గుంతలూరు

5 Aug, 2018 01:40 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఆఫీసులో తలపట్టుకుని కూర్చున్నాడు అభాగ్యనగర ఇంజినీరింగ్‌ అధికారి తవ్వకాల రావు. ఆయన డిపార్ట్‌మెంట్‌ నిజంగానే చారిత్రక నగరానికి అభాగ్యపుశాఖలా మారింది. ఈ శాఖ పుణ్యమాని రోడ్లను ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారని రోజూ పేపర్లలో, టీవీల్లో ఒకటే వార్తలు. ప్రజాప్రతినిధులూ ఫోన్లు చేసి ‘తవ్వడం ఆపుతారా? లేదా,’ అని తవ్వకాల రావును వాయిస్తున్నారు. వానాకాలంలో ఈ తవ్వకాలేంటని సోషల్‌ మీడియాలోనూ ప్రజలు తీవ్రంగా ఎండగడుతున్నారు. ప్రజలు, నాయకుల శాపనార్థాలతో తవ్వకాల రావు తలబొప్పికట్టింది.చిర్రెత్తుకొచ్చిన తవ్వకాల రావు ప్యూన్‌ మీద కేకేశాడు. వాట్సాప్‌లో స్టేటస్‌లు చెక్‌ చేస్తోన్న ప్యూన్‌ ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డాడు. గాబరాగా తలుపు తెరిచి అతని ఎదురుగా నిలబడ్డాడు.‘‘కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. ఫోన్లు వచ్చినా, మనుషులు వచ్చినా లేనని చెప్పండి’’ అంటూ కసిరాడు.తవ్వకాల రావు ముఖం అంతగా ఎర్రబడటం మునుపెన్నడూ చూడని ప్యూన్‌ భయంగా బయటికి వచ్చాడు.

కొద్దిసేపటి తరువాత ప్యూన్‌ వచ్చి ‘‘సార్‌! టీవీ ఆన్‌ చేయండి’’ అన్నాడు.‘‘ప్లీజ్‌సార్‌ అర్జెంట్‌’’ అన్నాడు ఆయాసంగా!ఏదో జరిగిందని ఆదుర్దాగా తెలుగు న్యూస్‌చానల్‌ పెట్టాడు తవ్వకాల రావు.‘‘అబ్బా. తెలుగు కాదు సార్‌.. ఇంగ్లిష్‌ చానల్‌ పెట్టండి’’ అన్నాడు కాస్త చిరాగ్గా. ప్యూన్‌ చెప్పినట్టు ఇంగ్లిష్‌ చానల్‌ పెట్టాడు తవ్వకాల రావు. తవ్వకాల రావు తనను తానే నమ్మలేకపోయాడు.ఆ వార్త తన గురించే!అభాగ్యనగరం రోడ్ల తవ్వకాల అధికారిగా ఆ వార్త చూసి ఆనంద భాష్పాలు ఆపుకోలేకపోయాడు.కుర్చీలో నుంచి లేచి వచ్చి మరీ ప్యూన్‌ను కౌగిలించుకున్నాడు. జేబులో నుంచి వెయ్యిరూపాయల నోటు తీసిచ్చి, ‘‘ఆఫీసులో అందరికీ మిఠాయిలు పంచు’’ అన్నాడు. ‘‘వెంటనే తెలుగు మీడియాను పిలుచుకురా! ఈరోజు మనం ధైర్యంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మన గొప్పదనాన్ని చాటి చెబుదాం’’ అన్నాడు ఉప్పొంగిన ఛాతీతో.

ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులతో హాలు కిటకిటలాడుతోంది.‘‘ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు?’’ అన్నాడో విలేకరి ఆసక్తిగా.‘‘కొంపదీసి రేపటి నుంచి రోడ్లు తవ్వడం ఆపేస్తున్నారా?’’ అన్నాడు మరో విలేకరి వెటకారంగా.ఈలోగా మైక్‌ సవరించాడు తవ్వకాల రావు. ‘‘మా శాఖకు అంతర్జాతీయ కాంట్రాక్ట్‌ లభించింది’’ అన్నాడు గర్వంగా!‘‘అవునా? ఏంటి సార్‌ అది?’’ అంటూ అంతా తవ్వకాల రావు వైపు ఆసక్తిగా చూస్తూ అడిగారు.‘‘ఆఫ్రికాలో వజ్రాల గనులు తవ్వకాల కాంట్రాక్ట్‌..’’ అని ప్రకటించాడు.ముందు వరుసలో ఉన్న విలేకరి కుర్చీలోంచి కిందపడి తవ్వకాల రావు వైపు అనుమానంగా చూశాడు.‘‘నీ సందేహం నాకర్థమైంది. నాకు మతి చలించలేదు. కావాలంటే చూడు’’ అంటూ ఒక ఇంగ్లిష్‌ న్యూస్‌ చానల్‌ పెట్టి మరీ లైవ్‌లో చూపించాడు.‘‘మీరు కళ్లు నలుపుకున్నా, కెమెరా లైట్లు ఫోకస్‌ చేసి చూసినా ఇది నిజం. నమ్మలేని నిజం. మనమంతా గర్వంగా గంగ్నమ్‌ డ్యాన్స్‌ చేయాల్సిన సమయం’’ అంటూ చెబుతూపోతున్నాడు. ‘‘అస్సలు దరఖాస్తే చేసుకోకుండా మీకే ఎందుకు ఇచ్చారు?’’ అంటూ పాయింట్‌ లాగాడు మరో విలేకరి.

‘‘నాకు తెలుసు నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని. అయినా దీనికి సమాధానం నేను కాదు, ఆ మైనింగ్‌ కాంట్రాక్ట్‌ మా శాఖకే ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఆఫ్రికా అధికారినే అడగండి..’’ అంటూ ఆయన్నే వేదికపైకి పిలిచాడు తవ్వకాల రావు. ఒక్కసారిగా కెమెరాలు అన్నీ అతనివైపే తిరిగాయి.‘‘హాయ్‌! ఐయామ్‌ గుంటల్‌ మండేలా. మా నాన్న తెలుగువాడే. మా అమ్మ ఆఫ్రికన్‌. నాకు తెలుగు వచ్చు’’ అంటూ వచ్చీరాని తెలుగులో మాట్లాడాడు.‘‘ఇండియా నుంచి సింగరేణి, ఓఎన్‌జీసీ, ఎన్‌ఎండీసీ లాంటి దిగ్గజ మైనింగ్‌ సంస్థలు దరఖాస్తు చేసుకున్నా వీరికే ఎందుకిచ్చారు?’’ అంటూ ముక్తకంఠంతో అడిగారు విలేకరులంతా.‘‘దాని వెనక చాలా పెద్ద గతం ఉంది. అది సింగరేణి గనులంత లోతుగా, బళ్లారి గనులంత విశాలంగా ఉంటుంది.. అయినా సరే చెబుతా’’ మైకందుకున్నాడు ఉత్సాహంగా గుంటల్‌ –
‘‘ఇటీవల మా తాత కాళ్లు విరిగి సీరియస్‌ అని తెలిసి నగరానికి వచ్చాం. వచ్చాక తెలిసింది ఆయన ఇక్కడ రోడ్డు పక్కన గుంతల్లో పడ్డాడని. నాకు ఈ శాఖ నిర్లక్ష్యంపై చిర్రెత్తుకొచ్చింది. ఆఫ్రికాలాంటి ఖండంలో ఎన్నో గనులు తవ్విన అనుభవం నాకు, మా నాన్నకు సొంతం. అలాంటిది రోడ్డు కటింగ్‌ కోసం తవ్విన చిన్న గుంతలో పడి మా తాత గాయపడటం చాలా అవమానంగా భావించాం. ఈ శాఖ భరతం పడదామనుకుని మా నాన్న కారులో కోపంగా బయల్దేరాడు. కొంత దూరం వెళ్లాక ఆయన వెళ్లే కారు అవే గుంతల్లో ఇరుక్కుని ప్రమాదానికి గురైంది. దీంతో ఈ నగరం గుంతలు మాకు అచ్చిరాలేదని మా నాన్న, వాళ్ల నాన్నను తీసుకుని ఆఫ్రికా వెళ్లిపోయారు. కానీ నేను మాత్రం గుంత వదలని విక్రమార్కుడిలా ఇక్కడే ఉన్నా.’’ అన్నాడు గుంటల్‌ మండేలా.‘‘గుంత కాదుసార్‌! పట్టు వదలని విక్రమార్కుడు అనాలి’’ అంటూ వాక్యాన్ని సరిచేశాడు తవ్వకాల రావు.

‘‘నాకు తెలుసు లేవోయ్‌! మనది మైనింగ్‌ ఫీల్డ్‌ కదా. మార్చుకుంటే తప్పులేదులే’’ సమర్థించుకున్నాడు గుంటల్‌. ‘‘ఈ తవ్వకాల రావుకు నా పిడిగుద్దులు రుచి చూపిద్దామని మా ఇంటి అటకపై ఉన్న పాత బాక్సింగ్‌ గ్లౌజుల దుమ్ము దులిపా. ఈ తవ్వకాల రావేమో ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. నగరం మొత్తం తవ్వడం, తవ్వించడమే పని కదా! ప్లాన్‌ వేసిన ప్రతీసారి నేను వెళ్లేసరికి మరోచోటికి వెళ్లేవాడు. అలా దాదాపు నెలరోజులు వెతికా. ఎక్కడా చిక్కలేదు. చివరికి కిరాయి రౌడీలను పెట్టి కొట్టిద్దామనుకున్నా. తవ్వకాల రావు కోసం బయల్దేరిన వారంతా రోడ్డు పక్కన గుంతలో పడి ఆసుపత్రిలో పడుకున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడమీద ఉన్న మా కులదైవం వైపు చూస్తూ ఉండిపోయా. అప్పుడే నాకు ఎడారిలో నీటి గుంత ఎదురైనట్లు, ఎండిన బోరు పొంగిపొర్లినట్లు, మూసేసిన మైన్‌లో వజ్రాలు దొరికినట్లు బుర్రలో ఒక్కసారిగా లైట్‌ వెలిగింది –‘‘తవ్వకాల రావు, ఆయన స్టాఫ్‌ చాలా గ్రేట్‌! ఎంత ప్రయత్నించినా మానాన్నకు, నాకు, చివరికి లోకల్‌ కిరాయి రౌడీలకూ దొరకలేదు. విచిత్రంగా వారంతా అవే గుంతల్లో పడి కాళ్లుచేతులు విరగ్గొట్టుకున్నారు. అంటే దీనర్థం ఏంటంటే తవ్వకాల రావు, ఆయన సిబ్బంది నిరంతరం రోడ్లు తవ్వడంలో తల నుంచి కాళ్ల దాకా మునిగిపోయారని. మా వద్ద పెద్ద గనుల్లోనూ వర్షాకాలం, ఎండాకాలంలో వాతావరణం సహకరించకపోతే తవ్వకాలు నిలిపేస్తాం. ఎందుకంటే అన్నీ కూడా వందల కోట్ల రూపాయల విలువగల భారీ యంత్రాలు. నాకు అర్థంకాని విషయం ఏంటంటే వీరి వద్ద అంత పెద్ద యంత్రాలు లేవు. పైగా లిమిటెడ్‌ మేన్‌ పవర్‌. కానీ, రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు, ఏడాదిలో 12 నెలలు, అంతెందుకు 365 రోజులు ఎండనకా, వాననకా తవ్వుతూనే ఉంటారు.

ప్రతిభ ఉంటే శత్రువునైనా అభినందించాలన్న మా తాత గుంతలో యోగా చేస్తూ చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది.అందుకే, మా దేశం వాళ్లకి ఈ విషయం చెప్తే వారు ముచ్చటపడ్డారు. దరఖాస్తు చేసుకోకున్నాకాంట్రాక్టు ఈ శాఖకే ఇవ్వాలని నా చేత ఒట్టేయించుకున్నారు. అదీ విషయం!’’ అని గుంటల్‌ మండేలా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు ఫ్లాష్‌బ్యాక్‌. అంతే! తమ తప్పు తెలుసుకున్న విలేకరులు లెంపలేసుకున్నారు. తవ్వకాల రావు ఇంటర్వ్యూల కోసం పోటీ పడుతున్నారు. తాను తవ్విన గోతి తనకే ఉపయోగపడుతోందని తెలిసి తవ్వకాల రావు లోపల గర్వపడుతున్నా పైకి మాత్రం ‘‘ఇప్పుడు కాదు.. ఇప్పుడు కాదు..’’ అంటూ చిరాకు ప్రదర్శిస్తున్నాడు.‘‘సార్‌! చాయ్‌..’’ అంటూ ప్యూన్‌ తట్టిలేపడంతో ఉలిక్కిపడి లేచాడు తవ్వకాల రావు.‘‘వార్తలు పెట్టు. గుంటల్‌ రావు ఎక్కడా?’’ అంటూ తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు.‘ఏంటిసార్‌.. కలగన్నారా ఏంటి..?’’ ప్యూన్‌ ఆయన రెండు భుజాలు పట్టుకుని ఊపాడు.దీంతో ఈ లోకంలోకి వచ్చిన తవ్వకాల రావు, ‘ఇదంతా కలా?’ అనుకున్నాడు.‘ఎంత అందమైన కల! నిజమైతే బావుండును.’ అనుకుంటూ టీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు.  
- అనిల్‌కుమార్‌ భాషబోయిన 

మరిన్ని వార్తలు