నన్ను కట్టుకో

17 Mar, 2019 00:37 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘అబ్బ.. ఎంత బాగుందోనే ఈ చీర...’’ కళ్లల్లో మెరుపుతో కాంప్లిమెంట్‌ ఇచ్చింది మందాకిని.‘‘కదా... అందుకే.. బడ్జెట్‌ కంటే ఎక్కువైనా కొనేసుకున్నా ...’’ అపురూపంగా చీరను హత్తుకుంటూ తార. ‘‘ఊ... చాలాబాగుందే..’’ మందాకిని మనసంతా చీరమీదే ఉంది. ‘‘ఎక్కడ కొన్నావ్‌?’’ ఆదుర్దాగా అడిగింది .‘‘అదృశ్యపట్టులో’’ ఉత్సాహంగా  తార. ‘‘ అయితే.. నా  పెళ్లి షాపింగ్‌ కూడా అక్కడే చేస్తా...’’ మందాకిని.  పదిహేను  రోజుల్లో తార పెళ్లి. ఫార్మాసిస్ట్‌. ప్రాక్టికల్‌గా ఉండే మనిషి. అనవసర ఖర్చులకు దూరం. అందుకే పెళ్లి కూడా చాలా సింపుల్‌గా జరగాలని పెళ్లికొడుకు వాళ్లతో ఒప్పించింది. కట్నం ముచ్చటేరానివ్వలేదు. కాని ఈ పెళ్లి చీర పట్లే  ఎందుకో విపరీతమైన కాంక్షను కనబరిచింది. వందల చీరల్లో ఈ చీరే ఆకర్షించింది ఆమెను. ఎన్ని సార్లు దాన్ని చూడొద్దనుకున్నా.. దానివైపే  మనసు లాగింది. దాని ధర చూశాక గుండె గుభేల్‌మనడంతో పక్కన పడేసింది కూడా.  అయినా అది తననే చూస్తున్నట్టు.. నన్ను  తీసుకో అంటూ అభ్యర్థించినట్టూ.. వెంటాడినట్టూ అనిపించింది తారకు. దాంతో ఆ చీరనే తీసుకుంది.  తార తల్లి, మేనత్తకు ఆశ్చర్యమేసింది...పీనాసిగా ముద్రేసుకున్న తార.. పెళ్లి చీర విషయంలో ఇంత ఉదారంగా ఉందేంటని!  

‘‘ ఇంకా వారమే ఉందే. బ్లౌజ్‌ కుట్టడానికి ఇవ్వనేలేదు. చీరకు ఫాల్‌ కూడా వేయాలి. ఎప్పుడిస్తావ్‌?’’ కేకలేసింది తార మేనత్త పెళ్లి సరంజామా అంతా సర్దుతూ.‘‘ఇస్తాలే అత్తా...’’ నీరసంగా తార ..కాఫీ కప్‌తో మేనత్త పక్కనే కూర్చుంటూ.‘‘ఇంకెప్పుడూ?’’ అంది పసుపు కొమ్ముల మూట విప్పుతూ మేనత్త. ‘‘అబ్బా.. అది మూటకట్టేసేయత్తా’’ చిరాగ్గా తార. ‘‘ఏమైందే? శుభమాని పసుపు మూట విప్పుతూంటే కట్టేయమంటావ్‌’’ మేనకోడలి ప్రవర్తనకు విస్తు పోతూ.‘‘ తీసేయ్‌ ’’ అని అరుస్తూ  ఆ మూటను కాలుతో విసిరికొట్టింది తార.అవాక్కయి నోరెళ్లబెట్టింది మేనత్త. ఎంత కోపన్నయినా బ్యాలెన్స్‌ చేసుకునే పిల్ల.. ఇలా  అకారణంగా చిరాకుపడడం.. ఇదే మొదటిసారి.   కొంపదీసి ఈ పెళ్లిగాని ఇష్టంలేదా ఏంటీ? ఒక్క క్షణంలోనే రకరకాల ఆలోచనలు మేనత్తకు. ‘‘అత్తా.. పసుకొమ్ముల మూటేంటి? అలా గిరాటేశారు?’’ అమాయకంగా తార.. షాక్‌ మేనత్తకు. ‘‘అత్తా..