అరచేతిలో బుల్లిపెట్టె

15 Mar, 2020 10:47 IST|Sakshi

ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న మహిళ చేతిలో పాతకాలం నాటి రోటరీ డయల్‌తో కనిపిస్తున్న పరికరం అచ్చంగా మొబైల్‌ ఫోన్‌. ఇది పూర్తిగా పనిచేస్తుంది కూడా. జస్టీన్‌ హాప్ట్‌ అనే ఈ మహిళ స్పేస్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. స్మార్ట్‌ ఫోన్లంటే ఈమెకు మాచెడ్డ చిరాకు. ల్యాండ్‌ఫోన్‌ను ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోయే వీలు లేదు. మొబైల్‌ఫోన్‌ వాడటం తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్ల బెడద తప్పించుకోవడానికి ఈమె తన బుర్రకు పదును పెట్టి ఉపాయాన్ని ఆలోచించింది.

బుర్రలో బల్బు వెలగడమే తరువాయి. ఈ ఎక్స్‌ట్రా స్మార్ట్‌ఫోన్‌కు రూపకల్పన చేసింది. పాతకాలం నాటి రోటరీ డయల్‌తో, అంగుళం మందం, మూడంగుళాల వెడల్పు ఉండేలా సరికొత్త మొబైల్‌ఫోన్‌ను తయారు చేసింది. దీని తయారీ కోసం టెలికం పరికరాలను తయారు చేసే సంస్థల నుంచి విడి భాగాలను తెప్పించుకుంది. ఇందులో ఆమె ‘ఏటీ అండ్‌ టీ’ కంపెనీకి చెందిన ప్రీ పెయిడ్‌ సిమ్‌కార్డును వాడుతోంది. ఈ ఫోన్‌ కూడా పాతకాలం నాటి ల్యాండ్‌ఫోన్‌ మాదిరిగా మాటలాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. స్మార్ట్‌ఫోన్లలో చిరాకుపెట్టే ఎస్‌ఎంఎస్, ఎంఎంఎస్‌లు, వాట్సాప్‌ వంటి యాప్‌ల పప్పులేవీ ఇందులో ఉడకవు. భలే ఉంది కదూ! దీని తయారీ కోసం ఆమె తెప్పించుకున్న పరికరాల విలువ 130 డాలర్లు (సుమారు రూ.9,600).

దీని ఫొటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగానే ఇలాంటిది తమకూ కావాలని చాలామంది కోరారు. దీంతో ఆమె ఇలాంటి ఫోన్‌ తయారీకి కావలసిన పరికరాల కిట్‌ను, తయారీ పద్ధతి నోట్‌ను ఆన్‌లైన్‌లో 170 డాలర్లకు (దాదాపు రూ.12,500) విక్రయిస్తోంది. ఈ ధరకు మార్కెట్‌లో ఏకంగా స్మార్ట్‌ఫోన్‌ దొరుకుతుందిగా అనుకుంటున్నారా? అలాగే అనుకోండి. ఇలాంటిది మీ దగ్గర ఉంటే బాగుంటుందనుకుంటున్నారా? అలాగైతే ఆన్‌లైన్‌లో జస్టీన్‌ హోప్ట్‌కు ఆర్డర్‌ చేయండి.
  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా