దెయ్యాల రోజు

11 Feb, 2018 00:39 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

అనుకోకుండా వాళ్లిద్దరూ కలుసుకున్నారు!  ఒకతను చక్రవర్తిలా ఉన్నాడు. చక్రవర్తి కళ లేదు. ఇంకొకతను చక్రవర్తిలా లేడు. చక్రవర్తి కళ ఉంది! చక్రవర్తి కళ ఉన్న వ్యక్తిలోని కాంతి.. చక్రవర్తి కళ లేని వ్యక్తి మీద, ఆ చుట్టపక్కల పడుతోంది.‘‘నిన్నెక్కడో చూశాను..’’ చికాగ్గా అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుంటూ.‘‘నాకూ అనిపిస్తోంది, మిమ్మల్నెక్కడో చూసినట్లు..’’ చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తిలా లేనతను. ‘‘నేను నీతో చికాగ్గా మాట్లాడుతున్నాను కదా!  నువ్వు నాతో ప్రవక్తలా నవ్వుతూ ఎలా మాట్లాడ గలుగుతున్నావు?’’ అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను.   ప్రవక్త నవ్వు ఆపలేదు. చక్రవర్తి చికాగ్గా చూశాడు.‘‘నేను నిన్ను ‘నువ్వు’ అంటున్నాను కదా! నువ్వు నన్నెలా ‘మీరు’ అనగలుగుతున్నావు? నన్ను‘మీరు’ అనడం మానెయ్‌. అందులో నాకు వ్యంగ్యం కనబడుతుంది. వ్యంగ్యంగా మాట్లాడేవాడు తనను తను గొప్పవాడినని అనుకుంటాడు. నాకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉండడం నాకు ఇష్టం లేదు’’ అన్నాడు చక్రవర్తి. మళ్లీ నవ్వాడు ప్రవక్త. ‘‘మీకన్నా గొప్పవాడు ఇంకొకరు లేరు కానీ, మీకన్నా గొప్పది ఇంకొకటి ఉంది’’ అన్నాడు. 

‘‘ఏంటది?’’ అన్నాడు చక్రవర్తి.‘‘ప్రేమ’’ అన్నాడు ప్రవక్త. చక్రవర్తి చికాకు ఎక్కువైంది.ప్రవక్త చిరునవ్వు ఎక్కువా కాలేదు, తక్కువా కాలేదు.ప్రవక్తని అసహ్యంగా చూస్తున్నాడు చక్రవర్తి. చక్రవర్తిని ఆపేక్షగా చూస్తున్నాడు ప్రవక్త. ఆ చూపు, ఆ మాట, ఆ నవ్వు.. ఏ జన్మలోనివో గుర్తుకొచ్చింది చక్రవర్తికి! ‘‘నువ్వా!! నిన్ను మళ్లీ చూడాలని నేను అనుకోలేదు. యుగాల తర్వాత కూడా నువ్వు అలాగే యవ్వనంతో ఎలా ఉన్నావ్‌?’’ అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి తనను తను చూసుకున్నాడు. కిరీటం ఉంది. వెలుగు లేదు. ఒంటి మీద మణులున్నాయి. మెరుపు లేదు. ఖడ్గం ఉంది. పదును లేదు. ప్రవక్తను చూశాడు. కిరీటం లేదు. వెలుగుంది. మణుల్లేవు. మెరుపుంది. ఖడ్గం లేదు. పదునుంది. ఆ వెలుగు, మెరుపు, పదును అతడి చిరునవ్వులోంచి కిరణాల్లా ప్రసరిస్తున్నాయి. ‘‘ఈ చీకటి రాత్రి ఎక్కడివీ సూర్యకిరణాలు?’’  విస్తుపోయాడు చక్రవర్తి.‘‘సూర్యకిరణాలు కావు. ప్రేమ కిరణాలు. వేల సూర్యుళ్లనే వెలిగించే ప్రేమ కిరణాలు’’ నవ్వి, చెప్పాడు ప్రవక్త.‘‘నవ్వు ఆపి చెప్పు. నువ్వింకా అలాగే ఎలాగున్నావ్‌?’’ అని అడిగాడు చక్రవర్తి.‘‘నాలో ప్రేమ ప్రవహిస్తోంది. ప్రేమ ప్రవహించే చోటంతా పచ్చదనం ఉంటుంది. పూల పరిమళం ఉంటుంది. పక్షుల రాగాలు ఉంటాయి.’’‘‘నీ బొంద కూడా ఉంటుంది. ఉరి తీయించినా ఇంకా గాల్లోనే వేలాడుతున్నావా! నీతో పాటు నీ ప్రేమా చచ్చిపోతుందనుకున్నాను..’’ కోపంతో ఊగిపోతున్నాడు చక్రవర్తి. ‘‘నా ప్రేమ తనతో పాటు నన్నూ బతికించుకుంది’’ అన్నాడు ప్రవక్త.‘‘నిన్నొక్కడినేనా.. ఈ గాలిలో తిరుగుతున్న ప్రేమ దెయ్యాలనన్నింటినీనా?’’ విసుగ్గా అన్నాడు చక్రవర్తి.‘‘నేనొకటి చెప్తాను చక్రవర్తీ..’’ అన్నాడు ప్రవక్త. మొదటిసారి అతడు ‘చక్రవర్తీ’ అనడం. ‘‘నేనెవరో గుర్తొచ్చానా?’’ ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ దేన్నీ మర్చిపోనివ్వదు. దేన్నీ వాడిపోనివ్వదు. దేన్నీ దుఃఖపడనివ్వదు. ఆ రోజు జరిగినవన్నీ నాకింకా గుర్తున్నాయి చక్రవర్తీ’’ అన్నాడు ప్రవక్త. ‘ఆ రోజు’ అంటే.. ఏ రోజో చక్రవర్తికి అర్థమైంది.  ప్రవక్తను తను ఉరి తీయించిన రోజు. 

ఉరితీతకు ముందు.. ప్రవక్తతో చాలాసేపు ఘర్షణ పడ్డాడు చక్రవర్తి. ‘నీ ప్రేమ ప్రవచనాలతో యువతను చెడగొడుతున్నావు ప్రవక్తా! యువకులు యుద్ధానికి, యువతులు పద్ధతులకు పనికిరాకుండా పోతున్నారు. చచ్చేముందైనా వాళ్లకు చివరి మాటగా చెప్పు. పనికిమాలిన ప్రేమలకు దూరంగా ఉండమని చెప్పు’ అంటున్నాడు చక్రవర్తి.‘ప్రేమ.. ప్రజల్నీ, రాజ్యాల్నీ దగ్గర చేస్తుంది చక్రవర్తీ. ఒక్క శత్రువైనా మీకు మిగలకుండా చేస్తుంది. అప్పుడిక యుద్ధాలతో, పద్ధతులతో పనేముంది?’‘నీకర్థం కాదు ప్రేమోన్మాదీ.. రాజనీతిజ్ఞుడెవ్వడూ ప్రేమను అంగీకరించడు. పోనీలే పాపం అని ప్రేమించుకోనిస్తే.. చిన్న పువ్వును విసిరి రాజ్యంలోని యువతీయువకులు నా తలపై కిరీటాన్ని పడగొట్టేస్తారు’ అన్నాడు చక్రవర్తి.‘ప్రేమ కన్నా గొప్ప రాజ్యం లేదు. గొప్ప కిరీటం లేదు. అంతిమంగా ప్రేమదే సార్వభౌమత్వం’ అన్నాడు ప్రవక్త.చక్రవర్తి నిట్టూర్చాడు. ప్రవక్త వైపు జాలిగా చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెనకే తలుపులు మూసుకున్నాయి. ‘ప్రేమమూర్తులైన ఈ ప్రవక్తగారిని ప్రేమగా ఉరి తియ్యండి..’అవే చక్రవర్తి చివరి మాటలు. ప్రవక్తవి కూడా అవే చివరి చూపులు అనుకున్నాడు. మళ్లీ ఇలా మనిషిలా దాపురించాడు!

‘‘రాజ్యాలు అంతరించాయి. రాజును నేనూ అంతరించాను. నువ్వూ, నీ ప్రేమా ఇంకా ఇలాగే తగలడ్డాయి. నన్నెందుకిలా వెంటాడుతున్నావు? నా బతుక్కన్నా, నీ బతుకే బాగుందని చెప్పడానికా?’’ అన్నాడు చక్రవర్తి. ‘‘నేను మిమ్మల్ని వెంటాడడం లేదు చక్రవర్తీ. లోకంలోని ప్రేమ వెంటాడుతోంది. ఆ వెంటాడే ప్రేమకు నేనొక హృదయాన్ని మాత్రమే’’ అన్నాడు ప్రవక్త.  ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోని ఆ కాస్త సమయంలో ప్రవక్త చక్రవర్తిని ప్రేమిస్తూ కూర్చున్నాడు. చక్రవర్తి ప్రవక్తను ద్వేషిస్తూ కూర్చున్నాడు. అయితే ఎక్కువసేపు అతడలాద్వేషించలేకపోయాడు. ప్రేమ ద్వేషాన్ని మింగేసింది!‘‘ఈ లోకాన్ని కూడా నీ ప్రేమకు బందీని చెయ్యాలని వచ్చావా వాలెంటైన్‌?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ బందీని చెయ్యదు క్లాడియస్‌. బంధనాల నుంచి స్వేచ్ఛను ఇస్తుంది’’ అన్నాడు ప్రవక్త.  చక్రవర్తికి ద్వేషం అనే బంధనం నుంచి విముక్తి లభించింది. ప్రవక్త వెంట గాలిలో పైకి లేచాడు. 
మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు