చెదిరిన బతుకులు

16 Dec, 2018 10:17 IST|Sakshi

భార్య వైపు పదిరోజుల తెల్లని కుక్కపిల్లని నెట్టి ‘‘ఓయ్‌! ఇదిగో నీ మోతీ’’ అన్నాడు దిత్తా. కుక్కపిల్ల చిన్నగా అరిచింది.రాఖీ చిన్న బల్లపై కూర్చొని ఉంది. దిత్తా వైపు తిరిగింది.‘‘ఏమిటీ! ఇది నా మోతీయా?’’ అంటూ ఒక ఏహ్యభావంతో ఆ కుక్కపిల్లని ఎడమ చేత్తో తోసివేసింది. దాన్ని చూడను కూడా చూడలేదు. ఒకప్పటి దేశం రెండు ముక్కలు కాగానే దేశంతో పాటు దిత్తా ప్రపంచం కూడా ఛిన్నాభిన్నమైంది. చిక్కుల్లో కూరుకుపోయింది.అన్నివైపుల నుంచీ లూటీలూ మారణహోమాలూ గృహదహనాలూ జరుగుతున్న వార్తలు ముప్పిరిగా వస్తున్నాయి. ఆ దశలో ఒక శ్రేయోభిలాషి ఇలా సూచించాడు. ‘‘దిత్తా! నువ్వెందుకు పాకిస్తాన్‌ వెళ్లిపోకూడదు?’’

దిత్తాకు ఆ మాట ఒక అసభ్యకరమైన దుర్భాషలాగా వినపడింది. అతని తండ్రీ, తాత ముత్తాతలూ, ఎన్నో తరాలుగా ఈ నేల మీదనే నివసించారు. ఈ నేల మీదనే శ్రమించారు. జొన్న, గోధుమ, చెరకు ఈ నేల మీదనే పండించారు. చివరకు వారంతా ఈ నేల మీదనే మరణించారు. అంతటి రుణానుబంధం గల ఈ పవిత్రమైన నేలని విడిచి వెళ్లడం అతని ఊహకే అందని అంశమైంది.దిత్తా పెద్ద కొడుకు ఆరడుగుల వాడు. ఒక బ్రిటిష్‌ పోలీసు అధికారి గాంధీగారి గురించి అవమానకరంగా మాట్లాడితే అతడిపై తిరగబడ్డాడు. పోట్లాట జరిగింది. ఆ గాయాలతోనే యువకుడు చనిపోయాడు. దిత్తా అతడి చితాభస్మాన్ని సేకరించి, తావీజులో పెట్టుకుని మెడలో ధరించాలనుకున్నాడు. కానీ కుమారుడి అవశేషాలేవీ లభించలేదు. నిరాశ చెందాడు.ఇక రెండో కొడుకు మంచి అందగాడు. వేరే ఊర్లో ఉన్న మాతామహుల ఇంటికి చుట్టపు చూపుగా వెళ్లాడు. మరి తిరిగి రాలేదు. అతడి శవం సిర్‌సింద్‌ కెనాల్లో తేలి ఉండటం తను చూసినట్టుగా ఒక పొరుగాయన చెప్పాడు. బహుశా ఒక గుంపు సిక్కులే అతణ్ణి చంపి ఉంటారు. లేక తోటి ముస్లిమే నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి ఉంటాడు. ఆ రోజుల్లో ఇటువంటివి సాధారణంగా జరిగాయి.

ఆ ఇద్దరు అబ్బాయిలూ ఉండి ఉంటే దిత్తాకు ఈ వార్ధక్యంలో ఎంతో ఆసరాగా ఉండేవారు. అతడి జీవితం నిశ్చింతగా సాగేది.ఆ కల్లోల సమయంలో ఎవరూ భగవంతుడిని నమ్మలేదు. పక్కవాణ్ణీ నమ్మలేదు. నిజానికి ఎవరికీ ఎవరి మీదనూ నమ్మకం లేదు. అదో పిచ్చి ప్రపంచమైంది.అటువంటి సంక్షోభంలో ఖాలాసింగ్‌ అనే అతడు అదే అదనుగా సొంత మేనల్లుణ్ణే చంపేశాడు. వారిలో వారికి గొడవలు ఉండేవి. నిద్రిస్తున్న వాడిని నిద్రలోనే మట్టుబెట్టాడు. అతడినెవరూ అనుమానించరనీ, కాకపోతే ముస్లిములనే నిందిస్తారనీ భావించాడు.

ఇలాంటి ఘోరాలు లెక్కలేనన్ని జరిగాయి. ఇరువర్గాలవారూ ఒకరి తలల్ని మరొకరు అవలీలగా నరుక్కున్నారు. ఎటు చూసినా భార్యని పోగొట్టుకున్న భర్తలూ, భర్తని పోగొట్టుకున్న భార్యలూ, సంతానాన్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులూ దీనంగా మిగిలారు. కొన్నిసార్లు కుటుంబాలే మాయమయ్యాయి. జనం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని బతికారు. ఒక మనిషి మూటా ముల్లే సర్దుకుని వేరొక దేశానికైతే పోగలడు. కానీ ఈ దేశపు నేల మీద జీవించి మరణించిన తన పూర్వీకుల ఆత్మల్ని ఎలా తీసుకెళ్లగలడు?దిత్తా నీరు నిండిన కళ్లతో తన భార్యతో ఇలా అన్నాడు: ‘‘పాకిస్తాన్‌ వెళ్లాలా? అక్కడ ఎవరింటికని వెళ్లగలం? అక్కడ మనకు దగ్గర బంధువులూ లేరు, దూరపు బంధువులూ లేరు.’’ రాఖీ ఏమీ అనలేకపోయింది.

మత విద్వేషాలూ, పాశవిక హింస చెలరేగినప్పుడు ఆ ఊరి పెద్దలు దిత్తాతో ఇలా అన్నారు: ‘‘కనీసం పేరైనా మార్చుకో. హిందూ పేరు పెట్టుకో. ఎప్పుడు వెనక నుంచి నిన్నెవరు పొడిచేస్తారో తెలీదు. నిజానికి నీ పూర్వీకులు హిందువులే కావచ్చు. వాళ్లెవరూ మక్కా నుంచి వచ్చి ఉండరు. నీకు పేరుతో పనేముంది?’’దిత్తా చాలా ఆలోచించాడు. వారి సూచనని పాటించాడు. హిందువుగా మారిపోయాడు. ఆ తర్వాత ఏ మతంలో ఉన్నా తేడా ఏమీ లేదని అర్థమైంది. గతంలో అతడి పేరు అల్లా దిత్తాగా ఉండేది. జనం అతణ్ణి దిత్తా అనే పిలిచేవారు. ఇప్పుడు హర్దిత్‌ సింగ్‌ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా జనం అతణ్ణి ‘దిత్తా’ అనే పిలుస్తున్నారు. అతడి భార్య పేరు అప్పుడూ ఇప్పుడూ రాఖీనే. వారి జీవనశైలిలోనూ ఏ మార్పూ రాలేదు.

ఆ ఊర్లో కొందరికి దిత్తా మతం మార్చుకోవడం ఇష్టం లేదు. అది కేవలం ఇండియాను అంటిపెట్టుకొని ఉండటానికి ఒక సౌకర్యంగా ఎంచుకున్నాడని వారికి తెలిసిపోయింది. వారు దిత్తాని పాకిస్తాన్‌ పొమ్మని ఒత్తిడి చెయ్యసాగారు. లేక ఇక్కడే ఉండాలనుకుంటే వారితో ఒప్పందం కుదుర్చుకోవాలని రాయబారం చేశారు. లేదా ఆయుధాలకు పనిపడుతుందని బెదిరించారు. 
ఈ దిశలో ఊర్లోని ఒక పెద్దాయన దిత్తాకు ఒక సలహా ఇచ్చాడు. ‘‘ఎందుకొచ్చిన గొడవ ఇదంటే? ఇండియాలో ఉన్నందుకు పరిహారంగా నీ నాలుగు గాడిదల్ని ఇక్కడి కుర్రాళ్లకు ఇచ్చెయ్యి. వారితో ఒప్పందం కుదుర్చుకో. నిర్భయంగా ఉండు.’’ ఆ సూచన అతడికి నచ్చింది.దిత్తా సంతోషంగా తన నాలుగు గాడిదల్ని ఆ మోతుబరి యువకులకు సమర్పించుకున్నాడు. ‘‘నేను ఇక్కడే ఉండిపోవడానికి వారు అంగీకరించినట్లయితే ఈ గాడిదలు నాకొక లెక్క కాదు. నేను నా సర్వస్వాన్నీ త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను’’ అనుకున్నాడు. ఆమాటే భార్యతో అన్నాడు.

దిత్తా నాలుగు గాడిదలతో బరువులు మోయిస్తూ ఆ కిరాయితో జీవిక సాగించేవాడు. అలా సంపాదిస్తున్న స్వల్ప ఆదాయం కూడా గాడిదలతో పాటుగా పోయింది. అయినా దిత్తా, అతడి భార్య పస్తులుండలేదు. జీవితం మీద ఆశ చంపుకోలేదు.నారత్‌ సింగ్‌ అనే ఆయన తన పశువుల్ని కాయడానికి దిత్తాను నియమించుకున్నాడు. రోజూ తిండి పెడుతూ, పంట కోతల సమయంలో పదిహేను రూపాయలు ఇవ్వచూపాడు. ఈ ఉపాధి దిత్తాకు సంతోషం కలిగించింది. రాఖీకి ఆ సరికే యాభై ఐదు సంవత్సరాలు దాటాయి. చిన్నా చితకా పనులు చేసేది. దూది ఏకేది. గోధుమలు తిరగలి పట్టేది. ధాన్యం దంచేది. గోడలకు మట్టి మెత్తేది. ఆవిధంగా దిత్తా సంపాదనకు సహాయకారిగా ఉండేది. ఏ రోజూ వారికి కాస్తంత తిండికి లోటు ఉండేది కాదు. రాఖీ ఎప్పుడూ ఇది లేదు అది లేదు అని గానీ, ఇది కావాలి అది కావాలి అని గానీ సణిగేది కాదు. కానీ ఆమె గతంలో మాదిరిగా పాడుకునే శక్తిని పోగొట్టుకుంది. రాత్రిళ్లు ఏడుస్తూ కూర్చునేది. పనేదీ దొరక్కపోతే పగలు కూడా ఏడ్చేది. 

ఒక సాయంకాలం జంగీర్‌భాగా అనే ఆయన వచ్చి రాఖీని పిలిచాడు. ప్రసవిస్తున్న తన భార్యకు మంత్రసానితనం చెయ్యమని కోరాడు. ఒకప్పటి ముస్లిం దాది ఈ దేశం విడిచి వెళ్లిపోయింది. దాంతో ఆ ఊర్లో ఆయా లేకుండా పోయింది. రాఖీ నలుగురు పిల్లల్ని కని పెంచిందే గానీ మంత్రసాని పని తెలీదు. అయినా ఒప్పుకొని వెళ్లింది. తన పని సంతృప్తికరంగానే చేసింది. జంగీర్‌కు కొడుకు పుట్టాడు. అతడు మంచి భూకామందు. మగ సంతానం కలగడం వల్ల ఆ కుటుంబం ఆనంద సాగరంలో మునిగి తేలింది. జంగీర్‌ భార్య ఇలా అంది: ‘‘రాఖీ! మేం సంతోషంగా ఉన్నాం. నిన్నూ సంతోషపెట్టాలనుకుంటున్నాం. నీకేం కావాలో నిరభ్యంతరంగా కోరుకో. ఇస్తాను.’’ఈ దేశపు నేల మీద ఉండటం కోసం ఒక్కసారిగా నాలుగు గాడిదల్ని కోల్పోయిన బాధ ఆమె అంతరాంతరాల్లో కలుక్కుమంటూనే ఉంది.కాబట్టి రాఖీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండానే ఇలా అంది: ‘‘అమ్మా! మీరు నిండు నూరేళ్లు జీవించాలి. నాకొక గాడిదని కొని ఇప్పించండి. చాలు.’’రాఖీ చిరుకోరికని తీర్చడం జంగీర్‌కు చాలా తేలికైనది. మరుసటి రోజు ఉదయానికల్లా మూడు నెలల గాడిద పిల్ల దిత్తా ఇంటి ముందుంది.

రాఖీ తొందరపాటుకీ తెలివితక్కువతనానికీ దిత్తా చిరాకుపడ్డాడు. ‘‘ఎంత పనిచేశావు! ఇంతకంటే విలువైన కోరిక కోరాల్సింది. ఈ పిల్ల గాడిద సంపాదనకు పనికొచ్చే వరకు దీన్ని పోషించాలి. అది కూడా ఒక్క గాడిద ఎందుకూ పనికి రాదు. ఎక్కువ బరువుల్నీ మొయ్యలేదు.’’కానీ, రాఖీ వద్ద అతడి వాదనలేవీ పనిచెయ్యలేదు. గాడిద పిల్ల పాలవంటి తెల్లని రంగులో ఉంది. మంచి ఎండలో రాఖీ దానికి స్నానం చేయించేది. మెడకు గోరింటాకు పూసేది. వెంట్రుకలన్నీ దువ్వేది. దానికి నామకరణం చేసింది. అది తెల్లగా ముచ్చటగా ఉన్నందు వల్లనే రాఖీ దానికి ఇన్ని హంగులు చేస్తున్నదని ఊరంతా నవ్వుకున్నారు. కానీ ఆమె ఆలోచనలు వేరు. చనిపోయిన పెద్దకొడుకు పేరు మామ్దీన్, చిన్నకొడుకు పేరు తూఫిక్‌. ఆ రెండు పేర్ల మొదటి అక్షరాల్ని కూర్చి ఈ గాడిద పిల్లకు ‘మోతీ’ అని పేరు పెట్టుకుంది. ఆ పేరుతో పిలిచినప్పుడు ఆమెకు తన కొడుకులిద్దరూ గుర్తు వచ్చేవారు. ఆమె పెదవులకు తేనె తగిలినట్టుండేది.కొన్నాళ్లు గడిచాయి. గాడిద కొంచెం పెద్దదయింది. ఒకరోజు దిత్తా దానిపైన బరువులెత్తడం కోసం ఒక జీనునీ, సంచీని తయారు చేస్తున్నాడు. కానీ రాఖీకి అప్పుడే దాన్ని బరువుల కోసం వినియోగించడం సుతరామూ ఇష్టం లేదు. ‘‘ఓయ్‌! నువ్వు జీనునీ, సంచీని తయారు చేస్తున్నావు. బాగానే ఉంది. కానీ బరువులు నువ్వే మొయ్యాలి. మోతీ వీపు మీద వెంట్రుక బరువు కూడా పెట్టడానికి వీల్లేదు.’’

అంతలో దిత్తాకు జబ్బు చేసింది. వదలని జ్వరంతో మంచం పట్టాడు. రాఖీ అతడ్ని ప్రేమతో జాగ్రత్తగా సాకింది. వ్యాధి నయం చెయ్యడానికి ఎన్నో మందులూ మాకులూ తెచ్చింది. పడరాని పాట్లు పడింది. అదే సమయంలో పూట గడవడానికీ చేతనైన పనులు చేస్తూనే ఉండేది. దిత్తా కోసం బెల్లం, తేయాకు, మేకపాలు మొదలైనవి కొనడానికి డబ్బు అవసరమైంది. కానీ ఆమె చాకిరీ చేసి తెచ్చిన డబ్బు చాలేది కాదు. దాంతో ఒకసారి ఐదువందలూ, ఆ అప్పు అలా అలా ఏడెనిమిది వందల వరకూ పెరిగింది. చివరకు గి«ద్‌మాల్‌ అనే ధనికుడు కావలసిన మొత్తం అప్పుగా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒకనెల అయ్యేసరికి ఆ మొత్తం బాగా పెరిగిపోయింది. గి«ద్‌మాల్‌ కొడుకు లక్ష్మణ్‌ లెక్కలన్నీ చూశాడు. బాకీ కింద మోతీని తీసుకుపోయాడు.రాఖీ కోపంతో రగిలిపోయింది. కానీ ఆమె చెయ్యగలిగిందేమీ లేదు. లక్ష్మణ్‌ని మనసులోనే తిట్టుకుంది. శపించింది. దిత్తా ఆమెని శాంతింపజేశాడు. ‘‘మనం గి«ద్‌మాల్‌ కుటుంబం నుంచి ఎన్నో ఉపకారాలు పొందాం. లక్ష్మణ్‌ దురాశాపరుడుగా కనిపిస్తున్నాడు. కానీ మనసులో మంచివాడే. అతడు మన ఇంట్లో వస్తువులేవీ ముట్టుకోలేదు. తలచుకుంటే మన బాకీకి బదులుగా ఇల్లు గుల్ల చేసేవాడు. మనమూ మాట్లాడలేకపోయేవాళ్లం. ఒక్క గాడిదతో సరిపెట్టుకున్నాడు.

 సంతోషించు.’’ అని ఉద్బోధ చేశాడు. కానీ రాఖీ ఈ మాటల్ని పూర్తిగా అంగీకరించలేకపోయింది. మోతీ వియోగాన్ని కూడా భరించలేకపోయింది. ప్రత్యేకంగా తుంచిన ఆకులూ, ఖరీదైన కాయధాన్యాలు పెట్టి ఆమె మోతీని పెంచింది. కంటికి రెప్పలా చూసుకుంది. అలాంటి మోతీని నష్టపోవడం ఆమెకు తీరని లోటుగా పరిణమించింది.కొంతకాలానికి దిత్తాకు నయమైంది. లేచి తిరిగాడు. గి«ద్‌మాల్‌ కుటుంబానికి గాడిదను పెంచడం తెలీదు. వారి పెద్ద భవంతిలో మోతీ సంతోషంగా లేదు. తినడం మానివేసింది. ఒకమూలగా బెంగతో ఒదిగి ఉండేది. దాని తల కూడా ఎప్పుడూ విచారిస్తున్నట్లుగా కిందకే ఒంగి ఉండేది. ఒక శుక్రవారం రాత్రి రాఖీకి ఒక కల వచ్చింది. ఆ కలలో పోయిన ఆమె ఇద్దరు కుమారులూ తలలు వంచుకుని నిలుచుని ఉన్నారు. వారి ఎముకల మూలుగ మరుగుతున్న బానలో కారుతున్నది. రాఖీ తుళ్లిపడి లేచింది. దిత్తాను గట్టిగా కదిలించి లేపింది. తన కల గురించి చెప్పింది. ఆ కలని ఆమె అశుభ సూచకంగా భావించింది. ఆందోళన చెందింది. ఉదయాన్నే గి«ద్‌మాల్‌ ఇంటికి పరుగెత్తింది. నిజానికి గతంలో తన ప్రీతిపాత్రమైన మోతీని ఎత్తుకుపోయిన వారి ఇంటివైపు కన్నెత్తి చూడకూడదని ఒట్టు పెట్టుకుంది. అయినా మనసు మార్చుకుని మోతీని చూడటానికి వెళ్లింది. 

అత్యంత దర్పం గల ఏనుగుని సైతం ఆకలి నేలకు సాగిలబడేట్టు చేస్తుంది. తపస్సంపన్నులైన మునులూ రుషులూ కూడా ఆకలికి దాసోహం అంటారు. అదే ఆకలి మోతీ జీవశక్తిని హరించివేసింది. ఇప్పుడు దాని కాళ్లు నిటారుగా నిలబడలేకపోతున్నాయి. వొణికి పోతున్నాయి. వొంగిపోతున్నాయి. రాఖీ మోతీ వద్దకు వెళ్లేసరికి దాని జీవశక్తి నెమ్మదిగా అణగారిపోతున్నది. మోతీ తనను పెంచిన రాఖీని గుర్తించింది. కానీ తల కదిలించడానికీ దానికి శక్తి లేదు. ఆమె చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ప్రాణం గాలిలో కలిసిపోయింది. దేహం మట్టిలోకి చేరుతుంది.ఆ దృశ్యాన్ని చూసిన రాఖీ చలించిపోయింది. గి«ద్‌మాల్‌ ఇంటి నుంచి తిరిగి వచ్చేసింది. తర్వాత కూడా దుఃఖంలో మునిగి, కుంగిపోయింది. మళ్లీ మనిషి కాలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి.
∙∙ 
‘‘ఔను. దీన్నే నీ మోతీ అనుకో’’ అన్నాడు దిత్తా. ఆ కుక్కపిల్ల కోసం కొన్ని పవిత్రమైన మాటల్ని వాడాడు. ‘‘దీని కళ్లు చూడు. ఎంత ముచ్చటగా ఉన్నాయో!’’ అంటూ మరికొన్ని మెచ్చుకోలు మాటల్ని జత చేశాడు. ‘‘కుక్క చాలా విశ్వాసపాత్రమైన జంతువు తెలుసా?’’ అని బోధపరచాడు. ‘‘ఇది కచ్చితంగా నీ మోతీ స్థానాన్ని భర్తీ చేస్తుంది.’’ అని నచ్చచెప్పాడు. దాని శరీరాన్ని నెమ్మదిగా నిమిరాడు.రాఖీ ఆ చిన్న కుక్కపిల్లవైపు పరిశీలనగా చూసింది. దాని కళ్లలోకి చూస్తున్న కొద్దీ అవి ముద్దుగా కనిపించాయి. అది కూడా మచ్చికగా తోకాడించింది. పెద్ద కొడుకు మామ్‌దీన్‌ ముఖం, చిన్న కొడుకు తూఫిక్‌ అందమైన కళ్ల కోసం దాన్లో ఆమె వెతుకుతున్నట్లు అనిపించింది. కుక్కపిల్ల మెత్తని శరీరాన్ని తన ముఖానికి దగ్గరగా తీసుకుంది. ‘‘ఓసీ! చిట్టి భడవా!’’ అని అరిచింది. పాపం కుక్కపిల్ల తికమకపడుతూ చూసింది. చిన్నగా మొరిగింది. రాఖీ మరోసారి లాలిస్తూ అరిచింది. కుక్కపిల్ల బెదిరిపోయింది. భయంతో దాని కాళ్లు తీగకు వేలాడిన పక్షిలా కొట్టుకున్నాయి.

ఏవేవో అప్రియమైన తలపులు రాఖీని కలతపరచాయి. పాపం ఆ కుక్కపిల్లకు ఇవేవీ తెలీవు. దేశం రెండుగా విడిపోయిందని తెలీదు. రెండు మతాల వారు తమ తలల్ని తెగనరుక్కుంటున్నారని తెలీదు. దిత్తా కుటుంబం దేశ విభజన చక్రాల కింద చితికిపోయిందని తెలీదు. అందివచ్చిన అతని కొడుకులిద్దరూ మత విద్వేషాలకు బలైపోయారని తెలీదు. అది కాళ్లాడిస్తూ సన్నగా అరిచింది. అతి ప్రయత్నం మీద రాఖీ తమను ముంచేసిన విషాదాన్ని దిగమింగుకుంది. కుక్కపిల్లని గుండెకు హత్తుకుంది. మొత్తని దాని మూతిభాగాన్ని ముద్దు పెట్టుకుంది. ముట్టి చల్లగా తగిలింది. ఆమె కళ్లు చెమ్మగిల్లాయి.

మరిన్ని వార్తలు