గోల్డ్‌ ది గ్రేట్‌

19 Aug, 2018 01:09 IST|Sakshi

ఈవారం కథ

నా పేరు శ్యామ్‌ సుందరం అండీ. నా భార్య నన్ను అందంగా శ్యామ్‌ అని పిలుచుకుంటుందండీ. అయితే ఇప్పుడు నేను నా గురించో, నా భార్య గురించో చెప్పబోవడం లేదు. నా కుక్క గురించే చెప్పాలనుకుంటున్నానండీ. కుక్కే గాని కుక్క అనడం నాకిష్టం లేదనుకోండి. మీకందరికీ అలా ముందు ముందుగా ఆ ముక్కేదో చెప్పేస్తే తర్వాత్తర్వాత అలా అనకపోయినా పర్లేదని అనేశానన్నమాట. వాడికో పేరుందండి. దటీజ్‌ గోల్డీ అండి. వాడని ఎందుకన్నానంటేనండి, వాడు వాడు కాబట్టి. అది కాదు కాబట్టి అని మీకు మనవి చేసుకోవాలనే ఈ కాస్త వివరణ. సుత్తి లేకుండా సూటిగా విషయానికొచ్చేస్తానండి. మా గోల్డీ గాడు నన్ను వదిలి పారిపోయాడండి. నన్ను ఒంటరోణ్ణి చేసి అకస్మాత్తుగా ఎటో మాయమైపోయాడండి. కారణం చిన్నదేనండి. కానీ దానికి ముందు మేటర్‌ మాత్రం చాలా పెద్దదే వుందండి. మీతో నా బాధ పంచుకోవాలని నా ఆరాటం. సాక్షాత్తు కన్న కొడుకు ఇంటి నుంచి పారిపోయినట్టనిపిస్తోందండి. 

గోల్డీ కేవలం ఒక కుక్క కాదు సార్‌. నా ప్రాణం. నా కుటుంబ సభ్యులతో కంటే, వాడితో నేను, నాతో వాడు గడిపిన క్షణాలే ఎక్కువ. వాడు నాకు దొరకడమే ఓ విచిత్రం. మార్నింగ్‌ వాకింగ్‌లో రోజూ కూడా నడిచేవాడు. మేం గవర్నమెంట్‌ క్వార్టర్స్‌లో వుంటాం. రాత్రిపూట మా క్వార్టర్‌ ముందే పడుకునే వాడు. పొద్దునే వాకింగ్‌ కోసం నేను తలుపులు తీయగానే పటపటా వొళ్ళు దులుపుకుని రెడీ అయిపోయేవాడు.పొద్దున్నే కుక్క మొహం చూడ్డం ఏంట్రా బాబూ అనుకుని ఛీ అని విదిలించేవాణ్ణి. కొన్ని బంధాలు అంత తేలిగ్గా వదిలించుకోలేం. వాడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా నా వెంటే నడిచేవాడు. కొన్నాళ్ళకి మేం వేరే క్వార్టర్‌కి మారినప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ తినేవాడో ఏమో! అప్పుడిక అనుకున్నాను, వీడికీ నాకూ ఎక్కడో లింకుందని. మా ఆవిడతో చెప్తే అన్నం పెట్టడం మొదలుపెట్టింది. వాడు ఇక మా ఇంట్లోకి రావడం మొదలుపెట్టాడు. అయినా ఆ హిస్టరీ అంతా ఇప్పుడెందుకులెండి.

‘వాడిని ఈ మధ్య గొలుసు వేసి తిప్పుతున్నారే. ఎలా పోయాడు?’ అంటున్నారంతా. విషయం గొలుసు కాదు. నిజమే! ఇంతకుముందు గొలుసు లేకుండా వదిలేసేవాళ్ళం. ఈ మధ్యనే గొలుసు వేసి బంధించడం మొదలుపెట్టాం. అలవాటు లేని కట్టడి. నచ్చి వుండక పోవచ్చు. కానీ కారణం అది కాదనుకోండి. ఏదో చిన్న తప్పు చేశాను. దానికింత పెద్ద శిక్ష వేశాడు వాడు. బంధమే తెంచుకుని పోయాడు. నాతో ఉన్న బంధాన్ని తెంచుకుని పోయాడు. ఆగండి కొంచెం. కన్నీళ్ళొస్తున్నాయి.ఏమిటో నేనేదో నా కడుపులో దు:ఖం మీతో చెప్పుకుంటున్నా కదా! కాసేపు ఆగొచ్చుగా వెదవ కన్నీరు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పొంగాలో తెలీదు. అదిగో ఆ సిమెంటు దిమ్మ మీద కాసేపు కూచుంటాను. హమ్మయ్య కూచున్నాన్లెండి. ఇక్కడ నేను కూర్చున్నప్పుడల్లా ఎగిరి గంతేసి పక్కనే కూర్చునేవాడు మా గోల్డీ. ఇంకెవరి కుక్కయినా నా దగ్గరకొచ్చి ముద్దు చేయించుకుంటే నా సామిరంగా ఇక ఎటాకే అన్నమాట. కుళ్ళుమోతోడు. నేనెవరినీ ముద్దు చేయకూడదు వాణ్ణి తప్ప. నేను లేకపోతే హాయిగా కాలనీలో కుక్కలతో బాగానే ఆడుకుంటాడు. సర్లెండి. ఆ సోదంతా ఎందుకు గాని.

బంధాలు మక్కువే కాని బంధనాలు ఎవరికిష్టం వుంటాయి చెప్పండి? కానీ మా గోల్డీ గాడు మాత్రం నా బంధం తెంచుకుపోయింది గొలుసు గురించి కాదు. వాడికీ నాకు చాలా ఇష్యూస్‌ వున్నాయి.మీరలా నవ్వక్కర్లేదండోయ్‌. ఏదో పెళ్లాంతో, పిల్లలతో వున్నట్టు ఒక కుక్కతో ఇష్యూసేంటండీ అని పగలబడుతున్నారు కదా! నేనూహించగలను. నవ్వుకుంటే నవ్వుకోండి. ఇంతకీ గొలుసు ఎందుకేసేనో ముందు చెప్తాను. వీధిలో వదిలితే బయటి కుక్కలన్నీ వాడి మీదే ఎగబడతాయి. అయితే మీరనుకున్నట్టు కుక్కలన్నీ మీదపడి కరుస్తాయని కాదు గొలుసు వేసింది. మేటర్‌ వేరే వుంది. కుక్కలన్నీ మా వాడంటే ఇష్టపడుతున్నాయి. ఆడ కుక్కలు ఇష్టపడితే సరే. మగ కుక్కలు కూడా వెనకపడతాయి. మా వాడి రంగు బంగారంలా మెరిసిపోతుంది. వాడి పేరు గోల్డీ అని పెట్టడానికి కారణం అదే. వాడంటే కుక్కలకు అట్రాక్షన్‌ వెనక కారణం కూడా అదే. అందుకే గొలుసు వేయాల్సి వచ్చింది.‘ఏమిటీ.. గొలుసు వేయడం దేనికి? హాయిగా ఎంజాయ్‌ చేయనివ్వొచ్చు కదా!’ అంటారా? నా పాయింట్‌ అది కాదండి బాబూ.అందులో నాకిష్టం లేని కుక్క ఒకటి వుంది. దాని మీదే మా వాడు మనసు పారేసుకున్నాడు.

ఏమిటీ పిచ్చి మాటలని కొట్టి పారేయకండి. నిజంగా ఆ కర్రి కుక్క మీద మా వాడికి పిచ్చే పట్టింది. అది బక్కగా ఎండు కట్టెలా వుంటుంది. పైగా మచ్చలు మచ్చలు. ఛీ ఒకటే రోతగా వుంటుంది. ఎంత కొట్టినా అది మా ఇంటి చుట్టే తిరుగుతుంది. ‘నిను వీడని నీడను నేనే’  అని పాట పాడుతుందేమో. అంతే అది మా గోల్డీ గాడికి తెలిసిపోతుంది. ఇక ఒక్కసారిగా పైకి లేస్తాడు. నన్ను అదోలా చూస్తాడు. వాడెప్పుడు ఎలా చూస్తాడో నాకు తెలుసు. నా ప్రేయసితో నన్నెన్నాళ్ళు దూరంగా వుంచుతావో నేనూ చూస్తా అన్నట్టు వుంటాయి వాడి చూపులు. ఏమాత్రం వీలు దొరికిందా ఇంక దానితోనే షికార్లు. మా గోల్డీ తక్కువోడు కాదు సార్‌. మహా ముదురు నా కొడుకు. అదంటే నాకు ఇష్టముండదని వీడికి తెలుసు కదా, నేను పక్కనున్నప్పుడు మాత్రం అది పక్కకొస్తే దాన్ని దూరంగా అరిచి తరిమేస్తాడు. అబ్బే మా మధ్య ఏమీ లేదు అని చెప్పడానికన్నమాట. వాళ్ళిద్దరూ కలుసుకునే రహస్య స్థావరాలు వేరే వున్నాయి లెండి.‘ఏమైందండీ తిరిగితే?’ అంటారు మీరు. ఎదుటివాళ్ళకయితే ఎన్నయినా చెప్తాం లెండి. మా పక్క క్వార్టర్‌లో సుధాకర్‌ గారు పెంచుకుంటున్నారే, ఆ తెల్లబొచ్చు తింగరి బుచ్చితో తిరగొచ్చు కదా. అబ్బే అదంటేనే గిట్టదు. అది దగ్గరికొస్తే చాలు భయంకరంగా అరుస్తుంది. పాపం దానికేమో వీడి మీద మోజు. ఏంట్రా చిన్నా ఆ కర్రి దాంతో ఎందుకురా? ఈ తెల్లదానితో జతకట్టరా అన్నాను. దానికి మావోడేమన్నాడో తెలుసా? చెప్తాను జస్ట్‌ వెయిట్‌. ప్లీజ్‌ లెట్‌ మీ టేక్‌ సమ్‌ బ్రేక్‌. మీరు కూడా కాస్త రిలాక్సవ్వండి.

ఆ.. ఎక్కడున్నాను? ఓకే. నేనూ మా గోల్డీ ఏ భాషలో మాట్లాడుకున్నామో సెలవివ్వండని మీరు ఏమైనా వ్యంగ్యం పోవాలనుకుంటున్నారా? మీకేం తెలుసండి బాబూ. అందరికీ అన్ని భాషలుంటాయి. మా ఇద్దరికీ అర్థమయ్యే భాష ఒకటుంది. అది చెవులు కదిపితే ఏమంటుందో, తోక అదే పనిగా ఊపితే ఏమంటుందో, కళ్ళు కుడివైపు తిప్పితే అర్థమేంటో, ఎడమ వైపు తిప్పితే అర్థమేంటో, తన చుట్టూ తాను తిరుగుతున్నట్టే తిరుగుతూ నా వైపు చూస్తే అర్థమేంటో, ఎప్పుడు మొరుగుతుందో, ఎప్పుడు మూలుగుతుందో అన్నీ నాకు తెలుసు. రాత్రి నేను చాలాసేపు చదువుకుంటూ వుంటాను. వాడు నన్ను చదువుతూ వుంటాడు. నా ప్రతి కదలికా వాడికి క్షుణ్ణంగా తెలుసు. పడుకున్నట్టే వుంటాడు కానీ కళ్ళు మూసినా తెరిచినా వాడి పరిశోధనాంశం నేనే. చెప్పాల్సిందేమంటే నా భాషని మా గోల్డీ బాగా నేర్చుకున్నాడు. సరే విషయానికొస్తాను. మా గోల్డీ ఏమన్నాడంటే...‘మీలా అన్ని రంగులు మాకు తెలీదు. కాబట్టి రంగు భేదం పాటించడం మా జాతికి తెలియని విషయం.’ అని తేల్చి చెప్పాడు. అబ్బా చెంప మీద కొట్టినట్టనిపించిందండి. వాడు ఏ అంగ విన్యాసంతో ఈ మాట చెప్పాడని మీరు వంకర్లు పోతూ అడగక్కర్లేదులెండి. ప్రతీదీ అవయవాలతోనే చెప్పాలా? వాడి చూపులు చాలు.

చూడబోతే మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ తెలివి తేటలున్నాయని నేను చెప్పబోతున్నట్టుగా మీరు నిర్ధారించుకుంటే మీరు జ్ఞానవంతులే. పదివేల నుంచి లక్ష రెట్లు ఎక్కువ మనుషుల కంటే వాసన చూసే శక్తి కుక్కలకు వుంటుందని తెలుసుకుని మా గోల్డీగాణ్ణి ఒక గ్రహాంతర వాసిలా చూడ్డం మొదలుపెట్టాను. వాడి పుణ్యమా అని కుక్కల గురించి చాలా చాలా చదివేశాను. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలో సెన్సరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ వాకర్‌ వారి బృందం చేసిన పరిశోధనలు చూస్తే మతిపోయింది. అంతెందుకు చెప్పండి.  అలెగ్జాండ్రా హోరోవిట్జ్‌ అనే ఆవిడ రాసిన ‘ఇన్‌ సైడ్‌ ఆఫ్‌ ఏ డాగ్‌’ అనే పుస్తకం ఒకటి చాలు. ఆ లెక్కకొస్తే మా గోల్డీ ప్రపంచంలోనే అత్యున్నత మేలు జాతి శునకాల కంటే మేలైన మేధస్సు ఉన్నవాడని నేను ఢంకా భజాయించి చెప్పగలను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను చాలు.మా ఇంటికి ఒకసారి ఎవరైనా కొత్తగా వస్తే గోల్డీ మొరుగుతాడు. మళ్లీ వస్తే మొరగడు. ఓహో కొత్త వాళ్ళొస్తే మొరుగుతాడు కదా అనుకున్నాం. ఒకసారి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. మొరగలేదు.ఆశ్చర్యపోయాం. తీరా ఆరా తీస్తే ఆ వచ్చిన వ్యక్తి ఇంతకు ముందు వచ్చిన వ్యక్తికి పరిచయమున్న వాడు. అంటే ఒక మనిషి నుంచి ఆ మనిషికి సంబంధించిన మనుషుల వాసన కూడా పసిగట్టాడన్న మాట. కుక్కల్ని కొట్టేవాళ్ళు ఎవరైనా రోజూ వచ్చినా రోజూ మొరుగుతాడు. అదేమిటబ్బా అని ఆరా తీస్తే వాళ్ళకి కుక్కలంటే పడదని తెలిసింది. అందుకే మా గోల్డీకి వాళ్ళంటే పడదు.

ఇంతకీ ఆ నల్ల కుక్క దగ్గరకి మా గోల్డీని పోనివ్వటం లేదని మా మీద అలిగి వాడు ఆ కర్రిదాన్ని లేపుకు పోయాడని మీరు డౌటుపడితే, మహాప్రభో అదేం కాదు. వాడి ఇష్టానికి అనుగుణంగా అప్పుడప్పుడూ వదిలేస్తాను కదా, అందుకు వాడికి నేనంటే కాస్త కృతజ్ఞతాభావం వుందండోయ్‌. మరేమైంది? అని మీరు విసుక్కోవద్దు. కొంచెం శాంతం కావాలి మరి.మనం మనుషులం. మన పద్ధతుల్లోనే వాటిని పెంచుతాం.మన పద్ధతులు వాటికి నచ్చవు. వేరే కుక్కలు చెప్తాయో లేదో కాని, మా వాడు మాత్రం అన్ని సందర్భాల్లో తన నిరసన వ్యక్తం చేసేవాడు. మా గోల్డీ మనిషై వుంటే, వాడిని మించిన విప్లవకారుడు మరొకడు వుండే వాడు కాదనిపించేది చాలాసార్లు. మనం రా ఫుడ్‌ తినం. జంతువులకు రా ఫుడ్‌ ఇష్టం. మాంసం తెచ్చి నూనె వేసి ఉప్పూ కారం మసాలాలు దట్టించి వండుకుంటాం. వాడికి కూడా అలాగే పెడతాం.మొదట్లో చాలా ప్రొటెస్ట్‌ చేశాడు. కానీ తప్పక అదే తినడం అలవాటు చేసుకున్నాడు.‘ప్రకృతిలోంచి వచ్చి ప్రకృతికి విరుద్ధంగా బతుకుతున్నార్రా! మీరు చెడితే చెడిపోయారు. ప్రకృతిలో భాగంగా బతికే మాలాంటి ప్రాణుల్ని కూడా ఎందుకు చెడగొడతార్రా బాబూ’ అని కొంచెం మందలించేవాడు. అబ్బే! మనమెందుకు వింటాం. మా అలవాట్లే వాడి మీద రుద్దాం. మా ఆహారం మీద మీ ఆంక్షలేంటి అని మనం ఇంకెవర్నో తిట్టుకుంటున్నామే. జంతువులు కూడా మనుషుల్ని అలాగే తిట్టుకుంటాయని మా గోల్డీ చాలాసార్లు చెప్పాడు. నిజమే అనుకున్నా గాని వాడి మాట మాత్రం ఎప్పుడూ వినలేదు. వాడికి మాలాగే రుచిగా పెట్టాలని మా కోరిక. రుచికి మించిన శత్రువు లేడని వాడి హెచ్చరిక. అందుకే వాడిని అప్పుడప్పుడు డాక్టర్‌ దగ్గరకి తీసుకుపోవడం, అరుగుదలకి, వగైరా వగైరా జబ్బులకు మందులు వాడటం చేస్తుంటాం.వాడు నవ్వుకుంటాడు. ఎందుకురా నవ్వుతావంటే, ‘నాయాళ్ళారా మీ అజ్ఞానంతో పాటు మీ అభిరుచులతో నన్ను కూడా రోగిష్టి వాడిని చేసేశారు కదా’ అని వాడి కంటెన్షన్‌.ఆగండాగండి. మా వాడు మా అభిమానం, ప్రేమ తట్టుకోలేక, దానిమూలంగా ఆసుపత్రుల చుట్టూ తిరగలేక పారిపోయాడని మీరనబోతున్నారు అంతేగా. అయితే మీరు దాల్‌ మే లెగ్గేసినట్టే. మా వాడు అంత డెలికేట్‌ డెసిషన్స్‌ తీసుకునే సెన్సిబుల్‌ కాదు. చాలా డెడికేటెడ్‌ అండ్‌ కమిటెడ్‌ ఫ్రెండ్‌ మా గోల్డీ. ఏంటి.. సస్పెన్స్‌లో పెట్టి చంపేస్తున్నానంటారా? అలాంటి ఉద్దేశాలేమీ లేవు. మా గోల్డీకి సంబంధించిన పూర్తి సమాచారం మీకందితే, మీరెక్కడ ఉన్నా ఓ చేయి నా భుజం మీద వేసి ఓదారుస్తారనే. అసలేం జరిగిందంటే..

నా ప్రేమని వాడు భరించలేని స్థితికి వచ్చే పని ఒకటి చేశాను. అదే.. అదే వాడు నానుంచి దూరమయ్యేలా చేసింది. ఎంత మంచి వాడు, నా అత్యుత్సాహంతో నేనే వాడిని దూరం చేసుకున్నాను. నేను ఏం చెప్పినా చేస్తాడు. మా అలవాట్లు తెలుసుకుంటాడు. వాటిని నచ్చకపోయినా భరిస్తాడు. నేనే రెండుమూడు సార్లు వాణ్ణి కొట్టాను. అసహ్యించుకున్నాను. అయినా వాడు మాత్రం నా కోపం పోయిందని తెలుసుకున్నాక వచ్చి మెల్లిగా వొళ్లో వాలిపోయేవాడు. వాడికి వారానికి రెండుసార్లు స్నానం చేయిస్తాం. వాడి షాంపూ, సబ్బు, డియోడరెంట్‌ అన్నీ సెపరేట్‌. స్నానం చేయించిన తర్వాత మా గోల్డీ గాడి బొచ్చు చూడాలండీ. బంగారానిక్కూడా కుళ్ళేసుకొస్తుందంటే నమ్మండి. దాని వొంటి మీద ఒకసారి చేయి వేసి నిమిరితే జన్మజన్మాంతరాల స్పర్శానుభవం పొందినట్టే అనిపించేది. కానీ చాలాసార్లు స్నానం చేయించిన రోజే వాడు ఏదో బురదలోనో, మట్టిలోనో కసిదీరా దొర్లిదొర్లి వచ్చేవాడు. పోనీలే ఆడుకుంటాడు కదా అని వదిలేస్తే వాడు చేసే ఘనకార్యం ఇది. నాకు కోపం ముంచుకొచ్చి కర్ర తీసుకుని కొట్టేవాణ్ణి. దగ్గరకు రానిచ్చేవాణ్ణి కాదు. బయటే పెట్టి తలుపు పెట్టేసేవాణ్ణి. పాపం వాడు మాత్రం తలుపుకు ఆనుకుని అక్కడే పడుకునే వాడు. ఎప్పుడో జాలి పుట్టి ఏ బట్టో తీసుకుని వాడి వొళ్లంతా దులిపి అప్పుడు ఇంట్లోకి రానిచ్చేవాణ్ణి. దగ్గరకొచ్చి నా కళ్ళలోకి కళ్లు పెట్టి అలాగే చూసేవాడు. మనం ఏది శుచీ శుభ్రం అనుకుంటున్నామో అది వాడికి నచ్చడం లేదేమో. కడుక్కోవలసిందంతా లోపలే దాచుకుని పైపైన చేసే ఈ ప్రక్షాళన కార్యక్రమం అంతా నాటకంలా వాడికనిపిస్తుందేమో. మనం చేసే ప్రతి పనీ వాడి సహజత్వం నుండి దూరం చేసే అసహజమైన దానిగానే అనుకుంటున్నాడేమో. అప్పుడు వాడి కళ్ళలోకి చూస్తే ఎందుకో నా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అదంతా తల్చుకుంటుంటే ఇప్పుడూ తిరుగుతున్నాయనుకోండి.

ఓహో! ఇదన్నమాట కారణం అనుకొని అప్పుడే ఓ కంక్లూజన్‌కి వచ్చేయకండి. స్నానం చేయించినందుకు చిరాకు పుట్టి పారిపోయాడని అనేసుకోవద్దు. అలా అనేసుకుని ఎంతైనా కుక్క కుక్కే. అందుకే కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధెక్కడ పోనిచ్చుకుంటుందని మాటలు జారేస్తారేమో అంత పనిచేయకండి. అసలు జంతువుల్ని మనుషులు ఎందుకు పెంచుకుంటారో తెలుసా? అది జంతు ప్రేమ కాదు. మనలోపలున్న జంతువులకీ, బయట స్వేచ్ఛగా తిరిగే జంతువులకీ మధ్య జరిగే యుద్ధానికి మనం పెట్టుకున్న అందమైన పేరు. అంత ఆశ్చర్యంగా చూడక్కర్లేదు. వాస్తవానికి మన లోపలున్న జంతువులు బయట హాయిగా వున్న జంతువుల మీద కుళ్ళుతో వాటిమీద కసి తీర్చుకోడానికి వాటికి ఇష్టం లేని పనులు చేయడానికి మనల్ని ఉసికొల్పుతాయి. ఇక మనం పెంచుకున్నవి మనకు నచ్చని పనులు చేసి వాటి నిరసన తెలియజేస్తాయి. ఇదంతా నేను మా గోల్డీ సాహచర్యంలో తెలుసుకున్న విశేషాలే సుమా.

సరే! విషయానికే వద్దాం. స్నానం చేయించినంత మాత్రానికే పారిపోయే కురచబుద్ధి వాడు కాదు మా గోల్డి. నా వల్లే నా సరదా సంతోషాలే వాణ్ణి నా నుండి దూరం చేశాయి. వాడిది సహజంగానే బంగారంలా మెరిసిపోయే జుట్టు అని చెప్పాను కదా. అలాంటి వాడికి నా సరదా కోసం ఒక పూల చొక్కా కుట్టించాను. ఒక రంగు టోపీ కొన్నాను. వాటిని బలవంతంగా ఒకరోజు అలంకరించాను. అంతే, ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. ఏంటో గొంతులో ఏదో ఇరుక్కున్నట్టుంది ఉండండి. పొలమారితే ఎవరో తల్చుకున్నట్టే. వెదవ! నన్ను తలుచుకుంటున్నాడేమో.వాడికేదో పోయేకాలమొచ్చి పోయాడని అనొద్దండి.మీకు దండం పెడతాను.  మేముండే చోటుకి నెమళ్ళు బాగా వస్తాయి. బావుంటుంది కదా అని ఓ నెమలి కన్నుల చొక్కా కుట్టించేను గోల్డీకి. అంతే! వాడికి ఎక్కడ లేని తిక్క రేగింది. వాడన్న మాటల్ని మీకోసం ఇక్కడ మీకు తెలిసిన భాషలో చెప్తున్నా చూడండి.‘మీ మనుషులు మారర్రా అన్నాడు. ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల జీవులున్నాయి. ఒక్కటంటే ఒక్కటైనా బట్టలు వేసుకుంటాయా? అది ప్రకృతికి విరుద్ధంరా! మీ మనుషులు చేసేదంతా ప్రకృతి విరుద్ధమే.  ఆ నెమలిని చూడు. ఏదో రోజు ఆ నెమలిని కూడా మచ్చిక చేసుకుని నువ్వు దానికి కూడా పనికిమాలిన చీర ఏదో చుట్టినా చుడతావు. బాబూ నీకూ నీ చాదస్తంతో కూడిన అజ్ఞానంతో నిండిన అసహజత్వానికీ పరాకాష్టలాంటి నీ అలవాట్లకో నమస్కారం. నీకూ నాకూ రాం రాం.’ అని అన్నాడండి. దాని తర్వాత ఒకటి రెండురోజులు నెమలి మా దొడ్డి వైపు వస్తే దాన్ని తరిమేసే వాడు. అలా చివరికి ఒకరోజు తనను తానే నానుండి దూరంగా తరిమేసుకున్నాడు.

మీరిప్పుడు ఏమంటారో నాకు తెలుసు. ‘మీ కుక్కప్రేమ నక్కలెత్తుకెళ్ళా. ఆ కుక్క నాయాలకు చొక్కా ఎందుకు కుట్టించారండి’ అంటారా? అనండి. అంటే అన్నాడు గాని భలే అన్నాడని నవ్వుకుంటున్నారు కదా. ‘నెమలికి కూడా మీరు చీర కట్టగలిగే నేర్పరులే’ అని నన్ను వెక్కిరించండి. ‘ చీర కట్టిన నెమలి. ఆహా! పోతేపోయాడు కాని మాంచి జ్ఞానోదయం చేశాడండి మీ గోల్డి!’ అంటారా? అనండి అనండి. మీరనాలి.నేను పడాలి. అంత దిక్కుమాలిన పని చేశాను మరి.నిజంగానే మనిషి తక్కువోడు కాదు. తనలోపల పాతిపెట్టాల్సిన వాటినెన్నింటినో  నిత్యం బయటపెడుతూనే ఉన్నాడు. స్వార్థం, కుళ్ళు, ద్వేషం, అసహనం, మోహం, అత్యాశ, క్రోధం ఇలా ఎన్నని చెప్పాలి! వేటిని ఇనప కచ్చడాలు వేసి బిగించాలో వాటిని నిర్లజ్జగా వదిలేసి, ఏవేవో కపట వస్త్రాలతో తనను తాను కప్పుకుంటున్నాడు. మనిషి చేసే ప్రతి పనీ ప్రకృతి విరుద్ధమే అని నిరూపించగల అద్భుత మేధావి మా గోల్డీ గాడు. కాని వాడి భాష నాకు మాత్రమే తెలుసుగా ఏం చేస్తాం. నేనేమీ ఏడ్వటం లేదండి. నిజంగా. ఇన్ని విషయాలు నాకు బోధించి పోయాడు మా గోల్డీ గాడు. అదే తల్చుకుని పొంగిపోతున్నా. నిజంగానండి. పైకి చూపుతున్న గాంభీర్యం కాదు.ఏంటి? ఒకసారి సారీ చెప్పేసి, ఆ చొక్కా చింపి పారేయాల్సిందంటారా? వెధవ చొక్కా. కనీసం కుక్కయినా దక్కేదంటారా? మీ వ్యంగ్యానికేంగాని నా పశ్చాత్తాపాన్ని ప్రకటించుకునే అవకాశాన్ని కూడా నాకివ్వలేదు మా గోల్డి. దానికి కూడా అర్హుడనని వాడనుకోలేదు కాబోలు. వాడు కచ్చితంగా నెమళ్ళను నా నుండి కాపాడే మహోద్యమం ఏదో మొదలుపెట్టడానికే ఏ అడవుల్లోకో పారిపోయి ఉంటాడని నా నమ్మకం.

నన్ను చూసి మీరేమీ జాలి పడక్కర్లేదు. తెలివిమాలిన వారు సానుభూతికి అనర్హులు.  హచికో సినిమాలో కుక్క, చనిపోయిన యజమాని కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసి చూసి పాపం చివరికి గడ్డకట్టుకుపోయిందే! నేను కూడా అలాగే అయిపోయేలా వున్నానని మాత్రం భయం కలుగుతోంది. అందులో యజమాని కోసం ఎదురుతెన్నులు చూసి కుక్క అలాగైంది. కుక్క కోసం ఎదురుతెన్నులు చూసి నేనిలా అవుతున్నాను. అంతే. వాడిని మర్చిపోలేను. దయచేసి వేరే కుక్కను పెంచుకోమని మీరు సలహాలు ఇవ్వొద్దు. మా గోల్డీ స్పెషల్‌. వాడి కోసం చుట్టుపక్కల ఎక్కడెక్కడ అడవులున్నాయో అన్నీ వెదుకుతున్నాను.  ఒకవేళ వాడు కనబడితే ఏం చేస్తానో చెప్పమంటారా?బతిమాలుకుంటాను. వాడు రానంటే వాడితోనే వుండిపోతాను. వాడికి బట్టలిష్టం లేదుగా. నేను కూడా వాడి ఇష్టాన్నే ఫాలో అయిపోతా. సూఫీ గురువు సర్మద్‌లాగా నగ్నంగా తిరుగుతాను. ఔరంగజేబు రాజధాని నగరం నడిరోడ్డు మీద తల తీయించేశాడే ఆ సూఫీ గురువు గురించి మాట్లాడుతున్నానని మీరు కనిపెట్టే వుంటారు.ఔను! ఒక కవి తత్వాన్ని తలబిరుసు అనుకున్నాడు రాజు. అందుకే తల నరికించాడు. కాని ప్రజలు ఆ ఫకీరు అంతరాత్మలోని సత్యమనే వెలుగును దర్శించారు. అందుకే అతని సమాధిని ఒక తీర్థ స్థలంగా మార్చేశారు.ఉండండి ఉండండి. దూరంగా ఏవో నెమళ్ళు ఆడుకుంటున్నాయి. పక్కనే ఏదో కుక్క కూడా ఉన్నట్టుంది. తర్వాత చెప్తాను. పరుగు పెడుతూ మాట్లాడలేను. అవును! మా గోల్డీలానే వున్నాడు. ఉండండి ఒక్క నిమిషం. తర్వాత మాట్లాడుకుందాం.

మీరు వెయిట్‌ చేసినందుకు సంతోషం. కానీ నేనే మీతో మాటల్లో పడి మళ్ళీ బుద్ధి తక్కువ పని చేశాను. నా హడావుడి పరుగు చూసి నెమళ్ళన్నీ ఒక్కసారిగా రెక్కల్ని ఎడాపెడా చాచేసి కూడబలుక్కున్నట్టు రివ్వున ఎగిరిపోయాయండి. దగ్గరకు పోయి చూస్తే అక్కడ కుక్క ఏదీ కనిపించలేదు. పైకి చూస్తే నెమళ్ళతోపాటు కుక్క ఆకారంలో ఎర్రని వర్ణం ధగధగా మెరిసిపోతూ కనిపించిందండోయ్‌. మీరు నమ్ముతారో లేదో. వాడు కచ్చితంగా మా గోల్డీనే. కచ్చితంగా చెప్తున్నా కదా, మా గోల్డీనే. ఇంక నేను మీతో మాట్లాడలేను. ఎందుకంటే నా వొంటికి పట్టింది చెమటో కన్నీళ్ళో నాకు తెలీదు. కాసేపు ఇక్కడే నేల మీద సేద తీరి పైకి చూస్తూ ఉంటాను. మా గోల్డీ నాకోసం తప్పకుండా వస్తాడు. మీకు ఒక విషయం తెలుసా తనను పెంచుకుంటున్న యజమానిని వదిలి కుక్కలు ఎక్కడికీ వెళ్ళవు. వస్తాడు. మా గోల్డీ తప్పకుండా వస్తాడు. కనీసం తనతో నన్ను తీసుకుపోడానికైనా వస్తాడు.   
- ప్రసాదమూర్తి 

మరిన్ని వార్తలు