అడవిలో అలజడి

2 Dec, 2018 01:49 IST|Sakshi

కొత్త కథలోళ్లు

కాకులు దూరని కారడవి కాదు.... చీమలు దూరని చిట్టడవి కాదు....అదొక మామూలు అడవే... కానీ అతి పెద్ద అడవి....ఆ అడవిలో ఒక అలజడి...అది సింహం సృష్టించిన సంహారమా!అది వ్యాఘ్రం విసిరిన పంజాయా!అది ఏనుగులు చేసిన విధ్వంసమా!అది నక్కలు పన్నిన కుతంత్రమా!అది తోడేళ్ళు ఆడిన నాటకమా!అది గద్దలు లేపిన దుమారమా!అది పందికొక్కులు మెక్కిన ఫలహారమా!అవన్నీ ఎలాగూ ఉన్నాయి,అందుకు కాదు అలజడి...మరెందుకు అడవిలో అలజడి రేగింది?ఈ అజెండాతోనే అడవికి రారాజు...మృగరాజు అడవిలోని అతిముఖ్య అమాత్య శేఖరులతో అత్యవసర సమావేశానికి ఆదేశించాడు. ‘‘ఏమిటి! నా అడవిలో అలజడి! నా చట్టం పట్టు తప్పుతోందా! ఏమిటి?’’ అంటూ గట్టిగా గర్జించాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించిన ఆ అడవిలో సింహరాజు చేసిన గర్జన భూదిగంతములంతటా ప్రతిధ్వనించింది. భూకంపం వచ్చినట్లుగా అడవిలోని పక్షులన్నీ భయభ్రాంతులకు గురవుతూ తమ వృక్షావాసాల నుంచి ఒక్కసారిగా రెక్కలు టపటపలాడిస్తూ ఎటో ఎగరిపోయాయి.అడవిలోని అల్ప జంతుజాలమంతా కకావికలమై భూమి కలుగుల్లోనో, చెట్ల పొదల్లోనో ముడుచుకుపోయి దాక్కున్నాయి. మృగరాజు అడిగిన ప్రశ్నకు అమాత్యులేవీ సమాధానం చెప్పడానికి సాహసించలేక మౌనంగా ఉండిపోయాయి.
 
అవి ఉలుకు, పలుకు లేకుండా ఉండడంతో మృగరాజుకు అసహనం కలిగింది. ఏనుగు నుద్దేశించి  ‘‘మత్తేభమా! ఏమిటిదంతా! మాకు తలవంపులు తెచ్చేవిధంగా అడవిలో అలజడి!’’ అని తిరిగి ప్రశ్నించింది.తననుద్దేశించి మృగరాజు అడిగేసరికి మత్తగజానికి మాట్లాడక తప్పలేదు.‘‘నేడు కొత్తగా వచ్చిన అలజడి కాదు ప్రభూ! అడవిలో మన న్యాయం ప్రతిష్టించినప్పటి నుంచి ఉన్న అలజడే. అయితే దాని తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదే మనకు తలనొప్పిగా పరిణమించింది’’‘‘ఏది ఏమైనా మాకిది చాలా సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. ఇదేమైనా మన ప్రత్యర్థుల పన్నాగమంటావా!’’ అంటూ నక్కవైపుతిరిగి‘‘జంబుకోత్తమా! నీవద్దేమైనా సమాచారముందా? కాలికి బలపం కట్టుకొని అడవంతా కలియదిరుగుతుంటావుగా! నీవైనా చెప్పు’’ అంటూ అడిగింది సింహం.ఏనుగు మాట్లాడిన తరువాత కొంత ధైర్యం తెచ్చుకున్న నక్క ‘‘ఏమీ లేదు ప్రభూ! అదే మన అడవి న్యాయం ఇక చెల్లదని కొద్దిమంది అల్పులు కొండలెక్కి, గుట్టలెక్కి అరుస్తూ అఘోరిస్తున్నారు’’నక్క ఇచ్చిన సమాచారానికి సింహం పక్కనే నిల్చున్న పెద్దపులి ఆగ్రహంతో శివాలెత్తి పోయింది.‘‘మృగరాజా! మీరు ఆదేశించండి! ఇప్పటికిప్పుడే వెళ్ళి వాళ్ళందరి భరతం పడతాను. వారేమనుకుంటున్నారు? ఇది అడవి కాదనుకుంటున్నారా! అడవి న్యాయం వద్దనిచెప్పడానికి వారికెన్ని గుండెలు’’ అంటూ పెద్ద పెట్టున గాండ్రించింది. మర ఫిరంగి మ్రోగినట్లుగా వచ్చిన ఆ శబ్దానికి కలుగుల్లోని ఎలుకలు బిక్కచచ్చి ఆంజనేయ దండకం ఆలపించాయి. పులి దూకుడుగా వ్యవహరించి పరిస్థితిని చేయి దాటిపోయేటట్లు చేస్తుందనే ఆందోళనతో ఏనుగు కల్పించుకొని ‘‘వ్యాఘ్ర శ్రేష్టమా! ఆగాగు, అన్ని పనులను దండనతోనే చక్కదిద్దలేము. యుగయుగాలుగానున్న మన చట్టానికి సవాలు ఎదురైనప్పుడు సంయమనంతో వ్యవహరించాలి’’‘‘హా!...చాలు.. చాలు మీ నీతి బోధలు. ఆఫ్ట్రాల్‌ భీతహరిణాలు! మనలను చూసి భయంతో పరుగులు పెట్టే వాటి గురించి ఇంతగా ఆలోచించాలా’’ అంటూ పులి కొట్టిపడేసింది. 

పులి వైఖరి నక్కకు నచ్చలేదు. అయినా పైకి నవ్వు పులుముకుంటూ ‘‘అయ్యా! మృగ శ్రేష్టమా! మీరు తలుచుకుంటే ఏమైనా చేయగల సమర్థులు. అందులో సందేహంలేదు. కానీ మనం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని పెద్దలు వచించియున్నారు. నిజమే! నీవన్నట్లు అల్పులైన హరిణాలు మన కాళ్ళ కింద అణిగి, మణిగి ఉండతగ్గవే. అయితే అవన్నీ కలసి దుమ్ము రేపితే మట్టి మన కళ్ళలో వచ్చి పడుతుంది సుమా! వాటిని నీవు వేటాడుతున్నప్పుడు అవి తెలివిగా అమాంతంగా పరుగెడుతున్న దిక్కుమార్చి నీకు దక్కకుండా తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి గుర్తుంచుకో... ‘‘ఓహో!... మీ నక్క జిత్తులు వదిలించుకున్నారు కాదు. ఈ డొంక తిరుగుడు ఎందుకు? అటో ఇటో సూటిగా తేల్చేయకుండా’’ అని పులి జంబుకం వైపు చురచుర చూసింది. అప్పుడు సింహం కల్పించుకొని ‘‘ఆపండి! మీ వాగ్వివాదం...మనలో మనం కలహించుకోవడానికి కాదు నేను మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది. హరిణాలు లేకుండా మన అడవి మనజాలదు. అలాగే అడవిన్యాయాన్ని అవి కాదనడానికి వీల్లేదు. కావున రెండింటికీ సయోధ్య కుదిర్చే సలహా ఇవ్వండి’’ అంటూ తిరిగి నక్కవైపే చూసింది.సింహమంతటి మృగ మహారాజు తననే సలహా చెప్పమని అడిగే సరికి జంబుకానికి లోలోపల ఆనందం జివ్వున ఉప్పొంగింది. దాన్ని బయటకు కనిపించకుండా ‘‘ప్రభూ! మీ దయాదాక్షిణ్యాల క్రింద బ్రతుకుతున్న భృత్యులం. మీ క్షేమమే మా క్షేమం. అదే అడవికి క్షేమం. అంతకు మించినది మరేముంది!’’ నక్క ఇలా సాగదీస్తూ మాట్లాడుతుంటే చిరుతకు చిర్రెత్తుకొచ్చింది.‘‘అది సర్లే!... మీ భట్రాజుల పొగడ్తలు తర్వాత చేద్దురుగాని. మీ ఆలోచన ఏమిటో తొందరగా చెప్పండి’’ అని అడిగింది. ‘‘మృగరాజ్య శేఖరులారా! నా యోచన ప్రకారం ఆ కురంగముల వద్దకు మన ప్రతినిధిని పంపుదాం. మొదట వారి కోర్కెలేమిటో తెలుసుకుందాం. రాజనీతి గురించి మీకు పాఠాలు చెప్పేటంతటి దాన్ని కాను. సామ, దాన,బేధముల తరువాత ఎలాగూ దండోపాయముందిగా’’ అని పలికింది.ఈ ప్రతిపాదనకు పులితో సహా అన్ని అంగీకరిస్తున్నట్లు తలలూపాయి. అతి చిక్కు సమస్యను తానే పరిష్కరించినట్లుగా నక్క అన్నిటివైపు ఒకసారి కలియజూసి తిరిగి ధీమాగా మాట్లాడింది.‘‘మన అమాత్యశేఖరులలో శాకాహార భక్షకులైన మత్త గజేంద్రమే ఇందుకు సార«థ్యం వహించి కార్య భారాన్ని వహిస్తే మంచిది. ఎలాగూ హరిణాలకు మనపై నమ్మకం లేదు’’ అంటూ మరొక సలహా ఇచ్చింది.‘‘భలే, భలే...భేష్‌! గోమాయువా! అలాగే చేద్దాం. మన కుంజరమును ఆ కురంగముల వద్దకు రాయబారిగా పంపుతున్నాను’’ అంటూ ప్రకటన చేసి మృగరాజు గంభీరంగా అడుగులు వేస్తూ నిష్క్రమించింది.

ఆహా! ఎంతటి శోభాయమానంగా ఉందా దృశ్యం... అడవిలోని హరిణాలన్నీ ఒక్క చోట చేరితే అతి మనోహరం కదా! ప్రకృతిలోని వర్ణాలన్నీ విరబూసినట్లుంది. ఉషోదయాన ఆకుల గలగలల సవ్వడి వింటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో... ఇంద్రధనస్సులోని రంగులన్నింటినీ మేనికి పులుముకున్న ఆ కురంగములు అటూ ఇటూ చక చకా కదులుతూ ఒకటితో నొకటి దరహాస పలికింపులను చూస్తే మనస్సు పులకించక మానదు. వాటి వదనాల్లో లాలిత్యం, లావణ్యం విరజిమ్ముతుంటే... కళ్ళలో అణువణువునా ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోంది. మహిషాసురున్ని వధించి, దశమికి విజయోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైనట్లుందా సమూహం.ఆ హరిణాలు చిన్న చిన్న గుంపులుగా విడిపోయి ముచ్చటించుకుంటున్న సమయంలో ఎవరో వస్తున్నట్లుగా కలకలం రేగింది. ఎవరు? ఎవరు? అని ఒకటి మరొకదాన్ని అడుగుతున్న సమయానికి మృగరాజు పంపిన మదపుటేనుగు భారీకాయాన్ని మోస్తూ, తొండమూపుతూ అక్కడికి వచ్చింది. ఏనుగు తమ సమీపానికి వచ్చేసరికి లేళ్ళన్నీ ఒకే పెద్ద గుంపుగా వచ్చి నిలబడ్డాయి.ఏనుగు వాటికి ఎదురుగా నిలిచి ఒక్కసారి అంతటా పరికించి చూసింది. లేళ్ళ నుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. ఇంతటి భారీ కాయమొచ్చి నిలబడితే అవి పల్లెత్తి మాట్లాడకుండా ఉండడంతో ఏనుగు ఒకింత కోపంతో ఘీంకరించి‘‘మీరంతా ఇలా గుమిగూడడం అడవికి మంచిది కాదు. మీలో దేనికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే అవి ఒక్కొక్కటిగా మృగరాజు వద్దకు వెళ్ళి చెప్పుకోవాలి. అంతేకాని కొండలెక్కి, గుట్టలెక్కిఅలజడికి దిగడం సరికాదు’’ అంటూ ఆయాసంగా పలికింది. ‘‘ఇబ్బంది కాదు మహానుభావా! మత్తగజమా!’’ అంటూ గుంపు వెనక భాగంలోంచి ఒక హరిణం గట్టిగా అరిచింది. అంతటా ముందున్నవన్నీ బాగా చెప్పావని అభినందిస్తున్నట్లుగా కాలి గిట్టలతో నేలకు రాస్తూ,గుర్‌–గుర్‌ మంటూ సకిలిస్తూ వెనక్కి తిరిగి చూశాయి. ‘‘ఇబ్బంది కాకపోతే కష్టం కావచ్చు. అంత మాత్రానికే ఇంత హంగామా చేస్తారా!’’‘‘కాదు, కాదు... కష్టం కూడా కాదు మహాశయా!’’ అంటూ అన్నీ ఒక్క పెట్టున గొంతెత్తాయి.‘‘ఇలా అన్నీ అరిస్తే నాకేమీ అర్థం కాదు. మీలో ఎవరైనా ఒకటి మీ కోర్కెలేమిటో నాకు ఎరుక పరిస్తే, మృగరాజుకు తెలియబరుస్తాను’’ ‘‘అలాగే... అలాగే...’’ అంటూ గుంపు ముందు భాగానున్న హరిణాలలో బంగరు మేని ఛాయతోనున్న ఒకటి మిగతా వాటిని వారించి ఏనుగు ఎదుటికి వచ్చి నిల్చుంది.‘‘గజరాజా! మా మొర అలకించడానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. ఇబ్బందులు, కష్టాలు ఓర్చుకోలేక మేమిలా గుమిగూడలేదు. అవన్నీ  మాకు సహజమే. అంతకు మించిన ఉపద్రవం మామీద వచ్చి పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వేటాడుతోంది. మాలో ఒక్కదానికి మాత్రమే కాదు. మా జాతి జాతంతా నిత్యం భయ భ్రాంతులకు గురవుతోంది. అడవిలో ఆహారానికి వెళ్ళినా, నదీ తీరాలవద్ద నీళ్లుతాగుతున్నా, ఎండకు తాళలేక చెట్ల కింద సేద తీరుతున్నా, చివరకు చెట్టు పొదల్లో విశ్రమిస్తున్నా...మా పిల్లలకు పాలిస్తున్నా...అక్కడ, ఇక్కడ అని లేదు అన్ని చోట్ల మాపై వ్యాఘ్రాల వేట విలయతాండవం చేస్తోంది. మా నీడను చూసి మేమే భయపడాల్సి వస్తోంది’’ అంటూ ఉద్వేగభరితంగా రుద్ధ కంఠంతో విన్నవించింది. ఆ మాటల్లో అనంతకాలంగా గూడుకట్టుకున్న ఆవేదన ఉప్పెనలా పెల్లుబికింది. కాసేపు ఆ హరిణం తనను తాను సంభాళించుకొని కంఠస్వరం మార్చి మళ్ళీ ఇలా చెప్పింది.

‘‘ఏం! ఈ అడవి మాది కాదంటారా! నిర్భయంగా జీవించే హక్కు మాకు లేదా! చెప్పండి’’ అంటూ ఏనుగును నిలదీసింది. ‘‘రెండు రోజుల క్రితం మాలో ఒకటి ఏమరుపాటున ఒక వృద్ధ వ్యాఘ్రం సమీపానికి వెళ్లడమే అది చేసిన పాపమైపోయింది. ఆ వ్యాఘ్రం కండకావరంతో కన్నూమిన్నూ కానకుండా మా దానిపై లంఘించి రాక్షసంగా నొక్కి, రక్కి గాయపర్చింది. మా హరిణం ఎలాగో చావు తప్పించుకుని బయటపడింది. ఈ అన్యాయాన్ని అది నోరు తెరచి మాకు చెప్పడం వల్ల బయటకు తెలిసి వచ్చింది. బయటకు చెప్పలేక మౌనంగా రోదిస్తున్నవీ, కిరాతకంగా బలైనవి మా జాతిలో చాలా ఉన్నాయి. ఇలాంటి అన్యాయాలకు అంతం పలకాలనే మేమిలా చేస్తున్నాం’’ అని దృఢంగా పలికి ఊరుకుంది. ఆ హరిణం చెప్పిన విషయాన్ని సావధానంగా ఆలకించిన ఏనుగు ‘‘ఇంతకీ మీ కోర్కెలేమిటో మాకు విశదం కాలేదు’’ అంటూ ప్రశ్నార్థకంగా చూసింది. అంతా విని సీతకి రాముడికి సంబంధమేమిటో తెలియదన్నట్లుగా ఏనుగు మాట్లాడే సరికి హరిణాలన్నీ ఆగ్రహంతో ఎగరి గంతులేస్తూ‘‘మీకు విశదం కాకపోవడమే మా విషాదం’’ అంటూ తిరిగి బర్‌–బర్‌మంటూ గావుకేకలు పెట్టాయి.‘‘శాంతించండి! శాంతించండి! ఆవేశపడకండి! మనం చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టం చేద్దాం’’ అంటూ ఇంతకు మునుపు వివరించిన ఆ లేడియే మిగతా వాటిని సమాధానపరచి ‘‘మా కోర్కె ఒకే ఒక్కటి. మమ్ములను భయోత్పాతంలో ముంచుతున్న మీ ఆటవిక న్యాయం మాకొద్దు. దాన్ని తిరగరాయాలి. బలాఢ్యులకు చట్టం చుట్టం కారాదు. అడవిలోని జంతువులన్నీ అంతటా సమానమని కొత్త చట్టాన్ని లిఖించాలి. కండ బలంతో మాపై దాడి చేసే మృగమదాంధులను వెలి వేయాలి. ఇలా చేస్తేనే మా అలజడి అగుతుంది. ఇంతే. ఇంతకు మించి ఏమీ లేదు’’ అని తెలియజేసి అడుగులు వెనక్కు వేసి లేళ్ళ గుంపులో కలిసింది. ఏనుగుకు ఏం చేయాలో, ఏమని సమాధానం చెప్పాలో కాసేపు పాలుపోలేదు. కొంత ఆలోచించిన తరువాత‘‘అడవి న్యాయాన్ని అధర్మమనీ, దీన్ని తిరగ రాయమని మీరు అడుగుతున్నట్లు నాకర్థమైంది. ఇది నా చేతిలో లేనిది. మృగరాజుకు విన్నవిస్తాను. ఆపై ప్రభువుల ఇష్టం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని మాత్రం ప్రత్యుత్తరమిచ్చి, తను ఇక చేయగలిగింది ఏమీ లేదని తలచి వెనక్కు తిరిగి భారంగా అడుగులు వేస్తూ వెళ్ళి పోయింది. ఏనుగు కనుమరుగు అయ్యేవరకు హరిణాల గుంపు కదలకుండా నిశ్చలంగా నిలబడి పోయాయి. తమను అధికారం ఆదుకుంటుందా లేదా అనే దానితో నిమిత్తం లేకుండా లోకానికి తమ గోడును వినిపించేటట్లు చేయగలిగామనే సంతృప్తి వాటిల్లో కనిపించింది.

ఆ అలజడి చివరికేమైంది?ఆటవిక న్యాయం అంతమైందా?అధికారం దాన, భేద, దండోపాయాలతో అణచి వేసిందా?ఇవి సమాధానాలు దొరకని ప్రశ్నలని భావించకండి!మాకెందుకులేనని మౌనం వహించకండి!రండి! వెళ్దాం!కాకులుదూరే కారడవికి...చీమలు దూరే చిట్టడవికి...అమ్మో! నాకు భయమేస్తుంది...క్రూరమృగాలు చంపుకుతింటాయి...అంటూ అక్కడే ఆగి పోయారా...ఆ భయం పెనుభూతమై మిమ్మల్ని కూడా వెంటాడుతుంది...
- ఎస్‌. జి. జిజ్ఞాస 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా