సిద్దవ్వ 

8 Apr, 2018 01:08 IST|Sakshi

ఈవారం కథ

‘‘అమ్మా! ఫీజు కట్టకపోతే పరీక్ష రాయనియ్యరట్నే?’’ తల్లి జడ అల్లి, రిబ్బన్‌ ఇస్తే దాంతో ఆ జడను జతచేసుకుంటూ చెప్పింది ఎనిమిదో తరగతి చదువుతున్న రేణుక. ‘‘బాపమ్మకు పింఛన్‌ రానీ... కడ్దాం’’ అంటూ విసురుగా బిడ్డను కుడికి తిప్పి అటు వైపు తల దువ్వి ఇంకో జడకోసం పాయలు తీయసాగింది భూలక్ష్మి. పక్కింట్లోంచీ మాటలు వినపడుతున్నాయి. ‘‘అమ్మా.. ఎన్ని రోజుల్సంది అడుగుతున్నా.. బూట్లుగావల్నని? షెర్కు పనికివోతే ఇస్తా.. మిరపకాయలు తెంపవోతే ఇస్తా.. బెండకాయ ఇర్వవోతే ఇస్తా అని నాల్గు నెల్ల నుంచి అంటున్నవ్‌. యే కాలంకి ఆ కాలం బోతనే ఉంది పైసల్లెవ్‌.. బూట్లు లెవ్‌. రాజుగాడు గొన్నడు.. మహేందర్‌గాడు తెచ్చుకున్నడు.. నన్ను ఎక్రిస్తున్రే....’’మారాం చేస్తున్నాడు ఇంటర్‌ ఫస్టియర్‌లోఉన్న కొడుకు. ‘‘చింతపండు వొల్వవోతా కదా.. ఆ పైసల్‌ రాంగనే ఇస్తా...’’ బోర్లించిన సత్తు పళ్లెం మీద జొన్నరొట్టెను ఒత్తుతూ అంది సరోజ.‘‘నాకిప్పడే గావాలేపో. బాపమ్మను అడిగియ్యి!’’ జిద్దుతో  కాళ్లను నేలకేసి తంతూ అన్నాడు. రొట్టెను పెనం మీద వేస్తూ ‘‘బాపమ్మ తాన ఏడుంటయ్‌? అక్క ఫోన్‌ జేసింది. చిన్ను గాడి పుట్టెంట్రుకలు వెట్టుకుంటున్రట. బట్టలు.. మాసం బంగారం కట్నంబెట్టాలే. యేడ్నుంచయితయ్‌ అన్ని? గా పైసల కోసమే ఎవరి కాళ్లువట్టుకొవాల్నో తెల్వక సస్తున్నా’’ తనలో తను అనుకుంటూ కొడుక్కీ చెప్పింది సరోజ.

‘‘నాకు  దెల్వదు.. నీ యవ్వ.. ఈ నెలగన్క  పైసలియ్యకపోతే సూడు.. ఇంట్లకెంచి ఎల్లిపోతా’’ అదే జిద్దు, అదే మొండితనంతో కొడుకు. పైన రేకుల వేడి.. పొయ్యి వేడి.. తన నిస్సహాయత మీద కోపం..అన్నీ నెత్తికెక్కి పిండిచేతిని దులుపుకొని, నుదుటి మీద పడ్డ జుట్టును మణికట్టుతో వెనక్కి తోసుకుంటూ లేచింది  ‘‘ఏందిరా బాడ్కో.. లెస్స మాట్లాడుతున్నవ్‌? ఇంట్లకెంచి వోతవా?’’ అంటూ గది మూలకు చూడసాగింది చీపురు కోసం. తల్లి ఆవేశం తెలిసిన కొడుకు నిమిషంలో  బయటపడ్డాడు. అయినా తగ్గని అమ్మ.. చీపురు తీసుకొని వాకిట్లోకి పరిగెత్తింది కొడుకు వెనకాలే.. ‘‘నీయయ్య ఏమన్న ఈడ గడ్డ దాషివెట్టి పోయిండనుకుంటున్నావ్‌రా? బూట్లులెవ్‌.. గీట్లు లెవ్‌.. మల్లగనక ఆ పేరెత్తినవో పాత బూటుతో కొడ్తా ఏందనుకుంటున్నవో బిడ్డా’’ తప్పించుకుని పోతున్న కొడుకు వేగాన్ని అందుకోలేక స్వరాన్నిపెంచింది సరోజ. ఆ రెండిళ్లకు కలిపి ఒక్కటిగా ఉన్న వాకిట్లో కూర్చునుంది సిద్దవ్వ. రెండిళ్ల మాటలూ ఆమె  చెవినపడ్డాయి. చాచుకుని ఉన్న కుడికాలును చూసుకుంది. మోకాలి కింద పాత గుడ్డతో గట్టిగా కట్టుకట్టి ఉంది. ఆ దెబ్బ తగిలి దాదాపు మూడు నెల్లవుతోంది. కాస్త వంగింది కుడిచేత్తో కట్టు ఉన్న  చోటును రుద్దుకుందామని. నొప్పి ప్రాణం తీసింది. ‘‘అవ్వా....’’ అని మూలుగుతూ మళ్లీ అరుగుకు వెన్నును వాల్చింది. ‘ఈ నెలన్నా దవ్‌ఖాన్ల సూపించుకోవాలే అనుకున్న..’ మనసులో సణుక్కుంటూ నిస్సహాయంగా అరుగు అంచుకు తల ఆనించింది. అనుభవించిన జీవితం మెదిలింది.

ఈ ఇంటికొచ్చినప్పుడు తొమ్మిదేండ్ల పిల్ల. పెండ్లంటే ఆటలెక్కనే అన్కుంది. అటెన్క నాలుగేండ్లకు పెద్దమనిషి అయింది. పద్నాలుగేండ్లకు మల్లేష్, పదహారేండ్లకు బాల్రాజు, ఆ యేడాదికే పద్మ... పదిహేడేండ్లకే ముగ్గురు పిల్లలు.  మధ్యల ఇంక రెండు కడుపులు వొయినయ్‌. ‘‘ఛల్‌.. గీ ఊళ్లె పనిజేస్తనా’’ అని పెనిమిటి.. కొన్నొద్దులు బొంబైల, ఇంకొన్నొద్దులు మస్కట్ల ఉండి పైసల్‌ దేలేగాని అప్పులైతే జేసిండు మస్తుగా. అన్నోంకల అప్పు వుట్టుడు బంద్‌ అయినంక  ఊర్లేనే ఉండుడు సురు వెట్టుండు. అప్పు ముట్టజేషె తందుకు ఉన్న రెండెక్రాలు అమ్ము కుంటిమి. పద్మ పెండ్లికి మల్లా అప్పే. సోల్ది వెట్టంగా వెట్టంగా కూలికి వోవుడు మొదలువెట్టిండు మొగడు. కొడుకులు చేతికొచ్చినంకైతే పురాగా పని బందేవెట్టిండు. పరాకత్‌ తాగుడే. తాగతందుకు పైసల్‌ లేకపోతేనే పని. కొడుకులతో సరిసమానంగా  మొగోడిలెక్క ఎంత కష్టవడ్డది? పెండ్లిలు, నీల్లాటలు.. ఎన్ని జేసింది? భూపాల్‌రెడ్డి దొర పొలంల పెనిమిటి, ఇద్దరు పిల్లలు గల్సి బాయి దవ్వుతుంటే మట్టిపెళ్లలు ఇరిగి మీదవడ్డయ్‌. మొగడైతే ఆడిదాడ్నే పానం ఇడ్శే.  పీన్గును దీస్కొని అందరం గల్సి భూపాల్‌రెడ్డి దొర ఇంటికాడికి వోతిమి. పైసల కోసం. ‘‘ఆడు తాగి సచ్చిపోయిండు. నేనెందుకు దండుగ్గడ్తా? ఉల్టా నా పేరే బద్నాం.. ఫలానా దొరకోసం బాయి దవ్వుతుంటే సచ్చిపోయిండని. మల్లా నా పొలంల పనికెవరొస్తరే?’’ అని గాయ్‌జేసి.. లొల్లివెట్టి రూపాయి ఇయ్యలే. పోస్ట్‌మార్టమ్‌ల తాగి సచ్చిపోయిండనే అచ్చిందట. ‘‘అవ్‌మల్లా.. కాయకష్టంజేషెటోళ్లు  తాగకుండా ఎట్ల పనిజేస్తరు?’’అని పీన్గును బొందవెట్టినంక కల్లు గుడ్షె కాడ గూసోని భూపాల్‌రెడ్డి దొరను తిట్టిండ్రు తనోల్లంతా. ‘‘వారీ.. గా దొర ముంగట నోరువెగ్లకుండా.. కల్లు ముంతను జూస్కోని ఎంత ఎగిర్తే ఏమొస్తదిరా?’’ అన్నది. ‘‘యే.. లంగగాడ్దికొడుకే అడు! మనమేం జెప్పినా ఇనడే..!’’ అనుకుంట తన నోరే మూపిచ్చిరి. గదే బాయిల  చిన్నోడి నెత్తికి దెబ్బతగిలి.. మెంటల్‌ అయిండు. మీది మీది దెబ్బలతో పెద్దోడు బయటవడ్డడు. గా పొద్దు ఇంకా యాదికున్నది. షిన్నోడు పనికివోనన్నా.. గుంజుకపోయిండు పెద్దోడు. ‘‘పానం బాగలేదు రానే..’’ అన్నా ఇన్లే. మక్కగట్క తిని గట్ల మంచమ్మీద ఒరిగిండో లేదో.. గుంజ్కపొయిరి అయ్యా, కొడుకు గల్సి. పండి.. పండి షిన్నోడు సూత పాయే. 

గిన్నేండ్లలో.. అంటే ఎన్నేండ్లుంటయ్‌? గానాడు దేనికోసమో సర్కారోళ్లు అడిగితే డెబ్భై మీదనే ఉంటయ్‌ అని జెప్పింది. ఆడ్నే ఉన్న కోమటోళ్ల సావిత్రమ్మ.. ‘‘ఊకో సిద్దవ్వ.. పెండ్లిజేసుకొని నేను ఈ ఊరికొచ్చినప్పడు షిన్నపిల్లవు. మీ అత్తతో బాసండ్లు తోమతందుకు రాకపోతుంటివా మా ఇంటికి? అరవై ఉంటయేమో గంతే’’ అన్నది. గంతేనా? ఏమో తియ్‌. అరవై ఏండ్లకు నెత్తి నెరుస్తదా? దవడలు కూడా ఊషిపోయే. కింది పండ్లూ వదులైనయ్‌. నడుమైతే భూమేవట్టే. పెయ్యంతా ముడుతలే. షేతులైతే ఇకారం గొడ్తున్నయ్‌. ముందుగల్లనే  నల్లటి మనిషి... ఇంకా నల్లగా! పాపం.. బాపనోల్ల ఆయి ఊకే అంటుండే.. ‘‘సిద్దీ.. నల్లగుంటవ్‌ కాని.. మస్తు కళ ఉంటదే నీ మొఖంల’’ అని. ఆల్లింట్లున్న సిమెంట్‌ కుండీలల్ల నీళ్లు నింపతందుకు గట్లంటుందేమో అనుకునేది. ఆ లోతు నుయ్యిల కెంచి బొక్కెనేసి నీళ్లు షేదుతుంటే దమ్ము ఎగవోతుండే. మా ఆడివిల్ల  అననే అనే.. ‘‘బాపనోల్లింట్ల నీళ్లు షేది షేది అంగిపోయినవ్‌ అదినా.. అని. అయినా తాను జేషిన కష్టం ముందు పాపం.. గా ఆయికి  షేదిచ్చిన నీళ్లెన్ని? గివన్నీగాదు గని.. మొగడు, కొడుకులు సచ్చిపోయినప్పుడు రెక్కలు ఇర్గిపోయి.. యెన్ను çవడిపోయినట్టయింది. ఇగ మల్లా లెవ్వలే. కాలం లేదు. ఉన్నోళ్లు సుత పొలాలను పిలాట్లు జేసుకున్నరు. పనులు బంద్‌ అయ్‌నయ్‌. కరువు పని ముసలోల్లకు ఇడ్శిపెట్టి.. బలమున్నోల్లంతా పట్నం దారివట్టిండ్రు. పెద్దోడు గూడా గా దారిపొంటనేవాయే. ఏ పనిదొరికితే గా పని జేసుడు వెట్టిండు. గొన్నొద్దులు చౌకీదార్‌ లెక్కగూడా ఉన్నడు. దొంగతనం మోపి ఎల్లగొట్టిండ్రు. మస్తు బాధవడ్డడు. ‘‘అమ్మా.. నేను దొంగతనం జెయ్యలేదే’’ అని ఏడ్శిండు కొడుకు. ఆఖిరికొస్తే డ్రైనేజీలు దీసే పనిదొరికిచ్చుకున్నడు. ఎనిమిదినెల్లు జేసిండేమో.. మోర్లదంతా నోట్లకు, ముక్కులకు వొయ్యి ఏదో ఇన్‌సిపెక్షనటా.. అదొచ్చి సచ్చిపోయిండు పట్నంల. అందరం రోడ్డు మీదవడ్డం. పెద్దోడికి ఒక బిడ్డ, కొడుకు. చిన్నోడికి ఇద్దరు బిడ్డలే.  

ఇందిరమ్మ పథకంలొచ్చిన ఇల్లమ్మితే పెద్దోడి బిడ్డ పెండ్లాయే. దానికి పదిహేను నిండంగనే  పెండ్లి జేస్తిమి. మిగిలినోల్లు  సదూతుండ్రు. పద్మకు పెండ్లి జేసి తోలిచ్చినమంటే ఇగామెను అర్సుకున్నదే లేదు. అడగకడగక అడ్గింది బిడ్డ.. ‘‘అమ్మా... నా బిడ్డకు కమ్మల్‌గున్నాలు జేపిస్తవానే’’ అని. గదిగూడ అడగకపోవునేమో.. సముర్థాడింది. ఆల్ల యారాండ్ల పిల్లలకు అమ్మమ్మలు మస్తు బంగారం వెట్టిండ్రట. నలుగుట్ల దీసేసినట్టు ఉండద్దని అడిగినట్టుంది. అదీ బీడీలు జేస్తది. అన్ని పైసలు ఇంట్లియ్యకుండ... ఇన్ని దాషిపెట్టుకుంటది. గట్ల దాసుకున్న దాంట్లెకు కొన్ని గలుపుమన్నది గంతే. గవ్విటితో బిడ్డకు కమ్మల్‌గున్నాలు కొనిచ్చి అమ్మమ్మ వెట్టిందని జెప్తా అన్నది బిడ్డ. తానిచ్చుడేమోగానీ.. కాపోల్ల గంగారం పొలంల పనికివొయ్యి కాలుజారివడితే సూడొచ్చింది. దాసుకున్న పైసలల్ల నుంచి తనకే గొన్నిచ్చిపాయే...  దవ్‌ఖాన్ల సూపిచ్చుకో అని. దవ్‌ఖాన్లకు ఏడవాయే? ‘‘నిన్ను సూడతందకొచ్చెటోల్లకు షికెన్లు వెట్టి, కల్లు తాపిచ్చుడికే ఉన్న పైలు వొడుస్తున్నయ్‌’’ అని పద్మిచ్చిన పైసల్‌ దీస్కుంది పెద్ద కోడలు. గా నెలల పెద్ద కోడలి దగ్గరుండె. షెరొక్క నెల వంచుకుంటుడ్రు గదా! ‘‘ఏందే సిద్ది పంచుకునుడు? నువ్వేమన్నా కాయకష్టం జేస్తలేవా? సక్కగ నీది నువ్వు ఉండక?’’ అన్నది మల్లవ్వ. మొగదిక్కులేని ఆడోళ్లం. ముగ్గురం మూడు సోట్ల ఎందుకని.. ఆల్లిద్దరి దగ్గర్నే కాలం ఎల్లదీస్తుంది. ఓల్లదగ్గరుంటే ఆల్లకు గా నెల ఫించన్‌ ఇయ్యాలే. కూలీ చేసిన పైసలెమన్నుంటే బిడ్డ కోసమని వెడ్తుండే. కాలు కదలకుండయినప్పటి కెంచి కూలీగూడా లేదు.  సిద్దవ్వకు తెలియకుండానే కన్నీళ్లొస్తున్నాయి. థూ.. ఏం బతుకు పాడైంది? సోయి దెల్షినప్పటినుంచీ కష్టాలే. ఎన్నడన్న సుఖవడ్డదా? కడుపు నిండ తిండి దిన్నదా? బిడ్డ నోరు ఇడ్శి అడిగింది.. ఉల్టా దాన్‌ దగ్గరున్నయే ఇచ్చే. ఎంత సిగ్గుషరం లేని జన్మిది?  ఒక్కసారిగా కాలు సులుక్కుమని పొడిచినట్టవడంతో ఆ కాలును కొంచెం వెనక్కి మడవడానికి ప్రయత్నించి నొప్పి పెరగడంతో వెంటనే మళ్లీ చాపింది. ‘‘ఈ కాలొకటి.. సావనియ్యది.. బత్కనియ్యది’’ అనుకుంది వేదనగా.  

‘‘ఏమత్తా.. పుర్‌సత్‌గా గూకున్నవ్‌? కచ్చీరుకాడికి వోవా?’’ జొన్నెరొట్టె, ఉల్లిగడ్డ కారం ఉన్న పళ్లేన్ని తెచ్చి సిద్దవ్వ ముందు పెడ్తూ అంది పెద్ద కోడలు. మొహం మీద తిరుగుతున్న ఈగను తోలడానికి కుడిచేతిని అటూఇటూ ఆడిస్తూ పళ్లెం వంక చూసింది సిద్దవ్వ. ఫించనొచ్చే దినం వంతు మార్తది.  ఏం మర్శినా గిది మాత్రం మర్వరు కోడండ్లు. చిన్న కోడలు అన్న మాట గుర్తొచ్చింది. ‘‘అత్తా.. అచ్చే నెల సుత నాతాన్నే ఉండు. ఊకే వాకిట్ల దేక్కుంట ఆ ఇంటికి ఈ ఇంటికేం తిర్గుతవ్‌ గని’’ అని. తన మీద పావురంతో గాదు. ఆ నెలల బిడ్డ ఫీజు గట్టాలే.. పిల్లగాండ్లు పెద్దోలయిండ్రు. బాత్రూమ్‌కు ఉట్టి తడ్కనే ఉన్నది. తల్పువెట్టియ్యాలనే ఆలోశ్న జేస్తుంది. ఎక్వతక్వలకు ఫించన్‌ పైసలు సగవెడ్తది. అయినా ఈ నెల సూత తనను షిన్నదే ఉంచుకుంటే పెద్దది ఊకుంటదా? గుంజి గూట్లెవెట్టది? అనుకుంటూ జొన్నరొట్టె తినసాగింది. 
 
‘‘ఏమయ్యా... లిస్ట్‌ తయారైందా?’’ అడిగాడు సెక్షన్‌ హెడ్‌ యూడీసీని. ‘‘సర్‌.. రామ్మోహన్‌ దగ్గరుంది’’ అని చెప్పి రామ్మోహన్‌ దగ్గరకు వచ్చాడు యూడీసీ. ‘‘రామ్మోహన్‌.. లిస్ట్‌ తయారైందా?’’ అడిగాడు యూడీసీ. ‘‘ఫోర్‌డేస్‌ అవుతుంది సర్‌..రెడీ అయ్యి’’ చెప్పాడు ఎల్డీసీ రామ్మోహన్‌.  ‘‘ఎంత మంది ఉండొచ్చు...’’ మళ్లీ యూడీసీ. ‘‘అయిదూర్లలో పన్నెండు మంది ఉన్నారు సర్‌. అంతా డెబ్భై ఏళ్ల పైబడ్డ వాళ్లే’’ చెప్పాడు సిన్సియర్‌గా రామ్మోహన్‌. యూడీసీ మొహంలో చిరునవ్వు. ‘‘గుడ్‌! సర్‌ సంతోష పడ్తాడు. వచ్చే నెలలో కూడా  చూడూ..’’ అంటూ వెళ్లిపోయాడు యూడీసీ. రామ్మోహన్‌ మెదడులో ఇద్దరున్నారు. ఆ ఇద్దరి పేర్లను వయా యూడీసీ సెక్షన్‌హెడ్‌కు చేరకుండా జాగ్రత్తపడ్తున్నాడు. స్వామి ఒక కార్యం అప్పజెప్పినప్పుడు స్వకార్యమూ చూసుకోవాలని గవర్నమెంట్‌జాబ్‌లో చేరిన కొత్తలోనే నేర్చుకున్నాడు. అదీగాక వాటా తనకు ఉంటదో ఉండదో? ఉన్నా.. ఎంతుంటుందో? అందుకే జాగ్రత్తపడ్డాడు. యూడీసీ కూడా ఆ జాగ్రత్తలోనే ఉన్నట్టున్నాడు. అంతగా పట్టుపడితే ఒక్కరి పేరు చెప్తాడు. ఆ నెలవి నిన్ననే వీఆర్‌ఓలకు అప్పగించేశాడు కూడా!  నిశ్చింతగా ఇంకో ఫైల్‌ ఓపెన్‌ చేశాడు రామ్మోహన్‌. 

మధ్యాహ్నం పన్నెండు దాటింది. మార్చి ఎండ చుర్రుమంటోంది. ‘గింత తిని ఎల్లేసరికి గీయాల్లాయే..’ రెండు అరచేతులను నేల మీద పెట్టి బలాన్ని కూడదీసుకుని డేక్కుంటు వెళ్తూ అనుకుంది సిద్దవ్వ. మధ్యలో ఆగి తల నిటారుగా పెట్టి ఎండ తగలకుండా కుడి చేతిని నుదురుకు అడ్డం పెట్టుకుని దారి చూసుకుంది. ‘ఇంకా మాలెస్స దూరమే ఉన్నదుల్లా...’ అనుకుంటూ మళ్లీ డేకడం మొదలుపెట్టింది. ‘‘గింత ఎండపూట ఎల్లినవేందే?’’ ఏదో పనిమీద నుంచి ఇంటికెళ్తూ  అడిగాడు గూండ్ల భూమేశ్‌.. ఎదురుపడ్డ సిద్దవ్వను.‘‘గ్యారకొట్టిందాంక పంచాయతీ అపీస్‌లకు పెంట మీది గిర్దావర్‌ (విలేజ్‌  రెవెన్యూ ఆఫీసర్‌) రాడు! ఇంత కడుపు సల్లవడగొట్కొని ఎల్లేసరికి గీయాల్ల ఆయే.. ఏంజేతు’’ మూలుగుతూ బదులిచ్చింది.‘‘పంచాయతీ ఆఫీస్ల ఏం పనే నీకు?’’ అని అంతలోకే గుర్తొచ్చిన వాడల్లే ‘‘అగో.. ఇయ్యాల ఫించనా.. ఏందీ?’’ అడిగాడు. ‘‘అవ్‌!’’ నిలబడి ఉన్న భూమేష్‌ వైపు ఇందాకటిలాగే తల పైకెత్తి నుదురుకి చెయ్యి అడ్డంపెట్టుకొని మాట్లాడసాగింది. ‘‘రా మల్ల.. నేను కొండవోవాల్నా..?’’ భూమేశ్‌. ‘‘ఎట్ల దొల్కపోతావ్‌.. సైకిల్‌ సూత లేనట్టుందిగద కొడ్కా..?’’ వెళ్లడానికి సిద్ధమవుతూ అడిగింది.‘‘ఎత్కపోతా రాయే అవ్వా..’’ అని నవ్వుతూ సిద్దవ్వను అమాంతం రెండు చేతులతో పైకి లేపి పరుగుపెట్టాడు భూమేశ్‌. పదిహేను నిమిషాల్లో ఆమెను పంచాయితీ ఆఫీస్‌లో దింపి నీళ్లతో ఆయసాన్ని తీర్చుకున్నాడు. డేక్కుంటూ వెళ్లి వరుసలో కూర్చుంది సిద్దవ్వ. దెబ్బ తగిలిన కాలు తన ఉనికిని మర్చిపోనివ్వట్లేదు. కాలు కాదు మిన్ను విరిగినా బాధ్యత తప్పదు. క్యూలో పెన్షన్‌ తీసుకునేవాళ్లు కదులుతున్నకొద్దీ సిద్దవ్వ ముందుకు డేకుతోంది. కాలు నొప్పి విపరీతంగా ఉంది. తట్టుకోలేకపోతోంది. కళ్లను గట్టిగా మూసుకుంది బాధను భరిస్తున్నట్టు. 

పెన్షన్‌ పంచుతున్న వ్యక్తి గొంతు గట్టిగా వినపడేసరికి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది సిద్దవ్వ. ‘‘యాదమ్మా.. నీ వేలిముద్ర మ్యాచ్‌ అయితలే.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో!’’ అన్నాడు అసిస్టెంట్‌. ‘‘ఏందీ.. అయితే పైసలియ్యవా?’’ అన్నది యాదమ్మ.‘‘వేలిముద్ర కరెక్ట్‌గా లేకపోతే పైసలెట్లిస్తరు? వీయ్యార్వో సారు కొలువూడ్తది’’ అని జాబితాలో తర్వాత ఉన్న పేరు పిలవసాగాడు. ‘‘ఓ సారూ.. ముందుగల్ల నా లెక్క జెప్పి తర్వాత ఇంకొకొల్లన్‌ బిలువ్‌’’ అన్నది బెదురు లేకుండా.‘‘ఏం దబాయిస్తున్నవా? వీయ్యార్వో సారు తానకు పో.. చెప్తడు’’ బెదిరిస్తున్నట్టుగా అసిస్టెంట్‌.‘‘పోకడ మస్తే ఉందిరో’’ అంటూ కాస్త ముందుకు జరిగింది.‘‘ఏమన్నవే ముసల్దానా? నాకు పోకడ్నా?’’ అంటూ కూర్చున్నవాడు ఒక్కసారిగా లేచాడు ఆవేశంతో.   ‘‘ఏ సారూ.. మాటలు మంచిగరానియ్‌. నా అసుంటి తల్లి లేదా?’’ అంది యాదమ్మ గాయపడ్డదానిలా. ‘‘ఛీ.. నీ అసుంటి తల్లా? నా తల్లి నీ లెక్కెందుకుంటది?’’ అంటూ ఆమెతో పోట్లాటకు దిగాడు. అక్కడున్న వాళ్లంతా బెదిరిపోయారు. ఆ గొడవ.. కొంచెం దూరంలో సర్పంచ్‌తో రాజకీయాలు మాట్లాడుతున్న వీఆర్వో చెవిన పడటంతో గబగబా అక్కడికి వచ్చాడు అతను. ‘‘ఏయ్‌.. సునీల్‌.. ఏందయ్యా లొల్లి? ఏమైంది?’’ గద్దించాడు అసిస్టెంట్‌ను. ‘‘సూడుండ్రి సర్‌.. వేలిముద్ర సరిగ వడ్తలేదు.. రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు పో అని మర్యాదగా జెప్తుంటే ఇనకుండా పోకడగాడు.. గీకడగాడు  అంటుంది’’ ఫిర్యాదు చేశాడు అసిస్టెంట్‌.‘‘ఏందమ్మా?’’ అన్నాడు యాదమ్మ వైపు తిరుగుతూ వీఆర్వో. ‘‘అవ్‌ సారూ.. నెల కిందట.. అంతకు మునుపూ గిదే యేలు.. గిదే ముద్ర గదా..  గప్పుడు కరెక్ట్‌గవడ్డది.. గిప్పడు పడకుండవోతదా? లేక నేనేమన్నా కొత్తేలుతో అచ్చిన్నా?’’ యాదమ్మ బాధలో వెటకారం ధ్వనించింది.

‘‘అదే వేలు యాదమ్మా.. రోజురోజుకి ముసలైతున్నవ్‌గదా.. గీతలర్గి పోయినయేమో..’’ అన్నాడు వీఆర్వో నింపాదిగా, పళ్లమధ్యలో ఇరుక్కున్న వక్కపొడిని  టూత్‌పిక్‌తో తీసుకుంటూ. ‘‘గట్లెట్లా? గట్ల అర్గుతయ్‌ అని నేను యేడ ఇన్లే. సాచ్ఛం ఉంటే సూపియ్‌ సారూ..’’ అదే కడుపుమంట యాదమ్మ గొంతులో.‘‘గవన్నీ రేపు ఎమ్మార్వో ఆఫీస్‌ల అడుగు పో..’’ నిర్లక్ష్యంగా  చెప్పి ‘‘ఏయ్‌.. సునీల్‌! నువ్వు కానియ్‌! మూడూర్ల పంచాయతీ ఇది. లైను కూడా బాగానే ఉన్నట్టుంది. తొందర్గ కానియ్‌’’ అంటూ వరాండాలోంచి పంచాయతీ ఆఫీస్‌ గదిలోకి వెళ్లాడు వీఆర్వో. ఆ అవమానానికి యాదమ్మ మనసు చివుక్కుమన్నది.  ‘‘మీ మొదలారా.. మీకు గత్తర్లులెవ్వ.. నాయంగా మాకొచ్చే పైసల్ని మింగుతుండ్రు గదా! మీ ఇండ్లండ్లకెంచి వెడ్తున్నట్టే జేస్తుండ్రు.. మీ పోకట్లకగ్గివెట్టా!  పోతా.. ఎమ్మార్వో తాన్కే గాదు..ఆల్ల తాత కాడిగ్గూడా వోతా! మీ పనిజెప్తా!’’ కోపం, బాధ, ఉక్రోషం, ఏడుపు అన్నీ ఉన్నాయి ఆ అరుపులో. ‘‘ఏయ్‌ సునీల్‌! గా ఒర్రుడేంది? ఈడికెంచి ముందామెను పంపియ్‌!’’  యాదమ్మ మాటలకు చిరాకుపడుతూ వీఆర్వో. ‘‘సార్‌’’ అని జవాబిచ్చి.. ‘‘ఏ యాదమ్మ..గీడ లొల్లివెట్టక్‌.. రేపు ఎమ్మార్వో తాన వెట్కపో.. నడువ్‌’’తరిమాడు అసిస్టెంట్‌.‘‘పెడ్త పెడ్తా.. మీ సంగతి జూస్తా’’ చీర కొంగుతో ముక్కు తుడుచుకుంటూ ‘‘ఓ ఎల్లక్కా.. సిద్దవ్వా.. మీక్కూడా గీ గతేవట్టిస్తరు సూడుండ్రి... రేపు నాతో ఎమ్మార్వో ఆఫీస్‌కి రాండ్రే. గీల్లంతా లంగల్‌.. దొంగలు.. మన ఎయ్యి రూపాయలగ్గూడా ఆశవడే కుక్కలు.. గీ కొడుకులు. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే జూపిస్తరు’’ అని లైన్‌లో ఉన్న వాళ్లను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ  పంచాయతీ కాంపౌండ్‌ దాటింది యాదమ్మ. 

అక్కడున్న అందరి మనసూ బరువెక్కింది. సిద్దవ్వకైతే చేతులు రావట్లేదు ముందుకు జరగడానికి. భయం జొచ్చింది. యాదమ్మ ఇంటి సంగతి తనకెర్కే. వయసుమీదున్నప్పుడే మొగుడు వొయిండు. పిలగాండ్లిద్దరు ఎడ్డోల్లే. మగబాయి లెక్క అన్నిటికీ తానే. ఫించన్‌ దప్ప ఏం లేదు. పొద్దుగూకేటాల్ల కాపోల్లిండ్లల్ల అన్నం అడుక్కచ్చుకుంటది. ఎప్పుడెప్పుడన్నా సాకిలిండ్లల్ల పనుంటే విలుస్తరు. పోతది. గంతే.ఇప్పుడెట్లుల్లా.. ‘‘సూడుండ్రే.. మీగ్గూడా మొండి షెయ్యే...’’ యాదమ్మ మాటలు చెవుల్లో తిరుగుతున్నయ్‌. ‘‘సిద్దవ్వా... ఓ సిద్దవ్వా..’’ ఆ పిలుపుతో వర్తమానంలోకి వచ్చి.. అసిస్టెంట్‌ వైపు చూసిందిసిద్దవ్వ. ‘‘ఏం జూస్తవ్‌... ముందుకు రా’’ ఈసడింపు అసిస్టెంట్‌ గొంతులో.  చేతుల ఆసరాతో ముందుకు జరిగింది. ‘‘హూ...’’ చిరాగ్గా నిట్టూరుస్తూ.. ‘‘పెంటయ్యా... గీమెను జెర కుర్చీల కూసోవెట్టు’’ అక్కడే ఉన్న పంచాయతీ ప్యూన్‌కు చెప్పాడు అసిస్టెంట్‌. ‘‘సారూ..’’ అంటూ వచ్చి సిద్దవ్వ రెండు చంకల కింద చేతులతో ఆమెను లేపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు పెంటయ్య. ఒక్కసారిగా కాళ్లు కిందకి వేళ్లాడటంతో దెబ్బతిన్న కాలు జువ్వుమని లాగి కంపించసాగింది. ఆ నొప్పికి  విలవిల్లాడింది ఆమె. పంటికింద బాధను నొక్కేసి  బయోమెట్రిక్‌ మెషీన్‌ మీద వేలు పెట్టింది ముద్ర కోసం. ‘ఫెయిల్‌’ అంటూ మొరాయించింది మెషీన్‌. ‘‘ఉహ్హూ.. మల్లా వెట్టు’’ తిరస్కారం అసిస్టెంట్‌ గొంతులో.కంపిస్తున్న కాలు మోకాలిని ఎడమచేత్తో అదిమిపట్టుకుంటూ కుడిచేయి బొటనవేలును మళ్లీ మెషీన్‌ మీద పెట్టింది. అదే శబ్దం ఫెయిల్‌ అంటూ. ‘‘సిద్దవ్వ గిదే లాస్ట్‌ చాన్స్‌. సరిగ్గా పెట్టు’’ హెచ్చరిక. ‘‘అట్లనే  సారూ..’’ కంపిస్తున్న స్వరం, చేయితో బొటన వేలిని ఉంచింది.  ఫె.. యి.. ల్‌.‘‘సిద్దవ్వా.. నీ వేలిముద్రను గూడా రిసీవ్‌ చేస్కుంట లేదు. ఎమ్మార్వో ఆఫీస్‌కు పో రేపు’’ అంటూ తర్వాత పేరు పిలిచాడు అసిస్టెంట్‌ సునీల్‌. వెన్నులో వణుకు  సిద్దవ్వకు. అంటే.. ఎయ్యి రూపాయలు రావిప్పుడు. ఫించన్‌ లేకుండా ఇంటికివోతే..? దిగులు.. గుబులు ముసురుకున్నాయ్‌. పొద్దున రొట్టె తినంగా.. దబ్బదబ్బ  చిన్నకోడలు బయటకచ్చి.. ‘‘ఈ నెల సుత అత్తమ్మ నాదగ్గర్నే ఉంటది’’ అన్నది పెద్దకోడలికి ఇనవడేటట్టు. గంతే.. ఉరుక్కుంట బయటకచ్చింది పెద్దకోడలు ‘‘ఏందే ఉండేది’’ అనుకుంట. ‘‘ నెల నీ తాన.. నెల నా తాన అన్నప్పుడు లెక్క గట్లనే ఉండనియ్‌’’’ బెదిరిచ్చింది.‘‘ఏంది లెక్కపత్రం? మస్తు మాట్లాడుతున్నవ్‌. ఉంటది. నా తాన్నే ఉంటది. నీకేమైతుంది?’’  ‘‘నాకేమైతుందా?’’ 

‘‘అవ్‌..’’ ‘‘ఏందే అవ్‌...’’ మాటామాటా వెంచుకుని సిగెంట్రుకలు వట్టుకుండ్రు. ఫించన్‌ కోసం తనను పంచుకున్నోళ్లు... ఇయ్యాల అది లేకుంట వోతే ఇంట్లెకి రానిస్తరా?రేపు ఎమ్మార్వో ఆఫీస్‌కు తనను ఓల్లు గొండవోవాలే? పైసల్‌ దప్ప గివన్ని ఆల్లకు పడ్తయా? ఏం అవుసరం ఆల్లకు? ఎట్లనన్న జేసి పైసలు దేవాలే.. ఆల్ల షేతులల్ల వొయ్యాలే! ఆల్లు మాత్రం ఏం జేస్తరు? బతుకులిట్ల గాలిపాయే.. అనుకుంటూ పెంటయ్య వైపు చూసింది.అర్థమైన పెంటయ్య ఆమెను కిందికి దించాడు. చేతులు నేల మీద పెడితే బలం రావట్లేదు. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగట్లేదు. మెదడులో యాదమ్మ మాటలే.. సూడుండ్రే మీగ్గూడా మొండి షెయ్యే... సూడుండ్రే మీగ్గూడా మొండి...సూడుండ్రే మీగ్గూడా.. సూడుండ్రే... సూడుం...
  

మరిన్ని వార్తలు