రేడియేషన్‌ పడకుండా ఉండాలంటే?

23 Dec, 2018 00:38 IST|Sakshi

సందేహం

రేడియేషన్‌ సమస్య వల్ల గర్భస్త శిశువుల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. రేడియేషన్‌ ప్రభావం పడకుండా ఉండాలంటే సెల్‌ టవర్లు ఉన్న ప్రాంతాలలో ఉండకూడదా? లేక సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడకూడదా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.
  – కె.సుచిత్ర, మదనపల్లి

సెల్‌ టవర్స్‌ నుంచి nonionizing కొంచెం ఎక్కువ ప్రీక్వెన్సీ 19-00 MHZ ఉన్న ఎలక్ట్రోమెగ్నటిక్‌ రేడియేషన్స్‌ విడుదల అవుతాయి. ఈ తరంగాల వల్ల వీటికి మరింత చేరువలో ఎక్కువ కాలం అక్కడే ఉన్నవాళ్లలో తలనొప్పి, కొద్దిగా మతిమరుపు, నిద్రపట్టకపోవడం, కొందరిలో బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని కొన్ని పరిశోధనలు తేలిపాయి. అలాగే గర్భిణీలు సెల్‌ టవర్లకు మరీ సమీపంలో నివసిస్తుంటే పుట్టబోయే పిల్లల్లో, పుట్టిన తర్వాత వారిలో ఏకాగ్రత తగ్గడం, హైపర్‌ యాక్టివ్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని, జంతువులు మీద చేసిన కొన్ని పరిశోధనల్లో కనుగొన్నారు. అలాగే సెల్‌ఫోన్లలో రోజూ ఎక్కువ సేపు మాట్లాడటం, అవి శరీరానికి దగ్గర్లో ఎక్కువ సమయం, ఉండటం వల్ల కూడా శిశువుకి ప్రభావం పడే అవకాశాలు కొద్దిగా ఉన్నాయని జంతువుల మీద చేసిన కొన్ని పరిశోధనలలో కనుగొన్నారు. ఏది ఏమైనా ప్రెగ్నెన్సీ సమయంలో ఎంత వీలు అయితే అంత సెల్‌ఫోన్లో మాట్లాడటం, వైఫై వాడి నెట్‌ చూడటం తగ్గిస్తే అంత మంచిది. కావాలంటే ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ వాడుకోవచ్చు. సెల్‌ టవర్స్‌ నుంచి కనీసం అరకిలోమీటర్‌ దూరంలో ఉండటం మంచిది. రేడియేషన్‌ ఎఫెక్ట్‌ కంటే కూడా సెల్‌ఫోన్లతో, అనవసరమైన విషయాలు గంటలు గంటలు మాట్లాడటం, నెట్, ఫేస్‌బుక్‌ వంటివి చాలా సేపు చూడటం వల్ల అనవసరమైన సందేహాలు, భయాలు వంటివి ఏర్పడటం, మానసికంగా సరిగా ఉండకపోవడం వల్ల కూడా బిడ్డ మానసిక ఎదుగుదలలో లోపాలు ఏర్పడే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ సమయంలో టైమ్‌పాస్‌కి కొద్దిగా నడక, ధ్యానం, మంచి పుస్తకాలు చదవడం, మ్యూజిక్‌ వినడం వంటివి అలవాటు చేసుకోవటం మంచిది.

∙నా వయసు 25. ప్రస్తుతం మూడోనెల. గర్భిణులకు ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం... మొదలైనవి సమృద్ధిగా అందాలంటే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో వివరంగా తెలియజేయగలరు. నాకు పిండిపదార్థాలు ఎక్కువగా తినే అలవాటు ఉంది. ప్రెగ్నెన్సిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినవచ్చా?– ఆర్‌.శ్రీలత, తుంగతుర్తి
గర్భిణీలలో శిశువు తొమ్మిది నెలల పాటు ఆరోగ్యంగా పెరగాలంటే, తల్లి నుంచి సరైన పోషకపదార్థాలు బిడ్డకు చేరాలి. అలాగే తల్లి శరీరంలో జరిగే మార్పులకు కూడా ఇవి అవసరం. తల్లీ బిడ్డ అవసరాలకు కూడా ఐరన్, జింక్, కాల్షియం, పొటాషియం మొదలైన మినరల్స్‌ ఎంతో అవసరం, కీలకం. ఇవి కొద్ది మోతాదులో రోజూ అవసరం కాబట్టి వాటిని మైక్రోనూట్రియంట్స్‌ అంటారు. ఐరన్‌ తల్లిలో రక్తం సమృద్ధిగా పెరగడానికి తోడ్పడుతుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది. తద్వారా శరీరంలోని అన్నికణాలకు ఆక్సిజన్‌ను అందజేస్తుంది. దీని లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. కాల్షియం, ఎముకలు, దృఢంగా బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. జింక్, కణాలలోని డీఎన్‌ఏ మరియు ప్రొటీన్స్‌ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. పొటాషియం, కండరాల నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. పైన చెప్పిన మినరల్స్‌తో పాటు ఐయోడిన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి మినరల్స్‌ కూడా బిడ్డలోని అన్ని అవయవాల ఎదుగుదలకు ఎంతో అవసరం. ఆహారంలో తాజా ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు, పాలు, పెరుగు, కొద్దిగా డ్రైఫ్రూట్స్‌ వంటివి అలాగే మాంసాహారలు అయితే గుడ్లు, మాంసం, చేపలు మితంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకపదార్థాలు తల్లి నుంచి బిడ్డకు చేరి, బిడ్డ మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. పిండిపదార్థాలలో ఎక్కువగా కార్భోహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగటం, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి షుగర్‌ శాతం పెరిగి గర్భంలో మధుమేహవ్యాధి వచ్చి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్న బరువును బట్టి, ఫ్యామిలీ హిస్టరీ షుగర్‌ ఉన్నప్పుడు వీలైనంత వరకు తక్కువ తీసుకుంటే మంచిది. అలాగే డాక్టర్‌ సలహామేరకు పోషక ఆహారంతో పాటు అవసరమైతే ఐరన్, కాల్షియం, మినరల్స్‌ విటమిన్స్‌తో కూడిన మందులు తీసుకోవడం కూడా మంచిది.

∙నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌. చలికాలంలో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తల గురించి తెలియజేయగలరు. నాకు దుప్పటి పూర్తిగా కప్పుకొని పడుకునే అలవాటు ఉంది. గర్భిణిలు ఇలా పడుకోవచ్చా? ఫోలిక్‌ యాసిడ్‌ ఉపయోగం ఏమిటి? తప్పనిసరిగా తీసుకోవాలా?        – బి.చంద్రిక, రామచంద్రాపురం
చలికాలంలో గర్భిణులలో చర్మం ఎక్కువగా పగిలే అవకాశాలు డిహైడ్రేషన్, జలుబు దగ్గు ఇన్‌ఫెక్షన్స్‌ వంటి అనేక ఇబ్బందులు రావచ్చు. ఈ సమయంలో దాహం లేకపోయినా కనీసం 2–3 లీటర్లు మంచినీళ్లు తీసుకోవాలి. వీలైనంత వరకు రద్దీ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలి. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్స్‌ తొందరగా వేరేవాళ్ల నుంచి లేదా చల్ల వాతావరణం వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీలయితే డాక్టర్‌ సలహా మేరకు ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిది. చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చరైజర్‌ వాడటం మంచిది. గోరువెచ్చని నీళ్లలో స్నానం చెయ్యవచ్చు. తాజాగా కూరగాయలు, పప్పులు, పండ్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. వెచ్చని వులెన్‌ దుస్తులు శరీరంతో పాటు చేతులకి, కాళ్లకి కూడా మరీ బిగుతుగా లేకుండా ధరించవచ్చు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది లేకపోతే దుప్పటి పూర్తిగా కప్పుకోవచ్చు. రోజూ కొద్దిసేపు వాకింగ్, మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలు డాక్టర్‌ సలహా మేరకు చెయ్యడం మంచిది. చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే జలుబు, దగ్గు వంటి వ్యాధులు ఉన్నవారికి దూరంగా ఉండటం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో రోగ నిరోధక శక్తి, మామూలు సమయంలో కంటే తక్కువగా ఉండటం వల్ల, అంటువ్యాధులు త్వరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్‌ అనేది బి9 అనే బీకాంప్లెక్స్‌ విటమిన్‌ జాతికి చెందినది. ఇది శరీరంలోని కణాలలో డీఎన్‌ఏ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది ప్రెగ్నెన్సీ రాకముందు, వచ్చిన తర్వాత కూడా వాడటం వల్ల బిడ్డ ఎదుగుదల, అవయవాల తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మెదడు నాడీ వ్యవస్థ సరిగా ఏర్పడటానికి దోహదపడుతుంది. దీని లోపం వల్ల కొంత మంది శిశువులలో అవయవలోపాలు, మెదడు, వెన్నుపూస ఏర్పడటంలో లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి గర్భిణీలు తప్పనిసరిగా మొదటి మూడునెలలు ఫోలిక్‌ యాసిడ్‌ 5mg   మాత్ర రోజుకొకటి వేసుకోవడం మంచిది.

డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బోహైదర్‌నగర్‌ హైదరాబాద్‌ 

మరిన్ని వార్తలు