మా ఆయన అపరిచితుడు

19 May, 2019 00:51 IST|Sakshi

ఈవారం కథ

‘‘గుర్తుంది కదా...వచ్చే నెల్లో మా శ్రీదేవి కూతురి పెళ్లి. ఆదివారం నలుగు వేళకి మనం అక్కడుండాలి. అసలే తిరుపతి... ఆపై శనివారం ప్రయాణం.. ఇప్పుడు బద్ధకించి... చివర్లో టేక్సీలు మాట్లాడి బడ్జెట్‌ పెంచేయకుండా.. కాస్త మెలకువలో ఉండి తొందరగా రైలు టికెట్లు బుక్‌ చేసేయి... స్లీపర్‌ చాలు.. ఎటూ రాత్రి ప్రయాణమే కద, ఎండాకాలమే అయినా హాయిగా వెళ్లిపోవచ్చు..’’ కేరేజీ సర్దుకుంటూ ఏకబిగిన మాట్లాడేస్తున్న నాకు, పేపర్‌ చదువుతున్న ఆయన భంగిమ చూసి... అసలు నా మాటలు వింటున్నాడో లేదో అని అనుమానం వొచ్చేసింది. మొలకెత్తిన పెసరగింజల్ని నోట్లో వేసుకుంటూ ఓ క్షణం పాటు ఆయనకేసి చూసి... ‘‘ఏం వింటున్నావా.. ఇవాళ టికెట్లు అవుతున్నట్టేనా?’’ అన్నాను తేల్చుకోవడానికి.  ‘‘నాకు ఖాళీ లేదు. నువు చేసుకోవాల్సిందే’’ పేపర్లోంచి తలతిప్పకుండా చెప్పేశాడు.‘‘అంత లావు పనేం ఉందీ... రిటైరైన కాణ్నించీ ఊరుమ్మడి జనానికీ పనులన్నీ చేసి పెడుతూనే ఉన్నారుగా...’’ యథాలాపంగానే అన్నాను. దానికి జవాబుగా కాదుగానీ.. విసురుగానే మరో మాట వచ్చింది.. ‘‘ఇదిగో పెళ్లికి నేను రావట్లేదు. నువ్వొక్కదానివే వెళ్లాలి...’’ గాభరా పడ్డాను. నా మాటల్తో  నొప్పించానా?  మా మధ్యలో ఆ మాత్రం దెప్పిపొడుపులు కొత్తేం కాదు. ప్రతి దెప్పిపొడుపునూ సరదాగానే తీసుకునే మనిషి, ఇవాళ ఇంత చిన్న మాటకు నొచ్చుకున్నాడని అనుకో బుద్ధి కావడం లేదు. ‘నొచ్చుకున్నారా’ అని నేరుగా అడిగితే.. ఇంకాస్త బెడిసికొడుతుంది గనుక... వాలుకుర్చీలో ఉన్న ఆయన దగ్గరికెళ్లి భుజం మీద చేయేసి... ‘‘నువు తోడు రాకుండా ఎక్కడికైనా వెళ్లినదాన్నేనా... నాకు చేతకాదులెమ్మని బిడాయించుకుంటున్నావు... ఇదిగో బోల్డంత బతిమాలేస్తాను. ఇవాళ కాపోతే రేపైనా కాస్త ఆ టికెట్ల పని చూడాలి...’’ అని అర్థిస్తున్న భంగిమలో కాస్త ఆకట్టుకునేలాగానే అడిగాను. కానీ ఫలం లేదు. ఆయన నా వైపు నింపాదిగా  చూసి... ‘‘నేను రావడం లేదండీ... మీరే బుక్‌ చేసుకోండి. మీరే ప్లాన్‌ చేసుకోండి’’ అంటూ వీలైనంత ముక్తసరిగా చెప్పాడు. 

లోపల ఏదో ఉంది. ఏంటో అంతుబట్టడం లేదు. మొన్నమొన్నటిదాకా బాగానే ఉన్నాడు.  ఈలోగా ఏమైందో అర్థం కావడం లేదు. ఏదో అయిందన్నంత వరకు వాస్తవం. కానీ ఇలా పీటముడివేసుకుని ఉన్నప్పుడు మనం పొడిగించి హితం లేదు. అప్పుడప్పుడూ నా కిది మామూలే. మరోవైపు ఆఫీసుకు టైమైపోతోంది. అలాగని తలెగరేసినట్లుగా కాకుండా... ‘‘సాయంత్రం వచ్చి నిన్ను మరింత బతిమాలుకుంటాన్లే’’ అని మాత్రం అనేసి కేరేజీ పుచ్చుకుని వెళ్లిపోయాను. కానీ ఆయన ఎందుకిలా భీష్మించుకున్నాడో తెలుసుకోవాలనే దేవులాట మాత్రం నన్ను వీడలేదు. మా అమ్మల కాలంలో, ఏదో చాకలి పద్దు రాసుకోగలిగినంత వరకు ఆడాళ్లు చదువుకుంటే చాలని అనేవాళ్లుట. ఇవాళ్టి రోజుల్లో ఏదో టికెట్లు బుక్‌ చేసుకోవడమూ, క్యాబ్‌లు పురమాయించడమూ, బిల్లులు చెల్లించడమూ వరకైనా కంప్యూటర్‌ జ్ఞానం అందరికీ అవసరం అయిపోయింది. డబులెమ్మే చేసి... గ్రూప్స్‌ పాసై ఉద్యోగం చేస్తున్న నాక్కూడా ఆ పాటి తెలిసి ఉండాల్సిందే. కానీ...ఆఫీసులో పనికి అవసరమైనంత మేరా సర్కారు వాళ్లు బలవంతాన నేర్పించారు. కిందామీదా గల్లంతయిపోతూ... ఆ పని నడిపిస్తూనే ఉన్నాను. కానీ కంప్యూటరు మీద ఇతరత్రా లౌకిక వ్యవహారాలను నడిపించే నేర్పు మాత్రం పట్టుబడలేదు. ఏముందండీ ఇదంతా చాలా సింపుల్‌ అంటుంటారు కొంతమంది. కానీ నేనెప్పుడూ ఆ జోలికి వెళ్లలేదు. సాధారణంగా ఈ పన్లన్నీ ఆయన చూసుకుంటూ ఉంటాడు. డబ్బు లావాదేవీ ప్రతిదీ కంప్యూటరు మీదుగానే జరగాలంటాడు. చెబితే నవ్వుతారు గానీ... చెత్త తీసుకెళ్లే మునిసిపాలిటీ వాడికి నెలనెలా యిచ్చే యాభయ్యీ తప్ప.. పాలవాడికీ ఇంట్లో పనమ్మాయికీ కూడా నెలమొత్తాలు కంప్యూటర్లోనే చెల్లించేస్తుంటాడు. అవసరానికి ఊర్లకు వెళ్లాలన్నా, ఏడాదికోమారు సినిమాకు వెళ్లాలన్నా, వెచ్చాలు కొనాలన్నా.. అన్నీ కంప్యూటరు చెల్లింపులే. కాకుంటే క్రెడిట్‌ కార్డు గోకుతారు. దాని ముడుపును కంప్యూటర్లో కట్టేస్తాడు. 
పిల్లలిద్దరూ బయట సెటిలైపోయారు. వారి రాకపోకల గురించి మాకు ఖాతరు లేదు.

మా ఇద్దరి బతుకును చూసుకోవడానికే, ఊపిరి సలపనంతగా రోజులు గడిచిపోతున్నాయి. మా రోజువారీ పనుల్లో ఏ అవసరానికీ ‘అయ్యో పిల్లలు దగ్గర్లో లేరే’ అనే ఆలోచన లేకుండా.. బండి నడుస్తోంది. కుంటుంబం సాగడంలో– ‘నాకు చేతనైన పనులు నావీ... ఆయనకు చేతనైన పనులు ఆయనవీ’ అనే అప్రకటిత ఒడంబడిక ఒకటి ఉన్నట్లుగా మా వ్యవహారం నడుస్తుంటుంది. ఇప్పుడైతే ఇంకా చోద్యం. ఆయన రిటైరై ఏడాది అయింది. గవర్నమెంటు కొత్తగా పొడిగించిన గడువును కూడా కలుపుకుంటే రిటైర్‌ కావడానికి నాకింకా ఎనిమిదేళ్ల సర్వీసుంది. ఈ ఏడాదిగా ఆయనకు వ్యాపకం తగ్గింది. సాయంత్రం క్లబ్బులు కాదు కదా.. ఉదయం వాకింగ్‌ కు వెళ్లే దురలవాటు కూడా లేని మూలవిరాట్టు మా ఆయన. పొద్దున్లేచి రెండు గంటలపాటూ తిథివారనక్షత్రాల సహా పేపరు చదివేయడం... నేను ఆఫీసుకెళ్లిపోయాక ఒంటరిగా ఇంట్లో కూర్చుని పుస్తకాలు చదువుకుంటూ... పాతాకొత్తా నానా చెత్త సినిమాలన్నీ చూస్తూ గడపడం ఆయన వ్యాపకం. ఈ సందిట్లో చుట్టాలు, స్నేహితులూ అయితే పర్లేదు.. పరిచయస్తుల్లో ఎవరికి ఏ అవసరం వొచ్చినా తగుదునమ్మా అని ముందుంటాడు. వాళ్ల కరెంటు బిల్లు చెల్లింపులు, వాళ్లకు రైలు టికెట్లు బుక్‌ చేయడాలూ.. ఇలా ఇంట్లో కంప్యూటరు ముందు కూర్చుని మినీ మీ సేవ కేంద్రం నడుపుతుంటాడు.  

అలాంటి పెద్దమనిషి... శ్రీదేవి కూతురు పెళ్లికి వెళ్లడానికి టికెట్లు బుక్‌ చేయమంటే పెడసరం మాటలంటాడా? పైగా నేను రాను.. నువ్వే వెళ్లు అంటాడా? నేను ఒంటరిగా ఎప్పడూ ఎక్కడికీ వెళ్లిన దాన్ని కాదనేగా ఆయన పొగరు. చూస్తా చూస్తా సాయంత్రం ఇంటికెళ్లాక మొత్తం దించి పారేస్తా. ... ఈ ఆలోచనల్లో ఉండగానే ఆఫీసు వచ్చేసింది. ఆఫీసు సీట్లో కూచోగానే కాస్త రిలాక్స్‌ అయి ముందుగా శ్రీదేవికే ఫోన్‌ చేశాను. ‘మా ఆయన్తో ఏమైనా గొడవ పెట్టుకున్నావా..రీసెంట్‌ గా’ అన్నాను ఫోనెత్తగానే. అది మాలో ఆఖరిది. మా అందరిలోకి చాలా షార్ప్‌. ఒక్క మాటతోనే సాంతం గ్రహించేసినట్టుగా... ‘ఏంటే ఇలాంటి స్కెచ్‌ వేసి పెళ్లి ఎగ్గొడదామని అనుకుంటున్నావా? తాట తీస్తా... నీదీ మీ ఆయన్దీ’ అంది. నేననుకున్నదేమీ లేదనిపించింది. ‘ఎందుకలా అడిగా’వని అది గుచ్చి గుచ్చి అడుగుతున్నా పట్టించుకోకుండా... టాపిక్‌మార్చి పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయని కాసేపు వాకబు చేసి.. ఫోన్‌ పెట్టేశాను. మరి మా శ్రీవారు హఠాత్తుగా స్టయిలు మార్చి.. ఎందుకిలా భీష్మించుకున్నట్టు. ఏదో మూడ్‌ పాడై ఉంటుందిలే.. సాయంత్రం ఇంటికెళ్లాక చపాతీలోకి టమోటా పప్పు బదులు ఆలూ కూర చేసి పెడితే చాలు.. ఐసై పోతాడు. అసలే అల్ప సంతోషపు ప్రాణి.. అని నాకు నేనే సర్ది చెప్పుకుని.. ఆనక పన్లో పడిపోయాను.

‘‘ఇవాళ కాస్త లేటయ్యేలా ఉంది’’ అన్నాను ఫోన్చేసి. ‘‘ఓకే ఓకే’’ అన్నాడు ఎప్పటిలాగానే.ఇంటికి చేరగానే చపాతీలోకి ఆయనకిష్టమైన ఆలూకూర చేసేసి.. ఇంప్రెస్‌ చేసి.. టికెట్లు బుక్‌ చేయించుకోవాలని అనుకుంటూ.. బస్‌ దిగాక, సందు చివర కొట్టులో ఆలూతోపాటు కొన్ని దినుసులు కొనుక్కుని ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నరయ్యింది. అలా ఆపసోపాలు పడి వచ్చిన నాకు ఇంటికి రాగానే షాక్‌ తగిలినట్లయింది. ‘‘త్వరగా స్నానం ముగించి వచ్చేయ్‌... టిఫిన్‌ రెడీగా ఉంది. తినేద్దాం’’ అన్నాడు. ‘‘లేటవడం నిజమే గానీ.. వచ్చాక పది నిమిషాల్లో చేసేస్తా కదా. ఆ భాగ్యానికి స్విగ్గీ వాణ్ని మనం పోషించాలా’’ అంటూనే.. లోపలకు వచ్చిన నాకు హాట్‌ బాక్స్‌ లో చపాతీలు, గిన్నెలో కూర కనిపించాయి. తనే చేశాడా? నా సామ్రాజ్యంలోకి ఎవరో చొచ్చుకు వచ్చేస్తున్నట్టు అనిపించింది. తనకు వంట తెలుసు. చిన్నప్పుడు చేసేవాణ్ననీ, బ్యాచిలర్‌గా బతికిన రోజుల్లో కూడా స్వయంపాకమేననీ చెప్తుంటాడు. ఎప్పుడైనా బతిమాల్తే నాక్కాస్త సాయం చేయడం తప్ప.. ఇన్నేళ్ల సంసారంలో ఎన్నడూ ఆయన చేతివంట రుచెరగను. ఆశ్చర్యమూ అనిపించింది. నిజానికి పెళ్లయిన కొత్తల్లో కాస్త ప్రయత్నించాడు గానీ.. అదేదో నా సామ్రాజ్యం అన్నట్టుగా వంటింట్లోకి అడుగుపెట్టనివ్వకుండా నేనే అడ్డుకున్నాను. ఆ తర్వాతే నాకు ఉద్యోగమొచ్చింది. అయినా రెండు పనులూ నాలుగు చేతులా చేయడమే అలవాటైంది. కూరగిన్నెలో వేలుముంచి, నోట్లో పెట్టుకుని చప్పరించాను. పరవాలేదు. కూర చేయడం మాత్రమే కాదు... ఎన్నడూ లేనిది ఈ మనిషి, సందు చివరి దాకా వెళ్లి ఆలూ తెచ్చుకుని మరీ చేశాడంటేనే తెగ ఆశ్చర్యంగా ఉంది నాకు. 

నేను డ్రెస్‌ మార్చుకున్నాక.. ప్లేట్లలో సర్దుకుని తనకొకటి ఇచ్చి, పక్కనే కూర్చుని ‘‘నువ్వే చేశావా’’ అడిగాను. గర్వంగా నవ్వాడు. బుగ్గ చిదిమి ముద్దు పెట్టుకుని ‘‘మా బాగా చేశావ్‌’’ అన్నాను. ‘‘థేంక్యూ’’ అన్నాడు సిగ్గు అభినయిస్తూ. ‘నా’ పనులు చేయమని అడిగినప్పుడు మొండికేస్తున్నాడే తప్ప మా మధ్య ఇలాంటి సరదాలు, సరసాలు అన్నీ ఎప్పటిలా నిండుగా ఉన్నాయి. అదే నాకు అర్థం కావడం లేదు. అందరి పనులూ చేసి పెడుతుంటాడు. నేను మాత్రం ఏది అడిగినా ‘నాకు కుదర్దు’ అంటాడు. పైగా ‘నువ్వేం వేలిముద్ర దానివి కాదు కదా...ఆ పాటి పనులు నేర్చుకోలేవా?’ అంటూ అదనంగా దెప్పిపొడుపు కూడా. సినిమాకెళ్దాం అంటే టికెట్లు నువు బుక్‌ చేస్తే వొస్తానంటాడు... బయటికెళ్దాం అంటే క్యాబ్‌ నువ్వే బుక్‌ చేయాలంటాడు.. ప్రయాణాలకు టికెట్ల సంగతి సరేసరి. ఆ మధ్య నాల్రోజులు వరుసగా సెలవులొచ్చేసరికి చిన్న ట్రిప్‌ వెళ్లాం. ఎక్కడికెళ్లాలనే దగ్గరినుంచి ఎలా వెళ్లాలి ఎక్కడ బస అనే వరకు సమస్తం గూగుల్‌ చేయించి...రూట్‌ మ్యాప్, ఏర్పాట్లు అన్నీ నాతోనే చేయించాడు. కంప్యూటరు ఎదురుగా నన్ను కూర్చోబెట్టి, నా పక్కన తను కూర్చుని! 

ఈ వ్యవహారం మొత్తం నాకు అంతుబట్టకుండా తయారైంది. ఇదివరకు ఇలా కాదు. ఎప్పుడు ఏ అవసరం వొచ్చినా తానే ముందుండి, అన్నీ ప్లాన్‌ చేసి.. అన్ని బుకింగ్‌ లూ ముగించి.. పక్కా ప్లాన్‌ తో సిద్ధం చేసేసేవాడు. బిల్లుల చెల్లింపులూ ఆన్‌లైన్‌ కొనుగోళ్లూ లాంటి సమస్త వ్యవహారాలూ అసలు జరుగుతున్నాయో లేదో మనకు తెలియకుండా పూర్తి చేసేస్తుండేవాడు. ఇప్పుడు ఈ లంపటం మొత్తం నాకు తగిలిస్తున్నాడు. ఈ తేడా అంతా అయిదారు వారాలనుంచే... ఆ మధ్యన నేను ఆయన నొచ్చుకునేలా ఏమైనా చేశానా? అని నన్ను నేను కొన్ని వందల సార్లు ప్రశ్నించుకున్నాను. జవాబు చిక్కలేదు. ఎందుకిలా వ్యవహరిస్తున్నాడో అర్థం కావడంలేదు. ఆయనతో నాకంటూ పని పడనంత వరకూ జీవితం చాలా హాయిగా, సరదాగానే ఉంటుంది. బజార్నించి ఇది తెచ్చిపెట్టండీ అంటే చాలు.. కుదరదనేస్తాడు. నేను కొంత కించపడి, నా అంత నేను తెచ్చుకున్నాక కాసేపటికి మళ్లీ సర్దుకుంటూ ఉంటాను. రోజులు నిమ్మళంగానే గడుస్తున్నాయి.

ఓ రోజు ఆఫీసులో ఉండగా పద్మజక్క ఫోను చేసింది.‘‘ఏం రమా మీ ఆయన దేశంలో లేడా? రెండ్రోజుల్నుంచీ ఫోను స్విచాఫ్‌ వస్తోంది...’’ అంది. నిజానికి ఆ పాయింటు నేను కూడా గుర్తించలేదు. వేరే ఊర్లకు వెళ్లినప్పుడు తప్ప ఆయన మొబైల్‌కు కాల్‌ చేసే అవసరం నాకు అంతగా ఉండదు. రెండ్రోజులుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అది మోగడం నేను విన్లేదు గానీ.. స్విచాఫ్‌ చేసేసాడని అనుకోలేదు. 
‘‘ఏముందక్కా నీకూ నాకూ నెలకోసారి అయితే మూడురోజులుంటుంది. ఆయనకు నెలలో ఎన్ని సార్లు అవుతుందో తెలీదు... అయ్యాక ఎన్ని రోజులుంటుందో తెలీదు..’’ అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం.కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక ‘‘ఇంటికెళ్లాక ఓసారి ఫోన్‌ చేయించు’’ అంది.దొరికాడు. రెండ్రోజులుగా ఫోను కూడా వాడకుండా షెల్‌లో కూర్చుని గుడ్లు పొదుగుతున్నాడన్నమాట. ఇవాళ పద్మజక్కతో మాట్లాడకుండా ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాను. పద్మజక్కంటే మా ఆయన ఎలిమెంటరీ స్కూల్‌ క్లాస్‌మేట్‌. మా ఊరి దగ్గర చిన్న పల్లెలో ఉంటుంది. వాళ్ల ఆయన పోయాక ఉన్న ఒక కూతురికి పెళ్లి చేసి పంపేసింది. పల్లెలోనే చిన్న ఇల్లు ఉంది. కూతురికి పెళ్లి చేసినప్పుడు దాన్ని అమ్మి కట్నం కింద ఇచ్చేయాలని అనుకుంది. అవతలి వాళ్లు కూడా దానికి ఆశపడ్డారు. ఇల్లమ్మేసి మా ఇంట్లోనే ఉండిపొమ్మని అక్కకు ఆఫర్‌ ఇచ్చారు. కానీ మా ఆయనే అడ్డం పడ్డాడు. ఎటూ పద్మజ పోయాక అది మీకే దక్కుతుంది. ఉన్నంత కాలమూ తను అక్కడుండాల్సిందేనని పట్టుబట్టాడు. పెళ్లి సంబంధం ఆయన చూసిందే. వాళ్లను కన్విన్స్‌ చేశాడు. అలా పద్మజక్క పల్లెలోనే మిగిలిపోయింది. వ్యాపకమూ, తెరువూ ఉండాలని ట్యూషన్లు చెబుతుంటుంది. ఆ చిన్న ఊళ్లో ట్యూషన్లు చెప్పుకుంటే ఏమొస్తుంది? ఎటూ కాస్త పింఛనొస్తుంది గనుక..గుట్టుగా బతికేస్తుంటుంది. ఇంటికెళ్లేసరికి... ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. ‘‘పద్మజక్క ఫోన్చేసింది’’ అన్నాను. ఇప్పుడు తన ఫోన్‌ ఆన్‌ చేయకపోతాడా అనుకుంటూ. ‘‘ఏదీ నీ ఫోనిలా ఇవ్వూ..’’ అంటూ నా చేతిలోంచి తీసుకుని, ఫోన్చేసి ‘‘చెప్పు పద్మజా’’ అన్నాడు.ఫోనెందుకు స్విచాఫ్‌ చేశావని అడిగినట్లుంది. ‘‘అది కాస్త రిపేర్‌ వచ్చిందిలే.. రెండు మూడు రోజుల్లో బాగైపోతుంది’’ సంజాయిషీ చెప్పుకుంటున్నాడు. నాకెప్పుడూ  మహా ఆశ్చర్యం వేస్తుంటుంది. ఈయన నెలలో ఎన్ని సార్లు ఇలా ఫోను చెడిపోయిందనే అబద్ధం చెప్పినా ఆయన ఫ్రెండ్స్‌ ప్రతిసారీ దాన్ని నమ్మినట్లే కనిపిస్తుంటారు. వాళ్లలో ఎవరూ అంత అమాయకులు కాదు. కానీ ఒక్కసారి కూడా ‘కథలు కట్టిపెట్టవోయ్‌’ అనరు. డెబ్భయివేలు తగలేసి కొనుక్కున్న ఫోను ఇలా తరచుగా ఎందుకు చెడిపోతుందని గానీ, అన్ని సార్లు చెడిపోయే ఫోనుని మార్చవచ్చుకదా అని గానీ అనరు. అవతలినుంచి అక్క గొంతు కూడా వినిపిస్తూనే ఉంది. ‘‘పది రోజుల్నుంచీ టౌనుకు వెళ్లడం కుదరడం లేదు రవీ..’’‘‘ఒంట్లో బానే ఉంటోందా?’’‘‘అబ్బెబ్బే ఆ ఇబ్బందేం లేదు గానీ.. కరెంటు బిల్లింకా కట్టలేదు..’’ సాగదీస్తోంది. ‘‘నేను కట్టేస్తాలే..’’‘‘సర్వీస్‌ నెంబరు మెసేజీ పెట్టనా..’’‘‘నా డైరీలో ఉందిలే... రేపుదయాన్నే కట్టేస్తా. పాపెలా ఉందీ... మనవరాలితో మాట్లాడుతున్నావా..’’ అని కుశలాలు ఆరా తీసి ఫోను పెట్టేశాడు. ఖచ్చితంగా రేపు బిల్లు కట్టేస్తాడు. నేను ఇలాంటి సందర్భంకోసమే ఎదురుచూస్తున్నా.. ఆయన వాలుకుర్చీకి ఎదురుగా బాసింపట్టు వేసుకు కూర్చున్నా! ‘‘ఇప్పుడు నాకు చెప్పి తీరాల్సిందే. ఏంటి సంగతి? నేను రైలు టికెట్లు అడిగితే బుక్‌ చేయవు... ప్రీమియం కట్టమంటే కట్టవు... పద్మజక్క ఫోన్‌ చేస్తే మాత్రం యుద్ధప్రాతిపదిక మీద కట్టేస్తావు.. ఏంటి సంగతి? నా పనులు మాత్రం ఎందుకు చేయవు? చెప్పి తీరాల్సిందే’’ అన్నాను.
ఆయన నాకేసి ఓ చూపు చూసి... ‘‘అదంతే. నువ్వు నా భార్యవు కాబట్టి’’ అని మళ్లీ పుస్తకంలోకి మళ్లిపోయాడు. 

‘‘ఏంటి పద్మజ మాత్రం అంత స్పెషలా... భార్య కంటె ఎక్కువగా...’’ చివుక్కున నాకేసి చూశాడు. ఆ కోపంలో, నా పెడసరపు మాట అనుచితంగా, సంకుచితంగా ఉన్నదనే స్పృహ అప్పటికి నాకు లేదు. తనే సంబాళించుకుని, నెమ్మదించి...‘‘పద్మజ ప్రతిసారీ అడగదు. రెండ్రోజులుగా ఫోను ట్రై చేసి మరీ కరెంటు బిల్లు కట్టమన్నదంటే.. తన దగ్గర ఇప్పుడు డబ్బు లేదని అర్థం.. ఆ మాట చెప్పలేకపోతోంది. నేను అడగడమూ బాగుండదు. అన్నిటినీ మించి నా ఫ్రెండు..’’ అన్నాడు.‘‘అయితే నన్ను కూడా ఫ్రెండ్‌ లిస్టులో పెట్టుకో’’ విసురుగా తన చేతిలో పుస్తకం లాక్కుని అన్నాను. తేలిగ్గా నవ్వేసి ‘‘ఆ లిస్టులో మొదటి పేరు ఎప్పటికీ నీదే. కానీ భార్యగా మారిపోయావ్‌ నువ్వు’’ అనేశాడు.  ఇదేం ట్విస్టు. పెపంచికంలో ఎక్కడైనా భార్య కాబట్టి ఎక్కువ ప్రయారిటీతో చూసుకునే మొగుళ్లుంటారు. ప్రయారిటీ ప్రస్తావన లేకపోయినా.. గతంలోనూ ఈయన నన్ను తన ఫ్రెండ్స్‌ తో సమానంగానే చూసుకునే వాడు. ఇప్పుడు భార్య కావడం నా తప్పు అన్నట్లుగా.. నీ అవసరాలు మాత్రం పట్టించుకోను.. అని తేల్చేయడం ఏమిటో నాకు అస్సలు అర్థం కాలేదు. పద్మజక్కకు మాత్రం ఇలా చెప్పగానే అలా పనులెందుకు చేస్తున్నాడనే చెత్త అనుమానం నాకు లేదు. ఉడుక్కుని, మాట తూలానంతే. నా విషయంలో మాత్రం.. నీ చావు నువ్వు చావాల్సిందే అన్నట్టుగా ఎందుకు తేడాగా చేస్తున్నాడో తెలియడం లేదు. ఆయన మొహంలో ఎలాంటి ఫీలింగ్‌ ఉన్నదో వెతుకుదామని తదేకంగా చూశాను. ఈ మనిషితో ఇదే ఖర్మ. కోపంగా ఉంటే తగ్గవచ్చు. అలిగి ఉంటే బుజ్జగించవచ్చు. గారంగా ఉంటే ఆడించవచ్చు. దు:ఖంగా ఉంటే ఊరడించవచ్చు. ప్రేమగా ఉంటే అనుభూతించవచ్చు. స్నేహంగా ఉంటే ఆస్వాదించవచ్చు. సంతోషంగా ఉంటే పంచుకోవచ్చు. విసుక్కుంటే తగాదా పడవచ్చు. కానీ ఎలా ఉన్నాడో తెలియకుండా అభావంగా ఉంటే ఎలా స్పందించగలం. అలా చూసి చూసి, నామీద నాకే చిరాకేసి లేచి నా పనుల్లో పడ్డాను. 

నాకు నెమ్మదిగా ఈ పనులన్నీ అలవాటు కావడంలో వింతేమీ లేదు. కాకపోతే అంతకంటె పెద్ద వింత మరొకటి ఉంది. ఆయన ఇప్పుడు చాలా తరచుగా వంట చేసేస్తున్నాడు. నాకు ఆఫీసునుంచి లేటైన ఏ సందర్భంలోనూ ఇప్పుడు మేం జై జొమాటో అనడం లేదు. వంటొక్కటే కాదు.. పని ఒత్తిడి ఉండే సందర్భాల్లో బట్టలు ఉతికేస్తున్నాడు. ఇల్లంతా శుభ్రంగా పెట్టేస్తున్నాడు. నా వంతులో నేను బాగా ముదిరిపోయాను. టెక్‌ బేబీ అయిపోయానంటే నిజం. చాలా మంది ఫ్రెండ్స్‌కి ఇప్పుడు నేనే దిక్కు. ఇలాంటి చిన్నచిన్న కంప్యూటరు పనులే కాదు.. బయటకెళ్లే పనులున్నా సరే నేనే తోడుగా, గైడుగా మారిపోతున్నాను. అంతెందుకు... కుశలప్రశ్నలకు తప్ప పద్మజక్క కూడా ఆయనకిప్పుడు ఫోను చేయడం లేదు. ఏ పని ఉన్నా నాకే చెబుతోంది. తమాషా ఏంటంటే... ఆయన ఆన్‌లైన్‌ బ్యాంక్‌ అకౌంట్‌ లాగిన్‌ డీటెయిల్స్‌ కూడా నాకు యిచ్చేశాడు. ఎప్పుడైనా అవసరం పడుతుందని. అప్పట్లో ఓ రెణ్నెల్లపాటూ తెగ తిట్టుకున్నాను. అలవాటు పడడం మొదలయ్యాక ఆ అసంతృప్తి  పోయింది. 
ఈలోగా నా పుట్టిన రోజొచ్చింది. కోదండరామాలయానికి వెళ్లాం. శంషాబాద్‌ నుంచి నాలుగైదు కిలోమీటర్లు లోపలకు వెళ్తే వస్తుంది అమ్మపల్లి. అద్భుతమైన ఆలయం. నవమి రోజుల్లో తప్ప నిత్యమూ నిర్జనంగా ఉంటుందనే మాకు ఆ గుడి అద్భుతం. ఇష్టం. సీతను వెతికే ప్రయత్నంలో ఉత్తరాదినుంచి దక్షిణపు కొన వరకూ దేశమంతా తిరుగుతూ మార్గమధ్యంలో అలసి, రాముడు సతీసోదర సమేతంగా వెలసిన క్షేత్రమట ఇది. మూలవిరాట్టుల్లో భాగంగా హనుమంతుడు ఉండడిక్కడ. ప్రశాంతంగా ఉండే గుడి. ఓపిక ఉన్నంతవరకూ దర్శనం చేసుకుని..ఆవరణలో ఓ గంటసేపు కూర్చున్నాం. అప్పుడు– తన లాల్చీ పక్క జేబులోంచి ఓ కవరు తీసి నా చేతికిచ్చాడు. 

