ఋషి

27 Jan, 2019 00:37 IST|Sakshi

కొత్త కథలోళ్లు

అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు.

‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్‌ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది.

ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్‌రూమ్‌ కట్టారు.గ్రీన్‌రూమ్‌ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్‌ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్‌ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు.

కర్టెన్‌ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్‌రూమ్‌లో ఉన్న మేకప్‌ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్‌కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్‌ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్‌ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు.

మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను  ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్‌ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది.
వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు.

డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ  జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి  ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు.

ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్‌ ఉండాలి.టికెట్‌ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్‌ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు.

మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది.
అల్తి మోహనరావు 

>
మరిన్ని వార్తలు