రెక్కలు తెగిన చీకటి 

19 Aug, 2018 00:28 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఆఫీస్‌ లంచ్‌ బ్రేక్‌లో పరధ్యానంగా ఉన్న ప్రసాద్‌ని చూశాను. నవ్వుతూ గలగల మాట్లాడే వాడి ముఖంలో ఆ సీరియస్‌నెస్‌ అస్సలు బాగోలేదు. ఆ మాటే అన్నాను. ఓ నవ్వు నవ్వి, ‘‘అలాంటిదేం లేదు’’ అన్నట్లు భుజాలెగరేశాడు. తిరిగొచ్చాక సీట్లో కూర్చుని పని చేస్తున్నాడు కానీ, ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. కుర్చీని వాడికి దగ్గరగా జరుపుకుని మాటల్లోకి దింపాను. పొడిపొడిగా సమాధానాలిచ్చాడు. సరిగ్గా అప్పుడే ఫోనొచ్చింది. మాట్లాడుతూ వరండాలోకి వెళ్లాడు. ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటూ, నెమ్మదిగా మాట్లాడాలని వాడు ప్రయత్నిస్తున్నాడు. ముఖం మాత్రం కందగడ్డలా మారిపోయింది. వచ్చి తన సీట్లో కూలబడి నిస్తేజంగా నాకేసి చూశాడు. ‘‘చెప్పు, ఏం జరిగింది?’’ అన్నాను ఆత్రుతగా. ‘‘ఇన్వెస్టిగేషనా?’’ అన్నాడు. చుర్రుమని తగిలింది ప్రశ్న! ఇలాంటివి వాడు అనడం, నేను వినడం మామూలే. ‘‘నీయిష్టం. ఏమైనా అనుకో. కానీ చెప్పి  తీరాలి’’ అన్నాను. నీకనవసరం అన్నట్లు ఓ చూపు విసిరాడు.మౌనాన్ని కాలమే కరగదీస్తుందని నాకు తెలుసు. 

మర్నాడు నా పనిలో నేను బిజీగా ఉన్నాను. మళ్లీ అడుగుతానని వాడు ఎదురుచూస్తున్నాడు. గ్రహించాను. నేనేమీ అడగలేదు. బెట్టు చేసి చెప్పడం వాడి అలవాటు. మూడు దశాబ్దాల మా స్నేహంలో ఇది నాకు కొత్త కాదు.రాత్రి ఏడింటికి ప్రసాద్‌ మా యింటికొచ్చాడు.‘‘కాఫీ ఇవ్వనా అన్నయ్యా!’’ అంది మా ఆవిడ. ‘‘మేడ మీదకి తీసుకురా’’ అని ఆర్డరేసి మేడెక్కి అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. రెండు కుర్చీలు మెట్ల మీద నుంచి మోసుకు వెళ్లి వేశాను.‘అడగాల్సింది ఏమీ లేదా?’ అన్నట్లు వాడి ‘వాడి చూపులు’ నాకు గుచ్చుకుంటున్నాయి. టీ తెచ్చిన మా ఆవిడని కిందకి వెళ్లిపొమ్మని సంజ్ఞ చేశాను, కప్పు అందుకుని. ఇది రహస్య సమావేశమని కమలకి అర్థమైపోయింది. ‘‘రొట్టెలకి పిండి కలపాలి’’ అని వెళ్లిపోయింది. నేను ఆకాశంలో మేఘాలవైపు చూస్తున్నాను.‘‘దాన్ని ఎలా పెంచాను నేను! ‘ఆడపిల్ల పుట్టిందా’ అని జాలిపడిన వాళ్లని కడిగి పారేశాను. ఏం లోటు చేశాను దానికి? చెప్పరా చెప్పు!’’ నన్ను నిలదీశాడు. కొండ కదిలింది. బాధ కరిగింది.‘‘ఆరు నెలలయింది, అది నాతో మాట్లాడి! కార్తీక మాసం పిక్నిక్‌కి రమ్మంటే రాలేదు. నిన్నటికి నిన్న సినిమాకి వెళదామనుకుని నేను, మా చెల్లాయి బయలుదేరితే రానంది. వాళ్లమ్మతోనూ అందరితోనూ బాగానే ఉంటోంది. నా దగ్గరికొచ్చేసరికి మూతి బిగించుకుని కూర్చుంటోంది. కనీసం నాతో కలిసి భోజనం కూడా చెయ్యడం లేదు. వింటున్నావా?... దాని పెళ్లికి డబ్బు దాస్తున్నాను. ఈ క్షణంలో సంబంధం నచ్చితే చేయగలను. డాక్టరవుతాను అంటే వద్దన్నానా? నీకునచ్చిన చదువు చదువుకో అన్నాను.’’ పొంతన లేని మాటల ప్రవాహం అలా సాగుతూనే ఉంది.‘కూతురు వీడితో నిశ్శబ్ద యుద్ధం చేస్తోంది’ ఇదీ నేను గ్రహించింది. ఏ విషయంలోనో తండ్రి వల్ల పిల్ల హర్ట్‌ అయింది! తెలుసుకోవాలి. రవళితో మాట్లాడాలి. 

మంచి వంక దొరికింది. వెంటనే ప్రసాద్‌ భార్య సంగీతకి ఫోన్‌ చేశాను. మా రెండు కుటుంబాలు ఓ రోజు రాయగడ మజ్జిగౌరి మందిరం చూసి రావాలని నిర్ణయించుకున్నాం. రైలు ప్రయాణం నాలుగు గంటలూ కబుర్లతో, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ విశేషాలతోనే గడిచిపోయింది. ఊళ్లో దిగిన వెంటనే ఒక రెసిడెన్సీలో రూమ్‌ తీసుకుని, స్నానపానాలు కానిచ్చి మందిరానికి వెళ్లాం. ఉత్కళాంధ్రుల ఇలవేల్పు దర్శనంతో పులకించిపోయాం. ముద్దమందారంలా ఉన్న అమ్మవారి శిరస్సుకి శిరసు వంచి నమస్కరించాం. మందిరం ముందున్న ఇత్తడి గుర్రాల్ని పిల్లలు ఆసక్తిగా పరిశీలించారు. అక్కడికి యాభై అడుగుల దూరంలో పరుగులు తీస్తున్న రైళ్లని ఆశ్చర్యంగా గమనించారు.లాడ్జికి తిరిగొస్తూ బస్టాండ్‌కి దగ్గరున్న ‘ఆదివాíసీ వస్తు ప్రదర్శనశాల’లో వారి ఆభరణాలు, దుస్తులు, వేట సాధనాలు, సంగీత వాయిద్యాలు, వంట పాత్రలు, కొమ్ము బొమ్మలు మా వాళ్లని బాగా ఆకర్షించాయి. ట్రైబల్‌ ఆర్ట్, కంచు బొమ్మలు మురిపించాయి. అట్నుంచి అటే తెరువలి లక్ష్మీనారాయణ మందిరం చూడాలని బయలుదేరాం. తెల్లని హంసలా మెరిసిపోతున్న పాలరాతి కట్టడాలు, వాటి చుట్టూ అందమైన పూల తోటలు ప్రశాంతతకి పట్టుగొమ్మలుగా ఉన్నాయి. పనిలో పనిగా చట్టికొనా జలపాతాన్నీ చూసేశాం.తిరిగి రాయగడ వస్తూ నాగావళి నది ఇసుక తిన్నెల్లో ఆడుకున్నాం. పరిగెత్తాం. అందరిలో ఆనందం చిందులు వేస్తోంది. నా కూతురు శారద గులకరాళ్లు ఏరుతోంది రవళితో కలిసి.‘‘మావయ్యా అని ఊరికే అంటే ఏం లాభం! ఓ కొడుకును కంటుందేమో మీ అత్తయ్యని అడిగి చూడు’’ అన్నాను. రవళి నవ్వుతూ వెళ్లి నేనన్న మాటలు మా కమల చెవిలో ఊదేసింది. కమల నన్ను తన్నడానికి వస్తే నేను తప్పించుకుంటూ అల్లరి చేశాను. చివరికి నా శ్రీమతి నా చెవులు పట్టుకొని మెలిపెట్టడం, నేను రెండు గుంజీలు తీసి వదిలేయమని బతిమిలాడటం అందరికీ కనువిందు చేసింది.శారద ఒక్కత్తే నాకు సపోర్ట్‌ చేసింది. నేనంటే దానికి పంచ ప్రాణాలు. నా ఇంటి మహాలక్ష్మి అది. మా ఆవిడ వీరత్వం చూసి చాలా రోజుల తర్వాత ప్రసాద్‌ పకపక నవ్వాడు. సంగీత ముఖంలో చిన్న రిలీఫ్‌ కనిపించింది. 

రవళి కళ్లకి రుమాలు కట్టారు. అంతా అందకుండా ఆటపట్టిస్తున్నారు. రాయిని గుద్దుకుని పడబోయింది తను. గబుక్కున వెళ్లి ఆపాను. గబగబ రుమాలు విప్పి నాకేసి సీరియస్‌గా చూసింది. ‘‘నువ్వూ మా నాన్నలా అవకాశవాదివేనా మావయ్యా!’’ అంది.‘‘రాయిని తన్నబోయావు. ఆపాను’’ – అన్నాను.విషయం గ్రహించి ‘సారీ’ అంది. ఒక నిమిషం వ్యూహాత్మకంగా ఆలోచించి మౌనంగా అక్కడ్నుంచి ముందుకు వచ్చేశాను. పాపం రవళి నొచ్చుకుంటుందని తెలుసు.. తెలిసే అలా చేశాను. కొండ మీదున్న కాలి బాట నుంచి ఒకరి వెనక మరొకరుగా నడిచి వస్తున్న ఆదివాసీలను చూపించాను కమలకి. వెంటనే ఓ చిన్న ఉపన్యాసానికి సిద్ధమైపోయాను. ‘‘రాయగడ జిల్లాలో జనాభా ఎనిమిది లక్షలు. ఇందులో ఈ గిరి పుత్రుల సంఖ్య సగానికంటే ఎక్కువే. పోడు వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం. కందులు, మినుములు,అల్లం, ఆవాలు, పెసలు, రాగులు అన్నీ పండిస్తారు. తేనె, చింతపండు అమ్ముతారు. కొండ చీపుళ్లు అమ్మకం వీరి ప్రధాన ఆదాయ వనరు. పురుగు మందులు వాడని కూరగాయలు గొప్ప రుచిగా ఉంటాయి. మీకు తెలుసా! రాయగడ వంకాయలకు ముళ్లుంటాయి. లోపల గింజలు మాత్రం ఉండవు...’’అలా ఉపన్యాసం చాలాసేపు కొనసాగించి ఊపిరి తీసుకున్నాను. పిల్లలు చప్పట్లు కొట్టారు.‘‘ఇవన్నీ మీకెలా తెలుసు?’’ అంది శ్రీమతి. 

‘‘ఎక్కడికైనా వెళ్లే ముందు ఆ ప్రాంత విశేషాలు తెలుసుకోవాలి కదా! ఇంటర్‌నెట్‌ చూస్తే అన్నీ తెలుస్తాయి’’ అన్నాను. శీతాకాలం అయినా బాగా దాహమేసింది. నీళ్ల సీసా ఎత్తి గుటకలు వేస్తున్నాను.రవళి నా దగ్గరగా వచ్చింది. ‘‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి’’ అంది. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నానని తనకి తెలీదు. వెళ్లాను. నదిలోకి చిన్న చిన్న రాళ్లు విసురుతూ చెప్పింది – ‘‘నాన్నంటే నాకు చాలా గౌరవం ఉండేది. జన్మనిచ్చి, విద్యాబుద్ధులిచ్చి..’’ గొంతు జీరబోయింది... సర్దుకుంది. ‘‘...కానీ నాన్న కల్పించుకొని పనిమనిషి మీద చేతులు వేయడాలు, నా క్లాస్‌మేట్‌ సుజాత ఇంటికొస్తే తనని ఎగాదిగా చూడటాలు నాకు నచ్చడం లేదు. నేను తప్పు చేస్తే సరిదిద్దాల్సిన నాన్న.. తనే తప్పు చేస్తూ.. ఛీ! సిగ్గేస్తోంది. ‘‘ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది.’’ ఇదే చివరి మాటగా విసవిసా నడుస్తూ వెళ్లిపోయింది రవళి. నా అడుగు ఏమాత్రం అటూ ఇటూ వేసినా కొంపలు అంటుకుంటాయి.అటు ప్రసాద్‌తోను, ఇటు చెల్లాయితోనూ ఏం మాట మిగిలినా కొరివితో తల గోక్కున్నట్టే. కానీ స్నేహధర్మంతో పరిస్థితి సరిదిద్దాలి. తిరుగు ప్రయాణంలో రైలు కంటే వేగంగా ఆలోచనలు పరిగెత్తాయి. పార్వతీపురం ఎప్పుడు దాటామో తెలీదు. బొబ్బిలిలో రైలు ఆగింది. ‘‘చెల్లాయ్‌! నీ నడుంనొప్పికి ట్రీట్‌మెంట్‌ ఎక్కడ తీసుకున్నావు?’’ అని సంగీతని అడిగాను. ‘‘హైదరాబాద్‌లో! మంచి డాక్టర్‌ చూశారు. క్రమం తప్పకుండా మందులు వాడుతూ చిన్నపాటి ఎక్సర్‌సైజ్‌లు చెయ్యమన్నారు’’‘‘వెంటనే పనిమనిషిని మాన్పించు. తేలికపాటి వ్యాయామాలు ప్రారంభించు. ఇంట్లో ముగ్గురే కదా – నీ పనులు నువ్వే చేసుకో’’ అన్నాను. ‘‘ఏమిటి అసలు సంగతి?’’ అన్నట్లు చూసింది సంగీత. 

గుప్పిడి విప్పకపోతేనే అందం, చందం. ‘‘నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నీ యిష్టం’’ అన్నాను. ఏదో దాస్తున్నావు అన్నట్లు నవ్వుతూ తల ఊపిందామె. ‘‘ట్యూషన్‌ సార్‌ మీయింటికే రావడం, రవళి స్నేహితురాళ్లు చదువు పేరుతో మీ యింట్లో మూగడం అవసరమా? ఆ సార్‌కి చెప్పు – ఇక మీయింట్లో చెప్పడం కుదరదని, మరోచోట చెప్పినా రవళి వస్తుందని.’’ అన్నాను.నా మాటలకి మా ఆవిడ, సంగీత, ప్రసాద్‌ ఏకకాలంలో ఆశ్చర్యపోయినా – ఒక్కొక్కరిలో ఒక్కో ప్రశ్న తలెత్తింది. ప్రసాద్‌ లోలోపలే కుతకుతలాడిపోయాడు. నివురుగప్పిన నిప్పులా... లేని శాంతం కప్పుకుని కూర్చున్నాడు. ఈ మార్పులన్నీ తనని ఎలా ప్రభావితం చేస్తాయో ప్రసాద్‌కు తెలుసు. కానీ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయాడు.ఈ విషయాలేమీ తెలియని సంగీత – తన ఆరోగ్యమే మహా భాగ్యమని ప్రభాతపు నడక, సాయంకాలపు నడకల్లో, వ్యాయామాల్లో, ఇంటి పనుల్లో తీరికలేని హడావుడిలో మునిగిపోయేందుకు నిర్ణయించుకుంది.రవళి కళ్లలో ఆనందబాష్పాలు చూశాను. మా ఆవిడ ముఖంలో మాత్రం జవాబు దొరకని ప్రశ్న కదులుతోంది. కొన్నాళ్లకు ఆ ప్రశ్న మరచిపోతుంది. ఆమె ఆ ప్రశ్న మరచిపోయే లోపే ప్రసాద్‌తో మాట్లాడాలి. ఇవన్నీ అతనికి అర్థమయ్యేలా గట్టిగానే చెప్పాలి. ఆ రోజు కోసం ఎదురుచూడకుండా నేనే దగ్గరికెళ్లాలి! 
  

మరిన్ని వార్తలు