పేరులో మాత్రమే బంగారం

28 Jul, 2019 09:15 IST|Sakshi

ఈవారం కథ

ప్రశాంతమైన ఊర్లో పోలీసులా సూర్యుడు నింపాదిగా డ్యూటీ ఎక్కుతున్న ఓ శీతాకాలపు ప్రాతఃకాలం. దూరంగా వెంకటరమణమూర్తి గుళ్ళో ధనుర్మాసం పూజలు, గంటలు, వినిపిస్తున్నాయి. 
‘‘కాంచనా!, త్వరగారా, టైంఅవుతోంది, డ్రైవర్‌ వచ్చేస్తాడు’’ అంటూ గట్టిగా అరిచాను హాల్లో షూ వేసుకుని పాలిష్‌ చేసుకుంటూ.  
‘‘ఆ వస్తున్నా.. రెండే నిమిషాలు’’ అంటూ కిచెన్లో మిక్సీ ఆన్‌ చేసింది కాంచన. అన్నట్టుగానే రెండునిమిషాల్లో ఓ చేత్తో స్టీల్‌గ్లాస్‌లో కాఫీ రెండో చేత్తో ప్లేట్లో మూడిడ్లీ, చట్నీ తెచ్చి టేబుల్‌ మీద పెట్టి, కాఫీ చేతికందించింది. అమ్మ ఇంకా లేవలేదు.  
కాంచన– ఎరుపెరుగని కనులు, నలుపెరుగని మనసు, చలికాలంలో తొలికిరణంలా నొసటన కుంకుమ, ఆకలెరుగనివ్వని అమ్మతనం, నేనే లోకమైన అమాయకత్వం –ఇవీ తనలో నాకు కనిపించే అందం. పెళ్ళై పాతికేళ్ళయినా,  ఇద్దరు ఇంజనీరింగ్‌ కొచ్చిన పిల్లలున్నా, ఇప్పటికీ ఆమె ముఖంలో వేకువనే ప్రకృతిలో ఉండే ప్రశాంతత, కళ్ళల్లో వర్షం పడినప్పుడు పూలమొక్కలోఉండే స్వచ్ఛత.

ఎంత యోగా ట్రై చేసినా నాకు మాత్రం ఆ లక్షణాలు వంటపట్టలేదు. ఛాలెజింగ్‌గా ఉండే సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగంలో వచ్చే ఒత్తిళ్ళు ఏమాత్రం గుర్తు రాకుండా ఇంటికొస్తే తనే నా స్ట్రెస్‌బస్టర్‌.  నాతోనే ఉండే అమ్మ, బాగా చదువుకునే పిల్లలు బోనస్‌. 
ఆలోచనలలోంచి బయటకి వచ్చి, టిఫిన్‌ చేస్తూ చూశా కాంచన వైపు. చెవులకి చిన్నచిన్నదిద్దులు. ‘‘కాంచనా, నీ గుండ్రటి మొహానికి దిద్దులు కాకుండా బుట్టలైతే బాగుంటాయేమో?’’ అన్నాను నవ్వుతూ.  
‘‘నా చెవులకు బుట్టలు కన్నా, నడుముకి వడ్డాణం అయితే ఇంకా బాగుంటుంది.’’ అంది రిప్లై నవ్వుతో. 
అక్కడితో ఆగలేదు. 
‘‘ఏమండీ, పక్కింటావిడ, ‘మీ ఆయన చూస్తే ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ ఆఫీసర్‌. ఇంచుమించు వారానికోసారి స్మగ్లింగ్‌ చేసిన బంగారాన్ని కస్టమ్స్‌ వాళ్ళు పట్టుకున్నారని పేపర్లో వస్తుంది.  మీ వంటి మీద చూస్తే పట్టమని నాలుగు తులాలు కూడా ఉండదు’ అంటూ వెటకారం చేస్తోదండి. పైగా, మొన్న పూజకి పిలిచి, తను కొత్తగా కొనుక్కున్న వడ్డాణం అందరికీ చూపించింది. నాకుతప్ప.’’ అంది కొంచెం దిగులుగా.

‘‘అబ్బబ్బా, అవన్నీ నాకు ఇప్పుడే చెప్పాలా, నాకు టైమైపోతోంది.  నేనే అనవసరంగా బంగారం ఊసెత్తా. ఈసారి ఆవిడకి చెప్పు. కస్టమ్స్‌ ఆఫీసర్‌ అంటే స్మగ్లింగ్‌ చేసేవాడుకాదు, ఆపేవాడని.  సరే, సరే, వస్తా డ్రైవర్‌ ఆల్రెడీ కింద కొచ్చేసినట్టున్నాడు. మిస్డ్‌కాల్‌ ఇచ్చాడు’’ అంటూ బ్రీఫ్‌ కేసు తీసుకుని కిందకి పరిగెత్తా. అప్పటికే ట్రావెలర్‌లో నలుగురు కొలీగ్స్‌ ఉన్నారు. దారిలో ఇంకో ఇద్దరు ఎక్కుతారు. అంతా ఎయిర్‌ పోర్ట్‌కి చేరుకునేసరికి ఉదయం ఆరుంపావు అవుతుంది.  వెళ్లి అందరం యూనిఫార్మ్స్‌ మార్చుకొని, రెడీ అయ్యేటప్పటికి దుబాయ్‌ ఫ్లైట్‌ వస్తుంది.  అది చిన్న సిటీ కావడంతో, ఈమధ్యే ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ తిరగడం స్టార్ట్‌ అవటంచేత, పెద్దగా ప్యాసింజర్లు ఉండరు. దుబాయ్‌ నుంచి వచ్చే వాళ్ళు రోజుకు డెబ్బై మంది ఉంటారు అంతే.  వాళ్ళ బ్యాగేజ్‌ని, అవసరమైతే అందులో కొందరిని క్షుణ్ణంగా చెక్‌ చెయ్యాలి. 

బంగారం ధర పెరిగేకొద్దీ, కస్టమ్స్‌ డ్యూటీ ఎగ్గొట్టడానికి ఇంచుమించు రోజూ స్మగ్లర్లు అక్రమంగా ఎక్కడో అక్కడ దాచి తేడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు.  సీలింగ్‌ ఫ్యాన్‌ బేరింగ్‌ రూపంలో, ఛార్జ్‌ లైట్‌ లోపల బ్యాటరీ రూపంలో, సూట్‌కేసు లైనింగ్‌లో, కడుపులో, ఆఖరికి మలద్వారంలో కూడా బంగారం పెట్టి తెచ్చేస్తూ ఉంటారు. దేశంలో బంగారానికున్న సెంటిమెంట్, క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవడమే వీళ్ళ వృత్తి.  ఇవన్నీ ఆపటమే మా వృత్తి. 
కళ్ళు ఎర్రబడి భారంగా నడిచేవాళ్ళు, టక్, టైతో సాఫ్ట్‌వేర్‌లా కనిపించేవాళ్ళు– వీళ్ళలో ఎవరిని ఆపాలో, ఎవరిని పంపాలో, ఎవరిని తడమాలో, ఎవరిని తరమాలో ఇదంతా ఓ పది నిమిషాల్లో నిర్ణయించవలసి రావటం, ఇలా మా వృత్తి రోజు ఓ సాహస యాత్రే. నిత్యం నిప్పుల నడక, కత్తుల వంతెనే. ఈ ప్రాసెస్‌లో ఒక్కోసారి ఆఫెండ్‌ అవుతూ ఉంటారు.  వాళ్ళ చేత మాటలు పడవలసి వస్తుంది.

ఓ వారం డే డ్యూటీ చేస్తే, మరోవారంౖ నెట్‌ డ్యూటీ. ఏదైనా కేసు బుక్‌ చేస్తే,  స్మగ్లర్ని అరెస్ట్‌ చెయ్యడం నుంచి,  గవర్నమెంట్‌ హాస్పిటల్లో మెడికల్‌ టెస్ట్‌లు చేయించి, మేజిస్ట్రేట్‌గారి ముందు హాజరు పరచి, సెంట్రల్‌ జైల్లో హ్యాండ్‌ ఓవర్‌ చెయ్యడం వరకు దాదాపు ఓ రెండు రోజులు ఇంటికి కూడా  వెళ్ళడానికి అవదు. కానీ ఓ కేసుని చాకచక్యంగా ఛేదించి,  ప్రభుత్వానికి లక్షల్లో ఒక్కోసారి కోట్లలో ఆదాయాన్ని వచ్చేలా చేశామన్న ఆనందంతో ఈ కష్టాలన్నీ మర్చిపోయి, మళ్ళీ మర్నాడు ఉత్సాహంగా డ్యూటీకి వెళ్తాము. ఇదీ ఒరకమైన దేశభక్తే. 
ఎయిర్‌ లైన్స్‌ నుంచి ప్యాసింజర్‌ లిస్ట్‌ తీసుకొని రెడీగా ఉన్నాము. ఓపావు గంట లేటులో ఫ్లైట్‌ దుబాయ్‌ నించి వచ్చింది.  బోనఫైడ్‌ ప్యాసింజర్స్‌ బ్యాగేజ్‌ క్లియర్‌ చేసి, అనుమానాస్పదంగా అనిపించిన ఓ అయిదుగురి పాస్‌పోర్ట్‌లు తీసుకున్నాము. వీళ్ళ బ్యాగేజీల మీద స్కాన్‌ మార్క్‌ పెట్టాడు మా ఆఫీసర్‌. అంటే క్షుణ్ణంగా చెక్‌ చెయ్యమని.

అందులో ఒకావిడ ముస్లిం, ఓ అరవైఏళ్ల ముసలాయన, స్మార్ట్‌గా ఉన్న ఓ కుర్రాడు. బహుశా టెక్కీ అయ్యుంటాడు. ఓ ప్లంబర్, ఓ బిజినెస్‌మేన్‌.  ఈ ఐదుగురు మెటల్‌ డిటెక్టర్‌లోంచి పాస్‌ అయినప్పుడు బీప్‌ సౌండ్‌ బాగా వచ్చింది. పైన రెడ్‌లైట్‌ కూడా బాగాబ్రైట్‌గా వెలిగింది. మెటల్స్‌ ఏమైనా ఉంటే అలాగే జరుగుతుంది. అదే మాకు ప్రిలిమినరీ సస్పిషన్‌.  
బిజినెస్‌మేన్‌ చేతికి బ్రేస్లెట్‌ ఉంది. మెళ్ళో ఓలావు గొలుసు ఉంది. రెండూ కలిపి లిమిట్‌ కంటే కొంచెం ఎక్కువే ఉంది. అతన్ని ఆపి క్షుణ్ణంగా చెక్‌ చేసి ఇంకేమీ లేవని నిర్ణయించుకున్నాక, అతనికి రూల్స్‌ వివరిస్తే  చాలా హుందాగా డ్యూటీ కట్టేసి వెళ్ళిపోయాడు. హమ్మయ్య అనుకుని ఊపిరి తీసుకుని, ముస్లిం యువతిని రూమ్‌లోకి పంపి లేడీ ఆఫీసర్‌ చేత చెక్‌ చేయించాము.  ఆవిడ దగ్గర కూడా పెద్దగా ఏమీ లేవని నిర్ధారించుకుని ఆవిడని పంపేశాము.

ఆ తర్వాత ముసలాయన. ఆయన దగ్గర బంగారం లేదుకానీ, ఆపిల్‌ ఫోన్‌తో సహా కాస్టీ›్ల ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి.  ఆయన దగ్గర డ్యూటీ కట్టటానికి డబ్బులు లేవంటే ఆ వస్తువులు డిటైన్‌ చేసి వస్తువులకు రసీదు ఇచ్చి, వెళ్లి డబ్బులు తెచ్చి డ్యూటీ కట్టి తీసుకెళ్లమని పంపేశాము. ఆయన తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. 
మా అనుమానం అంతా ప్లంబర్‌ మీదే  పైగా అతని కళ్ళల్లోబెరుకు చూస్తే మాకు తెలిసిపోతోంది. ఇలాంటివి ఎన్నోచూశాము. అందుకే అతన్ని పక్కన కూర్చోమని, ఆ కుర్రాణ్ణి కూడా డిస్పోజ్‌ చేసేసి, అప్పుడు తీరిగ్గా చెక్‌ చెయొచ్చని, ఆ కుర్రాడి బ్యాగేజి చెక్‌ చెయ్యడం మొదలుపెట్టాము. అతను విసుక్కుంటున్నాడు.

‘‘సర్, అందర్నీ పంపేసి మీరు నన్ను మాత్రమే ఉంచి, ఇన్సల్ట్‌ చేస్తున్నారు.  మీకు తెలుసా నేను ఎం.టెక్‌ చదివాను. నా శాలరీ నెలకి త్రీ లేక్స్‌. రేపు నా సిస్టర్‌ మ్యరేజ్‌. ఇక్కడి నుంచి నేను మావూరు వెళ్ళటానికి టాక్సీ కూడా మాట్లాడుకున్నాను. డ్రైవర్‌ బయట వెయిట్‌ చేస్తున్నాడు. నేను వెళ్ళాలి’’ అన్నాడు విసుగ్గా.
‘‘సరేసర్, ఫైవ్‌ మినిట్స్‌లో వెళ్లిపోదురుగాని’’  అంటూ, ఆయన బ్యాగ్‌ ఓపెన్‌ చేయించి చెక్‌ చేయడం మొదలుపెట్టాము. మొత్తం మూడుబ్యాగ్లు.  ముందుగా సూట్‌కేసుకి ఏమైనా ఫాల్స్‌బాటమ్, టాప్‌ ఉందేమో చెక్‌ చేశాము. ఆ తర్వాత ఓపెన్‌ చేసి చూసాము.  ఓ బ్యాగ్‌లో సీలింగ్‌ఫ్యాన్‌. మా దగ్గరున్న టూల్‌ కిట్‌తో దాన్ని ఓపెన్‌ చేశాము. అతను చాలా అసహనంగా ఉన్నాడు. 
‘‘సర్‌ దిస్‌ ఈస్‌ టూమచ్‌’’ అన్నాడు విసుగ్గా.
‘‘సారీసర్, మా డ్యూటీ మేము చెయ్యాలి కదా. అయినా మీరు దుబాయ్‌ నుంచి సీలింగ్‌ ఫ్యాన్‌ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి?’’అడిగాను సీరియస్‌గా.
‘‘నా ఇష్టం సర్, ఇది రిమోట్‌ ఫ్యాన్‌. బాగుందని, పల్లెటూర్లో ఉన్న మా తాత గారికి కొన్నాను’’ అన్నాడతను కోపంగా.

‘ఓకే ఓకే’ అంటూ మా అసిస్టెంట్‌ చేత ఓపెన్‌ చేయించా.  బేరింగ్‌ తీసి, స్క్రూడ్రైవర్‌తో గోకి చూసాడు.  అది మాములు బేరింగ్‌ మాత్రమే.  తిరిగి బిగిస్తూ ఉండగా ఫ్యాన్‌ మీ ఓస్క్రాచ్‌ పడింది.  అంతే అతను మామీద ఎగరటం మొదలుపెట్టాడు. 
ఆ తర్వాత దొరికిన అనుమానించ తగ్గ వస్తువుఛార్జ్‌లైట్‌.  టెస్ట్‌ చేస్తే వెలుగుతోంది. అది కూడా ఓపెన్‌ చేస్తూ ఉంటే అతను అడ్డుకున్నాడు.
‘‘సర్‌ దీన్ని ఓపెన్‌ చేస్తే తిరిగి ఫిక్స్‌ చెయ్యడం కష్టం.  మా ఊర్లో పవర్‌ కట్‌ ఎక్కువ. అందుకని మా వాళ్లకి తెచ్చాను. దీన్ని ఓపెన్‌ చెయ్యడానికి నేను ఒప్పుకోను’’ అన్నాడు అతను దృఢంగా.  మా అనుమానం ఇంకా బలపడింది. 
‘‘సారీసర్, సాధారణంగా ఛార్జ్‌లైట్‌కి ఒక బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కానీ ఇందాక స్కాన్లో చూస్తే ఈ ఛార్జ్‌లైట్‌లో రెండుబ్యాటరీలు ఉన్నాయి. అందుకే మాకు అనుమానంగా ఉంది. మేము ఓపెన్‌చేసి తీరాలి. అది పాడైతే మేము దాని ఖరీదు మీకు పేచేస్తాము’’ అంటూ, ఓపెన్‌ చేశాం. 
బ్యాటరీ తీసి చెక్‌ చేశాము.  అందులో ఉన్న రెండూ బ్యాటరీలు మాములువే. అప్పుడు అతను ఆ ఆ ఛార్జ్‌లైట్‌ మాన్యువల్‌ తీసి మాకు చూపించాడు.  అందులో రెండు బ్యాటరీల చార్జర్‌ అని రాసి ఉంది.  మా అసిస్టెంట్‌ ఆ ఛార్జ్‌లైట్‌ని తిరిగి ఫిక్స్‌ చెయ్యలేకపోయాడు.  నేను అతనికి సారీ చెప్పి, పర్సులోంచి అమౌంట్‌ ఇవ్వబోయాను. అతను తీసుకోకుండా, లాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి, నెట్‌ ఆన్చేసి, మా హెడ్‌ క్వార్టర్‌కి  ప్రైమ్‌ మినిస్టర్‌  ఆఫీస్‌కి సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌కి కంప్లైంట్‌ చెయ్యడం మొదలు పెట్టాడు.     

నేను వద్దంటే బాగోదని ఊరుకున్నాను.  మా అసిస్టెంట్‌ మాత్రం అతన్ని రిక్వెస్ట్‌ చేస్తున్నాడు.
‘‘సర్, ప్లీజ్‌ సర్, ఒద్దుసర్‌’’ అని. 
అతను బాగా కోపంగా ఉన్నాడు.  చెప్పినా ఆగడని నాకు తెలుసు. తప్పదు. ఇలాంటివి ఫేస్‌ చేయాలి.  రేపు ఎక్సప్లనేషన్‌ ఇచ్చుకోవాలి. ఇవన్నీ డ్యూటీలో భాగం. అనుకుంటూ, ఇంకా వెతకటం మొదలుపెట్టాము.
ఓ అరడజను కొత్త షర్ట్‌లు. వాటికి పై నుంచి కిందవరకూ ఏడేసి ప్రెస్‌బటన్స్‌ ఉన్నాయి.  ఓ బటన్‌ పీకి టెస్ట్‌ చేశాము.  అది కేవలం స్టెయిన్లెస్‌ స్టీల్‌ ప్రెస్‌ బటన్‌ మాత్రమే. అంతే అతను అంతెత్తున లేచాడు.  మేమంతా సిగ్గుతో తలదించుకున్నాము.  కానీ ఇది కొనసాగించక తప్పదు.  సాధారణంగా మాకు అనుమానం వస్తే అది కచ్చితంగా నిజమౌతుంది. 
ఇతన్ని చెక్‌ చేసేస్తే, ఆ తర్వాత ప్లంబర్‌ని చెక్‌ చెయ్యొచ్చు. గ్యారంటీగా అతని దగ్గర ఏదో ఒకటి దొరకొచ్చు.  
నెక్స్ట్‌ సూటు కేసులో చూస్తే ఓ అరడజను నల్లఖర్జూరం ప్యాకెట్లు.
‘సర్, ఇవి మా నైబర్స్‌కి’ అన్నాడతను కోపంగా.  ఓపెన్‌ చేసి చూశా. నిజంగా ఖర్జూరమే.
‘‘సర్, ఇలా విప్పేసిన ప్యాకెట్లు ఇస్తే వాళ్లేమనుకుంటారు. నేను మీపై అధికారితో మాట్లాడాలి’’ అన్నాడతను సీరియస్‌గా.  మా బాస్‌ చాంబర్‌లో ఉన్నారు.  ఆయన బయటకి వచ్చి, ఇదంతా చూశారు.  
ప్యాసింజర్‌ చెప్పిందంతా విని,  ‘‘మూర్తీ, ఇట్స్‌ ఎనఫ్‌.  రేపు కంప్లైంటీకి ఆన్సర్‌ నేను ఇవ్వాలి.  తేడావస్తే, జెన్యూన్‌ ప్యాసింజర్‌ని హెరాస్‌ చేశావని నీ మీద డిసిప్లినరీ యాక్షన్‌ తీసుకోవలసి రావచ్చు. నిన్ను సస్పెండ్‌ కూడా చెయ్యొచ్చు.  నా మాట విని, అతనికి ఆపాలజీ చెప్పి పంపేయ్‌.’’ అన్నారు సీరియస్‌గా.

‘‘ఓకే సర్‌’’, అనిచెప్పి,  ఎందుకైనా మంచిదని, అతన్ని చివరగా ఓ ఖర్జూరం తీసిచ్చి తినమన్నాను.  అతను విసురుగా నా చేతిలోంచి ప్యాకెట్లాక్కుని, ఓ ఖర్జూరం అడుగు నుంచి తీసి, తిని, పిక్క నా సీటు పక్కనే అప్పటికే ఈ సామాన్ల తాలూకు చింపేసిన రేపర్లతో నిండుగా ఉన్న డస్ట్‌బిన్‌లో విసురుగా ఉమ్మాడు. ఇలాంటి అవమానాలు కూడా మాకు అప్పుడప్పుడు మాములే. ఆ సూట్‌కేసులో ఇంకేమీలేవు.  అతని సామాన్లు సర్దటానికి మా వాళ్ళు హెల్ప్‌ చేస్తే , అతనికి సారీచెప్పి, వెళ్ళిపోమన్నాము. అతను విసురుగా తన బ్యాగేజ్‌ లాక్కుని, మమ్మల్ని గట్టిగా తిడుతూ, వెళ్తూవెళ్తూ నా షర్ట్‌ మీదున్న నేమ్‌ప్లేట్‌ కేసి చూసి ‘ఐ విల్‌ మేక్‌ ష్యూర్‌ దట్‌ యు పే ఫర్‌ ఇట్‌’ అంటూ విసురుగా లగేజీ తోసుకుంటూ అరైవల్‌ నించి బయటకు వెళ్ళడానికి బయలుదేరాడు. నిజం చెప్పాలంటే ఈరోజు నేను కొంచెం ఎక్కువ చేశానేమో అనిపించింది.

ఇదంతా పొద్దున్న నా భార్యతో జరిగిన డిస్కషన్‌ వల్లా, లేక పక్కింటి ఆవిడ నా ఉద్యోగాన్ని, నన్ను కించపరచడం వల్లా, ఇలా ఆలోచిస్తూ ఉండగా, నా ఫోన్‌ మోగింది.  కాంచన.  
ఎత్తి ‘హలో’ అన్నాను విసుగ్గా.
‘‘ఏమండీ, పొద్దున్న చెప్పడం మర్చిపోయా. వచ్చేటప్పుడు అత్తయ్యగారికి డేట్స్‌ తేవటం మర్చిపోకండి.’’ అంది కాంచన సౌమ్యంగా.
నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇక్కడ పరిస్థితి తనకేం తెలుసు. ఆలా అని కూల్‌గా ఉండటం నావల్ల కాలేదు. 
‘‘ఇంత చిన్నపని కూడా నువ్వు చెయ్యలేవా? పెట్టెయిఫోను’’ అన్నాను విసుగ్గా. 
‘‘బాగుందండి, నేనేమన్నా బంగారం తెమ్మన్నానా, ఖర్జూరమే కదా, దానికెందుకంత విసుగు? సరే మీరు బిజీగా ఉన్నట్టున్నారు. నేనే తెచ్చుకుంటాలెండి.’’ అంటూ నొచ్చుకుని ఫోన్‌ పెట్టేసింది కాంచన.  
ఫోన్‌ పెట్టేశాక నాకు బాధనిపించింది. నా చేతకానితనానికి తన మీద విసుక్కోవటం తప్పు. ఆ చిరాకుతో విసుగొచ్చి, అక్కడే బిక్కుబిక్కుమని కూర్చున్న ప్లంబర్‌ కేసి చూసి, అతన్ని కూడా పంపించేయమని, ఓ టీ చెప్పమన్నాను తలనొప్పిగా ఉండటంతో. ఏంటో ఈరోజంతా ఇలా గడుస్తోంది అనుకుంటూ ఎదురుగా చూశాను.  మమ్మల్ని తిట్టిన ఆ కుర్రాడు తన లగేజీని తోసుకుంటూ ఎవరికో ఫోన్‌ చేస్తూ అరైవల్‌ హాల్‌ అప్పుడే దాటబోతున్నాడు.  చెత్తలతో నిండిపోయిన డస్ట్‌బిన్లో ఖర్జూరం పిక్క నన్ను వెక్కిరిస్తోంది. కాంచన మాటలు చెవిలో మ్రోగుతున్నాయి. 
‘నేనేమన్నా బంగారం తెమ్మన్నానా, ఖర్జూరమేగా ...’
అంతే ఒక్కసారిగా ఏదో వెలిగింది.  దూరంగా ఉన్న మా సిపాయికి సైగ చేసి అతన్ని ఆపి వెనక్కి పిలుచుకురమ్మన్నాను. అంతే, అప్పుడే కస్టమ్స్‌ ఏరియా దాటి ఎగ్జిట్లోకి వెళ్ళబోతున్న అతన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాడు. అతని మొహం ఎర్రగా కందిపోయి ఉంది. 

‘‘ఏంటి మళ్ళీ?’’ అన్నాడు. 
ఈసారి ‘సర్‌’ అని కూడా అనకుండా. 
‘‘ఇంకోసారి నీ లగేజీ చెక్‌ చెయ్యాలి’’అన్నాను కటువుగా.  నేనిక మొహమాట పడదల్చుకోలేదు.  ‘‘ఏం రేపటి నుంచి నీకు ఉద్యోగం చెయ్యాలనిలేదా?’’ అన్నాడతను విసురుగా.  నేను అతనన్న ఏకవచనం కూడా పట్టించుకునే పరిస్థితిలోలేను. బ్యాగ్‌ ఓపెన్‌ చేయించాను. అతను అరుస్తున్నాడు. 
మా బాస్‌ ఛాంబర్‌లోంచి బయటకి వచ్చాడు.  ‘‘మూర్తీ, వాటీజ్‌దిస్‌? ఐ టోల్డ్‌ యు టు లీవ్‌ హిమ్‌. యు ఆర్‌ స్ట్రెచ్చింగ్‌ టూ మచ్‌’’ అన్నారు కోపంగా. నిజానికి ఆయనకి మా మీద అపారమైన నమ్మకం. మేమింత పట్టుబడుతున్నామంటే ఏదో కారణం ఉంటుందని ఆయనకీ తెలుసు. కానీ స్మగ్లింగ్‌ని అరికట్టడంతోబాటు డిపార్ట్‌మెంట్‌ ఇమేజ్‌ కాపాడ్డం కూడా ప్రయారిటీయే. ఆరెండూ బాలన్స్‌ చేయడం ఆయన రెస్పాన్సిబిలిటీలో భాగం. 
‘‘సర్, ప్లీజ్‌ గివ్‌ మీ ఫైవ్‌ మినిట్స్‌’’ అని, గబగబా ఖర్జూరం ప్యాకెట్లు ఓపెన్‌ చేసి, డస్ట్‌బిన్‌ ఖాళీ చేసి, ఓ ఖర్జూరం ఒలిచి, పిక్క తీసి ఖాళీ డస్ట్‌బిన్‌లో వేశా.
‘ఠంగు’మని మెటల్‌ సౌండ్‌ వచ్చింది.  మొత్తం ఆరుప్యాకెట్లు తీసికెళ్ళి హ్యాండ్‌ మెటల్‌ డిటెక్టర్‌తో చెక్‌ చేశా.  విపరీతమైన శబ్దం.  చాకు తీసుకుని ఓ ఖర్జూరం పిక్కని పైన కొద్దిగా స్క్రాచ్చేసా.  మిలమిలమని మెరుస్తూ బంగారం. మా స్టాఫ్‌ మొహంలో వెలుగులా. మొత్తం కేజీ బంగారం. అతని మొహం మాడిపోయింది– నల్లఖర్జూరంలా.

