భానూదయాన.. చంద్రోదయాలు

11 Mar, 2018 06:20 IST|Sakshi

పాటతత్త్వం

చిత్రం: మహర్షి రచన: నాయని కృష్ణమూర్తి
గానం: బాలు, జానకి సంగీతం: ఇళయరాజా

‘మహర్షి’ సినిమాలోని ఈ పాట నేపథ్యం ఈ సందర్భంగా గుర్తుకు వస్తోంది. ఈ చిత్రంలో కొత్తవారితో ఒక పాట రాయించాలనుకున్నాను. అలా ‘సుమం ప్రతి సుమం సుమం...’ పాటతో నాయని కృష్ణమూర్తి కొత్త రచయితగా సినీరంగ ప్రవేశం చేశారు. మదురైలోని హోటల్‌ తమిళనాడులో కూర్చుని కంపోజ్‌ చేస్తే హిట్‌ అవుతుందని  ఇళయరాజాకి ఒక సెంటిమెంట్‌ ఉంది. ఆయన అక్కడ కూర్చుని ట్యూన్‌ చేసి ఇచ్చారు. ఆ ట్యూన్‌ను నాయని కృష్ణమూర్తికి ఇచ్చి పాట రాయమన్నాను. ఆయన వారం రోజుల పాటు కష్టపడి పాట రాశారు. పాట పాడించడానికి ఎస్‌ పి బాలు, ఎస్‌. జానకిలను రప్పించాం. పాడటానికి వస్తున్న సమయంలో, ఇళయరాజా ఆ పాట ట్యూన్‌ మళ్లీ విని, ‘ఇది నాకు నచ్చలేదు’ అని మళ్లీ కొత్త ట్యూన్‌ కట్టారు. ఈలోగా గాయకులు వచ్చేశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మళ్లీ నాయని కృష్ణమూర్తిని రప్పించి, కొత్త ట్యూన్‌కి పాట రాయమని అడిగాను. ముందుగా పల్లవి రాసి ఇచ్చారు. పల్లవి రికార్డింగు అవుతుండగా చరణం రాశారు. ఇలా మొత్తం పాటను గంటలో రాసి ఇచ్చారు. మరో విషయం ఏంటంటే... ఈ పాట సోలోకి అనువుగా కంపోజ్‌ చేశారు ఇళయరాజా. అప్పటికే ఎస్‌. జానకి వచ్చేయడంతో, ఆ పాటలో ఆవిడ చేత హమ్‌ చేయించాం. పాట కోసం చాలా కష్టపడ్డాం. ఇలా ఆ పాట పుట్టింది.‘సుమం ప్రతి సుమం సుమం’ అంటూ అందమైన పదాల పూలతో అల్లుకున్న పందిరి ఈ పాట. సువాసనలు వెదజల్లే కుసుమాల వంటి పదాలతో అల్లిన మాలిక ఈ పాట. భావకవిత్వ పలుకులతో గుది గుచ్చిన పుష్పగుచ్ఛం ఈ పాట.

కథానాయికను ఊహించుకుంటూ కథానాయకుడు చేసిన భావ ప్రకటనే ఈ పాట. కవి భావన హృద్యంగా ఉంటుంది. ‘భానూదయాన... చంద్రోదయాలు....’  తన కలల కథానాయికను చూడగానే సూర్యోదయ సమయాన చంద్రోదయం అయినట్లు భావిస్తాడు ప్రియుడు. ఆమె గొంతు విప్పి గానం చేస్తుంటే, అది వేణు నాదమో, వీణా నాదమో తెలియనంత సుస్వరంగా ఉంది ఆమె కంఠం అని ప్రస్తుతిస్తాడు. ప్రేమలో పడినవారికి... తమ ప్రియురాలిని తలచుకుంటే హృదయమంతా ఆనంద తరంగితమవుతుంది. ప్రేమ మహిమ అంటే ఇదేనేమో. ప్రపంచమంతా అందంగా అనిపిస్తుంది. ఆకాశమంతా తెల్లగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ, రంగురంగుల ఆకాశాన్ని ఊహిస్తాడు. ఆమెను ప్రణయరాగ దేవతగా, చెలియ ప్రణయాన్ని అందుకోవడం ఒక వరంగా భావిస్తాడు ప్రేమికుడు. తన మనసులో ప్రేయసిని ఊహించుకుంటూ కలిగే సౌఖ్యం... స్థిరంగా, మధురంగా ఉంటుందనుకుంటాడు. తన మనసంతా ప్రేమమయంగా ఊహల్లో విహరిస్తాడు. ప్రపంచమంతా ప్రణయ కలహాలు కూడా ఉంటాయనుకుంటాడు. ఈ పాటలో హృదంతరం, సురతం, రాగోల్లసాలు... వంటి మంచి మంచి పదాలను ఉపయోగించారు రచయిత. ఒక ప్రేమికుడి అంతరంగాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఇది. ఈ పాట ఒక కొత్త రచయిత రాసిన భావన కలగదు. అప్పటికే ఎన్నో సినీ గీతాలు రచించిన అనుభవజ్ఞుడిలా రాశారు రచయిత నాయని కృష్ణమూర్తి.
– వైజయంతి 

మరిన్ని వార్తలు