నిన్నే అడుగుతోంది? ’’చేష్టలుడిగిన మేనత్త భుజం పట్టి ఊపుతూ తార.‘‘ ఎవరు గిరాటేసారో నీకు తెలీదా’’ అయోమయంగా అడిగింది మేనత్త. ‘‘ నాకేం తెలుసత్తా? నేనిప్పుడే కదా వచ్చింది ’’ అంటూ నేల మీద గొంతుక్కూర్చుని పసుపు కొమ్ములన్నీ ఏరసాగింది. మతిపోయింది మేనత్తకు. వంగి.. తార గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తుతూ.. ‘‘ఏమే... వీటిని ఎవరు విసిరికొట్టారో నిజంగానే నీకు తెలీదా?’’ అడిగింది.‘‘ఏమైందత్తా నీకు?’’ గాబరాగా తార.  తల పట్టుక్కూలబడ్డది  మేనత్త. మధ్యాహ్నం భోజనాలప్పుడు.. ఎంత వడ్డిస్తున్నా  వద్దనడం లేదు తార.  వంచిన తలెత్తకుండా తింటూనే ఉంది. ఉదయం జరిగిన సంఘటనతో ఇంకా తేరుకోని  మేనత్త.. తార తింటున్న తీరుతో  మరింత గందరగోళంలో పడిపోయింది. ఇంట్లో వాళ్లందరికీ వింతగానే ఉంది. తారను అలా వదిలేసి  మౌనంగా వేరే గదిలోకి వెళ్లిపోయారు వాళ్లు  ఏమీ అర్థంకాక. మేనత్త కూడా మళ్లీ మళ్లీ  తిరిగి  చూస్తూ  భయం భయంగానే అక్కడి నుంచి కదిలింది. లోపల గదిలో ఉన్న తార తల్లిదండ్రులకు పొద్దున జరిగిన విషయం చెప్పింది ఆమె.  కారణం కనుక్కొనే  యోచనలో పడ్డారంతా. ఇంతలోకే వగరుస్తూ ఆ గదిలోకి వచ్చింది తార.. ‘‘అమ్మా.. ఆకలేస్తోందే. అన్నం పెట్టవా? మందాకిని వస్తానంది.  తినేసి పార్లర్‌కు, అక్కడి నుంచి టైలర్‌ దగ్గరకూ వెళ్లాలి.. బ్లౌజ్‌ ఇవ్వాలి.. ఫాల్‌ కుట్టించాలి.. అమ్మో.. టెన్షన్‌ వచ్చేస్తుంది’’ అంది ఫోన్‌లో ఏదో నంబర్‌ కలుపుతూమేనత్తకైతే మొహంలో నెత్తురు చుక్కలేదు.. మిగతా వాళ్లది ఉదయం మేనత్తకు ఎదురైన అనుభవమే!తార తండ్రి.. మెల్లగా భార్య వెనకాలకు వచ్చి.. మోచేత్తో పొడిచాడు.. ‘‘వెళ్లి పిల్లకు అన్నం పెట్టు’’ అన్నట్టుగా!కన్‌ఫ్యూజన్‌ స్టేట్‌లోనే తార తల్లి డైనింగ్‌ హాల్లోకి వెళ్లింది ‘‘రామ్మా.. అన్నం పెడతాను’’ అని కూతురిని పిలుస్తూ!‘‘ఆ.. ఆ..’’ అని తల్లికి సమాధానమిస్తూ ఫోన్‌లోంచి తల పైకెత్తింది. కళ్లు పెద్దవి చేస్తూ అందరూ తననే చూస్తూండే సరికి.. ‘‘ఏమైంది’’ అడిగింది . ఏమీ కాలేదన్నట్టుగా తలలూపారు అందరూ! ‘‘మరెందుకలా చూస్తున్నారంతా?’’ ఈసారి ఆశ్చర్యం తారది. సేమ్‌ ఓల్డ్‌ ఎక్స్‌ప్రెషన్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌.ఏంటో అన్నట్టుగా భూజాలెగరేస్తూ నడిచింది తార భోజనాల గదిలోకి. 

పెళ్లికి మూడు రోజుల ముందు.... ఉదయం ఏడైంది.. దగ్గరి చుట్టాలతో తారా వాళ్లిల్లంతా సందడిగా ఉంది. వదినామరదళ్ల పరాచికాలు.. బావామరదుల వేళాకోళాలు.. అత్తాకోడళ్ల సరదాలతో కళకళలాడుతోంది. కాని అసలు మనుషుల మొహాల్లో సంతోషం కనపడ్డం లేదు. బయటికి నవ్వు నటిస్తున్నారు కాని లోపలంతా తెలియని భయం... పూటపూటకూ మారుతున్న తార బిహేవియర్‌ గురించి. పెళ్లి కూతురుని చేయడానికి పీట మీద కూర్చోబెట్టారు తారను. అమ్మమ్మ, నానమ్మతోపాటు అత్త వరస, పిన్ని వరస, అక్క వరస అయ్యేవాళ్లంతా ఒక్కొక్కళ్లే వచ్చి  బొట్టు పెడ్తున్నారు...తార తల్లి,మేనత్త ఉగ్గబట్టుకుంటున్నారు.. తార ఎప్పుడు ఎలా.. రియాక్ట్‌ అవుతుందోనని!వాళ్ల అంచానాలను తారుమారు చేస్తూ ... తార .. చక్కగా నవ్వుతూ.. సిగ్గు పడుతూ కూర్చుంది. పసుపు రాస్తున్నారు.. నలుగు పెడ్తున్నారు.. మంగళ వాద్యాలు మోగుతున్నాయి.. పెరట్లో ఆరుబయట  ఆనవాయితీగా  మంగళ స్నానం చేయించాక.. షాంపూతో తలంటుకొమ్మని పెరట్లోనే ఉన్న బాత్రూమ్‌లోకి పంపించారుతారను.టిఫిన్‌ పని చూసేందుకు వాళ్లంతా  వంటింట్లోకి వెళ్లబోతుంటే  తార ఎదురు పడింది. నిశ్చేష్టులయ్యారంతా. అసంకల్పితంగానే వెనక్కి తిరిగి చూశారు బాత్రూమ్‌ వైపు. తలుపు వేసే ఉంది. మళ్లీ తార ౖవైపు తిరిగారు. ‘‘సారీ.. అమ్మా.. అలారం మోగినా మెలకువ రాలేదు. ముహూర్తం ఎనిమిదిలోపు ఎప్పుడైనా అన్నారు కదా?’’అంది తార. యాంత్రికంగా తలూపింది తార తల్లి. ‘‘బ్రష్‌చేసుకొని వస్తానుండండి’’ అంటూ పెరట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లింది.  మతి పోయినంత పనైంది అందరికీ! వీళ్ల స్థితి ఇలా ఉండగా.. తార అన్నయ్యకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘‘సర్‌.. మీరు ఈ మధ్యఅదృశ్యపట్టులో ఏమైనా షాపింగ్‌ చేశారా?’’‘‘అవును’’‘‘అక్కడ బిల్‌ డిటైల్స్‌లో మీ నంబర్‌ తీసుకుని ఫోన్‌  చేస్తున్నా సర్‌.. ఒకవేళ పెళ్లి చీర కొంటే మాత్రం అది కట్టుకోవద్దని చెప్పండి. కొనే వరకు నన్నుతీసుకో అని.. కొన్నాక నన్ను కట్టుకో అంటూ కలలో కూడా వెంటాడుతుంది ఆ చీర. మా చెల్లి ఆ షాప్‌లోనే పనిచేసేది. పెళ్లి కుదిరాక అక్కడే పెళ్లి చీర కొనుక్కుంది. పెళ్లికొడుక్కి ఇదివరకే పెళ్లయిందని తెలిసి పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మా చెల్లి ఆ చీరతోనే ఉరేసుకుంది సర్‌’’ఫోన్‌ డిస్కనెక్ట్‌ చేసి గబగబా తల్లి దగ్గరకు పరిగెత్తాడు తార వాళ్ల అన్నయ్య.
- సరస్వతి రమ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా