ఎన్‌ఎఫ్‌

27 Jan, 2019 01:20 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

జూన్‌ 10వ తేదీ తెల్లవారుజాము 5 గంటలవుతోంది. నార్త్‌ జోన్‌ పరిధిలోని మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ మోగుతోంది. నైట్‌ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ నిద్ర మత్తులో ఉండి అసహనంగా రిసీవర్‌ను చెవిలో పెట్టుకున్నాడు. ‘‘సార్‌... ఇక్కడ ఒక శవం ముక్కలు ముక్కలుగా నరికి పడి ఉంది. అర్జెంట్‌గా రావాలి’’ అవతలి వ్యక్తి భయంగా చెప్పాడు.  ఇది విన్న కానిస్టేబుల్‌ నిద్ర మత్తు వదిలించుకుని ఆ వ్యక్తి చెప్పిన వివరాలన్నీ నమోదు చేసుకున్నాడు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఎస్సై షుకూర్‌ తన సిబ్బందితో ఎంజీ ఫ్లై ఓవర్‌ పక్కన శవం ఉన్న స్థలానికి వెళ్లాడు. ఆ స్థలం చిన్న చెత్తకుప్పలా ఉంది. చుట్టూ జనం మూగి ఉన్నారు. ‘‘ఆ..ఎవరు ఇక్కడ పోలీసులకు  ఫోన్‌ చేసింది?’’  ఎస్సై అడిగాడు.  ‘‘నేనే సార్‌’’ అని అక్కడున్న 45 ఏళ్ల వ్యక్తి చేతులు కట్టుకుని ఎస్సై దగ్గరికి వచ్చాడు.  ‘‘ఇక్కడెందుకున్నావ్‌? నీకెలా కనిపించింది ఈ శవం?’’ అడిగాడు ఎస్సై.  ‘‘సార్‌.. నేను మున్సిపాలిటీలో చెత్తను సేకరించే వ్యక్తిని. నా పనిలో భాగంగా ఈరోజు ఉదయమే ఈ ఏరియాలో చెత్త తీయడానికి వచ్చా. అప్పుడే చెత్తలో కనిపించిన శవాన్ని చూసి మీకు ఫోన్‌ చేశా’’ అన్నాడు. అతనితో మాట్లాడుతూనే దగ్గరికొస్తూ పరిశీలనగా చూశాడు ఎస్సై.  ఆ శవాన్ని ముక్కలుగా నరికి చికెన్‌ వ్యర్థాల్లో కలిపి పడేశారు. దానిపై చెత్త కప్పడాన్ని చూశాడు. బహుశా పోలీసు జాగిలాలకు క్లూ దొరక్కుండా నేరస్తులు ఇలా చేశారనుకున్నాడు ఎస్సై. అక్కడ ఉపయోగపడే క్లూలు సేకరించి శరీర భాగాలను మార్చురీకి పంపాడు. 

సెప్టెంబర్‌ 23వ తేదీ ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈస్ట్‌జోన్‌ పరిధిలోని కంప చెట్లలో ఓ యువతి శవాన్ని కనుగొన్నారు పోలీసులు. అక్కడకు పెద్ద  సంఖ్యలో ప్రజలు, మీడియా ప్రతినిధులు చేరారు.మీడియా వాళ్లను స్పాట్‌కు రానివ్వకపోవడంతో దూరం నుంచే వీడియోలు తీస్తూ లైవ్‌ టెలికాస్ట్‌ చేస్తున్నారు. అంతకంతకూ జనం తాకిడి పెరుగుతుంటే కంట్రోల్‌ చేయడానికి పోలీసులకు తలనొప్పిగా మారింది.ఈస్ట్‌జోన్‌ ఏసీపీగా కొత్తగా విధుల్లోకి చేరిన భగత్‌ అప్పుడే ఆ స్పాట్‌కు వచ్చాడు. శవాన్ని పరిశీలిస్తూ సిబ్బంది ద్వారా  వివరాలు సేకరిస్తున్నాడు. ‘‘సార్‌... యువతి వయసు 25 ఏళ్లు ఉంటుంది. నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. మొహం గుర్తు పట్టకుండా ఉండేలా యాసిడ్‌ పోయడంతో ముఖం మొత్తం కాలిపోయింది’’ చెప్పారు  సిబ్బంది.  ‘‘సరే ఏవైనా క్లూస్‌ దొరికాయా?’’ అని అడిగి మొత్తం కులంకషంగా పరిశీలించాలని ఆదేశించాడు భగత్‌. యువతి చేతి గోర్లకు  రక్తం మరకలు అంటి ఉండటాన్ని సిబ్బంది గమనించి భగత్‌కు చెప్పారు. దీంతో ఫోరెన్సిక్‌ వారు వచ్చి ఆ క్లూస్‌ని తీసుకుని ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అనంతరం యువతి శవాన్ని పంచనామా కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి ఎస్సై ప్రసాద్, ఏసీపీ భగత్‌కు కాల్‌ చేసి యువతి శరీరంపై 4 పొడవాటి వెంట్రుకలు ఉన్నాయని చెప్పాడు. నేరస్తుల్లో మహిళ కూడా ఉండొచ్చని అనుమానం వెలిబుచ్చాడు. మరిన్ని వివరాల కోసం ఆ స్పాట్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని సిబ్బందితో బయలుదేరాడు భగత్‌. అక్కడంతా తిరిగి వెతికాడు. ఏ ఇతర క్లూ దొరకలేదు. కానీ అక్కడ బ్లూ కలర్‌లో ఉన్న కుడికాలు ప్లాస్టిక్‌ చెప్పు ఒకటి కనిపించింది. అది బాగా వాడబడి ఉంది. అందుకేనేమో కాళ్ల వేళ్లన్నీ అనిగి గుంటలు పడి ఉన్నాయి. ఆ చెప్పును తీక్షణంగా పరిశీలించిన భగత్‌..కుడికాలి బొటన వేలి పక్క వేలి ముద్ర లేకపోవడాన్ని గమనించాడు. చెప్పు పై భాగంలో ‘ఎన్‌ఎఫ్‌’ అనే సింబల్‌ మాత్రం కనిపించి కనిపించనంతగా అరిగిపోయి ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న భగత్‌ సిబ్బందితో ఆఫీసుకు వచ్చాడు. ‘‘సార్‌ ఇప్పుడే ఫాక్స్‌ వచ్చింది. ఈస్ట్‌జోన్‌ పరిధిలో మాజీ కార్పొరేటర్‌ నాగేందర్‌  బహిరంగ సభ ఉందట. డీజీపీ ఆఫీసు నుంచి ముందస్తు సమాచారం వచ్చింది’’ అసిస్టెంట్‌ ఏసీపీ భగత్‌కు తెలిపాడు.
‘‘సరే చూద్దాం’’ అంటూ ఆ విషయాన్నంతగా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో మునిగిపోయాడు. 

‘‘ఆ హత్య వివరాలు వచ్చాయా? పోస్టుమార్టమ్‌ రిపోర్టు ఏమైంది? ఆ అమ్మాయి వివరాలు తెలిశాయా?’’ అంటూ శంకర్‌ను అడిగాడు భగత్‌. ‘‘తెలిసింది సార్‌. ఆ అమ్మాయి విజయ్‌ సేథ్‌ అనే నగల వ్యాపారి కూతురు. పేరు మీనాక్షి. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి గొతు నులిమి చంపారని తర్వాత ముఖంపై యాసిడ్‌ పోసి గుర్తు పట్టలేనంతగా నిందితులు మార్చినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తెలిసింది’’ అన్నాడు.అప్పుడే ఫోరెన్సిక్‌ ఎస్సై ప్రసాద్‌ నుంచి భగత్‌కు ఫోన్‌ వచ్చింది.‘‘ప్రసాద్‌ ఎనీ ప్రోగ్రెస్‌?’’ అని అడిగాడు. ‘‘సార్‌.. హత్య జరిగిన స్థలంలో ముగ్గురు, నలుగురి పాద ముద్రలు గుర్తించాం. బహుశా ఆ హత్యలోముగ్గురు నలుగురు పాల్గొని ఉండొచ్చు’’ అని చెప్పాడు. ‘‘సరే ఏదైనా ఇన్ఫర్మేషన్‌ ఉంటే నాకు చెప్పు’’ అని  ఫోన్‌ కట్‌ చేశాడు భగత్‌. ‘‘నేను ఇక్కడ చార్జ్‌ తీసుకోకముందు నార్త్‌జోన్‌లో జూన్‌ 10న కార్పొరేటర్‌ చిన్నారావు మర్డర్‌ జరిగిందిగా.. ఆ వివరాలు కావాలి’’ అని ఏసీపీ భగత్‌ ఎస్సై శంకర్‌ను అడిగాడు. ‘‘ఆ కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్‌లో ఉంది. పూర్తి వివరాలు రాకపోవచ్చు’’ చెప్పాడు శంకర్‌. ‘‘నాకు అర్జెంటుగాఆ వివరాలు కావాలి’’ అని  గట్టిగా చెప్పాడు భగత్‌.దీంతో ఎస్సై శంకర్‌ మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై షుకూర్‌కు ఫోన్‌ చేసి  ‘‘ఏసీపీ సార్‌ కార్పొరేటర్‌ చిన్నారావు మర్డర్‌ కేసుకు సంబంధించి మాట్లాడతారంట’’ అని భగత్‌కు ఫోన్‌ ఇచ్చాడు.

 ఆ వ్యక్తి హత్య గురించి ఎంత వరకు విచారణ జరిగింది, పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ వివరాలన్నీ ఎంత వరకు సేకరించారో ఎస్సై షుకూర్‌ ఏసీపీ భగత్‌కు వివరించాడు. ‘‘ఓకే ఆ ఫైల్‌ నేనొకసారి చూడాలి. రేపొకసారి ఫైల్‌తో కలవండి’’ భగత్‌ ఆదేశించాడు.మర్నాడు ఉదయమే ఎస్సై షుకూర్‌ ఆ హత్యకు సంబంధించిన ఫైల్‌ను తీసుకుని ఏసీపీ భగత్‌ ఆఫీసుకు వచ్చాడు. ఎస్సై శంకర్‌ షుకూర్‌ను ఏసీపీ భగత్‌కు పరిచయం చేశాడు. ‘‘సార్‌ ఇదే ఆ ఫైల్‌.  హత్య వివరాలు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టు అన్నీ ఈ ఫైల్‌లో ఉన్నాయి’’ ఫైల్‌ను భగత్‌కు ఇచ్చాడు ఎస్సై షుకూర్‌.ఫైల్‌ చూసిన భగత్‌ ‘‘ఇదేంటి... మృతుడి మొహం రాడ్‌తో చితక్కొట్టిననట్లుంది’’ అడిగాడు. ‘‘అవును సార్‌. కత్తితో గొంతుకోసి హత్య చేశాక మొహాన్ని గుర్తు పట్టకుండా చేసి శరీరాన్ని ముక్కలుగా కట్‌చేసి చికెన్‌ వ్యర్థాలతో కలిపి చెత్త కుప్పలో పారేశారు’’ షుకూర్‌ చెప్పాడు. ‘‘అయితే హత్య ఎన్ని గంటల ముందు జరిగింది?’’ అడిగాడు భగత్‌. బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి 6 లేదా 7 గంటల ముందు జరిగి ఉంటుందని పోస్టుమార్టంలో తేలిందని తెలిపాడు.షుకూర్‌ ఏదో చెప్పబోతుండగా మధ్యలో ఆపిన భగత్‌ ప్రభుత్వాసుపత్రి డాక్టర్‌కు ఫోన్‌ చేసి మీనాక్షి బాడీని స్వాధీనం చేసుకునే సమయానికి ఎంత సమయం ముందు జరిగిందని అడిగాడు.సుమారు 6 గంటల ముందు జరిగి ఉంటుందని డాక్టర్‌ చెప్పాడు. ఓకే అని ఫోన్‌ పెట్టేసిన భగత్‌...‘‘అంటే రెండు హత్యలు దాదాపుగా అర్ధరాత్రి జరిగి ఉంటాయి’’ అని  ఎస్సైతో అనుమానం వ్యక్తం చేశాడు.ఇన్వెస్టిగేషన్‌ గురించి ఎస్సై శంకర్‌తో మాట్లాడుతుండగానే కమీషనర్‌ నుంచి భగత్‌కు ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘గుడ్‌ మార్నింగ్‌ సార్‌’’  విష్‌ చేశాడు భగత్‌. ‘‘ఆ మర్డర్‌ కేసు ఏమైంది?’’  భగత్‌ను అడిగాడు. ‘‘అదే పనిలో ఉన్నాం సార్‌. ఇన్‌పుట్స్‌ సేకరిస్తున్నాం. రెండు మూడు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది’’ అని  చెప్పాడు భగత్‌. వీలైనంత త్వరగా కేసు ముగించాలని ఫోన్‌ పెట్టేశాడు కమీషనర్‌. 

ఏసీపీ భగత్‌ మాజీ కార్పొరేటర్‌ నాగేందర్‌ సభ విజిటింగ్‌కు బయల్దేరాడు. సభా ప్రాంగణానికి వచ్చిన భగత్‌ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాడు.‘‘మినిస్టర్‌ క్యాంపు ఆఫీసు నుంచి కాన్వాయ్‌ బయల్దేరిందా?’’  ఎస్సై శంకర్‌ను అడిగాడు భగత్‌. ‘‘ఇప్పుడే స్టార్ట్‌ అయింది సార్‌’’  శంకర్‌ బదులిచ్చాడు. ఇంతలోనే సభకు ముఖ్య అతిథిగా వస్తున్న మినిస్టర్‌ కాన్వాయ్‌ వచ్చింది. అభిమానుల తోపులాటమధ్య మినిస్టర్, ఇతర నాయకులను వేదికపై భద్రంగా పంపించారు. సభ భద్రతకు వచ్చిన సిబ్బంది ఎండ, ధూళిని లెక్క చేయకుండా తమ  విధుల్లో మునిగిపోయారు. భగత్‌ మాత్రం సభకు కొంచెం దూరంగా ఉన్న తన వాహనం దగ్గరకు వచ్చి ఆ హత్యల గురించి ఆలోచిస్తున్నాడు. ఇంతలో ‘‘హాయ్‌ భగత్‌’’ అంటూ పక్క నుంచి ఒక పలకరింపు వినిపించింది. తీరా అటూ ఇటూ చూసేసరికి ఓఎస్‌డీ ప్రభాకర్‌ ఎదురుగా ఉన్నాడు. ఓఎస్‌డీ ప్రభాకర్‌ ఏసీపీ భగత్‌లు ఒకే బ్యాచ్‌. అదీగాక వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. కొంతసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. వీళ్లు తమ మాటల్లో ఉండగానే సభ కూడా పూరై్తంది. ‘‘భగత్‌ సాయంత్రం చిన్న ఈవెంట్‌ ఉంది నువ్వు కూడా రా..నీకూ రిలీఫ్‌గా ఉంటుంది’’ అని ప్రభాకర్‌ ఆహ్వానించాడు. ‘‘ ఏం ఈవెంట్‌? ఎక్కడ?’’ అని అడిగాడు భగత్‌. ‘‘ఎర్రగడ్డలోని మెంటల్‌ ఆస్పత్రిలో తెలిసిన స్వచ్ఛంద సంస్థ వారు ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా నన్ను రమ్మన్నారు. నువ్‌ కూడా రా అలా వెళ్లొద్దాం’’ అనేసరికి భగత్‌ తలూపాడు.సాయంత్రం 4గంటలకు ఎస్సై శంకర్‌తో ఎసీపీ భగత్‌ ఎర్రగడ్డలోని ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే వచ్చిన ఓఎస్‌డీ ప్రభాకర్‌ భగత్‌ను రిసీవ్‌ చేసుకున్నాడు. ‘నేస్తం’ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేషెంట్లకు చెప్పులు, దుస్తులు, పండ్లు పంపిణీ జరుగుతోందని అక్కడ కట్టిన బ్యానర్లను చూసేసరికి భగత్‌కు అర్థమైంది. ఆ సంస్థ నిర్వాహకుడు యాదగిరిని భగత్‌కు పరిచయం చేశాడు ప్రభాకర్‌. మా సంస్థ ఆధ్వర్యంలో 12 ఏళ్లుగా ఆర్నెళ్లకోసారి ఇలా పంపిణీ చేస్తామని యాదగిరి తెలిపాడు. చిన్నపాటి ప్రసంగం తర్వాత బహుమతుల ప్రదానం జరిగింది. తర్వాత టీ విరామంలో నిర్వాహకుడు యాదగిరి ఆస్పత్రి ముఖ్య డాక్టర్‌ను వీరికి పరిచయం చేశాడు. తర్వాత డాక్టర్, భగత్, ప్రభాకర్‌లు ఏదో విషయమై కొంతసేపు ముచ్చటించారు. అలా మాట్లాడుతూనే ఆస్పత్రి ఆవరణ  అంతా కలియతిరిగారు.  కార్యక్రమం పూరై్తన తర్వాత తన కారు  ఎక్కబోతున్న భగత్‌ ఒక్కసారిగా ఆగిపోయాడు. వేరే  డాక్టర్‌తో మాట్లాడుతున్న ప్రభాకర్‌ ఏమైందని ఆశ్చర్యంగా అడిగాడు. ఎస్సై శంకర్‌ కూడా వచ్చాడు. అటుగా వెళ్తున్న పని మనిషిని పిలవమని శంకర్‌ను అన్నాడు. శంకర్‌ ఆ చెత్తబుట్ట తీసుకెళ్తున్న ఆమెను  పట్టుకొచ్చాడు. ఆ చెత్తబుట్టలో ఉన్న చెప్పును తీసి చూపిస్తూ ‘‘శంకర్‌ నీకిది గుర్తుందా? మీనాక్షి మర్డర్‌ జరిగిన చోట ఇలాంటిదే దొరికింది!’’  ఆశ్చర్యంగా అన్నాడు ప్రభాకర్‌.

‘‘అవును సార్‌ అచ్చం అలాగే ఉంది’’ బదులిచ్చాడు శంకర్‌. ‘‘ఈ చెప్పు ఇక్కడెలా ఉంది?’’ అని  డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇది మా ఆస్పత్రిలోని రోగులకు పంపిణీ చేసింది. అందరికీ ఇదే మోడల్‌ ఇచ్చారు’’ అని  అక్కడికొచ్చిన నిర్వాహకుడు యాదగిరి బదులిచ్చాడు. మరి ఇందాక పంపిణీ చేసినవి వేరే డిజైన్‌లో ఎందుకున్నాయని భగత్‌ ఎదురు ప్రశ్నించాడు. ‘‘పాత మోడల్‌ చెప్పులతో నడవడానికి ఇబ్బంది కలుగుతోందని ఫీడ్‌బ్యాక్‌ వస్తే ఈ రోజు పంపిణీ చేసిన వాటితో కొత్త మోడల్‌ ప్రారంభించాం’’  చెప్పాడు యాదగిరి. పాత మోడల్‌ చెప్పు ‘ఎన్‌ఎఫ్‌’ అనే అక్షరాల లోగో అర్థం ఏంటని భగత్‌ అడిగేసరికి ‘నేస్తం ఫౌండేషన్‌’ అని యాదగిరి చెప్పాడు. ‘‘కొత్త మోడల్‌ చెప్పుపై కూడా ఇవే అక్షరాలుంటాయి. కానీ లోగో వేరే డిజైన్‌లో పెద్దగా ఉంటుంది’’ అని చెప్పాడు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన చెప్పును తీసుకురమ్మని ఎస్సై శంకర్‌కు భగత్‌ చెప్పాడు. శంకర్‌ వెళ్లాక డాక్టర్‌తో మాట్లాడుతూ ‘‘ఈ వరుస హత్యలతో దొరికిన ఏకైక క్లూ ఈ చెప్పు. మీరు మా విచారణకు సహకరించాలి’’ అని  కోరాడు. ‘‘సరే’’ అన్నాడు డాక్టర్‌.ఇంతలోనే ల్యాబ్‌లో ఉన్న చెప్పును తీసుకుని ఆస్పత్రికి చేరుకుని భగత్‌కు చూపించాడు శంకర్‌. దాన్ని యాదగిరికి చూపించి నిర్ధారించుకున్నాడు.  ఏసీపీ భగత్, డాక్టర్, ప్రభాకర్‌లు ఆస్పత్రిలోని ఒక గదికి వెళ్లారు.మొత్తం ఇక్కడ ఎంతమంది పేషెంట్లు, పనివాళ్లు, డాక్టర్లు ఉంటారని ముఖ్య డాక్టర్‌ను ప్రశ్నించాడు. ‘‘ఇక్కడ మొత్తం 132 మంది పేషెంట్లు, 20కి పైగా సిబ్బంది ఉంటారు’’ అని  బదులిచ్చాడు. ‘‘మాకు దొరికిన ఈ చెప్పును బాగా పరిశీలిస్తే కొన్ని క్లూలు దొరికాయి. దాన్ని బట్టి నిందితులు ఇక్కడివారేనని నాకు అనుమానం వస్తోంది. ఈ చెప్పులో అన్ని వేలి ముద్రలున్నాయి. కానీ కుడికాలు బొటనవేలి పక్క వేలి ముద్రలేదు. అలాగే ఇది 7 అంగుళాల సైజు ఉన్న చెప్పు. అంటే ఆ వ్యక్తి దాదాపు 65 కేజీల బరువు, 5.5 అడుగుల పొడవుంటాడు’’ చెప్పాడు భగత్‌.

నేరస్తులను గుర్తించడానికి పేషెంట్లతో సహా సిబ్బందిని బయటి నిల్చోబెట్టారు. అందర్నీ బయటికి తెచ్చే క్రమంలో ఇద్దరు వ్యక్తులు గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు వాళ్లను భగత్‌ దగ్గరకు తీసుకొచ్చారు. అందులో ఒకరికి బొటనవేలి పక్కన వేలు లేదు. వారిని గదమాయించగా మిగతా ఇద్దరిని ఆ వరుసలో చూపించారు. అందరినీ పోలీస్‌ స్టైల్‌లో అడిగేసరికి ఆ రెండు హత్యలు వారే చేశారని ఒప్పుకున్నారు. ‘‘మాతో మాజీ కార్పొరేటర్‌ నాగేందర్‌ ఈ హత్యలు చేయించాడు’’ అని నిజం చెప్పారు. ‘‘ఈ హాస్పిటల్‌లో ఎందుకున్నారు?’’ అని  గదమాయించగా, ‘‘ హత్యలకు ప్లాన్‌ చేసే ముందు ఏదైనా సేఫ్‌ ప్లేస్‌ ఎంచుకుంటాం. ఇంతకుముందు హత్య చేసి వేరే రాష్ట్రం పారిపోయేవాళ్లం. కానీ ఈసారి ఎన్నికలొస్తున్నందున నాగేందర్‌ మమ్మల్ని అందుబాటులో ఉండేలా ఈ  ఆస్పత్రిలో ఉండమని ప్లాన్‌ ఇచ్చాడు. ఇక్కడి నుంచి హత్య ప్లాన్‌ చేస్తే ఎవరికీ అనుమానం రాదని మెంటల్‌ పేషెంట్లుగా చేరాం. తనకు రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని కార్పొరేటర్‌ చిన్నారావును, షేర్‌ నుంచి అడిగినంత డబ్బు ఇవ్వకపోవడంతో అతని కూతురు మీనాక్షిని రేప్‌ చేసి హత్య చేశాం’’ అని  ఒప్పుకున్నారు. ‘‘హాస్పిటల్‌ నుంచి ఎలా వెళ్లారు?’’ భగత్‌ అడిగాడు.‘‘రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో మెంటల్‌ ఆస్పత్రి నుంచి జనరల్‌ హాస్పిటల్‌కు వ్యాన్‌లో చెకప్‌కు తీసుకెళ్తారు. ఆ సమయంలో మేం నలుగురం ఒకేసారి వెళ్లి హత్య చేసి గోడ దూకి హాస్పిటల్‌కి వచ్చాం’’ అని  చెప్పారు. అందులో ఒకడి జుట్టు పొడవుగా ఉండటం చూసి అక్కడ దొరికిన పొడవైన వెంట్రుక వీరిదేనని, ఆడవాళ్ల పాత్ర లేదని భగత్‌ నిర్ధారించాడు.వీళ్లు చెప్పిన ఆధారాలతో మాజీ కార్పొరేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.నేరాన్ని ఒప్పుకున్నాడు నాగేందర్‌. - ఉమేశ్‌ కోమటి
  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా