వృత్తి ధర్మం

29 Jul, 2018 00:21 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘నాకొక ఒర్జినల్‌ దెయ్యం కావాలి’’ అన్నాడు వ్యాస్‌. ‘‘కమెగైన్‌’’ అన్నాడు త్రిలోక్‌ మల్హోత్రా.‘‘ఎస్‌. ఒక నిజమైన దెయ్యాన్ని చూడాలని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాడు వ్యాస్‌. ‘‘గాడ్‌.. నాకేమని వినిపించిందంటే.. మీరొక వర్జిన్‌ దెయ్యాన్ని కోరుకుంటున్నారని’’ అంటూ పెద్దగా నవ్వాడు మల్హోత్రా. ఆ నవ్వుతో అతడిపై వ్యాస్‌కి ఇంప్రెషన్‌ పోయింది. ‘‘మీ వల్ల కాదని నాకు అర్థమైంది. బై’’ అని విసుగ్గా పైకి లేచాడు. మల్హోత్రా ఖిన్నుడయ్యాడు. ‘నీ వల్ల కాదులే’ అని ఒక వ్యక్తి లేచి వెళ్లడానికి సిద్ధపడటం అతడి సర్వీసులో అదే మొదటిసారి. సర్వీసంటే పెద్దగా ఏం కాదు. దెయ్యాల్ని కళ్లారా చూపిస్తాడు. భక్తులు దైవ దర్శనానికి క్షణమైనా నోచుకోవడం కష్టం అవుతుందేమో కానీ, భయస్థులు మల్హోత్రా దగ్గరకు వచ్చాక దెయ్యాన్ని చూడకుండా వెళ్లరు. కొంతమందికి మాత్రం అక్కడి వరకూ వచ్చాక అనిపిస్తుంది.. దెయ్యంతో గేమ్స్‌ ఎందుకని. చివరి క్షణంలో వెనక్కి వెళ్లిపోతారు. 

త్రిలోక్‌ మల్హోత్రా భూత వైద్యుడు కాదు. భూత శాస్త్రజ్ఞుడు. దెయ్యాలు ఉన్నాయా లేవా అని పరిశోధనలు చేసే స్థాయిని అతడెప్పుడో దాటేశాడు. దెయ్యాల్ని పట్టి వాటిపై ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నాడు. ఏట్లో చేపల్ని పట్టినట్లుగా అతడు శ్మశానాల్లో దెయ్యాల్ని పట్టేస్తాడు. ఆ పట్టేయడం గమ్మత్తుగా ఉంటుంది. గంగా జలాన్ని నేరుగా సీసాలోకి పట్టినట్లు.. దెయ్యాల్ని సీసాల్లో బంధించేసి తన ల్యాబ్‌కి తెచ్చేసుకుంటాడు. ‘‘మీ వృత్తి ధర్మం మీద నాకు సందేహాలు మొదలయ్యాయి మిస్టర్‌ మల్హోత్రా. నేను ఒరిజినల్‌ దెయ్యం అన్న మాటను మీరు ఎప్పుడైతే వర్జిన్‌ దెయ్యం అని తీసుకున్నారో.. మీరొక నాన్‌సీరియస్‌ డెవిల్స్‌ సైంటిస్ట్‌ అని అర్థమైంది. వృత్తి మీద గౌరవం లేనివాళ్లే ఇలా.. ఆడవాళ్లతో పోలికలు తెచ్చి గంభీరమైన వాతావరణాన్ని తేలికపరుస్తారు’’ అన్నాడు వ్యాస్‌. ‘‘అంటే.. మీరు ఆడవాళ్లను తేలికపరుస్తున్నారా వ్యాస్‌’’ అన్నాడు మల్హోత్రా. ‘‘నేను తేలికపరచలేదు మల్హోత్రా. దెయ్యాల్లో ఆడ మగ పోలికలు తెచ్చి, మీరే ఆడవాళ్లను తేలికపరిచారు. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌ దెయ్యాలను! ఎట్‌ ద సేమ్‌ టైమ్‌ మీ వృత్తిని!’’ అన్నాడు వ్యాస్‌. మళ్లీ ఒకసారి నవ్వబోతూ ఆగాడు మల్హోత్రా. ‘‘మీరు అనుమతిస్తే నేను మరొకసారి నవ్వాలనుకుంటున్నాను మిస్టర్‌ వ్యాస్‌’’ అన్నాడు. ఆ విరుపు వ్యాస్‌కి అర్థమైంది. ‘‘నవ్వండి. కానీ.. ఒర్జినల్‌ దెయ్యమా? వర్జిన్‌ దెయ్యమా అనడం.. ఇట్సే బ్యాడ్‌ జోక్‌’’ అన్నాడు వ్యాస్‌. 

‘‘రైట్‌. మిస్టర్‌ వ్యాస్‌. చెప్పండి. మీ మనసు ఏం కోరుకుంటోంది. దెయ్యాన్ని చూడాలనా? దెయ్యాలను చూడాలనా?’’.. అడిగాడు మల్హోత్రా. ‘‘ఎలాగైనా పర్లేదు మల్హోత్రా. కానీ మీరు సమాజాన్ని ఉద్ధరించే సైకాలజిస్టులానో, పత్రికల్లో దెయ్యం కథలు రాస్తుండే అతి తెలివి రచయితల్లానో దెయ్యాలను చూపించడాన్ని నేను ఇష్టపడను. ‘దెయ్యాలు ఎక్కడో ఉండవు.. మనసులోనే ఉంటాయి’ అంటాడు సైకాలజిస్ట్‌. ‘దెయ్యాలు లేవని చెప్పడానికే దెయ్యాలు ఉన్నాయని రాస్తున్నాను’ అంటాడు రచయిత. ఈ ట్రాష్‌ అంతా నాకు అక్కర్లేదు. అందుకే ఒర్జినల్‌ దెయ్యం కావాలని మిమ్మల్ని అడిగాను. ఒర్జినల్‌ అంటే.. అది నా కళ్లకు కనిపించాలి. అది నా మీదకు రావాలి. అది చూసి నేను భయంతో చచ్చినంత పనవ్వాలి. అది నన్ను తరుముకుంటూ ఉంటే నేను పెద్దగా రంకెలు పెడుతూ పారిపోతుండాలి. అలాంటి దెయ్యం! తెల్లటి పొగను చూపించి, అదే దెయ్యం అంటే నమ్మను. సమీపంలో ఏదో వింత వాసన వస్తోంది.. అదే దెయ్యం అంటే నమ్మను. కిర్రుమని చప్పుడవుతుంటే అదే దెయ్యం అని నమ్మను. కిటికీలు టపటప కొట్టుకుంటుంటే అదే దెయ్యం అని నమ్మను. మీరు నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి ఇదే దెయ్యం అని చూపిస్తే, అప్పుడు నేను నమ్ముతాను’’ అన్నాడు వ్యాస్‌. మౌనంగా విని, మౌనంగా ఉండిపోయాడు మల్హోత్రా. 

‘‘ఏమిటాలోచిస్తున్నారు మల్హోత్రా. మీరైనా నాకొక స్పష్టమైన దెయ్యం రూపాన్ని చూపిస్తారనే అశిస్తున్నాను’’ అన్నాడు వ్యాస్‌. ‘‘తప్పకుండా’’ అన్నాడు మల్హోత్రా. అని, ‘‘ఒకటి చెప్పండి మీరు బయట ఉండి, లోపలి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా? లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడాలనుకుంటున్నారా?’’ అడిగాడు. ‘‘అర్థం కాలేదు’’ అన్నాడు వ్యాస్‌. ‘‘బయట ఉండి లోపలి దెయ్యాల్ని చూడడం అంటే.. నా ల్యాబ్‌కి వెళ్లి, అక్కడి సీసాల్లోని దెయ్యాల్ని చూడ్డం. లోపల ఉండి బయటి దెయ్యాలను చూడ్డం అంటే.. శ్మశానానికి వెళ్లిపోయి అక్కడ తిరుగుతుండే దెయ్యాల్ని చూడ్డం’’.. చెప్పాడు మల్హోత్రా. వ్యాస్‌కి కొంతే అర్థమైంది. ‘‘ల్యాబ్‌కి వెళ్లడం వరకు ఓకే. శ్మశానానికి వెళ్లినప్పుడు అక్కడి దెయ్యాలు, మనమూ అంతా బయటే ఉంటాం కదా. మరి లోపల ఉండి బయటి దెయ్యాల్ని చూడ్డం ఏమిటి?’’ అని అడిగాడు. నల్లటి దారం ఒకటి చూపించి, ‘‘ఇది చేతికి కట్టుకుంటే మనం లోపల ఉన్నట్లే. మనం బోనులో తిరుగుతూ, సఫారీలో క్రూర జంతువుల్ని చూస్తూ వెళ్తాం కదా. అలా’’ అన్నాడు మల్హోత్రా. ‘‘అయితే శ్మశానానికే వెళ్దాం’’ అన్నాడు వ్యాస్‌.

ఆ రాత్రి మల్హోత్రా కంటే ముందే శ్మశానానికి చేరుకున్నాడు వ్యాస్‌. అయితే మల్హోత్రా ఇచ్చిన నల్లదారం కట్టుకోవడం మర్చిపోయాడతడు. శ్మశానంలోకి వచ్చాక అక్కడి ఎగుడు దిగుడు దిబ్బల్ని, అక్కడక్కడా ఉన్న అస్థికల్ని, ఆ మసక వెలుతురులో వ్యాపిస్తున్న పొగలనీ చూశాక.. ఎందుకో తను చేస్తున్నది పిచ్చి పని అనిపించిందతడికి. మల్హోత్ర ఎంతకూ రాకపోతుంటే, మంచిదే అయిందని అక్కడి నుంచి వెనుతిరిగాడు. నాలుగడుగులు వేశాడో లేదో.. మల్హోత్రా వస్తూ కనిపించాడు! వస్తూ కనిపించాడో, Ðð ళ్తూ కనిపించాడో వెంటనే అర్థం కాలేదు వ్యాస్‌కి. ‘‘నీకంటే ముందే వచ్చాను వ్యాస్‌.. నా సీసాలోకి ఏ దెయ్యమైనా దొరుకుతుందేమోనని. ఒక్కటీ కనిపించలేదు. అలాగని నువ్వేం నిరాశపడకు. నువ్వు కోరుకుంటున్నట్లు నీ చెయ్యి పట్టుకుని నీకు దెయ్యాన్ని చూపించే పూచీ నాది’’ అన్నాడు మల్హోత్రా. 
ఇద్దరూ కలసి నడుస్తున్నారు. ముందు వ్యాస్‌ నడుస్తున్నాడు. వెనుక మల్హోత్రా నడుస్తున్నాడు. కొంత దూరం నడిచాక వ్యాస్‌కి ఎవరో తన చెయ్యి పట్టుకున్నట్లనిపించి వెనక్కి తిరిగి చూశాడు. మల్హోత్రానే. కానీ మల్హోత్రా చెయ్యి మాత్రమే వ్యాస్‌ చేతిని పట్టుకుని ఉంది. మల్హోత్రా ఎక్కడో.. దూరంగా.. చాలా దూరంగా.. తనవైపే నవ్వుతూ చూస్తున్నాడు. గుండె గుభేల్మంది వ్యాస్‌కి. దెయ్యాన్ని చూడాలను కోడానికి ధైర్యం అక్కర్లేదు. దెయ్యాన్ని చూడ్డానికి మాత్రం ధైర్యం కావాలని ఆ తర్వాతనైనా అతడు అనుకున్నాడేమో తెలీదు.
- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు