ఏనాడు ఏ జంటకో  రాసి వున్నాడు  విధి  ఎప్పుడో...

9 Sep, 2018 00:25 IST|Sakshi

పాటతత్త్వం

చిత్రం: అంతులేని కథ రచన: ఆత్రేయ
సంగీతం: ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ గానం: ఎస్‌. పి. బాలు

ఎన్నో పాటలు వస్తాయి, ఎన్నో పాటలు పోతాయి. కాని కొన్ని పాటలు  మాత్రమే బతికుంటాయి. నేటికీ సజీవంగా ఉన్న పాట ‘అంతులేని కథ’ చిత్రంలోని ‘తాళికట్టు శుభవేళ’. తమిళంలో కణ్నదాసన్‌ రచించిన పాటను ఆత్రేయ ఎంతో అందంగా తెనిగించారు. ‘ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో’ అంటూ మెడలో తాళికట్టడం మన చేతిలో ఉండదని, ఎవరికి ఎవరితో ముడి పడుతుందనేది బ్రహ్మ దేవుడు రాసి పంపుతాడని రాశారు మనసు కవి ఆత్రేయ. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ పాటంతా మిమిక్రీతో కలిసి ఉంటుంది. ‘‘వికటకవిని నేను వినండి ఒక కథ చెబుతాను/కాకులు దూరని కారడవి /అందులో కాలం ఎరుగని మానొకటి/ఆ అందాల మానులో ఆ అద్భుత వనంలో/చక్కని చిలుకలు అక్కాచెల్లెలు పక్కన గోరింకలు/ఒక గోరింకకు ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మా/బావా రావా నన్నేలుకోవా’’ అంటూ వచ్చే మొదటి చరణంలో ప్రతి వాక్యం తరవాత మిమిక్రీ వస్తుంది. ‘కాకులు దూరని కారడవి’ తర్వాత వచ్చే పక్షుల శబ్దాలలో కొన్ని శబ్దాలు, చిలుక గొంతులో ‘బావా బావా నన్నేలుకోవా’ అనే మాటలు స్వయంగా బాలునే మిమిక్రీ చేశారు.

ఈ పాటలో మిమిక్రీకి ఎలా నటించాలో నాకు అర్థం కాలేదు. ప్రసిద్ధ మిమిక్రీ కళాకారుడు ‘నేరెళ్ల వేణుమాధవ్‌’ మా గురువులు రాజారామ్‌దాస్‌కి సన్నిహితులు. ఆయన ద్వారా వేణుమాధవ్‌గారిని కలిసి ఎలా నటించాలో నేర్చుకున్నాను. ఈ పాట ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు స్ఫూర్తి. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. ‘నర్తనశాల’ చిత్రంలో బృహన్నల పాత్ర కోసం ఎన్‌.టి. రామారావు, ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చినసత్యం గారిని ఇంటికి పిలిపించుకుని నాట్యం నేర్చుకున్నారు. అదేవిధంగా నేను మిమిక్రీ కళాకారుడిగా నటించడం కోసం నేరెళ్ల వేణుమాధవ్‌ గారి దగ్గర నేర్చుకున్నాను. ‘‘మేళాలు తాళాలు మంగళవాద్యాలు మిన్నంటి మోగెనమ్మా/వలపు విమానాన తలపుల వేగాన వచ్చాయి కాన్కలమ్మా/ఊరేగుదారుల వయ్యారి భామలు వీణలు మీటిరమ్మా/శింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మా/గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవిం^è  వచ్చెనమ్మా/కాన్వెంటు పిల్లల పోలిన నెమళులు గ్రీటింగ్సు చెప్పిరమ్మా/నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మా’’ అని సాగే చరణంలో ప్రతి వాక్యం పూర్తి కాగానే మిమిక్రీ బిట్‌ వస్తుంది. వీణ శబ్దం వచ్చే చోట మిస్టర్‌ అయ్యర్‌ తన గొంతులో పలికించారు. బాలచందర్‌ దగ్గర అసోసియేట్‌గా చేస్తున్న ఈరంకి శర్మ దగ్గరుండి నటన నేర్పించారు. ‘చేయీచేయిగ చిలుకగోరింక శయ్యకు తరలిరమ్మా/చెల్లెలి కోసం త్యాగం చేసిన చిలకమ్మ తొలగెనమ్మా/తప్పుగ తలచిన అప్పటి గోరింకకిప్పుడు తెలిసెనమ్మా/అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మా’ అనే చరణంతో పాట ముగుస్తుంది. ఇందులో ‘చేయీచేయిగ చిలుకగోరింక’ అనే వాక్యాలకు ముందు వచ్చే మాండొలిన్‌లాంటి శబ్దం కూడా బాలు గారే అనుకరించారు. మిగతా శబ్దాలను ఎం.ఎస్‌. విశ్వనాథన్‌ వాద్య బృందంలోని మురుగేష్, సాయిబాబా, సదాశివం ఉరఫ్‌ సదన్‌ వారి వారి గొంతుల్లో పలికించారు. ఈ చిత్ర కథ మొత్తం ఈ పాటలో వచ్చేస్తుంది. ఈ పాటకు నలభై సంవత్సరాలు నిండినా నేటికీ కొత్తగానే ఉంటుంది. ఈ పాటను వేదిక మీద పాడేటప్పుడు మాత్రం అన్ని శబ్దాలను ఎస్‌. పి. బాలు స్వయంగా చేస్తున్నారు.

మూడు రోజుల పాటు ఈ పాట షూటింగ్‌ జరిగింది. నేను బాగానే నటించానని బాలచందర్‌ మెచ్చుకున్నారు. నా నటనలో ఏఎన్‌ఆర్‌ స్టయిల్‌ వస్తోందని, నా సొంత స్టైల్‌ డెవలప్‌ చేసుకోమని సూచించారు. నేను నటించిన మొదటి చిత్రంలోని నా మొదటి పాట ఇంత పెద్ద హిట్‌ కావడం నా జన్మలో మరచిపోలేను.
నారాయణరావు సినీ నటుడు 
- ఇంటర్వ్యూ: వైజయంతి పురాణపండ
 

మరిన్ని వార్తలు