మునిగోడు

6 May, 2018 00:15 IST|Sakshi

కొత్త కథలోళ్లు

‘‘మ్మే బుజ్జి! నామాట ఇనుమే అట్టా మూలగుచ్చోని ముంగాళ్ళపై ముఖం పెట్టుకోని  ఏడవబాకమే! ఏడిస్తే పైకిబొయ్యిన నేను తిరిగొస్తానా...! ఐనా ఆ రోజు కైపులో నీ చేతిలో వుండే పురుగులమొందు డబ్బాని గబక్కని లాక్కుని ఒక్క చుక్క మిగల్చకుండా మందు తాగినట్టు తాగేద్దునా మనకీ ఇద్దురు లేందర బిడ్డలుండారే అని ఒక్కసారిగూడా ఆలోచించకుండా అట్టా నాపని నేను ముగించుకోని పోయినట్టు ఎళ్ళిపోతే! పెద్దోళ్ళు అనింది నిజిమే మే! నేను నిన్ను బతికీ ఏపించినా, చచ్చినాకా ఏపించుకు తింటండా!’’దివసాలు కూడా ఐపోనాయ్‌. మాయత్తమామలు గూడా వాళ్ళూరికి ఎళ్ళిపోయినారు. బిడ్డలిద్దరూ నిద్దరపోతాండారు. ఇదేమో నోట్లో ముద్దపెట్టకుండా అట్టా గొమ్మోని ఆలోచిస్తా వుండాది. నాకు బిత్తరగా వుండాది ఇది ఎవురూ లేందిజూసి ఏం అగాయిత్తెం చేసుకుంటుందోనని.ఏరే కాపరం పెట్టకుండా ఉన్నుంటే లోకాని కెరిసైనా తోడికోడలు నిన్ను తినమనుండేది. నేను తాగితాగి ఊర్లో గొడవలంతా ఇంట్లోకి తెస్తంటే నాకు దిగవీదిలో ఇల్లిచ్చి నన్ను నా పెళ్ళాంబిడ్డల్ని మరేదగా తరిమేసినారు. నాయిన ఎపుడో కాలంచేసినా అమ్మని మాయన్నే దెగ్గిరే పెట్టుకోనుండాడు. మాయన్న దేముడంటోడు. మాకుండేది అయిదుగుంటల పొలం. నేను, బుజ్జి, మాయన్న ముగ్గురం కోడి కూయకముందే ఎళ్లినామంటే, పొద్దుగూకే దాకా మడికాడ్నే. మా వదిన మాపటేళ సంగటిముద్దలు ఎత్తుకోని వచ్చును. మాయమ్మ ఇంటిని, పిలకాయల్ని కాపెట్టుకోనుండును. అట్టా ఆరుగాలం కష్టపడి మేము మా మడికి పక్కనుండే నాగన్న అయిదుగుంటలు అమ్మతానంటే అడిగిన ధర ఇచ్చి కొనుక్కోని ఎకరా రైతులం అనిపించుకున్నేము.

అబ్బ, ఆరోజులు తలుసుకుంటే ఎట్టుండేది మునిగోడంటే చెర్లోపల్లి చుట్టుపక్కల ఊళ్ళలోనే గాదు కాళాసి మండలంలోనే పేరెత్తినానే. మా సొంత పనైపోయిందంటే ఇంకచూడు మా ఊళ్ళో నాకు ఎంత గిరాకీ, పనిలో నేనుండానంటే మిగతా వోళ్ళు  కూడా ఉసారుగా ఎగిరిగంతేస్తా పనిచేద్దురు. చూస్తావుండగానే నాకూతుర్ని బడిలో ఏసేసాం. ఎవసాయం పనులు ముందులాగాలేదు. జోరుతగ్గింది. ఈస్పురుడి జుట్టు పెరిగినట్టు కాళాస్తి నుంచి తిరపతికొచ్చే రోడ్డు పెరగడం మల్లింది.ఒకరోజు పనేం లేకపోతే ఊరుబయట సర్కారురోడ్డు పక్కనుండే రచ్చబండకాడ నేను ధర్మయ్యతో దాయాలాడతావుండా. టింగ్‌టింగ్‌ అని సైకిల్‌ బెల్‌ మోగితే తలెత్తి చూసినా. రంగడు.వోడు నన్ను చూసి ‘‘ఏరా! మునిగా పనేంలేదా, ఏం లేదురా! పానగల్‌ దగ్గర ఈ రోజు ఒక బిల్డింగ్‌ స్లాబు అక్కడి కెళతుండా! అవున్రా నీకు పొలం పనులు లేకపోతే నాతోరా మీ కూలీలకంటే మా కూలీడబ్బు ఎక్కువ కూడా’’ అన్నేడు.‘‘వద్దులేరా! ఆ పనులు నాకు అలవాటు లేదు.’’ అన్నేను. ‘‘అదేం పెద్ద బెమ్మవిద్దేంగాదు. 

ఒకరోజు నువురా మాకంటే నువ్వే బాగాచేస్తావు. ఖాలీగా ఉండేబదులు రోజూ డబ్బులేరా! మా మేస్రి దగ్గర ఎంతమందికైనా పనుంటుంది. అందులో స్లాబుకి గుల్ల, ఇసుక, సిమెంటు మిల్లర్‌లో పోయడమే మనపని అదే కలిపి తోసేస్తుంది. ఆ కాంక్రీటును చౌకుకొయ్యలతో ముందు మెట్లుకట్టుకుని తట్టలకెత్తి చేతుల్తో పైకి అందించేయడమేరా!’’ అన్నేడు.ఖాళీగా ఉండేబదులు ఈడితో పనికిపోతే నాలుగు రూపాయలు ఎనకేసుకోవచ్చు, సేద్దేలు అంతంతమాత్రమే అయిపోయుండాయి అనుకోని నిక్కరజేబులోంచి సెల్లు తీసి బుజ్జికి చెప్పినాను. అట్టా మొదులైంది రంగడితో టౌనులో పని. సాయంత్రానికి స్లాబు ఐపోయింది. మద్దేనం చికిన్‌ బిరియాని. ఒక కోటర్‌ చీపులిక్కరు. నాకు ఆ అలవాటు లేదు కాబట్టి రంగడికే ఇచ్చేసినా.ఎవసాయంలో రోజుకూలీ కంటే రెండింతలు గిట్టింది. ఆరోజు ఇంట్లో అందరికీ  బోండాలు కట్టకపోయి ఇచ్చినాను. పిల్లలు ఎగిరిగంతేసి బోండాలు తిన్నారు. ఇంక రోజు నుంచి తిరిగి ఎనక్కి చూసిందే లేదు. ఎవసాయాన్ని నమ్ముకున్నన్నిరోజులు అరాకొరగా కట్టి లీడర్ల దగ్గర తిట్టించుకునే వోళ్ళు. అట్టా కొన్నాళ్ళకే మాయన్నగూడా నా కూలీ రూకలకి లొంగిపొయ్‌నాడు. 

ఒకరోజు పెద్దబిల్డింగుకి స్లాబేసినాము. ఆ రోజు రంగడు నాదగ్గిర బలంతంగా ఈ ఒక్కసారే అని ఇది చీపుకాదని మంచి మందని, వొళ్ళు నొప్పులు తగ్గిపోతాయని తాగిపిచ్చేసినాడు. ఆ రోజు ఇంట్లో బుజ్జికి తెలిసి నాపైన రచ్చేసుకు నేసింది. రేతిరన్నం తిన్నాక దిగవీదిలో వుండే ఇంటికాడ నేను, బుజ్జి, పిలకాయలు పడుకుంటాం కాబట్టి ఇంట్లోళ్ళకి తెలవకుండా దాచిపెట్టింది. బుజ్జితో ఆర్దరేత్రిదాక గొనుక్కోడం వల్నో, లేకపోతే మూడంతస్తుల స్లాబుకి కాంక్రీటు మొయ్యడం వల్నో  రంగడు చెప్పినట్టు రాత్రి నిజంగానే పడుకునిందొకటి తెలుసు. మెలకవొచ్చేటప్పుటికే పొద్దు బారడెక్కుండాది. కోపంతో బుజ్జి లేపలేదు. గబగబాలేచి పది నిమిసాల్లో పనిలోకెళ్ళిపొయ్యినా. ఎందుకంటే ఎగువీధిలో వుండే అమ్మకి అన్నకి ముఖం చూపియ్యలేక ఒకటి, ఇంట్లో వుంటే బుజ్జితో ఏంగొడవ వస్తందో అనే భయం ఇంకొకటి. అట్టా బుజ్జి నేను మాటాడుకోడానికి నాలుగైదు దినాలు పట్టింది.  అయితే తిరిగి ఆదోరం  సిమెంటు రోడ్డు మూలకంగా ఇంకో గండం వొచ్చిపడింది. రంగడు ఇంటికొచ్చి పట్టుబట్టి నన్ను తీసుకెళ్నాడు. పనైతే మద్దేనం మూడుకంతా ఐపోయింది ఆడోళ్లంతా ఇండ్లకెళ్ళినారు. మాకు మద్దేనం చెయ్యించిన చికెన్‌పులుసు ముక్కలు చిన్నదబరాకి మిగిలి పోయుండాయి. దాంతో మొగోళ్ళంతా రోడ్డేసిన ఈది చివర్లో చెట్లచాటుగా కూర్చున్నారు. పెద్దమేస్రి ఇనాంగా ఇచ్చిన డబ్బుతో ఒకడుపొయ్యి మందు బాటిళ్ళు తెచ్చినాడు. అందురూ మొదులు పెట్టినారు. రంగడు నాకు ఒక గ్లాసులో పోసాడు.

నేను అందుకు ‘‘వద్దురా! మీరు కానిచ్చేయండి. నేను మీ అందరికీ చికెన్‌ పెడతావుంటా!’’ అన్నేను. ‘‘రే ముని! ఇంతమందిలో ఇదేం పద్దతిరా! అదెంతాఎంత మూడౌన్సులు నీ బాడీకి ఒకమూలకిరాదు.’’ అని నన్ను మెల్లగా ముగ్గులోకి దింపినాడు. ఆరోజు నేను మూడు కాదు కోటరు దాటాను. అట్టా ఆరోజు ఇల్లు చేరేటప్పుడు నేను, రంగడు మాయన్న కంట్లో పడ్డాం. నేను తలొంచుకుని సైకిలు ఇస్పీడు పెంచినా. ఎట్టయినా మేం తాగినట్టయితే తెలిసి పోయింది. ఇలా నేను నాకు తెలవకుండానే తాగుడికి లొంగిపోయినాను. టౌనులో మండపం కాడా నిలబడి రంగడికూడా మేస్రి పనికి పోయేటప్పిటినుంచి ఎప్పుటికప్పుడు ఇంక తాగ్గూడదు. రేపిటినుంచి దానిజోలికే పోగూడదు అనుకోవడం. సాయంకాలానికి ఎవురోవొకరు లాక్కెళ్ళిపోవడం, లాస్టుకి ఎవురూ పిలవక పోయినా పొద్దుపోతాండాదంటే నరాలు లాగడం, నాలిక్కి మందు తగలకపోతే మెదుడు పనిచేయకుండా అయిపోయేటట్టుండాది. నా బతుకు ఇట్టా అయిపోబట్టే నా పెళ్ళాం నాతో ఏగేగి నన్ను మారుసుకోలేక కయ్యల్లో నాట్లుకి, కలుపుకీ, వరికోతలకీ ఇట్టా ఒకటనిగాదు కాలట్ట కుదురుగ్గా కూర్చోకుండా పిలకాయల్ని సాకతా నాతో రోజూ గొడవ పడతాండాది. అన్ని కష్టాలుపడ్నే ఓర్చుకునింది గానీ ఒకరింటికిబొయ్యి చెయ్యి జాపిందిగాదు. దాంతో బుజ్జి ఒకరోజు నన్ను నిలేసి పురుగులమందు డబ్బా చేతికి ఎత్తుకునింది. నేను బుజ్జిని కుయ్యోమొర్రో అని కాళ్ళు గట్రా పట్టుకోని రేపిటినుంచి తాగనంటే తాగనని గట్టిగా మాటిచ్చేసినా. ‘ఇట్టా ఎన్నిసార్లో... జెప్పి మరసట్రోజు తప్పతాగొచ్చి అడిగితే నడీదిలో గొడ్డుని బాదినట్టు బాదింది చాల్లే’ అని మొండికేసేసింది. అయినా నేనూ వదల్లేదు ఇంక తాగనులేమే! అని గెడ్డంపట్టి అడుక్కున్నా. చివరికి దానిమింద ఒట్టేయమని తప్పితే ఆనాటికి ఈ పురుగుల మందే నాకూడు అనింది. దాంతో సరేనని ఒట్టేసేసినాను.

ఆ మరుదినం పనికి పోలే. చెరువు గెడ్డన మద్దిమానుకాడ తలకింద టవలేసుకుని పడుకున్నే. ఈ మూడేండ్లకి నేనెట్టయిపొయ్యినానబ్బా!  తలుసుకుంటే నామింద నాకే రోతపుడతాండాది. ఇంక ఆరునూరైనా అగ్రారం చెరువైనా ఆ దరిద్రపు మందు జోలికి పోగూడదు. మూడోరోజు బైపాసు రోడ్డులో చిన్నదే పని. మొత్తంమీద ఇంతని ఒప్పుకున్నాం. నాలుగుగెంటల్లో ఐపోయింది. అందరికీ బాగానే గిట్టింది. నేను మెల్లిగా జారుకుందామని రంగడితో మామా! నా లెక్కజూసి ఇచ్చేయ్‌రా ఎళతా అన్నేను. ఇసయం చెప్పినాను. వోడు దొంగనాకొడుకు నన్ను డబ్బిచ్చి పంపించేకుండా నా ఇసయం అందరికీ  చెప్పి కీతాజేసి నన్ను రెచ్చగొట్నేడు. మాకూడా పనిజేసివోళ్ళు కోటరే తాగరా! మద్దేనం పెరుగన్నం తిను అంతే సాయంత్రానికి పూర్తిగా దిగిపోతాది అని నన్ను మళ్ళీ ముగ్గులోకి దించినారు. అట్టా కొత్తబాందీసాపులో కూర్చునిందే తెలుసు. దొంగనాకొడుకు రంగడు అందురూ ఎళ్ళి పోయినాక కాళాస్తిలోనే నాడబ్బంతా తాగితాగి వాడిడబ్బు బద్రంగా నిక్కరజేబిలో ఏసుకోని నన్ను ఊరుగెవినిలో వొదిలేసినాడు.నేను తూలతాతుమలతా ఇంట్లోకి బొయ్యినా.నావొల్లు నాకే తెలవలే, మాటలు పెగల్లేదు. ‘‘చీ నువు మారతావనుకోవడం నా తప్పు’’ అని అటికి పైనుండే పురుగుల మందు డబ్బాని అందుకుని బిరటా తీసి తాగేస్తావుంటే నా మీద నాకే రోతబుటి ్ట ఆడబ్బా గబక్కన పెరుక్కొని గుటగుటా తాగేసినాను. తాగినచనాల్లోనే గావుకేకలు పెడతా పైలోకంలోకెళ్ళిపొయ్యినా! అదయ్యా జరిగింది.

నిజంగా మాయన్న ఎంతోమంచోడు. కైపులో ఊళ్ళోళ్ళ చెప్పుడు మాటలిని ఆయన్ని ఈదిలోకి లాగి ఐదుగుంటలు కయ్య, దిగవీదిలో ఇల్లు పంచుకుందునా! పెద్దోడే! వోడిబాగానికి అరగుంటైనా తలబాగం ఇయ్యకపోగా ఎగవీదిలో ఇల్లుకన్నా దిగవీదిలో మేముండేది పెద్దిల్లు ఐనా మారుమాటాడకుండా రాసిచ్చేసినాడే మహానుభావుడు.నేను పురుగులమందు తాగి చచ్చిన నాలుగోరోజే నా అయిదుగుంట్ల పత్రాల్ని మాయత్తమామల్ని ఎదురుగా పెట్టుకోని ‘‘మా కుటుంబంలో వోడెంతో కష్టంజేసినాడు పాపానాయుడు పిలిచి చెప్తే నేనే పత్రాలు తీసిపెట్టుకున్నే డబ్బు మునిగోడికి నువ్విచ్చినట్టే ఇయ్యమని చెప్పినా, వోడు ఎప్పుడైనా మారతాడు ఈ కయ్య పత్రాలు అపుడిద్దామనుకున్నా’’ అని కన్నీళ్ళు పెట్టుకోని బుజ్జి చేతిలో పెట్నాడు. ఈ ఇసయం బతికుండగా నాకు తెలవలేదు. అవును ఇంతకీ అది అంత తినిందో లేదో చూస్తా అని అటెల్తే మాయమ్మ వచ్చి మాటాడాతాండాది. ‘‘ఏమ్మే! ఎంత ఏడ్చినా పొయ్యినోడు తిరిగొస్తాడా కన్నపేగు నేనే రాయిజేసుకోలే. తెల్లార్తో ఆడోళ్ళ సంగాలకి పెద్దమేడమూ వస్తాదంట. ఎట్ట పొయ్యినాడని అడిగితే పురుగులమొందు తాగి అని సెబ్బాక పైసాకూడా రాదంట. గుండిల్లో పట్టేసి అని సెప్పుమే రూకదండిగా వస్తాయంట. సంగంలో నీ అప్పులెగిరి పోతాయి. మీ తోడుకోడలడిగితే అబద్దం సెప్పను అన్నావంట. ఏమి వాళ్ళిండల్లో సొమ్ము మనకియ్యర్లే. గవర్మెంటోడి సొమ్మే సరేనా!’’ అని రేపిటికి జాగరత్తలు చెప్పింది. దానికి ఆయమ్మి అవుననీజెప్పలే, కాదనీజెప్పలే. మాయమ్మ మా ఇంట్లోనే బుజ్జికి తోడుగా పడుకునేసింది. రేత్రంతా నేను ఈస్పురుడికి మొక్కతానే ఉండా. తెల్లరగానే  పెద్దమేడమొచ్చింది. అందురు ఆడంగులూ నా గురించే అంగలారస్తాండారు. పెద్దమేడం నోరు ఇప్పింది – ‘‘ఏమ్మా నీ పేరేంటి!’’

‘‘బుజ్జి’’‘‘మీ ఆయన పేరు!’’‘‘మునిరాముడు’’‘‘ఊరంతా గుండాగి చనిపోయాడని అంటున్నారు. నిజమేనా!’’‘‘కాదుమేడం! నా మొగుడు పురుగుల మొందు తాగి సచ్చిపోయినాడు’’ బుజ్జి చెప్పిన మాటకి ఒక్కసారిగా అందరూ తెల్ల ముఖాలేసుకున్నారు. పెద్ద మేడం  సంగాలు రాసే హేమ మేడమును ఉరిమి చూసింది.  ఎంత పనిచేసావే కొంపముంచుకున్నేవు కదే! నా చావు డబ్బులతోనైనా అప్పులన్నీ ఎగిరిపోయుంటాయి గదే. పనికిమానినదాన అని తిట్టుకున్నేను. నీకు సకాయం చెయ్యబోయిన సంగాలర రాసే మేడమును ఇరికిచ్చేసినావుగదే. ఐనా ఈ ముండకేం పొయ్యేకాలం పొయ్యినోడ్ని నేనెట్టా పొయ్యినాను కదా! ఒక అబద్దమాడితే ఏమైపోతంది.గెంటాగి అందరూ ఎవురిపాటికి వోళ్ళు ఇద్దురు ముగ్గురుగా మాటాడతా ఇండ్లకెళ్ళి పోతావుండారు. ఆ పిల్ల తలరాత ఎట్టుంటే అట్ట అని ముఖాలు నల్లగా పెట్టుకోని అనుకుంటాండారు. ఇసయం అర్థంకాలే. పెద్దమేడం, చిన్నమేడం ఇద్దురూ బయలుదేరి సర్కారు రోడ్డెక్కి  బస్సుకోసం ఎదురుచూస్తావుండారు. నేను ఎనకాలే ఎళ్ళి వాళ్ళమాటలు ఇంటావుండా. ‘‘చూడు హేమలతా! మునిరాముడు బుజ్జిల కథనే ఒక మంచి రచయిత దగ్గర నాటకంగా రాయించాలి. సేద్దేన్నే నమ్ముకుని తాగుడికి బానిస కాని రోజుల్లో మునిరాముడి కుటుంబం ఎట్టుండేది. తాగుడికి అలవాటు పడ్డాక వారికుటుంబం ఎట్టయ్యిందో చూపాలి. ఈ నాటకం ప్రతి పల్లెలో వెయ్యించాలి. ఈనాటకంలోని పాత్రలంతా మహిళలచేతనే వెయ్యించాలి’’ అని అంటాండగా బస్సు వచ్చింది. పెద్ద మేడంబస్సెక్కేముందు ‘‘హేమ మనం బుజ్జికి ఇన్సూరెన్స్‌ ఇస్తున్నాం.’’ అంది. ఆ మాటతో చిన్నమేడం ఆనందంగా నవ్వింది. ఇదంతా ఇంటావుంటే నాకు ఏడుపొచ్చేసింది. దేవుడిచ్చిన ఈ జన్మని నాకు నేనై నాశనం చేసుకున్నేనే. దేవుడా! మా ఇంట్లో వాళ్ళ ఏడుపులు చూడు నాయనా! నీ కాళ్ళ మొక్కతా నాగోడు ఒకతడవ ఇన్నాయనా! నన్ను ఒక్క తడవ పంపించునాయనా! సంకురాత్రి పండగరోజు నాపెళ్ళాం బిడ్డలతో ఉండేసి అన్ని జాగర్తలు చెప్పేసి మాటతప్పకుండా నీదగ్గరకొచ్చేస్తా. 
 పేరూరు బాలసుబ్రమణ్యం 

మరిన్ని వార్తలు