ఎగ్జామ్స్‌ గైడ్‌

25 Feb, 2018 00:17 IST|Sakshi

కవర్‌ స్టోరీ

పరీక్షలొచ్చేస్తున్నాయి. పరీక్షలకు సిద్ధపడే పిల్లలకే కాదు, వారి తల్లిదండ్రులకూ పరీక్షలంటే ఎంతో కొంత ఆందోళన సహజం. ఏడాది పాటు నేర్చుకున్న పాఠాలను, వాటి ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని ప్రదర్శించి, మంచి మార్కులు సాధించడానికి పరీక్షలు ఒక అవకాశం. కొందరు విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా సిలబస్‌ పూర్తి చేసి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధపడితే, చాలామంది విద్యార్థులు పాఠాలు చదువుకున్నా, పరీక్షల్లో సరిగా రాయగలమో లేదోననే ఆందోళనతో సతమతమవుతుంటారు. తరగతి గదుల్లో బాగా రాణించే విద్యార్థులు సైతం ఆందోళన కారణంగా పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించలేక పోతుంటారు. పరీక్షల గురించి ఆందోళన చెందడం వల్ల ఫలితం చెడుతుందే తప్ప ప్రయోజనం ఉండదు గానీ, కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఒత్తిడి నుంచి బయటపడి పరీక్షల్లో ఆశించిన ఫలితాలను సాధించవచ్చు.

సమయం శరణం గచ్ఛామి
పరీక్షల్లో ఒత్తిడిని అధిగమించడానికి, సత్ఫలితాలు సాధించడానికి కీలకమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంటుందని విద్యారంగ నిపుణులు, మానసిక శాస్త్ర నిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న మాట. పరీక్షలకు సంసిద్ధమయ్యేటప్పుడు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై వారు చేస్తున్న సూచనలు కొన్ని...
∙చదవాల్సిన అంశాలను వాయిదా వేయడం తగదు. ముందుగా సిద్ధం చేసుకున్న నోట్సును శ్రద్ధగా పునశ్చరణ చేసుకోవడం ద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి చెందకుండా జాగ్రత్త పడాలి.

∙మిత్రులతో బాతాఖానీ, టీవీ చూస్తూ కూర్చోవడం, సోషల్‌ మీడియా చాటింగ్, సినిమాలు, షికార్లు, వీడియోగేమ్స్‌ వంటి కాలాన్ని హరించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
∙సిలబస్‌ కొండలా కనిపించినా నిర్ణీత టైమ్‌టేబుల్‌ను కచ్చితంగా అమలు చేస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలను ఇట్టే రాయవచ్చు.
∙రోజూ నిర్ణీత సమయం ప్రకారం చదవాలి. ఏకధాటిగా గంటల తరబడి చదవడం వల్ల అలసట అనిపించవచ్చు. అలాంటప్పుడు కొద్దిసేపు మనసుకు నచ్చిన పనులు చేస్తూ రిఫ్రెష్‌ అయి మళ్లీ చదవడం మొదలుపెట్టాలి.
∙నిద్ర, కాలకృత్యాలు, ఆహారం తీసుకోవడం, స్వల్ప విరామం వంటివన్నీ పోయినా, రోజుకు కనీసం పది గంటల సమయం ఉంటుంది. విద్యార్థులు ఆ పదిగంటల సమయాన్నీ గరిష్టంగా చదువు కోసమే వినియోగించుకునేలా చూసుకోవాలి.
∙ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు వంటి గాడ్జెట్స్‌కు దూరంగా ఉండటం క్షేమం. వీటి వల్ల సమయం వృథా కావడమే కాకుండా, చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుంది.
∙రిలాక్సేషన్‌ కోసం కొద్దిసేపు ఆటలు ఆడటం, డ్యాన్స్, స్విమ్మింగ్‌ వంటివి చేయడం మంచిది. వీటి వల్ల చురుకుదనం పెరుగుతుంది.
అనుకూల వాతావరణం
చుట్టూ అనుకూల వాతావరణం ఉన్నప్పుడే ఎవరైనా పనులు సజావుగా చేయగలరు. విద్యార్థులు కూడా అంతే. ఒకే చోట కూర్చుని గంటల తరబడి చదువుకోవాలంటే ఎవరికైనా కష్టమే. పిల్లలు చదువుకునే గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉంటే చదువుపై ఉత్సాహం పెరుగుతుంది. పుస్తకాల ర్యాక్‌లో పాఠ్యపుస్తకాలతో పాటు మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే మంచి సాహిత్యం, మెదడుకు పదునుపెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు, పదసంపదను పెంపొందించే నిఘంటువులు వంటివి కూడా ఉండేలా చూసుకోవాలి. 

ప్రణాళికతో కూడిన సాధనే కీలకం
పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి ప్రణాళికతో కూడిన సాధనే కీలకం. విద్యా ప్రమాణాలను గుర్తించి భిన్న కోణాల్లో ఆలోచించి రాసే జవాబులను వాక్య పరిమితిని పాటిస్తూ నోట్స్‌ తయారు చేసుకుని ప్రాక్టీస్‌ చేయాలి. ప్రతి సబ్జెక్టులోనూ ప్రతి పాఠ్యాంశమూ ఫలితాల సాధనలో కీలకమైనవే. చాలామంది విద్యార్థులు ఏయే చాప్టర్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి? ఏవి ముఖ్యమైనవి? అని అడుగుతూ ఉంటారు. పాఠ్యాంశాల్లో కీలకమైనవి, ప్రాధాన్యం లేనివి అంటూ ఏవీ ఉండవు. అన్నీ కీలకమైనవే. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిందే. గతంలో అడిగిన ప్రశ్నలను గుర్తుచేసుకుని, వాటిని ఇంకా ఎన్ని విధాలుగా అడిగే అవకాశాలు ఉన్నాయో అవగాహన చేసుకోవాలి. పాఠ్యాంశాల్లో ఉన్న చిత్రాలు, గ్రాఫ్‌లు, పట్టికల్లో ఉన్న సమాచారాన్ని  క్షుణ్ణంగా చదివి పూర్తి చేయాలి. కీలకమైన పదాల అభ్యసనాన్ని మెరుగు పరచుకోవాలి. కఠిన పదాలు ఎదురైనప్పుడు ఉపాధ్యాయులను లేదా పెద్దలను అడిగి తెలుసుకోవాలి. లేకుంటే డిక్షనరీలు తిరగేయడం ద్వారా వాటి అర్థాలను తెలుసుకోవాలి. తరగతిలో జరిగే చర్చల్లో పాల్గొనడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా పరీక్షల్లో సులువుగా జవాబులను రాయవచ్చు. పరీక్షలకు ముందుగానే తగిన ప్రణాళికను సిద్ధం చేసుకుని, దానికి పూర్తిగా కట్టుబడి చదువు సాగించేటట్లయితే చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉంటుంది. 

ఇలా ప్రణాళిక వేసుకోవాలి
పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మంచి ఫలితాలను సాధించడానికి అందుకు తగిన ప్రణాళికను ఎలా వేసుకోవాలనే దానిపై విద్యారంగ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన

సూచనలు...
∙మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో, పరీక్షలు మొదలవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకోవాలి.
∙ఒక్కొక్క సబ్జెక్టుకు ఎన్ని రోజులు కేటాయించడం సాధ్యమవుతుందో లెక్క వేసుకోవాలి. చేతిలో ఉన్న డబ్బును ఖర్చు చేయడానికి బడ్జెట్‌ వేసుకున్నట్లే పరీక్షల కోసం కచ్చితమైన టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి.
∙కొన్ని సబ్జెక్టులు సులభంగా అనిపిస్తాయి. కొన్ని సబ్జెక్టులు కష్టంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు సులభంగా పూర్తి చేయగలమనుకునే సబ్జెక్టులకు సిద్ధపడాల్సిన రోజులు తగ్గించుకుని, కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ రోజులు కేటాయించుకోవాలి.
∙రోజుకు ఎన్ని గంటలు చదవడానికి కేటాయించగలమనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. సబ్జెక్టుల కోసం కేటాయించే వ్యవధిని సహేతుకంగా లెక్క వేసుకుని, వీలైనంత వరకు దానికి కట్టుబడి ఉండాలి.
∙చదువుకునే సమయాన్ని, రిలాక్స్‌ అయ్యే సమయాన్ని, రివిజన్‌ చేసుకునే సమయాన్ని, నిద్రకు కేటాయించే సమయాన్ని హేతుబద్ధంగా విభజించుకుని, ఆ టైమ్‌ టేబుల్‌కు కట్టుబడి పరీక్షలకు సమాయత్తం కావాలి.

పాజిటివ్‌గా ఆలోచించాలి
పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు ఎప్పుడూ పాజిటివ్‌ దృక్పథంతోనే ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా వారిని పాజిటివ్‌ దృక్పథంతోనే ప్రోత్సహించాలి. ‘అమ్మో! ఇంత సిలబస్‌ ఉంది. ఎప్పుడు చదవాలి? ఎలా పూర్తి చేయాలి? ఇదంతా గుర్తు పెట్టుకోగలనా?’ అని బెంబేలెత్తిపోకుండా, ‘ఇదంతా నేను చక్కగా చదివి అర్థం చేసుకోగలను. బాగా జ్ఞాపకం ఉంచుకోగలను’ అనే భావనను పెంపొందించుకోవాలి. ఈ భావన కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటప్పుడు తల్లిదండ్రులు వారిని మరింత ఒత్తిడికి లోను చేయకుండా ఉండాలి. ‘ఈ పాఠం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఇంతసేపు చదివినా ఆ పోయెమ్‌ రాదు. ఇక ఎగ్జామ్‌ ఎలా రాస్తావు?’ అంటూ వారిలో మరింతగా భయాందోళనలను సృష్టించరాదు. తల్లిదండ్రులే సంయమనాన్ని కోల్పోయి పిల్లలను ఒత్తిడికి గురిచేస్తే వారిలో నెగెటివ్‌ ఆలోచనలు పెరుగుతాయి. ఈ పరీక్షలు రాయడం తన వల్ల కాదనుకునే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి పరిస్థితి తలెత్తితే వారు తమకు వచ్చిన అంశాలను కూడా కంగారులో మర్చిపోతారు. ఇక పిల్లలు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు టీవీలు చూస్తూ , కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇలాంటి పనుల వల్ల పిల్లల ఏకాగ్రత దెబ్బతింటుంది. 

ఒత్తిడిని ఇలా జయించండి
పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని జయించడానికి పలువురు మానసిక శాస్త్ర నిపుణులు, యోగా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఈ సూచనలను పాటించినట్లయితే ఒత్తిడి, ఆందోళన లేకుండా  పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించవచ్చని వారు చెబుతున్నారు.
∙ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా ‘పరీక్షలంటే యుద్ధం’ అనే భావనను పిల్లల్లో రేకెత్తించరాదు. వారి సామర్థ్యాన్ని గుర్తించి, వారి వెన్నంటే ఉండి, సామర్థ్యానికి తగిన ఫలితాలను రాబట్టేలా పిల్లలను ప్రోత్సహించడం కొనసాగించాలి.
∙ఒత్తిడి అనిపించినప్పుడు పిల్లలు బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని, ఐదు నుంచి పది అంకెల వరకు లెక్కపెట్టిన తర్వాత శ్వాసను వదలడం ద్వారా ఒత్తిడి నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. 
∙కొందరు పిల్లలు పరీక్ష హాలుకు వెళ్లేంత వరకు చదువుతూనే ఉంటారు. చివరి నిమిషం వరకు చదివితే బాగా రాసేస్తారని అనుకోవడం సరికాదు. చివరి నిమిషం ఒత్తిడిలో ఉన్నప్పుడు చదవడం వల్ల వచ్చిన విషయాలను కూడా మర్చిపోతారు. పరీక్ష హాలుకు వెళ్లడానికి కనీసం రెండు గంటల ముందు నుంచి చదవడం మానేస్తే మంచిది.
∙కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌ వంటి పానీయాలకు దూరంగా ఉండటమే మంచిది. ఇలాంటివి తాగడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందనుకోవడం ఉత్త భ్రమ మాత్రమే. కెఫీన్‌ మోతాదు పెరిగితే ఆలోచనల్లోని స్పష్టత లోపించే ప్రమాదం ఉంది.
∙పరీక్షల కోసం సిద్ధపడే విద్యార్థులు  చదువు సాగించేటప్పుడు ప్రతి గంటకు పది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. విరామ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ చూడటం వంటి పనుల ద్వారా రిలాక్సేషన్‌ పొంది మళ్లీ చదువు కొనసాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
∙చదువు సాగించేటప్పుడు విజువలైజేషన్‌ టెక్నిక్‌ బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కళ్లు మూసుకుని పరీక్ష హాలులోనే ఉన్నట్లు ఊహించుకోండి. ప్రశ్నపత్రం తీసుకున్నట్లు, అన్నీ మీకు తెలిసిన ప్రశ్నలే వచ్చినట్లు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీలో పాజిటివ్‌ దృక్పథం దానంతట అదే పెరుగుతుంది. పాజిటివ్‌ ఆలోచనలు మీరు మంచి ఫలితాలను సాధించడానికి దోహదపడతాయి.

ప్రశాంతంగా నిద్రించండి
పరీక్షలు దగ్గర పడుతున్నాయంటే చాలామంది విద్యార్థులు అర్ధరాత్రి దాటేంత వరకు చదువుతూ జాగారాలు చేస్తుంటారు. ఇలా జాగారాలు ఉండటం కంటే రోజూ కనీసం ఆరేడు గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రలోనే మెదడుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. నిద్రించేటప్పుడు ‘సెరటోనిన్‌’ ఎంజైమ్‌ చురుగ్గా స్రవిస్తుంది. దీనివల్ల అభ్యసన సామర్థ్యం, జ్ఞాపకశక్తి దానంతట అదే పెరుగుతుంది. తగినంత విశ్రాంతి తర్వాత చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని, కంటి నిండా నిద్రపోయే వారే ఎక్కువ పదాలను గుర్తుంచుకోగలరని పలు పరిశోధనల్లో ఇప్పటికే రుజువైంది. అందువల్ల పరీక్షల సమయంలో విద్యార్థులు రోజూ కనీసం ఆరేడు గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవాలి.

‘బట్టీ’ విక్రమార్కులు కావద్దు
పాఠాలను కేవలం బట్టీ పట్టడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఇదివరకటి పద్ధతిలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను బట్టీ పట్టేస్తే పరీక్షలు గట్టెక్కేసే అవకాశాలు ఉండేవి. ప్రస్తుత విధానంలో అన్ని పాఠాలను విధిగా చదివి అవగాహన చేసుకోక తప్పదు. పాఠ్య పుస్తకంలోని ప్రతి అంశాన్నీ, ప్రతి భావనను సమగ్రంగా అవగాహన చేసుకుని సమాధానాలను రాయాలి. ప్రశ్నలకు సూటిగా సమాధానాలు రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్‌ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు తదుపరి సంవత్సరాల్లో జరిగే పరీక్షల్లో పునరావృతమయ్యే అవకాశాలు దాదాపు ఉండవు. అందువల్ల బట్టీ విధానం కంటే, పాఠాలను అర్థం చేసుకుంటూ అధ్యయనం సాగించడమే మేలు.

ఎగ్జామ్స్‌ మేడిన్‌ చైనా...
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏదో ఒక దశలో ‘ఈ పరీక్షలు ఎవడు కనిపెట్టాడ్రా బాబూ! అనుకోకుండా ఉండరు. పరీక్షలు కనిపెట్టిన మహానుభావుడు ఎవరో ఇదమిత్థంగా తెలియకపోయినా, అతగాడిని నోరారా తిట్టుకుంటూ ఉంటారు. ఇటీవల కొందరు ఔత్సాహికులు హెన్రీ ఫిషెల్‌ అమెరికన్‌ అనే తత్వవేత్త ఫొటో సామాజిక మాధ్యమాల్లో పెట్టి, విద్యార్థులను వేధించడానికి పరీక్షలు కనిపెట్టిన కఠినాత్ముడు, క్రూరాత్ముడు ఇతగాడేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. జర్మనీలో పుట్టి, అమెరికాలో స్థిరపడ్డ హెన్రీ ఫిషెల్‌ ఈ విషయంలో ఎలాంటి పాపమూ ఎరుగడు. ఈ పెద్దమనిషి ఇరవయ్యో శతాబ్దికి చెందిన తత్వవేత్త. పరీక్షల విధానం అంతకు చాలా పూర్వం నుంచే వాడుకలో ఉండేది. మొట్టమొదటగా చైనాలోని సుయి వంశీకుల పాలనలో క్రీస్తుశకం 605 సంవత్సరంలో పరీక్షల విధానం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం ఈ పద్ధతి వాడుకలోకి వచ్చింది. కింగ్‌ వంశీకులు ఈ పద్ధతిని 1905లో రద్దు చేశారు. అయితే, క్రీస్తుశకం 1806లో బ్రిటిష్‌ పాలకులు పరీక్షల పద్ధతిని తొలిసారిగా యూరోప్‌లో ప్రవేశపెట్టారు. సివిల్‌ సర్వీస్‌ అభ్యర్థుల ఎంపిక కోసం ప్రవేశపెట్టిన ఈ పరీక్షల పద్ధతి శరవేగంగా ఇతర దేశాలకూ వ్యాపించింది. ఉద్యోగాలకు తగిన అభ్యర్థుల ఎంపిక కోసమే కాకుండా, పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు తరగతుల్లో ఉత్తీర్ణులను నిర్ధారించడానికి సైతం పరీక్షలు నిర్వహించడం వాడుకలోకి వచ్చింది.

రియలిస్టిక్‌ ప్లాన్‌ ఉండాలి! 
పరీక్షలనగానే పిల్లలకు కాస్తంత భయం, ఒత్తిడి ఉండడం ఆరోగ్యకరమైన విషయమే! అసలు ఏమాత్రం భయం లేకున్నా పరీక్షలంటే సీరియస్‌నెస్‌ పోతుంది. అయితే ఇది స్థాయి దాటి ఎక్కువ ఒత్తిడి, ఆందోళనకు దారితీస్తేనే ప్రమాదం. ఒత్తిడి ఎక్కువ అవ్వడం అన్నది సాధారణంగా అందరిలోనూ చూస్తూంటాం. ఇది ముఖ్యంగా పరీక్షలు దగ్గరవుతున్న కొద్దీ ఎక్కువవుతూ ఉంటుంది. పరీక్ష రోజు, ఆ ముందు రోజే కాకుండా ముందు నుంచే చదవడం మొదలుపెడితే పరీక్షల సమయంలో ఒత్తిడిని తప్పించుకోవచ్చు. అలాగే పరీక్షల సమయంలో ‘రోజుకు ఇన్ని గంటలు చదివేస్తా. అన్ని చాప్టర్లూ ఫినిష్‌ చేసేస్తా..’ లాంటివి పెట్టుకోకుండా, రియలిస్టిక్‌ ప్లాన్‌ ఉంటే మంచిది. నిద్ర, ఆహారాలు మాని చదవడం ప్రమాదకరం. నిజానికి పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడానికి ఇంకాస్త ఎక్కువ నిద్రే అవసరం. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదవమని ఒత్తిడి పెంచొద్దు. ఫిజికల్‌ ఎక్సర్‌సైజ్‌ పరీక్షల సమయంలో కొందరు స్కిప్‌ చేస్తుంటారు. కానీ దానివల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. పాజిటివ్‌ ఆటిట్యూడ్‌ను ఎప్పటికీ వదులుకోవద్దు. 
– డా. పద్మ పాల్వాయి, చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌ 

టైమ్‌ టేబుల్‌ వేస్కొని చదువుతున్నా! 
పరీక్షలు దగ్గరైపోయాయి. ఇప్పటికే ఏయే సబ్జెక్ట్స్‌ ఎలా ఎలా చదవాలో టైమ్‌ టేబుల్‌ వేస్కున్నా. మ్యాథ్స్‌ కొంచెం టఫ్‌ సబ్జెక్ట్‌. ఫ్రెండ్స్‌ కూడా అదే అంటారు. ఏది కష్టమో ఆ సబ్జెక్ట్‌కు ఎక్కువ టైమ్‌ ఇచ్చి చదువుతున్నా. కొంచెం భయమైతే ఉంది కానీ, ఇంట్లో, స్కూల్లో అందరూ మంచి సపోర్ట్‌ ఇస్తున్నారు. అమ్మ వాళ్లైతే ఇప్పుడు ఏ పనీ చెప్పడం లేదు కూడా. బాగా రాస్తానన్న నమ్మకం ఉంది. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. 
– దేవర ఉదయ్‌కిరణ్, పదో తరగతి విద్యార్థి  

టెక్ట్స్‌ బుక్స్‌ బాగా చదవాలి! 
పరీక్షల సమయంలో పిల్లలు బాగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. బాగా చదివిన విద్యార్థులు కూడా ‘చదివినవన్నీ గుర్తుంటాయా?’ అని ఆందోళన పడుతూంటారు. అందుకే రోజూ ధ్యానం చేస్తే ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. ముఖ్యంగా పరీక్ష రోజు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతబాగా పరీక్ష రాయగలరని తెలుసుకోవాలి. ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రోజ్‌ మిల్క్, ఆయిల్‌ తక్కువగా ఉండే వంటకాలు, పండ్లు, కూరగాయలను పిల్లల డైట్‌లో చేరిస్తే బాగుంటుంది. పిల్లలు బట్టీ పట్టకుండా కాన్సెప్ట్‌ వైజ్‌ నేర్చుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధిస్తారు. టెక్స్‌›్టబుక్స్‌ బాగా చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 
– లక్ష్మీ శారద, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు  

మరిన్ని వార్తలు