ఖాళీ కప్పు

28 Oct, 2018 01:03 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘సర్‌ ఉన్నారా?’’.. పెద్ద బంగళాలా కనిపిస్తున్న ఇంటి ముందు ఆగి, గేటు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ ని అడిగాడు ఆ యువకుడు. స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఇల్లు అది. రెండు రోజులుగా అతడు ఆ ఇంటికి వచ్చి వెళుతున్నాడు. అది మూడో రోజు. ‘‘సర్, ఇంటి దగ్గర ఎవర్నీ కలవరు. ఆఫీస్‌కి వెళ్లి కలువు’’ అన్నాడు గార్డ్‌. ఆ మాటకు ఆ యువకుడి చేతి నరాలు బిగుసుకున్నాయి. ‘‘సర్‌.. ఆఫీసులో కలవడం లేదు. అందుకే ఇంటికొస్తున్నాను’’ అన్నాడు అదే రిథమ్‌లో. ఇవాళ ఎలాగైనా కమిషనర్‌ని కలిసే తీరాలని నిశ్చయించుకున్నాడు అతడు. ఉదయాన్నే, ఏడు గంటలైనా కాకముందే కమిషనర్‌ ఇంటికి వచ్చేశాడు! ‘‘సర్‌ని కలవనివ్వకపోతే, ఇక ఎప్పటికీ ఇక్కడి నుంచి కదలను’’.. అంటూ అక్కడే ఇంటి ముందు ఒక బండరాయిపై కూర్చున్నాడు.‘‘లెయ్‌ ఇక్కణ్ణుంచి’’ అన్నాడు గార్డ్‌ అతడి దగ్గరికొచ్చి, కర్ర ఊపుతూ.‘‘లేవను.. మీ సార్‌ని పిలువు బయటికి’’ అన్నాడు అతడు. మాటామాటా పెరిగింది. కర్రతో అతడి వీపు మీద కొట్టబోయాడు సెక్యూరిటీ. ఆ కర్రను రెండుగా విరిచేసి, ఆ ముక్కల్ని దూరంగా విసిరేశాడు అతడు! సెక్యూరిటీ ఖిన్నుడయ్యాడు. 

అది మనుషులు విరిచేస్తే విరిగిపోయే కర్ర కాదు. అలాంటి కర్రను అతడు విరగ్గొట్టాడు. గార్డ్‌కి బలమే కర్ర. ఆ బలాన్నే విరిచేశాడు. గార్డ్‌కి తల కొట్టేసినట్లయింది. అతడిపై చెయ్యి చేసుకోబోయాడు. అప్పుడొచ్చాడు కమిషనర్‌. ‘‘ఏం జరుగుతోందక్కడ?’’ అంటూ.అప్పటికే ఆయన ఎక్కడికో వెళ్లేందుకు తయారై ఉన్నాడు. ‘‘ఎవరో పిచ్చివాడు సార్‌’’ అన్నాడు సెక్యూరిటీ. ఆ యువకుణ్ణి చూశాడు కమిషనర్‌. ‘‘నేను పిచ్చివాణ్ణి కాద్సార్‌. పిచ్చి పట్టిస్తున్నారు. నెల రోజులుగా మీ ఆఫీస్‌ చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కరూ సరిగా సమాధానం చెప్పరు. మిమ్మల్ని కలవనివ్వరు. అందుకే ఇంటికి వచ్చేశాను. ఇక్కడా కలవనివ్వడం లేదు’’ అన్నాడు సెక్యూరిటీ వైపు కోపంగా చూసి.అతడిని నిశితంగా గమనించి, ‘‘లోపలికి రా’’ అన్నాడు కమిషనర్‌. వెళ్లాడు. ‘‘కూర్చో’’ అన్నాడు. కూర్చున్నాడు. ‘‘చెప్పు..?’’ అన్నాడు. చెప్పాడు. కమిషనర్‌ అతడిని వింతగా చూశాడు. ‘‘ఆఫీస్‌కి రా.. నేరుగా నన్నే కలువు’’ అని చెప్పాడు. 

అబిడ్స్‌లో మొజాంజాహి మార్కెట్‌ వెనుక ఉంటుంది ‘సమాచార హక్కు భవన్‌’. అందులోనే ఉంటాడు కమిషనర్‌. ఆయన ఎదురుగా కూర్చొని ఉన్నాడు ఆ యువకుడు. ‘‘నువ్వడిగిన ఇన్ఫర్మేషన్‌ మా దగ్గర ఉండదు మిస్టర్‌ తీర్థా. ఆర్టీఐ చట్టం అన్నీ ఇవ్వలేదు. ఇవ్వకూడదని కాదు. లేనిది ఎలా ఇవ్వగలదు? గూగుల్‌లో ట్రయ్‌ చెయ్యి’’ అన్నాడు కమిషనర్‌. విరక్తిగా నవ్వాడు ఆ యువకుడు. గూగుల్‌కైనా ఎక్కడి నుంచి వస్తుంది సర్‌ ఇన్ఫర్మేషన్‌? మీలాంటి వాళ్లు ఇస్తేనే కదా’’ అన్నాడు. ‘‘కావచ్చు! కానీ తీర్థా.. రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూత్‌ బంగళాలు ఉన్నాయో చెప్పమని ఆన్‌లైన్‌లో నువ్వు అడిగిన ప్రశ్నకు.. నిజంగా మా దగ్గర సమాధానం ఉండి ఉంటే, నీకెప్పుడో ఆ సమాచారం అంది ఉండేది’’ అన్నాడు కమిషనర్‌. తీర్థ ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ‘ఇక నువ్వు వెళ్లొచ్చు’ అని కమిషనర్‌ అనొచ్చు కానీ, అతyì తో మరికొంతసేపు మాట్లాడాలనిపించింది. టీ తెప్పించాడు. ‘‘భూత్‌ బంగళాలు ఎందుకు నీకు? ఏదైనా రిసెర్చ్‌ లాంటిది చేయబోతున్నావా? లైక్‌.. దెయ్యాలు, భూతాలు?’’ ఆసక్తిగా అడిగాడు కమిషనర్‌. నిజానికది ఆసక్తి కాదు. ఆసక్తి కనబరచడం. తన ఎదురుగా ఉన్న వ్యక్తిని.. తనకు సాధ్యమైనంత వరకు నిరాశకు లోను చెయ్యకూడదనుకున్నాడు కమిషనర్‌. చెప్పడం ఇష్టం లేదో, చెప్పినా అర్థం కాదనో మౌనంగా ఉన్నాడు తీర్థ.‘‘ప్రధానమంత్రి పర్యటనలకు ఎంత ఖర్చయిందీ మేము చెప్పగలం కానీ.. పాడుబడిన బంగళాలు ఎక్కడెక్కడున్నదీ చెప్పలేం. బహుశా అది ఇంకో డిపార్ట్‌మెంట్‌ అయి ఉంటుందోమో. నాకైతే తెలియదు’’ అన్నాడు కమిషనర్‌. టేబుల్‌ మీద వాళ్లిద్దరూ తాగేసిన ఖాళీ టీ కప్పులు ఉన్నాయి. ‘‘జీవితం ఖాళీ టీ కప్పులాంటిది కదా సర్‌’’ అన్నాడు తీర్థ.. ఆ కప్పుల వైపు అభౌతికంగా చూస్తూ.కమిషనర్‌కు అర్థం కాలేదు. అయితే ఆ మాట అనకుండా.. ‘‘కానీ నేననుకోవడం ఏంటంటే తీర్థా.. జీవితం ఖాళీ కప్పు కాదు. ఖాళీ కప్పుపై వాలుతున్న ఈగ’’ అన్నాడు. ఆ మాట తీర్థకు అర్థం కాలేదు. ఇద్దరికీ అర్థమైంది ఒకటే.. ఇద్దరిలో ఒకరు అబ్‌నార్మల్‌గా ఆలోచిస్తున్నారు. 

‘‘మన జీవితాన్ని ఎవరో తాగేస్తే మనం ఖాళీ కప్పులా మిగిలిపోతాం’’ అన్నాడు తీర్థ. ‘‘ఎవరో తాగేసిన మన జీవితంలో ఇంకా ఏదో మిగిలి ఉందన్న ఆశతో.. మనమే ఈగలా ఖాళీ కప్పు చుట్టూ తిరుగుతుంటాం’’ అన్నాడు కమిషనర్‌. కమిషనర్‌ వైపు అనుమానంగా చూశాడు తీర్థ. ‘‘జీవితం ఖాళీ కప్పు అని నేను అంటున్నప్పుడు, ఖాళీ కప్పుపై వాలే ఈగే జీవితం అని మీరు అంటున్నారంటే.. మన దృక్పథాలు వేరు అని అర్థం. దృక్పథాలు వేరైనవారు కూడా హాయిగా కలిసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఉండగలిగే చోట్లు ఈ లోకంలో భూత్‌ బంగళాలు మాత్రమే సర్‌’’ అన్నాడు తీర్థ. కమిషనర్‌ నవ్వాడు.‘‘ఇప్పుడు మన ఇద్దరం చక్కగా కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కాసేపూ ఈ సమాచార హక్కు భవన్‌ను భూత్‌ బంగళా అనుకోవచ్చు కదా తీర్థా’’ అన్నాడు కమిషనర్‌.తీర్థ నవ్వలేదు. ‘‘దృక్పథాలు వేరైనవారు కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవడం అంటే.. దృక్పథాలను దాచిపెట్టుకుని మాట్లాడుకోవడం అవుతుంది సర్‌. ఆ దాపరికం భూత్‌ బంగళాల్లో ఉండదు’’ అన్నాడు. ‘‘మరి?!’ అన్నాడు. ‘‘మామూలు ఇళ్లలో ఉంటుంది. మామూలు మనుషుల్లో ఉంటుంది’’‘‘మనుషుల్ని మామూలు అంటున్నావా? ఇళ్లను మామూలు అంటున్నావా తీర్థా?’’‘‘బుద్ధుల్ని అంటున్నాను సర్‌’’‘‘మనుషుల బుద్ధికి కొత్తగా ఏమైంది తీర్థా ఇప్పుడు? లోకం çపుట్టినప్పటి నుంచీ ఉన్న బుద్ధులు, ఉన్న మనుషులే కదా!’’‘‘అందుకే కదా సార్‌.. మనుషుల్లో ఉన్నంతసేపూ మనిషిలా ఉండడం కష్టం కాదు’’ అన్నాడు తీర్థ. ఒక్కసారిగా కమిషనర్‌ బిగుసుకుపోయాడు. వెన్నులోకి చలి పాకడం అంటే ఏంటో జీవితంలో తొలిసారి తెలుస్తోంది ఆయనకు. ‘‘ఇళ్లకు ఉన్నట్లు భూత్‌ బంగళాలకు కూడా టూ–లెట్‌ బోర్టులు ఉంటే అసలు మీ వరకు వచ్చేవాడిని కాదు సార్‌..’’ అనే మాట తర్వాత.. కమిషనర్‌కి ఇంకేమీ వినిపించలేదు. 
- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు