ఒక గంగిరెద్దు ఆత్మకథ!

10 Jan, 2016 06:32 IST|Sakshi
ఒక గంగిరెద్దు ఆత్మకథ!

స్వగతం
ఎప్పటిలాగే... ‘అయ్యగారికి దండం అమ్మగారికి దండం. అన్నగారికి దండం... అక్కగారికి దండం అటు పోయేవాళ్లకు దండం...ఇటు వచ్చేవాళ్లకు దండం’
పాపం కిషన్ చందర్ ఎంత మంచివాడు. మనం తిట్టుకు పర్యాయ పదంగా వాడుతున్న ‘గాడిద’కు కూడా ఒక మనసు ఉందని, దానికీ ఒక ఆత్మ ఉందని గ్రహించి ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ డాంకీ’ పుస్తకం రాశాడు. గాడిద కంటే నేను ఏ రకంగానూ తీసిపోను. మరి నా ఆత్మకథను ఏ ఒక్కరూ  ఎందుకు రాయలేదో తెలియదు. ఆత్మకథ భాగ్యం ఎప్పుడో తెలియదుగానీ...ముందైతే నా కడుపులో బాధ చెప్పుకుంటా...
 
గంగిరెద్దు అవతారం ఎత్తిన నాటి నుంచి అవసరమైన వారికి అవసరం లేనివారికి, అర్హత ఉన్నవారికి అర్హత లేని వారికి దండాలు పెడుతూనే ఉన్నాను. దండాలు పెట్టి పెట్టీ మెడంతా ఒకటే నొప్పులు. ‘బాస్...ఆస్పత్రికి తీసుకెళ్లు’ అని అడుగుదామనుకున్నా....వారం రోజుల నుంచి చలి జ్వరంతో ఊగిపోతున్నాడు మా బాసు బంగారయ్య...పేరుకు బంగారయ్యేగానీ  చేతిలో చిల్లిగవ్వలేక ఆస్పత్రికి వెళ్లలేకుండా ఉన్నాడు.

అతనికే దిక్కు లేదు. ఇక నన్నేం తీసుకువెళతాడు?!
 ‘మన సంస్కృతి గొప్పది. గంగిరెద్దుల ఆట మన సంస్కృతిలో భాగం’ అని చాలామంది పెద్దోళ్లు  మైకు ముందు కోస్తుంటారు. మన సంస్కృతి గొప్పదే కావచ్చు. కానీ మా గంగిరెద్దోళ్ల పరిస్థితి గొప్పగా లేదు సరికదా....తిప్పలే తిప్పలు. తాతల కాలంలో  ఉన్న పెద్ద గుడిసెలు, బంగారయ్య నాయిన కాలానికి చిన్న గుడిసెలయ్యాయి.
 
ఇక మా బంగారయ్యకు  ఆ చిన్న గుడిసె కూడా మిగల్లేదు. ఒంటి మీద చిరుగుల నల్లటి కోటే ఆస్తైపోయింది. సన్నాయి పాటే జీవనరాగమైంది. సంచారమే లోకమైపోయింది. మీకో వింత విషయం తెలుసా? భారతీయ సంస్కృతిలో భాగమైన ఒక జానపదకళకు ప్రతినిధి అయిన బంగారయ్యకు...ఓటు హక్కు కూడా లేదు. నా మీద తప్ప....అసలు అతనికి ఏ హక్కు ఉందని?
   
ఆరోజులు ఎలా ఉండేవి?
కొండంత విజయగర్వంతో పంటలన్నీ ఇంటికొచ్చేవి. పంట కళ రైతు ఇంటికళను రెట్టింపు చేసేది.
 ‘అయ్యవారికి దండం’ అన్నామో లేదో మా బాసుల జోలెలు నవధాన్యాలతో  నిండేవి. ఇది చూసి  మేము సంతోషంగా ఎన్నెన్ని డ్యాన్సులు చేసేవాళ్లమో.
 చుట్టూ చూసేవాళ్లు చప్పట్లు కొట్టడానికి మా బాసు నన్ను తన గుండెల మీదికి ఎక్కించుకొని-‘ఆడర బసవా’ అని అరుస్తుంటాడు. నలభై నాలుగు కిలోలు కూడా  లేని బంగారయ్య గుండెల మీదికి ఎక్కాలంటే  మనసు రంపపు కోతకు గురవుతుంది.

బాధతో  దూరంగా నిల్చొంటే, నేను తన మాట వినడంలేదన్నట్లు  కళ్లెర్రజేస్తాడుగానీ నా కడుపులో బాధ అయితే పట్టించుకోడు. అందుకే మనసు చంపుకొని అతని గుండెలపై నృత్యం చేస్తాను. గుండెల మీద ఉన్నందుకేమో...అతడి గుండెల్లో బాధ చాలా దగ్గరి నుంచి చూడగలుగుతాను. ఆరోజులు- ఈరోజులు అంటూ  బేరీజు వేసుకుంటాను.
 
ఇప్పుడు వర్షాలే లేవు. పంట ఇంటి ముఖం చూడక ఎంత కాలమవుతుందో. రైతు కంట్లో కళ లోపించి ఎంత కాలం అవుతుందో! ‘అయ్యవారికి దండం పెట్టు’ అని మా బాసు అన్నాడో లేదో ‘వెళ్లవయ్య వెళ్లు’ అంటున్నాడు రైతు. పచ్చని పల్లె ఎడారై పోయింది. అందుకే తల్లిలాంటి పల్లెని విడిచి మా బంగారయ్య నన్ను పట్నానికి తీసుకువచ్చాడు. ఊళ్లో ప్రతి ఇంటికి మేము పండగ చుట్టమే. ఈ సిటీలో పేవ్‌మెంట్లు, రైల్వే ఓవర్ బ్రిడ్జీలే మాకు దిక్కయ్యాయి.

ఐటమ్ సాంగ్‌లకు అలవాటు పడిపోయిన కళ్లు... నేను  డ్యాన్స్ చేస్తుంటే ‘ఐతే ఏంటి?’ అని వెక్కిరిస్తున్నాయి. గంగ్నమ్ డ్యాన్స్‌ల కాలంలో గంగిరెద్దుల డ్యాన్స్ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేకపోయినా, నాకోసం కాకపోయినా, మా అయ్యవారి కోసం, పండగ రోజుల్లోనైనా అతను పస్తులు ఉండకుండా చూడడం కోసం.... డ్యాన్స్ చేస్తూనే ఉంటాను....ప్లీజ్ ఇప్పటికైనా నా ఆత్మకథ ఎవరైనా రాయరూ!
 - యాకుబ్ పాషా

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా