జనాజా

28 Oct, 2018 00:51 IST|Sakshi

కొత్త కథలోళ్లు

అప్పుడప్పుడే తెల్లారుతోంది. అసలే ఎముకలు కొరికే చలి..ఆపై చల్ల గాలి.. ఎంతగా కాళ్లు ముడుచుకుని పడుకున్నా వణుకు తగ్గడం లేదు డ్రైవర్‌ రాముడికి. రాత్రి పడుకునేటప్పుడు బస్సు అద్దాలన్నీ దించేసి.. నిండా దుప్పటి కప్పుకుని  వెచ్చగా పడుకున్నాడు. కానీ ఎక్కడో కిటికీలోంచి వీస్తున్న ఈదురుగాలి తన ఒంటిని వింటినారిలా మార్చేసింది. అప్పుడు అర్థమైంది అతనికి తన ఒంటిపై దుప్పటి లేదని. నిద్ర మబ్బులోనే చేత్తో అటూ ఇటూ తారాడాడు. దుప్పటి కనిపించలా.  గొణుక్కుంటూనే ‘ రేయ్‌ రఫీ...’ అని ఆ మత్తులోనే కేక వేశాడు. బయట బస్సు అద్దాలను కడుగుతున్న క్లీనర్‌ రఫీ ‘ఆ.. అన్నా..’ అంటూ లోనికి వచ్చాడు. దుప్పటి ఏమైందిరా చిటపటలాడాడు రాముడు. ‘ ఇందాకా.. నేనే తీశాలే.. ఇంక లేవన్నా.. తెల్లారుతాంది. అసలే ఆదివారం’ దేవుళ్ల చిత్రపటాల వద్ద ఊదుకడ్డీలు ముట్టిస్తూ సమాధానమిచ్చాడు. అప్పుడప్పుడే ఊర్లకు, పక్కూర్లో బజారుకు పోయేటోళ్లు ఒక్కొక్కరు రోడ్డుపైకి వస్తాండారు. నియోజకవర్గం కేంద్రానికి 15 కి.మీ దూరంలో ఉన్న ఓ పల్లెటూరులో బస్సు నైట్‌ హాల్ట్‌ చేశారు.రాముడు, రఫీ ఇద్దరూ ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్, క్లీనర్‌గా పోతాండారు. ఆ నియోజకవర్గంలో పేరున్న నాయకుడిదే ఆ బస్సు. ఒకటి రెండు కాదు మూడు, నాలుగు బస్సులున్నాయి ఆ లీడర్‌కి.నియోజకవర్గం కేంద్రంగా ఆ చుట్టు పక్కల పల్లెలంతటికీ ఆ ప్రైవేటు బస్సులే దిక్కు. ఆర్టీసీ బస్సులు ఆ రూట్లలో అస్సలు తిరగవు. ఆటోలు తిప్పకూడదని ఆ రౌడీ నాయకుడు పెట్టిన రూలు. ఎవరైనా ఆ రూల్‌ను బ్రేక్‌ చేస్తే అతని వేలు తీయడమో.. రైలు కింద తోయడమో.. ఏదోకటి జరుగుతుంది. అందుకే ఆ రూట్‌లో వెళ్లాలంటేనే ఆటో డ్రైవర్లకు హడల్‌. 

27 ఏళ్ల రాముడు ఏడేళ్లుగా ఆ బస్సుకే డ్రైవర్‌గా పోతున్నాడు. పక్క జిల్లాకు చెందిన రఫీ మూడు నెలల కిందటే క్లీనర్‌గా చేరాడు. డిగ్రీ ఫెయిల్‌ అయ్యాడని నాన్న కోప్పడితే అలిగి పారిపోయి ఇక్కడికొచ్చాడు. ఈ మూడు నెలలకే వాళ్లిద్దరి మధ్య స్నేహం బాగా చిగురించింది. ఇద్దరూ పేదింటివారే కావడంతో సఖ్యత బాగుంది.  కాసేపటికే రాముడు నిద్ర లేచి రెడీ అయ్యాడు. ‘రఫీ.. బస్సును కాసేపు స్టార్టింగ్‌లో ఉంచిరా.. టీ తాగొద్దాం..’ ‘ఆ.. అలాగే అన్నా..’ రఫీ బస్సు స్టార్ట్‌ చేసి కిందికొచ్చాడు. ఇద్దరూ పక్కనే ఉన్న అలీ టీ బంకులోకి వెళ్లారు. ఆ పల్లెటూర్లో అలీ టీ స్టాల్‌ ఒకటే ఉంది.  టీ తాగకముందే ‘రామూ... బస్సు నిండింది రా బ్బా.. పోదాం’ బస్సులోంచి ఒకాయన కేక వేశాడు. వస్తున్నా పెద్దరెడ్డయ్యా అంటూ రాముడు బస్సెక్కాడు. రఫీ టీ డబ్బులు ఇచ్చి రైట్‌..రైట్‌ అంటూ ఈల వేసి బస్సెక్కాడు. ఆదివారం కావడంతో మొదటి ట్రిప్పు నుంచే  ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంది. సినిమాలకు, షికార్లకు పోయే వారు, సెలవని ఊర్లకు వచ్చే వారితో రోజంతా రద్దీతో నడిచింది బస్సు. రాత్రి లాస్ట్‌ ట్రిప్పు తర్వాత బస్సును ఆ లీడర్‌ గోడౌన్‌ ఆవరణలో పార్కింగ్‌ చేశారు. ఆదివారం రోజు బస్సులన్నీ నైట్‌ హాల్ట్‌ అక్కడే. అన్ని బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు అక్కడికి చేరుకున్నారు. టౌన్‌లో ఇళ్లు ఉన్నవారు ఇళ్లకెళతారు. ఊర్లు దూరంగా ఉండేటోళ్లు అక్కడే నిద్రపోతారు. డ్రైవర్లందరూ కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. క్లీనర్లేమో ఆ రోజుకు వచ్చిన డబ్బు గురించి లెక్కలేసుకుంటున్నారు.

ఇంతలో ‘అయ్యా.. నన్నొదిలేయండయ్యా.. ఇంకోసారి ఈ ఇలాఖల కనిపించనయ్యా.. వదిలేయండయ్యా’ అంటూ ఏడుపులు వినిపిస్తున్నాయి.‘ఎవడ్రా కొడకా నువ్‌.. చెప్తాన్నా కూడా వినిపించుకోకుండా మా రూట్లోకొచ్చి ఆటో తోలతావ్‌.. తోలు తీస్తాం కొడకా.. పా.. అయ్య దగ్గరికి పా..రా..నువ్‌’ అంటూ అతన్ని లోపలికి లాక్కెళ్లారు. డ్రైవర్లు, క్లీనర్లు అందరూ లోపలికెళ్లారు. లోపల మహరాజా కుర్చీలో ఠీవిగా కూర్చుని ఉన్నాడా లీడర్‌. మూరెడు సిగరెట్‌ నోట్లో పెట్టుకుని గుప్పు గుప్పు మంటూ పొగ వదులుతున్నాడు. అందరూ చేతులు కట్టుకుని నిలడ్డారు. అప్పటికే విషయం తెలిసిందేమో ఆ లీడర్‌కి పట్టరాని కోపంతో ‘లం.. కొడకా’ అంటూ లేస్తూనే కాలుతో ఆ ఆటో డ్రైవర్‌ దొమ్మలపై తన్నాడు. ఊపిరిబిగపట్టుకుని ‘అమ్మా..’ అంటూ  అంతదూరం పడ్డాడు. లేచే శక్తి కూడా లేదు. ‘నన్నొదిలేయండయ్యా’ పాక్కుంటూ వచ్చి కాళ్లమీద పడ్డాడు.  టైం ఎంతైందిరా అడిగాడు.. పక్కనున్న వాళ్లు ‘‘10.10 అయిందయ్యా...’’ సమాధానమిచ్చారు. ‘‘సరే... నే పోతాన్నా ఈ నా కొడుక్కి ఇంకో కోటింగ్‌ ఇచ్చి పంపించండి’’ అంటూ బయలుదేరాడు. గోడౌన్‌ పక్కనే రైలు పట్టాలు ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ వచ్చే సమయమైంది.. అప్పటికే రైలు గేట్లు పడ్డాయి. అతన్ని పక్కనున్న రూంలో పడేసి రైలు వచ్చే సమయానికి ఒక్కొక్కరు ఒక్కో రాడ్డు తీసుకుని చావబాదుతున్నారు  అతని కేకలు, అరుపులు రైలు శబ్దం మింగేసింది. రైలెళ్లిపోయింది. ఇక్కడ కోటింగ్‌ కూడా అయిపోయింది. 

అక్కడే ఉండి చూస్తున్న రఫీకి కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. ఈ మూడు నెలలకాలంలో వాళ్ల అరాచకం గురించి వినడమే తప్ప చూసింది లేదు. ఫస్ట్‌ టైం చూసేసరికి భయంతో అప్పుడే జ్వరం వచ్చింది. ఆ పక్కనే ఉన్న డ్రైవర్‌ రాముడు ‘ రా రఫీ .. పోదాం అంటూ భుజంపై చేయివేసి పిలుచుకుపోయాడు. రాముడికి అవన్నీ చూసి చూసి అలవాటైంది. రోజు ప్రకారమే ఆ రోజు కూడా మామూలుగా నిద్రపోయాడు.రఫీకి ఎంత చేసినా నిద్ర రావడం లేదు. జ్వరంతో ఒళ్లు వేడెక్కింది. అమ్మా, నాన్న, చెల్లీ గుర్తుకొస్తున్నారు. కళ్ల నుంచి నీళ్లు జలజల రాలిపోతున్నాయి.  రాత్రి 2 గంటల ప్రాంతంలో రాముడికి మెలకువ వచ్చింది. రఫీ కూర్చుని ఉన్నాడు. ‘ ఏం రఫీ... నిద్ర రావడం లేదా..’ అంటూ చేయి పట్టుకున్నాడు. ‘ఒళ్లు కాలిపోతోందే..’ నిద్ర లేచి ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌లోంచి జ్వరం మాత్ర తీసి ఇచ్చాడు. ‘నేను చెప్తానే ఉన్నా ఇక్కడ నువ్వు ఉండలేవని.. వచ్చిన రోజే పో అంటే వినలేదు.. ఇప్పుడు చూడు.. తాగు’ అంటూ గ్లాసుతో నీళ్లిచ్చాడు రాముడు. మాత్ర మింగాక ఏడుస్తూనే ‘అన్నా నే వెళ్తాన్నా.. నాకు ఇక్కడ భయమేస్తాందన్నా.. మా అమ్మా,నాన్న గుర్తుకొస్తున్నారన్నా..’ గట్టిగా హత్తుకున్నాడు. ‘వాళ్లు రాక్షసులు రఫీ.. ఒక్కసారి ఇక్కడికొస్తే మళ్లీ పంపించరు.. పైగా నువ్వేమో వాళ్ల దగ్గర అడ్వాన్స్‌ తీసుకుని ఐపో జేసుకున్నావ్‌.. అది తీర్చాలన్నా ఐదు నెలలు పని చేయాలి..’ అని రాముడు సమాధానమిచ్చాడు. ‘సర్లే ఏదోఒకటి చేస్తాలే నువ్‌ పడుకో’ అంటూ తన దుప్పటి ఇచ్చాడు.  ఏడేళ్లుగా పని చేస్తున్న రాముడికి వాళ్ల గురించి అంతా తెలుసు. రాముడు కూడా చాలా పేదవాడే. ఇంట్లో పెళ్లాం పిల్లల్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. రాముడికి ఇద్దరు పిల్లలు. ఐదేళ్ల పాప. ఏడాది బాబు. రాత్రంతా జాగారం చేసిన రాముడు ఓ నిర్ణయానికి వచ్చాడు. రఫీ బాధను చూడలేక ఏమైనా సరే తన ఊరికి పంపిద్దామని నిశ్చయించుకున్నాడు. తెల్లారుజామునే రఫీని నిద్ర లేపాడు. ‘ఊరికి పోతానంటే పంపించేటోళ్లు కాదు వారు.. ఆ అడ్వాన్స్‌ డబ్బులు నేను కడతాను. ఇదిగో  ఈ నెల జీతం కూడా తీసుకుని పో..’ అంటూ  తన డబ్బులు  కూడా ఇచ్చి ట్రైన్‌ ఎక్కించాడు. 

తెల్లారింది. బస్సు కదల్లేదు.. క్లీనర్‌ లేడన్న విషయం లీడర్‌కి తెలిసింది. ‘నీకు తెలీకుండా వాడు యాడికి పోతాడ్రా.. ఏషాలేస్తున్నావ్‌..’ అంటూ అందరిలాగే ‘కోటింగ్‌’ ఇచ్చారు. దెబ్బలకు రాముడు అల్లాడిపోయాడు. నెల నుంచి ఒక్కరోజు కూడా రెస్ట్‌ లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. ఆపై సమ్మెట దెబ్బలు.. పాపం ఒళ్లు హూనమైంది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. అక్కడేమో డ్యూటీకి పోయినెలైంది.. అంతో ఇంతో డబ్బులతో వస్తాడని రాము భార్య దేవి కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తాంది. నాన్న వస్తాడు... ఏదైనా తెస్తాడని పిల్లల ఆశ. కుంటుకుంటూ.. కళ్లు తుడుచుకుంటూ ఇంటికొచ్చాడు రాము. ‘ఏమైందయ్యా’ అంటూ భార్య ఎదురొస్తానే జరిగిన విషయమంతా చెప్పేశాడు. ‘ఇన్నేళ్ల నుంచి చేస్తాన్న కాసింత కూడా కనికరం లేదా వాళ్లకి’ ...ఒంటిపై ఉన్న దెబ్బలకి ఇంట్లో ఉన్న ఆయింట్‌మెంట్‌నే రాస్తూ.. ఏడ్చేసింది దేవి. ఐదారు నెలలు గడిచాయి.. ఓ రోజు ఇంటర్నేషనల్‌ కాల్‌ వచ్చింది రాము మొబైల్‌కి. దేవి ఫోన్‌ తీసింది. ‘రామన్నా.. నేను రఫీని.. బాగున్నావా’ అన్న మాటలు వినిపించాయి. ‘నేను దేవిని రఫీ.. నువ్వు బాగున్నావా?’ ఆమె సమాధానం ఇచ్చింది. ‘బాగున్నా వదినా.. అన్న యాడికి పోయినాడు.... ‘ఊర్లోనే కూలి పనికి పోయినాడు...’ అని చెబుతూనే జరిగిన విషయం మొత్తం చెప్పి బాధ పడింది దేవి. రఫీ చాలా బాధపడ్డాడు. ‘నా వల్లే అన్న   ఉద్యోగం పోయింది.. ఇన్ని కష్టాలు వచ్చింది.. సర్లే వదిన అన్న వచ్చాక మళ్లీ ఫోన్‌ చేస్తాలే..’ బాధతో ఫోన్‌ పెట్టేశాడు.  ఆరోజు తన ఊరికెళ్లిన రఫీ అన్ని సరంజామా సిద్ధం చేసుకుని కువైట్‌కు వెళ్లాడు. అంతాపోనూ నెలకు 25 వేలు జీతం. మంచి సేఠ్‌ దొరికాడు. మళ్లీ సాయంత్రం రాముడికి ఫోన్‌ చేశాడు రఫీ. ఇద్దరు పలకరించుకున్నారు.గుర్తు పెట్టుకుని కృతజ్ఞతలు తెలిపినందుకు రాముడు.... తన వల్ల అన్ని కష్టాలు వచ్చినా ఒక్క మాట అనకుండా.. ఇంకా తన క్షేమాన్నే కోరుతున్న రాముడి పలకరింపుతో రఫీ .. ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. ఆ మూడు నెలల్లో చిగురించిన స్నేహం మళ్లీ మొగ్గలు తొడిగి... ఫలాల్ని కూడా ఇస్తోంది. ఆపదలో తనను ఆదుకున్న రాముడి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలా భావించిన రఫీ ఆర్థికసాయం చేస్తుండేవాడు. వద్దని చెప్పినా వినకుండా రాముడి కూతురి ట్యూషన్‌ ఫీజుకంటూ ప్రతి నెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో వేస్తుండేవాడు. 

ఐదేళ్లు గడిచాయి. ఓ రోజు రఫీ రాముడికి ఫోన్‌ చేసి ‘అన్నా వచ్చే నెల 10వ తేదీన ఇండియాకు వస్తున్నాను.. 11న వదిన, పిల్లల్ని పిలుచుకుని మా ఊరికి రావాలి.. లేకుంటే నా మీద ఒట్టే’ అన్నాడు.తప్పకుండా వస్తాను రఫీ అంటూ రాముడు మాటిచ్చాడు. వచ్చే మూడు రోజుల ముందు ఫోన్‌ చేసి మా ఇంటి అడ్రస్‌ ఇస్తాలే అని ఫోన్‌ పెట్టేశాడు రఫీ.మరుసటి నెల ఒకటో తేదీ ... రెండు, మూడు.. ఎనిమిదో తేదీ వచ్చింది. రఫీ నుంచి ఫోన్‌ రాలేదు. ఇండియాకు వచ్చే రోజైన ఫోన్‌ చేస్తాడనుకున్నాడు. రాలేదు. 11వ తేదీ ఉదయాన్నే రాముడు తన కుటుంబంతో సుమారు 200 కి.మీ ఉన్న రఫీ ఊరికి బయలుదేరాడు. రఫీ వాళ్లు  నియోజకవర్గ కేంద్రంలో ఉంటున్నారని తెలుసు. పల్లెటూరయితే అడ్రస్‌ తెలుసుకోవచ్చు. టౌన్‌లో అడ్రస్‌ లేకుండా కనుక్కోవడం ఎలాగబ్బా .. అతనేమో ఫోన్‌ చేయకపాయ.. ఎక్కడికని వెళ్లాలి.. ఎలా వెళ్లాలి? రాముడిలో ఆందోళన మొదలైంది. వెళ్లకపోతే ఫీల్‌ అవుతాడేమోనన్న దిగులు పట్టుకుంది. ఏదైతేనేం ఆ ఊర్లో దిగారు. అప్పటికే ఉదయం 11 గంటలైంది. అక్కడ.. ఇక్కడ తిరిగారు. ఓ సారి మాటల్లో  ఏదో మసీదు సందులో అని చెప్పినట్టుగా గుర్తు. పాపం అక్కడికీ చాలా మసీదుల సందుల్లో తిరిగారు. ఊహూ.. కనిపించలేదు. సుమారు రెండు గంటలు తిరిగారు. రఫీ నుంచి ఫోన్‌ మూగబోయింది. వీరికి ఓపిక నశించిపోయింది. 

మధ్యాహ్నం ఏదో హోటల్లో తినేసి పోదామని అనుకుని.. ఓ మసీదు సందు చివర్లో అలసిపోయి కూర్చున్నారు.  అంతలోనే ‘ అల్లాహు అక్బర్‌...’ అజాన్‌ పిలుపులు. వీధి మొదట్లో టోపీలు పెట్టుకుని గుంపులు గుంపులుగా జనాలు వస్తున్నారు. ఆ జనాల మధ్యలో కొందరు ‘డోలీ’ని ఎత్తుకొస్తున్నారు. డోలీలో జనాజా (మృతదేహం) ఉంది. డోలీపైన ఖురాన్‌లోని అక్షరాలతో కూడిన ఆకుపచ్చని రంగు వస్త్రం, దానిపైన ఎర్రని గులాబీ పూలు. వీధంతా జనంతో నిండిపోయింది. పైగా అది పెద్ద బజారు వీధి. డోలీకి ఎదురుపోయే వాళ్లు, అంగట్లో కూర్చున్న వాళ్లు తమ పనులు పక్కనెట్టి ఆ డోలీని తమ భుజాలపై మోస్తూ రెండడుగులైనా వేస్తున్నారు. మళ్లీ వచ్చి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఇక బైక్‌పై పోయేటోళ్లు.. తమ బండిని పక్కన పడేసి మరీ డోలీని భుజాన వేసుకుని కొంతదూరం నడిచి వెళ్లడం.. తర్వాత వెనక్కు వచ్చి తమ బైక్‌ తీసుకుని తమ దారిన తాము వెళ్లడం చేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న రాముకి ఓ సందర్భంలో రఫీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.  

అదేమంటే ఓసారి ఊర్లో రాము, రఫీ బస్సును స్టాండ్‌లో నిలబెట్టి టీ తాగుతున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఎదురుగా ఎవరో ముస్లిం యువకుడి శవాన్ని ఖబరస్తాన్‌కు తీసుకెళుతున్నారు. అది చూసిన రఫీ వెంటనే టీ గ్లాస్‌ను అక్కడ పడేసి తలకు కర్చీప్‌ కట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి కొంతదూరం వరకు ఆ శవ పేటిక (జనాజా)ను తన భుజాలపై మోశాడు. మళ్లీ వచ్చి ఇంకో టీకి ఆర్డరిచ్చాడు. ఇది చూసిన రాముడు ‘చనిపోయింది ఎవరో నీకు తెలీదు.. నీ బంధువు కూడా కాదు ఎందుకలా పాడె మోశావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడు రఫీ ‘ అన్నా.. అతనెవరో నాకు తెలియకపోవచ్చు.. కానీ బతికున్నప్పుడు అతను ఏదో ఒక సందర్భంలో నాకేమైనా సాయం చేశాడేమో.. లేదా నేనేమైనా అతనికి రుణ పడి ఉన్నానో ఏమో.. ఇలా భుజం ఇవ్వడం వల్ల ఆ రుణం తీరిపోతుంది. ఈ రోజు అతన్ని సాగనంపుతున్నాం.. రేపు మేమూ వెళ్లేవాళ్లమే.. ఇక్కడేదీ.. ఎవరూ శాశ్వతం కాదు కదా’ అని వివరించాడు.  

ఆ రోజు మిత్రుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్న రాము వెంటనే తన జేబులోంచి కర్చీప్‌ బయటికి తీశాడు. తలకు చుట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న జనాజాను తన భుజంపై ఎత్తుకుని మసీదు దగ్గరి వరకు అడుగులేశాడు. మసీదు లోపలి ఆవరణలోనే ఖబరస్తాన్‌ ఉంది. మసీదులో ప్రార్థనలనంతరం ఆ ఆవరణలోని ఖబరస్తాన్‌లోనే ఖననం చేస్తారు. రఫీ గురించి అక్కడికొచ్చిన వాళ్లకేమైనా తెలుసుంటుందేమోనని ఒక పెద్దాయనను అడిగాడు రాము. అప్పుడా పెద్దాయన  ‘ఆ రఫీ.. మా అందర్నీ వదిలిపెట్టి  హాయిగా ఎలా నిద్రపోతున్నాడో చూడు’ అంటూ జనాజా వైపు చేయి చూపి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘మూడు రోజుల్లో వస్తాడనగా కువైట్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. సంతోషంగా గుమ్మంలో అడుగుపెడతాడులే అనుకుంటే.. శవమై ఈ శవపేటికలో వచ్చాడయ్యా’ అంటూ ఏడ్చుకుంటూ మసీదులోనికి వెళ్లాడు ఆ పెద్దాయన. తనకు తెలీకుండానే కళ్ల నుంచి నీళ్లు జాలువారాయి రాముడికి. ఒట్టేసి ఇక్కడికి రమ్మని చెప్పింది ‘రుణ’బంధం తెంచుకోవడానికేనేమో.. లేక ఇలా రుణం తీర్చుకోవడానికేనేమో.. అనుకుంటూ మరపురాని జ్ఞాపకాలతో.. బరువెక్కిన హృదయంతో భారంగా కదిలాడు రాముడు.ఈ లోకంలో ‘నేను.. నాది ’ అని కాకుండా ‘మనం.. మనది’ అనుకుంటే ఎవరూ ఒంటరి కాదు... అనాథలే    ఉండరు.. నీ వెంట నలుగురు ఉన్నారన్న సత్యం సమాజంలో చాటి చెప్పేందుకే జనాజా సిద్ధాంతమేమో.            ·
- ఎస్‌. షబ్బీర్‌ హుస్సేన్‌ 

మరిన్ని వార్తలు