ప్రతి పిల్లికీ ఓ రోజు

28 May, 2017 00:39 IST|Sakshi
ప్రతి పిల్లికీ ఓ రోజు

‘మియాం.. మియాం.. అదిగో పిల్లి. వచ్చేస్తోంది!’ అంటూ చిచ్చర పిడుగులకు.. పులిని చూపించినంత భయంకరంగా పిల్లిని చూపించి హడలెత్తిస్తాం! ఇంటి దరిదాపుల్లో పిల్లి కనిపిస్తే భౌ..భౌ అంటూ దానిపై కయ్యానికి దిగుతాం! పాలు, మాసం, గుడ్లు ఇంట్లో దాచేటప్పుడు, కోడిపెట్టలను గూట్లోకి ఎక్కించేటప్పుడు పిల్లి రాజు ఎక్కడైనా పసిగడుతుదేమోనని భయపడతాం! ఎదురొస్తే అపశకునం అనే సెంటిమెంట్‌తో అది కనిపిస్తేనే దారి మార్చుకుంటాం! మన తెలుగు ఇలాకాలో పిల్లంటే ఇష్టపడే వారికంటే తన్ని తరిమే వారే ఎక్కువ. కానీ... వాటితో చెలిమి చేస్తే కుక్కల కంటే విశ్వాసంగా ఉంటాయంటుంటారు పిల్లి ప్రేమికులు. మరి పిల్లి గురించి కొన్ని నిజాలు తెలుసుకుందామా..?

ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల పిల్లులు ఉన్నాయని ఓ అంచనా. వాటిలో 40 రకాల జాతులు ఉన్నాయి. ఒక పిల్లి తన జీవిత కాలంలో సగటున 2/3 వంతు నిద్రలోనే గడుపుతుంది. అంటే ఒక పిల్లి జీవితకాలం 9 సంవత్సరాలు అనుకుంటే.. అందులో కేవలం 3 సంవత్సరాలు మాత్రమే మెలకువగా ఉంటుందన్నమాట!

పిల్లి ఇంచుమించు 100 రకాల శబ్దాలు చెయ్యగలదు. అదే కుక్క అయితే 10 రకాల మించి శబ్దాలు చెయ్యలేదు.
ఉత్తర అమెరికాలో కుక్కల కంటే ఎక్కువగా పిల్లులనే పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. లెక్కల్లో చెప్పుకోవాలంటే సుమారు 7 కోట్లకుపైగానే పెంపుడు పిల్లులు ఉన్నాయని ఓ అంచనా.

భావోద్వేగాలకు సంబంధించిన పిల్లికి – మనిషికి దగ్గర సంబం«ధాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.

పిల్లి చరిత్ర 3 కోట్ల ఏళ్లక్రితం నాటిదేనని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆ కాలం నాటి  పిల్లి శిలాజాన్ని వారు కనుగొన్నారు. దానికి ప్రోలూరస్‌ అనే పేరు పెట్టారు. అంటే మొదటి పిల్లి అని అర్థం.

ఈజిప్షియన్లు పిల్లిని దైవంగా భావిస్తారు. పిల్లి కనిపిస్తే శుభప్రదమని నమ్ముతారు. ‘పిల్లి తల, మనిషి శరీరంతో ఉన్న ఓ ఆకారాన్ని’ దేవతగా కొలుస్తుంటారు. అందుకే ఈజిప్టులో పిల్లిని స్మగ్లింగ్‌ చేస్తే మరణ శిక్ష విధించేవారు.

అమెరికాలోని ఆస్టిన్‌ టెక్సాస్‌లో క్రీమే పఫ్‌ అనే పిల్లి... 38 సంవత్సరాలు జీవించి రికార్డు సృష్టించింది. 2005లో మృతి చెందిన ఈ పిల్లి... మనిషి ఆయువుతో పోల్చుకుంటే 96 సంవత్సరాలు జీవించినట్లు.

కేవలం ఒక్క ఆసియాఖండంలోనే ప్రతి సంవత్సరం 40 లక్షల పిల్లులను తింటున్నారంటే పిల్లి మాంసానికి ఉన్న గిరాకీ అర్ధం చేసుకోవచ్చు.

ఒక మనుషులు ధరించే కోటు తయారు కావాలంటే సుమారు 24 పిల్లల చర్మం అవసరం.

అమెరికాలో ప్రతి ఏడాదీ 40 వేలమంది పిల్లికాటుకి గురవుతున్నారని ఓ అంచనా.

మరిన్ని వార్తలు