇస్తున్నారు అలేఖ్య, సృజన్‌లు. వాటిల్లో అందమైన ఓ చేతి కర్ర కూడా ఉంది. అది తీస్తుండగా.. సృజన్‌ తండ్రి అన్నాడు.. ‘‘ఒరేయ్‌.. నేనింకా అంత ముసలాణ్ణి కాలేదురా.. చేతికర్ర ఊతం పట్టుకోడానికి?’’ అని. ‘‘అయ్యో.. నాన్నా.. ఇది మీకోసం కాదు. శంకర్‌ సర్‌ కోసం తెచ్చా!’’ అన్నాడు సృజన్‌. ‘‘ఏదీ.. సైన్స్‌ శంకర్‌ సర్‌ ఆ...ఆ..’’ సందేహం నివృత్తి చేసుకోవడానికి అడిగాడు సృజన్‌ తండ్రి. ‘‘అవున్నాన్నా.. మాకు రామాయంపేట్‌ దగ్గర కనిపిస్తే.. మేమే కార్లో తీసుకొచ్చాం.. సదాశివనగర్‌ దాకా. ఏదో పనుందని అక్కడ దిగిపోయిండు..’’ అన్నాడు సృజన్‌ ఆ కర్రను అటూ ఇటూ తిప్పిఅభిమానంగాచూసుకుంటూ.ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్‌ అయ్యారు. ‘‘ఏ శంకర్‌ సర్‌? శ్మశానంలో పడుకునే శంకర్‌ సర్‌ గురించే కదా నువ్‌ చెప్తుంది?’’ సృజన్‌ తండ్రి విస్మయంగా. ‘అవున్నాన్నా.. ఎందుకట్ల అడుగుతున్నారు?’’ వాళ్ల తీరు వింతంగా అనిపించింది సృజన్‌కు. ‘‘ఒరేయ్‌.. ఆయన చనిపోయి రెండేళ్లవుతోంది.. ఎవర్ని చూసి ఎవరు అనుకున్నావో..?’’ సృజన్‌ వాళ్లమ్మ. ఆ మాటకు సృజన్‌ చేతిలోంచి కర్రజారి కిందపడింది. చేష్టలుడిగి చూస్తోందిఅలేఖ్య భయంగా! 
- సరస్వతి రమ 

మరిన్ని వార్తలు