యాప్‌ కీ కసమ్‌

18 Feb, 2018 01:31 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ 

ఉష ఇంజనీరింగ్‌ చదువుతోంది. ఆమె బావ సంచిత్‌ పది రోజుల్లో అమెరికా వెళుతున్నాడు. ఇద్దరికీ చిన్నప్పుడే పెళ్లి నిశ్చయమైంది కానీ, ఉషకి డిగ్రీ పూర్తయ్యాకనే పెళ్లి అనుకున్నారు. సంచిత్‌ నిన్న సాయంత్రమే అక్కడికొచ్చాడు. వాళ్లు సరదాగా గడపడానికి కొద్ది రోజులే ఉన్నాయి. ఆ రాత్రి కబుర్లలో పడి, పడుకునేసరికి పన్నెండు దాటినా మర్నాడుదయం ఆరు కాకముందే లేచారిద్దరూ. ఇంట్లో మిగతావాళ్లెవరూ ఇంకా నిద్ర లేవలేదు. వీళ్లిద్దరూ హాల్లో కూర్చుని, టీవీ ఆన్‌ చేసి సౌండ్‌ మినిమమ్‌లో ఉంచారు. ‘‘చందన థియేటర్లో ఫస్ట్‌ షోకి వెడదామా?’’ అన్నాడు సంచిత్‌.‘‘సినిమా ఏంటి?’’ అంది ఉష. సంచిత్‌ నవ్వి, ‘‘ఏదో సినిమా, ఏదైనా ఓకే! అక్కడ రన్నయేవి పాత సినిమాలు కదా, జనమట్టే ఉండరు. నువ్వు సినిమా చూద్దువు. నేను నిన్ను చూస్తా’’ అన్నాడు.ఉష ముఖం సిగ్గుతో ఎర్రబడింది.  ‘‘నన్ను చూడ్డానికి సినిమాకెందుకు? ఇంట్లోనే కూర్చోవచ్చు’’ అంది. ‘‘థియేటర్లో నాన్‌స్టాపుగా గంటల తరబడి నిన్ను చూడొచ్చు. ఎవరూ ఏమీ అనరు, అనుకోరు. ఇక్కడలా కుదురుతుందంటే చెప్పు. ఈ హాలే నాకు సినిమా హాలు’’ అన్నాడు.

సంచిత్‌ అలా మాట్లాడుతుంటే వినడానికి బాగుంటుంది ఉషకి. రోజంతా బావతోనే గడపాలి అనుకుంది. అంతలో పక్కనున్న ల్యాండ్‌లైన్‌ మ్రోగింది. ‘‘హలో! లావణ్యని. నా కొత్త యాప్‌ గురించి అర్జెంటుగా నీతో షేర్‌ చేసుకోవాలి. నువ్వీ రోజు పూర్తిగా నాకోసం కేటాయించాలి. అడక్క అడక్క అడుగుతున్నా – బెస్ట్‌ ఫ్రెండుని. కాదనకు. ప్రోగ్రాం కాసేపట్లో చెబుతాను. వెయిట్‌ చెయ్‌’’.ఉష రిసీవర్‌ పెట్టేసి సంచిత్‌కి విషయం చెప్పి, ‘‘అది నా క్లాస్‌మేటూ, బెస్ట్‌ ఫ్రెండూ. నాకోసం ఎన్నోసార్లు ఎన్నో చేసింది. దానికీ సరిగ్గా ఈరోజే ముహూర్తం దొరకడం మన దురదృష్టం’’ అంది. సంచిత్‌ చిరాగ్గా, ‘‘ఇప్పుడామె నాకు వరస్ట్‌ ఎనిమీ. నేనంటే నీకిష్టమైతే, నువ్వూ తన గురించి అలాగే అనుకోవాలి. మన ప్రోగ్రాం గురించి తనకి చెప్పు. అర్థం చేసుకుంటుంది’’ అన్నాడు.‘‘నేను చెప్పలేను. ఏం చెయ్యాలో తోచడం లేదు.’’ అంది ఉష దిగాలుగా. సరిగ్గా అప్పుడే మళ్లీ ల్యాండ్‌లైన్‌ మోగింది. మళ్లీ లావణ్యే!‘‘సారీయే, సడెన్‌గా గోపాల్‌ గుర్తుకొచ్చాడు. నా మొదటి యాప్‌ కబురు ముందు తనతో షేర్‌ చేసుకున్నా. ఇది ముందు నీతో షేర్‌ చేసుకున్నానని తెలిస్తే ఫీలౌతాడు. మన ప్రోగ్రాం కాన్సిల్‌!’’ అందామె. ఉష ఫోన్‌ పెట్టేసి, ‘‘హుర్రే’’ అంది.

వారం రోజులుగా రెండో యాప్‌కోసం పడుతున్న శ్రమ ఫలించిందని లావణ్యకు మహోత్సాహంగా ఉంది. యాప్స్‌ తయారీ ఆమె హాబీ. ఆమె పెదనాన్న అమెరికాలో ఉంటున్నాడు. ఆయనకిద్దరు పిల్లలు. ఇద్దరికీ తెలుగు రాదు. వాళ్ల నానమ్మకి వాళ్లతో మాట్లాడాలని మహా సరదా. వాళ్లకోసం ఇంగ్లీషూ నేర్చుకున్నా, ఆ యాక్సెంట్‌ పిల్లలు పట్టుకోలేరు. అందుకని లావణ్య ఓ యాప్‌ తయారు చేసింది. నానమ్మ తెలుగులో మాట్లాడితే, అది ఇంగ్లీష్‌లోకి అనువాదమై పిల్లలకి వాళ్లకి అర్థమయ్యే యాక్సెంట్లో వినిపిస్తుంది. పిల్లలు ఇంగ్లీష్‌ మాట్లాడితే, అది తెలుగులోకి అనువాదమై చక్కని తెలుగు యాక్సెంటులో నానమ్మకి వినిపిస్తుంది.మూడు వారాలక్రితం ఈ మొదటి యాప్‌ తయారు చేసినప్పుడు – ఆ ఉత్సాహాన్ని నానమ్మకంటే ముందు గోపాల్‌తో పంచుకుంది లావణ్య. అతడామెని మూడు నెలలక్రితం ఓ థియేటర్‌ వద్ద కలిశాడు. తనే పలకరించి, ‘‘నాకు బాగా డబ్బుంది. ఖర్చు చేస్తూ సరదాగా గడిపెయ్యడం నా హాబీ. పేరుకో డిగ్రీ కూడా ఉంది. ఇటీవల మీరు లాస్య అనే అమ్మాయిని వాసు అనే జులాయి నుంచి రక్షించడంలో గొప్ప సాహసం చేశారు. మీతో స్నేహం చేసి, మీ లక్ష్యాలను నా లక్ష్యాలు చేసుకోవాలని ఆశ పడుతున్నాను’’ అన్నాడు.అతడు మాట్లాడిన పద్ధతి నచ్చిందామెకి. వారంలోగానే ఇద్దరూ పార్కులో కలుసుకున్నారు. మరుసటి వారం కలిసి సినిమా చూశారు. నెల తిరక్కుండా ఒకరికొకరు ఐ లవ్యూ చెప్పుకున్నారు. ఆమె మొదటి యాప్‌ గురించి వినగానే, ‘‘దీన్ని కమర్షియలైజ్‌ చేద్దాం’’ అన్నాడతడు. లావణ్య మురిసిపోయింది. ‘ఇప్పుడీ రెండో యాప్‌ గురించి వింటే గోపాల్‌ ఏమంటాడో’ ఆనుకుంటూ ల్యాండ్‌లైన్‌ డయల్‌ చేసింది లావణ్య.
 
 అది గోపాల్‌ ఇల్లు. ఇంట్లో పెద్దవాళ్లు లేరని ఫ్రెండ్స్‌ అంతా ధైర్యంగా రాత్రి మందు పార్టీ చేసుకున్నారు. పెద్దవాళ్లిచ్చే డబ్బులు ఖర్చు చెయ్యడం తప్ప వాళ్లకింకో బాధ్యత లేదు. ఆడపిల్లల్ని వలలో వేసుకోవడం తప్ప ఇంకో పని లేదు. వాళ్ల చేతుల్లో మోసపోయిన అమ్మాయిల్లో కొందరు ఆత్మహత్య చేసుకుంటారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా ఊరుకుంటారు. చాలా కొద్దిమంది మాత్రం వలలో పడ్డట్లే పడి జారిపోతారు. వాళ్లలో కొందరు ఎదురు తిరగొచ్చని లాస్య నిరూపించింది.వాసు ఇంటర్‌ చదువుతున్న లాస్యని ఇష్టపడ్డాడు. చొరవ చేసి పరిచయం చేసుకున్నాడు. మర్యాదస్తుడిలా పోజు కొడుతూ, ఆదర్శాలు వల్లించాడు. ఐ లవ్యూ తను చెప్పి, ఆమె చేతా చెప్పించాడు. ఒక రోజు పార్కులో ఓ పొద మాటున మరింత చొరవ చేశాడు. అప్పుడు మాత్రం ఆమె సహకరించలేదు సరికదా, ‘‘తప్పు నీది కాదు. నీతో పార్కుకి వచ్చానుగా, అదీ నా తప్పు’’ అని రుసరుసలాడింది.

