బ్యాంకులో ఓ రోజు

19 May, 2019 00:36 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్‌ఫోన్‌కి ఏదో మెసేజ్‌ వచ్చిన శబ్దం గుయ్‌మని వినిపించసాగింది. బద్ధకంగా  మెసేజ్‌ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్‌ నెగటివ్‌ నుండి పాజిటివ్‌కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్‌ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్‌ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్‌ మెంట్‌ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్‌ గా క్లినిక్‌ కి  వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్‌ కాల్‌. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్‌ తన హౌసింగ్‌ లోన్‌ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్‌.మొండి బకాయిల  గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్‌ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్‌ ఆన్‌ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్‌. ఫోన్‌ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్‌లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్‌ గా కాష్‌ కావాలి’ కస్టమర్‌ అభ్యర్ధన. కనెక్టివిటీ  వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్‌ ఉంచుకుని కాష్‌ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్‌ విన్నపం మరియు సలహా.

క్యాషియర్‌ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్‌లో బాలన్స్‌ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్‌లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్‌ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్‌ రాదని ప్రశ్న ప్లస్‌ జవాబు?! ఇంతలో లోన్‌ సెల్‌ నుండి డీవియేషన్‌ అప్రూవ్‌ అయితే గాని హౌసింగ్‌ లోన్‌ క్లియర్‌ కాదని, అర్జంట్‌ గా రమ్మనమని పిలుపు. సింగల్‌ బ్రాంచ్‌ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్‌ ఆఫీస్‌ నుండి కాల్‌. సీజీమ్‌ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్‌ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ నా?!) ‘నేను సింగల్‌ బ్రాంచ్‌ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్‌లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్‌ ఫోన్‌ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్‌ రాలేదు’ ‘లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్‌ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు  ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్‌ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్‌ ‘సిస్టమ్‌ సస్పెన్స్‌ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్‌గా రివర్స్‌ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్‌ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్‌ సర్‌! ఇంకా రెస్టోర్‌  కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్‌ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్‌ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్‌ వచ్చి ‘సర్‌ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’  ‘అదే సర్‌...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్‌ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట.   గబగబా బీఓడీ  చేసి, కాష్‌ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్‌! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్‌ ఇన్‌ఛార్జ్‌ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్‌ కూడా  చెయ్యాలి, గోల్డ్‌ లోన్‌కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్‌ ఇన్‌ఛార్జ్‌. చిరాకు, టెన్షన్‌ తో ఛాంబర్‌లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్‌గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్‌ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా  మరిచిపోయాను ఈ రోజుకి  తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్‌ లెవెల్‌ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం  గ్యారెంటీ.పాసింగ్‌  ప్రారంభించాడు చకచకా.

ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్‌ లోన్‌కి.‘వీటికి లోన్‌ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు  అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్‌ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్‌ హెడ్‌ ఆఫీస్‌ నుండి ...ట్రేడింగ్‌ అకౌంట్‌లో కొంత అమౌంట్‌ లీన్‌ లో ఉందనీ, అది లిఫ్ట్‌ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్‌ అంబుడ్స్‌మెన్‌కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా  ఫోన్‌ వచ్చింది.ట్రేడింగ్‌ అకౌంట్‌ ఆపరేట్‌ చేసేది కస్టమర్, అతడు షేర్స్‌ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్‌ లీన్‌లో పెట్టుకునేది అతడే...షేర్స్‌ అలాట్‌ కానప్పుడు ఆ లీన్‌ లిఫ్ట్‌ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్‌ మేనేజర్‌ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్‌ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్‌ లిఫ్ట్‌ చేయించి ప్రాబ్లెమ్‌ లేకుండా చూసుకోండి’  అని ఫోన్‌ కట్‌ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్‌ అందుకుంటే అది ఖాళీ.బెల్‌ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్‌ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్‌ క్లియరింగ్‌కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్‌ హాల్‌లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్‌ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్‌ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్‌ బాక్స్‌ లో వేశారు. అది శుక్రవారం   ఉదయం వెళ్ళింది. శనివారం నాన్‌ క్లియిరింగ్‌ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్‌లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్‌ అని బోర్డ్‌ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని  కౌంటర్‌లో కాష్‌ ఇన్‌చార్జ్‌ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని  కస్టమర్‌ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్‌ కంప్లయింట్‌ ఇస్తాననే  వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్‌ టైం అవ్వడంతో ఇంట్రవెల్‌ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది.

రమణమ్మకు టిఫిన్‌ తెమ్మనమని చెప్పాడు.బాంక్‌ ఎదురుగా ఓ పాక హోటల్‌ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్‌ పెరిగి హార్ట్‌కి బైపాస్‌ తప్పదేమో? సీనియర్‌ కొలీగ్‌ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్‌ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్‌ అర్జంట్‌ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్‌ బ్రాంచ్‌ లిమిట్‌ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్‌ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్‌ బ్రాంచ్‌కి ఫోన్‌ చేసి రిక్వెస్ట్‌ చేస్తే, చెక్‌ ఎటెస్టు చేసి కస్టమర్‌ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్‌ ట్రాన్జాక్షన్స్‌ క్లోజ్‌ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్‌ బాలన్స్‌ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్‌ క్లోజ్‌ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్‌ నైట్‌.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్‌ ఎంట్రీలు రివర్స్‌ చెయ్యాలంటే స్టాఫ్‌ ఉండాలి. వాళ్లు ఫీడ్‌ చేసాక గాని తను ఆథరైస్‌ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం  ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్‌ నుండి ఫోన్‌ వచ్చింది.‘ఇంకా రివర్స్‌ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్‌ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్‌ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్‌ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్‌. ‘ఒరేయ్‌...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్‌ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్‌ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్‌ లోన్‌ లిమ్మంటారు.బ్రాంచ్‌ షిఫ్ట్‌ చేద్దామంటే నన్నే షిఫ్ట్‌ చేస్తామన్నారు.

పైగా నా వాక్‌ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్‌ చేశావ్‌’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి  చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్‌లోన్‌ ఇవ్వొచ్చూ అంటావ్‌...సరి సరి’ఇంతలో సెల్‌ఫోన్లు గుయ్‌ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్‌ వచ్చినట్టు ఉంది’  అంటూ ఇద్దరూ ఫోన్‌ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్‌.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్‌ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే  నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్‌ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్‌? ఇంకా పదేళ్లు  సర్వీస్‌ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్‌తో వుంటామో లేదో....వున్నా రోగాలతో,  మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల  గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు  సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్‌ లైఫ్‌ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్‌ కాల్, ఓ రెండు మెసేజ్‌ లు వచ్చాయి. వాటికి  తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్‌ చేసాడు.‘క్లినిక్‌ కి వస్తున్నాను’  చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్‌ చెక్‌ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్‌ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్‌ లేదా?’  అంది.సరిగ్గా అప్పుడే సెల్‌ ఫోన్‌ గుయ్‌ మంది.మెసేజ్‌ చూశాడు...బ్రాంచ్‌ ఇన్‌స్పెక్ట్‌ చేయడానికి  ఉదయం ఏడు గంటలకు ఆడిటర్‌ వస్తున్నట్టుగా ఓ వార్త.

∙పక్కి శివప్రసాదరావు  

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు