మంట  ఎక్కువగా ఉంటోంది

5 Aug, 2018 02:23 IST|Sakshi

సందేహం

నా వయసు 29. ఈ మధ్య మూత్రానికి వెళుతున్నప్పుడు బాగా మంటగా ఉంటోంది. దీని గురించి ఒక స్నేహితురాలికి చెబితే... ‘సెక్స్‌వల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్‌’ కావచ్చు అంటోంది.  ఈ ఇన్‌ఫెక్షన్‌ ఎందుకు వస్తుంది? – జీఆర్, ధర్మవరం
మూత్రాశయంలో ఇన్‌ఫెక్షన్, మూత్రంలో ఇన్‌ఫెక్షన్, యోని భాగంలో ఇన్‌ఫెక్షన్‌ వంటి ఎన్నో కారణాల వల్ల మూత్రంకి వెళ్లినప్పుడు మంట రావటం జరుగుతుంది. ఇది నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల, కిడ్నీల్లో రాళ్లు ఉండి, మూత్రం వచ్చే దారిలో అవి అడ్డుపడి మూత్రం ఎక్కువ సేపు నిల్వ ఉండడం వల్ల, వ్యక్తిగత శారీరక శుభ్రత సరిగా పాటించకపోవడం, మూత్రవ్యవస్థలో లోపాలు, వంటి ఎన్నో కారణాల వల్ల మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చి, మూత్రానికి వెళ్లినప్పుడు మంటగా ఉంటుంది. కొందరిలో మలద్వారం నుంచి కూడా రోగక్రిములు మూత్రాశయంలోకి చేరి మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌ రావటానికి కారణం అవుతాయి. కొన్ని సార్లు సెక్స్‌ ద్వారా, పార్టనర్స్‌ ఇరువురిలో ఒకరికి ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా ఇంకొకరికి అది సోకడం వల్ల యోనిలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్‌ఫెక్షన్స్‌నే ‘సెక్స్‌వల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ ఇన్‌ఫెక్షన్‌’ అంటారు. వీటిలో గనేరియా, హర్పిస్, ట్రైకోమోనియాసిస్, హెచ్‌ఐవి వంటి కొన్ని రకాల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉంటాయి. వీటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కొందరిలో తెల్లబట్ట ఎక్కువగా అవుతూ నురగలా, పచ్చగా కనిపించడం, మరి కొందరిలో పెరుగులా రావడం, యోనిలో మంట, దురద, వాసన, మూత్రానికి వెళ్లినప్పుడు మంట, కొందరిలో యోని దగ్గర కురుపులు వంటివి ఏర్పడవచ్చు. ఆడవారిలో మూత్రానికి ద్వారం, యోని ద్వారం, మల ద్వారం దగ్గరదగ్గరగా ఉండటం వల్ల, ఈ ఇన్‌ఫెక్షన్‌లు ఒక భాగం నుంచి ఇంకొక భాగానికి తొందరగా వ్యాప్తి చెందుతాయి.

ఫస్ట్‌టైమ్‌ పీరియడ్‌ గుర్తుంచుకోవాలని, భవిష్యత్‌లో ఎదుర్కోబోయే సమస్యలకు ఇది కీలకం అవుతుందని చదివాను. ఇది నిజమేనా? పీరియడ్‌ భయాల గురించి ఎదిగే పిల్లలను మానసికంగా ఎలా సంసిద్ధులు చేయాలి? – యం. సుగుణ, వేములవాడ
ఫస్ట్‌టైమ్‌ పీరియడ్‌ అంటే రజస్వల అవ్వటం. రజస్వల అయిన తర్వాత కొందరిలో  పీరియడ్స్‌ రెండు సంవత్సరాల వరకూ సక్రమంగా ఉండవు. తర్వాత పీరియడ్స్‌ సమయంలో ఏదైనా సమస్యలు వచ్చి డాక్టర్‌ని సంప్రదించినప్పుడు.. వారు మొదటæ అడిగే ప్రశ్న ‘పీరియడ్స్‌ ఎప్పుడు మొదలయ్యాయి’ అని. దానిబట్టి ఫస్ట్‌టైమ్‌ పీరియడ్‌ గుర్తు పెట్టుకోవడం చాలా అవసరం. పీరియడ్స్‌ మరీ తొందరగా మొదలైనా.. కొందరిలో ఎక్కువగా ఈస్ట్రోజన్‌ హార్మోన్‌కు గురికావడం వల్ల భవిష్యత్తులో వారి ఫ్యామిలీ హిస్టరీని బట్టి, బరువుని బట్టి బ్రెస్ట్‌ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎదిగే పిల్లలకు పీరియడ్స్‌ గురించి, ఆ సమయంలో వచ్చే శారీరక మార్పుల గురించి మెల్లగా చెప్పాలి. అది సహజసిద్ధమేనని, అందరి ఆడపిల్లలోనూ వయసు వచ్చిన తర్వాత జరిగేదేనని వారిని మానసికంగా సంసిద్ధం చెయ్యాలి. పీరియడ్స్‌ వస్తే, న్యాప్‌కిన్స్‌ వాడకం గురించి, వ్యక్తిగత శుభ్రత గురించి, ఆ సమయంలో వచ్చే నొప్పి, ఇతర ఇబ్బందుల గురించి కూడా ఓపికగా చెప్పడం మంచిది. వీలైతే కొన్ని వీడియోలు చూపించవచ్చు. దీనివల్ల ఆడపిల్లలు పీరియడ్‌ మొదలైనా, ముందుగా మానసికంగా సంసిద్ధులు అయి ఉంటారు కాబట్టి, ఆందోళన చెందకుండా, వాళ్లకు వాళ్లే అన్నీ చక్కగా సర్దుకుంటారు.

గర్భిణీలకు ‘హార్ట్‌ ఎటాక్‌ రిస్క్‌’ ఎక్కువ అవుతుందని ఈమధ్య చదివాను. ప్రెగ్నెన్సీ సమయంలో హార్ట్‌ ఎటాక్‌ రావడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ముందస్తు నివారణ మార్గాల గురించి తెలియజేయగలరు. – బి.నందిత, సామర్లకోట
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భం పెరిగే కొద్దీ గుండె మీద ఒత్తిడి పడడం, గుండె పనితీరులో మార్పులు వంటివి జరుగుతాయి. కొంతమంది గర్భిణీల్లో అధిక బరువు ఉన్నవాళ్లు, గుండె సమస్యలు ఉన్నవాళ్లు, బీపి, షుగర్‌ సమస్యలు, ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీలో జరిగే మార్పులకు గుండె మీద ఒత్తిడి పెరగడం వల్ల హర్ట్‌ఎటాక్, కార్డియాక్‌ ఫెయిల్యూర్‌ వంటి కొన్ని గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎవరికి, ఎప్పుడు వస్తాయనేది ముందుగా చెప్పడం కష్టం. నివారించడానికి మార్గాలంటే.. ప్రెగ్నెన్సీ రాకముందే అధికబరువు ఉన్నవాళ్లు బరువు తగ్గడం, గుండె సమస్యలు, బీపీ, షుగర్‌ వంటి సమస్యలు ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రదించి జాగ్రత్తలు పాటించడం, సరైన మందులు వాడటం మంచిది. గర్భం వచ్చిన తర్వాత డాక్టర్‌ పర్యవేక్షణలో సరిగా చెకప్‌లకు వెళ్లడం, మందులు వాడటం, అవసరమైన పరీక్షలు సక్రమంగా చేయించుకోవడం, ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు లేకుండా బయటపడవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు