స్మాల్‌బాస్‌ షో... విన్నర్‌ ఎవరు?

30 Sep, 2018 00:42 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

కాకులు దూరని కారడవి... చీమలు దూరని చిట్టడవి అది.ఆ అడవి మధ్యలో ఒక కొండపై అందమైన ఇల్లు ఒకటి నిర్మించారు. ఈ ఇంట్లో  ఎవరు ఉన్నారో  తెలుసా? పలు రంగాల ప్రముఖులతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంపు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్నారు.వీళ్లకు అక్కడేం పని?‘స్మాల్‌బాస్‌’ అనే టీవీ షోలో భాగంగా  ఒక నెలరోజుల పాటు వాళ్లు  ఈ ఇంట్లో ఉన్నారు. బట్టలు ఉతుక్కోవడం నుంచి వంట చేసుకోవడం  వరకు తమ పనులు తామే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం ‘స్మాల్‌బాస్‌’ ఒక టాస్క్‌ ఇస్తాడు. ఆ టాస్క్‌లో విఫలమైన వారు  ఎలిమినేట్‌ అవుతారు.పేషెన్సీ లెవల్‌ను పరీక్షించడానికి, మనిషిలోని ఒరిజినల్‌ క్యారెక్టర్‌ను బయటికి తీసుకురావడానికి ఉద్దేశించిన టీవీ షో ఇది. అన్ని సవాళ్లను  తట్టుకొని చివరి వరకు ఎవరు నిలుస్తారో వారే విజేత.‘డూప్లికేట్‌ క్యారెక్టర్, ఒరిజినల్‌ క్యారెక్టర్‌ అని రెండు వేరుగా ఉండవు. నాది  ఎప్పుడూ ఒకే క్యారెక్టర్‌...అది ఒరిజినల్‌ క్యారెక్టర్‌. కాబట్టి నేనే విజేత’ అని ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

మొదటి వారం టాస్క్‌:‘తన కోపమే తన శత్రువు’ఈ టాస్క్‌లో భాగంగా ఒకరినొకరు రెచ్చగొట్టుకోవాలి. అయినా సరే ఎవరు టెంప్ట్‌ కావద్దు. కోపం తెచ్చుకోవద్దు. ఒకవేళ  తెచ్చుకుంటే షో నుంచి ఎలిమినేట్‌ అవుతారు.ఆరోజు...‘‘ఎక్స్‌క్యూజ్‌మీ...’’ అంటూ  ట్రంపు దగ్గరకి వచ్చాడు నార్త్‌ కొరియా అధ్యక్షుడు  కిమ్‌ జోంగ్‌.‘‘ఏమిటి మిత్రమా!’’ కిమ్‌ను ప్రేమగా పలకరించాడు ట్రంప్‌.‘‘ఒకసారి మీ చెంప చూపిస్తారా’’ ఆప్యాయంగా  అడిగాడు కిమ్‌.‘‘ఇదిగో ఇదే నా చెంప’’ అని చూపించాడు ట్రంప్‌.చుక్కలు కనిపించేలా చెంప మీద ఒక్కటిచ్చుకున్నాడు కిమ్‌.ట్రంప్‌కు కోపం రాలేదు సరికదా...చిరునవ్వుతో అన్నాడు...‘‘మిత్రమా కుడిచెంప మాత్రమే వాయించావు. ఎడమ చెంప ఏ పాపం చేసింది?’’ఎడమ చెంప మీద కూడా గట్టిగా ఒక్కటి ఇచ్చాడు కిమ్‌.ఈసారి కూడా కోపం తెచ్చుకోలేదు.  ‘థ్యాంక్స్‌ గురూ’ అంటూ కిమ్‌ కళ్లలోకి కృతజ్ఞతపూర్వకంగా చూశాడు ట్రంప్‌.కొద్దిసేపటి తరువాత...‘‘ఏమిటి ట్రంపుగారు ఇలా వచ్చారు?’’ అడిగాడు కిమ్‌.‘‘ఎప్పుడూ మీ రూమ్‌లోనే ఉంటారా. ఈరోజు నా రూమ్‌కి రావాలి...నా సీట్లో ఆసీనులు కావాలి. ఇంతకుమించి ఈ జన్మకు సార్థకత లేదు’’  మెలికలు తిరుగుతూ  అడిగాడు  ట్రంప్‌.‘‘అదెంత పని. ఇప్పుడే వస్తాను’’ అంటూ పరుగులాంటి నడకతో ట్రంప్‌ రూమ్‌లోకి వచ్చి ఆయన సీట్లో కూర్చున్నాడు కిమ్‌.అంతే...‘ఢాం...’ అని పే....ద్ద సౌండ్‌.కిమ్‌ ప్యాంట్‌ చీలికలు పేలికలైంది. ముఖం నల్లబారింది.‘‘ముందస్తు ఎన్నికలలాగా.... ముందస్తు దీపావళి అన్నమాట...నీ సీటు కింద లక్ష్మీబాంబులు రెండు పెట్టాను. హ్యాపీ దివాలీ’’ అన్నాడు ట్రంప్‌.అయినా సరే కిమ్‌కు కొద్దిగా కూడా కోపం రాలేదు.‘‘థ్యాంక్స్‌ అన్నయ్య. బాంబు చల్లగా ఉంది’’ అని ట్రంప్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నాడు.ఇలా హౌజ్‌మెట్‌లు ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు. ఎవరూ కూడా టెంప్ట్‌ కాలేదు. కొద్దిగా కూడా కోపం తెచ్చుకోలేదు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఓటింగ్‌ పెట్టారు.‘ఆహా ఓహో’ కేటగిరీలో అందరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. ఎలిమినేట్‌’ కేటగిరీలో మాత్రం జీరో! అంటే ‘ఫలానా వ్యక్తిని ఎలిమినేట్‌ చేయాలి’ అని ప్రేక్షకులు ఎవరినీ కోరడంలేదన్నమాట. ప్రేక్షకులకు అందరూ పిచ్చపిచ్చగా నచ్చేశారు.

రెండో వారం టాస్క్‌:‘ఆవు పేడ తెచ్చి హౌజ్‌ అలకాలి’ఈ పని  ఎవరైనా  చేయకపోతే ఎలిమినేట్‌ అవుతారు.ఆరోజు...తెల్లవారుజామున నాలుగు తరువాత హౌజ్‌లో ఒక్కరూ లేరు. ఆ అడవిలో తలోదిక్కు వెళ్లారు. ఆరుగంటలకల్లా అందరూ పేడతట్టలతో వచ్చారు. తాము తెచ్చిన పేడతో హౌజ్‌ను అలికారు.‘ఈసారి కూడా ఎవరూ ఎలిమినేట్‌ కాలేదే!’ తలపట్టుకున్నాడు స్మాల్‌బాస్‌.ప్రేక్షకుల ఎలిమినేట్‌ లిస్ట్‌లో కూడా ఎవరూ లేరు.మూడో వారం కూడా కఠినమైన టాస్క్‌ ఇచ్చారు. అయినప్పటికీ అందరూ విన్‌ అయ్యారు.ఇక చివరి వారం మిగిలింది.‘‘ఫైనల్లో అందరూ విన్‌ అయ్యారా? ఎవరైనా ఎలిమినేట్‌ అయ్యారా? గత ఎపిసోడ్‌లను బట్టి  చూస్తే మళ్లీ అందరూ విన్‌ అవుతారని నాకు బలంగా అనిపిస్తుంది. ఒకవేళ అలాగే జరిగితే షో ఫ్లాప్‌ అయినట్లే కదా! దీనికి నీ సమాధానం ఏమిటి?’’ భేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు.‘‘పిచ్చిభేతాళా! అందరూ విజేతలు కావడం కాదు...అందరూ హౌజ్‌ నుంచి పారిపోయారు’’ అంటూ అసలు విషయం  చెప్పాడు విక్రమార్కుడు.‘‘అదేమిటి? అసలేం జరిగింది?’’ ఆత్రుతగా అడిగాడు భేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:

‘‘చివరి వారం...చావో రేవో అనే టాస్క్‌ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా హౌజ్‌మెట్‌లు ఒక కొత్తవంటకాన్ని కనిపెట్టాలి. ఆ వంటకాన్ని తయారుచేసి ఎవరికో ఒకరికి తప్పనిసరిగా తినిపించాలి. అందరూ ఉత్సాహంగా కొత్త కొత్త వంటలు తయారుచేశారు. కాని తినేవారు  ఏరీ? నువ్వు తిను అంటే... కాదు నువ్వు తిను. ఇదే గొడవ. ఈ గొడవలో భాగంగా ఒకరినొకరు చావబాదుకున్నారు. ఇది స్మాల్‌బాస్‌ నియమాలకు విరుద్ధం. ఎవరూ పోట్లాడుకోవద్దు...అని గట్టిగా అరిచాడు స్మాల్‌బాస్‌. ఆతరువాత  ‘ఇప్పుడు నేను మీకో కొత్త టాస్క్‌ ఇస్తున్నాను. చాలా సింపుల్‌. మీరు తయారు చేసిన వంటకాన్ని మీరే తింటే చాలు’ అని ప్రకటించాడు. అంతే...ప్రాణభయంతో ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు. హౌజ్‌లో ఒక్కరు ఉంటే ఒట్టు!’’
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా