హాహా హూహూ

14 Oct, 2018 00:16 IST|Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

‘‘మిత్రమా నీకో బ్రేకింగ్‌ న్యూస్‌ చెబుతాను’’ అంటూ ఇలా మొదలు పెట్టాడు భేతాళుడు...ఒకరోజున ఉదయం లండన్‌లో ట్రెఫాల్గర్‌ స్క్వేర్‌ వద్ద జనం గుంపులు గుంపులుగా మూగియున్నారు. వారొక విచిత్రమైన జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారినన్ని విధాల ఆకర్షిస్తుంది. ఆ జంతువు దేహప్రమాణం చాలా పెద్దది. చచ్చిపోయినదో, మూర్ఛలో ఉన్నదో  తెలియదు. ఇది జంతువా? మనుష్యుడో తెలియదు... ‘‘బ్రేకింగ్‌ న్యూస్‌ చెబుతానంటూ విశ్వనాథ వారి హాహా హూహూ నవల స్టార్టింగ్‌ పార్ట్‌  చెబుతున్నావేమిటయ్యా బాబూ’’ అని విసుక్కుంటూ ఆ భుజం మీద ఉన్న శవాన్ని ఈ భుజం వైపుకి మార్చుకున్నాడు విక్రమార్కుడు. ‘‘పుస్తకంలో రాసినది బయట జరగకూడదని ఎక్కడైనా ఉన్నదా?’’ అంటూ మళ్లీ మొదలుపెట్టాడు భేతాళుడు.... మెడవరకు మనిషి...తల మాత్రం నక్క తల. చేతి పదివేళ్లకూ పది రత్నపుటుంగరాలు ఉన్నాయి. భుజాల మీద భుజకీర్తులున్నాయి. శిరస్సున మెరిసే కిరీటం ఉన్నది. ఇది జంతువా? మనిషా? తెలియడం లేదు. ట్రాఫిక్‌ జామ్‌ అయినది. ఆఫీసులకు వెళ్లే వారు ఆఫీసుమానుకుని అక్కడే నిల్చొని చూస్తున్నారు. ఫంక్షన్‌లకు వెళ్లే వాళ్లు ఫంక్షన్‌లు మానుకొని అక్కడే నిల్చొని చూస్తున్నారు. కడుపు చెదిరి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసే వాళ్లు...ఆ పరుగాపి, తాము ఎందుకు పరుగెడుతున్నది కూడా మరిచి నిమ్మకు నీరెత్తినట్లు అక్కడ నిలబడి ఆ విచిత్ర జంతువును చూస్తున్నారు.

‘ఇది జంతువు అయినా దీనికి బట్టలెక్కడి నుంచి వచ్చినవి? నగలెక్కడివి?’ అని ఒకరు అన్నారు.‘ఎందుకైనా మంచిది’ అనే కాన్సెప్ట్‌లో భాగంగా  ఆ జంతువు చుట్టూ ముళ్ల కంచె నిర్మించారు.విషయం తెలిసి ప్రపంచ ప్రసిద్ధ జంతుశాస్త్రవేత్తలందరూ ఈ కంచె దగ్గరకు పరుగెత్తుకొచ్చారు. తాళపత్ర గ్రంథాల నుంచి డిజిటల్‌ గ్రం«థాల వరకు ఒకటే తిరిగేస్తున్నారు. ఏవో రాసుకుంటున్నారు. తమలో తామేమాట్లాడుకుంటున్నారు. చేతివేళ్లతో తలను సాలోచనగా కొట్టుకుంటున్నారు.‘‘ఎన్ని రోజులని ఇలా రోడ్డు మీద వదిలేస్తారు? జూకో పోలీస్‌స్టేషన్‌కో తరలించండి’’ అన్నాడు ఒక పెద్దమనిషి.‘‘అది మనిషి అయితే పోలిస్టేషన్‌కు తరలించవచ్చు. జంతువును ఎలా తరలిస్తామండీ’’ జారుతున్న ప్యాంట్‌ సర్దుకుంటూ పాయింట్‌ లేవదీశాడు పోలీసాయన.‘‘నేను మనిషిని కాదు జంతువును అని అదేమైనా మీ చెవిలో చెప్పిందా? జంతువని మీరెలా డిసైడ్‌ చేస్తారు? జూకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ఉన్న జంతువులకే దిక్కులేదు. ఇదొకటా మా ప్రాణానికి!’’ అని శాంతస్వరంతో అరిచాడు జూఆయన.ఒకరినొకరు భీకరంగా తిట్టుకున్న తరువాత  కేసు కోర్టుకెక్కింది. ఆరోజు కోర్టులో...‘‘నా కెరీర్‌లో ఎన్నో జటిలమైన కేసులు చూశానుగాని  ఇంత జటిలమైన కేసును ఎప్పుడూ చూడలేదు...అని నేనంటాననిమీరు అనుకుంటున్నారేమో...’’ కళ్లద్దాలను పైకి సవరిస్తూ అన్నాడు ఫేమస్‌ జడ్జి ఆండ్రూ లాంగ్‌మోర్‌.‘‘మేమేమీ అనుకోవడం లేదండి. ఉత్తపుణ్యానికి మీరే అనుకుంటున్నారు’’ అని పళ్లికిలించాడు కొత్త న్యాయవాది.‘షటప్‌’ అని ఆ న్యాయవాదిపై కళ్లెర్ర చేసి టేబుల్‌పై సుత్తితో  రెండు సార్లు బాది ఇలా అన్నాడు జడ్జి...‘‘జడ్జి అంటే సినిమాల్లో చూపినట్లు, తగిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట... అని డైలాగు చెప్పేవాడు మాత్రమే కాదు.... క్లూ అందించే వాడు... సమస్యను పరిష్కరించేవాడు కూడా. ఆ విచిత్ర జంతువు లేదా విచిత్ర మనిషిని జూకు తరలించాలా? పోలీస్‌స్టేషన్‌కు తరిలించాలా? అనే తీర్పు ఇచ్చేముందు అసలు అదేమిటో తెలుసుకోవాలి. దీనికి జుట్టు పీక్కోనక్కర్లేదు. సింపుల్‌...ఆ విచిత్రజీవికి ఒకవైపు చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, చేపల పులుసు,రొయ్యల ఫ్రై మరోవైపు పచ్చగడ్డి, చొప్ప, చెట్ల ఆకులు, జొన్నలు పెట్టండి. ఆకలితో ఉన్న ఈ జీవి ఏది ముడుతుందో చూసి అప్పుడు తీర్పు చెబుతాను’’ అన్నాడు జడ్జి.

జడ్జిగారి తెలివికి ముచ్చటపడుతూ ఆయన చెప్పినట్లే చేశారు. ‘‘ఏది ముడతాడు?’’ అనే ఆసక్తి ఆకాశాన్ని అంటింది. ఆ విచిత్రజీవి మాత్రం అటు నాన్‌వెజ్‌ ఐటమ్‌లు ఇటు గడ్డిగాదం ఐటమ్స్‌ సుష్ఠుగా లాగించేసి బ్రే...వ్‌ అన్నాడు!! సమస్య మళ్లీ  మొదటికొచ్చింది.దీంతో ఇంగ్లండ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రకటన విడుదల చేసింది...‘మా దేశంలో ఒక విచిత్రమైన జీవి కనిపించింది. ఇది మనిషా, జంతువా? అని చెప్పిన వాళ్లకు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ బహుమతిగా ఇవ్వబడుతుంది’‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అని...అమెరికా నుంచి ‘నాసా’ వాళ్లు, చైనా నుంచి సీయన్‌యస్‌ఏ శాస్త్రవేత్తలు,రష్యా నుంచి జూనియర్‌లు మొదలు సీనియర్‌ శాస్త్రవేత్తల వరకు వచ్చారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు వెనక్కి వెళ్లిపోయారు. ప్రపంచం నలుమూలాల నుంచి ‘నేను పక్షి శాస్త్రవేత్తను’ ‘నేను జంతు శాస్త్రవేత్తను’ అనో ఇంకేదో అనో ఎవరో ఒకరు లండన్‌కు వస్తూనే ఉన్నారు. ఏదీ తేల్చకుండా జుట్టు పీక్కుంటూ వచ్చిన దారినే వెనక్కి వెళుతూనే ఉన్నారు. ఈలోపు ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ చార్లెస్‌కు ఒక డౌటు వచ్చింది.‘‘పెద్ద దేశం అమెరికా నుంచి చిన్న దేశం మాల్టా వరకు రోజూ ఎవరో ఒకరొస్తూనే ఉన్నారు. ఇండియాలాంటి పెద్ద దేశం నుంచి ఎవరూ రాకపోవడం విచిత్రంగా  ఉంది’’ అని చార్లెస్‌ అంటున్నాడో లేదో...‘‘ఎక్స్‌క్యూజ్‌మీ సార్‌... ఐయామ్‌ ఫ్రమ్‌ ఇండియా’’ అని ఒక గొంతు వినిపించింది.‘‘మీరేం చేస్తుంటారు?’’ జుట్టు సవరించుకుంటూ  అడిగింది బ్రిటన్‌ ప్రధాని.‘‘నేను ఆర్‌బీఐ గవర్నర్‌గా  పనిచేస్తుంటాను’’ అన్నాడు ఆ వ్యక్తి.‘‘ఇది మనిషా జంతువా? అనేది పెద్ద పెద్ద  సైంటిస్టులే చెప్పలేకపోతున్నారు. ఎకనామిక్స్‌ తప్పా ఏమీ తెలియని మీరెలా చెప్పగలరు?’’ అడిగాడు లండన్‌ మాజీ మేయర్‌ బోరిస్‌ జాన్‌సన్‌.‘‘ఈ జీవి గురించి చెప్పడానికి సైన్స్‌ తెలియనక్కర్లేదు. ఆర్‌బీఐ గవర్నర్‌ అయితే చాలు’’ అన్నాడు ఆయన చిన్నగా నవ్వుతూ.‘‘భలే చిత్రంగా మాట్లాడుతున్నావే...ఇంతకీ ఈ జీవి మనిషా? జంతువా?’’ అడిగాడు చార్లెస్‌.‘‘ఏదీ కాదు’’ అన్నాడు ఆయన నిమ్మళంగా.‘‘మరేమిటి?’’ అని కళ్లు పెద్దవి చేస్తూ అడిగారు అక్కడున్నవాళ్లు.‘‘ఈ జీవి పేరు విజయ్‌మాల్యా’’ అసలు విషయం చెప్పాడు  ఆర్‌బీఐ గవర్నర్‌.
– యాకుబ్‌ పాషా 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా