అస‌లు క‌థ‌

20 Jan, 2019 01:05 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

‘యాంకర్‌ రమ్య భారతి ఇక లేరు.. ఆమె వాక్చాతుర్యం, నవ్వు శాశ్వతంగా మనల్ని వీడి పోయాయి.. గుండెపోటుతో నిద్రలోనే కన్ను మూసిన అందాల తార... బుల్లి తెరకు తీరని లోటు...’ సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త హోరెత్తిపోయింది.రమ్య భారతి చాలా ఫేమస్‌ యాంకర్‌. నవ్వుతూ సందర్భోచిత వ్యాఖ్యానంతో, పంచ్‌లతో, సునిశిత హాస్యంతో ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఆమెకు అభిమానులెందరో ఉన్నారు. ఆమె ఇంటి ముందు జనం బారులు తీరారు. క్యాంపులో ఉన్న భర్త రాజశేఖర్‌కి ఫోన్‌ చేశారు. వెంటనే వచ్చాడు. వీరి మాటలు నమ్మక, ‘నా బంగారం నన్ను విడిచిపోదు...’ అంటూ ఆశగా డాక్టర్‌ని పిలిపించాడు. కాని అతని ఆశ నిరాశ చేస్తూ డాక్టర్‌ ఆమె మరణించిన విషయం ధ్రువపరచి వెళ్ళిపోయాడు. రాజశేఖర్‌ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు. పని మనిషి ‘రాత్రి తొమ్మిది వరకు ఆమె బాగానే ఉంది’ అని చెప్పింది. బంధువులంతా వచ్చారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు.  ఇది సహజ మరణం కాదని, హత్య అని అనుమానంగా ఉందని రమ్య భారతి తల్లి ఫిర్యాదు చేసిందంటూ వచ్చి, ఆమె భర్తను, పనిమనిషిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

‘రమ్యతో పాటే టీవీ చానల్‌లో పనిచేసే ప్రదీప్‌ తరచు ఇంటికి వస్తుండే వాడని, రాజశేఖర్‌ లేనప్పుడల్లా ఇద్దరూ కలిసి తిరుగుతుండే వాళ్లని, ముందురోజు కూడా రాజశేఖర్‌ టూర్‌లో ఉండటంతో అతను  రాత్రి చాలా పొద్దు పోయేవరకు ఉన్నాడని’ భయపడుతూ చెప్పింది పనిమనిషి. తెల్లవారి పనిమనిషి వచ్చేసరికి గడియ తెరిచే ఉందని, లోపలికెళ్ళేసరికి రమ్య భారతి ఒక్కతే మంచంపై పడుకుని ఉందని, ఇంకా లేవలేదని లేపబోతే చల్లగా తగిలిందని, ఇంటి పక్క వారికి చెబితే వారు అయ్యగారికి ఫోన్‌ చేశారని చెప్పింది.  సీఐ బెడ్‌రూమ్‌ని పరిశీలించాడు. నిజంగానే అక్కడ ఘర్షణ జరిగినట్లు , పగిలిన చేతి గాజు ముక్క, అడ్డం పడి ఉన్న ఫ్లవర్‌ వాజు, ఆమె వెంట్రుకలు లాంటివి, పెరటి వైపు కారు టైర్ల గుర్తులు, బెడ్‌ రూమ్‌లో ప్రదీప్‌ వేలిముద్రలు అనుమానాస్పదంగా కనిపించాయి. కాని కేవలం వాటి వల్ల నిర్ధారణకు రాలేం. పరారవుతున్న ప్రదీప్‌ని అదుపులోకి తీసుకుని వారిదైన శైలిలో ప్రశ్నించారు. 

అతను  ‘నాకూ, ఆమెకూ సంబంధం ఉంది. ఆ రోజు రాత్రి పన్నెండు గంటల వరకు ఆమెతో గడిపి  వెళ్లిపోయాను. అంతకు మించి నాకే పాపం తెలీదు’ అన్నాడు.‘నంగనాచి... నా బిడ్డను నాశనం చేసి బుకాయిస్తున్నాడు, బంగారంలా చూసుకునే అల్లుడి నుంచి వల వేసి నా బిడ్డను లోబరుచుకున్నాడు. నాలుగు తగిలించండి... వాడే నిజం కక్కుతాడు... నా బిడ్డ దగ్గర నుంచి డబ్బంతా దోచుకున్నాడు..’ రమ్య భారతి తల్లి ఏడుస్తూ అరుస్తోంది.  పోలీసులు ఇన్వెస్టిగేషన్‌ చేసి రాజశేఖర్‌కు సంకెళ్ళు వేశారు. అంతా నివ్వెర పోయారు. ‘సర్‌... నా భార్యను బంగారంలా చూసుకుంటాను.. అసలు నిన్నేం జరిగిందో నాకు తెలీదు.... తప్పు చేసిన వాడిని వదిలి, ఇప్పుడు వచ్చిన నన్ను ఇలా అనుమానించడం అమానుషం...’ గింజుకున్నాడు రాజశేఖర్‌.‘మిస్టర్‌... మాకు అన్ని ఆధారాలూ దొరికాయి.. నువ్వు నిన్న రాత్రి  వెనక వైపు నుండి ఇంటికి వచ్చి ఆమెను చంపి మళ్ళీ వెళ్ళిపోయావు కదా.... నీ మీద అనుమానం రాకుండా ఉండటానికి అంతా ఫోన్‌ చేసి చెప్పాక అందరి ముందూ అప్పుడే వచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చావు... ఇంకా బుకాయించకు. నిజాయతీగా ఒప్పేసుకుంటే శిక్ష తగ్గుతుంది..’ సీఐ హూంకరించాడు. షాక్‌ తిన్న రాజశేఖర్‌ ఇంకా బుకాయించడం వల్ల లాభం లేదనుకున్నాడు. 

‘నిజమే... ఆమెను నా ప్రాణంలా చూసుకున్నా... కాని ఆమె మరొకరి వలలో పడింది. చూచాయగా వాళ్ళు వీళ్ళు ఈ విషయం నా దృష్టికి తీసుకొచ్చినా ఆమెను అనుమానించలేదు.. మీడియాలో ఇది మామూలే అనుకున్నా... ఎప్పుడు టూర్‌ కెళ్ళినా ఎప్పుడొస్తానో చెప్పేవాడిని. ఈసారి అలాగే రేపు వస్తానని చెప్పాను. కాని ముందు రోజే అంటే నిన్ననే అయిపోవడంతో రాత్రి ఇంటికి వచ్చాను. ఇంటి ముందు ఆగి ఉన్న కారు నాలో అనుమానాన్ని రేకెత్తించింది. ఇంటి వెనుక కారు ఆపి , వెనుక గేట్‌ గుండా బెడ్‌ రూమ్‌ కిటికీ దగ్గర కొచ్చాను. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ కనబడ్డారు. అసహ్యం వేసింది. ఎంత బాగా చూసుకున్నాను తనను, ఏడుపొచ్చింది. ఆ బాధలో ఆ చీకట్లో షాక్‌లో ఉండగానే ప్రదీప్‌ వెళ్ళిపోయాడు.  నేను లోనికెళ్ళాను. కొంచెం కంగారు పడింది. మాటలతో అనవసరం అనిపించింది. రేపటి వరకు టూర్‌ కాబట్టి ఇప్పటి వరకు ప్రదీప్‌ ఉన్నాడు కాబట్టి , చంపితే ఎవరికీ అనుమానం రాదనుకున్నాను. 

అదే బెడ్‌ రూమ్‌లో దిండుతో ఆమె ముఖంపై అదిమి ఊపిరి ఆడకుండా చేశాను. తర్వాత పక్క సరి చేసి, చక్కగా నిద్రపోయినట్లు పడుకోబెట్టి , కింద పడిన గాజుపెంకులు అవి ఏరి , వెళ్ళిపోయాను. నా బెడ్‌రూమ్‌లో నా ఫింగర్‌ ప్రింట్స్, భర్తనే కాబట్టి అనుమానం రాదు, ప్రదీప్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా అనుమానించినా అటే అనుమానం వెళుతుంది అనుకున్నా. కాని మీరింత తొందరగా ఎలా కనిపెట్టారో నాకింకా అర్థం కావడం లేదు..’ అయోమయంగా అన్నాడు. ‘దోషి ఎదో ఒక చోట ఎప్పుడైనా చట్టానికి  దొరికి పోతాడు. ఇంటి వెనక ఉన్న మీ కారు టైర్‌ గుర్తులు, వీధి మలుపు పై ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలో రాత్రి మీ కారు ఈ వీధిలోకి రావడం వెళ్ళడం రికార్డ్‌ అయ్యింది. చనిపోయిన సమయం దానికి సరిగ్గా సరిపోయింది. ఇలాంటివెన్నో చూసిన అనుభవం... ఎప్పటికీ డబ్బులిచ్చి, ప్రేమ కురిపించే ఆమెను ప్రదీప్‌ చంపడానికి కారణం కూడా కనిపించలేదు. భర్త కనుక సహజంగానే మరొకరితో ఉన్న బంధం బాధిస్తుంది, ఆ కోణంలో దర్యాప్తు చేశాం..’ అంటూ ముగించాడు సీఐ. 
- నామని సుజనా దేవి 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు

శార్వరి నామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు

సినిమా

సల్మాన్‌ కుటుంబంలో తీవ్ర విషాదం

తారలు.. ఇంట్లో ఉన్న వేళ..

కరోనా విరాళం

చైనాలో థియేటర్స్‌ ప్రారంభం

జూన్‌లో మోసగాళ్ళు

ఇంట్లో ఉండండి