చాప్టర్‌ IX

22 Jul, 2018 00:53 IST|Sakshi

ఈవారం కథ

పోలీస్‌ కమీషనర్‌ బంగ్లా. లోధి ఎస్టేట్‌. న్యూఢిల్లీ.నేటినుంచి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆతిథ్య జట్టుతో తలపడనున్న సౌదీ అరేబియా.ఇసుక తుపాన్లతో, భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ రాజధాని. రెండు రోజుల నుండి కురుస్తున్న....‘‘హలో...’’...భయాందోళనలో ప్రజలు. మరో నాలుగు రోజుల వరకు పరిస్థితి ఇలానే కొనసా...‘‘నానీ! టీవీ వాల్యూం కొంచెం డౌన్‌ చెయ్‌. హలో.. కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ స్పీకింగ్‌..’’‘‘హలో అరవింద్‌ సర్‌! నేను రమేష్‌ని మాట్లాడుతున్నా. పదేళ్ళ క్రితం ఏలూరులో మీ సబార్డినేట్‌గా పనిచేశాను సర్‌.’’‘‘హే రమేష్‌! ఎలా ఉన్నావ్‌? ఏంటి ఇంత సడన్‌గా కాల్‌ చేశావ్‌? హౌ ఈజ్‌ యువర్‌ ఫ్యామిలీ?’’‘‘అందరూ బావున్నాం సర్‌. ఒక ఇంపార్టెంట్‌ విషయం చెబ్దామని కాల్‌ చేశా. పదేళ్ళక్రితం మనం ఏలూరులో పనిచేసేటప్పుడు అన్‌ సాల్వ్‌డ్‌ మిస్టరీగా మిగిలిపోయిన రైల్వే హాకర్‌ మర్డర్‌ కేస్‌కి ఫైనల్‌గా సమాధానం దొరికింది సర్‌.’’‘‘వా... వాట్‌? కమ్‌ అగైన్‌.’’‘‘మీకు తెలిసే ఉంటుంది.. త్రీ డేస్‌ బ్యాక్‌ డెబ్బై రెండేళ్ళ నాగ్‌పూర్‌ మాఫియా డాన్‌ విలాస్‌ రావ్‌ దండేర్కర్‌ హార్ట్‌ అటాక్‌తో చనిపోయిన సంగతి. ఆఖరి కోరికగా తను చనిపోయిన తర్వాత వాడి ఆటో బయోగ్రఫీ విడుదల చెయ్యాలని ఫ్యామిలీ మెంబెర్స్‌కి చెప్పి బుక్స్‌ కూడా ఎప్పుడో ప్రింట్‌ చేయించేశాడంట సర్‌.’’

‘‘సో..?’’‘‘ఆ బుక్‌ ‘మై కన్ఫెషన్స్‌ – విలాస్‌ రావ్‌ దండేర్కర్‌’ మార్కెట్లోకి నిన్నే రిలీజ్‌ అయ్యింది. ఆ బుక్‌లో చాప్టర్‌ 9 మీరొక్కసారి చదవండి సర్‌.’’‘‘కమాన్‌ రమేష్‌! అసలేముంది ఆ బుక్‌లో? ఏలూరులో జరిగిన మర్డర్‌కి, నాగ్‌పూర్‌ మాఫియా డాన్‌కి సంబంధం ఏంటి?’’‘‘బిలీవ్‌ మీ సర్‌. ఒక్కసారి చదవండి. మూడేళ్ళు ఆ కేస్‌ మీద మీరు పడ్డ స్ట్రగుల్‌కి ఆన్సర్‌ దొరుకుతుంది.’’‘‘ఓకే... ఓకే... డెఫినెట్‌గా చదువుతాను. బట్‌...’’‘‘పదేళ్ళ నాటి మర్డర్‌ మిస్టరీ వీడిపోయింది సర్‌. అది నేను చెప్పడం కంటే మీరు చదివి తెలుసుకుంటేనే బావుంటుంది. చాప్టర్‌ 9. బై సర్‌.’’‘‘ఓకే రమేశ్‌.. బై.’’ పోలీస్‌ కమిషనర్‌ అరవింద్‌ ఫోన్‌ పెట్టేశాడు.‘‘వాట్‌ హాపెండ్‌ డాడ్‌? ఎవరు ఫోన్‌లో..’’ అరవింద్‌ కొడుకు నాని అడిగాడు.‘‘నథింగ్‌. నేను బైటకి వెళ్తున్నా నానీ.’’‘‘ఇంత పెద్ద వర్షంలోనా? కమాన్‌ డాడ్‌.. మీరేగా కలిసి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూద్దామన్నారు..’’.‘‘సారీ నానీ! ఐ హావ్‌ టు గో నవ్‌. రియల్లీ సారీ. డిన్నర్‌ చేసేయ్, నాకోసం వెయిట్‌ చెయ్యకు.’’‘‘ఎంత టైం పడుతుంది డాడ్‌? ఆఫీస్‌ వర్కా? కాదంటే చెప్పండి ఈరోజు డ్రైవర్‌ రాలేదుగా నేనొచ్చి కార్‌ డ్రైవ్‌ చేస్తా...’’ ‘‘నో. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతోందో. ఇట్స్‌ నాట్‌ సేఫ్‌ అవుట్‌ దేర్‌. మ్యాచ్‌ చూసి డిన్నర్‌ చేసి పడుకో. చిన్న పనే. చూసుకుని నేను వచ్చేస్తా.’’కార్‌ ఇంజిన్‌ స్టార్ట్‌ అయ్యింది.హెడ్‌ లైట్స్‌ ఆన్‌ అయ్యాయి. వైపర్స్‌ అటూ ఇటూ కొట్టుకుంటున్నాయి. కారు బంగ్లానుండి బయటకి వచ్చింది. అరవింద్‌ని కారు ముందుకి తీసుకువెళ్తోంటే... కాలం వెనక్కి తీసుకెళ్తోంది.

2008. ఏలూరు.గంటకి 182 కిలోమీటర్ల వేగంతో తీరం దాటనున్న తుఫాన్‌......దేశంలోని ప్రజల్ని పది సంవత్సరాలుగా మోసం చేస్తున్న ఆ దేశ ప్ర...నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా......రైల్వే స్టేషన్‌లో నిన్న రాత్రి జరిగిన సంఘటనకి...‘‘అబ్బబ్బబ్బా.. రేయ్‌ నానీ! ఒక్క చానల్‌ ఉంచలేవా, అస్తమానూ మారుస్తూ ఉంటావ్‌. అసలే అర్ధరాత్రెళ్లిన మనిషి ఇంకా ఇంటికి రాలేదు. చూస్తుంటే ఈ వానేమో ఆగి చచ్చేట్టులేదు. ఎక్కడున్నారో ఏంటో మీ నాన్నకోసారి ఫోన్‌ చెయ్‌.’’ టీవీ చూస్తున్న నానీతో అరుస్తున్నట్టు మాట్లాడింది వాళ్లమ్మ. పచ్చదనానికి, ప్రశాంతతకి నిలయమైన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ ఏలూరు నగరం అర్ధరాత్రి అకస్మాత్తుగా పేలిన తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో తుపాకీతో చేసిన హత్య ఇదేమొదటిదవడంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్ని జిల్లా ఎస్పీ అరవింద్‌ కుమార్‌ గార్ని అడిగి తెలుసుకుందాం.‘‘అమ్మా! ఇలా రా. ఫోనెందుకు, డైరెక్ట్‌గా టీవీలో చూద్దువుగాని నాన్నని.’’ అన్నాడు నాని చిన్నగా నవ్వుతూ. ‘‘ఇట్స్‌ ఎ క్వైట్‌æ షాకింగ్‌ ఇన్సిడెంట్‌ టు అస్‌. గన్‌ కల్చర్‌ అనేది ఈ జిల్లాలో ఇప్పటివరకు లేదు. సమ్‌ వన్, మేబీ సమ్‌ పీపుల్‌.. ఈ ఊరు పద్ధతుల్ని మార్చాలని అర్ధరాత్రి అలా జస్ట్‌ లైక్‌ దట్‌ ట్రిగ్గర్‌ పుల్‌ చేశారు. ఒక మనిషిని చంపారు. ఈ ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో హాకర్‌ అతను. పేరు నిమ్మకాయల నాగరాజు అలియాస్‌ రాజు. వి ఆర్‌ టేకింగ్‌ దిస్‌ కేస్‌ వెరీ సీరియస్‌ అండ్‌ హియర్‌ అయాం గివింగ్‌ మై వర్డ్‌ టు ది పీపుల్‌ ఆఫ్‌ ఏలూరు – డోంట్‌ పానిక్‌. వి విల్‌ హంట్‌ దిస్‌ గై డౌన్‌ అండ్‌ బ్రింగ్‌ బాక్‌ పీస్‌ టు ది సిటీ..’’ మీడియాతో మాట్లాడి పక్కకొచ్చాడు అరవింద్‌. 

‘‘రమేశ్‌! కమాన్‌ కమ్‌ హియర్‌. ఇంత వర్షంలో కూడా ఎలా వచ్చింది ఈ బ్లడీ మీడియా. అసలు జనాన్ని సగం భయపెట్టేది వీళ్లే. జనం బాగా భయపడుతున్నారని వాళ్లకి కొంచెం ధైర్యం చెబుదామని నేనే మాట్లాడా. సరే! కేస్‌ గురించి రైల్వే పోలీస్‌ ఏమంటున్నారు?’’ సబార్డినేట్‌ రమేశ్‌ని పిలిచి ప్రశ్నించాడు అరవింద్‌.  ‘‘అదే సర్‌! వాళ్ళు హేండిల్‌ చేస్తారంట ఈ కేస్‌ని.’’‘‘హేండిల్‌ చేస్తారా? ఎవరు వాళ్ళేనా? అయినా కేస్‌ గురించి వాళ్ళనెవడగుతాడు రమేశ్‌. సొసైటీ, మీడియా, హయ్యర్‌ అథారిటీస్‌ అందరూ పడేది మనమీదేగా. వాళ్ళు గనుక ఇన్వెస్టిగేషన్‌ చేస్తే ఓ పదేళ్ళు పడుతుంది కేస్‌ క్లోజ్‌ చెయ్యడానికి. చెప్పు... కేస్‌ మనమే తీసుకుంటున్నామని.’’‘‘ఓకే సర్‌ మాట్లాడతా. రాజు బాడీని అటాప్సీకి పంపించేశాం సర్‌. నిన్నరాత్రి రాజుతో పాటున్న ఇంకో రైల్వే హాకర్‌ శీనుని రైల్వే పోలీస్‌ స్టేషన్లో ఉంచి విచారిస్తున్నాం. ఏడుస్తున్నాడు కానీ ఏమీ చెప్పడంలేదు. షాక్‌లోనుండి ఇంకా తేరుకోలేదనిపిస్తోంది సర్‌.’’‘‘ఓకే! లెట్స్‌ సీ. పదండి’’.అరవింద్, రమేశ్‌ బయల్దేరారు. ‘‘ఈ రూమ్‌లో లైట్స్‌ లేవా? ఆన్‌ చెయ్యండి. వీడేనా?’’ అరవింద్‌ గట్టిగా మాట్లాడుతూ వచ్చాడు. ‘‘ఎస్‌ సర్‌!’’‘‘ఆ కిటికీలు మూసేయండి. జల్లు పడుతోంది లోపలకి. నీ పేరేంటి?’’‘‘సర్‌ అడుగుతున్నారుగా సమాధానం చెప్పు.’’‘‘సారు. నా పేరు శీనండి.’’ శీను నోరువిప్పాడు భయపడుతూ.  ‘‘రైల్వే స్టేషన్లో ఏం చేస్తుంటావ్‌?’’

‘‘ప్లాట్ఫారంమీద, రైల్లో కూల్‌డ్రింకులు, వాటర్‌ బాటిల్లు అమ్ముతాను సారు.’’‘‘రాజు నీకెలా తెలుసు?’’‘‘రేయ్‌ రేయ్‌... ఆపరా ఆ ఏడుపు. ఇది సర్‌ వీడి పరిస్థితి. వాడి పేరెత్తంగానే వీడేడుపెత్తుకుంటున్నాడు.’’ రమేశ్‌ కోపంగా అన్నాడు.‘‘వాడ్ని వీడే చంపేసుంటాడు రమేశ్‌. మనదగ్గర నుండి తప్పించుకోవడానికి ఇలా దొంగేడుపులు ఏడుస్తున్నాడు.’’‘‘సారు...?’’‘‘మరేంటి చెప్పు. ఇటు చూడు శీనూ! ముందు నిన్నరాత్రి ఏం జరిగిందో చెప్పు. ఇలా చెప్పకుండా నువ్వు ఆలస్యం చేసిన ప్రతి సెకనూ హంతకుడు పారిపోవడానికి హెల్ప్‌ అవుతుంది. హంతకుడికి హెల్ప్‌ చేస్తావా నువ్వు?’’‘‘లేదు సారు... లేదు. సెప్తా. రాజుగాడు, నేను సిన్నప్పట్నుండి స్నేహితులం సారు. పక్క పక్క ఇళ్లు. కలిసి పెరిగాం. ఒకేసోట సదువుకున్నాం. ఇప్పుడొకేసోట పనిజేత్తన్నాం సారు. ఆడు కూడా నాలానే ఇక్కడ కూల్‌డ్రింకులు, వాటర్‌ బాటిళ్లు అమ్ముతాడు. రోజూ ఇదే పనండి మాది. రోజూలానే నిన్న కూడా పన్లోకొచ్చాం. కానీ ఆ మాయదారి వాన పడకుండా ఉండుంటే రాజుగాడికి ఈ సావు తప్పేది సారు.’’‘‘ఊరుకో ఊరుకో. ఏడవకు. వానకి, రాజు హత్యకి సంబంధమేంటి?’’‘‘నిన్న కురిసిన వానకి స్టేషన్‌లో ఆఫీసర్లందరూ ఇంటికెళ్లిపోయారు సారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ గారొక్కరే ఉండిపోయారనుకుంట. పయానం సేసేదానికి జనం కూడా గుబులు పడ్డట్టున్నారు.ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదు. మేము కూడా ఇంటికి పోయేటోల్లమే కానీ కాలక్షేపానికి కబుర్లు సెప్పుకుంటా అలా ఉండిపోయాం. ఆ సరదా కబుర్లే ఇంత కొంప ముంచిద్దనుకోలేదు సారు.’’‘‘కరెక్ట్‌గా చెప్పు నిన్నరాత్రి ఏం జరిగిందో...’’‘‘సెప్తా సారు. నిన్నరాత్రి........... అప్పటికే రాత్రి పదకొండున్నర దాటింది.‘ఏరా రాజు. ఇంకిటికి పోదామా?’ అన్నాను నేను. 

‘వెల్దాంలేహె! ఓ కంగారెందుకురా. ఆ స్పెషల్‌ ట్రైన్‌ కూడా సూసేసి పోదాం.’ అన్నాడు రాజుగాడు. సిగరెట్‌ తాగుతా, ‘ఆహా శీనుగా. భలే మజాగా ఉందిరా ఈ వానలో సిగరెట్టు తాగుతుంటే.’ అన్నాడు. దయచేసి వినండి. ట్రైన్‌ నంబర్‌ 07101 సికింద్రాబాద్‌ నుండి కాకినాడ వెళ్ళవలసిన సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ 11:45కి ప్లాట్‌ఫారం నంబర్‌ రెండు మీదకి వస్తుంది అని వినిపిస్తుంటే ‘ఒరేయ్‌ శీనుగా! ఎందుకురా అదలా ఓ కూత్తది. అయినా ఏ నా కొడుకున్నాడు ఈ స్టేషన్లో దాని మాటలిండానికి.’ అంటూ ఉషారుగా మాట్లాడాడు. తర్వాత కాసేపటికి ట్రైనొచ్చింది సారు. మేమిద్దరం అలాగే కబుర్లు సెప్పుకుంటున్నాం. ఏం సూసాడో ఏమో కానీ, ట్రైన్‌ ఆగుతుండగా డ్రింక్‌ బాటిల్లు వాటర్‌ బాటిల్లు ఉన్న ట్రే పట్టుకుని ట్రైన్‌ కేసే పరిగెత్తాడు రాజుగాడు. బండాగే దిక్కుకి నా ఈపెట్టి కూసోడంతో రాజుగాడ్ని ఎవరు పిలిసారో నాకు కనపడ్లేదు సారు. కానీ ఆ బండికున్న మొత్తం డోర్లు కిటికీలు అన్నీ యేసేసున్నాయి సారు ఒక్క కిటికీ తప్ప. వాన జోరుగా పడతానే ఉంది. మావోడు వానలో తడుత్తానే తీసిన ఆ కిటికీ ఉన్న పెట్టె దగ్గరకి పరిగెత్తుకుంటా ఎల్లాడు.’’‘‘ఓకే. రాజు ఆ కిటికీ దగ్గరకెళ్ళిన తర్వాత ఏం జరిగింది?’’‘‘అదే తెలియదు సారు. పెట్టె నాకు శానా దూరంలో ఆగింది. ఆడు కిటికీలోనుండి ఎవరితోనో మాట్టాడాడు. తర్వాత ఎనక్కి తిరిగి నా వంక సూసి నవ్వాడు సారు.’’‘‘వాట్‌. నీ వంక చూసి నవ్వాడా? ఎందుకు?’’‘‘తెలియదు సారు. నా వంక సూసి నవ్వాక మళ్లీ కిటికీకేసి తిరిగాడు. అంతే బండి కూత పెట్టడం, ముందుకి కదలడం, రాజుగాడు నున్చున్నోడు నున్చున్నట్టే ఫ్లాట్ఫారం మీద పడటం.. అన్నీ సిటికెలో జరిగిపోయినాయి సారు. నేను పరిగెత్తుకెల్లి సూసేసరికి అక్కడంతా రక్తం. అటు పక్కకి పడున్న రాజుగాడ్ని నాకేసి తిప్పాను సారు. అంతే! తలంతా రక్తం. నుదురుకి బెజ్జం పడి రక్తం వత్తానే ఉంది. ఆడ్ని పిలిశా. కొట్టా. ఏ ఉలుకూ పలుకూ లేకుండా అలా పడున్నాడు. నాకు బయ్యమేసి ఎంటనే 108కి కొట్టా సారు. పోలీస్‌ సార్లక్కూడా సెప్పా. ఆల్లొచ్చి సూసి పాణం లేదన్నారు. రాజుగాడ్ని తీసుకొచ్చి పొడి ప్రాంతంలో పొడుకోబెట్టాం. తర్వాత ఎనక్కి తిరిగి సూసేసరికి ఫ్లాట్‌ఫారంమ్మీద ఒక్కటంటే ఒక్క రక్తం సుక్క ఆనవాలన్నా లేకుండా ఆ వాన దేవుడు అంతా నీటితో కడిగేశాడు సారు.
‘‘ఊరుకో శీను. రమేశ్‌! తనకి మంచి నీళ్ళు ఇవ్వండి.’’ లేచాడు అరవింద్‌. శీను దగ్గర్నుంచి అంతకన్నా మించి ఇంకే సమాధానం వస్తుందని అతననుకోలేదు.

‘‘సర్‌ ఆటాప్సీ రిపోర్ట్‌ వచ్చింది. 9 ఎంఎం బుల్లెట్‌ క్లోజ్‌ రేంజ్డ్‌  స్ట్రయిట్‌ హెడ్‌ షాట్‌ సర్‌. ఫింగర్‌ ప్రింట్స్‌ ఏం ట్రేస్‌ చెయ్యలేకపోయాం. నాకు ఈ కేస్‌లో విట్నెస్‌ దొరకడం కూడా ఇంపాజిబుల్‌ అనిపిస్తోంది సర్‌.’’ రిపోర్ట్‌ పట్టుకొని చెబుతూ ఉన్నాడు రమేశ్‌. ‘‘వై ఈజ్‌ దట్‌ రమేష్‌?’’‘‘ఆ రోజు వచ్చింది డైలీ ట్రైన్‌ కాదు సర్, స్పెషల్‌ ట్రైన్‌. అండ్‌ తుఫాన్‌కి తొంభై శాతం మంది జనం ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. మేము గేదర్‌ చేసిన ఇన్ఫర్మేషన్‌ ప్రకారం సెకండ్‌ క్లాస్‌ స్లీపర్‌ మొత్తం ఆరోజు 50 మంది మాత్రమే ప్రయాణం చేశారు. శీను చెప్పినదాని ప్రకారం చూస్తే ఆరోజు విండో ఓపెన్‌ చేసుంచిన కోచ్‌ 9 అని సస్పెక్ట్‌ చేసి పాసెంజర్స్‌ లిస్ట్‌ తీసుకున్నాం. ఆరోజు 9లో ముగ్గురు మాత్రమే ప్రయాణించారు సర్‌. భార్యాభర్తలిద్దరూ అండ్‌ ఒక స్టూడెంట్‌. వాళ్ళ బాక్‌గ్రౌండ్‌ వెరిఫై చేశాం. అంతా క్లీన్‌గా ఉంది. విడివిడిగా అడిగినప్పుడు వాళ్ళ ముగ్గురూ కూడా నాలుగో వ్యక్తిని చూడలేదనే చెప్పారు సర్‌. ఫైనల్లీ ఆరోజు జనమెక్కువ లేరని టీసీ కూడా టికెట్‌ చెకింగ్‌కి వెళ్లలేదంట సర్‌.’’ రమేశ్‌ తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ‘‘వాట్‌ ఈజ్‌ దిస్‌ రమేశ్‌! ఇంకొన్ని రోజులాగితే హంతకుడే ఆరోజు తుఫాన్‌ తెప్పించాడంటారా? అసలు అంత పెద్ద కోచ్‌లో ఆ ముగ్గురికి కనపడకుండా ఇంకో వ్యక్తి ఉండటానికి అవకాశం లేదంటావా? వీళ్ళు కోచ్‌కి ఒక ఎండ్‌లో ఉండి నాలుగో వ్యక్తి ఇంకో ఎండ్‌లో ఉండే అవకాశం లేదంటావా?’’‘‘ఆ అవకాశం ఉంది సర్‌. కానీ ఆరోజు ట్రైన్‌ ఏలూరు నుండి బయలుదేరి వెళ్లిన తర్వాత వర్షం ఇంకా పెద్దది కావడంతో ట్రైన్‌ని కొవ్వూరులో నాలుగు గంటలపాటు ఆపేశారు. ఆ సమయంలో కోచ్‌లో ఉన్న ముగ్గురూ ఆ నాలుగో వ్యక్తిని చూసే అవకాశం లేదంటారా సర్‌?’’‘‘రైట్‌. అంటే వాడు ఆ కోచ్‌లో ఎక్కువసేపు ఉండుండడు. మనం ఎక్కడో ఏదో పాయింట్‌ వదిలేస్తున్నాం రమేశ్‌. ఒక రైల్వే హాకర్‌ని గన్‌తో కాల్చాల్సిన అవసరం ఎవరికుంటుంది? పైగా రాజుకి శత్రువులు కూడా ఎవరూ లేరు. ఉన్నా గన్‌తో కాల్చేంత స్కెచ్‌ వెయ్యగలరని నేననుకోవడం లేదు. హత్యకి క్లూ దొరకలేదు. మోటివ్‌ కనిపించట్లేదు. విట్నెస్‌ కూడా లేరు. ఇదంతా పకడ్బందిగా చేసిన హత్యా లేదా ఎవరైనా ఆకతాయిల పనా? ఎవరు చేసుంటారు రమేశ్‌ ఇదంతా?’’ ‘‘.... ఎవరు? ఎవరు?’’.

కాలం పదేళ్లనాటి సంగతుల్ని, కారు పావుగంట ప్రయాణాన్ని ముగించుకుని ఆక్స్‌ఫర్డ్‌ బుక్‌స్టోర్‌ ముందుకొచ్చి ఆగాయి.‘‘గుడ్‌ ఈవినింగ్‌ సర్‌! హౌ మే ఐ హెల్ప్‌ యు?’’ నవ్వుతూ పలకరించాడు స్టోర్‌కీపర్‌. ‘‘యా! డూ యు హావ్‌ ద బుక్‌ ‘మై కన్ఫెషన్స్‌’ బై విలాస్‌ రావ్‌ దండేర్కర్‌?’’ అరవింద్‌ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు.‘‘జస్ట్‌ ఏ సెకండ్‌ సర్‌! యా వియ్‌ హావ్‌ ద బుక్‌ సర్‌. ఓవర్‌ దేర్‌ సిక్స్‌త్‌ రో ఫోర్త్‌ రాక్‌ సర్‌.’’ చెయ్యి ఆ రేక్‌ వైపు చూపిస్తూ చెప్పాడు స్టోర్‌కీపర్‌. ‘‘థాంక్యూ.’’ అంటూ ఆ రేక్‌ వైపుకు బయలుదేరాడు అరవింద్‌. బుక్‌ అందుకొని నేరుగా చాప్టర్‌ 9 ఉన్న పేజీకి వెళ్లిపోయాడు. 

చాప్టర్‌ IX
నా తోడబుట్టిన తమ్ముడే నన్ను చంపాలనుకున్నాడు. చంపి నా కుర్చిలో కూర్చుని నేను నిర్మించిన చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకున్నాడు. భాయ్‌ భాయ్‌ అని ఆప్యాయంగా పిలుస్తూనే నన్ను చంపడానికి నా వెనుక పెద్ద కుట్ర రచించాడు.2008. అక్టోబర్‌. నాగ్‌పూర్‌లో రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. తెల్లవారుజామున నాగ్‌పూర్‌ నుండి పెళ్లికని కారులో బయలుదేరి వెళ్తున్న మామీద దారి మధ్యలో ఎటాక్‌ జరిగింది. మేం కూడా వాళ్లమీద తిరిగి కాల్పులు జరిపాం. ఏడుగురున్న మా గుంపులో నలుగురు స్పాట్‌లో చచ్చిపోయారు. అందులో వికాస్‌ బాడీలో 32 బుల్లెట్లు దిగాయి నన్ను కవర్‌ చేసినందుకు. మిగిలిన ఇద్దర్ని నాగ్‌పూర్లో జరుగుతున్న విషయాలు తెలుసుకోమని పంపించి నేను ఆంధ్రా పారిపోయా. నా ప్రయాణమంతా వర్షమే. నేను తప్పించుకోవడానికి ఆ వర్షమే నాకు తోడయ్యింది. నేను ఆంధ్రాలోని వరంగల్‌ చేరే వేళకి చీకటి పడుతుంది. నాకు ప్రొటెక్షన్‌ ఇవ్వగలిగే ఒక ఆంధ్రా స్నేహితుడి దగ్గరకి వెళ్ళడానికి వరంగల్‌లో ట్రైన్‌ ఎక్కాను.ట్రైన్‌ అంతా దాదాపు ఖాళీగా ఉంది. వర్షాల వల్లనేమో ట్రైన్‌కున్న డోర్లు, కిటికీలు అన్నీ మూసేశారు. ట్రైన్‌ ఎక్కినప్పటినుంచి ఏ కోచ్‌లోనూ అరగంటకి మించి ఎక్కువసేపు ఉండలేదు నేను. ప్రమాదం నాకెంత దూరంలో ఉందో తెలియక ప్రతి అరగంటకి ఒక్కో కోచ్‌ మారుతూ పోయా. ఏ కోచ్‌లోనూ పెద్ద జనం లేరు. నా అరవయ్యేళ్ళ వయసుకి నన్ను అనుమానించినవారు, ప్రశ్నించినవారు ఎవ్వరూ లేరు. ఓ రెండు గంటల తరవాత ఎప్పుడు పట్టిందో తెలియకుండా నిద్ర పట్టేసింది. ఎంతసేపు పడుకున్నానో అలా!మెలకువొచ్చేసరికి ట్రైన్‌ మెల్లగా వెళ్తోంది. బాగా దాహం వేసింది. ట్రైన్‌ విండో ఐరన్‌ షట్టర్‌ పైకెత్తి బయటకి చూశా. వర్షం, చల్లగాలి ఒక్కసారిగా లోపలికి దూసుకొచ్చాయి. చీకటి తప్ప బయటేమీ కనిపించలేదు. చాలాసేపట్నుంచి అదే కోచ్‌లో ఉండిపోవడంతో వెంటనే లేచి వేరే కోచ్‌కి వెళ్ళిపోయా. నా దాహానికి గొంతెండుకుపోయింది. ఏదైనా స్టేషన్‌ వస్తుందేమోనని షట్టర్‌ పైకెత్తి బయటకి చూస్తూనే ఉన్నా. మెల్లగా నా గొంతు పిడచకట్టుకుపోయింది. లాలాజలం ఊరక నాలుక ఎండిపోయి నోట్లో అటూ ఇటూ తిప్పడానికి కూడా కష్టంగా తయారయ్యింది. అప్పుడే జీవితంలో నీళ్ల విలువేంటో తెలిసింది. కిటికీలోనుండి నా కుడిచేయి బయటకి పెట్టా. వాన నీటికి తడిచిన చేతి వేళ్లని నాలుక మీద రాసుకున్నా. తేడా తెలియలేదు. నీళ్ళే కావాలి తాగడానికి. చూశా, చూశా, చూస్తూనే ఉన్నా. ట్రైన్‌ వెళ్తోంది కానీ ఏ స్టేషన్‌లోనూ ఆగట్లేదు. ఆ సమయంలో నీళ్ల కోసం నేను పడిన యాతనతో పోల్చుకుంటే ఇన్నేళ్ల నా జీవితంలో నేనసలు ఏ బాధలూ పడలేదనే చెప్పాలి.

నేను నా ప్రాణాన్ని లెక్కచెయ్యను కానీ ఇంకిలాంటి బాధ ఎక్కువసేపు పడలేననిపించింది. ఎక్కడో నాగ్‌పూర్‌లో పుట్టి పెరిగిన నాకు, ఇక్కడింత బాధేంటో అని అనుకుంటుండగానే ట్రైన్‌ వేగం తగ్గింది. షట్టర్‌ పైకెత్తి చూశా. ఏదో స్టేషన్‌ వచ్చింది. ఆనందంలో వాటర్‌ బాటిల్స్‌ ఎక్కడున్నాయో అని ప్లాట్ఫారం మీద వెతికాను. కనిపించాయి. రెండు ట్రేల్లో వాటర్‌ బాటిల్స్, డ్రింక్స్‌ పక్కన పెట్టుకుని ప్లాట్ఫారం మీద కబుర్లు చెప్పుకుంటున్న ఇద్దరు మనుషులు కనిపించారు. నేను ట్రైన్‌లో నుండి చెయ్యి బయటకి పెట్టి ఊపుతూ వాటర్‌ అని బొటన వేలు చూపించా. ఇద్దరిలో ఒక వ్యక్తి నన్ను చూసి ట్రే తీసుకుని నేనున్న కోచ్‌ వైపుకి పరిగెత్తాడు. ట్రైన్‌ ఆగింది. వర్షం మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది.

ఆ మనిషి ట్రే పట్టుకుని నా దగ్గరకు రాగానే వాటర్‌ బాటిల్స్‌ అని చెప్పి నా పర్స్‌లోనుండి చేతికి తగిలిన నోటు తీసి అతనికిచ్చా. వర్షంలో తడిసిపోతుందని అతను నా చేతిలో ఉన్న నోటుని టక్కున లాక్కున్నాడు. లాక్కునేటప్పుడు చూశా, అది వెయ్యి రూపాయిల నోటు. అతను నోటుని తీసుకుని జేబులో పెట్టుకుని వాటర్‌ బాటిల్స్‌ ఇవ్వకుండా వెనక్కి తిరిగి అక్కడెక్కడో కూర్చుని ఉన్న ఇంకొకడి వైపు చూసి నవ్వాడు. వాడలా ఎందుకు నవ్వాడో ఆ క్షణంలో నాకర్థం కాలేదు. అలా నవ్వుతూనే వాడు నా వైపుకి తిరిగి మెల్లగా వెనక్కి జరిగాడు. నేను ట్రే వైపు చూపిస్తూ బాటిల్స్‌ అని కళ్ళతో అడిగా. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు కానీ బాటిల్స్‌ ఇవ్వడం లేదు. అప్పుడర్థమైంది వాడు నన్ను మోసం చెయ్యబోతున్నాడని. నేను డబ్బుల్ని లెక్క చెయ్యను కానీ నాకివ్వాల్సిన వాటర్‌ బాటిల్స్‌ కూడా ఇవ్వకుండా నా నుండి, వర్షం నుండి వెనక్కి జరుగుతుంటే కోపంతో నేను వాడ్ని అలా చూస్తూ ఉండిపోయా. వాడు కూడా ఈ అరవయ్యేళ్ళ ముసలోడు ఏం చేస్తాడ్లే అనే ఆలోచనతోనేగా నన్నిలా మోసం చేశాడు. నా జీవితంలో వాడికంటే దారుణమైన మనుషుల్ని చూశా. వాడినలాగే చూస్తూ నలభై ఏళ్లుగా నా వొంట్లో ఒక భాగమైపోయిన దానికోసం కుడి చేయి వెతికింది. పక్కన పెట్టిన కోట్లోకి చెయ్యి పోయింది.దొరికింది నా స్టార్‌ పిస్టల్‌. 92 మోడల్‌. టక్కున తీసి కిటికీలోపలనుండే ఆ మనిషికి గురి పెట్టా. అది కనబడగానే ఆ మనిషి మొహమ్మీద నవ్వు మాయం అయింది. గన్‌ చూడగానే చాలామంది షాక్‌లోకి వెళ్లిపోతారు. మెదడు మొద్దుబారిపోతుంది. వాడు కూడా షాక్‌లోకెళ్లిపోయాడు. వాడికి తగిలిన షాక్‌ భయంగా మారే సమయంలోనే... అసలు ఏం జరుగుతుందో మెదడుకి అర్థమయ్యే సమయంలోనే ట్రైన్‌ హార్న్‌ బ్లో చేశారు. నేను ట్రిగ్గర్‌ నొక్కాను. ట్రైన్‌ మెల్లగా కదిలింది. బులెట్‌ వేగంగా వెళ్లి వాడి నుదురిని చీల్చి తల్లోపలికెళ్లింది. వాడి చేతిలో ఉన్న ట్రే ఎగిరిపడింది. బాటిల్స్‌ అన్నీ చెల్లా చెదురయ్యాయి. వాడు నున్చున్నోడు నున్చున్నట్టే కుప్పకూలిపోయాడు. ప్లాట్ఫారం మీద చిమ్మిన వాడి రక్తం వర్షం కడిగెయ్యడమే నాకాఖరిగా కనిపించింది. అప్పుడంటే ఉద్రేకంలో చేశా కానీ, తర్వాత నా జీవితంలో ఈ సంఘటన తలచుకుని చాలాసార్లు బాధపడ్డాను.

‘‘సర్‌! ఎక్స్‌క్యూజ్‌ మీ సర్‌. వి ఆర్‌ క్లోజింగ్‌. డు యు వాంట్‌ ద బుక్, సర్‌?’’ స్టోర్‌కీపర్‌ మాటలతో చాప్టర్‌ 9 నుంచి బయటకొచ్చాడు అరవింద్‌. ‘‘యా! బిల్‌ ఇట్‌ ఫర్‌ మీ.’’ అన్నాడు ఏ భావం లేకుండా. కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ బుక్‌ స్టోర్‌ బైట గోడకానుకుని బంగారు కాంతిని వెదజల్లే సోడియం లైట్ల వెలుగులో వర్షాన్ని చూస్తూ తనలో తాను ఇలా అనుకుంటున్నాడు –‘పదేళ్ల క్రితం ఓ వర్షం పడిన రాత్రి జరిగిన మర్డర్‌ మిస్టరీకి సమాధానం ఈరోజు రాత్రి ఈ వర్షంలో తెలిసింది. నిజంగా వర్షానికి, దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఇదంతా జస్ట్‌ కో ఇన్సిడెన్సా? ఏమో నిజంగా మనిషి మెదడుకి అందని విషయాలు ఇంకా ఎన్నున్నాయో!’అదే సమయంలో టీవీ చూస్తూ అరవింద్‌ కొడుకు నానీ కూడా తనలో తాను అనుకుంటున్నాడు – ‘డాడ్‌ ఇంకా రాలేదేంటి? ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కూడా అయిపోయింది. డిన్నర్‌ చేసి పడుకోమన్నారుగా డాడ్, ఇప్పుడు ఫోన్‌ చేస్తే డిస్టర్బ్‌ చేసినట్టు ఫీల్‌ అవుతారేమో?’టీవీ మోగుతూనే ఉంది – బ్రేకింగ్‌ న్యూస్‌... బ్రేకింగ్‌ న్యూస్‌...ఢిల్లీ జన్‌పథ్‌ రోడ్లో బ్రేక్స్‌ ఫెయిలయిన ఒక ట్రక్‌ రెండు బైకులు, ఒక కారు మీదనుండి దూసుకెళ్లడంతో అక్కడ భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. వర్షం పడుతుండటం వల్ల సహాయక చర్యలకి ఆలస్యమవుతుందని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం యాక్సిడెంట్‌కి గురైన కారు ఢిల్లీలోని ఒక ప్రభుత్వశాఖ ఉన్నతాధికారిదని తెలిసింది. అయితే ప్రస్తుతం ఆ కారులో ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది.  ఎవరున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.వర్షం... వర్షం... వర్షం... అది మాత్రం ఆగకుండా అలా పడుతూనే ఉంది.  
- కె.ఎన్‌. మనోజ్‌ కుమార్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా