గోవింద గోవింద‌!

3 Mar, 2019 00:26 IST|Sakshi

కొత్త కథలోళ్లు

బస్సు సడన్‌ బ్రేకు వేయగా ముందరున్న కమ్మీకి గుద్దుకున్నాడు గురుమూర్తి. ‘స్‌.... అబ్బా‘ అంటూ డ్రైవేరుకేసి నాలుక మడిచి ఉరిమాడు. ఇతనికి మించి శబ్దం చేసింది అప్పుడే నిలిచిన బస్సు, ‘స్‌ స్‌ స్‌....‘ అంటూ. చప్పుడు విన్న డ్రైవర్‌ తిరిగి చూసి, మొరుస్తున్న గురుమూర్తిని చూసి చటుక్కున తిరుక్కున్నాడు, ఎక్కడ తిడతాడేమో అని. కోపాన్ని దిగమింగేసి గురుమూర్తి తన గుడ్డసంచి తీసుకొని సీటునుంచి లేసినాడు. పైన ఉన్న లగేజి వరుసకు ధబీల్మని తల కొట్టుకున్నాడు. ‘దీనె...‘ అంటూ బిగ్గరగా అరవాలనుకున్నవాడు. కళ్ళు గట్టిగా మూసి పిడికిలి బిగించి నొప్పి భరించుకొని నోరు అదుపు చేసుకున్నాడు. ‘ఏంది రా కొండకు రావడం రావడమే రెండుసార్లు పెట్టినాడు దేముడు మనకు?‘ అనుకుంటూ బస్సు దిగినాడు.  తిరుమలకొండకు డ్యూటీకి వచ్చినా మొక్కుగా వచ్చినా చెప్పులు వేసుకోవడం అలవాటు లేదు గురుమూర్తికి. తెల్లారి మంచుకు తడిసిన రాతినేల మీద పాదం మోపగానే ఐసుగడ్డ మీద పెట్టినట్లు సుర్రుమని నెత్తికి కొట్టింది. ‘గోవింద‘ అనుకుంటూ కల్యాణకట్ట వైపు తన గుడ్డసంచి చంకలో పెట్టుకొని పంచ సర్దుకుంటూ నడిచినాడు. కల్యాణకట్ట లో క్షౌరవృత్తి చేసేవారందరికి ఒక ఐడి కార్డు ఉంటుంది. తన కార్డు సరిచూసుకుంటూ వేగంగా నడవసాగినాడు. టిటిడి ఆడియో విభాగం వారు వేసిన ‘శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా‘ పాట ముగిసేసరికి కల్యాణకట్ట చేరుకున్నాడు. 

అదో బృహత్తరమైన భవన సముదాయం. ఒకప్పుడు చిన్నదిగా ఉన్న కల్యాణకట్ట, పెరుగుతున్న భక్తుల సంఖ్యతో కిక్కిరిసిపోవడంతో దాన్ని కొన్నేళ్ల ముందే తిరుమల తిరుపతి దేవస్థానంవారు విస్తరించారు.  
అప్పటికే జనం నిండుగా ఉన్నారు. గుండుకు మొండికేసే చిన్నారులు, దండిగా జుట్టు పెంచిన అపరభక్తులు, భక్తిభావంతో కురులు సమర్పించడానికి వచ్చిన గ్రామీణ మహిళలు, మూడు కత్తెర్లకే పరిమితం అయిన మోడరన్‌ సిటీ వనితలు...ఇలా నానారకాలు. కురులను చివరిసారిగా తడిమి చూసుకుంటున్న బాలికలు, మొక్కు పవిత్రత తెలియక ఎందుకు ఎవరు మొక్కుకున్నారో, తన జుట్టుమీదకు తెచ్చిపెట్టారే అనే అక్కసుతో తిట్టుకుంటున్న పిల్లలు ఎక్కువ మందే అక్కడ. గుండు కొట్టించుకున్నాక దాన్ని అపురూపంగా చూసుకోడానికి అద్దం ముందు వాలిపోయే పిల్లలతో పాటు, జుట్టులేని తమ తలలను చూడగానే బాధ ఆపుకోలేక భోరున ఏడ్చేసే పిల్లలూ ఉంటారు. సరదాగా ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని వెక్కిరించుకుంటూ కొందరు ఉంటే, ఏడ్చే పిల్లలు మాత్రం ఒకరికి ఒకరు ఓదార్పు చెప్పి, ధైర్యం తెచ్చుకుంటారు. ‘ఒక్క రెండ్రోజుల్లో నల్లబడుతుంది, పదిరోజుల్లో పూర్తిగా మొలిచేస్తుందిరా. ఊరుకో‘ అని ఉత్తుత్తి ధైర్యం చెప్పే తండ్రిని కాల్చుకుతినేలా చూసే మగపిల్లలు, రేపు మా గర్ల్‌ ఫ్రెండ్‌ ముందు ఎలా తలెత్తుకోవాలంటూ కుమిలిపోయే అర్బన్‌ బాయ్స్‌ ఇంకో పక్క. దర్శనం అవ్వగానే టోపీ కొనియ్యాలంటూ పేచీ పెట్టే పిల్లలు, ’అలాగే లేరా’ అంటూ హామీలు గుప్పించే తల్లితండ్రులతో కల్యాణకట్టంటేనే ఓ రచ్చబండ. ఎన్నో అంతస్తులో ఉన్నామో, బయటకు ఎలా వెళ్ళాలో తెలియక తికమకపడేవారు, స్నానానికి వేన్నీళ్ళు ఎక్కడ ఉంటాయో తెలియని వృద్ధులు, భాష రాక, ఎవరిని అడగాలో బోధపడక, అటూఇటూ తిరుగాడే పొరుగు రాష్ట్రాల భక్తులు, వీళ్లందరితో కల్యాణకట్టంటేనే ఓ పెద్ద మయసభ. 

తన స్థానం వద్దకు వచ్చి, వంగి నేలను తాకేసి, పైకి చూసి ఓసారి కళ్ళు మూసుకొని ’గోవిందా’ అనుకుంటూ కూర్చున్నాడు. పక్కనున్న సుబ్రమణ్యంకేసి చూస్తూ ‘ఏమియా, ఎంత సేపయ్యింది వచ్చి?‘ అన్నాడు. ‘ఇప్పుడే గురూ‘ అన్నాడు అతను. గురుమూర్తికి చాలా రోజులనుంచి ఒక సందేహం. ‘వయస్సులో పెద్ద కాబట్టి మర్యాదపూర్వకంగా నన్ను ’గురూ’ అంటున్నాడా లేక నా పేరు పెట్టి పిలస్తా ఉండాడా వీడు‘ అని. అయినా పట్టించుకోకుండా అక్కడున్న భక్తులకేసి చూసినాడు. గురుమూర్తికి వాళ్ళను భక్తులుగా కాకుండా, కస్టమర్లుగా చూడటం అలవాటు. ఎవరైనా ‘రిచ్‌‘ గా కనిపిస్తే, కనీసం ఒక రెండొందలయినా ఇచ్చుకుంటారు అనిపిస్తే, వాళ్ళకేసి సైగచేసి చప్పట్లుకొట్టి మరీ పిలుస్తాడు. మిగిలినవాళ్ళకి ఇది ఏ మాత్రం నచ్చదు. వాళ్ళంతట ఎదురు వరుసకు వచ్చినవారిని కూడా పిలిచి మరీ తన్నుకుపొయ్యే తత్వం మనోడిది. 

ఇతని గ్రద్ద చూపు పిచ్చుకలాగ ఉండే ఓ సన్నటి తమిళ భక్తునిపై పడింది. చాంతాడంత గొలుసు, బ్రాస్లెట్‌ సహితంగా చూడముచ్చటగా ‘కామధేనువు‘లాగా కనిపించాడు అతను. అతనొక్కడే వచ్చాడో లేక కుటుంబసమేతంగా వచ్చాడో ఆరా తీయసాగాడు. కుటుంబసమేతం అయితే గంపగుత్తగా ఓ ’ఫామిలీ ప్యాక్‌’ కింద లాగేయొచ్చు అని వీడి అంచనా, కాదు ఎదవ ఆలోచన. పక్కనోడి ముందర వాలే భక్తుణ్ణి డైవర్ట్‌ చెయ్యడమంటే వాడి నోటికాడ తిండి లాగేసుకోడమే.  ’వాడు ఏమైపోతే మనకేమి, నాకు చిల్లర ముట్టిందా లేదా’  అన్న టైపు. అందుకే అక్కడ గురుమూర్తి అంటే తెగ కడుపుమంట. కల్యాణకట్టలో అతనికి పదుల సంఖ్యలో సహచరులు ఉన్నారు, కానీ మిత్రులు ఒక్కరు కూడా లేరు.   ‘ఇదో సామి, ఇంగ వాంగే‘ అన్నాడు బిగ్గరగా. అటువైపు వరుసలో క్షురకుని వైపు వెళ్తున్న ఆ భక్తుడు తిరిగి చూసి ఓ క్షణం ఆగినాడు. ఏమనుకున్నాడో ఏమో, గురుమూర్తి దగ్గరకు వచ్చాడు. ‘ఉక్కారుంగ‘ అంటూ తన ముందున్న పీట చూపించి కూర్చోమన్నాడు. ఆ భక్తుడు చొక్కా బనియను విప్పి పక్కనపెట్టి, నేలను ఓ మారు తాకి కూర్చున్నాడు, ’గోవిందా గోవింద‘ అని గొణుక్కుంటూ. 

మిలమిల మెరిసే కళ్ళతో అతనిని ఆవురుఆవురుమంటూ ఓసారి సంతృప్తిగా చూసుకున్న గురుమూర్తి, అంతే స్థాయిలో మెరుస్తున్న ఓ కొత్త బ్లేడు తీసుకొని సగానికి తుంచి, పని మొదలుపెట్టసాగినాడు. ఆ భక్తుని తలను వేన్నీళ్ళతో తడుపుతూ ‘ఎంద ఊరు నమ్మల్దు?‘ అంటూ విచారించాడు. ఇతని తమిళానికి ఒకింత ఆశ్చర్యంతో ఆ భక్తుడు ‘మదురై పక్కత్తుల ఆండిపట్టి‘ అన్నాడు. ‘పేరు ఎన్న‘ అని మళ్ళీ తగులుకున్నాడు. ‘పళని సామి‘ అన్నాడు అతను, వంచిన తలను పైకెత్తలేక ఓరచూపు చూస్తూ.  రెండు నిమిషాలు గడిచాయి మౌనంగా. గురుమూర్తి కత్తి తన పనితనం చూపిస్తోంది. తలపై వెన్నలా జారుకుంటూ బుల్డోజర్‌ లెక్కన వెంట్రుకలను తొలగిస్తా ఉంది.  వెంకన్నకు సిరులు కురిపించే కురులను తితిదే వ్యావహారిక భాషలో ’నల్లబంగారం’గా అభివర్ణిస్తారు. ఒక్క రూపాయి కూడా ఇచ్చుకోలేని పేద భక్తుడు సైతం సగర్వంగా మొక్కుకింద ఇచ్చుకోగలిగిన సొత్తు ఈ కురులే. వీటిని వేలంపాటలో అమ్మితే తితిదే ఖజానాకు చేరే కోట్లాది రూపాయల్లో పళనిసామి లాంటి కోట్లాది భక్తుల కురులరూపంలో చేరే రూపాయి రూపాయి ఉందన్నమాట. 

టైమింగ్‌ తెలిసిన గురుమూర్తి ఇదే అదునుగా అతన్ని మళ్ళీ మాటల్లో పెట్టాడు. ‘మాకు అంతంత జీతాలే. పెద్దగా రాబడి ఇల్లే. ఏదో మీ సంతోషం, మా ప్రాప్తం‘, అంటూ పళ్ళు ఇకిలించాడు. ఓరకంటితో చూడగలిగినా చూపు కలపకుండా కళ్ళు మూసుకొని మౌనంగా ఉన్నాడు పళనిసామి. ‘మీ సంతోషం, మా ప్రాప్తం‘ అన్నది దేవస్థానంలో కొన్ని తరాలు గా ఊతపదం. చెప్పుల స్టాండు నుంచి క్షౌరశాల దాకా, దేవుని వాహనం మోసేవారి నుంచి టీ కప్పు మోసే అటెండర్‌ దాకా, అర్చకుని నుంచి అధికారి దాకా ఇది చాలా పాపులర్‌.  మామూలుగా ఈ మాటకు ఊకొట్టడమో, తలూపడమో చేస్తారు భక్తులు. నెత్తిన కత్తి పెట్టి మరీ అడిగితే ఇవ్వక చస్తారా? పైగా తల అప్పగించి, సగం గొరిగించుకున్నాక.. దీన్ని సానుకూల స్పందనగా గుర్తించి గురుమూర్తి డెటాల్‌ బాటిల్‌ కానీ, చందనం డబ్బా కానీ తెరుస్తాడు, తాయిలంలా. అన్నీ తెలిసిన పళనిసామి, గురుమూర్తి ’ఎదురుచూస్తున్న’ సంతోషం అర్థమైనా కిమ్మనక ఉన్నాడు. ఇతని మౌనం గురుమూర్తిని కలవరపెట్టింది, చికాకు తెప్పించింది. ‘ఇదేంరా బోణినే బెడిసికొట్టేట్టు ఉంది‘ అనుకున్నాడు.  ‘మేము తెల్లారి కొండకు వచ్చినామంటే కిందికి దిగేటప్పుడు సాయంకాలం పొద్దు పోయుంటుంది. ఏదో మా కుటుంబాల కష్టాలు మర్చిపోయి దేవుడిచ్చిన వరం, తరతరాలుగా చేస్తున్న ఉద్యోగం కాబట్టి చేస్తా వుండాము. లేకపోతే ఏమి గిట్టుబాటు అవుతుంది చెప్పు సామి, ఈ తక్కువ జీతాలకి పెరిగిన కర్సులకి‘, అన్నాడు. పళనిసామి విననట్లే ఉన్నాడు. అనుకున్నది జరగకపోతే ఇంకొంచం గట్టిగా ప్రయత్నించే మనస్తత్వం ఉన్న గురుమూర్తి ఈసారి ఇంకా బాగా తగులుకునే ప్రయత్నమే చేసాడు. ‘చూస్తానే ఉండారు కదా, ముందర మీ ఊరికాడ నుంచి ఈడకి రావాలంటే ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంతగా పెరిగింది? ఏదో అట్లా చూస్కోండి మమ్మల్ని కూడా‘, అని విశదీకరించారు, కాస్త సిగ్గును పక్కనపెట్టి.  అయినా చలనం లేదు పళనిసామిలో. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు అన్నట్టు ఈ అరమోడు ఏందిరా బాబు ఏమి మాటాడడు, అని మనసులో అనుకున్నాడు. 

పళని తలూపుతాడని ఎదురుచూసిన గురుమూర్తికి నిరాశ మాత్రమే మిగిలింది. అతని పెదాలపై చిరునవ్వు మెల్లగా మాయమవడం కళ్ళుమూసుకున్నా కూడా కనిపించింది పళనిసామికి. కొన్ని క్షణాల ముందు మెత్తగా జారుకున్న కత్తిలో కరుకుదనం పెరిగింది, అతని వేలిపట్టు బిగిసింది. ముందున్న జాగ్రత్త ఇప్పుడు కనపడలేదు. పళనిసామికి మార్పు తెలియవచ్చింది. పళనికి అర్థమైందని గురుమూర్తికి కూడా అర్థమయింది. ‘ఒక్కసారి కూడా పలకట్లేదు ఏమిరా వీడు?‘ అనుకుంటూ కత్తిని కాస్త విసురుగా లాగినాడు. చప్పని చెవిపక్కన లేతచర్మం కోసుకుపోయింది. నొప్పికి ‘అప్పా‘ అంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు పళని. ‘వీడికి బాగా కావాల‘ అని మనసులో అనుకున్నాడు. పక్కనున్న సుబ్రమణ్యం చటుక్కున తిరిగి, చందనం రుద్దమని సలహా ఇచ్చాడు. ‘నువ్వు మూసుకొని నీ పని చూడు‘, అన్నట్టు మనోడు సైగ చేయడం కూడా తల ఒంచి గమనిస్తున్నాడు పళనిసామి. చెవిపక్కన గాటుపడి, రక్తపుచుక్క మెల్లగా తొంగిచూసింది. కోసుకుపోయిన చోట కత్తిరించకపోవడంతో అలాగే నిలిచిపోయిన పొడవాటి వెంట్రుకల సంగతి గురుమూర్తి అస్సలు పట్టించుకోలేదు. 

తల మెల్లిగా పైకి ఎత్తి చూసిన పళనిసామి కళ్ళల్లో అసహనం కానీ, చికాకు కానీ కనపడలేదు. ఒకింత నిండుతనం, జాలి, క్షమాగుణం చూసి ఆశ్చర్యపోయాడు గురుమూర్తి. పళనిసామి చూపుడువేలితో తలపైన గాటును నిమురుతూ, ‘ఎన్న సామి, దుడ్డు కావాలని నువ్వు అడగాలనా? మేము నీకు ఇచ్చుకునే దక్షిణ కూడా హుండీలో వేసినంత పవిత్రంగా చూసుకుంటాము. అదుకుపోయి గాటు వేసేసినావే‘, అన్నాడు. అతని మాటలు కటువుగా లేవు, కనువిప్పు కలిగించేలా ఉన్నాయి. ఈసడించకుండానే ఈడ్చితన్నట్లు ఉన్నాయి. గొడవ పెట్టుకునేటట్లు కాకుండా గోడువినిపించినట్లు ఉంది. తిరగబడి తిమురుగా మాట్లాడే భక్తుల్ని టీముగా ఎదుర్కోవడం తిరుపతి టెక్నీకు. అది కొండపైనన్నా సరే, కింద బస్సు స్టాండ్‌ లో టీ కొట్టైనా సరే, గోవిందరాజస్వామి గుడి ముందర బొమ్మల అంగడైనా సరే. కలిసికట్టుగా అంగళ్ల వాళ్ళందరూ చేరుకొని ’ఏయ్‌.. ఏయ్‌’ అని అరుచుకుంటూ చుట్టుముట్టేస్తే బెదిరిపోయి పారిపోతారు అని ఒక స్ట్రాటజీ. ఇది ’మాబ్‌ మెంటాలిటీ’.  ఎదురుతిరిగి మొరుచుకుంటే తిరిగి అరుద్దామని గొంతు సవరించుకున్న గురుమూర్తికి అలాంటిది ఏమి జరగకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అరమోడు అరిస్తే తిరిగి గట్టిగా ఇవ్వాలని తీర్మానించుకున్నాడు కానీ పరిస్థితి అలా లేదు. ఆ భక్తుని సున్నితమైన బిహేవియర్‌ అర్థంకాక చూస్తుండిపోయాడు గురుమూర్తి. తీక్షణంతో నేరుగా చూస్తున్న పళనిని అంతే స్థాయిలో చూడలేకపోయాడు గురుమూర్తి. 

అవమానం అగుపించినా, మొదటిసారి గురుమూర్తిని ఆలోచింపచేసింది పళని మాటలు. కత్తి ఉన్న చేతితోపాటు, తన చూపు కూడా పళని కళ్ళను దాటుకుంటూ నేలపైకి వాలింది, సిగ్గుతో. పని మానేసి తిరిగి చూసినాడు సుబ్రమణ్యం, ఇంకా ఇద్దరు ముగ్గురు. గురుమూర్తికి ఒక అవమానం జరుగుతోంది అంటే చెప్పలేని ఆనందంతో చూడసాగారు తోటి క్షురకులు. ఒకరినొకరు ’స్‌.. స్‌’ అని పిలుచుకుంటూ ’ఇది గమనించండి’ అంటూ సైగలు చేసుకున్నారు అతనితో స్నేహం లేని సహచరులు. ఒక్కసారిగా ఓ ముప్పై జతల కళ్ళు తనపై వాలడంతో ఆ ఉష్ణాన్ని గ్రహించాడు గురుమూర్తి. పళని కొనసాగించాడు: ‘నాంగ తిరపతి ఒస్తే ఒక్క దేవుడు కాదు. సవరం చేసే మీనుంచి, పూసారి అయ్యా (అర్చకుడు) వరకు, మా మొక్కు తీర్చడంలో సహాయపడే ఎల్లారుమ్‌ మాకు వెంకటాచలపతి దాన్‌. నాంగ ఎంగ ఊర్లో బయల్దేరిన నాటినుంచి, సామి దర్శనం సేసి ఉంగ ఊరు దాటే వరికుం మీ మీదనే కదయ్యా ఆధారపడేది. అంటే మాకు దగ్గరుండి దారి సూపించే తిరపతిలో ప్రతి ఒక్కరూ దైవం దానే. మేము అట్లానే అనుకుంటాము, నిన్ను కూడా అట్లనే అనుకున్నాము. మీరు మాలాంటి కస్టమర్లను రోజుకు ఎంతో మందిని చూస్తారు, కానీ మీ అందరిలో మేము చూసేది ఆ దేవుణ్ణే సామి‘. ఆ ఒక్క మాట అతని గుండెలో గడ్డపార దింపినంత పని చేసింది. తదేకంగా చెయ్యి డెటాల్‌ బాటిల్‌ వైపు వెళ్ళింది, తీసి చెవికాడ గాయంపై రుద్దినాడు, మళ్ళీ అతని కళ్ళను దాటుకుంటూ.

సర్దుకున్న పళని లేచి నిలబడి చొక్కా జేబులో చెయ్యి పెట్టబోతే, అతని చేతిని పట్టుకున్నాడు గురుమూర్తి, తల అడ్డంగా ఊపుతూ, తనకేమీ ఒద్దు అన్న సంకేతమిస్తూ. ‘ఇది నీకు కాదు సామి, నీలో నేను చూసుకున్న వెంకటేశ్వరస్వామికి‘, అంటూ రెండు పెద్ద నోట్లు అందించాడు. ఆ పెద్ద నోట్లను కళ్ళతో చూడకుండానే దాని  విలువను గ్రహించాడు. అతను ’ఎదురుచూసిన’ సంతోషం కన్నా ఈ బేరంలో చిక్కిన ప్రాప్తం ఎక్కువే, కానీ ఇప్పుడు అతను చెయ్యి చాపలేక పోయాడు. అర్థం చేసుకున్న పళని, డబ్బుని పీట కింద పెట్టి లేసి, ’గోవిందా గొవింద’ అంటూ బయల్దేరాడు.  మొక్కుచెల్లించడంలో దక్షిణకు ఓ స్థానం ఉంది. గుడికి వస్తే పళ్ళు టెంకాయలు పూలు తేవడం, అర్చనకు హారతికి హుండీలోనే కాక అర్చకుని పళ్లెంలో కూడా డబ్బులు వేయడం, ప్రసాదానికి చందా కట్టడం, పుట్టినరోజుకి శ్రార్ధాలకు అన్నసంతర్పణ చేయడం సామాన్యులు సైతం చేస్తారు. ఉన్నవాళ్లు  ఉన్నతస్థాయి దానధర్మాలు చేయడం, ఇంకా బాగా ఉన్నోళ్లు గుళ్ళు గోపురాలు కట్టించడం పరిపాటి.  ఒకరు అడిగితే ఇవ్వడం కాక స్వచ్ఛందంగా ధర్మ సంస్థాపనకు ఎవరివంతు వారు కృషిచేయడం ఏనాటినుంచో వస్తున్న సంప్రదాయం. అడిగితేనే సాధించుకోగలం అన్న ఆలోచన గలిగిన మన గురుమూర్తికి ఇది తెలియకేం కాదు. ఇంత సూటిగా ఎవరూ చెప్పడం జరగలేదు, అంతే. 

పళని ఆ కొనదాకా వెళ్లి తిరిగే వరకు చూస్తుండిపోయాడు గురుమూర్తి. అతని మనసు పీట మీద కానీ, దాని కిందున్న డబ్బు మీద కానీ లయించలేదు. ఒక్కసారి తలతిప్పి చుట్టూ ఉన్న వారందరిని చూసాడు. అదేమి మాయో కానీ, అతనికి ఒక్క కస్టమర్‌ కూడా కనపడలేదు. భక్తులే కనిపించారు. ప్రతి భక్తుడిలో దేవుడు కనిపించాడు. పీటకింద డబ్బు తీసి, గబగబా బయటకు నడిచాడు. ఆ డబ్బు ఎందుకో నిప్పులాగా దహిస్తా ఉండింది అతనికి. గది బయట రాగానే మెయిన్‌ హాలులో భక్తుల కోసం ఉంచిన హుండీ వైపు వెళ్ళినాడు. ఎంచనైనా ఎంచకుండా మొత్తాన్ని అందులో వేసేశాడు. ఉద్వేగంతో ఒక్కసారి బిగ్గరగా ’గోవిందా గోవింద’ అన్నాడు. ఎవరు ఎందుకోసం అన్నారో తెలియకపోయినా, అక్కడ గుండు గీయించుకోవడంకోసం వేచియున్న భక్తులు కూడా అందుకున్నారు ’గోవిందా గొవింద, గోవిందా గోవింద’ అంటూ వరుసగా. తెల్లారి బస్సులో తగిలిన రెండు దెబ్బలు గుర్తుకొచ్చాయి గురుమూర్తికి. అప్పుడే అనుకున్నాడు ’ఏందిరా కొండకు రావడంతోనే రెండుసార్లు దెబ్బతగిలిందే. మనం అనుకున్నది కాకుండా దేముడు వేరే ఏదో రాసిపెట్టినాడు ఈరోజు మనకు’, అని.  కానీ రెండునిమిషాల ముందు  కల్యాణకట్టలో పడ్డ మూడో దెబ్బతో పోల్చేంత కావు అవి..!
- ఏ. డి. రంగరాజన్‌  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు