‘ఆత్మ’ ఘోష

22 Jun, 2014 02:20 IST|Sakshi
‘ఆత్మ’ ఘోష

నిజాలు దేవుడికెరుక: మెక్సికోలోని జారెజ్ హాస్పిటల్...
 రాత్రి పదకొండు కావస్తోంది. మత్తుగా నిద్రపోతున్న మార్కోకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఊపిరి అంద ట్లేదు. ఒళ్లంతా చెమటలు పోస్తున్నాయి. పక్కనే స్టూల్ మీద ఉన్న మంచినీళ్ల జగ్గును అందుకోవాలని ప్రయత్నించాడు. అందలేదు. ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నర్సునో, డాక్టర్‌నో పిలుద్దామంటే నోరు పెగలడం లేదు. ఇక తన పని అయిపోయిందని అర్థమైంది మార్కోకి. కళ్లు మూసుకుని, ‘‘భగవంతుడా... నన్ను నీ దరికి చేర్చుకో’’ అని మనసులోనే ప్రార్థించాడు. అంతలో...

నుదుటి మీద చల్లని స్పర్శ. ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు మార్కో. ఎదురుగా ఒక నర్సు నిలబడి ఉంది. తెల్లని గౌను, తెల్ల టోపీ పెట్టుకుంది. ఆ తెలుపులోని స్వచ్ఛత ఆమె ముఖంలోను, కళ్లల్లోనూ కూడా కనిపిస్తోంది. తన పరిస్థితిని ఆమెకు వివరించాలని అనుకున్నాడు మార్కో. కానీ అతడి వల్ల కాలేదు. ఊపిరి ఆడటం లేదు అన్నట్టుగా చేతితో సైగ చేసి చూపించాడు. ఆమె వెంటనే తన పనిని ప్రారంభించింది. అతడి ఛాతి మీద రుద్దింది. ఆక్సిజన్ పెట్టింది. ఏవేవో చేసి అతడి ప్రాణాలను నిలబెట్టింది. పావుగంట తిరిగేసరికి లేచి కూర్చున్నాడు మార్కో. కృతజ్ఞతగా రెండు చేతులూ జోడించాడు. చెప్పవద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పిందామె. అతడి రెండు చేతులూ పట్టుకుని... ‘‘దిగులుపడకండి. నేనున్నాను కదా’’ అంది నవ్వుతూ. ఆప్యాయంగా అతడి తల నిమిరి అక్కడ్నుంచి వెళ్లిపోయిందామె. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు మార్కో.
      
 మూడు రోజుల తరువాత...
 ‘‘ఇక నీకే ప్రమాదమూ లేదు మార్కో. నీ ఆరోగ్యం బాగైపోయింది. ప్రశాంతంగా ఇంటికెళ్లిపోవచ్చు.’’
 ఆశ్చర్యపోయాడు మార్కో. ‘‘అదేంటి డాక్టర్... కనీసం నెలయినా పడుతుందన్నారుగా?’’ అన్నాడు నమ్మలేనట్టుగా.
 ‘‘నాకూ ఆశ్చర్యంగా ఉంది మార్కో. నిజం చెప్పొద్దూ... నువ్వసలు మళ్లీ మామూలు మనిషివి అవుతావా లేదా అని కూడా అనుమానపడ్డాను నేను. కానీ అదృష్టంకొద్దీ నీ ఆరోగ్యం సరైపోయింది. నిన్ను ఇప్పుడే డిశ్చార్జ్ కూడా చేసేస్తాను.’’
 ‘‘థాంక్యూ డాక్టర్’’ అన్నాడు మార్కో సంతోషంగా. ఇంటికి వెళ్లడానికి సిద్ధమైపోయాడు. వెళ్లేముందు డాక్టర్‌ని అడిగాడు... ‘‘ఒక్కసారి ఆ నర్సును చూడాలి సర్. తనకి థ్యాంక్స్ చెప్పాలి’’.
 వెంటనే నర్సును పిలిచాడు డాక్టర్. ఆమె వచ్చి మార్కోకి ఎదురుగా నిలబడింది. అయోమయంగా చూశాడు మార్కో. ‘‘ఈవిడ కాదు సర్. మూడు రోజులుగా నైట్ డ్యూటీలో ఉన్నారే... ఆవిడ’’ అన్నాడు చుట్టూ చూస్తూ.
 డాక్టరు, నర్సు ముఖముఖాలు చూసుకున్నారు. ‘‘వారం రోజులుగా నైట్ డ్యూటీలో ఉన్నది నేనే’’ అంది నర్స్. తల అడ్డంగా ఊపాడు మార్కో. ‘‘కాదు కాదు. మీరు వచ్చి వెళ్లిన కాసేపటికి వస్తున్నారు కదా... ఆవిడ. మొన్న చావుబతుకుల్లో ఉన్న నన్ను కాపాడింది ఆవిడే. నేను మనసారా ఆవిడకి కృతజ్ఞతలు చెప్పాలి.’’
 డాక్టర్ చురుక్కున చూశాడు. అతడిలో ఓ చిన్న అలజడి. క్షణం తర్వాత అన్నాడు. ‘‘సారీ మిస్టర్ మార్కో. తనని చూడటం కుదరదు.’’
 ‘‘ఎందుకని? లీవ్‌లో ఉన్నారా?’’
 మాట్లాడలేదు డాక్టర్. ‘‘మీరు వెళ్లి రండి’’ అనేసి వడివడిగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. డాక్టర్ ప్రవర్తన ఉన్నట్టుండి అలా ఎందుకు మారిపోయిందో మార్కోకి అంతు పట్టలేదు. నర్స్ దగ్గరకు వెళ్లాడు.
 ‘‘మీరైనా చెప్పండి సిస్టర్. ఆ నర్స్ ఏమైంది? తన ని కలవడం ఎందుకు కుదరదు?’’... తన ప్రాణాలు కాపాడిన ఆమెకు కనీసం కృతజ్ఞతైనా చెప్పకుండా వెళ్లిపోవడానికి మనసొప్పడం లేదతడికి.
 ‘‘సారీ మిస్టర్ మార్కో. మీరు తనని ఇప్పుడే కాదు... ఎప్పటికీ చూడలేరు. ఎందుకంటే... తను చనిపోయి చాలా యేళ్లయ్యింది.’’
 ఉలిక్కిపడ్డాడు మార్కో. ‘‘ఏమంటున్నారు? తను చనిపోవడం ఏంటి? ఈ మూడు రోజులుగా నాకు సేవ చేస్తూనే ఉంది కదా!’’
 నవ్వింది నర్స్. ‘‘మీరు నమ్మకపోయినా ఇది నిజం మార్కో. మీరు మొదట చెబుతుంటే నేను కూడా ఎవరి గురించో అనుకున్నాను. కానీ తర్వాత అర్థమైంది... తను యులాలియా అని. తను ఎప్పుడో చనిపోయింది. కానీ ఇక్కడే ఉంటుంది. మీలాంటి వాళ్లందరినీ కాపాడుతూ ఉంటుంది. మీకిది కొత్త... మాకు కాదు’’ అనేసి వెళ్లిపోతున్న నర్స్‌వైపు కళ్లార్పకుండా చూస్తూండిపోయాడు మార్కో.
 చాలా యేళ్ల క్రితమే చనిపోయిందా? అయినా ఇక్కడే ఉంటోందా? అంటే తన దగ్గరకు వచ్చింది, తనను కాపాడింది, తనకు మూడు రోజులుగా సేవ చేస్తున్నది దె...య్య...మా? గుండె జారిపోయింది మార్కోకి. ఇక అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాడు. గబగబా వెళ్లిపోయాడు.
 మార్కోకి ఎదురైన ఈ అనుభవం ఆ ఆసుపత్రిలో చాలామందికి ఎదురయ్యింది. అక్కడనే కాదు... మెక్సికోలోని చాలా హాస్పిటల్స్‌లోని రోగులకు ఎదురయ్యింది. యులాలియా ఆత్మ ఓ నమ్మలేని నిజమై పలువురిని భయపెట్టింది. ఇంతకీ ఎవరా యులాలియా?
     
 1930 ప్రాంతంలో పేరు పొందిన నర్స్ యులాలియా. జారెజ్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న ప్రతి రోగీ ఆమె గురించి కథలు కథలుగా చెబుతారు. నవ్వు చెదరని ముఖం, కరుణను కురిపించే కళ్లు, ప్రేమను కుమ్మరించే మాటలు, ఆప్యాయత నిండిన స్పర్శ, ఎంతటి సేవనైనా చేసే ఓర్పు... ఇవన్నీ కలిస్తే యులాలియా. ఆమె ఎప్పుడూ మిలమిలలాడే తెల్లటి యూనిఫామ్ వేసుకునేది. ఎంత పని చేసినా ఇస్త్రీ మడతలు నలిగేవే కాదు. అందుకే ఆమెను అందరూ ‘లా ప్లంచాడా’ అనేవారు. అంటే ‘ఇస్త్రీ బట్టలు వేసుకునే అమ్మాయి’ అని అర్థం.
 
 సేవ చేయాలనే దృక్పథంతో చిన్న వయసులోనే నర్స్ అయ్యింది యులాలియా. జారెజ్ ఆసుపత్రిలో పనికి చేరాక కొద్ది రోజుల్లో పేరు తెచ్చుకుంది. ఎదుటివారికి సేవ చేయడానికే జీవితం అన్నట్టుగా ఉండేది. ఆమె చేయి పడితేనే తమ వ్యాధులు సగం తగ్గిపోతాయనేవారు రోగులు. డాక్టర్లను మించి గౌరవించేవారామెని. అలాంటి యులాలియా జీవిత ం... ఓ ఊహించని మలుపు తిరిగింది. జారెజ్ హాస్పిటల్‌కి ఓ అందమైన యువ డాక్టర్ వచ్చాడు. అతడు యులాలియా మీద మనసు పడ్డాడు. అతడి మాట, మంచితనం చూసి యులాలియా కూడా అతడిని ప్రేమించింది. అతణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. యులాలియాకి మంచి జోడీ దొరికిందని అందరూ సంతోషించారు.
 
 అంతలో ఓ రోజు... కాన్ఫరెన్స్‌కి హాజరు కావడానికి వేరే నగరానికి వెళ్లాడతడు. రెండు రోజుల తరువాత రావలసినవాడు రెండు వారాలైనా రాలేదు. ఏదైనా పనివుండి ఆగాడేమో అనుకుంది యులాలియా. కానీ ఎంతకీ రాకపోవడంతో అతడికేదైనా ప్రమాదం జరిగిందేమోనని అల్లాడిపోయిందామె. అంతలో ఓ రోజు పోస్ట్‌లో ఓ పెళ్లి కార్డు వచ్చింది యులా లియాకి. అందులో తను ప్రేమించినవాడి పేరు చూసి షాకైపోయింది. కాన్ఫరెన్‌‌సలో పరిచయమైన ఓ అమ్మాయిని తాను పెళ్లాడబోతున్నానంటూ అతడు రాసి పెట్టిన ఉత్తరాన్ని చూసి ఆమె హృదయం ముక్కలైపోయింది. పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది. గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్చింది.
 
 నెలలు గడిచినా అతడు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోయింది యులాలియా. రాత్రీపగలూ అతడి ఆలోచనలతోనే గడపసాగింది. నిబద్ధతకు మారు పేరైన ఆమె... రోగులను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టింది. అణచుకోలేని బాధ అణువణువునూ కాల్చేస్తుంటే... రోగుల బాధలను పట్టించుకునే ఓపిక ఆమెకు లేకపోయింది. దాని కారణంగా ఒక రోగి ప్రాణమే పోయింది. యులాలియా నిర్లక్ష్యమే అతడి ప్రాణం తీసిందంటూ రోగి బంధువులు గొడవకు దిగేవరకూ తాను ఏ స్థితికి దిగజారిపోయిందో యులాలియాకు అర్థం కాలేదు. సేవ చేసేందుకు నర్స్‌గా మారిన తాను... ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారణమయ్యానన్న బాధ ఆమెను తొలిచేసింది. ఆ వేదన ఆమెను దహించి వేసింది. బెంగతో మంచం పట్టింది. ఓ పక్క ఓడిపోయిన ప్రేమ ముల్లులా గుచ్చుతోంది. మరోపక్క వృత్తికి తాను చేసిన ద్రోహం శూలమై పొడుస్తోంది. తనలో తనే కుమిలి కుమిలి కృశించిపోయింది యులాలియా. చివరకు ఆ వేదనతోనే... ఆ ఆసుపత్రిలోనే... మానసికవ్యాధితో మరణించింది. అయితే ఆమె కథ అక్కడితో ముగిసిపోలేదు.
 
 చనిపోయిన నాటి నుంచీ జారెజ్ ఆసుపత్రిలో చాలాసార్లు, చాలా చోట్ల, చాలామందికి నర్స్ యూనిఫామ్‌లో కనిపించేది యులాలియా. రోగులను కనిపెట్టుకుని ఉండేది. మొదట్లో ఈ విషయాన్ని ఎవరూ గమనించుకోలేదు. కానీ కొందరు ఒక నర్సు తమను ప్రేమగా చూసుకుందని చెప్పడంతో స్టాఫ్‌కి అనుమానం వచ్చింది. రోగులు చెప్పిన గుర్తులను బట్టి ఆ నర్సు యులాలియానేనని నిర్ధారించుకున్నారు. దానికితోడు స్టాఫ్‌కి కూడా పలుమార్లు యులాలియా కని పించేది. అయితే ఎవరికీ ఏ కీడూ చేసేది కాదు. పైగా యులాలియా సేవ చేసిన ప్రతి రోగీ ఆశ్చర్యకరంగా వ్యాధి నుంచి బయటపడేవాడు. ఇంకా విచిత్రమేమిటంటే... జారెజ్ ఆస్పత్రిలోనే కాదు, మెక్సికోలోని చాలా హాస్పిటల్స్‌లో కనిపించేదామె. బహుశా... తన నిర్లక్ష్యంతో రోగిని చంపినందుకు ఇలా పాప పరిహారం చేసుకోవాలని చూస్తోందేమో అనుకునేవారు ఆసుపత్రుల వారు. మెల్లగా యులాలియా ఆత్మను చూసి భయపడటం మానేశారు.
 
 కానీ ఒక్కోసారి మాత్రం యులా లియా ప్రవర్తన జారెజ్ ఆస్పత్రి సిబ్బందికి కాస్త భయం కలిగించేది. ఒక్కోసారి తాను మంచాన పడి మరణించిన గదిలో ఓ మూల కూచుని కనిపించేది యులాలియా. కాలి బూడిదైన కలలను చూసి కన్నీళ్లు పెట్టుకునేదో... మోసపోయిన మనసును ఓదార్చలేక కుమిలి కుమిలి ఏడ్చేదో... వృత్తికి ద్రోహం చేశానన్న పాప భారాన్ని మోయలేక ఆవేదన చెందేదో తెలియదు కానీ... గుండెలవి సేలా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ రోదన ఎంతో భయానకంగా ఉండేది. విన్నవారి గుండెల్ని పిండేసేది. ఆ ఘోషను వినలేక దేవుడు ఆమె ఆత్మకు విముక్తి కలిగించాడో ఏమో... కొన్ని సంవత్సరాల తరువాత ఉన్నట్టుండి యులాలియా కనిపించడం మానేసింది.  ఓ చేదు జ్ఞాపకమై మిగిలిపోయింది!
 - సమీర నేలపూడి

మరిన్ని వార్తలు