నేను పుట్టింది నీ కోసం...

8 Jul, 2018 00:57 IST|Sakshi

పాటతత్త్వం

ఉర్దూ గజళ్లలో భాషా సౌందర్యం కవిత్వంతో పెనవేసుకుని ఉంటుంది. గాలిబ్‌ భాషా సౌందర్యాన్ని దాశరథి మాటల్లో చెప్పాలంటే, ‘ప్రతిదీ సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట యెంతొ దుష్కరమ్ము సుమ్ము’ వంటì ది. భాషలోని అతి లలిత పదాలని భావానికి తగినట్లుగా ఎన్నుకోవడమే గజల్‌ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకే అక్షరాన్ని సైతం పదునుపెట్టిన బాణంలా వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. గజల్‌ ప్రక్రియలో ‘షేర్‌’అనేది ముఖ్యం. రెండు పాదాలుండే షేర్‌ అంటే ‘పూలు’ అని అర్థం. అందుకే గులాబీపూవును దాశరథి ఈ పాటలో కవితా వస్తువుగా తీసుకున్నారు. అటువంటి ఒక అద్భుత గజల్‌ను తెలుగు సినిమాకు ఆయన రాయడం, ఆ గజల్‌ను హిందోళరాగంలో మా నాన్నగారు (మాస్టర్‌ వేణు) స్వరపరచి ఘంటసాలగారి మధురగళంలో రికార్డు చేయడం... అన్నింటికీ మించి ఎప్పుడూ మా నాన్నగారి రికార్డింగుకి వెళ్లని నేను ఆ పాట రికార్డింగుకు వెళ్లడం... అదే ఘంటసాలగారు పాటలు పాడిన చివరి సినిమా కావడం యాదృచ్ఛికం. ఘంటసాల గారు స్వయంగా మా ఇంటికి వచ్చి, నాన్నగారి దగ్గర కూర్చుని ఈ పాట నేర్చుకున్నారు. ఆ రోజులలో కమిట్‌మెంట్‌ అలా ఉండేది.

‘మధురమైన ఈ మంచి రేయిని వృథా చేయకే సిగ్గులతో’ అనే చరణంలో కాని, ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం’ అనే చరణంలో కాని కొన్ని అన్య స్వరాలు అనివార్యమైనా, వాటి ఛాయలు కనపడనీయకుండా, ‘హిందోళ’ రాగంలో అద్భుతంగా స్వరపరచడం మాస్టర్‌వేణుగారి ప్రతిభకు తార్కాణం అని నేను భావిస్తాను. తెలుగు చలనచిత్రసీమకు పరిచయం కాని తొలిరోజుల్లో బొంబాయిలో మేస్ట్రో నౌషాద్‌ అలీ వద్ద గడపడం, బేగమ్‌ అఖ్తర్, మెహదీ హసన్‌ల గజల్‌ ప్రక్రియలను దగ్గరగా పరిశీలించడం నాన్నగారికి గజల్‌ ప్రక్రియ మీద మోజును పెంచింది. తెలుగులో గజళ్లు వినిపించగలిగే అవకాశం వారికి రాలేదు. యువ నిర్మాతలు మహమ్మద్‌ రంజాన్‌ అలీ, మహమ్మద్‌ ఖమరుద్దీన్‌లు హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘మా ఇంటి దేవత’ చిత్రంతో ఆ ఆశ తీరింది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణం ఒడిదొడుకులకు లోనైంది. 1973లో మొదలుపెట్టిన సినిమా 1980 దాకా విడుదలకు నోచుకోలేదు. ఘంటసాల 1974లో కాలం చేసిన తరవాత ఆరేళ్లకు గానీ ఈ సినిమా విడుదల కాలేదు. కలర్‌ సినిమాలు ఊపందుకున్న తరవాత ఈ సినిమా విడుదల కావడంతో దీనికి గుర్తింపు రాలేదు. ఇది హిందీ సినిమా కాజల్‌కు రీమేక్‌. దాశరథి రచించిన ఈ పాటలో పల్లవితోనే అడుగడుగునా మీర్జాగాలిబ్‌ కళ్లలో మెదలుతాడు. ‘విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి’ అంటూనే ‘నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి’ అంటాడు.

కానీ ‘తాగాలి’ అనడు. అదే దాశరథి సున్నితమైన కవితా దృక్కోణం. ‘చంద్రుని ముందర తార వలె నా సందిట నీవే వుండాలి’ అంటూ ‘ఈ మధువంతా నీ కోసం, పెదవుల మధువే నా కోసం’ అని మధువును, మగువను ఏకదృష్టితో సంబోధిస్తాడు. ఇటువంటి అద్భుత రచనకు సంగీతం నిర్వహించే అదృష్టం నాన్నగారికి దక్కడం అదృష్టమే. నిర్మాతలు ఉర్దూ సంప్రదాయాలు తెలిసినవారు కావడం, గజల్‌ సంస్కృతి మీద మక్కువ వుండడం ఈ పాట సృష్టికి దోహదం చేసిన అంశాలు. మరో చరణంలో ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం’ అంటారు దాశరథి. ఇది ఒక అద్భుతమైన పోలిక. అందుకే గజల్‌ భాషా సంపద గొప్పది. అటువంటి పాట తెలుగులో రాసిన దాశరథి కూడా గొప్పవారు. అంతటి గొప్ప పాటకు స్వరపరచిన మా నాన్నగారు అదృష్టవంతులు. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. సినిమా విజయవంతం కాకపోవడంతో ఈ పాట మరుగున పడిన మణిపూసైపోయింది. ఈ చిత్రానికి నిర్మాతలు రిజిస్టర్‌ చేసిన అసలు పేరు ‘కంటికి కాటుక – ఇంటికి ఇల్లాలు’. విడుదల ఆలస్యం కావడం వలన దానిపేరు ‘మా ఇంటి దేవత’ గా మారిపోయింది. కృష్ణ నటించిన ఆఖరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రమిది. హరనాథ్‌ తను కోల్పోయిన స్టార్డమ్‌ను తిరిగి సాధించేందుకు హాస్యనటుడు పద్మనాభం, కృష్ణ, జమునల సహకారంతో నిర్మాతలు వెనక ఉండి నటించిన చిత్రం. 

జాతీయాలు
ఉంగరాల చేతి మొట్టికాయ
ఎవరైనా పిడికిలి బిగించి నెత్తి మీద లాగిపెట్టి మొట్టికాయ వేస్తే నొప్పి పుడుతుంది. మామూలు చేతి మొట్టికాయకే అంత నొప్పి పుడితే, అలాంటిది వేళ్ల నిండా ఉంగరాలు తగిలించుకున్న ధన మదాంధుడెవడైనా కసిదీరా మొట్టికాయ వేశాడనుకోండి ఆ దెబ్బకి ఎలాంటి వాళ్లకైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉంగరాల తాకిడికి నెత్తి బొప్పి కడుతుంది. సాదాసీదా మనుషులు ఎవరైనా ధనబలం, అధికార బలం గల వారితో అనవసర వైరం పెట్టుకుని, వాళ్ల ద్వారా కీడు కొని తెచ్చుకునే సందర్భాల్లో ఉంగరాల చేతి మొట్టికాయలు తిన్నారనడం పరిపాటి. 

ఐదు పది చేయడం
ఐదు పది చేయడమంటే ఐదో ఎక్కం చదవడం కాదు. ఒక్కో చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ జోడిస్తే రెండు చేతుల వేళ్లూ కలిపి పది వేళ్లవుతాయి. ఇలా రెండు చేతులూ జోడించడాన్నే ఐదు పది చేయడం అంటారు. గౌరవంతోనో, భక్తి ప్రపత్తులతోనో చేతులు జోడించే సందర్భాల్లో ఈ మాట అనరు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు, అధికార నిరంకుశుడైనప్పుడు వానితో తలపడటం సాధ్యం కాదని తలచినప్పుడు, లొంగుబాటే శరణ్యమనే పరిస్థితుల్లో చేతులు జోడించినప్పుడే ఐదు పది చేశాడంటారు. 

కాకదంతపరీక్ష
కాకులకు దంతాలు ఉండవు. లేని దంతాలను పరీక్షించాల్సిన అగత్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే, తమను తాము మేధావులుగా తలచే కొందరు ఏమీ లేని విషయమై గంభీర పరిశోధనలు సాగిస్తుంటారు. ఫలితమివ్వని పరీక్షలు చేస్తూ అనవసరంగా ప్రయాస పడుతూ అందరిలో నవ్వుల పాలవుతుంటారు. పనికి మాలిన విషయమై ఎవరైనా గంభీరంగా పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నట్లు కనిపిస్తే, అలాంటి వాళ్లను కాకదంత పరీక్షలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తుంటారు. 
 – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి

మరిన్ని వార్తలు