రన్‌ రాజా రన్‌

7 Jan, 2018 00:07 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ‘మిరాకిల్స్‌’ యజమాని యుగంధర్‌ తన  సంస్థ ఉద్యోగులను పిలిచి ఒక శుభవార్త ఇలా చెప్పాడు...‘‘మన సంస్థ వార్షికోత్సవంలో  భాగంగా మొదటి సారిగా పాటల పోటీ నిర్వహిస్తున్నాం. ‘గెలిచిన విజేత చేతిలో ఒక కప్పు పెట్టి, భుజాల మీద శాలువ కప్పుతాం...’  అని  అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ఉప్పులో కాలేసినట్లే. శాలువ, కప్పు కాదు విజేతకు 5లక్షల రూపాయల క్యాష్‌అవార్డ్‌ ఇస్తున్నాం.అంతేనా?వారానికి రెండు ఆఫ్‌లు ఇస్తాం.బైక్‌  ఉన్నవారికి కారు ఇస్తాం. కారు ఉన్నవారికి అంత కంటే ఖరీదైన కారు ఇస్తాం.అంతేనా? ప్రమోషన్‌ కూడా ఇస్తాం. మీ టాలెంట్‌ను చాటుకునే అపూర్వ అవకాశం ఇది’’   చప్పట్ల మోతతో హాలు అదిరిపోయింది.

 ‘గిఫ్ట్‌ ప్యాకేజీ’  దెబ్బతో ఎన్నడూ పాడని వాళ్లు, ఎప్పుడూ పాడే వాళ్లు, పాట అదేపనిగా వినేవాళ్లు, పాట వినగానే అందనంత దూరం పారిపోయేవాళ్లు...వీరు వారు అనే తేడా లేకుండా  ‘పాట’ ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ఎలాగైనా ‘వరాల మూట’ను చేజిక్కించుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నారు.పొద్దున్న ఏ తొమ్మిదింటికో, పదింటికో నిద్ర లేచే కుటుంబరావు... తెల్లవారుజామున మూడుగంటలకే లేచి గాత్రశుద్ధి కోసం ‘సా...రీ....రీ....గ...’ అని  సంగీతసాధన మొదలుపెడుతున్నాడు. ఈ దెబ్బతో ఇంట్లోని వాళ్లకి నిద్ర లేకుండా పోయింది.పుసుక్కున పాటల పోటీలో విజేతగా నిలబడితే తమ దశ మారిపోతుందనే ఏకైక ఆశతో, ఆశయంతో వాళ్లు సర్దుకుపోతున్నారు.మరి ఇరిగింటోళ్లు, పొరుగింటోళ్ల సంగతి?వాళ్లెందుకు సైలెన్స్‌గా ఉంటారు? తమ విలువైన నిద్రను ఎందుకు త్యాగం చేస్తారు? అదిగో పొద్దున్నే ఎవరో కుటుంబరావు  ఇంటి తలుపును దబాదబా బాదుతున్నారు....‘‘ఎవరండీ మీరు?’’ తలుపు తీసి అడిగింది కుటుంబరావు భార్య.‘‘రీ...రీ...గ...గ...సా...సా ఇంట్లో ఉన్నాడా?’’ ఆరా తీశాడు తలుపులు బాదిన  వ్యక్తి.‘‘ఆయన ఎవరు?’’ ఆశ్చర్యం, విసుగును చూపుల మిక్సీలో వేసి కలిపి అడిగింది కుభా (కుటుంబరావు భార్య)‘‘అదేనమ్మా...రీ...రీ....గ...గ అంటూ మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు  కదా... ఆ పెద్దమనిషి ఎక్కడ ఉన్నాడు?’’ అడిగాడు ఆయన.‘‘ఎందుకు?’’ అంటూ కాస్త ఆశ్చర్యంగా, కాస్త భయంగా  అడిగింది  కుభా.‘‘అంత గొప్ప గాత్రాన్ని ఎన్నడూ విన్న పాపాన పోలేదు. ఆయన్ను చూసి తరించిపోవాలనుంది. అమ్మా... ఒక్కసారి ఆయన్ని పిలుస్తారా’’ అని రిక్వెస్ట్‌గా   అడిగాడు ఆయన.‘‘కుటూ... నీ కోసం ఇరుగింటి పొరుగింటి ఫ్యాన్స్‌ వచ్చారు...’’ అని కేకేసింది కుభా.అప్పుడే బాత్‌రూమ్‌లో నుంచి బయటికి వచ్చిన కుటుంబరావు....‘రీ...రీ...సా...గ...గా’ అని పాడుతూనే ‘ఏం కావాలి మీకు?’ అన్నట్లు  సైగ చేశాడు.ప్రపంచంలోని మేలురకం తిట్లను తెలుగులోకి తర్జుమా చేసి మరీ తిట్టారు పొరుగువాళ్లు. ‘ఇంకోసారి...సా...రీ... అని పాడావంటే....ఏ  గొంతుతో అయితే పాడుతున్నావో  ఆ గొంతు నొక్కేస్తాం’ అని గట్టి వార్నింగ్‌ కూడా ఇచ్చారు.ఇది కూకట్‌పల్లిలో ఉండే కుటుంబరావు  పరిస్థితే కాదు, çసూరారంలో  ఉండే సుబ్బారావు పరిస్థితి, చింతల్‌బస్తీలో ఉండే శ్రీనివాస్‌ పరిస్థితి.... దాదాపుగా అందరి ఉద్యోగుల పరిస్థితి! గిఫ్ట్‌ప్యాకేజా మజాకా!

ఆరోజు ‘మిరాకిల్స్‌’ సంస్థ ప్రాంగణంలో పాటల పోటీ మొదలైంది...‘‘ఇప్పుడు నేను పాడబోయే పాట...‘ప్రేమాభిషేకం’ సినిమాలోనిది’’ అంటూ మొదలుపెట్టాడు కుటుంబరావు.‘ఆగదూ... ఆగదు.... ఆగితే సాగదు..’ అని మొదలుపెట్టాడో లేదో అతని ముఖంలో రంగులు మారాయి. ‘సభకు సారీ’ అంటూ స్టేజీ దిగి వేగంగా వెళ్లిపోయాడు కుటుంబరావు.ప్రేక్షకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.ఆ తరువాత సుబ్బారావు...‘రామ్మా చిలకమ్మ...ప్రేమా మొలకమ్మా...’ అని గొంతు సవరించాడు. గొంతు ఇంకాస్త పెంచగానే అతని కళ్లలో తేడా కనిపించింది.  ‘సభకు సారీ’ అంటూ స్టేజీ దిగి వేగంగా పరుగులు తీశాడు.ఆ తరువాత...గుర్నాథం గొంతు విప్పాడు...‘రాను రానంటూనే చిన్నదో...చిన్నదో’ అంటూ చిన్నగా  మొదలైన అతని గొంతు పెద్దదైంది. ఆ తరువాత అతని బాడీలాంగ్వేజ్‌ మొత్తం మారిపోయింది. మెలికలు తిరగడం మొదలైంది. ‘సారీ’ కూడా చెప్పకుండానే స్టేజీ దిగి పరుగు అందుకున్నాడు.‘‘ఇదేంటి పల్లవి కూడా పూర్తి కాకుండానే  అందరూ ఇలా పరుగులు తీస్తున్నారు?’’ ‘మిరాకిల్స్‌’ యజమాని యుగంధర్‌ని  ఆశ్చర్యంగా అడిగాడు పక్కనే కూర్చున్న అతని ఫ్రెండ్‌.‘‘ఆ పొరపాటు నా దగ్గరే జరిగింది. మా  ఆవిడ మిత్రమండలి సభ్యురాలనే విషయం నీకు తెలుసుకదా. వచ్చే వారం వాళ్ల సంస్థ వార్షికోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా తీపి వంటకాల పోటీ పెట్టారు. మా  ఆవిడ ‘రన్‌ రాజా రన్‌’ పేరుతో ఒక కొత్త  స్వీటు  తయారుచేసింది. మీ వాళ్లకు టేస్ట్‌ చూపించి ఒపీనియన్‌ కనుక్కో అని ‘రన్‌ రాజా రన్‌’ ప్యాకెట్లు నా చేతికి ఇచ్చింది.‘ మీరు మరింత తీయగా పాడాలి. మా ఆవిడ చేసిన ఈ స్వీటు తినండి’ అని ఆ స్వీట్లను గాయకులందరికీ ఇచ్చాను. ఆ ఎఫెక్ట్‌ ఇలా ఉంటుందనుకోలేదు. స్టేజీ దిగిపారిపోయినవారంతా  ఆ వాష్‌రూమ్‌ల దగ్గర నేను ముందంటే నేను ముందు అని కాలర్లు పట్టుకుంటున్నారు...అటు చూడు’’ అని వాపోయాడు యుగంధర్‌.
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా