విప్లవ యోగి

12 Aug, 2018 00:26 IST|Sakshi
అరవింద ఘోష్‌

ధ్రువతారలు

‘మనకి నిజమైన శత్రువని చెప్పుకునే శక్తి అంటూ బయట ఏదీ లేదు. రోదిస్తున్న మన బలహీనతలు, పిరికితనం, మన స్వార్థ చింతన, మన భేషజం, దృష్టి లోపించిన మన భావాలు ఇవే అసలైన శత్రువులు.’ ఈ మాట అరవింద ఘోష్‌ అన్నారు.ఈ మట్టిలో, ఈ గాలిలో ఉన్న తన మూలాల కోసం, దూరమైన స్పర్శ కోసం ఒక తృష్ణతో అన్వేషిస్తూ భారతదేశానికి వచ్చినవారు అరవిందులు. కానీ తనవైన మూలాల కోసం పరితపిస్తున్న భారతజాతి భారత భూమిలో కనిపించలేదు. పైగా వాటిని విస్మరిస్తున్న వాస్తవం ఇక్కడ కనిపించింది. విదేశీ పాలన నుంచి విముక్తం కావడం విదేశీయుల దిశా నిర్దేశంతో ఎలా సాధ్యమవుతుంది? భౌతికంగా ఉన్న సంకెళ్లను తెంచుకోవాలనుకున్న వారు మొదట మనసుకు పడిన బంధనాలను ఛేదించకుంటే ఎలా? స్వాతంత్య్రోద్యమంలో మొదట ఆయన అతివాది. తరువాత విప్లవకారుడు. ఆపై యోగి.  కానీ ఆయన పలాయనవాది కాదు. గతంలోకి నిష్క్రమించడమే వర్తమాన సమస్యలకు పరిష్కారమని భావించిన వారు కూడా కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో అరవింద్‌ ఘోష్‌ (ఆగస్ట్‌ 15, 1872–డిసెంబర్‌ 5, 1950) పాల్గొన్నది కేవలం ఐదేళ్లు. 1905లో ఆయన ఉద్యమంలో అడుగు పెట్టారు. 1910 నాటికే యోగి అవతారంలో పుదుచ్చేరిలో ప్రత్యక్షమయ్యారు. ఈ కొద్ది సమయంలోనే అరవిందుల జీవితం అగ్ని పర్వతాల నిలయంగా కనిపిస్తుంది.     

అరవింద్‌ ఘోష్‌ అవిభాజ్య బంగాళంలోని కున్నాగర్‌ గ్రామంలో పుట్టారు. తండ్రి కృష్ణధన్‌ ఘోష్‌ అసిస్టెంట్‌ సర్జన్‌. ఒకప్పుడు బ్రహ్మ సమాజంలో సభ్యుడు. తల్లి స్వర్ణలతాదేవి. కృష్ణధన్‌ ఇంగ్లండ్‌లోనే వైద్య విద్య చదివారు. ఆయన వంగ దేశీయుడే కావచ్చు. కానీ ఆంగ్లేయుల సంస్కృతిని అణువణువూ పట్టించుకున్నారు. ఇంట్లో వంగ భాష వినిపించడానికి వీలులేదు. భారతీయ సంస్కృతికీ జీవన విధానానికీ చోటు లేదు. కుటుంబ సభ్యులంతా ఆంగ్లంలోనే మాట్లాడాలి. పని మనుషులతో మాట్లాడడానికి మాత్రం హిందుస్థానీ. తన కొడుకుల ఆంగ్ల పరిజ్ఞానాన్ని మరింత పెంచాలన్న ఉద్దేశంతో కృష్ణధన్‌ డార్జిలింగ్‌లో ఉన్న లోరెటో పాఠశాలలో చేర్పించారు. అప్పటికి అరవింద్‌కు ఐదో సంవత్సరం. నిజానికి తొలి సంతానం తరువాత స్వర్ణలతాదేవి మానసిక ఆరోగ్యం కొంచెం పాడైంది. దీనితో తల్లికి దూరంగా ఉంచే ఉద్దేశం కూడా ఇందులో ఉంది. కొడుకులంతా కూడా ఐసీఎస్‌ చేయాలన్నదే ఆయన కోరిక. అందుకు డార్జిలింగ్‌ చదువు మొదటి మెట్టు. ఐసీఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలంటే ఇంగ్లండ్‌లో ఉండడం తప్పనిసరి అయింది. అందుకే కుటుంబంతో సహా కృష్ణధన్‌ 1879లో అక్కడికి వెళ్లిపోయారు. మాంచెస్టర్‌లో రెవరెండ్‌ డబ్ల్యూ హెచ్‌ డ్రెవిట్‌ పర్యవేక్షణలో ఉంచారు. డ్రెవిట్, ఆయన భార్య ఆ పిల్లలకు లాటిన్‌ చెప్పేవారు. 1884లో ఆ దంపతులు ఆస్ట్రేలియా వెళ్లిపోవలసి వచ్చింది. దీనితో డ్రెవిట్‌ ఆ ముగ్గురు పిల్లలని ఇంగ్లండ్‌లో ఉన్న తన తల్లి సంరక్షణలో ఉంచారు. అక్కడే ఆమె వారిని సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో చేర్పించింది. అక్కడే గ్రీక్, సాహిత్యం, ఇంగ్లిష్‌ కవిత్వం ఆ పిల్లలు చదువుకున్నారు. జర్మన్, ఇటాలియన్‌ భాషలతో కూడా పరిచయం కలిగింది. కానీ మొదటి ఇద్దరు సోదరులు కొన్ని కారణాలతో ఐసీఎస్‌ పరీక్షకు దూరంగా ఉండిపోవలసి వచ్చింది. అంటే తండ్రి కలని నిజం చేయవలసిన బాధ్యత అరవిందుడి మీద పడింది. కానీ  అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగాలేక తండ్రి భారత్‌కు వెళ్లిపోయారు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం వచ్చేవి. ఆ విధంగా చిన్నతనంలో తల్లీ తండ్రీ ఉండి కూడా వారికి లేకుండా అయిపోయారు.  

దీనితో విద్యార్థి వేతనం అనివార్యమైంది. అందుకే ఎంతో కష్టపడి కేంబ్రిడ్జ్‌లోని కింగ్స్‌ కాలేజీలో చేరారు, అరవిందులు. ఆ ఏడాది 250 మంది అభ్యర్థులు ఐసీఎస్‌ పరీక్ష రాస్తే, అరవింద్‌ ఘోష్‌కు పదకొండో స్థానం వచ్చింది. కానీ తరువాత జరిగిన గుర్రపుస్వారీ పరీక్షలో ఆయన విఫలమయ్యారు. ఐసీఎస్‌ దక్కలేదు. నిజానికి గుర్రపు స్వారీ పరీక్షకి ఆయన కావాలనే ఆలస్యంగా వెళ్లారు. బహుశా బ్రిటిష్‌ అధికారులకి కావలసింది కూడా అదే అయి ఉండాలి. అరవిందులకి ప్రభుత్వ సేవ అంటే ఇష్టం లేదు. అందుకే పరీక్షకు ఆలస్యంగా వెళ్లారు. అప్పటికే బరోడా మహారాజా పరిచయం కలగడం, ఆయన తన సంస్థానానికి ఆహ్వానించడం జరిగిపోయాయి. అరవిందులు ∙1893లో స్వదేశానికి చేరారు. అంతలోనే కృష్ణధన్‌ హఠాత్తుగా కన్నుమూశారు. అదొక చిత్రమైన సన్నివేశం. ఐసీఎస్‌ అయి కొడుకు వస్తున్నాడని ఆయన భావన. కానీ ఇంతలోనే బొంబాయి ట్రావెలింగ్‌ ఏజెంట్లు ఆయనకు ఒక తప్పుడు సమాచారం ఇచ్చారు. అరవింద్‌ ఘోష్‌ ప్రయాణిస్తున్న ఓడ పోర్చుగల్‌ తీరంలో మునిగిపోయిందన్నదే ఆ సమాచారం. ఈ సమాచారం విని తట్టుకోలేక కృష్ణధన్‌ మరణించారు. 

బరోడా సంస్థానంలో చేరిన తరువాత అరవిందుడు చేసిన పని సంస్కృతం, బెంగాలీ భాషలు నేర్చుకోవడం. ఆ తరువాత అంతదాకా తన కుటుంబానికి దూరంగా ఉండిపోయిన బంధువులని, సాక్షాత్తు తన సోదరుడు బరీన్‌ని, సోదరి సరోజని ఆయన కలుసుకున్నారు. బరోడాలో ఉండగానే బాలగంగాధర తిలక్, సిస్టర్‌ నివేదితలతో పరిచయం ఏర్పడింది. అతివాదులతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. కానీ ఇదంతా రహస్యం. మొదట రెవెన్యూ శాఖలో చేసినా, తరువాత బరోడా మహారాజా విద్యా సంస్థలో అరవిందుడు ఫ్రెంచ్‌ బోధించారు. ఆపై వైస్‌ ప్రిన్సిపాల్‌ అయ్యారు. ఈ సమయంలోనే బెంగాల్‌ విభజన ఘటన చోటు చేసుకుంది. అది 1905. ఆ మరుసటి సంవత్సరమే తన స్వస్థలానికి చేరుకున్నారు అరవిందుడు. 

జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులకు కూడా బ్రిటిష్‌ ప్రభుత్వం మీద నమ్మకం పోగొట్టిన ఘటన బెంగాల్‌ విభజన. దేశంలోని యువతరం తీవ్ర జాతీయవాదం వైపు చూసేటట్టు చేసిన సంఘటన కూడా అదే. 1905లో వారణాసి కాంగ్రెస్‌ సభలకు అరవిందుడు పరిశీలన కోసం వెళ్లారు. జాతీయ కాంగ్రెస్‌తో అదే ఆయన పరిచయం. విదేశీ వస్తు బహిష్కరణ పిలుపునిచ్చిన సమావేశం అదే. దానిని అరవిందుడు పాటించారు. 1906 లో జరిగిన కలకత్తా సభలు స్వదేశీ పిలుపునిచ్చాయి. కలకత్తాలోని జాతీయ కళాశాలలో అరవిందుడు చేరారు. ఆ సంత్సరమే అయన జుగాంతర్‌ (బెంగాలీ), వందేమాతరం (ఇంగ్లిష్‌) పత్రికలను స్థాపించారు. ఇందుకు సాయపడినవారు ఇద్దరు– సుబో«ద్‌ మల్లిక్, బిపిన్‌చంద్ర పాల్‌. సంపూర్ణ స్వాతంత్య్రం అన్న విశాల భావన మొదట వందేమాతరం పత్రికలోనే దర్శనమిచ్చిందని ఒక వాదన ఉంది. 

1906 నాటికే కలకత్తా కేంద్రంగా కొన్ని తీవ్ర జాతీయవాద సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో అనుశీలన్‌ సమితి ఒకటి. ఇందులో అరవిందుడి సోదరుడు బరీన్‌ కూడా కీలక పాత్ర వహిస్తున్నారు. అరవిందుడు కూడా సభ్యుడయ్యారు. అప్పుడే జరిగింది అలీపూర్‌ కుట్ర కేసు.ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి ముజఫరాపూర్‌ దగ్గర బెంగాల్‌ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్‌ డగ్లస్‌ కింగ్స్‌ఫోర్డ్‌ మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇది 1908లో జరిగింది. ఇందులో అనుశీలన్‌ సమితిదే కీలక పాత్ర అని పోలీసులు నిశ్చయానికి వచ్చారు. పైగా 1907 డిసెంబర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆండ్రూ ఫ్రేజర్‌ ప్రయాణిస్తున్న రైలు పడగొట్టాలని కొందరు ప్రయత్నించారు. ఈ రెండింటికి సంబంధం ఉందని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బరీన్, ఆయన సోదరుడు అరవిందుడు, మరో 37 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఎక్కువ మందిని ఒకేసారి బరీన్‌కు చెందిన గార్డెన్‌ హౌస్‌లో ఉండగా పట్టుకున్నారు. అది కలకత్తా శివార్లలలో ఉండేది. ఈ కేసును చిత్తరంజన్‌ దాస్‌ వాదించారు. అదృష్టవశాత్తు ఆ 37 మందిలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని జైలులోనే ఎవరో హత్య చేశారు. దీనితో అరవిందుడు బయటపడ్డారు. సోదరుడు బరీన్‌కు మాత్రం శిక్ష పడింది. అప్పటిదాకా అరవిందుడు అలీపూర్‌ ప్రెసిడెన్సీ జైలులో ఉన్నారు. ఇక్కడే ఆయన మానసికంగా ఎంతో మారిపోయారు. అందుకు ఉదాహరణ– స్వామి వివేకానందుల దివ్య ఆత్మ వచ్చి తనతో సంభాషించిందని చెప్పడం. జైలు నుంచి విడుదలైన తరువాత 1910లో ఆయన పుదుచ్చేరి చేరుకుని ఆశ్రమం ఆరంభించారు. అదొక దశ. 

భారత జాతీయ కాంగ్రెస్‌ సిద్ధాంతం, పంథా రెంటినీ కూడా అరవిందుల వారు హర్షించలేకపోయారు. ఆమోదించలేకపోయారు. 1907 నాటి సూరత్‌ జాతీయ కాంగ్రెస్‌ సభలకు ఆయన అధ్యక్షుడు. ఆ సమావేశంలోనే జాతీయ కాంగ్రెస్‌లోని అతివాద, మితవాద వర్గాల విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. సూరత్‌ సభలలో తిలక్‌ ప్రసంగిస్తున్నప్పుడు ఫిరోజ్‌షా అనుయాయులు ఎవరో ఆయన మీదకు బూటు విసిరారు. అది వచ్చి వేదిక మీదే ఉన్న సురేంద్రనాథ్‌ బెనర్జీకి తగిలింది. తరువాత గోఖలే (తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు) వంటివారంతా వచ్చి లోకమాన్యకు రక్షణగా నిలిచారు. కానీ  ఆ ఘటనతో వచ్చిన అపకీర్తి నుంచి కాంగ్రెస్‌ను వారు ఎప్పటికీ రక్షించలేకపోయారు. మితవాద వర్గం నుంచి జరిగిన దుశ్చర్యతో సంస్థ పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. సూరత్‌ సమావేశాల తరువాతే అరవిందుడు వెళ్లి విష్ణుభాస్కర్‌ లేలే అనే మరాఠీ యోగిని కలుసుకున్నారు. ఆ యోగికి అరవిందుడిని పరిచయం చేసినవారు ఆయన సోదురుడు బరీన్‌. ఆ సమావేశం వ్యక్తిగా అరవిందులను ఎంతో మార్చిందని అనిపిస్తుంది. అలీపూర్‌ కారాగారం మొత్తం తనకు వాసుదేవుడి రూపంలోనే కనిపించిందని ఆయన చెప్పేవారు. అక్కడి చెట్ల కింద నడుస్తున్నా, ఆ గోడలను చూస్తున్నా కూడా అదే భావన కలిగేదని ఆయన ప్రకటించారు. 

నిజానికి బరోడా సంస్థానంలో ఉండగానే అరవిందుడు యోగాభ్యాసంలో ఎంతో సాధించారు. 1904 నాటికే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు ప్రాణాయామం చేసేవారాయన. అంతకు ముందు ఏదైనా కవిత రాయాలంటే గంట సేపు ప్రయత్నిస్తే 12 పంక్తులకు మించి సాధ్యమయ్యేది కాదు. ఇక 200 పంక్తులు రాయాలంటే నెల రోజులు పట్టేది. కానీ ప్రాణాయామంలో ఉన్నత శిఖరాలకు చేరిన తరువాత గంటలోనే 200 పంక్తులు రాసే స్థాయికి మానసిక స్థితి ఎదిగిందని ఆయన చెప్పుకున్నారు. అంతటి కృషి చేసినప్పటికి కూడా ‘సావిత్రి’ అనే అజరామర కావ్యం రాయడానికి దాదాపు ఐదు దశాబ్దాలు పట్టింది. అరవిందుడు ‘సావిత్రి’తో పాటు మరెన్నో పుస్తకాలు రాశారు. చదువంటే ఆధ్యాత్మికం, ఆత్మికం మాత్రమే కాదు, హేతుబద్ధత కలిగినది కూడా కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక దశ వరకు విద్య అనేది మాతృభాషలో ఉండాలనే ఆయన వాదించారు. అసలు జీవితం అంటేనే చదువు. కాబట్టి పాఠ్య ప్రణాళికకు పరిమితులంటూ ఏమీ ఉండవు. చదువు కొన్ని పాఠ్య పుస్తకాలు చదవడంతోనే ముగిసిపోయేది కాదు అన్నారాయన. అరవిందుని పేరుని 1943లో నోబెల్‌ సాహిత్య పురస్కారానికీ, 1950లో నోబెల్‌ శాంతి పురస్కారానికీ సిఫారసు చేశారు. 
డా. గోపరాజు నారాయణరావు

మరిన్ని వార్తలు