ఐతే వాసుకి ప్లాన్‌ బి సిద్ధంగా ఉంది. ‘‘తప్పు నాదే! మళ్లీ ఇలా జరగదని నువ్వు నమ్మేదాకా నాకు నిద్ర పట్టదు. మా గెస్ట్‌హౌస్‌కి రా. అక్కడ నువ్వూ, నేనూ తప్ప ఇంకెవ్వరూ ఉండరు. పబ్లిక్‌ పార్కులో జరిగిన పొరపాటు ఏకాంతంలో కూడా నావల్ల జరగదని తెలుసుకుంటావు’’ అన్నాడు.లాస్య వెంటనే ఒప్పుకోలేదు. కానీ వాసుకి తెలుసు. ఏ ఆడపిల్లకైనా సరే ఆ వయసులో నమ్మాలి, ఒప్పుకోవాలి  – అనిపిస్తుందని. అలాగే చివరకు లాస్య ఒప్పుకుంది. వాసు ఉత్సాహం పట్టలేకపోయాడు. మిత్రులకి ఫోన్‌ చేసి, విషయం చెప్పాడు. వాళ్లతణ్ణి అభినందించి, త్వరలోనే ఆమె తమకూ సొంతం కానున్నదని ఆశించారు.  కానీ వాసు లాస్యని తక్కువ అంచనా వేశాడు. ఆమెకి అతడి మీద అనుమానమొచ్చింది. తనకి పరిచయమున్న లావణ్యకి చెప్పింది. లావణ్య తండ్రికి చెప్పింది. వాసు పోలీసులకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. తండ్రి పలుకుబడితో బెయిలు మీద బయటకు వచ్చాడు. అతడిప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవాలంటే లావణ్యని లక్ష్యం చేసుకోవాలి. ఆ ఉద్దేశ్యంతోనే గోపాల్‌ లావణ్యని పరిచయం చేసుకుని ప్రేమలోకి దింపాడు. ‘‘ఈ రోజే ఆ లావణ్య పొగరు దించి మనకి దాసోహం చేసుకోవాలి’’ అన్నాడు వాసు చర్చకి ఉపక్రమిస్తూ.  అంతలో గోపాల్‌ పక్కనున్న ల్యాండ్‌లైన్‌ మోగింది. రిసీవర్‌ తీసి, ‘‘ఎవరూ?’’ అన్నాడు గోపాల్‌ విసుగ్గా.

‘‘ఎవరూ గోపాలేనా – నేను లావణ్యని?’’‘‘అరే, లావణ్యా నువ్వా? థాంక్‌ గాడ్‌! ఏమయింది నీకు? నువ్వు ఫోన్‌ చెయ్యవు. నేను చేస్తే తియ్యవు. మనం ఫోన్లో మాట్లాడుకుని వారం దాటిపోయింది తెలుసా?’’ అన్నాడు గోపాల్‌.‘‘అందుక్కారణం కొత్త యాప్‌ డెవలప్‌ చేస్తూ బిజీగా ఉండడం! అది నిన్న రాత్రే సక్సెసవడం నాకు చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. నీతో పంచుకోవాలనిపించి ఆగలేక ఇప్పుడే ఫోన్‌ చేసేశాను’’ అంది లావణ్య.‘‘యు ఆర్‌ గ్రేట్‌ లావణ్యా! పాత యాప్‌ మీద ఆల్రెడీ ఒకరు స్పాన్సర్‌షిప్‌కి ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా దాంతో కలిపేద్దాం’’ అని గోపాల్‌ ఇంకా ఏదో అనబోతుండగా – ‘‘కమర్షియలైజేషన్‌ విషయం తర్వాత. ముందు నా యాప్‌ డిటెయిల్స్‌ విను...’’ అంది లావణ్య.‘‘టెక్నికల్‌ విషయాల మీద నాకంత ఆసక్తి లేదు. నీ పేరు నలుదిక్కులా మోగిపోవాలి. అంతే నాక్కావలసింది. సాయంత్రం ఆరుకి మా ఇంటికి రా. అమ్మానాన్నా ఊళ్లో లేరు. ఈరోజు మధ్యాహ్నానికి వస్తారు. వాళ్లకి నిన్ను పరిచయం చేస్తా. నువ్వేమో యాప్‌ గురించి చెప్పడానికి వచ్చినట్లు అందువుగాని. నేనేమో నీ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. అదే సమయంలో నువ్వు నీ యాప్‌ని కూడా డెమాన్స్‌ట్రేట్‌ చెయ్యాలి సుమా!’’ నవ్వాడు గోపాల్‌.

‘‘సరేలే కానీ ఎవరో స్పాన్సర్‌ అన్నావు! అతణ్ణీ పిలువు.. యాప్‌ గురించి నేనే చెబుతాను..’’‘‘అతడు కాదు, ఆమె! ఒక్కణ్ణే ఉన్నప్పుడు పిలిస్తే బాగుండదుగా.. అమ్మానాన్నా వచ్చాక  చెబుదామనుకున్నా. నువ్వొస్తున్నావు కాబట్టి ఇప్పుడే చెబుతాను’’ అన్నాడు గోపాల్‌.‘‘సాయంత్రం కోసం ఎదురు చూస్తుంటాను. అప్పుడు నీ ఊహకందని సర్‌ప్రైజ్‌ కూడా తెస్తాను. నువ్వూ, ఆ స్పాన్సర్‌ కూడా ఫ్లాట్‌ అయిపోతారు. నీ మీదొట్టు’’ అని ఫోన్‌ పెట్టేసింది లావణ్య.గోపాల్‌ ఫోన్‌ పెట్టేసి, ‘‘చేప తనే వచ్చి వలలో పడతానంటోంది’’ అని ఫోన్‌ సంభాషణ సారాంశం వివరించాడు మిత్రులకి.‘‘సర్‌ప్రైజ్‌ అంటే లాస్య విషయంలో లాంటిది కాదు కదా!’’ అనుమానంగా అన్నాడు మూర్తి.‘‘వాసు ఫూలిష్‌గా గెస్ట్‌హౌస్‌కి రమ్మన్నాడు. దాంతో ఆ పిల్లకి అనుమానమొచ్చింది. మనం నేరుగా ఇంటికి పిలుస్తున్నాం. డౌటు రానే రాదు. తను రావడం ఖాయం’’ అన్నాడు గోపాల్‌.  ‘‘నిజంగా వస్తుందా? వచ్చినా లొంగు తుందా?’’ అన్నాడు మూర్తి.‘‘ఒక ఆడపిల్లని చెప్పుచేతల్లో ఉంచాలంటే, ముందామె చెప్పు చేతల్లో మనమున్నామన్న భ్రమ కలిగించాలి. అది ఫస్ట్‌ స్టెప్‌. ఆమెకై ప్రాణమైనా ఇస్తామన్న నమ్మకం కలిగించడం రెండో స్టెప్‌. నమ్మించి మోసం చెయ్యడం మూడో స్టెప్‌. మోసపోయిన అమ్మాయిని బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం నాలుగో స్టెప్‌. ఇది ఎస్టాబ్లిష్డ్‌ ఫార్ములా. ఈరోజు మనం మూడో స్టెప్‌లోకి వస్తున్నాం. నో డౌట్స్‌’’ అన్నాడు గోపాల్‌ మిత్రబృందానికి కన్ను గీటి.

‘‘అందరికీ తెలిసిన ఈ ఫార్ములా లావణ్యకి తెలియదా. పోలీసాఫీసరు కూతురు’’ అన్నాడు వాసు. ‘‘లావణ్యకి మన దగ్గర జాగ్రత్త అవసరం లేదనిపించడమే రెండో స్టెప్‌. ఆమె విషయంలో అది దాటేశాం. అయినా ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండే అమ్మాయిలు నూటికొక్కరే ఉంటారు. మిగతా తొంభైతొమ్మిదిమందీ అబ్బాయిల వల కోసం సిద్ధంగా ఉంటారు. అది వయసు మహిమ. ఇదీ ఎస్టాబ్లిష్డ్‌ ఫ్యాక్టే్ట’’ అన్నాడు గోపాల్‌.‘‘ఇంతకీ ప్లానేమిటి? లావణ్య మీద నీ మోజు తీర్చుకోవడమా? నా పగ తీర్చడమా?’’ అన్నాడు వాసు. ‘‘ఎందుకురా నీకంత తొందర?’’ అన్నాడు గోపాల్‌. ‘‘బెయిలు మీదున్నవాణ్ణి. తొందరే మరి! ఈవేళైతేనే ఇంట్లో అంకులూ, ఆంటీ లేరు’’ అన్నాడు వాసు. ‘‘ఇంతకీ లావణ్య మీద నాకు మరీ మోజేం లేదు. అంతా నీ పగ కోసమే! మా బెడ్రూమ్‌ సౌండ్‌ప్రూఫ్‌ అని తెలుసుగా. అక్కడ ఈరోజు మనం లావణ్యపై తీసే వీడియోలు నీకు జైలు తప్పించడమే కాదు. ఓ పోలీసాఫీసర్ని కూడా మనకి తొత్తుని చేస్తాయి. మనం ఆ వీడియో ఆపరేషన్‌ గురించి చర్చిద్దాం’’ అన్నాడు గోపాల్‌.

రాత్రి ఎనిమిది. చందన థియేటర్లో సినిమా చూస్తున్నారు ఉష, సంచిత్‌. ఉన్నట్లుండి ఉష మొబైల్‌ మోగింది. లావణ్య. ‘‘థియేటర్లో ఉన్నానే! తర్వాత మాట్లాడతా’’ అంది ఉష కొంచెం విసుగ్గా.‘‘ఉషా పరిణయం చూడాల్సింది నేను. కానీ, నువ్వు చూడ్డమేమిటే..’’ ‘మేము ఉషా పరిణయం సినిమాకు వెళుతున్నట్లు ఇంట్లో కూడా తెలియదే, దీనికెలా తెలిసింది?’ అనుకుంటూ ఉలిక్కిపడింది ఉష. ‘ఔనూ బావ ఉదయం అగ్లీ క్రీచర్‌ అన్న విషయం లావణ్యకెలా తెలిసింది?’ ‘‘నువ్వు షాక్‌లో ఉన్నావని తెలుసులే! ముందు అసలు విషయం విను. ఉదయం నేను చెప్పానే కొత్త యాప్‌ గురించి.. అదేమిటంటే, అవతలివాళ్లు ఫోన్‌ పెట్టేసేక కూడా మళ్లీ వాళ్లు మరొకరికి డయల్‌ చేసేదాకా అక్కడి మాటలు వినగలిగేలా చేస్తుంది. ఇది ల్యాండ్‌లైన్లకే పని చేస్తుంది. ముందు నీ ల్యాండ్‌లైనుకి టెస్టు చేసి, మీ ఇద్దరి మాటలు రికార్డు చేశాను. అవి మీకే వినిపించి థ్రిల్‌ చెయ్యా లను కున్నాను. టెస్టు ఫలించడంతో హుషారెక్కి పోయి ఆ విషయం గోపాల్‌తో షేర్‌ చెయ్యాలను కున్నాను. అప్పుడు....’’అప్పుడు ఉషకి కలిగిన థ్రిల్‌ వర్ణనాతీతం. లావణ్య ఇంకా ఏదో చెప్పబోతుంటే, ‘‘యు ఆర్‌ ఎక్స్‌ట్రార్డినరీ లావణ్యా! మరి యాప్‌ గురించి షేర్‌ చేశావా? గోపాల్‌ థ్రిల్లయ్యాడా?’’ అంది ఉష ఆత్రుతగా. అవతల పెద్ద నిట్టూర్పు వినిపించింది, ‘‘గోపాల్‌తో షేరింగా, ఇప్పుడా ఛాప్టర్‌ క్లోజ్‌!’’ అంది.‘‘అదేమిటి? ఏం జరిగింది?’’‘‘యాప్‌ కీ కసమ్, గోపాల్‌ ఇప్పుడు తన నలుగురు మిత్రులతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి, జైల్లో ఊచలు లెక్కెడుతున్నాడు’’ అంది లావణ్య.
- వసుంధర

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా