పూసిందే ఆ పూల మాను నీ దీపంలో...

18 Nov, 2018 02:22 IST|Sakshi

పాటతత్త్వం

చిత్రం: నిరీక్షణ రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా గానం: కె. జె. ఏసుదాసు 

బాలు మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘నిరీక్షణ’ చిత్రంలోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. అన్ని పాటల్లోకీ ‘సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడ బోయావే/ ఇన్ని యేల సుక్కల్లో నిన్ను నేనెతికానే’ నాకు బాగా నచ్చిన పాట. ఈ పాట షూటింగ్‌ బెంగళూరు జైలు అధికారుల అనుమతితో అక్కడ చేశాం. జైలు అధికారులు మాకు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. అక్కడి ఖైదీలు ఏయే పనులు ఎలా చేస్తారో దగ్గర నుంచి గమనించాక చిత్రం తీశారు బాలు మహేంద్ర.నేరస్థులంతా రాత్రుళ్లు జైలు లోపల ఉంటారు. పగటిపూట పనులు చేస్తుంటారు. కొందరు రాళ్లు కొడతారు, కొందరు చెట్లు నరుకుతారు, కొందరు సిమెంట్‌ పని చేస్తారు, కొందరేమో పనిచేస్తున్నవారికి గార్డ్స్‌తో పాటు మంచి నీళ్లు, ఆహారం సప్లయి చేస్తుంటారు. అవన్నీ దగ్గరుండి గమనించాం. అక్కడి ఖైదీల కథలు మా మనసులను కదిలించాయి, ఖైదీలంతా వారి స్వవిషయాలు చెబుతుంటే కళ్లలో నీళ్లు ఆగలేదు.  ఎవరో చేసిన నేరానికి మేం బలయ్యామని వారు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ఏ నేరం చేయకుండా కూడా చాలామంది యావజ్జీవ శిక్షలు అనుభవిస్తున్నారు. భార్య వచ్చి ఏడాదికోసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది. వారి గురించి ఎవరు పోరాడతారో అర్థం కాదు. ఈ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే కావడం యాదృచ్ఛికం. వాళ్లతో కలిసిపోయినట్లు ఉండటం కోసం నేను, బాలు మహేంద్రగారు జైలులో వారు ఆ రోజు ఏది తింటున్నారో తెలుసుకుని, అదే వంటకం చేయించుకుని తెచ్చుకుని తినేవాళ్లం. వారంతా దీపావళి పండుగ చేసుకున్నట్లే అనుభూతి చెందారు.‘పూసిందే ఆ పూలమాను నీ దీపంలో/ దాగిందే నా పేద గుండె నీ తాపంలో/ఊగానే నీ పాటలో ఉయ్యాలై/ఉన్నానే ఈనాటికీ నేస్తాన్నై/ఉన్నా ఉన్నాదొక దూరం ఎన్నాళ్లకు చేరం/తీరందీ నేరం’ అనే మొదటి చరణంలో తన ప్రియురాలిని తలచుకుంటూ కుమిలిపోతాడు కథానాయకుడు. ఆత్రేయ గారు స్వయంగా ఈ పాత్రలో ప్రవేశించి ఈ పాట రాశారేమో అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో నేను దిగంబరంగా నటించడం చూసి కొందరు ఖైదీలు కన్నీరు కార్చారు. ‘అయ్యో! ఇంత పెద్ద ఆర్టిస్టు అయి ఉండి మీరు ఇలా నటించడమేంటి. ఏ తప్పూ చేయకుండా మీరు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారేంటి?’ అని అమాయకంగా ప్రశ్నించారు. వాస్తవానికి దగ్గరగా ఉండటం కోసం చేస్తున్నానని చెబితే, వారు ‘మీలాగ ఏ హీరో కూడా నటించరండి’ అని వారు అనడం నాకు ఇంకా బాగా గుర్తు. ఆ జైలులో తెలుగు వారు, తమిళులు ఎక్కువగా ఉండటం వల్ల వారు నన్ను తేలికగా గుర్తించారు. అదొక చెప్పరాని అనుభూతి. వాళ్ల కష్టాలతో పోలిస్తే  మనం చాలా హాయిగా ఉన్నట్లే అనుకున్నాను. జైలులో బయటివారికి రాత్రుళ్లు అనుమతి ఇవ్వరు కనుక, జైలు సీన్లన్నీ పగటిపూటే తీశారు. 

బాలు మహేంద్రగారి గురించి ఒక పూట కాదు ఒక పుస్తకం కూడా చాలదు చెప్పడానికి. ఆయన మంచి నటుడు కూడా. ఆయనకు ఆయనే సాటి. పుణే ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బంగారు పతకం సాధించిన బాలు మహేంద్ర కెమెరాతో మాయమంత్రాలు చేస్తారు. ‘తానాలే చేశాను నేను నీ స్నేహంలో/ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో/ఆనాటి నీ కళ్లలో నా కళ్లే / ఈనాటి నా కళ్లలో కన్నీళ్లే / ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగ వ్యర్థం/ చట్టందే న్యాయం’ అనే చరణంలో కథానాయిక అర్చనను ఒక బ్లాక్‌ క్రియోపాత్రాలాగ సృష్టించారు బాలూమహేంద్ర. కెమెరాలో నుంచి బయటకు వచ్చేస్తే, మామూలుగా ఉంది అర్చన. కెమెరాలో నుంచి చూస్తే మనం వివరించలేం.ఇక్కడ ఒక విషయం గుర్తుకు వస్తోంది. ఊటీలో షూటింగ్‌ జరుగుతుండగా, మద్రాసు నుంచి ఒక పార్సిల్‌ వచ్చింది. జేసుదాసు స్వరంలో రికార్డు చేసిన ‘సుక్కల్లే తోచావే’ పాట క్యాసెట్‌ అది. ఆ పాట జేసుదాసు గొంతులో వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ క్యాసెట్టుతో పాటు ఒక ఉత్తరం ఉంది.  బాలూ మహేంద్రగారిని ఉద్దేశిస్తూ, ‘డియర్‌ బాలూ, నేను నా జీవితంలో అద్భుతమైన పాటను నా శక్తి వంచన లేకుండా హార్ట్‌ అండ్‌ సోల్‌ పెట్టి పాడాను. మీరు చిత్రంలో అంతే అందంగా చూపించండి. నేను సినిమా చూస్తాను’ అని రాశారు. ఆ మాటలకు బాలు మహేంద్ర ఉక్కిరిబిక్కిరైపోయారు. ఒక్క క్షణం పాటు కదలకుండా నిశ్చలంగా ఉండిపోయారు. 
 – సంభాషణ: వైజయంతి పురాణపండ

మరిన్ని వార్తలు