కలలోనూ తనే గుర్తొస్తోంది!

4 Aug, 2019 09:38 IST|Sakshi

కొత్త కథలోళ్లు

ఏంటీ?! రొయ్యిలమామ్మ రొయ్యిలమిల్లు ఓనర్ని ఏసెయ్యాలనెళ్ళి దొరికిపోయిందా!.. నాయనో.. ఆశ్చర్యంతో, ఒకింత భయంతో నేను నోరువెళ్ళబెట్టుండిపోయాను. కేసు పెట్టేసారా మరీ...పాపం మామ్మమీదా! అన్నాను మళ్ళీ నేనే.. 
‘నేదండి. ఆ యమ్మి అదుట్టం కొద్దిగీనీ ఓన్రు యాపారం పనిమింద అయిద్రాబాదెల్నిడంట. ఆయ్‌.. ఈ అమ్మికా అజలేక రేత్రంతా కాపుగాసేసిందంట..కిరషనాలీబుడ్డీ, అగ్గిరవ్వల పెట్టీ అట్టుకునీ. తెల్లారగట్ల అట్టుకుని సెట్టుక్కట్టేత్తేనీ...ఓన్రు బారియా కాపాడి కుర్రోళ్ళని కుంకలేసి, ఓన్రుకీ గట్టా తెలీనివ్వొద్దనీ సెప్పి మా మావని కాకేసి లెక్కిచ్చి, మామ్మని కూతురింట్ల ఒగ్గేసి రమ్మని అంపీసిందండీ.. ఆయ్‌’ అందా ముక్కు పుడక పిల్ల. ‘ఇంక రాదా ఇటూ’ నా ప్రశ్నలో నీరసాన్ని అర్థం చేసుకున్న ఆ పిల్ల ‘ఉండండే... మా తాతిబాబయితే మీకివరంగా చెప్పేత్తాడు ఈ ఊసంతానీని. కాకేసికొచ్చేత్తానే’ అంటూ పల్లె కాలనీలోకి దూసుకు పోయింది ఆ పిల్ల. ఈ లోగా నా మనసెందుకో పోయినేడాది ఉగాదినాటికి పరిగెత్తింది.

తెల్లవారితే ఉగాది... పూర్ణాలకి పప్పునానేసానా? పుల్ల మామిడికాయ కూర్లమ్మి తెస్తుందా లేదా...మిషనోడి దగ్గరుండి పోయిన పిల్లాడి చొక్కా ఎలా వస్తుందో....లాంటి తలంపులతో ఉండగా తెల్లారగట్ల గట్టి కునుకు పట్టింది. ఆయ్‌.. రొయ్యలూ.. సేప్పలూ.. మట్టగిడసలండోయ్‌.. రాండ్రాండీ.. బేగిరావాలండో.. దూరం నుండి మొదలైన రాగయుక్తమైన కేక నా చెవుల్లో ‘బేగిరావాలండోయ్‌...య్‌...య్‌’ అని గట్టిగా ప్రతిధ్వనించగా ఉలిక్కిపడి లేచాను ఆ రోజు. టైం చూస్తే ఆరయింది. గబగబా మంచం దిగి ఎదవాకిలి దగ్గరకొచ్చి వీధికి ఆ చివర ఈ చివరా పరీక్షగా చూసాను. ఊహూ..ఇది నా భ్రమే! ఇదేంటిలా! మరీ సొంతమనిషిని మిస్సయినట్టూ, రొయ్యిలమామ్మ కోసం ఈ కలవరం ఏంటీ....ఛ...తల విదిలించాను.

ఛా..ఏముందీ? తనకి ఉగాది పచ్చడంటే భలే ఇష్టం. రొయ్యిలమామ్మ సరుకు తేకుండా ఒట్టి చేతుల్తో కనపడేది ఒక్క  ఉగాదిక పండక్కి మాత్రమే. అత్తమ్మ చేసిన ఉగాది పచ్చడి తిని, కాస్త ఇంట్లో కొడుక్కీ, తాతకీ తీసికెళ్ళేది. అందుకే ఈ రోజు తన ఆలాపన ఎక్కువై ఇలా భ్రమ కల్గింది. ఎందుకు రావట్లేదు ఈ ఆర్నెల్లుగా! ప్చ్‌..మా అత్తమ్మా, నేనూ ఒకే ప్రశ్నని ముఖాన వేలాడేసుకు తిరుగుతున్నాం..‘రొయ్యిల మామ్మ ఏమైనట్టూ?’ అని.
ఒహ్‌.. రొయ్యల మామ్మ!. ఏమాత్రం కండ కనపడని బక్కపల్చటి దేహం. కాళ్లకి వెండి కడియాలు. చేతికి ఎర్రటి మట్టి గాజులు. తలగుడ్డ మీద స్టీల్‌ బేసినులో రొయ్యలు, చిన్నచేపలూ కలిపితెచ్చేది. తాజా సరుకు. మా వీధి వీధంతా మామ్మ కేకతో నిద్ర లేచేది. మామ్మ కూరతోనే ముద్ద దిగేది. అలాంటి మామ్మ ఏమైపోయిందో...మా పేటంతా పేగు మాడ్చుకు చూస్తుందంటే నమ్మాలి..రొయ్యిలమామ్మ కోసం!
నాకు పెళ్ళైమూడు రాత్రులు అయ్యాకా  తెల్లారే మా అత్తగారు  వంటిట్లో పీటవేసి నన్ను కూర్చోబెట్టి కాఫీ కలుపుతూ ‘ఇదిగో పిల్లా...మా సన్యాసికి అన్ని కూరగాయల్లోనూ ఓ రొయిపీసు అడందే ముద్ద దిగదు. ఏదొక కాయగూరల్లో నాలుగు రొయ్యిలు కలుపేసె డితే ఆనందంగా తిని లేస్తాడు. అదే గుప్పీడు రొయిపప్పులో కొబ్బరి పాలేసి ఒండావనుకో పరమానందంగా తింటాడు. ఇగ గుడ్రొయ్యలు తెచ్చిన్నాడైతీనీ పెద్దపండగే పిచ్చినాగన్నకి. నువ్వు ఏపుళ్ళూ, సార్లూ...ఎడితే మాత్రం మనల్నయితే ఏవనడు గానీ... డొక్కా, మొగమూ  ఒకే సారీ మాడ్చేసుకుంటాడు. ఆ...గుర్తెట్టుకో. ఎనకటికి ఎవడో...కుడుమిస్తే పండగ అన్నాడంట గానీ  మా ఓడికి మాత్రం రొయిపీసడితేనే  పండగమో. పక్కమ్మటియ్యన్నీ ఆనవు ఆడి సూపుల్కి. ఆ...అంటూ  ఆయన కడుపులోంచి మనసుకు స్టెయ్రిట్‌ రూట్‌ చూపిస్తూ  ‘రొయ్యోపదేశం’ చేశారు.

దాంతో రొయ్యిలమామ్మ కోసం ఎలర్ట్‌గా ఉండటం తప్పనిసరైంది నాకు.
నాకు తెలీని కూరలెన్నో చేసేవారు అత్తమ్మ రొయ్యలతో. వంకాయలో వేసి కాస్త చింతపులుసు పిండితే అద్భుతంగా ఉండేది కూర. గోంగూర లో అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. నన్నేనాడూ అలారం ఆధారంగా లేవనీయలేదు రొయ్యిల మామ్మ.  ‘ఆయ్‌..రొయ్యిలే..సేప్పలోయ్‌...సేప్పలే రొయ్యిలండోయ్‌’..అంటూ తిప్పితిప్పి తీసే రాగాలకే లేచేసేవాళ్ళం. పండగకు వచ్చిన తమ్ముడు ‘ ఏంటక్కో..మీ ఊర్లో రొయ్యలే చేపలంట, చేపలే రొయ్యలంట ఎట్నే’..  అంటూ నవ్వేవాడు.
రొయ్యిల మామ్మని పలకరించటానికే మా అత్తమ్మ గబగబా మంచందిగేవారు. నీకు ఈ పేట పేటే రెగ్గులర్‌ కట్టమరూ అంటుంటే...మామ్మ తన తల గొంతుక్కూర్చునోనున్న మోకాళ్ళకి తగిలేలా ఒంచి ఓ నవ్వు నవ్వేది. ఇక మా ఆడబిడ్డలొచ్చినా మామ్మ చుట్టూ చేరి బంధువుల్లా ముచ్చట్లేసుకునేవాళ్ళు. మా టౌనులో ఇలాంటివి చూడక ముందు ‘అతి’గా  అనిపించేది..అక్కడ గుమ్మమే ఎక్కరు..ఇక ఇలా మనసుల్లోకి చొచ్చుకు పోవటమా! సమస్యేలేదు.

పెళ్లయిన కొత్తలో రొయ్యలు తీసుకుంటుంటే ..‘అసల్కే కొత్తపెళ్ళికూతురువి. నువ్వు సెయ్యెట్టమాక. నేను అలా నాలుగీదుల్లో ఈ బేసినా తిరగెట్టేసి ఒచ్చి సేసిచ్చేత్తాను. అత్తమ్మ కుంచుం  పసుపు...ఉప్పుగల్లు, వర్రా అడేసి . నిప్పులమింద ‘ఆగిలి’ పెట్టేసుంచుతాది. మాపటేలకూడా ఒండుకోవచ్చును. పోడవ్వవు. ఆయ్‌’ అనేది మామ్మ. మామ్మ  రాగానే నేను టీ ఇస్తూండేదాన్ని. అపుడపుడూ టిఫినూను..  ‘నీ అమ్మ కడుపు చల్లగా ఏడేడి టీ సుక్కలిత్తావు తల్లీ రోజుకీని. ఉండు నీకు రేపు సింతసిగరట్టుకొచ్చేత్తాను మా సూరిని ఎక్కి దులపమనేసి...నాలుగు రొయ్యిలడేసి ఒండుకుందురు గాని.  మా సెడ్డ రుసి. ఆయ్‌’  అంటూ తనకు వీలున్న వరాలు ఇచ్చేది. మామ్మకి  నా చీరలు ఇస్తుండేదాన్ని. ‘ఇద్దరూ పేణం పెడతారమ్మా నేనంటేని...ఏనాట్దీరుణమో గానీని’ అని మురిసిపోయేది. అందరం చల్లగుండాలని తెగ దీవించేది.

తను చాలా శుచిగా శుభ్రంగా ఉండేది. అందుకే మోకాలినొప్పి వల్ల అత్తమ్మ మా బాబుకి 6 నెలలు నీళ్ళు పోయమని మామ్మని పురమాయించితే నేనేమీ అభ్యంతరపడలేదు. స్నానం చేయించి సాంబ్రాణి పొగ పట్టిస్తూ..‘గొప్ప గుణాల్తో అందరికంటే ఎత్తుకెలి పోవాల బాబయ్యా నువ్వు’ అంటూ దీవింపులిస్తూనే ఉండేది.
కొడుకు కాలేజీ చదువుతున్నాడని అనేది.
‘చదువు ఆపకు మామ్మా, నీ కొడుకు చదివి ఉద్యోగం చేస్తే నువ్వు కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు’ అని అత్తమ్మ అనేవారు.
‘నాదీ అదే ఆశండీ. ఆయ్‌.. బాగా సదువు తాడని పెద్ద పేరండి ఆడికి. పొద్దున్నే నాకు ఏటిచ్చేసి, కసిన్ని టీ నీళ్ళు తాగేసి కాలేజ్జీకి పోతాడమ్మా. ఆయ్‌. రేత్రిపూట రొయ్యలు మిల్లు కాడ ఆ పని ఈ పని అందుకుంటా ఉంటాడు. ఈడంటే ఎంతిట్టమో ఓన్రుగోర్కి. ఈడ్ని నమ్మెచ్చురా అంటా ఉంటాడంట అందరరితోనీని. మాచెడ్డ కట్టజీవండీ మా బుల్లోడు.ఆయ్‌’..అని మురుసుకుంటూ కొడుకు సూరి గురించి ఎంతసేపైనా చెప్పేది. మా తమ్ముడి బట్టలు తెప్పించి అతనికి పంపుతూ ఉండేదాన్ని.
‘తాతే పోయుంటాడు. కట్టుబాటుకొద్దీ ఆర్నెల్లు ఇల్లు కదలొద్దనుంటారు’  అంటూ తేల్చారు మా అత్తమ్మగారు మామ్మ రాక కోసం చూసీ చూసీ.

ఉగాదికి బాగా ముందు ఓ మధ్యాహ్నం వేళ రొయ్యిలమామ్మ ఖాళీ చేతులతో చిక్కి సగం అయిన దేహంతో  మా గుమ్మానొచ్చి కూలబడింది. ఖాళీ చేతులంటే...అటు సరుకూలేదు, ఇటు ఎర్రని గాజులూ లేవని! ముఖమూ, మనసూ ఖాళీ పెట్టుకుని వచ్చిందని తెలిసిపోతూనే ఉంది.
నేను మంచినీళ్ళు తెచ్చేసరికే అత్తమ్మా, మాధవ్‌గాడూ మామ్మ చుట్టూ చేరారు ’ఏమైపోయావ్‌’ అంటూ. మామ్మ నీళ్లు తాగుతూనే ఘొల్లు ఘొల్లుమని  ఏడవసాగింది.
‘ఊరుకో ఊరుకో. తాతేనా... మరి వయసయిపోయాక ఎల్లకాలం ఉండిపోతారా ఏంటి!’ అంటూ మామ్మ భుజాలు రాస్తూ అత్తమ్మ అనునయించారు.
‘మామ్మా టీ తాగు. కొడుకు కోసమైనా నువ్వు మంచిగా తిని ఉండాలి. ఇలాగైతే ఎలా!’  అన్నాను గ్లాసు అందించి పీక్కుపోయిన ఆ ముఖం చూస్తూ. మామ్మ అమాంతం నా చేతులు పట్టుకుని బిగ్గరగా ఏడుస్తూ ‘ఇంకెక్కడి కొడుకు తల్లీ. ఆడు అర్థంతరంగా నరకానికి పయనమై పోతేనీ’ అంటూ  వెక్కిళ్ళు పెట్టింది.
‘హయ్యో ! ఏంటి ఎలా జరిగిందీ ఘోరం’ అంటూ నేనూ చతికిలపడ్డాను.

‘నా బిడ్డరతనం తల్లీ. ఆడి  మంచితనమే ఆడిని ఎత్తుకెళ్లి పోయింది అమ్మలాల. రేత్తిర్లు రొయ్యల మిల్లు ఓన్రు కాడ ఉంటాడని సెప్పా కదమ్మా. ఈడంటే నమ్మకం మీద ఆ పనికి పనికి ఈడ్ని ఒక్కడినే ఇంటికి పంపీవోడు ఆ ఓన్రు. ఆయ్‌. ఈలోగానేమోంచీ...ఆరి బార్యాగారి సెల్లి మన టౌనెమ్మట ఇంకో కులపోడిని పేమించి పెళ్ళాడీసిందంటండి. ఒద్దన్నగాటికీనీ. ఆనక్కి కుద్ది రోజులకి ఆపిల్ల  అమ్మా,అయ్యా ఒప్పుదల కొచ్చీరుగానీ ఈ ఓన్రు బాబు మాత్రం అగ్గిమీదగుగ్గిలం ఐపోయి, కులం సెడ్డా ఆ ఇంటికి ఎల్లకూడదనీ బార్యాకి గట్టిగా కట్టడి ఎట్టేసినాడండీ ఆయ్‌.’
‘ఇదే మరీ కందకు లేని దురద కత్తిపీట కంటేనీ’ అన్నారు మా అత్తమ్మ కోపంగా.
‘బలే సెప్పొచ్చారమ్మా. సెల్లిమీద మనేదుండిపోయింది ఆయిన బార్యాకి....మనోడు రోజుకీ టౌనెలతాడుకదాని ఏదోటంపీది..డబ్బులూ గట్టా, పిండొంట్లూ గట్టానీ సెల్లికి! ఆయ్‌..మా సూరి అయ్యిన్నీ ఆ పణంగా  మనింటికాడెట్టి, తెల్లారి అట్టుకెల్లి ఇచ్చొచ్చీవోడు. మరి ఏనా తొత్తుకొడుకు కొడుకు అగ్గి గీసేసినాడో గానీండి మావోడు ఒంటిరిగా ఓన్రు బార్యాని కలుత్తున్నాడని పుకారు ఎట్టేసినారమ్మా.’
‘అయ్యో... రామ రామ! ఓన్రు ఎలా నమ్మాడో వాళ్ళ పనులకోసమని, అతని భార్యా అలాగే నమ్మిందీ. అంతేకదా’ అన్నారు అత్తమ్మ.

‘చిన్నమ్మా నువెళ్లి లోపల ఆడుకో’ అన్నాను నేను నా కొడుకుని.
‘ఊహూ..నేను దొయిలమామ ఒళ్ళోనే కూసుంటా’ అని కదల్లేదు వాడు.
మామ్మ ఓ సారి చెంగుతో  కళ్ళు తుడుచుకుని, మా బుడ్డోడిని పొదివి పట్టుకుని  మళ్లీ తన విషాదాన్ని కొనసాగించింది.
‘ఇలాంటి పొద్దులోనే ఓన్రు కేకేసినాడని ఎల్లినోడు అటు నుంచి అటే నరకానికి పయనమైపోయాడమ్మా తల్లీ...నా బిడ్డని ఓన్రూ, ఆడి పాలేరు తొత్తుకొడుకులూ కలిసి తుక్కు కింద కొట్టేసేసి ఉసురు తీసేసినారమ్మా’ సుడులు తిరిగే దుఖఃవల్ల కాసేపు గొంతుకూడదీసుకుంటూ ఉండిపోయింది. అత్తమ్మా, నేనూ కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నాము.
‘పాపమ్మా!  నువంపిన బుషుకోటే మీదనుంట  పేణాలు పోయిన్నాడు ఆయ్‌’ అంటూ చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది రొయ్యిలమామ్మ. నాకు ఒళ్ళు జలదరించింది.
‘మీ పల్లెవాడంతా పోయి ఆ మిల్లు తొక్కేయకపోయారా’  అన్నాను.
‘ఆయ్‌..ఎల్నాం అమ్మా. ఓ పల్లినాకొడుకు పెద్దింటాడోళ్ళ జోలితీత్తే గాజులేసుకుని సూత్తామా.. నాల్గు దెబ్బలేసినం.. బరాయించుకోలేపోయాడు, సచ్చాడు. అయిగోరు ఎంతోకొంత ముట్టచెబుతారులే.. ఎల్లండెల్లండి.. కాదూకూడదంటే మీ తలలూ పొగుల్తాయ్‌ అంటా అందర్నీ గెంటేసారమ్మా.. ఆయ్‌’ ఒణికే గొంతుతో ఉక్రోషం, కసీ కలగలిపి చెప్పింది మామ్మ.
పోలీసోళ్ళుకూడా ‘కేసుకెళ్ళి ఆరితో తూగలేరు గానీ రాజీ సేత్తాం’ అని పిలుసుకెళ్ళినారండీ.

మీ తాత ఎల్లి డబ్బులన్నీ ఎగరేసేసి కొడుకు రత్తం ఏసుకుని కూడు తినమంటార్రా  తప్పుడునా కొడుకుల్లారా అని కేకలెట్టేసి ఆ సోటులో  మట్టి కరిసేసినోడు ఇక ఆ పడ్నే   మంచవట్టేసాడు.
ఆయ్‌..మనేదెట్టేసుకునీ రేత్తిరీ పొగులూ సూరే...సూరే..అంటూ నెతికేసుకునీవోడు...తిండీ నీరూ కట్టేసి సరింగా పక్షం రోజులికి నిద్దరలోనే పేణాలూదేసుకున్నాడు, ఓ యమ్మలాలో..ఇద్దరు మగపురుగులూ నన్నొగ్గేసి ఆళ్ళ దారినాళ్ళు పోయినారు తల్లో’  మామ్మ దుఃఖం వాళ్ళ పేటముందరి పోటెత్తిన  సంద్రం అయిపోయింది. కళ్ళు తుఫాను తాకిన తీరంలాగా అల్లల్లాడి పోయాయి.
‘ఊరుకో మామ్మా. రుణం తీరి నీ బిడ్డ స్వర్గానికి వెళ్లిపోయాడు అనుకో’  అన్నాను అనునయంగా.

దీనికి మామ్మ చాలా వేగంగా, అదోలాంటి నిష్ఠూరంతో ‘ఓల్నా పిచ్చితల్లే..ఉట్టిదీ...అంతా ఉట్టిదేమ్మా..సొరగవూ లేదూ. నరకవూ లేదు. ఈ కాయం ఈ మట్టిలోనే ఒగ్గేసి పోతావుంటే పైని అమురుతవూ, పంచబత్తాలూ, ఆడోళ్ళ డాన్సింగులూ  ఏ గాటికి సెప్పండి..ఆతమలకి ఆకలా, దప్పికా! నరకంలో ముళ్ళు గుచ్చుతారూ, నూనెలో ఏంచుతారనీ, రంపాలతో కోత్తారనీ మా తాత సెప్పీఓడు. ఆయ్‌..జీవుడు దేహమే ఇడిసి పెట్టేసి పైకెల్తే అయన్నీ యాడ గుచ్చుతారూ అంట! నాను ఒకటే అరదం సేసేసుకున్నాను. ఆడు మా నట్టింట నడిసిందే సొరగం! పొయీముందు సూసిందంతా నరకం! ఆడి పేణ్ణం గాలిపాలు. నా కడుపు కట్టం మట్టిపాలూనీ. ఆయ్‌. అంతేనండీ..ఇంకేం మిగిలిందికాదు..కడుపుకోత్తప్ప!’. అంటూ చెంగుతో ముక్కూ కళ్ళూ తుడుచుకుంది మామ్మ.

కొంచెం సద్దుమణిగాక మామ్మకి, అత్తమ్మకీ వడ్డించాను.
‘పోయినోళ్ళు స్వర్గంలో కొలువుతీరి, ఏడాదికోసారి దిగి భోజనప్రసాదాల ఆరగింపుకొస్తారనీ, తిరిగి మళ్ళీ నట్టింట పాపై పారాడతారనీ నమ్మే విషయాలన్నీ, మనసు పుండుకు రాసే నవనీతం లాంటివి కదా! మనిషికి సౌకర్యవంతమైన ఉపశమనాలు. కానీ మామ్మ కబ్బిన తర్కజ్ఞానం వల్లే తనకు మనశ్శాంతి పూర్తిగా దూరమైపోయుంటుంది పాపం!. అనుకుంటూ ఆలోచనలో పడి...మామ్మ ప్లేటు తీసుకుని లేవటంతో మజ్జిగ ఇవ్వటానికని లేచాను.
ఉగాదినాడొత్తానమ్మా..ఉగాది పచ్చిడీ తింటాకి ఇక ఇంటికట్టికెళ్ళటానికి ఎవరు మిగిలారు..ఇక్కడే తినేసి పోతాను. దుఃఖంగా అంటూ, కొంగు ముడి విప్పి....అత్తమ్మతో ‘అమా..ఇది మీ దగ్గరెట్టండి. మా సూరి సివరాకరి గేపకం! రొయిలమిల్లులో పనిసేసే ఓ అమ్మాయి రూపాయి పాపాయ్‌ కూడబెట్టి ఈ ఉంగరం సేయించి ఇచ్చిందంట పేమింతన్నానూ’ అని మా సూరికి. తెచ్చి నా కాడెట్టాడంతే ! రెండోనాడే ఎల్లిపోయాడమ్మా’..అంటూ హృదయాకారంలో ఉన్న అరకాసుంగరం ఇచ్చి..అత్తమ్మ బలవంతంగా ఇచ్చిన రెండు చీరెలూ, రెండు వందలూ పట్టుకుని బాబుని సల్లగుండు నాయనా అని టాటా చెబుతూ బయలుదేరింది రొయ్యిలమామ్మ. అరె..ఓ పిల్లతో సిన్సియర్గా లవ్‌ లో ఉన్న పిల్లాడిని భార్యకోసం  అనుమానించి ఇంత ఘోరం చేసారా అని బాధపడుతూ ‘మరా పిల్ల ఏమైంది మామ్మా ?’ అని అడిగాను.

మామ్మ బయటకెళ్ళి గేటు మూస్తూ ‘తల్లిలేని పిల్ల..తాగుబోతు బాబుతో ఏగుతుంటది. నేను తోడు తెచ్చీసుకుని..ఆనిక్కి దానికీ నాలుగు అచ్చింతలడేలా సేద్దామనుందమ్మా. ఎంతైనా నా కొడుకు మనసు గెలుసుకున్న పిల్ల...దాని దారిన అదే పోద్దిలే అనుకోలేకున్నాను. ఆ ఓన్రు సచ్చినోడి కులపు పిల్లే..ఐతేనేం.. బంగారం.. ఆయ్‌’ అంటూ సాగిపోయింది మామ్మ. సూరి హత్యకి అసలు కారణం మాకు బోధపడి భగభగా మండే మనసుతో చాలా సేపటిదాకా  స్థిమితపడలేకపోయాం. పాపం ఆ పిల్ల. సూరినెంత ప్రేమించి ఉంటుందో కదా. చాలా జాలేసింది. ఆ పిల్లపై. ఏం చేయగలం మా మధ్యతరగతి బతుకులతో. మామ్మని మరింత దగ్గరికి తీసుకోవటం తప్ప.

ఉగాదినాడు ఉగాది పచ్చడీ,పూర్ణాలూ, గారెలూ చేసి పగలంతా మామ్మకోసం ఎదురు చూసాం..
ఇక లాభంలేదని సాయంత్రంవేళ బండి తీసి ‘పదరా మామ్మని ఏసుకొచ్చేద్దాం’ అంటూ నా కొడుకుని తీసుకుని, రొయ్యలమామ్మ ప్రాణమైన ఉగాది పచ్చడీ, బూరెలు తీసుకుని, కల్పనాహాలు పక్కగా సముద్రం వైపు  పోయి పోయీ.... సంద్రం కోత ఆపేందుకనీ తీరం వెంబడి ఒత్తుగా పెంచుతున్న సరుగుడు తోపులు దాటి, ఎరువుల ఫ్యాక్టరీ పక్కగా  ఉన్న పల్లె కాలనీకి వెళ్ళి ఆగాం.
సమీపంలో కొచ్చిన సముద్రాన్ని మా మాధవ్‌గాడికి పరిచయంచేసాను. వాడు అంతలావు నీళ్ళను చూసి కాస్త బెదిరాడు. భయంగా రెప్పలాడిస్తూ నా చెంగులో ముఖం దాచేసుకున్నాడు. సమద్రం ఏదో ఘోషిస్తుంది. నాకు అర్థం అయ్యేదుంటే బహుశా రొయ్యిలమామ్మ మనసు లోతుల  గురించే గావచ్చు. ఈ ఇసుకలో మామ్మ తన సూరితో ఎంతగా ఆడి ఉంటుందో కదా! ఈ సముద్రం ఇక్కడివారి జీవితాల్ని పరామర్శించడానికే రోజూ ముందుకొచ్చి వెనక్కి వెళుతుందేమో....ఏదో భావావేశం కమ్ముకొనుండగా..తేరుకుంటూ, అటుగా కనపడిన ఓ స్త్రీని ఆపి ‘ఇక్కడ ఇంద్రపాలెంలో రొయ్యిలమ్మేదీ. ఆ మామ్మ ఇల్లెక్కడో చెపుతారా’ అని అడిగాను.

ఇక్కడందరివీ రొయ్యిలేపారాలే.. ఏం పేరూ అందామె..
నేను గతుక్కుమని అక్కడి కాయిన్‌ బాక్స్‌ నుండి అత్తమ్మకు ల్యాండ్‌ లైనుకి ఫోను చేసి మామ్మ పేరడిగాను.
‘అయో...నలుగురితో నారాయణంటిని తప్ప నేనూ తన పేరడగనేలేదు. నిజానికి పోషణలేకలాగ ముసిలివాటం అడిపోయింది గానీ ఆయమ్మిది సుమారుగా నా ఒయసే ఉంటాది’ అన్నారు అత్తమ్మ గిల్టీగా.
నిజమే. అన్ని వయసులోళ్ళూ రొయ్యిలమామ్మ అనేవాళ్ళే..నాకూ,మా అత్తగారికీ కూడా మామ్మే...విచిత్రంగా!
ఓ నాలుగు ఇళ్ళు దాటి  మరో  ప్రయత్నంగా ఓ పదేడేళ్ళ పిల్లనాపి ‘సూరి’ సంఘటన జోడించి అతని తల్లి కావాలి అని అడిగాను. ‘ఓసోస్‌..ఇందాట్నుంచీ మీరోకబు సేసీదీ మా సరోజిని మామ్మగూంచా’..అంటూ మామ్మ చేసిన సాహసం, ఓన్రు భార్య కూతురింటికి పంపేయటం గురించి చెప్పుకొచ్చి, మామ్మ దూరపు బంధువు తాతిబాబుని పిలుచుకొచ్చింది...ఆ ముక్కుపుడక పిల్ల.
వస్తూనే దండాలమ్మా అంటూ నేరుగా విషయానికొచ్చేసాడు తాతిబాబు.

కొడుకు పోయీ, భర్తపోయీ ఒంటిరి అయిపోయిన  మా యప్ప  సూరి పేమించిన అమ్మాయిని ఇంటికి పిలుసుకునీదండి...ఆ పిల్లమీద ఆశెట్టుకోడం మొదలేసింది. ఆ యమ్మి వస్తా పోతా ఉంటం మిల్లు ఓన్రుకి తెలిసి ఆ యమ్మని ఇటేపు రాకుండా కట్టడి సేసేడంట. అందుకే ఆ గొప్ప దయిర్నం సేయటానికెళ్ళి దొరికేసిందండి. మరి సరోజినమ్మ కూతురిల్లంటే  ఇక్కడెక్కడా కాదిండి మరీ..తూరుపు దేశం ఆయ్‌.....ఆడ ఫోన్లూ ఉండవు..ఏవీ ఉండవండి....ఆయమ్మిని ఏడూ, ఏడాదిన్నరలోపు ఇటేపు కాలెట్టొద్దనీ గట్టిగా సెప్పీనారా ఓన్రు బారియాగారు..ఎటెల్లి ఎటొత్తదో పెమాదం అనీసీ...ఈ పొద్దుదాకా ఏం సప్పుడు నేదులెండి మిల్లేపు నుంచి ఆయ్‌’ అన్నాడు.
‘పిల్లోడు పోయి ఆర్నెల్లు గమ్మునున్న మామ్మ ఎందుకింత సాహసం చేసింది?’  నేను అనుమానం వ్యక్తం చేసాను.
‘అదేనండీ బాబ! కొడుకు పోయినంక నిబ్బరంగానే నిలబడ్డ మనిషి...ఓన్రు తన కొడుకు పేవించిన పిల్లని బలిమిని’ ఉంచుకున్నాడన్న ఇసయానికి కుత కుతలాడిపోందండీ పాపం. ఆ పిల్ల కోసరవే ఈ సాహాసం సేసేసింది. నాతోనన్నా సంప్రదిచ్చిందా? నేదండి!
‘మంచవున్నంత వరికే కాళ్ళు సాపాల’
అదేం లేకుంటా ఒంటిరి దాన్నేగదాని దూకుడు మింద పోయిందండి. ఆనాడు ఓన్రు లేపోబట్టికే సరొజినమ్మ మళ్ళీ బట్టగడత ఆయ్‌. తాతిబాబు బాధపడ్డాడు. మా సరోజినామామ్మ ఒత్తేమాత్తరం  ముంగట మీ ఇంటికే ఉరుకులేస్తదండి..ఏకా మీ జప్మే సేసీదండి..ఆయ్‌...శానా ఇట్టం మీరంటేనీ’...అని ఆ పిల్ల చెబుతుండగా తెచ్చినవి ఆ పిల్ల చేతిలో పెట్టి, మామ్మ వస్తే చెప్పమని ల్యాండ్‌ నంబరిచ్చి, బండి స్టార్ట్‌
చేసి, బోలెడు చీకటిని పోగేసుకుని ఉస్సురంటూ ఇంటికి చేరాను బరువెక్కిన మనసుతో.

కాలాన్ని దాటుకుంటూ మళ్ళీ  ఉగాదొచ్చింది. ఇపుడు నా చేతిలో స్మార్ట్‌ ఫోనుంది. మామ్మ కూతురికైనా నంబరుంటే ఎంతబాగుండూ..ప్చ్‌..అనుకుంటూ ఉంటా...మామ్మ గుర్తొచ్చినపుడల్లా. సాగరతీరం కాకినాడ నా మెట్టినిల్లవటం, సీరియల్స్‌ చెప్పేవన్నీ అబద్ధాలని నిరూపిస్తూ మా అత్తమ్మ అందరికీ ప్రేమని పంచటం..నాకెంతో నిశ్చింత. మా టౌనేరియాలో డైరక్టు ప్రేమలు తగ్గి, వాట్సాప్‌ ఆప్యాయతలు పెరిగిపోయాయని దసరాకెళ్ళినపుడు గమనించాను.  ఇళ్ళల్లో మనుషుల మధ్య మాటలు బాగా తగ్గిపోయాయి అక్కడ. అంతా ఫోనుల్లోనే పొరుగువాడిని తెగ ప్రేమించేసే పనిలో ఉంటున్నారు. కానీ నా మెట్టినింట మాత్రం పండగలకి పది పళ్ళేలైనా పిండొంటలతో అటూ ఇటూ తిరుగుతాయి. రోజూ పలకరించే కూర్లమ్మకీ, సవరాలమ్మే వెంకట్రావుకీ టిఫిన్లు దాచి పెట్టే మా అత్తగారూ, వీధిన గాజులబండైనా, చీరెల సైకిలైనా అంతా గుమిగూడి పరాచికాలూ, మాట సాయాలతో బిజీగుండే వీధి వాసులూ..

‘ఎవరన్నారండీ మనుషుల మధ్య బంధాలు తెగిపోయాయనీ!’ అని ప్రశ్నిస్తూ నాకు మనిషి తత్వాన్ని బోధిస్తూనే ఉన్నారు. రొయ్యిల మామ్మ తప్పక వస్తుంది. ఈ ఉగాదికి కాకుంటే వచ్చే ఉగాదికి! ఆ రోజు మామ్మతొ పాటూ మా కుటుంబాన్నంతటినీ  శాశ్వతంగా బంధించాలని నా స్మార్ట్‌ ఫోనుకి గొప్ప ఆశ!’ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం..’
రేడియో పాడుతున్న ఆ పాటను  మార్చటానికని వంటింటి నుండి అత్తమ్మా, వరండానుంచి నేనూ చేస్తున్న పనులాపి ఒకేసారి చేరుకున్నాం.
ఎందుకో మాకది నచ్చదు మరి!
- మనోజ నంబూరి

మరిన్ని వార్తలు