ఆ ముగ్గురు

23 Dec, 2018 00:44 IST|Sakshi

క్రైమ్‌ స్టోరీ

కెప్టెన్‌ లయోపోల్డ్‌ న్యూయార్క్‌లోని పోలీస్‌ శాఖలో పని చేస్తున్నాడు. మరోవారం రోజుల్లో రిటైర్‌ కాబోతున్నాడు. అందుకే పై అధికారులు అతనికి కేసులేవీ అప్పగించలేదు. పనేం లేకపోవడంతో ఉబుసుపోక కంప్యూటర్‌లో పాత ఫైల్స్‌ని చూడసాగాడు. అందులో పరిష్కారం కాకుండా మూతపడిన కేసుల జాబితా కనిపించింది. అందులో మొదటి ఫోల్డర్‌ పేరు ‘క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌’ ఆ పేరు లియోపోల్డ్‌లో కుతూహలాన్ని రేకెత్తించింది. వెంటనే దాన్ని ఓపెన్‌ చేసి చదవసాగాడు.ఆ కేసు లియోపోల్డ్‌ ఉద్యోగంలో చేరటానికి పదేళ్ల ముందే జరిగింది. ఆ రోజు తేది 1962 డిసెంబర్‌ పదిహేను. ఆ రోజు సాయంత్రం న్యూయార్క్‌ రోడ్లపై గంట వ్యవధిలోనే మూడు హత్యలు జరిగాయి. ఎర్రరంగు గల పికప్‌ ఓపెన్‌ ట్రక్‌ని నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు వేరువేరు ప్రాంతాల్లో పిస్తోల్‌తో కాల్చబడ్డారు. హంతకుడు దొరకలేదు. ఫోరెన్సిక్‌ పరీక్షలో మూడు తూటాలు ఒకే పిస్తోల్‌ నుంచి వెలువడినట్లు తేలింది. పైగా హత్యకు గురైన ముగ్గురూ తమ ట్రక్‌ల్లో క్రిస్మస్‌ ట్రీని తీసుకెళుతున్నవారే! దానికే పత్రికల వారు ఆ అజ్ఞాత హంతకుడిని ‘క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌’గా పేర్కొన్నాయి.  ఈ మూడు హత్యలు న్యూయార్క్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. హత్యలన్నీ చీకటి పడ్డాక జరగటం, రద్దీ లేని ప్రాంతాల్లోనే జరగడం వల్ల హంతకుడ్ని ఎవరూ చూడలేకపోయారు. ఈ కేసుని పరిశోధించిన పోలీసులకు హంతకుడి గురించి ఎలాంటి క్లూ లభించలేదు. కనీసం ఈ హత్యలకు మోటివ్‌ని కూడా వారు కనుక్కోలేకపోయారు. న్యూయార్క్‌ పోలీస్‌ శాఖలో అత్యంత సమర్ధుడిగా పేరు గడించిన డిటెక్టివ్‌ మేనిలేక్‌ ఈ కేసుని పరిశోధించారు. ఆయన మరణించి చాలా కాలమైంది. ఆయన టీంలో పాల్గొన్న పోలీస్‌ అధికారుల్లో ఒక్క ఫ్రాంక్‌ ఫాక్స్‌ మాత్రమే ఇంకా జీవించి ఉన్నారు. లియోపోల్డ్‌కి తన రిటైరయ్యే ఈ వారం రోజుల్లో ఈ కేసుని పరిష్కరించే ప్రయత్నం చెయ్యాలని కోరిక కలిగింది. హంతకుడ్ని పట్టుకోలేకపోయినా కనీసం ఈ హత్యల మోటివ్‌ తెలుసుకోవాలనిపించింది. ఎందుకంటే అకారణంగా హత్యలు జరగవని ఓ పోలీసు అధికారిగా అతనికి బాగా తెలుసు.

