పక్కనే ఉండు

2 Dec, 2018 01:59 IST|Sakshi

కిర్ర్‌..ర్‌..!

చెవులకు మఫ్లర్, ఒంటికి స్వెట్టర్‌ వేసుకుని.. దాదాపుగా రాత్రి పదకొండు అవుతుండగా ధర్మజీవి ఇంటికి వచ్చాడు విశ్వేశ్వర్‌. వచ్చీరావడంతోనే ‘‘నీ సలహా కోసం వచ్చాన్రా «ధర్మా..’’ అన్నాడు.. «ధర్మజీవి పడుకుని ఉన్న మంచం మీద అతడి కాళ్ల వైపు కూర్చుంటూ.‘‘కుర్చీలో కూర్చోరా..’’ అన్నాడు ధర్మ.. దుప్పట్లో చాపుకుని ఉన్న కాళ్లను పైకి మడుచుకుంటూ. ‘‘పర్లేదురా’’ అని ధర్మజీవి కాలిపై మృదువుగా చెయ్యి ఆన్చాడు విశ్వేశ్వర్‌. అప్పుడనిపించింది ధర్మజీవికి.. విశ్వేశ్వర్‌ లోలోపల ఎందుకనో నలిగిపోతున్నాడని. దిగ్గున మంచం మీద లేచి కూర్చున్నాడు. ‘‘ఏమైందిరా విశ్వా?’’ అన్నాడు ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి.వాళ్లిద్దరూ స్నేహితులు. ఊళ్లో ఊడలు దిగిన జంట మర్రిచెట్ల లాంటి స్నేహితులు. అరవై ఏళ్ల స్నేహం. ‘‘ఏమైందిరా విశ్వా?’’ మళ్లీ అడిగాడు «ధర్మ. విశ్వ ఏం చెప్పలేదు. ధర్మ కళ్లలోకే చూస్తున్నాడు.మామూలుగా ధర్మను విశ్వ కలిసే సమయం ఇలాగే బాగా పొద్దుపోయాక ఉంటుంది. ధర్మ కూడా ఎప్పుడైనా వెళ్లి విశ్వను వాళ్లింట్లో కలుస్తుంటాడు. అయితే విశ్వ వచ్చి కలిసినంతగా, «ధర్మ Ðð ళ్లి కలవడు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. ధర్మ ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ధర్మకు ప్రత్యేకంగా ఒక గది ఉంటుంది. భార్యా పిల్లలు వేరుగా వేరే గదుల్లో ఉంటారు. ఇప్పుడా పిల్లలు కూడా లేరు.అమెరికాలో ఒకరు, జర్మనీలో ఒకరు వేరే గదులు చూసుకుని వెళ్లిపోయారు. «ధర్మ, అతడి భార్య జానకి మాత్రం మిగిలారు. విశ్వక్కూడా.. పిల్లలు పెళ్లిళ్లై వెళ్లిపోయాక ఇంట్లో కాస్త స్పేస్‌ దొరికింది. అయితే పిల్లల్లేని ఆ స్పేస్‌ అతడికి కొన్నాళ్లకే ఇరుగ్గా ఉన్నట్లనిపించడం మొదలైంది. ఆ ఇరుకును మరింత ఇరుకు చేస్తూ భార్య కూడా అతడికి మరికొంత స్పేస్‌ ఇచ్చి వెళ్లింది. కొన్ని నెలల క్రితమే ఆమె చనిపోయింది.ఒక్కడే ఇప్పుడు విశ్వ. అతడికున్నదీ ఈ విశ్వంలో ఒక్కడే ఇప్పుడు.. ధర్మ. 

‘‘ఇంక చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ.. నిట్టూరుస్తూ. ధర్మకు అర్థమైంది.‘‘తిన్నావా?’’ అన్నాడు. ‘‘ఊ..’’ అన్నాడే కానీ, విశ్వ తినిరాలేదు. కొద్ది రోజులుగా అతడికి తినవలసిన అవసరం కూడా కనిపించడం లేదు.‘‘జానకీ.. విశ్వా వచ్చాడు..’’ హాల్లోకి చూస్తూ చెప్పాడు ధర్మ ‘‘వద్దమ్మా.. టీ తాగే వచ్చాను’’ అన్నాడు విశ్వ.. ఆమెకు వినిపించేలా. ‘‘సరే.. కాస్త ఆగి తీసుకురా జానకీ’’ అన్నాడు «ధర్మ. పన్నెండూ ఒంటిగంట వరకు ఆ స్నేహితులిద్దరూ మాట్లాడుకోవడం ఆమెకు తెలిసిన సంగతే. ‘‘బతికింది చాలనిపిస్తోందిరా’’ అన్నాడు విశ్వ. అతడి వైపు తీక్షణంగా చూశాడు ధర్మ. ‘‘ఎవరు మాత్రం పనికట్టుకుని బతుకుతారు చెప్పూ. జీవితమే ఏదో ఒక ఆశను పెట్టి, లేదంటే నెత్తి మీద ఓ బాధ్యతను పెట్టి ఏ క్షణానికాక్షణం బతికిస్తుంటుంది మనుషుల్ని.చిన్న వయసులో ఆశలు. పెద్దయ్యాక బాధ్యతలు. ఎవరి బతుకూ వారి చేతుల్లో ఉండదు’’ అన్నాడు. ‘‘ఆశలేం లేవు. బాధ్యతలూ తీరిపోయాయి’’ అన్నాడు విశ్వేశ్వర్‌. ‘‘ఆశలు నెర వేరీ, బాధ్యతలన్నీ తీరిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్లంతా నీలాగే అనుకుంటున్నారా విశ్వా!’’‘‘అది కాదురా.. నాకు ఈ జీవితంపై ఏవిధమైన ఆసక్తీ కలగడం లేదు. ఊరికే.. నాది కాని ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్లుగా ఉంది.. నేనింకా ఈ భూమ్మీదే ఉండడం..’’‘‘పోనీ నాకోసం బతకరా. నేను పోయే దాకా. నిద్ర లేస్తే ఎప్పుడూ మన ఆశలు, మన బాధ్యతలేనా? మనపై ఆశలు పెట్టుకున్నవారినీ, మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్నవారిని నిరాశపరిచి వెళ్లిపోతామా’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్‌ పెద్దగా నవ్వాడు. ‘‘ఎవరు పెట్టుకుంటార్రా నా మీద ఆశలు. పైకి పోయిన నా భార్య పెట్టుకుంటుందా? పై చదువులని చెప్పి అట్నుంచటే వెళ్లిపోయిన నా పిల్లలా? ఇంకో మాట కూడా అన్నావు. ‘మన బాధ్యత తీసుకోవాలని ఆశపడుతున్న వారిని నిరాశపరిచి వెళ్లిపోతామా?’ అని. ఎవరికైనా ఎందుకిస్తాం మన బాధ్యతను? చెప్పు’’ అన్నాడు విశ్వేశ్వర్‌. 

‘‘పోనీ నీ బాధ్యతను ఎవరి మీదైనా పెట్టెయ్‌. అప్పుడు బతకాలనిపిస్తుందేమో’’ అన్నాడు ధర్మ. ‘‘అలా ఉంటుందా ధర్మా. ముందసలు బతుకుపై ఆసక్తి ఉంటే కదా.. బాధ్యతలు ఇవ్వడమైనా, బాధ్యతలు తీసుకోవడమైనా! ఇవన్నీ అటుంచు.. నా బాధ్యతను ఇంకొకరు తీసుకోడానికి నేనెందుకు అంగీకరిస్తానని అనుకుంటున్నావు’’ అన్నాడు విశ్వేశ్వర్‌.‘‘అవుననుకో..’’ అని ఆగిపోయాడు ధర్మ. మాటల మధ్య జానకి ఎప్పుడొచ్చి వాళ్లకు అక్కడ టీ పెట్టి వెళ్లిందో ఇద్దరూ చూసుకోలేదు. ‘‘టీ తీస్కోరా విశ్వా’’ అన్నట్లు చూశాడు ధర్మ.  టీ తాగుతున్నంతసేపూ విశ్వేశ్వర్‌నే చూస్తూ.. టీ తాగడం అయ్యాక.. ‘‘జీవితంపై ఆసక్తి లేదంటున్నావంటే.. జీవితంలోని సంతోషాలను చూడలేకపోతున్నావని అర్థం’’ అన్నాడు ధర్మ. ‘‘ఏం మిగిలి ఉంటాయని.. సంతోషాలు.. సూర్యుడు పడమటికి దిగిపోతుంటే..’’‘‘సంతోషాలు మిగిలిపోవు. ఉండిపోవు విశ్వా. రోజూ బతికే బతుకులోనే వెతుక్కోవాలి’’‘‘ఆశ ఉంటేనే కదా ధర్మా.. వెతుక్కుంటాం. నాకలాంటి ఆశ లేదంటున్నాగా..’’ అన్నాడు విశ్వేశ్వర్‌. ధర్మకు అర్థమైంది.. విశ్వ ఏదో తీర్మానించుకునే వచ్చాడని. ‘‘సరే.. చెప్పు.. సలహా కోసం వచ్చానని అన్నావ్‌ కదా. దేనికి సలహా? బతికింది చాలనుకోడానికా?’’ అని నవ్వాడు. విశ్వేశ్వర్‌ మౌనంగా ఉన్నాడు.

‘‘బతికింది చాలనుకోడానికైతే నా దగ్గరేం సలహా లేదు. బతకడానికైతే మాత్రం ఉంది. నేను నీ మీద ఆశ పెట్టుకుంటాను. నేను నీ బాధ్యత తీసుకుంటాను’’ అన్నాడు ధర్మ. విశ్వేశ్వర్‌కి అర్థం కాలేదనిపించి మళ్లీ చెప్పాడు.‘‘నా జీవితాంతం నువ్వు నా పక్కనే ఉండాలని నా ఆశ. ఇక నేను తీసుకోవాలనుకుంటున్న బాధ్యత.. నిన్నూ మా ఇంట్లో మనిషిగా, మాతో పాటు ఉంచుకునే బాధ్యత. ఏమంటావ్‌? నాఆశనెరవేరుస్తావా? నీ బాధ్యతను తీసుకోనిస్తావా?’’ అన్నాడు. మళ్లీ ఇందాకటే మాటే అన్నాడు విశ్వేశ్వర్‌. ‘‘నాపై నీ ఆశకు నా ప్రమేయం లేదు. నీపై నేను పెట్టే బాధ్యతేమీ ఉండబోదు’’ అన్నాడు. అని పైకి లేచాడు. పైకి లేవడం అంటేకుర్చీలోంచి పైకి కాదు. కుర్చీ కన్నా పైకి! ‘‘ఒరేయ్‌.. విశ్వా’’ అని పెద్దగా అరిచాడు ధర్మజీవి.. తల పైకెత్తి చూస్తూ.  ‘‘ఏంటండీ.. అని హాల్లోంచి ముందు గదిలోకి వచ్చింది జానకి. ‘‘నిర్ణయం తీసేసుకున్నాక సలహా తీసుకోడానికి వచ్చినట్లున్నాడు జానకీ’’ అన్నాడు ధర్మజీవి. ఆ మాట ఆమెకు అర్థం కాలేదు. తెల్లారి.. జానకమ్మ.. ముందు గదిలోకి వచ్చి టీ కప్పులు తీయబోయింది. వాటిల్లో ఒకటి మాత్రమే ఖాళీగా ఉంది. ‘‘విశ్వా.. రాత్రి టీ తాగి వెళ్లలేదా?’’ భర్తను లేపుతూ అడిగింది.
ధర్మజీవి కదల్లేదు. 
- మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు