అతీంద్రియ శక్తి

15 Mar, 2020 12:56 IST|Sakshi

మిస్టర్‌ ఫాదరింగే అద్భుతాల్ని, మహిమల్ని నమ్మేవాడు కాదు. కాని, ఓసారి లాంగ్‌ డ్రాగన్‌ రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి డ్రింక్‌ తీసుకుంటున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. అది కూడా అతీంద్రియశక్తులను నిరసిస్తూ  అతను అనర్గళంగా ఉపన్యిస్తున్న సమయంలో జరిగింది.
అతీంద్రియశక్తులు ఎక్కడో కాదు కేవలం తనలోనే ఉన్నట్లు అతనికి తెలిసింది. అది అతనికి నమ్మశక్యం కాలేదు. కాని, నమ్మక తప్పలేదు. తనను మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్న బీమ్మిష్‌ పై ఫాదరింగేకు పీకలదాకా కోపం వచ్చింది. కాని, మంచి మాటలతోనే అతణ్ణి ఒప్పించాలని ఓపిక తెచ్చుకుని మరోసారి వివరించాడు.
‘‘చూడు మిస్టర్‌ బీమ్మిష్‌! అసలు అతీంద్రియ శక్తి అంటే ఏమిటో తెలుసా నీకూ? కేవలం మానసిక శక్తితో అనుకున్నదానిని సాధించడం! ఇది సహజసిద్ధమైన ప్రకృతికి విరుద్ధంగా జరగాలి–అవునా?’’ అని అన్నాడు ఫాదరింగే అందరివైపు చూస్తూ–
ఒకరిద్దరు అవునన్నట్లు తలలూపి, ఫాదరింగేను బలపరిచారు. రెస్టారెంట్‌ యజమాని అక్కడే ఉన్నాడు. అవునూ–కాదూ–అని చెప్పకుండా గుంభనంగా ఉన్నాడు.
‘‘ఉదాహరణకు ఇదిగో టేబుల్‌ మీద కొవ్వొత్తి ఉంది. అది వెలుగుతోంది. దీన్ని తలకిందులుగా తిప్పితే వెలగదు కదా?’’
‘‘అయితే వెలగనే వెలగదా?’’ అన్నాడు బీమ్మిష్‌.
‘‘అవును! వెలగదు– అయితే?’’ అన్నాడు మళ్ళీ అయిష్టంగా.
‘‘అదే చెప్తూ ఉన్నా– అలాంటప్పుడు ఎవరైనా నాలాంటి వాడు కొవ్వొత్తిని తలక్రిందులుగా వెలగమని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమవుంది? వెలుగుతుందా?’’ అని అందరి ముఖాల్లోకి చూస్తూ అన్నాడు ఫాదరింగే.
అంతే–ఒక్కసారి అందరూ సంభ్రమాశ్చర్యాలతో కొవ్వొత్తిని చూశారు. ఇదేమీ చోద్యం అన్నట్లు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. కారణమేమిటంటే ఫాదరింగే ఏదో మాట వరుసకు చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది.

కొవ్వొత్తి గాల్లో తలకిందులుగా నిలబడింది. మంట భూమి వైపు వెలుగుతోంది. జరగరానిది జరిగిందే అన్నట్లు అందరూ నోళ్ళు తెరిచారు. నూటికి నూరుపాళ్ళు అసాధ్యమనుకున్నది సాధ్యమైందేమిటీ?–అని ఫాదరింగే నమ్మలేకపోయాడు. కాని కళ్ళెదుట విచిత్రం కనిపిస్తుంటే, నమ్మాల్సి వచ్చింది.
‘‘ఇదేమిటీ? పిచ్చోడిలా ఇలా చేశావు? ట్రిక్కులు చేయాలనుకుంటే ఇక వేరే లేనే లేవా? నిప్పుతో చెలగాటమేమిటి? అదృష్టం బావుండి ఎవరికి ఏమీ కాలేదు’’–అని అన్నాడు తీవ్రస్వరంతో మిస్టర్‌ కాక్స్‌. టేబుల్‌ చుట్టూ కూర్చొని డ్రింక్‌ తీసుకుంటున్న వాళ్ళలలో మిస్టర్‌ కాక్స్‌ ఒకడు. అక్కడున్న వాళ్ళందరిలోకి కాస్త ధనవంతుడు. చాలామంది అతణ్ణి బలపరిచారు. వాళ్ళందరి మాటలు వినేసరికి ఫాదరింగేకి కూడా అనుమానం వచ్చింది.
‘‘నిజమే–నిప్పుతో చెలగాటం–తనెందుకు చేశాడు?’’ అనుకుని ముఖం మాడ్చుకుని, రెస్టారెంట్‌లోంచి బయటపడ్డాడు. దారి పొడవునా తన అతీంద్రియశక్తుల గురించే ఆలోచించాడు. ఇంట్లో పడకగదిలో కూర్చున్నాడు. చేతులు ప్యాంట్‌ జేబులో పెట్టుకుని ‘ఎందుకిలా జరిగింది? ఎలా జరిగింది?’ అని చాలాసేపు ఆలోచించాడు.
ఎదురుగా టేబుల్‌ మీద ఉన్న క్రొవ్వొత్తి మీదికి దృష్టి మళ్ళింది.
‘మరోసారి ఆ అద్భుతశక్తి ప్రయోగం చేద్దామా?’ అని కొంటె కోరిక కలిగింది.

క్రొవ్వొత్తిని పైకి లెమ్మన్నాడు. అన్నీ అతను అనుకున్నట్లుగానే జరిగాయి, కాగితం చుట్టి గ్లాసు చేశాడు. అందులోకి నీళ్ళు రావాలన్నాడు. ఆ నీళ్ళ రంగు మారిపోవాలన్నాడు. అన్నీ అతను అనుకున్నట్టుగానే జరుగుతూ వచ్చాయి. అప్పటికి రాత్రి బాగా పొద్దు పోయింది. పొద్దున్నే లేవాలి. మళ్ళీ ఆఫీసు పని!
అయినా తనలోని మనోశక్తిని ఉపయోగించి, కష్టపడకుండానే ఆఫీసు పని పూర్తి చెయ్యొచ్చు కదా? అనే ఆలోచన రాగానే కొంచెం గర్వపడ్డాడు. పడుకుని నిద్రపోయాడు.
మరునాడు ఉదయం మామూలుగా నిద్ర లేచాడు.
‘రాత్రి జరిగిందంతా కల కాదు కదా?’ అనే అనుమానం వచ్చింది. దినమంతా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ తనలోని అతీంద్రియశక్తుల్ని పరీక్షించుకున్నాడు. ఆరోజు ఆఫీసులో పనేమీ చేయలేదు. చివరి పదినిమిషాల్లో తన ట్రిక్‌ ఉపయోగించి ఆరోజు చేయాల్సిన పనంతా ముగించాడు. అప్పటికి  నగరంలోని అతని మిత్రబృందానికి అతని అతీంద్రియశక్తుల గురించి తెలిసిపోయింది. క్రితం రాత్రి రెస్టారెంట్‌లో–
అలా కొన్ని గంటలు గడిచాయో లేదో ఫాదరింగే తనకు కావల్సిన ఖరీదైన వస్తువులన్నీ సృష్టించుకున్నాడు. ఉన్నఫళాన తనకు ఇవన్నీ ఎలా వచ్చాయని చుట్టు పక్కలవాళ్ళు అనుకుంటారేమోనని భయపడ్డాడు కూడా!

తను మామూలు మనిషి కాదని, దివ్యశక్తులు గలవాణ్ణని కొంచెం గర్వంగా అనిపించసాగింది. భోజనం ముగించుకుని, వీధిలో అలా కొంతదూరం నడిచాడు. 
ఉన్నట్టుండి ఆలోచన వచ్చింది. సృజనాత్మకంగా ఏదైనా వింతపని చేద్దామనిపించి, చేతికర్ర మట్టిలో గుచ్చాడు. మనసులోని సర్వశక్తుల్ని కేంద్రీకరించి–చేతికర్ర మట్టిలో గుచ్చాడు. మనసులోని సర్వశక్తుల్ని కేంద్రీకరించి–చేతికర్ర గులాబీ వలె  పూయాలని అనుకున్నాడు. ఆశ్చర్యం?
నడిరోడ్డు మీద గులాబీ పొద తయారైంది. తన మేజిక్‌ శక్తిని ఎవరైనా గమనిస్తున్నారా? అని చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనబడలేదు.
‘హమ్మయ్య! ఎవరూ లేరు లే’ అనుకున్నాడు. గులాబీ పొదని మళ్ళీ చేతికర్రగా మార్చాల నుకుని ‘వెనక్కి వెళ్ళు’ అన్నాడు.
 ‘‘పూర్వస్థితికి వెళ్ళు’’ అని అనాల్సింది. పదప్రయోగంలో పొరపాటు జరిగింది. గులాబీపొద వేగంగా వెనక్కి వెళ్ళింది. అటునుంచి వస్తున్న పాదాచారి ముఖం పగిలింది. అతని శరీరమంతా ముళ్ళు గుచ్చుకున్నాయి.
‘‘ఎవడ్రా వాడూ? కళ్ళు కనబడడం లేదా? గులాబీ చెట్టు నా పైకి విసిరాడూ?’’ అంటూ అతను ఫాదరింగే వైపు కోపంగా చూశాడు. 
దుదృష్టవశాత్తు అతనొక పోలీస్‌ కానిస్టేబుల్‌. కలిసి నడుస్తున్న ముగ్గురు పోలీసుల్లో అతనొకడు. పోలీసులు ఫాదరింగేని పట్టుకుని దులిపేశారు.
‘‘డ్యూటీలో ఉన్న పోలీసుని కొట్టావయ్యా! అది పెద్ద క్రైమ్‌. నీ పనేమౌతుందో చూసుకో’’ అని బెదిరించారు. ఫాదరింగేని హడలగొట్టారు.
ఎలాగో తప్పించుకుని, ఫాదరింగే ఇంటిదారి పట్టాడు. నిద్రపోయే ముందు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తనని బెదిరించిన పోలీసుల్ని ఆ ఊళ్ళో లేకుండా అతి దూరంలో ఉన్న శాన్‌ఫ్రాన్సిస్కోకు బదిలీ చేయించాడు. తర్వాత నిశ్చింతగా నిద్రపోయాడు.
మరునాడు జనాలు రెండు విషయాలు చెప్పుకోసాగారు. ఒకటి ఉన్నఫళంగా రోడ్డు మీద గులాబీలు పూయడం! రెండవది బీటు కానిస్టేబుల్స్‌ ఊళ్ళోంచి మాయం కావడం. ఆరోజు ఆదివారం. ఫాదరింగే చర్చికి వెళ్ళాడు. అక్కడ ‘చట్ట విరుద్ధమైన అంశాలు’ అనే విషయం మీద మిస్టర్‌ మేడింగ్‌ ఉపన్యసించాడు. ఫాదరింగేకు చటుక్కన్న ఒక ఆలోచన వచ్చింది– తన దివ్యశక్తుల గూర్చి చర్చించి మేడింగ్‌ సలహా తీసుకుంటే ఎలా ఉంటుందీ?–అనీ!
ఉపన్యాసం అయిపోగానే  ఫాదరింగే వెళ్ళి మేడింగ్‌ను కలిశాడు. మేడింగ్‌ పండితుడు, తత్వవేత్త, మేధావి. పొడుగు మెడతో, మెరిసే కళ్ళతో బక్కపల్చగా ఉంటాడు. మేడింగ్, ఫాదరింగేని తన ఆఫీసు గదికి తీసుకెళ్ళాడు.

సంభాషణ ఎలా ప్రారంభించాలో ఫాదరింగేకి తెలుసు. మత్తు పానీయాల్ని మంచినీళ్ళు చేశాడు. పేదరికం లేకుండా చేశాడు.
ఫాదరింగేలో దాగిన శక్తుల పరిధి ఎంత వరకుందోనని మేడింగ్‌ చిన్న చిన్న ప్రయోగాలు చేయించడం, ఫాదరింగే సులభంగా చేయడం జరుగుతూ వచ్చింది. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏదైనా చేయించాలని మేడింగ్‌ అనుకున్నాడు. 
ఓరోజు ఆకాశంలోని చంద్రుణ్ణి చూపించి ‘చంద్రుణ్ణి ఆపేయ్‌ చూద్దాం’ అన్నాడు.
‘‘అబ్బా! అది మరీ దురాశ. నాలోని శక్తి అంతవరకు చేరగలదా?’’ అని అనుమానపడ్డాడు ఫాదరింగే.
‘‘అయితే మనం నివసించే ఈ భూగోళాన్ని శాసించు. భూభ్రమణాన్ని ఆపు’’ అన్నాడు మేడింగ్‌. అలాంటి అద్భుతం చేద్దామని ఫాదరింగే కలలో కూడా ఊహించలేదు. కాని, మేడింగ్‌ కోరిక మేరకు ప్రయత్నించి చూస్తే తప్పేమిటీ–అనుకున్నాడు.
తన కాళ్ళ కింద ఉన్న భూమిని చూసి సాదరంగా మనసులో ప్రార్థించాడు.
‘‘అమ్మా! భూదేవీ ఒక్కసారి నీ భ్రమణాన్ని ఆపు తల్లీ!’’ అన్నాడు. 
అంతే–మరుక్షణంలో ఫాదరింగే గాల్లో లేచి ఎగరసాగాడు. క్షణానికి పది, పన్నెండు మైళ్ళ వేగంతో ముందుకు పోసాగాడు. పైకి, కిందికి, ఒక్కోసారి వేగంగా, మరోసారి మెల్లిగా పల్టీలు కొట్టసాగాడు. మొదట కాసేపు తమాషాగా అనిపించినా, తర్వాత అతని ఉనికి అతనికి తెలియకుండా అయ్యింది. ఊపిరి అందడం కూడా కష్టమై, గాల్లో ఒక ఇసుకరేణువుల్లా కొట్టుకుపోవడం అన్యాయమనిపించింది. అప్పుడు ఫాదరింగే అనుకున్నాడు.
‘‘ఏది ఏమైనా నేను సురక్షితంగా కిందికి దిగాలి’’–అని! 

ప్రచండమైన ఆ వేగానికి రాపిడి వల్ల పుట్టిన మంటలు అతని బట్టలకు అంటుకుని కాలడం ప్రారంభించిన క్షణంలో సురక్షితంగా నేలకు దిగాడు. బతికిపోయాననుకున్నాడు ఫాదరింగే. కాని ఎదురుగా మార్కెట్‌ క్లాక్‌ టవర్‌  ఉన్నఫళంగా ముక్కలై రాలిపోయింది. ఎగురుతున్న కాకులు ఎత్తయిన భవనాలకు కొట్టుకుని గుడ్డు పగిలినట్టు పగిలిపొయ్యాయి. జీవితంలో ఎప్పుడూ విననంతటి భీకరమైన ధ్వనులు వినిపించాయి. భూగోళం చుట్టూ గాలి మహోధృతంగా వీచింది. ఫాదరింగేకు తన అవయవాలు తన స్వాధీనంలో లేవని తెలిసింది. ఒక్క నిముషంలో ఇంతటి ప్రళయమా? ఇదంతా మేడింగ్‌ చేసిన పొరపాటు. అవునూ...నా పక్కన మేడింగ్‌ లేడేమిటీ? అని అనుకుని అయోమయంగా దిక్కులు చూశాడు...ఫాదరింగే. పిడుగులు, భూకంపాలు, వరదలు ఒకే ఒక్క నిముషంలో వాతావరణ భీభత్సమైపోయింది. ఫాదరింగేకు ఏమీ అర్థం కాలేదు. ఆకాశమెత్తు లేచిన ధూళి కెరటంలో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. అన్నీ శిథిలాలు. అంతా విధ్వంసం. ప్రళయం. ప్రకంపనం. ప్రభంజనం. భూమి ఎంత వేగంతో పరిభ్రమిస్తుందో, దాని మీద ఉన్న నదులు, పర్వతాలు, జంతువులు, చెట్లు, మనుషులు, వస్తువులు అన్నీ అదే వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఫాదరింగే తనలోని శక్తులన్నింటినీ కూడగట్టి భూభ్రమణాన్ని ఆపేశాడు. కాని దాని మీద వాటి గురించి అతను ఆలోచించలేదు. భూమితో పాటు వాటిని  కూడా  ఆగమంటే ఆగిపోయ్యేవేమో–కాని, ఫాదరింగే వాటికి ఏ సూచనా చేయలేదు. భూమి ఉపరితలంలో ఉన్నవి సెకనుకు తొమ్మిదిమైళ్ళ వేగంతో ముందుకు విసిరివేయబడ్డాయి. భూమిని ఆపిన మరుక్షణం ఫాదరింగే గాల్లోకి ఎగిరిపోవడానికి కారణం అదే–అనాలోచితంగా చేసిన ఒక పని వల్ల ప్రపంచమంతా సర్వనాశనమయ్యింది.

శాస్త్రీయ అవగాహన, సాంకేతిక విజ్ఞత దేనికైనా అవసరం. మరీ ముఖ్యంగా ఒక శక్తిని ఉపయోగిస్తున్నవాడు, దాని పూర్వాపరాల్ని చాలా తీవ్రంగా, లోతుగా, ఆలోచించాల్సి ఉంటుంది. అదేదో ఆషామాషీ కాదు...అనే విషయం ఫాదరింగే ఆలస్యంగా గ్రహించాడు. అసలు అతీంద్రియశక్తులు తనకు ఎందుకు కలిగినట్లూ? కలిగినంత మాత్రాన తనెందుకు ఉపయోగించినట్లు? తన పక్కన మేడింగ్‌ ఉండాలి కదా? ఏడీ? ఎక్కడా?
‘మేడింగ్‌ నువ్వు నా పక్కన ఉండాలి’ అని మనసులో అనుకున్నాడు. మేడింగ్‌ పక్కనే ప్రత్యక్షమయ్యాడు. తనకు తోడుగా ఒకడున్నాడని కొంత ధైర్యం కలిగింది.
ఇంతలో సముద్ర కెరటం మహోధృతంగా దూసుకువస్తూ కనిపించింది. అది తమదాకా వచ్చిందంటే మరణం తప్పదు. ఇక ఎన్ని అతీంద్రియశక్తులుంటే మాత్రం ఏంలాభం?
‘‘కెరటమా ఆగు!’’ ఆజ్ఞాపించాడు ఫాదరింగే. 

కెరటం అల్లంతదూరంలో ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని మళ్లీ యథాస్థితికి తేగలిగితే చాలు–ఆ పై తనకిక ఏ అతీంద్రియశక్తులు వద్దు. వాటిని ఉపయోగిస్తూ తను ప్రయోగాలు చేయడమూ వద్దు–అనుకొని ఫాదరింగే కాళ్ళ మీద కూర్చున్నాడు. చూపుడు వేలు భూమిలో గుచ్చి కళ్ళు మూసుకుని తన సర్వశక్తుల్నీ మనసులో కేంద్రీకరించి–
‘‘ఈ భీభత్సం ఆగిపోవాలి. భూమి యథాస్థితికి రావాలి. కాలం వెనక్కి వెళ్ళాలి. లాంగ్‌ డ్రాగన్‌ రెస్టారెంట్‌లో కొవ్వొత్తి మేజిక్‌ చేయడానికి ముందున్న పరిస్థితి రావాలి. అన్నింటినీ మించి నాలోని అద్భుతశక్తులు నశించాలి. ఆత్మశక్తీ, అతీంద్రియ శక్తీ ఏదీ వద్దు. ఆత్మవిశ్వాసం గల మంచి మనిషిలా బతకాలి’’ అని కోరుకున్నాడు. ఫాదరింగే ఆత్మశక్తి చివరిసారిగా పనిచేసింది.
(ఈ కథలో జరిగిన సంఘటన లేవీ ఫాదరింగేకి తెలియవు. అతను తన అతీంద్రియశక్తులన్నింటినీ తనకు తానై వదులుకున్నాడు. అతనిప్పుడు సాదాసీదా మనిషి. అతీంద్రియశక్తుల్ని కాకుండా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని బతకుకున్న మనిషి)

మూలం : హెచ్‌.జి.వెల్స్‌ 
తెలుగు: డాక్టర్‌ దేవరాజు మహారాజు 
బ్రిటీష్‌ రచయిత హె.జి.వెల్స్‌ (1866–1946) రాయల్‌ కాలేజీ ఆఫ్‌ సైన్స్‌ నుండి విద్యా విషయంలో ఓ కోర్సు చేసి, తర్వాత సృజనాత్మక రచయితగా స్థిరపడ్డాడు. జీవిక కోసం ఏ వృత్తినీ ఎంచుకోలేదు. రచనే ఊపిరి. రచనే జీవితంగా బతికారు. సైన్స్‌ నేపథ్యంలోంచి చిక్కటి హాస్యం వెదజల్లే తెలివైన కథలు రాస్తూ సాహిత్యరంగంలో అడుగుపెట్టారు. ద టైం మిషన్‌ (1895), ద వార్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ (1898), ద ఫస్ట్‌ మ్యాన్‌ ఇన్‌ ద మూన్, ది ఇన్విజిబుల్‌ మ్యాన్‌ వంటి నవలలలో ఏ ఒక్కటి తిరగేసినా అతని  అద్వితీయమైన మేధాశక్తి, అద్భుతమైన ఊహాశక్తీ దర్శనమిస్తాయి. మనిషి చంద్రునిపై అడుగుపెట్టక ముందే ‘చంద్రునిపై మొదటి మనిషి’ పేరుతో నవల రాశాడంటే ఆయన ఊహాశక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సైన్స్‌ఫిక్షన్‌ మాత్రమే కాదు, సామాజిక సమస్యల మీద కూడా నవలలు రాశారు.    
  

మరిన్ని వార్తలు