సింపుల్‌ బ‍్రైడ్‌ హెయిర్‌  స్టైల్‌

4 Nov, 2018 01:47 IST|Sakshi

సిగ సింగారం

వేసుకున్న డ్రెస్‌కు అల్లుకున్న జడ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే చాలా మంది తమ మేకప్‌లో ఎక్కువ సమయం కేశాలంకరణకే కేటాయిస్తుంటారు. అలాంటి వారికోసమే ఈ హెయిర్‌ స్టైల్‌. పైగా ఇది సంప్రదాయ దుస్తులకైనా.. మోడ్రన్‌ డ్రెస్సులకైనా ఇట్టే నప్పుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.

1. ముందుగా జుట్టునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్‌ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుట్టు మరింత మృదువుగా మారుతుంది. తర్వాత హెయిర్‌ స్ట్రయిటెనింగ్‌ చేసుకుని కుడివైపు చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని (చిత్రంలో కనిపిస్తున్న విధంగా) తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని టైట్‌గా పట్టుకోవాలి.

2. ఇప్పుడు మెలిపెట్టుకున్న రెండు పాయలను చిత్రంలో కనిపిస్తున్న విధంగా లూజ్‌ చేసుకోవాలి. అనంతరం ఎడమవైపు కూడా చెవి తిన్నగా ఉన్న జుట్టును కొద్దిగా తీసుకుని, రెండు పాయలుగా చేసుకుని కుడివైపు మెలిపెట్టుకున్నట్టుగానే తల మధ్య భాగం వరకూ మెలిపెట్టుకుని, ఆ మెలిపెట్టుకున్న జుట్టును లూజ్‌ చేసుకోవాలి.

3. తర్వాత కుడి, ఎడమ వైపుల నుంచి మెలిపెట్టుకున్న జుట్టును మొత్తంగా కలిపి (చిత్రాన్ని ఫాలో అవుతూ) హెయిర్‌ బ్యాండ్‌ పెట్టుకోవాలి. ఇప్పుడు జుట్టు చిక్కులు పడకుండా దువ్వెనతో దువ్వుకోవాలి.

4.ఇప్పుడు కుడివైపు చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని.. మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ... ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్‌ పెట్టుకున్న జుట్టులోంచి కుడి భాగాన్ని కూడా(చిత్రాన్ని గమనిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడమవైపు కూడా అదే మాదిరిగా ఎడమ చెవి పక్కనున్న జుట్టు మొత్తాన్ని తీసుకుని మూడు పాయలుగా చేసుకుని.. జడ అల్లుకుంటూ.. ఇంతకు ముందు మెలిపెట్టుకుని బ్యాండ్‌ పెట్టుకున్న జుట్టులోంచి ఎడమ భాగాన్ని కూడా(చిత్రాన్ని అనుసరిస్తూ) అందులో కలుపుకుని జడ అల్లుకోవాలి. (కుడి, ఎడమ జడలు అల్లుకుని.. కొంత జుట్టు ఉండగానే హెయిర్‌ బ్యాండ్‌ పెట్టుకోవాలి)

5.తర్వాత ఆ జడలను కూడా లూజ్‌ చేసుకోవల్సి ఉంటుంది. లూజ్‌ చేసుకునే సమయంలో జుట్టు తెగిపోకుండా, పాయలు రేగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

6.ఇప్పుడు కుడివైపు జడను ఎడమవైపునకు చిత్రంలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని.. ఊడిపోకుండా ఉండేందుకు హెయిర్‌ పిన్స్‌ పెట్టుకోవాలి. ఆ సమయంలో జడ చివర భాగాన్ని మడిచి పైకి రాకుండా చూసుకోవాలి. అనంతరం ఎడమవైపు జడను కూడా అదేవిధంగా వ్యతిరేక దిశలో కుడివైపునకు తిప్పుకుని హెయిర్‌ పిన్స్‌ పెట్టుకోవాలి. 

మరిన్ని వార్తలు