ఒబీస్‌

9 Sep, 2018 00:53 IST|Sakshi

ఈవారం కథ

‘ఈ ఒక్క ముక్కతోనే ఒళ్ళు పెరిగిపోతుందా ఏం? ‘వొద్దనుకుంటూనే కళ్ళు మరల్చలేకపోతున్నాను. మరోవైపు చూస్తే, నేహ ఇంత లావు పేస్ట్రీముక్క ప్లేట్లో పెట్టుకుని సుతారంగా దానిమీద ఐసింగ్‌ నాకుతూ కన్నుగీటిందిఒక ప్లాస్టిక్‌ నవ్వు పడేసి చూపులు ముందుకు తిప్పాను.లేత క్రీమ్‌ రంగూ, తెలుపూ కలిసిన పొరలతో దట్టమైన తెల్లని ఐసింగ్‌తో మాక్రోషాట్లో తీసిన ఫొటోలాగా స్పష్టంగా కళ్ళెదురుగా ..పైనాపిల్‌ పేస్ట్రీ.... చెమ్మ తాలూకు అతిపల్చని పొర... నోట్లో అప్రయత్నంగా నీళ్ళు ఊరిస్తూ..  ఫోన్‌ మోగింది.‘ఎక్కడున్నావ్‌?’‘ఆఫీసులో’‘మరి పక్కన ఆ కేకలూ హడావుడీ ఏంటి? ఆఫీసేనా?’‘అవును, ఇవాళ రాహుల్‌ బర్త్‌డే. కెఫెటేరియాలో కేక్‌ కట్‌ చేశాడిప్పుడే’‘రాహులెవడు?’‘ఎవడేంటి ఎవడు? మొన్న మాల్‌లో కనిపిస్తే పరిచయం చేశాగా? అతనే’‘చేరి నెలైనా కాలేదు, అప్పుడే బర్త్‌డే ఇంత హంగామాగా చేస్తున్నారా?’‘ఫ్రెండ్స్‌ ఉండరా ఏంటి? సరదాగా’‘మరే, సరదా! ఇందాక ఫోన్‌ చేశాను, ఏం చేస్తున్నావ్‌? తీయవేంటి‘కట్‌ చేశాను విసుగ్గా. మళ్ళీ రింగ్‌ అవుతోంది. తీయబుద్ధి కాలేదు .

ప్చ్‌... అసలు మనుషులు ఎందుకిలాగ ఉంటారో!ఇందాక పేస్ట్రీ వైపు సాగుతూ టేబుల్‌ మీద ఆగిపోయిన చేయి ముందుకు నిస్సంకోచంగా కదిలి ప్లేటు అందుకుంది. స్పూను పక్కన పడేసి చేత్తో అందుకునిమొత్తం ముక్కని నోట్లో పెట్టుకున్నాను. హాయిగా తీయగా చల్లగా కమ్మని క్రీమ్‌ రుచితో.. వేడెక్కిన మెదడుని మనసుని చల్లబరుస్తూ... మెత్తగా పళ్ళ కింద నలుగుతూ కమ్మగా గొంతులోకి జారుతోంది.హెవెన్‌... దేవుడా! ఎన్నెన్ని రుచులు సృష్టించావయ్యా స్వామీ... నీ దుంపతెగా!జతిన్‌ మరో ప్లేట్లో చాక్లెట్‌ కేకు ముక్కలుపెట్టుకుని వస్తూ ‘కావాలా?’ అన్నాడు.‘అర్జెంట్‌గా..’ దాదాపు లాక్కున్నంత పనిచేసి చాక్లెట్‌ కేకుని మళ్ళీ మాక్రోషాట్‌  లెవెల్లో మొహానికి దగ్గరగా పెట్టుకుని చూశాను. అందంగా కనపడింది నాలాగే!బాగా బొద్దుగా ఉంది, నాలాగే! బొద్దుగా..... ఒక్కక్షణం ఆగాను.ఉహూ. గబగబా చాక్లెట్‌ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకున్నానులేచి ఫస్ట్‌ఫ్లోర్‌కేసి నడుస్తుంటే వెనక నుంచి వినపడింది‘నార్త్‌ పిల్లలు అంత సన్నగా ఎలా ఉంటార్రా‘‘మనలాగా పప్పూ నెయ్యీ పోసుకొని తినరువాళ్ళు.. ’ ఇంకెవడో జవాబు చెప్పాడు.‘వాళ్ళూ తింటారు. కాస్త ఒళ్ళొంచి వర్కౌట్లు చేస్తారు. మనోళ్ళు పెళ్ళయితేటేకిట్‌ ఫర్‌ గ్రాంటెడ్‌ రకాలు. చేసుకున్నాక చస్తాడా ఏంటి భరించక‘‘అలా ఏంలేదురా! వాళ్ళూ అంతే! పంజాబీలు చూడు, మెక్సికన్‌ గాల్స్‌ టైపు. పెళ్ళి కాకముందు మెరుపుతీగలే! పెళ్ళయ్యాక ఆలూబస్తాలే‘ ఓహో వీడు ఆన్‌సైట్‌కి వెళ్ళొచ్చాడన్నమాట. అక్కడికేదో మెక్సిక¯Œ  ఆడపిల్లలని బాగా చదివేసినట్టే.. సొల్లుకబుర్లు. వీడి నాలెడ్జ్‌ అంతా పంచాలి మనకి!వాళ్ళు మాట్లాడుకుంటున్నది నా గురించి కాదేమో గాని నాకు మాత్రం నన్నుద్దేశించే అనిపిస్తుంది ప్రతిసారీ.

ఏడిశార్లే, ఐడోంట్‌ కేర్‌ !‘లవీ... అమ్మా, మెరుపుతీగా ఆగు’ మోహిత్‌‘ప్రొడక్ట్‌ రిలీజ్‌ ఎప్పుడు?’‘ట్వెల్త్‌‘  పాలిష్‌ చేసిన గోళ్ళకేసి చూసుకున్నా. నిండు ఆరెంజ్‌ రంగు, ఎంత బావుందో! షాపర్స్‌ స్టాప్‌లో వచ్చేస్తున్నపుడు చివర్లో దొరికింది.‘మీ టీమ్‌లో ఎవరో గుర్గావ్‌ నుంచి వచ్చిందట వడోదరా అమ్మాయి, పరిచయం చెయ్యొచ్చుగా కొంచెం.అంత కుళ్ళుండగూడదు‘ఇదీ వీడిక్కావలసింది. ప్రొడక్ట్‌ రిలీజ్‌ కాదు. ఇద్దరు పిల్లల తండ్రి, బెల్టుకి ససేమిరా లొంగనని తోసుకొస్తున్న పొట్ట, ఎంత ముందుకు దువ్వినా, మొదలైపోయిన బట్టతల.అయినా సరే కొత్త పిల్లలు ఎవరైనా రాగానే పరిచయం చేసేస్కోవాలని తాపత్రయం. ఆ పిల్లలకు తను తన నాలెడ్జ్‌ నచ్చేస్తాయని బోల్డు కాన్ఫిడెన్స్‌. కాంపిటీషన్‌ ఉంటుందని భయమైనా లేదు. ముందు నుంచి ఒక ఆడపిల్ల పోతుందంటే చాలు ఏదో ఒక పాయింట్‌ మీద కామెంట్‌ చేయకుండా ఉండడు. లావనో, పొట్టనో, నలుపనో, డంబ్‌ అనో, ఈజీ ఫాలింగ్‌ అనో..!‘నీకు ఒకళ్ళు పరిచయం చేసేదేముంది’ అటుగా వెళ్తున్న ఎవరి ప్లేట్లోంచో పేస్ట్రీ ముక్క తీసుకున్నాను. ఇవాళ చాలా క్రేవింగ్‌గా ఉంది. వారం నుంచి నోరు కట్టేసుకునే ఉన్నాను. రోజూ ఆ రుచీ పచీలేని పుల్కాలతో సరిపెట్టుకుంటున్నాను. అంతకంటే నీచమైన ఆ బీరకాయ, సొరకాయ కూరలతో! ప్రపంచమంతా నిస్సారంగా కనిపిస్తున్నా సరేకె ఫెటేరియాలో రకరకాల ఐటెంలు .కార్పొరేట్‌ లంచ్‌. అటుగా వెళ్తే ఏదో ఒకటి తినేస్తానని భయం.ఇవాళ తప్పింది కాదు. నా బాక్స్‌లో పుల్కాలు నీరసంగా నిద్రపోతున్నాయేమో! అందరితో కలిసి నూడుల్స్, పూరీకూర తినేశాను.  ఎంత హాయిగా ఉందో! కడుపునిండా ఎంత తిన్నా ఒళ్ళు రాకుండా లావు కాకుండా ఉండే వరమేదైనా దేవుడివ్వాలంటే ఎన్నేళ్ళు తపస్సు చేయాలో! 

ఆ చేసినన్నాళ్ళూ నిరాహారంగా చేయాలా? ఇహ అప్పుడు ఆశలన్నీ చచ్చాక ఇక స్లిమ్‌ ఉండి ఏంలాభం? ఇష్టమైంది కడుపునిండా తినేశాక వచ్చే నిద్ర ఎంతందం? నెమ్మదిగా రెప్పల మీదికి బరువుగా తోసుకొస్తూ, సోఫా, కుర్చీ, మంచంలాంటì æతేడాలేవీ లేకుండా పక్కన కూచున్న మనిషి ఎవరైనా సరే, వాళ్ల భుజం మీద వాలి, హాయిగా !అసలు మధ్యాహ్నం నిద్రల్ని ఆఫీసుల్లో కంపల్సరీ చేయాలి. కనీసం గంట! అప్పుడే ప్రొడక్టివిటీ పెరుగుతుంది.  మరో పది నిమిషాల్లో నాకు మీటింగ్‌ లేకపోయుంటే ఎంత హాయిగా డెస్క్‌ మీద తలవాల్చి నిద్రపోదును? మధ్యాహ్నాలు నిద్రపోతే ఒళ్ళొస్తుందని ఎవరోచెప్పారు. అయినాసరే తెగించి శనాదివారాలు ఒక్క గంటైనా పడుకుందామనుకుంటే ఏదో ఒక పని పని పని!అసలందుకే కడుపునిండా తినకూడదు. గాలి  పీల్చినా వెధవది ఒళ్ళొచ్చేలా ఉందే దీన.... ‘ఆ అమ్మాయిపేరు రిచా అటగా, మొన్న దూరం నుంచి చూశాం! ఏం తింటారబ్బా గుజ్జూలు, ఎంత స్లిమ్‌గా ఉందో!‘వీడి నోరుపడ, అనేశాడు మళ్ళీ!‘మరి అంత స్లిమ్‌గా ఉన్న పిల్లతో నీకెందుకు చెప్పు పరిచయం? గణపతి బప్పాలా ఆ బొజ్జ చూసుకో ముందు!’అయినా ఆ పిల్లకు పెళ్ళి కుదిరింది‘ వాడి మొహం ఎలా ఉందో చూడకుండా ముందుకు నడిచాను. సీట్‌లో కూలబడ్డాను.  మీటింగ్‌ క్యాన్సిల్‌. ఖాళీతెరెసా వస్తోంది గునగునా! తెరెసానో, చంద్రకళనో చూసినపుడు కాస్త హుషారు వస్తుంది. నాకంటే లావు కాబట్టి ఫీలింగ్‌ బెటర్‌ అనిపిస్తుందివస్తూనే బాక్స్‌తీసి,‘అత్తమ్మ పంపింది పొద్దున! ‘ అని బొబ్బట్టు తీసి పేపర్‌ ప్లేట్లో పెట్టింది.‘ఓయ్‌! ఇప్పుడే కేకు తిని వస్తున్నా. ఇంక చాలివాల్టికి‘ అన్నానుగొల్లున నవ్వింది. ‘చల్తీ! ఎంత చేసినా ఇంతేలే మనం. ఒక్కదానికేంగాదు. తినాలె‘ అని ప్లేట్‌ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ‘‘మనం’’అట.. నన్ను కూడా కలుపుకుంది బండది.‘తెరెసా, ప్లీజ్‌ ’అంటున్నా వినిపించుకోలేదు. నిజానికి మొదటి ముక్క తిన్నందుకే పశ్చాత్తాపంగా ఉంది. దానిపైన ఇంకో రెండు పట్టించాను. ఇప్పుడీ బొబ్బట్టు.నో, వద్దు! జాగ్రత్తగా పేపర్లో చుట్టి డస్ట్‌బిన్‌లో అడుగున పడేశాను.‘ఒక గ్రీన్‌ టీ తీసుకురా, తేనె వెయ్యొద్దని చెప్పు రామూకి. లతా మేడంకంటే ఎలా చేయాలో తెలుస్తుంది’ లక్ష్మణ్‌కి చెప్పాను?పేస్ట్రీలు, కేకులు తిన్నందుకు పశ్చాత్తాపం మొదలై క్షణక్షణానికి ఇంతింతై మర్రిచెట్టులా ఊడలు దిగుతూ పెరగడం ప్రారంభమైంది.‘ఛ, ఎలాటి ఫ్రస్ట్రేషన్‌ వచ్చినపుడల్లా దాన్ని అణచడానికి స్వీట్లు తినడం ఎలా అలవాటైంది నాకు?  హాస్టల్లో ఉండి చదివేటపుడు ఎగ్జామ్‌ టెన్షనూ, చదువు టెన్షనూ చాక్లెట్లు తింటే తగ్గుతుందని ఒక పిచ్చినమ్మకం.  ఇంటర్నెట్లో ఇలాంటి పనికిమాలిన సలహాలు భలే ఆకట్టుకుంటాయి

అందులో నిజముందాలేదా అనే సంగతి తర్వాత. ముందు చాక్లెట్‌ తినాలి. అలాగే పట్టుకుని ఉంటుంది వెధవ అలవాటునాలుగవుతుండగానే లేచి బయటపడ్డాను. లక్ష్మణ్‌ని పిలిచి, సాయంత్రం బండి ఇంటికి తీసుకు రమ్మన్నాను. నడిచివెళ్తా ఇవాళ. ఇందాక తిన్నది కొంతైనా కరిగించాలి.మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి నడిచి వెళ్ళాను. శరీరానికి కాస్త కష్టమైనా మనసు తేలిగ్గా అనిపించింది.పిండికలిపి, నాకోసం కీరాలూ, టమాటాలు కట్‌చేసి పెట్టుకున్నాను.‘పుల్కాలా మళ్ళీ? నీడైటింగ్‌తో మా ప్రాణాలు తీస్తున్నావ్‌. ఆ సొరకాయ కూర కాకుండా ఇంకేదైనా చెయ్యి. ఆలూకూర ‡చెయ్యి ఇవాళ. కొంచెం రైస్‌ కూడా ఒండు! అసలు నీ డైటింగ్‌ వంటలు నువ్వు చేసుకో. మాకెందుకు ఈ బలాత్కారం? ‘ఒక్కొక్కరికీ ఒక్కోరకం వండాలంటే ఎంతశ్రమో కనీసం ఊహలోనైనా తెలీదేమో!చపాతీలు చేసి నూనెవేసి కాల్చాను
స్నానం, వంట అయ్యాక ఏవిటో కేకుకి ప్రాయశ్చిత్తం చేసుకున్న ఫీలింగ్‌ వచ్చి, బరువు తగ్గినంత ఆనందం వచ్చిపడింది.నాలుగు కీరా ముక్కలూ, ఒకకప్పు టమాటా జ్యూసూ తాగి పడుకున్నాను. అర్ధరాత్రయ్యే సరికి ఆకలితో నిద్రపట్టలేదు. చాలాసేపు దొర్లానుగాని నిద్రలేకపోతే రేపు ఆఫీసులో పని చేయలేననిపించిందిలేచిచూస్తే డబ్బానిండా చాక్లెట్లూ, టేబుల్‌ మీద అరటిపళ్ళూ!వంటింట్లో హాట్‌ ప్యాక్‌లో చపాతీలూ, ఆలూకూర.అమ్మో ఆలూ ఒద్దు. దానికంటే æచాక్లెట్లు నయం. కానీ కడుపునిండదు.పెరుగన్నం తిని, బౌల్‌ సింక్‌లో పడేసి వస్తూవస్తూ నాలుగుచాక్లెట్లు నోట్లో పడేసుకున్నాక, హాయిగా నిద్రపట్టింది. ప్రాణం ఎటుపోయిందో తెలీదు
                                          
రాత్రి అనుకున్న ప్రకారం పొద్దున్నే ఐదున్నరకి లేచి అన్నం కుక్కర్లో పడేసి, జిమ్‌కి పరిగెత్తాను. నేను వెళ్ళేసరికే మూడు ట్రెడ్‌మిల్స్‌ మీదా ముగ్గురమ్మలు కనిపించారుగుంజన్, గీత, మన్‌ప్రీత్‌ రాజహంసల్లాగా రెండుస్పీడులో నడుస్తూ కబుర్లుచెప్పుకుంటున్నారు‘రారా, చాలా రోజులైంది కనపడి జిమ్‌లో?‘ ‘సాయంత్రాలు వస్తున్నాను‘ అబద్ధం అలవోగ్గా ఆడాను.‘సాయంత్రం నేనూ వస్తున్నానే? ‘గుంజన్‌ . నేను రావట్లేదని ప్రూవ్‌ చెయ్యాలి. అదీ దీని పట్టుదల.‘ఇంట్లో పనీ అదీ అయ్యేసరికి ఎనిమిదవుతుంది అప్పుడు వస్తున్నాను‘ తగ్గదల్చుకోలేదు‘కాస్త వెయిట్‌ పెరిగినట్టు అనిపించట్లా లావణ్య? ఒకసారి థైరాయిడ్‌ ప్రొఫైల్‌ చెక్‌ చేయించుకో, ఎందుకైనా మంచిది. దాని సింప్టమ్స్‌ మిగతావి ఎలా ఉన్నా ముందు వెయిట్‌ పెరిగి తీరతాం‘ మరికొంచెం లావయ్యాన నీ మనసులో అనుమానం ఉన్నా, వెయింగ్‌ మెషీన్‌ జోలికి వెళ్ళకుండా తగ్గే ప్రయత్నాలు చేస్తూ సమాధాన పడుతున్నాను.  చాలా నీరసం వచ్చింది మన్‌ప్రీత్‌ మాటలతో!అయినా వీళ్ళుమాత్రం తక్కువున్నారా ఏంటి? ఇంకోళ్ళని నువ్వు లావయ్యావని అంటేతప్ప కడుపునిండదేమో!సైక్లింగ్‌ చేయాలనుకున్నాగాని ఆ మాటలతో గొప్ప నిరాశ వచ్చిపడింది.గుంజన్‌ అంటోంది ‘నైరే! గార్లిక్‌ బటర్‌ పొటాటోస్‌కా రెసిపీ హై మేరే పాస్‌. హోలీకే దిన్‌ బనాయా, స్వీట్‌కే సాథ్‌. బటర్‌ జ్యాదా లగ్తా హై లేకిన్, టేస్ట్‌కీ బాత్‌ కరో! హెవన్‌ యార్, మెరా సిగ్నేచర్‌ రెసిపీ!’ఇంట్లో బటర్‌ పొటాటోస్‌ కానిచ్చి ఇక్కడికొచ్చి ఒక అరగంట కబుర్లు నంజుకుంటూటైమ్‌ పాస్‌ చేయడమే కానీ అసలు సీరియస్‌నెస్సేదీ? ‘నువ్వో‘ ఎవరో అడిగారు నా లోపల్నుంచి.

‘నేనేంకాదు‘ మొహంపగిలేలా జవాబుచెప్పి పెడలింగ్చేయడం మొదలుపెట్టాను. ‘వెయిట్‌ పుటాన్‌ చేసినట్టులేదూ లావణ్య? ‘పదేపదే గుంజన్‌ మాటలు వినపడుతున్నాయిపదినిమిషాలు చేసేసరికి ఉత్సాహం పూర్తిగా చచ్చింది. అయినా ఇవాళ ఆఫీసుకు పెందలాడే వెళ్ళకపోతే కష్టం. లక్ష్మణ్‌ బండి తీసుకు రాలేదు రాత్రి.ఆమాట గుర్తొచ్చేసరికి గుండెగుభేలుమంది. నడిచెళ్లాలా? అమ్మో నావల్లకాదు. గబగబా సైకిల్‌ దిగాను.‘నైరే! జలేబీమే జిత్‌నా భీ రెహెనేదో! కెలొరీస్‌? ఆనేదో? వెయిట్‌లాస్‌ కేలియే జాయేంగే ఫైనల్లీ‘  మన్‌ప్రీత్‌ మాటలు వినపడుతున్నాయి.హాయిగా అనిపించింది. అంతే! కెలొరీలు వస్తేరానీ! కడుపు మాడ్చుకుని ఏమిసాధిస్తాం? నేను ఏమీ తినకుండానే బరువు పెరిగిపోతున్నా, ప్చ్‌నిజంగానే థైరాయిడ్‌ ప్రొఫైల్‌ చెక్‌ చేయించుకుంటే? జీవితాంతం ట్యాబ్లెట్స్‌ వేసుకోవాలంటారేమో?వెయిట్‌లాస్‌ ట్రీట్‌మెంట్‌కి బరువు గ్యారంటీగా తగ్గుతారంటే ఈ కష్టాలుపడలేక అదీ ట్రైచేశానాయెఏవిటో వేడివేడి హాట్‌ ప్యాచ్‌లుఒళ్ళంతా చుట్టి పడుకోబెడతారు ఒకగంట. అదొక్కటీ ఐతే బానేఉండును. రోజుకు గంట బ్రిస్క్‌వాక్‌ చేయాలి, నిమ్మకాయనీళ్ళు తాగాలి, మధ్యాహ్నం అరకప్పు అన్నమే తినాలి. రాత్రి ఒకపుల్కా మాత్రమే తినాలి‘ అని చెప్పి 30 వేలు కట్టమన్నారు.అవన్నీ చేస్తే ఎలాగూ తగ్గుతాను, బోడి ..వీళ్ళు తగ్గించేదేంటి ? టీవీలో గంటలతరబడి సెలబ్రిటీస్‌ చేత చెప్పిస్తారు ‘అక్కడికెళ్ళి స్లిమ్‌గా తయారైపోయాను. నా లైఫ్‌ మారిపోయింది’ అని గబగబా తయారైపోయాను. బాక్స్‌లో రెండు పుల్కాలు, మరో బాక్స్‌లో ఆకుకూర, బుల్లి బుల్లి టప్పర్‌వేర్‌ డబ్బాలో కీరాముక్కలు.

నడవాలంటే నావల్ల అయ్యేలాలేదు. మూడ్‌ కూడా లేదు.కారు డ్రైవ్‌ చేసే సహనం ఈ ట్రాఫిక్‌లో నాకు లేదు. నిరుత్సాహంగా ఆటో పిలిచానుప్రతిరోజూ ఇలాగే గడిచిపోతోంది .ఉదయాన్నే గ్రీన్‌టీతో మొదలుపెట్టాలని, బ్రిస్క్‌వాక్‌కో, జిమ్‌కో వెళ్లాలని, బ్రౌన్‌ బ్రెడ్డూ లేదా ఓట్స్‌ తినాలని, వారానికి రెండుసార్లయినా యోగా క్లాసుకో, జుంబాకో వెళ్లాలని . జుంబాకి డబ్బుకట్టి కూడా మానేశాను రెండుసార్లు .ఉదయం టైముండదు, సాయంత్రం ఓపికుండదు. అందరూ ఎలా వెళ్తారో మరి. వాళ్లంతా ఇంటిపట్టునుండే గృహిణులా ? గృహిణులైతే మాత్రం పన్లుండవా?పేపర్, ఫేస్‌బుక్‌ చూస్తేనే చాలు బోల్డు ఈవెంట్స్‌ కనిపిస్తాయి. 3కే రన్, 5కే రన్, నెక్లెస్‌ రోడ్లో నడక, ఎక్కడెక్కడో సినిమా క్లబ్స్, ఫొటో వాక్స్‌ .. వాటికి వెళ్లేవాళ్లంతా ఔన్సు కూడా కొవ్వు లేకుండా స్లిమ్‌గాకనిపిస్తుంటారు. బోల్డు డబ్బుండి, పనేమీ ఉండి ఉండదా వాళ్ళకి? ఇదిగో ఇలాటి తొక్కలో తీర్పులే మానెయ్యాలి. ఉత్సాహం ఉండాలిగాని ప్రతి ఈవెంట్‌కీ వెళ్లొచ్చు.మరే, ఉత్సాహం నీకొక్కదానికే ఉంటే చాలా? నువ్వు తిరిగొచ్చే సరికి ఎవరి కాఫీ వాళ్ళు కలుపుకుని తాగేవాళ్లున్నారా కొంపలో? అలాటి ఈవెంట్స్‌కి పోయి తిరిగొచ్చాక, ‘ఎలాజరిగింది ? నీ ఫ్రెండ్స్‌ ఎవరైనా వచ్చారా? కాస్త ఏదైనా తిని రెస్ట్‌ తీసుకో ఇవాళ్టికి. అన్నీ రెడీగా ఉన్నాయి. స్నానం చేసొచ్చి తింటూ ఈవెంట్‌ కబుర్లు చెప్పు‘ అనేమాట ఎప్పటికైనా వినపడుతుందా? పనిమనిషి ఉన్నాసరే, బోల్డు పని!  టిఫిన్లు, లంచ్‌బాక్సులు సర్దటం నుంచి సాయంత్రం కావలసినవి రెడీగా పెట్టుకోడం వరకూ! సరుకులు, కూరగాయలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసినా సరే.. ఆఫీసు పని , ట్రాఫిక్‌లో పడి ఇల్లు చేరేలోపు ప్లాన్లు అన్నీ అట్టర్‌ఫ్లాప్‌ అయిపోతాయి.

సెల్ఫ్‌పిటీలో భలేహాయి ఉంది. కళ్ళెమ్మట నీళ్ళొచ్చేలా ఉంటుంది. ‘నేనెంత కష్టపడుతున్నానో‘ అనుకోడంలో ఒక త్యాగం ఉందసలు.టీవీ యాడ్స్‌లో భలే చూపిస్తారు. ఆవిడ ఇంటికెళ్ళాక కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైనవి వండి, మావగారికి మందులిచ్చి, అత్తగారికి కాళ్ళునొక్కి... అబ్బా ఆ దేవతా స్త్రీలు ఎక్కడుంటారో? ఆఫీసుకు వెళ్తూనేతెరెసా కనపడింది. దుశ్శకునం! ఇదేమి స్వీట్లూ ఫ్యాట్లూ తెచ్చిందో తినడానికి... 
లంచ్‌లో టప్పర్‌వేర్‌ డబ్బా తీసి టేబుల్‌ మీద పెట్టింది. ‘సున్నుండలు చేసిందమ్మ. నీకిష్టమని తెచ్చా’ అంది.దీనికెవరు చెప్పారో నాకిష్టమని. ప్రతిదీ నాకిష్టమని తెచ్చేస్తుంది. నామీద ఇష్టానికి సంతోషించాలో, కొంచెం కూడా పర్సనల్‌ స్పేస్‌ ఇవ్వనందుకు విసుక్కోవాలో తెలీదు.నా బాక్స్‌లో పుల్కాలు, సొరకాయ కూర తింటూ నీరసంగా సున్నుండల వైపు చూశాను.‘ఒద్దులేవే, ఏమనుకోకు. బరువు తగ్గాలి. బీఎంఐ 32 ఉంది. కనీసం 26కి దిగాలి. వెయిట్‌ తగ్గాలి. కాస్త సీరియస్‌నెస్‌ మెయింటైన్‌ చెయ్యాలి. చూడు నడుం దగ్గర ఎలా ఫ్యాట్‌ వచ్చేసిందో?అసలు రుజుతాదివేకర్‌ ‘అదేప్రాబ్లెమ్‌ మీతో...’ వెనక నుంచి వినిపించింది.ఉలిక్కిపడి వెనక్కుచూశాం. నిహాల్‌ !‘మీకింకా నడుం దగ్గర టైర్లు రాలేదు. చీర కట్టుకున్నా పర్ఫెక్ట్‌గానే ఉంది. మొన్న చూశాగా, అంత ఫ్యాట్‌ ఏమీ లేదులే.’ మండిపోయింది .‘సిగ్గుందా? ఏం వాగుతున్నావ్‌ ?’ అన్నాను.నిహాల్‌ స్పూన్‌తో స్ప్రౌట్స్‌ తింటూ ‘సరిగ్గనే వాగుతున్న! ఎంతసేపూ రుజుతాదివేకర్‌ నెయ్యి తినమంది, ఫ్రూట్స్‌ తినమంది, ఫ్యాట్స్‌ తినమంది అనేదే చూస్తారుగాని ఆవిడ ఎట్ల తినమందో చూడరు. అసలు మీ లేడీస్‌కి హెల్త్‌ కాన్షస్‌నెస్‌ కంటే బ్యూటీ కాన్షస్‌నెస్‌ ఎక్కువుంటది. ముప్ఫైఅయిదు దాటినంక కూడా ఇరవైల్లో ఉన్నట్టు ఉంటరా? ఎట్లయితది? ఐడియా మంచిదే! కానీ అందుకు సిచుయేషన్‌ మీకు కోపరేట్‌ చేస్తదా లేదా చూసుకోరేంది? పెళ్లి, డెలివరీలు, ఫ్యామిలీ, చాకిరీ ఇవన్నీ మీ బాడీని పెళ్లికి ముందులాగే ఉంచుతయా? ఉంచవు. అందుకే హెల్త్‌ చూసుకోవాలి. అయినా ముప్పయి దాటాక మరీ సన్నగుంటే బాగోదు. కొంచెం బొద్దుగుంటేనే మంచిగుంటది. ఎక్కణ్ణో ఏదో ఏ మాల్యాగాడి కాలెండరో జూస్తరు. ఆ లెక్కనే ఉండాలంటరు. ఏదైనా డ్రెస్‌జూస్తే, అది మనకు నప్పుతదా లేదా..అహా ఏంలేదు. పొయ్యి కొనుడు ఏసుకునుడు. ఆమెవరో కొన్నది గాబట్టి మనమూ కొనాలె, అంతే! ఎప్పుడూ ఎవరి లెక్కనో ఉండాలె.అయినా ఎవరికో మీరు నచ్చేదేంది? మీకు మీరు ఎలా ఉన్నా నచ్చాలి. లవ్‌ యువర్‌ మిర్రర్‌ అనే కాన్సెప్ట్‌ తెలుసా? అద్దంలో మీరెలా ఉన్నా, మీకు మీరు నచ్చాలంట తెల్సా? అరె, ఎప్పుడు చూడు,  వాడికి నచ్చాలి, ఈమె లెక్కుండాలి, పార్టీలో మెరిసిపోవాలి, ఎవరి పెళ్లిలోనో మనం సెంటరాఫ్‌ అట్రాక్షన్‌ కావాలి. ఏందిది? ఎంతసేపూ ఇదేగోలా? హెల్దీగా తినండి. హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే బ్యూటీ ఉంటది తెలుసా మొహంలో?’‘అయిందా నీ బోడి ఉపన్యాసం? ఏదో గీత బోధించినట్టు ఫీలవుతున్నావుగానీ ఇక దయచెయ్యి! చంపుతాను ఇంకొక్క మాటమాట్లాడినా‘ అన్నాను కోపంగా... కిక్కిక్కీ అని నవ్వాడు. ‘నాకుతెలుసులే, నేను చెప్పినవన్నీ నిజాలని మీకు తెలుసనీ! నేను మాట్లాడితే మీకు ఇయ్యన్నీ గిల్లినట్టు ఉంటై‘ ‘పోతావా పోవా నువ్వు?‘  ప్లాస్టిక్‌ గ్లాసు విసిరేశాను.‘సరేసరే, పోతున్నలే’ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.ఇద్దరం నవ్వుకున్నాం హాయిగా.‘అంటే అన్నాడులే కానీ కరెక్ట్‌గానే అన్నాడు’ అంది తెరెసా సున్నుండ తీస్తూ! ఇదసలు స్వీట్ల దగ్గర కాంప్రమైజ్‌ అవ్వనే అవ్వదు.పుల్కాలు తినడం అయిపోవడంతో, చేయిచాచి సున్నుండ తీసుకున్నా!కమ్మని నెయ్యి వాసనతో ...అమ్మ గుర్తొచ్చేస్తోందినిహాల్‌గాడు అన్న మాటలన్నీ మాకు తెలీనివా?అమ్మ అనదూ?‘ముప్ఫయి నిండగానే ఈ కడుపు మాడ్చుకోడాలేమిటో? హాయిగా తినకుండా అలా నీరసం మొహాలేసుకుని శవాల్లాగా తయారైతే ఏం అందమనో మరీ చచ్చిపోతున్నారు! పిల్లలు పుట్టాక కూడా మెరుపుతీగలల్లే ఉండాలని అంత తాపత్రయం ఉంటే ఎలాగ? ఉజ్జోగంతో పాటు బోల్డు పన్లుంటాయి కదా; సరిగా తినకపోతే ఎలా? హెల్దీగా ఉంటే చాలదూ? ఎవరికో అందంగా కనపడాలా? ఎంతమందిని మెప్పిద్దావనో?’ బస్సుదిగి నడుస్తున్నా! మా ఆఫీసు ముందే స్టార్టింగ్‌ పాయింట్‌ కావడంతో సీటు దొరికేసింది. హాయిగా కూచున్నా.ఇంటికెళ్లి కమ్మగా అన్నం తినేయాలి. పొద్దున్న చేసిన పప్పూ, వంకాయకూర, నిన్న చేసిన గోంగూరపచ్చడి! ఉల్లిపాయలు చక్రాలుగా తరిగి పెట్టుకోవాలి వెళ్ళగానే. మంచినెయ్యి పంపమని అమ్మకి ఫోన్‌ చేయాలి.ఇంటికెళ్ళగానే పిండి కలపక్కర్లేదని తలచుకుంటేనే బోల్డు హాయిగా ఉంది.అబ్బా, ఈ నార్త్‌ వాళ్ళు రోజూ చేతులు విరిగేలా పిండి కలపడం, రొట్టెలు ఒత్తడం ఎలా చేస్తారో పాపం!

ఇంటి వీధిలోకి తిరగ్గానే ముందు వెళ్తున్న అమ్మాయిలెవరో పెద్దగానే మాట్లాడుకుంటున్నారు‘నీకు ఎంత చెప్పినా బుర్రకి ఎక్కడం లేదు. అన్నం మానేయాలి. అన్నంలో ఎంత షుగర్‌ ఉంటుందో తెలుసా? రాత్రిపూట రోజూ పప్పు తింటావు. పప్పు ప్రోటీన్, రాత్రి తినకూడదు. పుల్కాలు కాదు, అసలు రాత్రిళ్లు సలాడ్స్‌ తినాలి. నాల్రోజులు నిద్రపట్టదు. కానీ ఆ తర్వాత అలవాటైపోతుంది తెలుసా? ఎన్నేళ్లు నీకిప్పుడు?’
‘ముప్ఫైనాలుగు, అయినా అన్నం ఒక్కపూటయినా తినకపోతే ఎలాగే?’‘అదేమరి! ఈ వయసులో ఫ్యాట్‌ కూడబెట్టుకుంటే ఇంకా ముందుకు పోయాక అది కరుగుతుందా? ఇప్పుడే జాగ్రత్తపడాలి. ఒక పనిచెయ్యి. కాస్త కష్టపడి కీటో డైట్‌ ఫాలో అవు. ఈ ఏజ్‌లో బాడీ మెయింటైన్‌ చెయ్యకపోతే ముందుముందు ఎంతకష్టం! చీరకట్టుకున్నా, ఏ డ్రెస్‌ వేసుకున్నా చక్కగా ఉండాలి. మొన్న కిట్టీపార్టీలో చూశావుగా, అసలు ఒక్కొక్కరు ఎలా ఉన్నారని? కాస్త నోరుకట్టేసుకుంటే ఏమీ చావంలే! లేదంటే నలభై రాకముందే అమ్మమ్మల్లా తయారైపోతాం. ఇప్పటికే ప్రతి అడ్డమైన వెధవా అడ్వాంటేజ్‌ తీసుకుని ఆంటీ అనేస్తున్నాడు. పొద్దున్నే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ కాస్త నీళ్ళలో కలుపుకు తాగు.బ్యాగులో బాదంపప్పు పడేసుకుని ఉంచు. గ్రీన్‌టీలో తేనె తగ్గించు. ఏమీ చేయనంటే ఎలా?’ఆటోమేటిగ్గా నా నడక స్లో అయిపోయింది. అడుగులు పడనని మొరాయిస్తున్నాయి. మెదడులో ఆలోచనలు గబగబా చిక్కుముళ్ళు పడిపోతున్నాయి.ఇంటికెళ్లి గబగబా పిండి కలపాలి. కీరాలు ఉన్నాయా ఫ్రిజ్‌లో? పోనీ ఇవాళ్టి సలాడ్‌ తినేస్తేనో?\రేపు బద్ధకించకుండా గుంజన్‌ వాళ్ళు రాకముందే లేచి జిమ్‌కి వెళ్లిపోవాలి.రైస్‌ మానేయాలి. అవును మానేయాలి ... గ్రీన్‌ టీ అయిపోయింది, తెచ్చుకోవాలి. తేనె? ఒద్దు ఒద్దు తేనెవద్దు. ఒట్టి గ్రీన్‌ టీయే తాగేస్తాను. 
సుజాత వేల్పూరి 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు