పసుపు కుంకుమ

9 Dec, 2018 01:40 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘ఆలోచించేపని లేదు. చెప్పినట్లు చెయ్యండి. కొంచెం పసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు. తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు.  

‘‘పట్టేశాను’’ అన్నాడు వీరభద్రం.ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు సహస్ర. ప్రమతి భర్త సహస్ర.‘పట్టేశాను’ అన్న వెంటనే, తన వెంట తెచ్చుకున్న బీకరులాంటి గాజు పాత్రలో పెట్టేసి, గట్టిగా బిరడా బిగించాడు వీరభద్రం. వీరభద్రం భూత వైద్యుడు కాదు. భూత తాంత్రికుడు. మనుషులకు పట్టే దెయ్యాల్ని వదిలించడంలో అతడికి ఇంట్రెస్ట్‌ లేదు. మనుషుల్ని వదలకుండా పట్టి పీడించే దెయ్యాల్ని బంధించడంలో అతడు ఎక్స్‌పర్ట్‌. ప్రమతి, సహస్ర మొదట తనను కలిసేందుకు వచ్చినప్పుడు అతడేం ఉత్సాహం చూపలేదు.   ఏమిటన్నట్లు చూశాడు. ‘‘ద..ద..’’ అని ప్రమతి తత్తరపడుతుంటే.. సహస్రే చెప్పాడు, ‘‘దెయ్యం ఉన్నట్లుంది మా ఇంట్లో.. దాన్ని వదిలించాలి’’ అని. ‘‘ఎన్నాళ్ల నుంచి ఉందనుకుంటున్నారు మీ ఇంట్లో దెయ్యం?’’ అడిగాడు వీరభద్రం. భార్యాభర్తలు ముఖాలు చూసుకున్నారు. యువ దంపతులు వాళ్లు. పెళ్లయి ఒక వారమైనా అయినట్లు లేదు. అంత ఉక్కిరిబిక్కిరిగా ఉన్నారు. ‘‘ఏడాది నుంచీ ఉంటున్నాం. ఆ దెయ్యం కూడా ఏడాది నుంచీ మాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది.  దెయ్యం వదలట్లేదని, ఇంటినే వదిలేయడానికి కూడా లేదు. అద్దెల్లు కాదు. సొంతది. మాకోసం మా అత్తమామలు కొని ఇచ్చింది. పెళ్లయిన నెల రోజులకు గృహప్రవేశం  చేశాం’’ చెప్పింది ప్రమతి.‘‘సరే.. వస్తాను వెళ్లండి’’ అన్నాడు వీరభద్రం. ‘వస్తాను, వెళ్లండి’ అనగానే.. ‘మా ఇంటి అడ్రస్‌..’ అంటూ దారులు, దిక్కులు చెప్పబోయింది ప్రమతి. అవసరం లేదన్నట్లు చేత్తో వారించాడు వీరభద్రం. సహస్రకు భలే ఆశ్చర్యం అనిపించింది. వెనక్కు వచ్చేశారు. అలా వెనక్కు వచ్చేటప్పుడు కూడా వీరభద్రం వెనక నుంచి వాళ్లనేమీ అడగలేదు. ఏ టైమ్‌లో ఉంటారూ.. ఇద్దరూ ఒకే టైమ్‌లో ఎప్పుడుంటారూ, ఆఫీస్‌లకు సెలవెప్పుడూ.. ఇలాంటివేమీ అడగలేదు. వాళ్లలా వెళ్లగానే ఇలా.. పుస్తకాలేవో తెరుస్తుండడం ప్రమతి, సహస్ర గమనించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంతసేపు  దెయ్యం సంగతి మర్చిపోయి, వీరభద్రం గురించి మాట్లాడుకున్నారు. ఆయన కళ్లల్లో వారికేదో తేజస్సు కనిపించింది. ‘‘పట్టేస్తాడు’’ అనుకున్నారు. 

