బాలయ్య మాస్టారు

5 Aug, 2018 02:13 IST|Sakshi

ఈవారం కథ

సువర్ణ కదిపి లేపడంతో చటుక్కున మెలకువ వచ్చింది రఘురాంకు – ‘‘లేవండి. మావయ్యగారు ఇంత రాత్రివేళ బయటకు వెళుతున్నారు. అత్తయ్యగారు వద్దంటున్నా వినటంలేదు లేవండి’’.‘‘ఏంటి నువ్వంటోంది?’’ లుంగీ సరి చూసుకుని లేస్తూ భార్యను అడిగాడు. ‘‘అత్తయ్య, మావయ్య మాటలు వినబడుతుంటే తలుపు కొంచం వారగా తెరచివిన్నాను. ‘హోటల్‌ ఓపెన్‌గానే ఉంటుంది. వెళ్లొస్తాను’ అంటున్నారు మావయ్య.  ‘అర్ధరాత్రి కావస్తోంది. ఇప్పుడేం వద్దు. నామాట వినండి. వొద్దు వెళ్లొద్దు’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. ఆయన ససేమిరా వినడంలేదు. ‘కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వు పడుకో’ అంటున్నారు. ‘ఇంట్లో పిల్లలంతా ఉంటే మీరిలా ఇప్పుడు వెళ్ళడం బాగోలేదు. నామాట వినండి. పడుకోండి. అవతల కొడుకూ కోడలు, ఇటు అమ్మాయీ అల్లుడు ఉన్నారు. ఆరుగురు మనవలు, మనవరాళ్ళు ఇంట్లో ఉంటే ఇప్పుడు మీరిలా అర్ధరాత్రి దొంగచాటుగా బయటకు వెళ్ళడం.. ఛ ఛ. వొద్దండి. నామాట వినండి. పిల్లలు వింటే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలి’ అని అత్తయ్య బతిమలాడుతున్నారు. కాని మావయ్య గారు ఏవీ వినే ధోరణిలో లేరు. అలా గుమ్మం వరకూ అత్తయ్యగారు బతిమలాడుతూనే ఉన్నారు. మావయ్యగారు మృదువుగా ఆమెను వారిస్తూ తలుపు తీసుకుని బయటకు వెళుతున్నారు. ఇక ఆగేలా లేరని మిమ్మల్ని లేపాను.’’ వివరంగా చెప్పింది సువర్ణ. 

ఏదో చిన్న విషయంగా కనిపిస్తున్నా నాన్నగారి గురించి తెలిసిన వారికీ ఇది పెద్ద విషయమేననిపించింది రఘురాంకు. బాలయ్య మాస్టారంటే చుట్టుపక్కల గ్రామాలు దాటి మండలాలు దాటి అసలు జిల్లాలో తెలియని వారు ఉండరు. గంగూరు జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ హెడ్‌ మాస్టర్‌గా, ఓ సిన్సియర్‌ మాస్టారుగా, అత్యుత్తమ నైతిక విలువలున్న పెద్ద మనిషిగా ఆయన ఓ హిమవన్నగం. ఎంతో మంది పెద్దలు, రాజకీయ నాయకులు, మేధావులు, టీచర్లు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గౌరవించే సమున్నత మూర్తిమత్వం ఆయనది.నిజానికి ఆయనలో రెండు పార్శా్వలు లేవు. ఇంటా బయటా ఎక్కడైనా అదే ప్రవర్తన. అదే వ్యక్తిత్వం. జీవితమంతా అదే నిబద్ధతతో రూపొందించుకున్న ఆదర్శప్రాయమైన జీవితం. పిల్లల్నీ అలాగే పెంచారు. అలాగే చదివించారు. కొడుకు రఘురాం, కూతురు సుజాత అలాగే పెరిగారు. చక్కగా మాస్టారు పెంచిన విధానంలోనే చదువుకున్నారు. మంచి ఉద్యోగాలు  సంపాదించుకున్నారు. మంచి జంటలను ఎంపిక చేసి చక్కగా పెళ్ళిళ్ళు చేశారు. మళ్ళీ ఇద్దరూ చెరో ఇద్దరిని కని మాస్టారిని తాతను చేశారు. ఆయన ఆదర్శప్రాయంగా నిర్మించిన బాటలోనే పిల్లల జీవితాలు పూలపూల పరిమళతోటలుగా, సరాగాలసిరిమల్లె పందిళ్ళుగా, సుస్వరాల సుమగంధాలు విరజిమ్ముతున్నాయి. వారి కుటుంబాలు వాటి ప్రవర్తన, పాటిస్తున్న నైతిక విలువలు ఎందరో ఊరివారికి ఆదర్శనీయం.  ప్రతి పండుగకూ రఘురాం కుటుంబం, సుజాత కుటుంబం పిల్లలతో మాస్టారింటికి వచ్చి తీరాల్సిందే. ఇది ఈసారి, ఈ సంక్రాంతికి కూడా జరిగింది. పగలల్లా పిల్లలూ పెద్దలూ ఎన్నో ఆటలాడారు. కబుర్లు చెప్పుకున్నారు. ఊర్లో తిరిగారు. పొలాల్లో ఎగిరారు. పాడిగేదెలతో ఆవు తువ్వాయిలతో ఎగిరిదూకారు. కోళ్ళ వెంట, బాతుల వెంట పరుగులెత్తారు. కొంగలతో, కోకిలలతో, పాడారు. ఊగారు. తూగారు. ఆడి ఆడి అలిసిపోయారు. అలసి సొలసి ఆనందించారు.

మాస్టారు సతీమణి శ్యామలకు మాత్రం ఈ ఆటపాటలతో పాటు వంటింటి పనులన్నీ మీద పడ్డాయి. కోడల్ని, కూతుర్ని కూర్చోబెట్టి తనే అన్నీ చూసుకుంటోంది.. పండుగలకు ఇద్దరు పని మనుషులను పెట్టుకోమని మాస్టారు ఎంతగా బతిమలాడినా వొప్పుకోలేదు. చివరికి పిల్లలు అలా ఐతే ఇంటికి రాము అని సమ్మె ప్రకటిస్తే కొంచం మెత్తగిల్లింది. వచ్చే ఏడాది చూద్దాం అంది. కాని ఈ ఏడాదికే వొప్పుకుంది. కారణం ఓపిక సన్నగిల్లడమే. అదికూడా పని మనుషులు సహకారం వరకే గాని వంటలన్నీ తనే వండాలని వొప్పందం చేసుకుంది. అప్పుడే తనకు తృప్తి అని ప్రకటించింది శ్యామల. ఆ మాత్రమైనా వొప్పుకున్నందుకు తల్లి చేతివంట రుచి మరెవ్వరికీ రాదు కాబట్టి తమకు లొట్టల భాగ్యానికి లోటు రాదు కాబట్టి పెద్దలూ పిల్లలూ అంగీకరించారు.అలా ఈ సంక్రాంతి కూడా మరో చిరస్మరణీయమైన పండుగగా గడుస్తోంది. ఈరోజు మరపురాని విధంగా గడిచిందని అందరూ ఏకగ్రీవంగా ప్రకటించారు. దానికి ప్రధాన కారణం శ్యామల చేసిన పండుగ వంటలు. ఉదయం తలంటుకోగానే తినాలంటూ నాలుగు రకాల స్వీట్స్‌ వండేసింది. మళ్ళా అరగంటకు టిఫిన్‌లకు మరో నాలుగైదు రకాలు. అలా గంటగంటకూ, ప్రతి ఆటకు, పాటకు మధ్య మధ్య ఏదో వొకటి అందరి నోటికి అందిస్తూనే ఉన్నారు పనిమనుషులు. పిల్లలు ఎలా లొట్టలేస్తూ తింటున్నారో తిరిగి శ్యామలకు రిపోర్టు వెళుతూనే ఉన్నది.

అలా పగలు, రాత్రి ప్రతి క్షణం మృదుమధురంగా గడిచింది.అంతా తిని అలసిసొలసి మామ్మకు, తాతకు థ్యాంక్స్‌ చెప్పి వారివారి గదుల్లోకి నిష్క్రమించారు. భుక్తాయాసంతో అంతా నిద్రకుపక్రమించారు. ఆ తర్వాత జరిగిందీ సంఘటన. అవతల హాలులో మాస్టారు, శ్యామల మాట్లాడుకుంటున్న మాటలు, విషయం కోడలు సువర్ణ చెవినపడ్డాయి. భర్త రఘురాంను లేపింది. రఘురాంకు తిండి మత్తు, నిద్ర మత్తు వదలిపోయాయి. లేచి లుంగీ సర్దుకున్నాడు. తల్లి శ్యామల లోపలికెళ్ళి తలుపేసుకుంది. ఆమెను అడగాలని ఉన్నా ఏమడిగితే ఏం చెబుతుందో.. ఏ భయంకర నిజాలు వినాల్సి వస్తుందోననిపించింది రఘురాంకు. బావను లేపుదామనుకున్నాడు. అతనో రకం. ఓవర్‌గా రియాక్ట్‌ అయ్యే బాపతు. విని ఏమంటాడో తెలియదు. చెల్లిని లేపితే? ఊహు.. బావ కూడా లేచొస్తాడు.సువర్ణే బెటరు. తనతో చెప్పి ఊరుకుంది. తనే ఏదైనా చెయ్యాలి. తల్లిదండ్రుల విషయంలో ఇప్పుడు, ఈ వయస్సులో, ఇలాంటి రాత్రివేళ ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి దేవుడా అనుకుంటూ ప్యాంట్‌ వేసుకున్నాడు.‘‘ఏం చెయ్యబోతున్నారూ?’’ అంటూ దీర్ఘం తీసింది సువర్ణ, ఎగాదిగా చూస్తూ. ‘‘ఏం తోచటం లేదే’’ అన్నాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ. తండ్రి ప్రవర్తన, తండ్రిపై సందేహం, తండ్రిని నిలదీసే సన్నివేశం జీవితంలో వస్తుందని ఎప్పుడూ ఊహించని రఘురాం ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకపోయినా చెప్పులు తొడుక్కుని బయటకు వచ్చాడు. ఇది ఎవరికీ చెప్పే సమస్య కాదని, తనే తేల్చుకోవాలని అస్పష్టంగా అనిపిస్తుంటే వెంటనే ఇంట్లోంచి బయటకు రావటం మినహా మరో మార్గం లేదు. 

బయట వీధి అంతా ప్రశాంతంగా ఉంది. అసలు ఊరంతా టీవీలు చూస్తూ నిద్రను ఆహ్వానిస్తోంది. గాలి హీటు తగ్గి చల్లచల్లగా గారాలు పోతోంది. నేలపై ఎండుటాకులు గాలికి మెల్లగా హాయిగా కదులుతున్నాయి. ఎక్కడో కుక్క పిల్ల మూలుగు లాంటిది దూరంగా వినిపిస్తోంది. వీధి దీపాలు అక్కడక్కడా ఎక్కువగా, అక్కడక్కడా తక్కువగా వెలుగుతున్నాయి. ఆ వెలుతురులో దోమలు గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నట్లు ఏదో శబ్దం లాంటిది చెవికి సోకుతోంది. అటూ ఇటూ చూస్తూ కళ్ళు చికిలించి ముందుకు చూస్తూ లుంగీ సర్దుకుంటూ కదులుతున్నాడు. చటుక్కున ఓ సందేహం వచ్చింది. తనిప్పుడు ఎవరి కంటనైనా పడే అవకాశం ఎక్కువగా ఉంది. చూసిన వారెవరైనా పలకరిస్తే, ‘ఎక్కడికి రఘురాం బాబూ?’ అంటే? ‘ఇంత రాత్రేల బయటకు వచ్చారు. నాన్నగారికి చెప్పే వచ్చారా?’ అని డౌటు ప్రకటిస్తే? అటూ ఇటూ చూస్తూ తండ్రి జాడకోసం దూరంగా చూపు సారిస్తూ వడివడిగా నడుస్తున్నాడు. అనుకున్నట్లే జరిగింది. కొండారెడ్డి మావయ్య చూడనే చూశాడు. ‘‘ఏంటల్లుడూ.. ఏంటి ఇంత రాత్రేల రోడ్డుమీద షికారా! ఏంటి.. ఏంటికత?’’ కొంటెతనం మేళవించి, నవ్వుకలిపి వదిలాడు బాణంలాంటి డైలాగు. అంత రాత్రివేళ కూడా ఆయన మీసంమీద చెయ్యి వేసి మెలిదువ్వడం స్పష్టంగా కన్పిస్తోంది.కొండారెడ్డి బాలయ్యకు మంచి స్నేహితుడు. ఆయనపై జోక్‌ వెయ్యగల చనువు, ధైర్యం, అంతకుమించి నీతి నిజాయితీ గల పెద్ద రైతు. అచ్చతెలుగు రైతు అంటే కొండారెడ్డి మావయ్యే. విన్నవెంటనే కంగుతిన్నాడు రఘురాం. అంతలోనే ఆయన అంతరాత్రి కూడా ఫెళఫెళలాడే పేటేరు ఖద్దరు పంచెలో కనపడటం విస్మయం కలిగించింది. 

‘‘నేను సరే. ఏదో కాస్త చల్లగాలి కోసం లుంగీతో బయటకొచ్చాను. నువ్వేంటి మావయ్యా! అర్ధరాత్రి కూడా సోగ్గాడు శోభన్‌బాబులా మెరిసిపోతున్నావ్‌?’’ అన్నాడు. సోగ్గాడు సినిమా ఆయన ఆరాధ్య సినిమా అని, శోభన్‌ బాబు అంటే ప్రాణం పెడతాడని రఘురాంకు క్షుణ్ణంగా తెలుసు. అనుకున్నట్లే కొండారెడ్డి పడిపోయాడు. ముసిముసిగా మొదలెట్టి హాయిగా ఆకాశందాకా వినిపించేలా భళ్ళు భళ్ళున నవ్వాడు. పెద్ద సిటీలో పెద్ద హోదాలో ఉన్న రఘురాం లాంటి ఆదర్శ యువకుడు తనతో కొంటెగా పరాచికాలాడటం ఆయనకెంతో ఆహ్లాదంగా అనిపించింది. కాసేపు కాలవ గట్టుకు తీసుకెళ్ళి కబుర్లు చెప్పుకుందామని ప్రతిపాదించబోయాడు గాని మాట్లాడుతూనే ముందుకు కదులుతున్న రఘురాం, ఏదో ఆలోచనలో ఉన్నట్లు గ్రహించి తానూ చుట్ట తాగడానికి ఇంట్లోంచి బయటకొచ్చాడు కాబట్టి ఆ పనిమీద ముందుకు సాగిపోయాడు. ‘హమ్మయ్య’ అనుకున్నాడు రఘురాం. అతనికి కొంచెం చెమట మొదలయ్యింది. ‘నాన్న ఎటు, ఎక్కడికి వెళ్ళినట్లు?’ నడకలో, ఆలోచనలో, వేగంపెరిగింది. మెడ అన్ని పక్కలకూ గిర్రునతిరుగితూ వెదుకుతోంది. బాలయ్య మాస్టారు కనబడలేదు. ఊరు ఊరుగా కొంచం పెద్దదే గాని షాపులు, షాపింగ్‌ సెంటర్లు, షాపింగ్‌ ఏరియా అంటూ లేదు. ప్రధాన రోడ్డు మీద మరో ప్రధాన కూడలి. సెంటర్‌ అంటారు అంతా. ఇప్పుడా సెంటర్‌ మెదట్లోకి ప్రవేశించాడు రఘురాం. తండ్రి కోసం వెతగదగ్గ చోటు అదే. ఇక్కడే, ఎవరైనా ఏదైనా కొనాలన్నా, అసలు ఈ ఊర్లో దొరికేవి ఏవిటో తెలుసుకోవాలన్నా ఇక్కడే. ఆ సరదా తీర్చుకోవాలి. ఇహ మిగిలింది అంతా నివాస ప్రాంతమే. ఆయా ప్రాంతాలలో తండ్రి కోసం వెదకనక్కరలేదు. మరి ఎటు వెళ్ళినట్లు? సెంటర్‌ వైపు నడక పెంచాడు.నాలుగడుగులు వేశాడో లేదో, ‘‘రఘు’’ అన్న పిలుపు చాలా దగ్గరలో వినపడి కాలికి ఏదో అడ్డుపడ్డట్లు ఆగిపోయాడు. కొంచం ఆశ్చర్యంతో అటే చూశాడు. ఆ చీకటిలో చిన్న గేదె దూడ లాంటి మనిషి ఆకారం. చొక్కా లేకుండా పంచతో కనిపించాడు. తనను పేరుపెట్టి పిలిచింది ఎవరో అని కళ్ళు చికిలించి చూసిన రఘురాం, చాలా తొందరలోనే ఆ శాల్తిని గుర్తుపట్టాడు. 

కోటేసు. ఉరఫ్‌ కోటేశ్వరరావు. కోటేశ్వరరావు రఘురాంకు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్‌మేట్‌. అంత సీరియస్‌గా చదువును తీసుకోనివాడు. ఎప్పుడూ క్లాస్‌కు సీరియస్‌గా వచ్చేవాడు కాదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో గొడవలు. తల్లి, తండ్రి కష్టపడేవారు. అయినా ఏవో చికాకులు, ఇబ్బందులు. అన్నింటికీ పర్యవసానం స్కూల్‌ మానేయడం. చెప్పినా అర్థం చేసుకోకపోవడం, అసలు వినడమే తక్కువ. ‘ఇంటికష్టాలు అన్నీ చదువుతో పోతాయిరా’ అని బాలయ్య మాష్టారు ఎన్నిసార్లు చెప్పినా చెవికి ఎక్కించుకునేవాడు కాదు. అయితే రఘురాంకు చాలా ఇష్టం వాడంటే. కారణం అమాయకమైన మంచితనం. మంచి హాస్యదోరణి. స్నేహగుణం. ఎప్పుడూ వెన్నటి ఉండే ఆప్యాయత.ఇప్పుడు కూడా చూడగానే అప్రయత్నంగా పిలిచాడు. రఘురాం విని, చూసి, ఆగాడు.‘‘వొరే కోటేసూ’’ అంటూ ఎప్పటిలాగే ఆత్మీయంగా అతనివైపు నడిచాడు. కోటేసు కూడా అలాగే స్పందించాడు. కానీ కోటేసు దగ్గరకు రాకముందే గప్పున వచ్చింది సారా వాసన. బ్రేకు వేసినట్లు ఆగిపోయాడు రఘురాం. కోటేసు కూడా కాస్త దూరంగా ఆగి పలకరింపుగా నవ్వాడు. రాత్రి బయటకు రావటం వల్ల కలిగే ఇబ్బందుల్లో ఇదోకటని రఘురాంకు అర్థమైంది.‘‘రఘూ.. నువ్వే? ఎప్పుడొచ్చావ్‌! ఏంటి రాత్రి తిరుగుళ్ళేంటి. మాస్టార్ని పడుకోనిచ్చి రోడ్డెక్కావ్‌’’ నవ్వాడు. ఎక్కువగా నవ్వాడు. కోటేసు వొరే అనడం, ఏకవచనంతో సంభోదించడం మానేసి చాలా కాలం అయ్యింది. 

‘‘నువ్వేంట్రా ఇంత రాత్రప్పుడు ఇట్టా రోడ్లమీద. ఆ పంచ ఏంటి? చొక్కా ఏది? తాగుడు ఎక్కువైయింది. అవునా!’’ కోపం నటిస్తూ మందిలిస్తున్నట్లు నిజమైన స్నేహితుడిలా చురుగ్గా అన్నాడు రఘురాం.ఆనందంతో మందు కిక్కులో మరింతగా నవ్వాడు. ‘‘నేను తాగి రాత్రుళ్ళు రోడ్డుమీద తిరగడం, తూలడం మావులే. గాని తవరేంటి ఇయ్యాల?’’ కోటేసు ఎలా అన్నా అసలు విషయం గుర్తొచ్చింది రఘురాంకు. ‘‘ఆ! నాన్నగారు ఏవన్నా కనపడ్డార్రా కోటేసూ.’’ ఆ ప్రశ్న అడగగలిగిన చనువున్న ఫ్రెండు కోటేసు వొక్కడే. ఈసారి నిజంగానే ఫెళ్ళున నవ్వాడు కోటేసు. సారా తాగిన నాలిక్కి కారం రుచి తగిలినంత తృప్తితో గుటకేసి నవ్వి నవ్వి అన్నాడు – ‘‘ఎవరు? బాలయ్య మేష్టారా! పగలేబెల్లు కోడితెగాని పాటం ఆపడు. రాత్రి ఏడుగంటల టీవీ వార్తలు సమాప్తం అనగానే ముసుగుపెట్టే బాలయ్య పంతులు ఇట్టా అర్ధరాత్రెల వీధిలోకి రావడం? ఏంటి నువ్వూ తాగావా?’’ మళ్ళీ భళ్ళుభళ్ళున నవ్వాడు. తాగి ఉన్న అతనితో లాభం లేదనుకుని ముందుకు కదిలాడు రఘురాం. సెంటర్‌ కూడలికి వచ్చాడు. అక్కడ చిన్న చిన్న కొట్లు కొన్ని ఉన్నాయి. అలాగే ఒకటీరెండు హోటళ్ళు లాంటివి. పెద్దసైజు బోర్డు రాయించిన భోజన హోటల్‌ ఉందిగాని భోజనం దొరికేది పగలే. అలాగే టీ బంకులు, మంగలిషాపు, ఇస్త్రీ దుకాణం లాంటివి ఆ సెంటర్‌ చుట్టుపక్కలా ఉన్నాయి. అలాగే ఊరి అన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయి. సెంటరుకు దగ్గరలోనున్న పక్క సందుల్లో సారా కొట్టు, కొత్తగా బార్, రెస్టారెంట్‌ లాంటివి కూడా వెలిశాయి. కొత్తగా చికెన్‌ దుకాణం, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మొదలెట్టారు. ఫ్లెక్సీల పుణ్యమా అని బోర్డుల అందచందాలు, తద్వారా సెంటరు రూపురేఖలు మారిపోయాయి. జనసందోహం లేని నిశ్శబ్దరాత్రి సెంటరు వెన్నెల్లో నగ్నసుందరిలా, ప్రాథమికమైన అందచందాలతో అది రఘురాం లాంటి వారిని కట్టిపడేస్తుంది.

అలా సెంటరు మధ్య నిలబడి అంతా కలయ చూస్తున్న రఘురాం చూపు ఎదురుగ్గా ఉన్న సందువైపు మళ్లింది. అంతే! అటే చూస్తున్న రఘురాం నెత్తిన పిడుగు పడినట్లు మ్రాన్పడిపోయాడు.ఆ సందులో పట్టపగల్లా వెలిగిపోతున్న మెర్క్యురీలైటు కాంతిలో రంభ బార్‌–రెస్టారెంట్‌ మహాద్వారం నుండి తల వంచుకుని కాళ్ళకు అడ్డుపడకుండా పంచె ఎత్తి పట్టుకుని బయటకొచ్చి వడి వడిగా సాగిపోతున్న బాలయ్య మాష్టారు. తన కన్నతండ్రి, ఊరంతా కీర్తించే మహా మహోపాధ్యాయుడు. నైతిక శ్రేష్టుడు. ఆదర్శగురువు. ప్రశంసనీయ తండ్రి. అత్యుత్తమ భర్త. బార్‌లోంచి అర్ధరాత్రి బయటకు రావటం. అది తాను చూడటం. ఆదర్శ కుమారుడైన రఘురాం భరించలేకపోయాడు. బాధతో, దు:ఖంతో, ఏదో అవమానంతో అతను ముడుచుకుపోయాడు. హిమవన్నగం అంత తండ్రి సమున్నత వ్యక్తిత్వం వేగంగా కరగసాగింది. ఇది కొత్త అలవాటా, ఎప్పట్నుంచో ఉందా! ఉంటే ఇంతకాలం తనకు తెలియకుండా ఎలా మేనేజ్‌ చేశారు. తల్లి కూడా తెలిసి భరిస్తోందా? పిల్లలకు తెలియకుండా ఎంతలా నటిస్తోంది?  ఊర్లో ఎవరికీ తెలియదా! కనీసం కొండారెడ్డి మావయ్యకు తెలియదా. లేక ఇద్దరూ కలిసే తాగుతున్నారా?అసలు ఆయనే అలవాటు చేశాడా? కోటేసుగాడికి తెలుసా! ఇప్పుడేం చెయ్యాలి!పరిపరివిధాల ఆలోచనలు సాగిపోతున్నాయి. ఇంతలో సైకిల్‌ బెల్‌ శబ్దం దగ్గరగా మోగడంతో చటుక్కున కదిలాడు. తండ్రి కోసం సందులోకి చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. చటుక్కున అన్ని వైపులా చూశాడు. బాలయ్య మాష్టారు కనపడలేదు. ఇంతలోనే ఎటు మాయమైపోయాడు? ఇంటికి వెళ్ళాలంటే ఇటే వెళ్ళాలి. ఏడీ ఇటు నా ముందుగా వెళ్ళలేదు. మరి ఎటు వెళ్ళినట్లూ? ఇదేవిటో ఇవ్వాళ నాన్న విచిత్ర ప్రవర్తన వల్ల తనకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి అనుకుంటూ ఇంటివైపు తిరిగి వడివడిగా నడవసాగాడు. అలా వెళుతూనే అటూ ఇటూ చూడటం మానలేదు. ఊహాతీతంగా బాలయ్య మాష్టారు ఓ సందులో కనపడి వడివడిగా మరో సందులోకి మాయమయ్యాడు.

ఈసారి గుండె ఆగినట్లయ్యింది రఘురాంకు– ‘ఇదేంటి! నాన్న, ది గ్రేట్‌ బాలయ్య మాష్టారు, ఆ సందులోకి వెళ్ళాడా! ఆ సందులోంచి వెళితే అలా అలా మరో సందు మరో సందు మా ఇంటికి చేరవచ్చు. అమ్మో అమ్మో అంటే నాన్న మెయిన్‌ రోడ్డు మీదికిరాకుండా సందు గొందుల్లోంచి బార్‌కు వెళ్లి తాగి తిరిగి ఇంటికి చేరుతున్నాడు’. సీన్‌ అంతా అర్థమయింది.ఈ వయసులో ఈయనకు ఇదేంబుద్ధి. కోపం ముంచుకొచ్చింది. ఉగ్రుడైపోయాడు. ఇవ్వాళ డైరెక్టుగా అడిగెయ్యాలి. మరింతగా ఆయన దిగజారకముందే, ఆయనను కట్టడి చేయాలి. అమ్మ ఎంత కుమిలి పోతోందో!వేగంగా ఇంటివైపు కదిలాడు. గుమ్మంలో నాన్న. అప్పుడే ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అమ్మ గుమ్మంలో నిలబడి ఆయనను లోపలికి తీసుకెళ్ళటానికన్నట్లు నిలబడి ఉంది. ఆయన రాగానే ఆమె కంగారు పడుతూ అటూ ఇటూ చూడటం రఘురాంకు ఎంతో బాధ కలిగించింది. అతను కోపంతోనూ, ఆవేదనతోనూ కదిలిపోతున్నాడు.బాలయ్య మాష్టారు లోపలికి అడుగువేసాడు. శ్యామల అటూ ఇటూ చూసి తలుపు వేసుకోబోయింది. ‘‘అమ్మా! ఆగు.’’ అరుపులా గట్టిగా దృఢంగా అన్నాడు. అన్నంత వేగంగా గుమ్మం దగ్గరగా వెళ్లి లోపలికి అడుగువేసి అంతే వేగంగా తలుపులు మూశాడు. ఇద్దరూ మ్రాన్పడిపోయారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావొస్తోంది. బాలయ్య మాష్టారు, రఘురాం ఇద్దరూ వేగంతో, ఆందోళనతో చెమటపట్టి అలసటగా కన్పిస్తుంటే శ్యామల కంగారుగా ఉంది. లోపలి తలుపు కొంచం కదిపి అంతా తాను చూస్తున్నట్లు సువర్ణ ముగ్గురి దృష్టిలోకొచ్చింది. ‘‘ఎక్కడికెళ్ళి వస్తున్నారీ రాత్రివేళ?’’ చటుక్కున తండ్రిని నిలదీస్తున్నట్లు నేరుగా అడిగాడు. జీవితంలో తొలిసారి కొడుకు నిగ్గదీసి ప్రశ్నించడంతో నోటమాట రాలేదు బాలయ్య మాష్టారుకు. ఆయన పక్కకు కదిలిన శ్యామల, ఆయన చేతిలోని సంచి తీసుకుంది. అప్పుడు మెదటిసారి తండ్రి చేతిలో ఉన్న సంచిని చూసాడు రఘురాం. ఆమె ఆయనకు సపోర్టు చేస్తున్నట్లు భావించాడు.‘‘అమ్మా! నువ్వు ఆయనను సపోర్టు చెయ్యొద్దు.’’ అన్నాడు. అతని గొంతు అలా తండ్రిని నిగ్గదీసి అడగటం వారి జీవితంలో మొదటిసారి.‘‘అడుగుతున్నది మిమ్మల్నే నాన్నా! ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లి వస్తున్నారు?’’ మళ్లీ రెట్టించి అడిగాడు. ఇద్దరూ ముఖాలు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సువర్ణ బయటకొచ్చింది. ‘‘ఏవిటి మీ ప్రశ్న? మావయ్యగారు ఎక్కడికి వెళ్లివస్తే మీకెందుకూ. ఆయననే ప్రశ్నిస్తున్నారు. లోపలికి రండి. బాగా పొద్దుపోయింది. అత్తయ్యా! లోపలికి వెళ్ళండి.’’ విషయాన్ని చిన్నదిచేసి రఘురాంను లోపలికి తీసుకెళ్లడం ఆమె ప్రస్తుత కర్తవ్యం.‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలుసా?’’శ్యామల తెల్లబోయింది. వేగంగా అర్థం చేసుకుని అంతే వేగంగా స్పందించింది – ‘‘రఘూ! ఏవిటా ప్రశ్న. నాన్నగారినే..’’ ‘‘అవును. నాన్నగారినే అడుగుతున్నాను. నువ్వు అడ్డుకోకు.’’
‘‘ఏవిటండీ! అర్ధరాత్రి ఈ ప్రశ్నలు. పొద్దున్నే మాట్లాడుకోవచ్చు.’’ సువర్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. 

‘‘నాన్న ఎక్కడికి వెళ్లి వస్తున్నారో తెలిస్తే నువ్విలా మాట్లాడవ్‌’’ రఘురాం ఎమోషన్‌ పెరిగిపోతోంది. ‘‘ఏవిట్రా. ఏవిటీ మీటింగు.’’ కళ్ళు నలుముకుంటూ బయటకొచ్చి అడిగింది సుజాత. వెనక భర్త రాజు.‘‘నాన్నగారు ఈ రాత్రివేళ బార్‌కు వెళ్లి.. అంటే.. మందుకొట్టి వస్తున్నారు.’’ అంతా అవాక్కయ్యారు. రెండు నిమిషాలు మౌనం. రఘురాం ఏదో కంటిన్యూ చేయబోయాడు. శ్యామల అంది గట్టిగా – ‘‘రఘూ! మతిపోయి మాట్లాడుతున్నావా..’’. రఘు తగ్గలేదు – ‘‘అవును. నాన్నగారిని బార్‌ దగ్గర చూశాక నిజంగానే మతిపోయింది నాకు.’’ ఇంకా వివరంగా చెప్పాడు. కోడలు, కూతురు, అల్లుడు నోటమాట లేక అచేతనంగా నిలబడిపోయారు. ముందుగా కదిలింది బాలయ్య మాష్టారు. ‘‘వెళ్ళండి వెళ్ళండి. అంతా లోపలికి వెళ్ళండి. వండినవన్నీ అందరూ తిన్నాక మీ అమ్మకు ఏమీ మిగలలేదు. పిల్లలుకదా పోటీ పడి అన్నీ ఖాళీ చేసేశారు. ఆమె కాసిని నీళ్ళు తాగి పడుకోవడం చూసి నేనే ఏవన్నా తినడానికి తెద్దామని బయటకు వెళ్లాను. పల్లెటూరుకదా, ఇంత రాత్రి సారాకొట్టు, అదే, బారు తప్ప ఏవీలేవు. ఏదో వెజిటబుల్‌ పలావ్‌ వేడివేడిగా చేసి ఇచ్చాడు. అదే తెచ్చా. తిను శ్యామలా! చల్లారిపోతుంది.’’ వాతావరణాన్ని చల్లబరచడానికన్నట్లు నవ్వి ‘‘ఆ మాంకాలమ్మ సందులో పరుగు పరుగున వస్తుంటే కుక్కలువెంటబడ్డాయిరా రఘురామా..’’ అంటూ అందరివంకా చూస్తూ జోక్‌గా చెప్పి అందరినీ నవ్వించాడు బాలయ్య మాష్టారు అనే భర్త! 
మత్తి భానుమూర్తి 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

శివానంద లహరి

ఔషధం కురిసే వేళ..

పసందైన రుచుల సమాహారం

గడసరి బుజ్జిమేక

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

నేరం దాగదు..

ఇది సహజమేనా?

అందుకే కాంపౌండ్‌ వాల్‌ ఉండాలి!

అంపకాల్లో కోడిగుడ్డు దీపం

దరువు పడిందో.. చావు డప్పు మోగాల్సిందే!

ఒక ఖైదీ ప్రేమకథ

దేశానికి జెండానిచ్చిన తెలుగు వీరుడు

వ్యాసుడి పలుకులు

వీరికి అక్కడ ఏం పని?!

ద్రుపదుడి గర్వభంగం

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం