పెళ్లి చీర

6 May, 2018 00:35 IST|Sakshi

 ఈవారం కథ

‘‘అమ్మలూ! అమ్మ ఎక్కడే..?’’ సోఫాలో కూర్చొని ల్యాప్‌టాప్‌ వంక తదేకంగా చూస్తున్న ప్రతిమ దగ్గరకు వెళ్ళి అడిగాను నేను, గౌరి గురించి.‘‘అత్త ఫోన్‌ చేసింది అమ్మమ్మా!’’ అని ప్రతిమ చెప్పింది. ప్రతిమ దృష్టి ల్యాప్‌టాప్‌ మీదే ఉన్నట్టుంది. అందుకే పొడిపొడిగా బదులిచ్చింది. ఏదో పని చేసుకుంటున్నట్టంది.‘‘అమెరికానించా?’’ అనడిగా.‘‘అవునమ్మమ్మా!’’ అంది తల ల్యాప్‌టాప్‌ నుండి తిప్పకుండానే.‘ఏ రంగు...? అలా రంగులేమీ అనుకోలేదు..’ అని మంచం మీద కూర్చుని కులాసాగా నవ్వుతూ మాట్లాడుతోంది గౌరి. నావైపు చూసింది కుర్చోమని చెప్తున్నట్టుగా, మంచం మీద తడుతూ. వెళ్ళి గౌరి పక్కన కుర్చున్నా. ‘‘నువ్వు ఇక్కడే ఉంటే ఆ ముచ్చట్లవీ దగ్గరుండి చూసుకునేదానివి కదా...’’ అంటోంది గౌరి. నేను గౌరి వైపు చూసాను. నేను అలా చూస్తే మాత్రం ఆ ముచ్చటించుకుంటున్న ముచ్చట్లేవో నాకు తెలిసేటట్టు.‘‘లేదు లేదు. ఈ రంగు అని అనుకోలేదు. పెళ్ళి దానిది, కాబట్టి ప్రతిమకి ఏ రంగు నచ్చితే ఆ రంగు తీసుకుంటాం.’’ అంది గౌరి.అప్పటికి నాకు విషయం అర్థమైంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నది పెళ్ళి చీర గురించి.నా మనవరాలు ప్రతిమ పెళ్ళి కుదిరింది. నేనిక్కడికి వచ్చింది కూడా ఆ పెళ్లి కోసమే. నేను వచ్చిన దగ్గరనుండి వింటున్న మాట ‘పెళ్ళి చీర’ గురించే. రోజుకి పదిసార్లు అయినా గౌరి పెళ్ళి చీర గురించి అనుకుంటూ ఉంటుంది.నా పెళ్ళి సమయంలో నేను కానీ మా అమ్మ కానీ పెళ్లిచీర గురించి ఇంత మాట్లాడుకున్నామా? నా ఆలోచనలు జ్ఞాపకాల్లోకి పరుగులు తీసాయి. నాకున్న మోకాళ్ళ నొప్పులు నా ఆలోచనలకి లేనట్టున్నాయి. సునాయాసంగా నా బాల్యాన్ని చేరుకున్నాయి అవి.

మా అమ్మగారికి ఇద్దరు మగపిల్లల తరవాత మూడవ సంతానంగా పుట్టాను నేను. అమ్మ నన్ను చాలా మురిపెంగా చూసుకునేది. ఆటలాడుకుంటున్న వయసులో హఠాత్తుగా వచ్చి ‘నీకు పెళ్ళి’ అన్నారు.పెళ్ళి అయిపోయాక అత్తవారింటికి వెళ్ళిపోవాలని తెలియని వయసు నాది. పూల జడ కుట్టించుకుని, బుగ్గన చుక్క పెట్టించుకుని బుట్టలో కూర్చోడమే పెళ్ళి అనుకున్నాను అప్పుడు.మా అమ్మ ‘కాంతానికి మంచి చీర కొనాలి’ అని ఒకటి రెండుసార్లు అన్నదేమో. ఆకుపచ్చటి చీరకి ఎర్రని అంచు ఉన్న పెద్ద పట్టుచీర కొంది నాకోసం.‘‘కాంతం.. చీర ఎంత బాగుందో.. చాలా బాగుంది.’’ అని మా వైపు బంధువర్గం, మా అత్తింటి వారు అనడం నాకు జ్ఞాపకమే. ఆ చీర ఇప్పటిలా ఎక్కడికో బయటికి వెళ్ళి తీసుకురాలేదు. ఇంటింటికి తిరిగి చీరలు అమ్ముకునే ఒకతని దగ్గరే మా అమ్మ తనకు కావాల్సిన చీరలన్నీ కొనేది. నాకు కూడా అతని వద్దే కొంది. మా నాన్నగారు పెళ్ళి ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఏదో కొంత పైకం నా చీర నిమిత్తం మా అమ్మకు ఇచ్చారు.

ఆ పెళ్ళి చీర బేరం చేస్తున్న రోజున – ‘‘ఏదీ.. ఆ చీర పైకి తియ్యి...’’ మా అమ్మ అమ్ముకునే అతనితో అంది. నేను మా అమ్మ పక్కనే కూర్చుని ఉన్నాను.‘‘ఏదమ్మగారూ?’’ అతను అడిగాడు. ఆ మూటలో చాలా చీరలు ఉన్నాయి. ‘‘ఇదీ..’’ అంది మా అమ్మ వేలు పెట్టి ఒక చీరని చూపించి. నేనూ అసక్తిగా చూస్తున్నాను. ఆ మూటలో పాతిక, ముప్ఫై చీరలు ఉంటాయేమో. అన్ని చీరలూ గొప్పవేమీ కావు. ఆ మూట కాక అతని వద్ద విప్పని ఇంకొక మూట ఉంది.మా అమ్మ అడిగిన చీర బయటకి తీసాడతను. మా అమ్మ వెంటనే ఆ చీరని నా భుజం పైన వేసి చూసింది. ‘‘అమ్మాయి గారికి ఈ రంగు బాగా నప్పింది.’’ అన్నాడతను.‘‘మా కాంతానికి చంద్రకాంతం లేకపోతే ఎలాగ.?’’ అని అమ్మ అంటూ ఉండగా అటువైపు వెళుతున్న నాన్నగారు అన్నారు – ‘‘చాల్చాలు ఇంకెన్ని చీరలు? ఆ మొదటి దానికి డబ్బిచ్చి అతన్ని తొందరగా పంపూ. అవతల చాలా పనులున్నాయి’’.నాన్నగారి మాటలకి అప్రమత్తం అవుతూ.. ‘‘ఈ చీరెంత?’’ అని గుసగుసగా అడిగింది అమ్మ. అతను ఏదో చెప్పేలోపే, ‘‘ఏమేవ్‌!’’ మా నాన్నగారు సింహంలా కేక వేసారు. మా అమ్మ అతనికేదో సైగ చేసి ఒక చీరకి డబ్బిచ్చి పంపేసింది. నా భుజం మీద చీరని అతను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ రంగు నాకు ఎలా ఉందో అద్దంలో చూసుకోలేకపోయానే అనే బాధ అలాగే ఉండగా అతను వెళ్ళిపోయాడు. 

తరువాత నేనూ ఆ సంగతి మర్చేపోయాను. కానీ ఎలా వచ్చిందో మరి.. పెళ్ళి రోజున మళ్ళీ ఆ చీర కనిపించింది నాకు.‘‘అమ్మా! అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే?’’ నేను హడావుడిలో కూడా మా అమ్మని అడిగాను. మా అమ్మ ‘ష్‌!’ అంది కానీ ఇంకేం చెప్పలేదు.కానీ పరుగున వెళ్ళి నాకు అ రంగు ఎలా నప్పుతుందో అద్దంలో ఆ రోజు చూసుకోనేలేదు నేను. ‘‘అమ్మా! భోజనం చేస్తావా?’’ అన్న గౌరి పిలుపుతో నా పెళ్ళి వయసు నుండి మనవరాలున్న వయసులోకి వచ్చేశాను. పెళ్ళి చీర అనగానే నాకు ఆ రెండు చీరలు, అవి ఎలా కొన్నది జ్ఞాపకం వచ్చాయి. ‘‘ఏమిటి? అంత దీర్ఘాలోచన?’’ అని అడిగింది గౌరి.‘‘ఏం లేదు. ఇంతకీ నీ ఆడపడుచు ఏమంటోందేమిటి?’’ అని అడిగాను.‘‘ఏముంది... రేపు బట్టలు కొనడానికి వెళ్ళాలి అంటేను, ప్రతిమకి ఏ రంగు చీర కొంటావ్‌ పెళ్ళి పీటల మీదకి, అని అడుగుతోంది.’’ అంది గౌరి. కాసేపు ఆలోచనల్లో పడింది. ‘అయినా రేపు వెళ్తాం కదాకొనడానికి, జాగ్రత్తగా చూసి కొనాలి‘ అని తనలో తను అనుకున్నట్టే పైకి అంది.

‘‘ప్రతిమ అత్తగారు కూడా వస్తామని అన్నారు కదా?’’ పెళ్ళిచీర కొనడానికి నేను, గౌరి, ప్రతిమ కార్‌లో వెళ్తోంటే గౌరితో అన్నాను. గౌరి ముందు సీట్లో మా అల్లుడుగారి పక్కన కూర్చుని ఉంది. అక్కడ నుండే తల తిప్పి, ‘‘ఆవిడ వస్తానని అన్నారు కానీ కుదరలేదుట. వాళ్ళ అబ్బాయి అయినా వస్తాడని అనుకున్నాం.’’ అంది గౌరి.‘‘ఏమే అమ్మలూ! అతను ఎందుచేత రావడంలేదు.’’ అని ప్రతిమని అడిగాను. ప్రతిమ ఫోన్‌తో చాలా బిజీగా ఉంది. నాకు సమాధానం కూడా ఫోన్‌ నుండి తల తిప్పకుండానే ఇచ్చింది – ‘‘తనకు ఈ షాపింగ్‌లూ అవీ నచ్చవుట అమ్మమ్మా!’’. కారు నడుపుతున్న మా అల్లుడు కిసుక్కున నవ్వి, ‘‘తెలివైనవాడు’’ అన్నాడు. గౌరి కనుచివర్ల నుండే భర్తని కోపంగా చూసింది.‘‘షాప్‌ ఇదేనా నువ్వు అనుకున్నది’’ అంటూ అల్లుడు తెలివిగా గౌరి కోపాన్ని మాయం చేసాడు. ‘‘ఇదే!’’ అని గౌరి చెప్పాక కారు ఆగింది. ‘‘మీరూ రండీ’’ బట్టల దుకాణం ముందు మేము ముగ్గురం దిగిపోయాక గౌరి భర్తతో అంది. ‘‘లేదు. నాకు పని ఉంది. మీరు వెళ్ళి రండి, మీ పని అవ్వగానే ఫోన్‌ చేస్తే నేను వస్తాను.’’ అని అల్లుడు అనగానే ప్రతిమ గౌరి వైపు చూసి చిన్నగా నవ్వింది.‘‘అమ్మా! ఈ చీర ఎప్పుడు కొన్నావే? ఇందాకటి నుండి అనుకుంటున్నాను’’ అని అల్లుడు వెళ్ళీ వెళ్ళగానే అడిగింది గౌరి, బట్టల దుకాణం మెట్లు ఎక్కుతుంటే. 

‘‘ఇదా?’’ నేను కట్టుకున్న ఉల్లిపాయ రంగు పట్టుచీర వైపు చూపిస్తూ అడిగాను. ‘‘అవునూ!’’ అంది. ‘‘ప్రతిమ చిన్నప్పుడు కొన్నది’’ అని నేను చెప్పగానే గౌరి నమ్మలేనట్లుగా చూస్తూ, ‘‘అయినా ఎంత మెరుపుగా ఉందో,’’ అంటూ తన చీర వైపు చూసుకుంటూ, ‘‘ఇది కొని మూడేళ్లు కూడా కాలేదు. చూడూ, నీ చీర ముందు ఎంత వెలవెలపోతోందో’’ అంది.‘అలా ఏం కాదే బాగుంది.’’ అన్నాను. నేనేమీ గౌరి కోసం చెప్పలేదు. దాన్ని సాయంత్రం సంపెంగపండు రంగు చీరలో చూసిన దగ్గర నుండి అనుకుంటున్నాను, సంధ్యాదీపంలా మెరిసిపోతోంది అని. ‘‘నీకు వయసు అయిపోయింది. అందుకే అలా అంటున్నావ్‌’’ అంది. గౌరి వేళాకోళానికే అన్నదని తెలిసిపోతోంది.‘‘ఇందాకటి నుండి నీ గురించి సంధ్యాదీపంలా ఉన్నావ్‌ అని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పూ... నాకు వయసు అయిపోయిందా?’’ అని అడిగాను.ప్రతిమ ఫకాలున నవ్వింది. మౌనంగా మారడం గౌరి వంతయ్యింది.ముగ్గురం కలిసి ఆ పెద్ద బట్టల షాపులో అడుగుపెట్టాం. నేను ఇంత పెద్ద బట్టల దుకాణానికి రావడం ఇదే మొదటిసారి. లోపలికి వెళ్ళీ వెళ్ళగానే పెద్ద లక్ష్మి దేవి విగ్రహం, పక్కనే రెండు పెద్ద ఇత్తడి దీపపు సమ్మెల్లో దీపం వెలుగుతోంది. ఆ విగ్రహం ముందు అర్చక స్వామి కూర్చొని ఉన్నాడు. సన్నగా కీర్తనలు వినిపిస్తున్నాయి. ముక్కుకి అగరబత్తి పరిమళం తెలుస్తోంది. ఎటు చూసినా చీరలే. మమ్మల్ని చెప్పులు విడిచి చీరలు చూడటానికి వెళ్ళమన్నారు. నాకు ఆ చీరల అంగడిని చూడగానే ఇంటికి చీరల వాడు తెచ్చిన చీరల మూట గుర్తుకు వచ్చింది. ఇక్కడ చీరల సంఖ్య లక్షల్లో ఉండి ఉండచ్చు.

‘‘ఇది దుకాణంలా లేదు, గుడిలా ఉంది’’ అన్నాను గౌరితో.‘‘నాకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదనే ఎంతోమందిని ఎన్నోసార్లు వాకబు చేసి ఈ షాప్‌ గురించి తెలుసుకున్నాను.’’ అంది గౌరి గొప్పగా. ఆ మాట అనేసి గౌరి చీరలు చూడటంలో పడిపోయింది. నేను మాత్రం అక్కడే ఆగిపోయాను. గౌరికి నేనూ ఏం తక్కువ చెయ్యలేదు. కానీ ఎందుకు గౌరి అలా అన్నది అన్న చింతన మొదలయ్యింది. ఆ చింతనే నన్ను మళ్ళీ గతంలోకి లాక్కెళ్ళిపోయింది.  గౌరి చదువు పూర్తి కావస్తుండగా మా అత్తగారి తరుపు వేలు విడిచిన బంధువొకడు ఆవిడ చెవిన ఒక మాట వేసి వెళ్ళాడు, ‘‘మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి అని చెప్పటం కాదు కానీ ఆజానుబాహుడు, అందగాడు, ఆస్తిపరుడు, ప్రభుత్వోద్యోగి, తల్లిదండ్రులకి ఆఖరి సంతానం. మన గౌరమ్మ అక్కడ అడుగుపెడితే అంతే! ఇక చూసుకోవక్కర్లేదు.’’ అని. అంతే! మా అత్తగారు అబ్బాయిని నేరుగా చూడక మునుపే మాట మాత్రానికే, ‘‘తల్లీ కామాక్షీ! నా మనవరాలికి ఈ సంబంధం ఖాయం అయితే నీ దగ్గరికి వస్తాను తల్లీ!’’ అని మొక్కేసుకున్నారు. మొక్కు మహిమో లేక భగవంతుడే వేసిన బంధమో గౌరికి అదే సంబంధం ఖాయం అయిపోయింది. వెంటనే మా అత్తగారికి మొక్కు చెల్లించేసుకురావాలనే ఆదుర్దా మొదలయ్యింది. మా మరిదిగారిని వెంట తీసుకుని కంచి బయలుదేరారు. పెళ్ళి పనుల తాకిడి ఎక్కువగా ఉండటంతో మేము వెళ్ళడం కుదరలేదు. అత్తగారు అక్కడికి వెళ్ళడం వలన, పట్టుచీరల విషయంలో కంచికి ఉన్న ప్రాశస్త్యంవల్ల గౌరికి అక్కడ నుండే చీరలు తెప్పించాం.పెళ్ళికి వచ్చిన ప్రతీ ఒక్కరూ చీరని పొగడకుండా వెళ్ళింది లేదు.  ‘‘అమ్మా! చూడూ.. ఆ చీర ప్రతిమకి నప్పిందా?’’ అంటూ పిలిచింది గౌరి. ఆ పిలుపుకి నా ఆలోచనలు కాస్త విశ్రమించాయి. 

దుకాణంలోని ఒక అమ్మాయి చీరని పూర్తిగా విప్పకుండానే చీర కట్టినట్టు చీరని ప్రతిమకి చక్కగా చుట్టబెట్టింది. ‘బావుంది’ అని పైకి అన్నానే కానీ మనస్ఫూర్తిగా నా భావాన్ని వెల్లడించడానికి నేను ప్రతిమకి కట్టిన చీరని చూడనేలేదు. గౌరి అది గమనించినట్టుంది. ప్రతిమకి మరో చీర కూడా కట్టి చూడమని చెప్పి, ‘‘ఏమైందమ్మా! ఏమైనా ఇబ్బందిగా ఉందా?’’ అని అడిగింది. ‘‘లేదు’’ అని చెప్పినట్టు తల అడ్డంగా ఊపాను. అయినా గౌరి ఊరుకోలేదు. నేను నోరు మెదిపేదాకా అడుగుతూనే ఉంది. ‘‘నీకు మేం ఏం తక్కువ చేసాం చెప్పూ? ఆ రోజుల్లో కంచి నుండి చీర వేలు పోసి తెప్పించాం. నీకు జరిగినట్టు ప్రతిమకి జరగకూడదని ఎందుకన్నావ్‌?’’ అని ఉండబట్టలేక అడిగేసాను. గౌరి అన్నిసార్లు అడగబట్టి కానీ లేదంటే ఆ విషయం చెప్పేదాన్ని కాదేమో!గౌరి చిన్నగా నవ్వీ ‘‘అందుకా ఇంత ఆలోచనా?’’ అంది.‘‘నీకూ ఒక కూతురుంది, అది నిన్ను ఇలా అంటే అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాధ’’ అని చెప్పాను నేను.‘‘అది కాదమ్మా! చీర ఖరీదు ఎంత, అది ఎక్కడ నుండి తెప్పించాం అన్నదే కాదు కదా.. ఆ రోజుల్లో నా ఫ్రెండ్స్‌ అందరూ వాళ్ళవాళ్ళ పెళ్ళి చీరలు వాళ్ళే సెలెక్ట్‌ చేసుకున్నారు. కానీ నా విషయంలో అలా జరగలేదనే చిన్న బాధ మిగిలిపోయింది అంతే!’’ అంది.‘‘నువ్వు అప్పుడే చెప్పవలిసింది.’’‘‘అప్పుడు నాకు అంత వయసు లేదు కదే, చెప్తే ఎవరు ఏమంటారో అని నోరు తెరవలేకపోయాను.’’ అంది నవ్వుతూ. నేను ఇంక ఏం మాట్లాడలేదు. మళ్ళీ గౌరి కూతురికి నచ్చిన చీర కొనే పనిలో పడింది. అక్కడ సూపర్‌వైజర్‌ అన్ని రకాల చీరలు ఓపికగా చూపిస్తున్నాడు. ఒక్కో చీరకి ఒక్కో పేరు. వెయ్యి రూపాయలు మొదలుకొని లక్ష రూపాయల వరుకు ఎన్నో రంగుల్లో రకరకాల పేర్లు చెప్తూ చాలా చీరలు చూపించాడు సూపర్‌వైజర్‌. గౌరి చిన్నతనంలో ఇన్ని రకాల పేర్లతో చీరలు లేనే లేవు. ఇన్ని చీరల్లో ఏ ఒక్కటీ ప్రతిమని మురిపించలేకపోయింది. ఒక చీర రంగు నచ్చితే అందులో డిజైన్‌ నచ్చలేదు. డిజైన్‌ నచ్చిన చీర రంగు తన మేని ఛాయకి సరిపడదని ఇలా ఒక్కో చీరకి ఒక్కో వంక చెప్తూ చాలా సమయం గడిపేసింది కానీ ప్రతిమ ఒక్క చీర కూడా కొనలేదు. గౌరి ముఖంలో వెలుగు మాయం అయ్యింది కానీ, సూపర్‌వైజర్‌ పెదాల మీద నవ్వు చెక్కు చెదరలేదు. ప్రతిమలాంటి వాళ్ళని చాలా మందిని చూసి ఉంటాడు. 

‘‘అయితే ఏం ఒద్దా?’’ గౌరి ప్రతిమని అడిగింది విసుగ్గా. ‘‘నాకు ఇక్కడ అంతగా నచ్చలేదు.’’ అని నిర్మొహమాటంగా చెప్పిన ప్రతిమని ఏమనాలి? ఇంత పెద్ద దుకాణంలో ఇన్ని లక్షల చీరల్లో దానికి ఒక్కటి కూడా నచ్చలేదంటే నేను ఆశ్చర్యపోయాను. గట్టిగా మాట్లాడలేక గౌరి నీరసంగా ముఖం వేలాడేసింది. ‘‘దాని సంగతి వదిలేయ్‌. నువ్వు ఏదైనా తీసుకో’’ అన్నాను నేను గౌరితో.‘‘ఇప్పుడు నాకేం ఒద్దే’’ అంది గౌరి విసుగ్గా.‘‘ఏమిటి ఒద్దంటావ్‌? పెళ్ళి పీటల మీద కన్య ధార పోసేటప్పుడు నువ్వు కట్టుకోవు కొత్త చీర?’’ అని నేను అనగానే గౌరి ఒద్దని చెప్పబోతే, ‘‘అప్పుడెలాగో నీ ముచ్చట గ్రహించలేకపోయాను. ఇప్పుడైనా నువ్వు ఇష్టపడి ఒక్క చీర కొనుక్కుంటే నేను సంతోషిస్తాను. నీ కూతురి పెళ్ళి వయసు వచ్చేంత ఆలస్యం చేసాను. అదే నన్ను గుంజుతోంది. నేను ఇంకా బాధపడేలా చెయ్యకు తల్లీ!’’ అన్నాను గౌరితో.గౌరి ముఖంలో వెలుగు మళ్ళీ తిరిగి వచ్చింది. ‘సరే’ అని నవ్వింది. సూపర్‌వైజర్‌కి మళ్ళీ పనిపడింది.

‘‘అమ్మమ్మా!’’ ప్రతిమ సంబరంగా నాకు కునుకు పడుతున్న సమయంలో వచ్చి పిలిచింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రతిమే కాదు గౌరి కూడా ఉంది దాని పక్కనే. నేను వెంటనే గడియారం వంక చూసాను. గంట పన్నెండవుతోంది. ఏమైంది ఈవేళప్పుడు అని కంగారుగా లేచి కూర్చుని, ‘‘ఏమిటమ్మలూ?’’ అని అడిగాను.‘‘నా పెళ్ళిచీర చూపించేందుకు వచ్చాను.’’ అంది ప్రతిమ సంబరంగా.‘‘పెళ్ళిచీరా!?’’ మేం వెళ్ళిన దుకాణం నుండి తిరిగి వచ్చిన తరువాత ఆ వారం రోజుల్లో మరో దుకాణానికి వెళ్ళింది లేదు. నాకు చెప్పకుండా గౌరి వెళ్ళదు. మరి ఎలా? ఎప్పుడు? ఎక్కడ? కొన్నారు ప్రతిమకిచీర అని మనసులో అనిపిస్తూ ఉండగా, ‘‘ఏది చూడనీ?’’ అన్నాను.నా చేతికి ప్రతిమ చీర ఉన్న అట్టపెట్టే ఇస్తుందని అనుకుంటే ల్యాప్‌టాప్‌ అందించింది. బరువుగా ఉండి పట్టు సడలబోతుండగా, ‘‘ల్యాప్‌టాప్‌ అమ్మమ్మా! జాగ్రత్తా!’’ అని ప్రతిమ అన్నాక నా కళ్ళు బాగానే పని చేస్తున్నాయి అనుకున్నాను. ‘‘చీర అన్నావ్‌..’’‘‘ఇదిగో అమ్మమ్మా!’’ అంటూ స్క్రీన్‌ మీద వేళ్ళతో ముట్టుకుని ఏదో చేసేసరికి ఎదురుగా ప్రతిమ ఫొటో వచ్చింది. అందులో చీర కట్టుకుని ఉంది ప్రతిమ. ఆ చీర రంగు ఇది అని నేను చెప్పలేను. ‘‘ఎలా ఉంది?’’ అని అడిగింది మెరిసిపోతున్న వదనంతో.‘‘బావుందమ్మా!’’ అన్నాను మామూలుగా.‘‘చూడూ! నీ కన్నా అమ్మమ్మ బెటర్, వెంటనే బావుందని చెప్పింది.’’ అంటూ ఆ ల్యాప్‌టాప్‌ తీసుకుని ప్రతిమ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

నాకు ప్రతిమ కొనుక్కున్న చీర సరిగ్గా గుర్తు కూడా లేదు. ప్రతిమ అలా గది దాటగానే, ‘‘నిజం చెప్పూ... చీర ఎలా ఉంది?’’ అని అడిగింది గౌరి.‘‘బాగుందే..!’’ అన్నాను. ప్రతిమకి నచ్చింది కదా అంతే చాలు అనిపించింది నాకు. ‘‘ఏం బాగుందే... అసలు ఆ బట్ట ఏమిటో, మామూలుదో, మంచిదో కాదో ఏం తెలీదు.దాని ఫ్రెండ్స్‌ ఎవరో ఇలా చేసారట. ఇది కూడా అలాగే కొనుక్కుంటుందిట. చీర ఎవరి ఇష్ట ప్రకారమో కాకుండా దానికి నచ్చిన తీరులో డిజైన్‌ చేయించుకుంటుందిట. పైటంచంతా ముత్యాలు వచ్చేస్తాయిట. డిజైనంతా రాళ్ళూంటాయిట. ఏమిటేమిటో చెప్తోంది ప్రతిమ. నాణ్యత చూడద్దే అంటే ఇంత ఖరీదుంది నాణ్యత అదే ఉంటుంది అంటుంది.’’ అని విసుగ్గా చెప్పింది గౌరి.‘‘పోనీలేవే....పెళ్ళి దానిది, చీర కట్టుకోవలిసినది అది. దానికి నచ్చితే మనకి సంతోషమే కదా...’’ అని నచ్చజెప్పచూసాను.‘‘అది కాదమ్మా! ఇన్ని వేలు పోసినప్పుడు కాస్త మంచిది, జీవితాంతం గుర్తుగా ఉండిపోయేది అయితే బావుంటుంది కదా...’’ అంది గౌరి నిట్టూరుస్తూ.‘‘నువ్వు అన్నది నిజమే, నేను అలా ఆలోచించే ఆ రోజు మీ నాయనమ్మ నీకు అక్కడ నుంచి చీర తీసుకువస్తానని అంటే సరే అన్నాను. కానీ ఇప్పుడు నీ మనసులో ఉన్న లోటు తెలుసుకున్న తరువాత అనాలోచితంగా ప్రవర్తించానా? అనిపించింది.’’ అని నేను చెప్పాక గౌరి ఏం మాట్లాడక మౌనంగా మారింది.‘‘పెళ్ళే కాదు... పెళ్ళి చీర కూడా ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక మధురమైన విషయం. అది ఒక జ్ఞాపకం మాత్రమే శాశ్వతం కాదు. అది ఇష్టపడి ఎంచుకోవడంలో కలిగే ఆనందం, అనుభూతి మాత్రమే శాశ్వతం. నువ్వు నీ కూతురికి అలాంటి అనుభూతిని మిగల్చబోతున్నావ్‌. రేపు నాలాగా నువ్వు ‘అయ్యో!’ అని బాధపడనవసరం లేదు. నేను ఇప్పుడు నీకు చెప్పిన విషయం అమ్మమ్మగా మనవరాలి పెళ్ళి సమయంలో తెలుసుకోవడం నాకు ఎంత బాధగా ఉందో!’’ అన్నాను నేను.

‘‘ఛ! అలా అంటావేంటమ్మా! ఇప్పటికీ ఆ చీర చెక్కు చెదరలేదు. నేనే ఏదో తెలియక బాధపడ్డాను. ఇప్పుడు ప్రతిమని చూసాక మీరు చేసిన పని ఎంత మంచిదో అర్థమవుతోంది.’’ అని నా పక్క నుండి లేస్తూ, ‘‘ఆలస్యం అయ్యింది నిద్రపో.’’ అని చెప్పి గౌరి వెళ్ళిపోయింది.ఈ సందర్భాన్ని గౌరి ఒకలా అర్థం చేసుకుంటే నేను మరోలా అర్థం చేసుకున్నాను. మా తరం అమాయకత్వంలో కొట్టుకుపోయింది. గౌరి తరం బయటపడటం సబబో కాదో తెలియని సందిగ్ధంలో కొట్టుకుపోయింది. ప్రతిమ తరం గురించి ఏమనుకోవాలో ఈ మారుతున్న పోకడకి ఏ పేరు పెట్టాలో నాకు అర్థం కావడం లేదు.ఆడపిల్ల తన హక్కుని వినియోగించుకుంటోంది అనుకోవాలా? సొంతంగా నిర్ణయం తీసుకునే సమర్ధతని పొందింది అనుకోవాలా? తమకి ఏం తెలియదులే ఇంత రాణిస్తున్నాం నేటి ప్రపంచంలో అని దూసుకుపోతోంది అనుకోవాలా?ఇలా నాలో సాగుతున్న ఈ ఆలోచనలు నాకే వింతగా తోచాయి.ఏది అయితేనేం ఆనందంగా ప్రతిమ పెళ్ళి చీర కొనుక్కుంది. దీని మీద అనవసరమైన చర్చలు చేసి లాభనష్టాలు దానికి తెలిసేలా చేస్తే దాని వల్ల ప్రతిమకి మిగిలేది బాధే. గౌరికి కాలం ఎలా కొన్ని విషయాలని తెలియజెప్పిందో రేపు ప్రతిమకీ అదే కాలం అన్నీ తెలియజేస్తుంది. అప్పటి దాకా నేనుంటే చూస్తాను. లేదంటే ఎలా జరగవలిసినది అలా జరగక ఆగిపోతుందా? అనుకుని కళ్ళు మూసుకున్నాను. ఎంత ప్రయత్నించినా ప్రతిమ కొత్తగా కొనుకున్న ఆ పెళ్ళిచీర ఎలా ఉన్నది గుర్తుకురావడం లేదు. దానికి గుర్తుంటే చాలును కదా అని నాలో నేనే నవ్వుకుని నిద్రపోయాను.
 

మరిన్ని వార్తలు