‘‘బర్త్‌ డే గిఫ్టా’’‘‘అలాంటిదేలే’’దాన్ని అందుకుని... తడిమిచూసి... అడిగాను.‘‘చెక్కా?’’ఏమీ చెప్పకుండా చిరునవ్వు నవ్వాడు. ‘‘లవ్‌ లెటరా?’’ అదే నవ్వు.‘‘లవ్‌ లెటర్ని ఇలా బ్రౌన్‌ కవర్లో ఇవ్వడమేంటి మహాప్రభూ! గులాబీరంగు కవర్లో ఇవ్వాలని ఎప్పుడూ పుస్తకాల్లో చదవలేదా?’’ కోప్పడ్డాను. తెరవబోతుండగా నా చేయి పట్టుకుని ఆపాడు. ఎందుకన్నట్టుచూశాను.‘‘ఇప్పుడు కాదు’’‘‘ఇంటికెళ్లాక ఏకాంతంలో చదువుకోనా...? అంత రసహృదయం ఉందా ఇందులో’’‘‘ఇప్పుడు కాదు. ఎప్పుడైనా, ఒకవేళ నేను ముందుగా, తుదివీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు...’’చివాల్న చెంపమీద ఓ దెబ్బ వేశాను. లాఘవంగా తప్పుకున్నాడు– గట్టిగా తాకకుండా! ‘‘గుళ్లో అలాంటి మాటలెత్తుతావా?’’ కోపంగానే అన్నాను.‘తథ్యమైన సంగతులు మాటాడ్డానికి స్థల కాల నిషేధాలెందుకు?’’నిజమే కావొచ్చు. కానీ, మనసు వికలమై ఆ కవరు బ్యాగులో పెట్టేసుకున్నాను. ‘రమా!’’బ్యాగులోంచి బీరువాలోకి వెళ్లిపోయిన కవరు. ఇవాళ తెరవాల్సి వచ్చింది. ‘‘దాంపత్యం అంటే ఏమిటి?దీనికి ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకేమాదిరి సమాధానం చెప్పలేకపోవచ్చు. అన్ని వేల కోట్ల వైవిధ్యాలున్న అనుభూతి కాగలిగింది కాబట్టే... అది ప్రపంచంలో ఎప్పటికీ అనన్యమైన బంధంగా తయారైంది. కానీ కొన్ని సందర్భాల్లో నేను ఇందులో ఒక సిమిలారిటీ గమనించాను. అది దీనికి నిర్వచనం కాదుగానీ...ఎవరూ చెప్పకపోయినా, ఒప్పుకోకపోయినా సరే.. నిర్వచనంలో ఒక భాగం  అవుతున్నదా అనిపించింది. అదే ‘ఇంటర్‌ డిపెండబిలిటీ’!ధర్మం అను, మతం అను... ముసుగు ఏదైనా.. ఎలాగైనా సరే మన వ్యవస్థలో దంపతుల్ని ఇంటర్‌ డిపెండబుల్‌గా మార్చేయడం ఒక సాంప్రదాయం అయిపోయింది. ఈ డిపెండబిలిటీ పర్యవసానాలుగా కొన్ని అసహజ పరిణామాలు కనిపించాయి నాకు. బహుశా అది నా దృష్టిలోపం కూడా కావొచ్చు. భర్త అనేవాడు చనిపోగానే... ‘నా ఎస్సెస్సీ సర్టిఫికెట్లు ఎక్కడ పెట్టాడో కూడా తెలియదే‘ అంటూ ఓ అమ్మాయి డూప్లికేట్లకు అప్లయి చేసుకుని ఆ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత.. సగం హరించుకుపోయిన జీవితాన్ని కొత్తగా ప్లాన్‌ చేసుకోవడానికి ప్రయత్నించడం ఏమిటసలు? ‘ఇబ్బందేమీ తెలియనీకుండా, నాకేం కావాల్సి వచ్చినా తనే చూసుకునేవాడమ్మా’ అనే విలాపంలో, బయటకు వ్యక్తం అయ్యేది ఆవేదనే గానీ.. కాస్త లోతుగా చూస్తే అసలామె ఎందుకంత అశక్తంగా తయారైపోయినట్లు? ఆశ్చర్యం అనిపించేది నాకు. ‘నన్ను అన్యాయం చేసి వెళ్లిపోయావే’, ‘నువు లేకుండా ఎలా బతికేదిరా దేముడా’... ఇలాంటివి చాలా విన్నాను. సహగమనం అనే వెధవాయిత్వాన్ని మనం పూడ్చిపెట్టగలిగాం గానీ... ఆ స్థాయిలో ఇలా డిపెండబిలిటీతో ముడిపడ్డ ఆవేదన ఎందుకు మిగలాలి? భార్య అలా తయారైపోవడంలో– ఉదాత్తత, పెద్దరికం ముసుగులో భర్తల అప్రకటిత కుట్ర ఏమైనా ఉంటున్నదా? అని కూడా అనిపిస్తుండేది నాకు తరచుగా!! ఏడవకూడదని, ఏడుపు వస్తే ఆపుకోవాలనీ నా ఉద్దేశం కాదు. కానీ ఆ కన్నీళ్లు ‘డిపెండబుల్‌’ సేఫ్‌జోన్‌ పోతున్నందుకు కాకుండా, ‘డిపార్ట్‌’ అవుతున్న వియోగానికి సంబంధించి మాత్రమే అయిఉండాలని నా కోరిక. ఇంకా లోతుగా వెళ్లే సందర్భం ఇది కాదు గానీ.. మరణం అంటే ఏమిటసలు? ఐహికమైన, దైహికమైన బాధ్యతలనుంచి విముక్తి కదా? అలాంటి విముక్తి ప్రదాయకమైన అద్భుత సందర్భాన్ని కన్నీటితో నింపుకోవడం ఎందుకు? ఇదివరకు చెప్పిన ‘ఇంటర్‌ డిపెండబిలిటీ’ లేకపోతే... అలాంటి కన్నీళ్లు ఆగిపోతాయి కదా... అనేది నాకు పుట్టిన ఆలోచన!

సమాజాన్ని దిద్దడానికి నేను సంస్కర్తని కాను. దిద్దే నెపం మీద బురిడీ కొట్టించడానికి బాబాను కాను. కానీ, ముందు నన్ను దిద్దుకుంటే చాలు. నాలో భాగమైన నిన్ను దిద్దుకుంటే చాలు.  అందుకే నీ నిత్య వ్యవహారాలు సమస్తం నువ్వే చేసుకోగలగాలి అనుకున్నాను. నేను భౌతికంగా లేకపోవడం వలన నీ జీవితంలో ఎలాంటి తేడా రాకూడదని అనుకున్నాను. అందుకే అలా ప్రవర్తిస్తూ వచ్చాను. ఐ యామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యూ రమా! వ్యవహారాలను సంబాళించుకోవడంలో నువ్వు నన్ను మించిపోయావ్‌! అదృష్టవశాత్తూ నాకే గనుక ముందుగా విముక్తి లభిస్తే.. ఈ కారణాల వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టే పరిస్థితి రాదని మాత్రం నమ్ముతున్నా... ప్రేమతో నీ...’’పెదవులు బిగబట్టి వెక్కడం లేదు... కళ్లనుంచి మాత్రం ధారగా కారిపోతున్నాయి. ఆ నీటి చుక్కలు పడి, కాగితమ్మీది అక్షరాలు చాలావరకు అలుక్కుపోయాయి... అసలే మా ఆయనకు సిరా పేనాతో రాసే అలవాటు. బిగియపట్టుకున్న ఆయన చేతుల్లో అప్పటికే ఆ కాగితం పూర్తిగా తడిచి, నలిగి పోయింది. విశాలమైన గదిలో మేమిద్దరమే ఉన్నాం. రెండు రోజుల కిందటే పిలిపించిన పిల్లల్ని పది నిమిషాల కిందట బయటకు పంపేశాడు. మా ఏకాంతం కోసం..., ఈ సమయంలో! ఆ తర్వాత చదవడం మొదలెట్టాడు. చదవడం పూర్తయ్యాక నా చేతిని గట్టిగా పట్టుకుని అన్నాడు...
‘‘ఇందులో రాసిందంతా తప్పు... డిపెండబిలిటీ కాదు. డిపార్ట్‌ గురించి కూడా కాదు. ఇంకా ఏదో ఉంది.. ఏదో ఉంది. అది నా మూర్ఖత్వానికి తెలియదు... మూర్ఖత్వానికి తెలియదు...’’ ముద్దగా మారుతున్న మాట నాకు స్పష్టంగా వినిపిస్తోందో లేదో అని... రిపీట్‌ చేస్తున్నాడు. ఐసీయూలో సెలైన్‌ ఎక్కుతున్న నా చేతిని– నలిగిపోయిన కాగితంతో సహా గట్టిగా పట్టుకున్న తన చేతివేళ్ల వణుకు కూడా నాకు స్పష్టంగా తెలుస్తోంది. అచేతనంగా ఉన్న కళ్లతో ఆయన్ను నేను కొత్తగా చూస్తున్నాను. నలభయ్యేళ్లుగా ఎరిగిన ఆయనలో... నాలుగేళ్ల కిందట ఒకడు కొత్తగా కనిపించాడు. ఈ గడియలో మరొకడు ఇంకా కొత్తగా కనిపిస్తున్నాడు. వాడూ వీడూ మా ఆయనలోని అపరిచితులు! తృప్తిగా ఉంది. మా ఆయనని పూర్తిగా తెలుసుకోగలుగుతున్నందుకు!ఆయన పట్టుకున్న నా చేతిమీద... తన కళ్లనుంచి రాలుతున్న నీటిచుక్కల స్పర్శ తెలుస్తోంది. కళ్లు మూసుకున్నాను.
కె.ఎ. మునిసురేష్‌ పిళ్లె 

మరిన్ని వార్తలు