‘‘పట్టేశాను’’ అని చెప్పి, బీకరులో పడేసి, బిరడాలో పెట్టేశాక.. దానిని ఈశాన్యంలోని దేవుడి మూలకు అభిముఖంగా, నైరుతి మూలలో చేతికి అందే ఎత్తులో అటకమీద ఉంచి చెప్పాడు వీరభద్రం.. ‘‘దీన్నిక్కడే కొన్నాళ్లు కదలకుండా ఉంచండి’’ అని. భయంగా చూశారు భార్యాభర్తలు. ‘‘దెయ్యాన్ని మీరు తీసుకెళతారనుకున్నాం’’ అన్నారు ఇద్దరూ ఒకేసారి. ‘‘లేదు. కొన్నాళ్లు ఈ బీకరు ఇక్కడే ఉండాలి. బీకరుకు అడ్డంగా కర్టెన్‌లాంటిది కూడా ఏమీ వేలాడదీయకండి. అది మీకు కనిపిస్తూ ఉండాలి’’ చెప్పాడు వీరభద్రం. ‘‘కానీ దాన్ని చూస్తుంటే మాకు భయంగా ఉంటుంది. బీకరులోని దెయ్యం మమ్మల్నే చూస్తూ ఉంటుందేమోనని. పైగా బీకరు అక్కడ ఉంటే.. మేం ఏ పనిలో ఉన్నా ఆ దెయ్యానికి కనిపిస్తూ ఉంటాం. తింటున్నా, టీవీ చూస్తున్నా, పడుకోడానికి వెళుతున్నా, స్నానం చేసి వస్తున్నా..’’ చెప్పాడు సహస్ర. అవునన్నట్లు చూసింది ప్రమతి. ‘‘కనిపించాలి’’ అన్నాడు వీరభద్రం.. బీకరులోకి చూస్తూ. ఆ మాటకు భయంగా గుటకలేశారు భార్యాభర్తలు. దెయ్యం ఇంట్లో ఏమూలన తిరుగుతోందో తెలియక భయపడడంవేరు. ఫలానా చోటు ఉందని తెలిసీ దెయ్యం.. ముందు ఇంట్లో తిరగడం వేరు. అది ఆలోచిస్తున్నారు వాళ్లు. అది కనిపెట్టాడు వీరభద్రం. ‘‘ఆలోచించే పని లేదు. చెప్పినట్లు చెయ్యండి.కొంచెంపసుపు, కుంకుమ కావాలి’’ అన్నాడు.  తీసుకురాబోయింది ప్రమతి. ఆగమన్నాడు వీరభద్రం. ‘‘డబ్బాలోని పసుపు, భరిణెలోని కుంకుమ కాదు’’ అన్నాడు. ‘మరి!’ అన్నట్లు చూశారు ప్రమతి, సహస్ర. ‘‘నీ కాలికి రాసుకున్న పసుపు. నీ భర్త గుండెలకు నువ్వద్దిన కుంకుమ’’ అని చెప్పాడు వీరభద్రం. కాళ్లకు పసుపు రాసుకుని, ఆ రాసుకున్న పసుపులోంచి కొంత తీసింది ప్రమతి. అలాగే భర్త గుండెకు కుంకుమ అద్ది, ఆ అద్దిన కుంకుమలోంచి కొంత తీసింది. వాటిని చిన్న కాగితం ముక్కలో వేసుకుంది. రెంటినీ కుడిచేతి ఉంగరపు వేలు, బొటనవేలితో కలపి, నలపమని చెప్పాడు వీరభద్రం. కలిపి, నలిపింది. దాంట్లోంచి భార్యాభర్తల్ని చెరిసగం తీసుకోమని చెప్పాడు. తీసుకున్నారు. బీకరు దగ్గరికి వెళ్లి, బీకరుపై ఇద్దర్నీ వేర్వేరుగా రెండు బొట్లు పెట్టమన్నాడు. మళ్లీ ఉలిక్కిపడింది ప్రమతి. ఉలిక్కిపడకుండా ఉండేందుకు సహస్ర ప్రయత్నించాడు కానీ వీలుకాలేదు. 

‘‘భయంలేదు. వెళ్లమ్మా.. నువ్కొక బొట్టు పెట్టు, నువ్వూ ఒక బొట్టు పెట్టబ్బాయ్‌’’ అన్నాడు. బొట్లు పెడుతున్నప్పుడు వాళ్ల వేళ్లు వణికాయి. బీకరు లోపల ఊపిరి ఆడకుండా ఎవరో టపటపా కొట్టుకుంటున్నట్లనిపించింది. ఆ తర్వాత వీరభద్రం వెళ్లిపోతుంటే.. భయంగా అడిగింది ప్రమతి. ‘‘ఎప్పుడు తీసుకెళతారు ఆ దెయ్యాన్ని’’ అని. ‘‘ఎవరూ తీసుకెళ్లే పని లేదు. సమయం వచ్చినప్పుడు బీకరే దానంతటది కిందపడి బద్దలవుతుంది’’.. చెప్పాడు వీరభద్రం. ‘‘అప్పుడు దెయ్యం మా పని పట్టదా.. అన్నాళ్లూ బంధించి ఉంచినందుకు?’’ అడిగాడు సహస్ర. ‘‘అలా జరగదు’’ అన్నాడు. వెళ్లే ముందు ఇంకో మాట కూడా చెప్పాడు. ‘‘మీరనుకున్నట్లు ఆ బీకరులో దెయ్యం లేదు. దెయ్యాలు ఉన్నాయి. రెండు దెయ్యాలు. ఒకటి ఆడ దెయ్యం, ఇంకోటి మగదెయ్యం. అంతేకాదు, అవి రెండూ కూడా బతికే ఉన్న ఇద్దరు మనుషుల ఆత్మలు.’’బతికున్న మనుషులకు కూడా ఆత్మలు ఉంటాయా అని ఆ రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నారు ప్రమతి, సహస్ర. ఆ తర్వాతెప్పుడూ బీకరులోని ఆ రెండు దెయ్యాల గురించిమాట్లాడుకోలేదు. ఇంట్లో దెయ్యం ఉందని మునుపు వాళ్లకు అనిపించడానికి కారణమైన సంఘటనలు కూడా వీరభద్రం వచ్చి వెళ్లాక మళ్లీ ఆ ఇంట్లో జరగలేదు. కొన్నాళ్ల తర్వాత.. ఓ రోజు ఉదయాన్నే నిద్ర లేచిన ప్రమతి, సహస్రలకు భళ్లున ఏదో పగిలిన చప్పుడు వినిపించింది. వెళ్లి చూశారు. బీకరు! ముక్కలై పడి ఉంది. ఆ మధ్యాహ్నం వాళ్లకు వేర్వేరుగా రెండు పెళ్లి కార్డులు వచ్చాయి. ఒక జంటలో వరుడు పంపిన కార్డు ప్రమతి పేరు మీద వచ్చింది. ఇంకో జంటలో వధువు పంపిన కార్డు సహస్ర పేరు మీద వచ్చింది. ‘నువ్వు లేకుండా బతకలేను’ అని ప్రమతికి చెప్పి, ప్రమతికి పెళ్లవుతున్న రోజు.. చీకట్లో ప్రమతినిపట్టుకుని బోరుమని ఏడ్చిన అబ్బాయి వరుడు. ‘నువ్వే నా సర్వస్వం. నిన్ను తప్ప ఎవర్నీ పెళ్లి చేసుకోనని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నావా!’’ అని.. చివరిసారి కలవడానికి వచ్చిన సహస్రను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులు వేసుకుని, లోపల్నుంచి దభీదభీమని తలను తలుపుకేసి కొట్టుకున్న అమ్మాయి వధువు. ∙∙ మర్నాడు వీరభద్రాన్ని కలిసి బీకరు పగిలిపోయిందని చెప్పారు ప్రమతి, సహస్ర. ‘‘ఆత్మ విముక్తి జరిగింది’’ అన్నాడు వీరభద్రం. ‘‘బీకరును మీతో తీసుకెళ్లితే ఆత్మ విముక్తి జరిగి ఉండేది కాదా?’’ అడిగాడు సహస్త్ర.. ఆసక్తి కొద్దీ. ‘‘కసితో జరిగిన ఆత్మవిముక్తి అది. మీ దాంపత్యాన్ని ఆ ఆత్మలు కళ్లారా చూశాక’’.. చెప్పాడు వీరభద్రం. 
∙మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు