అగ్గిపెట్టె   

22 Apr, 2018 00:34 IST|Sakshi

కథా ప్రపంచం

బెంగాలీ మూలం :  ఆశాపూర్ణా దేవి
 అనువాదం: టి. లలితప్రసాద్‌ 

నేను మహిళలను ఎప్పుడూ అగ్గిపెట్టెతో పోలుస్తూంటాను. ఎందుకంటే, అగ్గిపెట్టెలానే వంద లంకల్ని తగలెయ్యగల శక్తి వున్నప్పటికీ, చాలా అమాయకంగా, వంటింట్లో, పడగ్గదిలో, అక్కడా ఇక్కడాఎక్కడయినాసరే మహిళలు అలా మౌనంగా ఉంటారు. ఉదాహరణ కావాలా?మా ఇంటిముందు మూడంతస్తుల భవనాన్ని జాగ్రత్తగా గమనించండి. అది ఆదివారం ఉదయం.చాకలి వచ్చి వున్నాడు. అజిత్‌ భార్య చాకలి ముందు బట్టలు కుప్పగా వేసింది. అతను అవి తీసికెళ్లేలోగా చివరగా మరోసారి అజిత్‌ ప్యాంటు జేబులు వెతికింది. వెతగ్గా వెతగ్గా ఒక వుత్తరం దొరికింది. నలిగిపోయిన ఒక వైపు చిరిగిన ఓ కవర్‌. దాని మీద నమితా పేరే ఉంది. అంతే బట్టలన్నీ అలా వదిలేసి ఆ వుత్తరం పట్టుకుని గదికి వెళ్లి మంచం మీద కూలబడింది. ఎప్పుడొచ్చిందీ తేదీ చూసింది. అది వచ్చిమూడు రోజులయింది. అజిత్‌ వుత్తరాన్ని తెరిచి చదివి ఇలా మడతలుపెట్టి జేబులో వేసుకుని అలానే వుంచేసి వుంటాడు. నమితకి ఆ వుత్తరం సంగతి చెప్పాలని అనిపించలేదతనికి. మంటలు ఎగిసిపడుతున్నాయి, అది ఆమె ఆలోచనల్ని కూడా అంటుకుంది. దీన్ని అంత సులభంగా తీసుకునే సంగతిగా ఆమె భావించడం లేదు. కావాలని చేసిందే అనుకుంది. అజిత్‌ అలాంటివాడే. పెద్ద కుటుంబంలో యాభైరెండు చేతులు దాటించి మరీ లెటర్‌బాక్స్‌ తాళం తీశాడు. కవర్‌ మీద నమితా పేరుంటే అతనే తెరిచి ముందుగా చదివేస్తుంటాడు. ఆ తర్వాతే ఆమెకి ఇస్తాడు. అలాగని ఆమెకి వచ్చిన వుత్తరాలన్నీ ఆమెకి ఇస్తాడనీ కాదు! ఇదుగో అతని ఈ తత్వమే ఆమె మనసులో అనుమానాన్ని బలపరచింది.

ఈరోజుకీ, తాను వుత్తరాలు ముందుగా తీసి చూస్తానన్నది కనుగొనడానికి ఏమాత్రం రుజువు లేకుండా జాగ్రత్తపడతాడు. ఆమెకి అనుమానం. అతనిది చెడ్డ అలవాటు. ఇప్పటికీ రెండూ పోవు. అందుకే ఆమె ఎత్తిపొడుపులూ, అతను కోపం ప్రదర్శించడం ఆ పెద్ద ఇంట రోజువారీ కార్యక్రమంలా సాగుతూంది. సరే ఇవాళ ఆమె చూసినది తన తల్లి నుంచి వచ్చినది. దాన్నిండా ఎపుడూ ఉండే అనేక ఫిర్యాదులు, కష్టాల పరంపరే. అటక పాడయిందని, దూలం ఏ క్షణాన్నయినా విరిగి పడితే తాను చావడం ఖాయమని, ఎవరూ దాన్ని బాగుచేయించడంలేదని, తన కూతురు రాకుమార్తె, అల్లుడు రాకుమారుడని, అందువల్ల తనను ఆదుకుంటారన్న ధైర్యంతో ఎన్ని కష్టాలనైనా భరించేస్తున్నానని యింకా ఏవేవో ఇలానే చాలా..! భర్తను కోల్పోయిన ఆవిడ తన వొక్క కూతురిని కాస్త పెద్ద కుటుంబంలోనే ఎలాగో ఇవ్వగలిగింది. అందుక్కారణం అమ్మాయి చూడచక్కనిది గనుక. వాళ్లు మంచివాళ్లు కావడం వల్ల ఈమె తను లేని కష్టనష్టాలను ఆరోపిస్తూ ప్రతీ చిన్న పని అమ్మాయి ద్వారా చక్కగా చేయించుకుంటూ జీవితాన్ని గడిపేస్తోంది. అందుకే ఆమె నుంచి నమితకు ఉత్తరం వచ్చిన ప్రతీసారీ, ‘ఎందుకు చదవడం? మనీఆర్డర్‌ చేయడమే ఉత్తమం’ అని నవ్వి వూరుకుంటుంటాడు. నమిత అవమానంతో తలొంచుకుంటూంటుంది. ఇక ఇది ఏమాత్రం భరించలేక తన తల్లిని కార్డు మీద రాయడం మాన్పించింది. అప్పటినుంచీ నమిత తను దాచుకున్న డబ్బులోంచి కొంత తల్లికి పంపడమూ చేస్తోంది. కవర్‌లోని వుత్తరం కథ కూడా అదే.
ఆ ఆదివారం హఠాత్తుగా తల్లిమీద ఆగ్రహంతో వూగిపోయింది. ఎందుకిలా ఎప్పుడూ ప్రాధేయపడుతూంటుంది? కూతురు ఆత్మగౌరవాన్ని ఆలోచించలేదా? అత్తవారింట్లో పరువేంగావాలి? లాభంలేదు. ఈసారి తానే సమాధానం రాయాలనుకుంది నమిత. ‘ఇక నా వల్ల కాదు. నా నుంచి ఎలాంటి సాయంకోరి ఎదురుచూడవద్దు’ అని రాసింది.

అజిత్‌ తలస్నానం చేసి అపుడే గదిలోకి వచ్చాడు. అప్పటివరకూ తల్లి మీది కోపం అతని మీదా ప్రదర్శించింది, ‘ఈ వుత్తరం ఎప్పుడు వచ్చింది?’ అని అడిగింది.ఆమెను పరికించి చూసి, తన తప్పు ప్రభావం గ్రహించి ‘చేతికి వచ్చినంత ఇమ్మని వుంది’ అందుకే నమితకి ఆ వుత్తరం ఇవ్వకూడదనుకున్నాడు; వుత్తరాన్ని తీసుకుని ముక్కలు చేసి పారేయాల్సింది. అలా చేయలేదు, పొరపాటే చేశాడు. అందువల్ల అతనేమీ భంగపడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు నటించి, ‘వుత్తరమా? ఏం వుత్తరం? ఓహ్, అవునవును! మీ అమ్మగారి నుంచి వచ్చింది, ఇవాళే నీకు ఇద్దామనుకున్నాను’ అన్నాడు.‘వెంటనే ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు? సమాధానం చెప్పండి, ఎందుకు మీ దగ్గరే పెట్టుకున్నారు?’ ‘అబ్బా, ఏంటీ గోల? ఏదో మర్చిపోయానులే’ ‘అబద్ధం’ కోపంతో అన్నది.‘నోటికి వచ్చినట్టు అంటావేమిటి? మనిషి అన్న తర్వాత మర్చిపోడా?’‘లేదు. మర్చిపోరు. కవర్‌ చించి వుత్తరం ఎందుకు చూశారు?’ అదేమీ పట్టనట్టు అజిత్, ‘చూస్తే ఏమయింది? నా భార్యకి వచ్చినదేకదా..’ అన్నాడు.‘అలా అనొద్దు. లక్షసార్లు చెప్పాను నా వుత్తరాలు చూడొద్దని, చెప్పానా లేదా?!’నమిత కోపానికి అజిత్‌ భయపడలేదు. చక్కగా నవ్వుతూ, ‘నువ్వు కాదంటే అదేదో చూడాల్సిందేగదా. ఎవరైనా రహస్యంగా ప్రేమలేఖలు రాస్తున్నారేమో!’ అన్నాడు కవ్వింపుగా.‘ఆపుతారా? ఎంత దారుణమైన మనిషివి!’

ఇక అజిత్‌ తన దొంగ నవ్వును నిజంగానే బయటకి నవ్వేశాడు. తాను కత్తి ఝళిపించాడు. ‘అలాగయితే రాత్రింబవళ్లూ  కష్టాల్ని చెప్పుకుంటూ చేతులు చాచి సాయం అడుగుతున్న వాళ్లనేమనాలి? పేడకళ్లులెత్తుకునే వాళ్లమ్మాయి రాణి అయితే ఇలానే ఉంటుంది సుమా..’ అన్నాడు.‘ఇంక ఆపుతారా?’ గట్టిగా అరిచింది నమిత.వాళ్ల గది మూడో అంతస్తులో వుంది నయం. లేకుంటే ఈ అరుపులు అందరికీ వినిపించి పైకే చూస్తుండేవారు!‘ఎందుకు నోరుముయ్యాలి? నీ ఉత్తరాలు చూస్తాను. ఏదనుకుంటే అది చేస్తాను, నా యిష్టం. ఏం చేస్తావ్‌? ఏమన్నా చేయగలవా?’‘ఏం? నేనేంచేయలేనా? నేనేం చేయగలనో చూస్తారా?’ ఉక్రోషంతో ఊగిపోయింది నమిత.అంతే, పరుగున వెళ్లి అక్కడ టేబుల్‌ మీదున్న అజిత్‌ సిగరెట్‌ పెట్టె, అగ్గిపెట్టె తీసింది. అగ్గిపుల్ల వెలిగించి చీరకు అంటించుకుంది. ఆ ధనికుని భార్య ఖరీదయిన చీర అంటుకుంది.ఒక్క ఉదుటన దగ్గరికి వెళ్లి చీర కాలుతున్న భాగాన్ని చేతులతో పట్టి మంటలు ఆర్పి ‘నీకేమైనా పిచ్చా?’ అని తిట్టాడు అజిత్‌. నిజానికి అతను ఎంతో భయపడిపోయాడు. భయంతో ఆమె వంక చూశాడు. ఇంకా సరిగా ఆరని మంటలపై నీళ్లు పోసాడు. అతి కష్టంమీద మళ్లీ మాట్లాడగలిగాడు. ‘ఆ కోపమేమిటి? బుద్ధిలేకపోతే సరి? ఆడమనిషికి ఇంత కోపమా ఓహ్‌!’ అనగలిగాడు. ఆ వెంటనే నమిత ఏమన్నదో ఎవరికి తెలుసు. కానీ అప్పటికే ఆమె మేనకోడలు రీని వచ్చింది. గుమ్మంలోనే ‘అయ్యో అత్తా, చాకలివాడు ఇంకా ఎంతసేపు వుండాలి? నీ బట్టలేవీ ఇవ్వకుంటే చెప్పు వెళ్లిపోతాడుగదా!’ అని అరిచింది. క్షణంపాటు నమిత అలా ఉండిపోయింది. తన కోసం కింద హాల్లో వున్న చాకలివాడి మొహం గుర్తుకువచ్చింది. వెంటనే మాసిన బట్టలు లెక్కబెడుతూ ‘నువ్వెళ్లు కిందకి వస్తున్నా, బట్టలు తెస్తున్నాలే!’ అన్నది.నమిత ఏదయినా మనస్ఫూర్తిగానే చెబుతుంది. అందుకే ఇంట్లో ఎవరూ ఆమెను వ్యతిరేకించరు. అపుడపుడు తోడికోడళ్లు వెనకనుంచీ ఎత్తిపొడుపుతూ పొడుస్తూనే వుంటారు. ఇప్పుడు కూడా. నమిత మెట్లు దిగి వచ్చింది. ‘నీకు క్షణం దొరికితే చాలు చడీచప్పుడూ చేయకుండా గదిలోకి దూరతావు, ఎప్పుడూ మొగుడిదగ్గరే వుండిపోతూంటావ్, సమయం, సందర్భం ఏమీ లేవు మీ ప్రేమకబుర్లకి!!’ అన్నది వెక్కిరింపుగా వదినగారు. నమిత ఒక్కసారి చుట్టుపక్కల చూసింది. ఉదయం పనుల్లో అంతా హడావుడిగా తిరుగుతున్నారు. తాను ఏమీ జరగనట్టే ఉండాలనుకుంది. సన్నగా నవ్వి మెల్లగా ‘అబ్బే అదేంలేదు, కావాలంటే వచ్చి చూడవచ్చు, మేమేదో మాట్లాడుకుంటున్నాం, అంతే.’ 

మిజో ఆహాహా అంటూ గట్టిగా నవ్వి, ‘చాల్లే, మాకు తెలీదనుకున్నావా? అయినా మీ గదిలోకి తొంగిచూడడానికి మాకు వేరే పనేమీ లేదనుకున్నావా? మా కళ్లకు కనపడుతోంది, ఇరవై నాలుగ్గంటలూ ఏం చేస్తున్నావో!’ అన్నది వెటకారంగా.  నమిత నవ్వింది. నవ్వుతూనే, ‘మీకు మామూలేగా, తమాషాగా అనడం!’ అన్నది. ‘నువ్వింకా కూరలు తరగనే లేదా? కథలు ఇలా చెబుతూనే వుంటావా?’ అన్నది తోడికోడలు పరుగున వచ్చి. మరో గదిలోకి వెళ్లబోతూ వెనక్కి తిరిగి నమిత కాలిన చీర అంచు చూసి, ‘ఏమయిందే?ఇంతమంచి చీరను ఎలా కాల్చుకున్నావే?’ అని ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.నమిత ఆశ్చర్యాన్ని నటించింది. కానీ ఒక్క నిమిషమే. మరుక్షణం కాలిన కొంగు భాగాన్ని వెంటనే మడిచి పట్టుకుని, నవ్వుతూ, ‘అదా! గుర్తు చేయకు. నన్ను హెచ్చరిస్తూనే వున్నావు. నేను విననే లేదు. చూడు ఇపుడేమయిందో! స్టవ్‌ మీంచి వేడినీళ్ల  గిన్నె దించబోయాను. అపుడు చీర అంటుకుంది!’ అన్నది.  నమిత బంగాళాదుంపలు బుట్ట దగ్గరికి లాక్కుని తొక్కు తీయడానికి కూర్చుంది. కానీ ఆమె మనసులో మాత్రం తన తల్లికి రహస్యంగా డబ్బులు ఎలా పంపాలా అనే ఆలోచిస్తోంది. ఉత్తరం రాయలేదు. ‘నా నుంచి ఏమీ ఆశించకని, ఆశ పెట్టుకోవద్దనీ’ ఎలా రాయగలదు?  అక్కడ ఊళ్లో నమిత రాణీభోగం అనుభవిస్తోందన్నది ప్రతీ ఒక్కరికీ తెలుసు. నమిత భర్త కూడా చాలా మంచివాడు, విశాలహృదయుడు. ఇందుకే, నేను మహిళలను అగ్గిపెట్టెలతో పోల్చేది. దేన్నయినా కాల్చి బూడిద చేయగల శక్తిసామర్థ్యాలున్నప్పటికీ, ఇంతటి మంచి మనసు, విశాలహృదయం వున్నట్టు బయటికి కనిపించే మగాళ్ల ముసుగులను మాత్రం ఏమీ చేయవు. ఎన్నటికీ. ఈ సంగతి మగవాళ్లకీ తెలుసు.అందుకనే వంటింట్లోనూ స్వేచ్ఛగా ఉండనిస్తూంటారు, పెరట్లో, పడకగదిలోనూ. అక్కడా, ఇక్కడా, ఎక్కడయినా  సరే. భయం లేకుండా జేబుల్లోనూ పెట్టుకుంటారు.         
  

మరిన్ని వార్తలు