ఆరోజు ఆఫ్‌ కావడంతో, వాకింగ్‌కు వెళ్లొచ్చి పేపర్‌ చదువుతున్నా. కాంచన కాఫీ తెచ్చిచ్చి పక్కనే కూర్చుని, ‘‘ఏమండి ఇదిగో మీరు కొన్న బుట్టలు, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, పూజ చేసి పెట్టుకున్నా. ఎలా ఉన్నాయి?’’అడిగింది మురిపెంగా. తలస్నానం చేసిందేమో, తన మనసులాగే మృదువైన ఆమె కురులు చెవి పైభాగాన్ని కప్పేయగా, చెవి క్రిందన వేలాడుతున్న బుట్టలు ఆమె మాట్లాడుతూ ఉంటే అందంగా అటు, ఇటు ఊగుతున్నాయి కొండపల్లి బొమ్మల్లా.. వేలితో సున్నితంగా మీటి, నవ్వాను బాగున్నాయన్నట్టుగా. 
‘‘అయినా కేసుపట్టిన ప్రతీసారీ మీకొచ్చిన క్యాష్‌ రివార్డ్‌తో పిల్లల ఫీజు కట్టడమో, ఇంటిలోన్‌ కొంత తీర్చడమో చేస్తారు కదా, ఈసారేంటి నాకు బంగారం కొనాలనిపించింది ?’’ అడిగింది కాంచన ఆనందంతో కూడిన ఆశ్యర్యంతో.

‘‘ఓ అదా, పట్టిందల్లాబంగారమైతే అది అదృష్టం. బంగారాన్నే పడితే అది నైపుణ్యం. నేను నైపుణ్యాన్ని నమ్ముతాను. ఈ కేసుకి నువ్వే ఇన్ఫార్మర్‌వి బంగారం, అందుకే ఈ రివార్డ్‌ నీకే.’’ అన్నాను నవ్వుతూ.  తనకి అర్థం కాకపోయినా, తిరిగి నవ్వింది. టేబుల్‌ మీద ఉన్న ఖర్జూరం ప్యాకెట్లోంచి ఒకటి తీసి నోట్లో వేసుకున్నా.
ఇంతలో పక్కింటావిడ వచ్చింది. మర్యాదకి నేను లేచి లోపలికి వెళ్లబోయాను.  ఆమె ‘‘మీతోనే పనుంది అన్నయ్యగారూ’’ అంది మొహమాటంగా. 
ఆవిడని కూర్చోమని, ‘‘చెప్పండమ్మా’’ అన్నాను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ. ‘‘అదే సర్, మా తమ్ముడు గురించి. ఏదో చిన్నతనం. తెలియక, ఎవరో చెబితే అలా చేశాడు. ఇదే ఫస్ట్‌టైం సార్‌. మీరు కాస్త హెల్ప్‌ చేయాలి....’’ అంటూ నసిగింది.  నేనేం మాట్లాడకుండా లేచి లోపలికి వచ్చేశా. అదే సమాధానం అన్నట్టు. నోట్లోఉన్న ఖర్జూరం పిక్క చేతిలోకి తీసుకుని పక్కనే ఉన్న డస్ట్‌బిన్‌లో వేశా. పెద్దగా చప్పుడు రాలేదు. బంగారం కాదు కదా.
- ఉమామహేష్‌ ఆచాళ్ళ

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిడ్డను భర్తే అపహరించాడు..!

నిజమే మాట్లాడు..

టారో వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

వారఫలాలు (జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు)

బీ47 గదిలో ఏముంది?

అరే సీనుగా.. పెళ్లిబువ్వరా.!

సిరా చుక్క.. నెత్తుటి మరక...

రైటర్‌ కాపీరోవా ఆండ్రూ కథనం ప్రకారం..

గడ్డిపరకా..! నీకు కూడా చులకనయ్యానా?!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!