మరుసటి రోజు లియోపోల్డ్‌ ఫ్రాంక్‌ ఫాక్స్‌ ఇంటికి వెళ్లి తన మనసులోని మాట చెప్పాడు. ‘నేను రిటైరయ్యే ఈ వారంలోగా ఈ చిక్కుముడిని విప్పాలని ఉబలాటపడుతున్నాను. ఈ కేసును విచారించిన వారిలో మీరొక్కరే జీవించి ఉన్నారు. నాకు మీ సహాయం కావాలి’ అన్నాడు వినయంగా.‘ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది’ కాఫీ కప్పు లియోపోల్డ్‌ ముందు జరుపుతూ అన్నాడు ఫాక్స్‌. ‘‘ఒకప్పుడు నేను కూడానీలాగే ఈ హత్యల రహస్యం తెల్సుకోవాలని తహతహలాడాను. కానీ ఏం తెల్సుకోకుండానే రిటైర్‌ అయిపోయాను. నా మొత్తం సర్వీస్‌లో నాకు సాధ్యం కాని పనిని నువ్వు వారం రోజుల్లో ఎలా చెయ్యగలవు? ఒకవేళ హంతకుడు ఎవరో నువ్వు తెల్సుకున్నా అతనింకా జీవించి వుంటాడన్న నమ్మకం నాకు లేదు’ అన్నాడు.‘ఒకవేళ హంతుకుడిది మీ వయసే అయితే అతనింకా జీవించి ఉండే అవకాశంవుంది. ఇంతకీ ఈ కేసు వివరాలు మీకిప్పటికీ గుర్తున్నాయా?’‘చక్కగా గుర్తుంది.’ నవ్వుతూ అన్నాడు ఫాక్స్‌.‘అలాంగైతే నా సందేహాలు తీర్చండి. ఒకే వ్యక్తి చేతిలో గంట వ్యవధిలో ముగ్గురుహతమయ్యారు కదా! ఆ ముగ్గురిలో ఒకరితో ఒకరికి సంబంధం ఉందా?’‘లేదు. ముగ్గురూ ఒకరికొకరు అపరిచితులే. క్రిస్మస్‌ వేడుక కోసం తమ ఎర్రరంగు పికప్‌ ఓపెన్‌ ట్రక్కులో క్రిస్మస్‌ ట్రీతీసుకుపోతూ చంపబడటమే ముగ్గురి మధ్య గల ఏకైక పోలిక’‘ముగ్గురూ క్రిస్మస్‌ ట్రీని ఒకే చోట కొన్నారా?’‘నీకొచ్చిన అనుమానమే అప్పట్లో మాకూ వచ్చింది. ఆ ముగ్గురూ క్రిస్మస్‌ ట్రీల్లో ఏదైనా విలువైన వస్తువుల్ని దాచి తీసుకెళుతూ హత్యకు గురయ్యారేమోనని కూడా మేం ఆ క్రిస్మస్‌ ట్రీలను క్షుణంగా పరిశీలించాం. కానీ ఆ చెట్లలో ఏమీ దాచినట్లు కనపడలేదు. పైగా హంతకుడు వాళ్లను చంపిన తర్వాత ఆచెట్లను ముట్టుకోలేదని రిపోర్ట్స్‌ తేల్చాయి’ అన్నాడు ఫాక్స్‌.‘హంతకుడు ఆ ముగ్గురిలో ఒకరిని పాత కక్షల వల్ల చంపి పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి అలాంటి ట్రక్కులోనే వెళుతున్న మిగిలిన ఇద్దర్నిచంపి ఉంచొచ్చు కదా?’‘ఎస్‌! మన పోలీసు బుర్రలకు ఇలాంటి అనుమానాలు రాకుండా ఉంటాయా? మొదటి వ్యక్తి సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాలకు చంపబడ్డాడు. అతనొక సాధారణ క్లర్క్‌. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. భార్యతో ప్రశాంతంగా జీవించేవాడు. అతనికి అక్రమ సంబంధాలు గానీ, ఇతరులతో తగాదాలు గానీ లేవని మా ఎంక్వైరీలో తేలింది. అలాంటి మంచి వ్యక్తిని ఎవరూ చంపుతారు?’‘మరి మిగిలిన రెండు హత్యల సంగతేమిటి?’‘మొదటి హత్య జరిగిన చోటుకి ఇరవై మైళ్ల దూరంలో ఇరవై నిమిషాల తర్వాత రెండో హత్య జరిగింది. హంతకుడు ఇరవై నిమిషాల్లో ఇరవై మైళ్ల దూరం వెళ్లాడంటే అతను తొలి హత్య చేశాక ఎక్కడా ఆగకుండా ప్రయాణించాడని అర్థమవుతోంది.’

‘మరి మూడో హత్య?’‘మరో అరగంట తర్వాత మరో ప్రాంతంలో జరిగింది. ఆ తర్వాత హంతకుడు మళ్లీ హత్యలు చేయ్యలేదు. ఆ రోజుల్లో ఈ హత్యల గురించి పత్రికలో వార్తలు వచ్చినప్పుడు న్యూయార్క్‌ నగరంలో కలకలం రేగింది. కొద్దిరోజుల వరకూ ఎర్రరంగు పికప్‌ ట్రక్కులున్నవారు తమ ట్రక్కుల్ని బయటికి తీయలేదు. తీసినా అందులో క్రిస్మస్‌ ట్రీలను తరలించలేదు.’‘ఆ మూడు ట్రక్కులు ఒకే కంపెనీకి చెందినవా? ఆ కంపెనీకి ప్రత్యర్థులైనవారు ఈ హత్యలు చేయించి ఆ కంపెనీ ట్రక్కుల్ని జనం కొనకుండా చెయ్యాలనుకున్నారేమో?’‘ఆ కోణంలోనూ మేము ఆలోచించాం. కానీ ఆ మూడు ట్రక్కులు వేరువేరు కంపెనీలకు చెందినవి. ఒకటి డాడ్జ్, ఇంకొకటి ఫోర్డ్, మరొకటి బెంజ్‌! అయినా ఆ కాలంలో కార్పొరేట్‌ రంగంలో క్రైమ్‌ ఇంకా అడుగుపెట్టలేదు. ఈ మిస్టరీ హత్యలు జనంలో ఎంతగా చర్చనీయాంశమైనాయంటే దీని ఆధారంగా హాలీవుడ్‌ వారు కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. ఓ సినిమా నాకిప్పటికీ గుర్తుంది. అందులో హంతకుడిని సైకో కిల్లర్‌గా చూపించారు. తన చిన్నతనంలో క్రిస్మస్‌ ట్రీని తీసుకెళుతున్న ఓ ఎర్రరంగు పికప్‌ ట్రక్‌ తన తల్లిదండ్రుల్ని గుద్ది చంపినందుకు ప్రతీకారంగా హీరో పెద్దయ్యాక సైకోగా మారి అలాంటి ట్రక్కుల్ని నడిపే డ్రైవర్లను చంపుతుంటాడు. ఆ సినిమా చూశాక ఈ హత్యలు కూడా సైకో కిల్లర్‌ చేసి ఉంటాడనిపించింది’‘కాని సైకో కిల్లర్‌ ఒక్క ఏడాది మాత్రమే హత్యలు చేసి ఆ తర్వాత మానెయ్యడు. ప్రతి ఏడాది క్రిస్మస్‌ వచ్చినప్పుడు హత్యలు చేసి ఉండేవాడు.’‘అతని ద్వేషం ఒక్క ఏడాదికే చల్లబడిందేమో!?’‘అలాంటప్పుడు అతను సైకో కాదు. క్షణికావేశంలో హత్యలు చేసినట్లు భావించాలి.’‘ఏది ఏమైనా ఈ హత్యలకు మోటివ్‌ని మేం కనుక్కోలేకపోయాం. ఒకవేళ నువ్వు కనుక్కుంటే నాకు చెప్పడం మర్చిపోవద్దు. నీకు ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా నా ఇంటికిరా! నువ్వు ఎప్పుడొచ్చినా ఓ కప్పు కాఫీ నీ కోసం ఎదురుచూస్తుంటుంది’ ఆప్యాయంగా అన్నాడు ఫాక్స్‌.∙∙ తర్వాత లియోపోల్డ్‌ మరణించిన ముగ్గురి కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ముగ్గురు హతుల్లో ఇద్దరి భార్యలు జీవించి ఉన్నారు. కానీ వారు కూడా ఈ హత్యల గురించి ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయారు.ఆ తర్వాత లియోపోల్డ్‌ న్యూయార్క్‌ పబ్లిక్‌ లైబ్రరీకి వెళ్లి పాత వార్తపత్రికల్ని తీరగేశాడు. 1962 డిసెంబర్‌ నెలలోని పత్రికలన్నీ తీరగేశాడు. ఆ రోజుల్లో ఏదైనా బ్యాంక్‌ దోపిడీ లేదా వజ్రాల చోరీ వంటివి జరిగి దొంగలు దొంగ సొత్తును తరలించడానికి క్రిస్మస్‌ ట్రీలను వాడుకున్నారా? అనే ఆలోచనతో దోపిడీ వార్తల కాలమ్‌ మొత్తం చదివాడు. కానీ ఆ నెలలో ఒక్క దోపిడీ కూడా జరగలేదని తెలిసింది.

చివరగా అతను ఈ వరుస హత్యలపై తీసిన హాలీవుడ్‌ సినిమాలు చూశాడు. సినిమా రచయిత ఊహాశక్తి వల్ల తనకేదైనా క్లూ దొరుకుతుందనుకున్నాడు. కానీ ఆ సినిమాల్లో కూడా ఎలాంటి క్లూ లభించలేదు. చివరికి లియోపోల్డ్‌ రిటైర్‌మెంట్‌ రోజు రానే వచ్చింది.రిటైర్‌ అయ్యే రోజు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక విలేఖరి అతన్ని ఇంటర్వ్యూ చేశాడు. పోలీస్‌ డిటెక్టివ్‌గా లియోపోల్డ్‌ తన అనుభవాలు చెప్పి చివరగా ‘క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌’ గురించి కూడా చెప్పుకున్నాడు.మరుసటి రోజు ఆ ఇంటర్వ్యూ న్యూయార్క్‌ టైమ్స్‌లో ప్రచురితమైంది. ఆ రోజు సాయంత్రం ఓ ముసలావిడ లియోఫోల్డ్‌ ఇంటికొచ్చింది. ఆమె చేతిలో చిన్న ఓ పార్మిల్‌ ఉంది.‘క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌ గురించి ఇంటర్వ్యూలో చెప్పింది నువ్వేనా?’ అని లియోపోల్డ్‌ని అడిగింది.‘అవును నా కన్నా ముందు ఈ కేసు చేపట్టిన అధికారులు ఆ హంతకుడ్ని పట్టుకోలేకపోయారు. నేను రిటైరయ్యేలోగా ఆ కేసు పరిష్కరించాలని ప్రయత్నించాను. కనీసం ఆ హత్యకు మోటివ్‌ తెలుసుకోవాలనుకున్నాను కానీ తెలుసుకోలేకపోయాను. ఇక ఈ రహస్యం చరిత్రలో శాశ్వతంగా సమాధి అయినట్లే!ఇంతకీ మీరెందుకొచ్చారు?’ లియోపోల్డ్‌ అడిగాడు.‘ఆ క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌ ఎవరో ఈ ప్రపంచంలో ఒక్క వ్యక్తికే తెలుసు’ అందామె.‘ఎవరా వ్యక్తి?’ లియోపోల్డ్‌ సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు.‘నేనే’అందామె.లియోఫోల్డ్‌ ఆమె వైపు నమ్మలేనట్లు చూశాడు. వయసు బాగా మీదబడటం వల్ల ఆమె మతిస్థిమితం కోల్పోయిందేమో అనిపించింది. ‘మీరు నిజమే చెబుతున్నారా?’ అనడిగాడు.‘ఆ విషయం నేను ఇప్పుడే రుజువు చెయ్యగలను. నా పేరు డయానా అకార్డ్‌. నా భర్త పేరు అకార్డ్‌. 1962లో మా పెళ్లి అయ్యింది. అప్పుడే క్రిస్మస్‌ వచ్చింది. క్రిస్మస్‌ కానుకగా మా నాన్నగారు మా ఆయనకి ఓ కొత్త ప్లిమత్‌ కారుని బహుకరించారు. డిసెంబర్‌ పదిహేనవ తేదీ సాయంత్రం మా ఆయన ఒంటరిగా ఆ కారుని షోరూం నుంచి ఇంటికి తీసుకొస్తున్నారు. దారిలో ఓ చోట వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ఎర్రరంగు పికప్‌ ట్రక్‌ కారును కుడిపక్క రాసుకుంటూ ఓవర్‌ టేక్‌ చేసి వెళ్లిపోయాడు. కారు కుడిపక్క రంగంతా పోయింది. దాంతో మా ఆయన ఆవేశంగా ఆ ట్రక్కును వెంబడించారు. ఆ ట్రక్‌లో క్రిస్మస్‌ ట్రీ ఉంది. కాసేపట్లో ఆ ట్రక్‌ కనిపించకుండాపోయింది. దాన్ని పట్టుకోవడానికి మా ఆయన షార్ట్‌ కట్‌లో వెళ్లారు. చివరికి ఓ చోట అది కనిపించింది. మా ఆయన ఆవేశంగా ఆ ట్రక్‌ని ఆపి డ్రైవర్‌ని పిస్తోల్‌తో కాల్చి చంపేశారు. తర్వాత ఆగకుండా ముందుకెళ్లి పోయారు.

దారిలో క్రిస్మస్‌ ట్రీ తీసుకెళుతున్న మరో ఎర్రరంగు పికప్‌ ట్రక్‌ కనిపించింది. తను పొరబాటున వేరే ట్రక్‌ డ్రైవర్‌ని కాల్చాననుకొని మా ఆయన రెండో ట్రక్‌ డ్రైవర్‌ని కూడా కాల్చారు. తర్వాత అలాంటిదే మూడో ట్రక్‌ కనిపిస్తే ఇంకా కోపం చల్లారక మా ఆయన ఆ డ్రైవర్‌ని కూడా చంపి ఇంటికొచ్చారు’‘ఈ విషయం మీ ఆయనే మీకు చెప్పారా?’ లియోపోల్డ్‌ ఆశ్చర్యంగా అడిగాడు.‘ఆయన జీవితాంతం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టారు. గత ఏడాది ఆయన పోయారు. ఆయన పాత డైరీలు చదివితే అందులో ఆయన రాసుకున్న ఈ రహస్యం బయటపడింది’‘ఇదంతా నమ్మశక్యంగా లేదు. మీరు నిజమే చెబుతున్నారా?’ చాలా ఆశ్చర్యంగా ముఖంపెడుతూ అన్నాడు లియోపాల్డ్‌.‘మీరిలా అంటారనే నా వెంట సాక్ష్యం కూడా తీసుకొచ్చాను’ అంటూ ఆ ముసలావిడ తన చేతిలో ఉన్న పార్శిల్‌ని లియోపోల్డ్‌ ముందు ఉంచి లేచి మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది.లియోపోల్డ్‌ ఆత్రంగా ఆ పార్శిల్‌ని విప్పి చూశాడు. ఆ పార్మిల్‌ లోపల పాయింట్‌ ఫోర్‌ క్యాలిబర్‌ పిస్తోల్‌ ఉంది. అది చాలా పాత పిస్తోల్‌. అందులో ఉన్న బుల్లెట్లలో మూడు మాత్రమే ఖర్చు అయ్యాయి. లియోపోల్డ్‌ పిస్తోల్‌ని శుభ్రం చేసి ప్రయోగాత్మకంగా దాన్ని పేల్చిచూశాడు. పిస్తోల్‌లోంచి బయటికొచ్చిన బుల్లెట్‌ని సేకరించి పోరెన్సిక్‌ ల్యాబ్‌కి తీసుకెళ్లాడు. అక్కడి నిపుణులు ఆ బుల్లెట్‌ని ముగ్గురు హతుల శరీరాల్లో లభించిన బుల్లెట్ల పోల్చి చూశారు. చివరికి అన్ని బుల్లెట్లు ఆ పిస్తోల్‌ నుంచి వెలవడ్డాయని తేలింది.ముసలావిడ అబద్ధం చెప్పలేదని లియోపోల్డ్‌కి అర్థమైంది. మొత్తానికి క్రిస్మస్‌ ట్రీ కిల్లర్‌ కేసు చిక్కుముడి వీడినందుకు అతను తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు.
అమెరికన్‌ మూలం – ఎడ్వర్డ్‌ డి హాక్‌
అనువాదం – మహబూబ్‌ బాషా 

మరిన్ని వార్తలు