గుడ్ బై న‌వీన్‌!

23 Dec, 2018 00:33 IST|Sakshi

ఈవారం కథ

మృత్యువు ఒక అజ్ఞాత మిత్రుడు. హఠాత్తుగా వచ్చి కౌగిలించుకుంటుంది. అప్పుడు మనం విడిపించుకోలేం. ఈ భూమిని ఒక శాశ్వత విడిదిగా భావించి నిరంతరం లావాదేవీల్లో మునిగి తేలే నవీన్‌కుమార్‌ చనిపోయాడు. వాట్సప్‌లో మెసేజ్‌ చూసి ఒక్కక్షణం షాక్‌ తిన్నాను. వెంటనే తేరుకుని లెక్కలేసుకున్న. ఇరవై కిలోమీటర్ల దూరం క్యాబ్‌లో వెళ్లి రావాలంటే కనీసం వెయ్యి ఖర్చు. హాఫ్‌ డే టైం. నవీన్‌తో పనేముంది? చనిపోయిన వాడి గుడ్‌లుక్స్‌ అవసరమా? వెళితే ఎవరైనా పాత ఫ్రెండ్స్‌ తగలొచ్చు. ఈ నగరాల్లో మన మొహమే మనం సరిగా చూసుకోం. ఫ్రెండ్స్‌ని చూసుకోవాలంటే ఎవడైనా చావాలి, ‘‘ఏరావస్తున్నావా?’’ ధీరజ్‌ ఫోన్‌.‘‘అదే ఆలోచిస్తున్నా’’‘‘ఏంట్రా ఆలోచించేది. ఏం రైటర్‌విరా నువ్వు. ఫ్రెండ్‌షిప్‌డే గురించి వ్యాసాలు రాయమంటే రాస్తావు. ఫ్రెండ్‌ చచ్చిపోతే ఆలోచిస్తా అంటావ్‌. ఏం తీసుకుపోతార్రా మీరంతా. వీడు చూడు నవీన్‌. లంకంత కొంప కట్టుకున్నాడు. ఈ నైట్‌ ఆరడుగుల గుంతలో నిద్రపోతాడు’’‘‘కొంచెం ఆపరా బాబూ, జర్నలిస్ట్‌ ఉద్యోగాల్లో మనం చస్తే కూడా సెలవివ్వరు తెలుసా’’‘‘సరే, నువ్వొస్తానంటే నా కారులో పికప్‌ చేసుకుంటా’’అయితే, క్యాబ్‌ ఖర్చు మిగిలిందన్న మాట. వెళితే సరి, ఫ్రెండ్‌ని ఆఖరిసారి చూసినట్టుంటుంది.

‘గున్న గున్న మామిడి..’’ పాటకి కారు కూడా ఊగుతోంది. ‘‘మనం వెళ్లేది చావుకి, పెళ్లికి కాదు... పాట మారుస్తావా’’ చిరాగ్గా అన్నాను.ధీరజ్‌ నా వైపు సీరియస్‌గా చూశాడు.‘‘డ్రైవింగ్, షేవింగ్‌ జాగ్రత్తగా చేయాలి. లేదంటే బ్లడ్డే’’ అన్నాడు.‘‘ఇప్పుడీ కొటేషన్‌ అవసరమా?’’‘‘డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు డిస్టర్బ్‌ చేయొద్దని అర్థం. అయినా వాడు నవీన్‌ చచ్చిపోతే ఈ ప్రపంచమేమన్నా ఆగిపోయిందా?  ఈ నైట్‌ మనంభోంచేయమా, మందు కొట్టమా?’’‘‘కొంచెం డీసెన్సీ అక్కరలేదా?’’‘‘ఏంట్రా డీసెన్సీ? లైఫ్‌లో పైకెదగాలని వాడెన్నెన్ని ఘోరాలు చేశాడో తెలియదా నీకు? ఇప్పుడు కూడా వాడి డెడ్‌బాడీ దగ్గరకెళ్లి, ‘అరె, నీకు ప్రమోషన్‌ వచ్చింది లే’ అంటే లేచి కూచుంటాడు. కావాలంటే పందెం’’పకపక నవ్వాడు.‘‘చనిపోయిన వాళ్ల మీద సెటైర్లు అవసరమా?’’‘‘ఏం రేపు నువ్వు చచ్చిపోవా? నేను చచ్చిపోనా? అప్పుడు బతికున్నోళ్లంతా మన మీద జోకులేసుకోరా? నీలాంటి వాళ్లంతా నెగటివ్‌ ఎనర్జీ. రెండురోజులు మీతోవుంటే మెంటలొస్తుంది. నన్ను చూడు, బ్లడ్‌గ్రూప్‌తో సహా బీ పాజిటివ్‌’’‘‘నవీన్‌ ఇల్లొచ్చేసింది. కొంచెం సీరియస్‌గా వుండు’’‘‘ఇప్పుడు నువ్వక్కడ చేసే యాక్టింగ్‌కి నంది అవార్డ్‌ ఇచ్చేయొచ్చు కదా.. ఫేక్‌ న్యూస్‌లు రాసిరాసి మనిషే ఫేక్‌ అయిపోయావ్‌’’‘‘మూసుకుని రా, పొలిటీషియన్లు కూడా నీ అంత చెత్తగా మాట్లాడరు.’’

నవీన్‌ది ఇండిపెండెంట్‌ హౌస్‌. గేటెడ్‌ కమ్యూనిటీ. ఇంటి ముందు షామియానా, కుర్చీలు. భగవద్గీత వినిపిస్తోంది. వాడి కారు మిలమిల మెరుస్తోంది. దాని మీద కాసింత దుమ్ము పడనిచ్చేవాడు కాదు.డ్రైవర్‌ని చెడామడా తిట్టేవాడు. సాయంత్రం వాడి మీద అందరూ తలా ఇంత గుప్పెడు మట్టి చల్లుతారు. కోట్లు లెక్కపెట్టి అలసిపోయిన చేతుల మీద మట్టి రేణువులు పరుచుకుంటాయి. సూక్ష్మజీవులు శరీరాన్ని తినేస్తాయి.ఎవరో అటూ ఇటూ తిరుగుతున్నారు. చావు దగ్గర ఎలా వుండాలో నాకు తెలియదు. బర్త్‌డేలు, పెళ్లిళ్లయితే నవ్వుతూ వెళ్లి పలకరిస్తాం. ఇక్కడేమో అంతా గంభీరంగా వుంటారు.సంతోషాన్ని షేర్‌ చేసుకోవచ్చు. కన్నీళ్లతోనే సమస్య. ఈ మధ్య ఒకరింటికెళితే, ఆవిడ నన్ను పట్టుకుని భోరుమని ఏడ్చింది. నాకేమో ఏడుపు రాదు. కళ్లు వుత్తుత్తిగా తుడుచుకున్నా. ఆ తర్వాత నెలరోజులకి నేనో బ్యూటీషియన్‌ ఇంటర్వ్యూ కోసం వెళితే అక్కడ ఆమె కనిపించింది. అన్నీ మరచిపోయి ప్రశాంతంగా కనిపించింది. ఆరోజు ఆమె ఏడుపు చూసి, పోయిన మొగుడితో పాటు ఈమె కూడాపోతుందేమో అనిపించింది. ఏదీ ఆగదు. పోయేవాళ్లు పోతూనే ఉంటారు.ఇంట్లోకెళ్లాం. నవీన్‌ వైఫ్‌ ప్రశాంతి నన్ను చూసి కళ్లు తుడుచుకుంది. ఫ్రీజర్‌ బాక్స్‌లో నవీన్‌ నిద్రపోతున్నాడు. వాడికి ఐస్‌క్యూబ్‌లంటే ఇష్టం.విస్కీ తాగితే సోడా, వాటర్‌ ఏదీ తీసుకోడు. ఓన్లీ ఐస్‌క్యూబ్స్‌. ఒక పెగ్గు మందు గ్లాసులో పోసుకుని ఫుల్‌గా ఐస్‌క్యూబ్స్‌తో నింపేవాడు. ఇప్పుడు చల్లగా.. ఆ బాక్స్‌లో.‘‘ఉదయం ఆఫీస్‌కెళుతుండగా గుండెపోటు వచ్చింది... హాస్పిటల్‌కి తీసుకెళ్లే టైం కూడా లేదు’’ ప్రశాంతి చెబుతూ వుంది.‘‘వాడికి గుండె కూడా వుందంటావా... నిచ్చెనలెక్కడానికి ఎందర్ని ఫినిష్‌ చేశాడో వీడు’’ ఈధీరజ్‌గాడు తాగినా తాక్కపోయినా కుక్కలా ఏదో ఒకటి మొరుగుతూ వుంటాడు. వాడికి రావాల్సిన ప్రమోషన్‌ ఆ నవీన్‌ కొట్టేశాడు. అప్పట్నుంచి కడుపుమంట.వీళ్లంతా నాకు ఎంబీఏలో క్లాస్‌మేట్స్‌.జర్నలిజం మీద పిచ్చికొద్దీ నేను రిపోర్టర్నయ్యా. కంపెనీల్లో చేరి వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. నేను అద్దె ఇంట్లో వుంటున్నా. ఈ దేహమే ఒక అద్దె ఇల్లు. నవీన్‌ ఖాళీ చేశాడు. ఏదో ఒకరోజు మేమూ ఖాళీ చేస్తాం.ఎవరెవరో వస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు.‘‘ఇప్పుడంతా ప్యాకేజీ సిస్టం. పుట్టడానికి, బతకడానికి, చావడానికి అన్నీ ప్యాకేజీలే. క్రిమేషన్‌ వరకు ప్యాకేజీనే. పంతులు ఖర్చులు కూడా ఇన్‌క్లూడెడ్‌’’ నవీన్‌ బంధువు ఎవరో మాట్లాడుతున్నారు.‘‘చాలా ఎక్కువ చెబుతున్నాడు. నీ ఇన్‌ఫ్లుయెన్స్‌ వుపయోగించి చూడు. తగ్గిస్తారు’’‘‘ఏం తగ్గిస్తారు? మన బాధ వాళ్లకి వ్యాపారం.’’‘ఈ ప్రపంచంలో ప్రతిదీ వ్యాపారమే. మనల్ని మనం అమ్ముకుంటాం. లేదా ఎవరో ఒకర్ని కొంటూ వుంటాం. లాభనష్టాలు అనే పదాలపై ఈ లోకం నడుస్తుంది. ఎమోషన్స్, రిలేషన్స్‌ అన్నీ ఇవే నడిపిస్తాయి.’’అనేవాడు.ప్పుడు వాడి చివరి ప్రయాణంతో వ్యాపారం జరుగుతోంది.

మనం ఎదుటివాళ్ల వ్యాపారాన్ని గుర్తిస్తాం కానీ, మన వ్యాపారాన్ని గుర్తించం. ఇరవై ఏళ్లుగా పరిచయమున్న నవీన్‌ చనిపోతే నాకు దుఃఖం రాలేదు. క్యాబ్‌ ఖర్చుల గురించి ఆలోచించాను.ఘంటసాల గొంతు వినిపిస్తోంది.చావు ఇంట్లో ఈ భగవద్గీత వినిపించాలని మొదట ఎవడు కనిపెట్టాడో? భగవద్గీత వినపడగానే ఎవడో పోయాడని అర్థమైపోతుంది.ప్రశాంతి కళ్లు తుడుచుకుంటోంది.నిజంగా ప్రశాంతి నవీన్‌ని ప్రేమించిందా? లేదంటే ఇక్కడ దుఃఖం ఒక అనివార్యత మాత్రమేనా?‘జీవితం ఒక గేమ్‌. ఫౌల్‌ ఆడయినా సరే గెలవాలి. నాకు సెంటిమెంట్స్‌ లేవు. మనం గెలవాలంటే ఎవడో ఒకడు ఓడాలి’నవీన్‌ ఫిలాసఫీ ఇది.నవీన్‌ గెలిచాడా.. ఓడాడా?లేత పసుపురంగులోకి మారింది మొహం. చివరి క్షణాల్లో బాధని అనుభవించాడా? మృత్యువు ఎదురైనప్పుడు అతని ఫీలింగ్స్‌ ఎలా ఉన్నాయి?కలలన్నీ సునామీలో కొట్టుకుపోతున్నప్పుడు, ఏడుస్తూ వాటి వెంట పరుగెత్తాడా? పైసా ఖర్చు లేకుండా గుండెల నిండా పీల్చుకునే గాలి, కోట్ల రూపాయలిచ్చినా హృదయాన్ని తాకకుండా వుక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడుఏ మనిషయినా ఏం చేస్తాడు?జీవితంలో ప్రతిదీ ప్లాన్‌ చేశాడు. కానీ చావు వాడి కోసం వేసిన ప్లాన్‌ని కనుక్కోలేకపోయాడు.‘దేవుడు మన కోసం బ్లాంక్‌ పేపర్‌ని వదిలేస్తాడు. ప్రతిదీ మనమే రాసుకోవాలి. ఒకవేళ దేవుడు తప్పుడు రాత రాసినా సరే, మనమే కరెక్ట్‌ చేసుకోవాలి’ మిడిల్‌క్లాస్‌లో పుట్టిన నవీన్‌ ఇలాగే మాట్లాడి, ఇలాగే జీవించాడు. నిజానికతను చాలా సిస్టమాటిక్‌.తెల్లారి నాలుగుకి లేచేవాడు. వాకింగ్, యోగా, ధ్యానం, బ్రేక్‌ఫాస్ట్‌ అన్నీ ఆరుగంటల లోపే. ఏడు గంటల వరకు పేపర్‌ రీడింగ్, ముఖ్యంగా బిజినెస్‌ పేజీలు. సెవెన్‌ టు ఎయిట్‌ ఇంపార్టెంట్‌ ఫోన్‌ కాల్స్‌. ఎయిట్‌కి ఆఫీస్‌కి బయలుదేరితే వన్‌ అవర్‌ జర్నీ.తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఆఫీస్‌. రోజుకి పన్నెండు గంటలు పనిచేసేవాళ్లని ప్రతి సంస్థ ఇష్టపడుతుంది. తొమ్మిదికి బయలుదేరి, మధ్యలో ఒక పెగ్గు విస్కీ. పదకొండు గంటలకి ఇల్లు, నిద్ర, వీలైతే రోమాన్స్‌. శని, ఆదివారాలు ఏం చేయాలో నెల ముందే ఫిక్సయిపోతాయి.ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు వరకు డ్రైవర్‌ డ్యూటీలోనే వుంటాడు. అతను భోంచేశాడో లేదో ఏనాడూ అడిగేవాడు కాదు. నిజానికి ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న డ్రైవర్‌ పూర్తి పేరేంటో కూడా తెలియదు.

కష్టాలు వినడం ప్రారంభిస్తే ప్రతివాడు టన్నుల కొద్దీ కష్టాల్ని మన మీద మోపుతాడు. ఆ బరువుకి ఇక పైకి లేవలేం. సుఖపడ్డానికే ఈ భూమ్మీదకొచ్చాం. సుఖపడాలి అంతే. ఎవరూ కష్టపడకపోతే మనమెలాసుఖపడతాం?నిచ్చెన ఎక్కుతున్నప్పుడు చూపు పై మెట్టు మీదే ఉండాలి. కాలి కింద నలుగుతున్న మెట్టు మీద కాదు.అతనికి ఫిక్షన్‌ చదివే అలవాటు లేదు. కెరీర్‌ మేనేజ్‌మెంట్‌ పుస్తకాలే చదివేవాడు. నచ్చిన వాక్యాల్ని అండర్‌లైన్‌ చేసుకునేవాడు.ఇదంతా పులి మేక ఆట. నువ్వు పులివో, మేకవో నిర్ణయించుకో. పులివైతే మేకని తిను. వేటగాడి నుంచి కాపాడుకో.ఇలాంటి వాక్యాలు బాగా ఇష్టం.నవీన్‌ కొలీగ్స్‌ చాలామంది వస్తున్నారు. గంభీరంగా కళ్లు తుడుచుకుంటున్నారు. చనిపోయింది తాము కాదనే రిలీఫ్‌. వాళ్లలో ఒక అందమైన అమ్మాయి వెక్కివెక్కి ఏడ్చింది.ప్రశాంతి ఒక్క క్షణం చిరాగ్గా, అనుమానంగా చూసింది.ఇక్కణ్ణుంచి వెళ్లిపోగానే అందరూ చర్చించే విషయం ఒకటే. నవీన్‌ ప్లేస్‌లో వచ్చే అదృష్టవంతుడెవడురా అని!ఈపాటికి పైరవీలు ప్రారంభమై వుంటాయి.నవీన్‌ చాలా కలలు కన్నాడు. ఇది కలలు లేని నిద్ర.ప్రతి ఆరునెలలకోసారి అన్ని టెస్ట్‌లు చేయించుకునేవాడు. డైట్‌ స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవాడు. ఎగ్‌ ఎల్లో తినేవాడు కాదు. అది కొలెస్ట్రాల్‌. ఆయిలీ ఫుడ్స్‌ నిషిద్ధం. ఇష్టాలన్నీ అణచేసేవాడు.పురోహితుడొచ్చాడు. జరగాల్సిన కార్యక్రమాన్ని వివరించాడు.శవాన్ని బాక్స్‌లోంచి బయటికి తీశారు. ప్రశాంతి వెక్కివెక్కి ఏడుస్తోంది. వాళ్లకి పిల్లలు లేరు. ప్లానింగ్‌లో భాగంగా, ఇల్లు తర్వాతే పిల్లలు.ఈ భూగోళానికి మనం అతిథులు మాత్రమే.. ఈ వాక్యాన్ని నేనే రాశాను. వృత్తిలో భాగంగా రోజూ ఏదో ఒకటి రాయాలి. మనం చదివే పుస్తకాలు, వినే ప్రవచనాలు దేన్నీ జీవితానికి అన్వయించుకోం.వాస్తవంలోకి వస్తే మళ్లీ పేడపురుగులా జీవితాన్ని దొర్లిస్తూ వుంటాం. నవీనంటే నాకు అసూయ. వాడికి ఇల్లుంది. నాకు లేదు. నాకంటే జీతమెక్కువ. నా జీతం నాకు చాలదు. వాడికి లగ్జరీకారుంది.వైకుంఠరథం ఆగింది. ఏవేవో శ్లోకాలు, కొటేషన్లు దాని మీద రాశారు. డ్రైవర్‌ నిర్వికారంగా దిగాడు.‘‘స్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వన్‌ అవర్‌లో వెళ్లిపోదాం’’ చెప్పారెవరో.నవీన్‌ బాడీని నలుగురు పట్టుకున్నారు. తెల్లటి బనీను, పంచె. మెడలో గోల్డ్‌చైన్‌. నున్నగా షేవ్‌ చేసిన గడ్డం. ఎక్కడా కొవ్వు లేకుండా ఫిట్‌గా ఉన్న బాడీ. చాలాకాలం బతకాల్సినోడు.వేలికున్నఉంగరాలు,మెడలోని గొలుసు తీసేశారు. ఇంటి ముందు ఆవరణలో ఒక కుర్చీలో బాడీని వుంచి ఇరువైపులా పట్టుకున్నారు. రెండు బకెట్లతో గోరువెచ్చని నీళ్లొచ్చాయి. ఒకచెంబులోకుంకుడురసం. నవీన్‌ తండ్రి రెండేళ్ల క్రితం పోయాడు. హార్ట్‌ పేషెంట్‌. డబ్బులు ఖర్చవుతాయని ఆయనకి సరైన వైద్యం చేయించలేదని అంటారు. ఆ తర్వాత ఆరునెలలకి తల్లి కూడా పోయింది. వాళ్ల కోసం పెద్దగా దుఃఖించినట్టుగా కూడా లేడు. తల్లి పోయిన మరుసటి రోజే బోర్డ్‌ మీటింగ్‌కి అటెండయ్యాడు.‘ఎమోషన్స్‌ వుంటే లైఫ్‌లో ప్రమోషన్స్‌ రావు’– ఇది కూడా అతని కొటేషనే.నేనూ, ధీరజ్, ప్రశాంతి,నవీన్‌ నలుగురం ఎంబీఏలో క్లాస్‌మేట్స్‌. ధీరజ్‌తో ప్రశాంతి చాలా క్లోజ్‌. ఒకరకంగా లవ్‌. ఒకర్నొకరు దిలేవాళ్లు కాదు. చదువు తర్వాత నేను జర్నలిజం వైపు వచ్చాను. నవీన్‌కి మంచి కంపెనీలో జాబ్‌వచ్చింది.

ధీరజ్‌ ఇంకా ట్రయల్స్‌లో వుండేవాడు.ఒకరోజు నన్ను కాఫీషాప్‌కి రమ్మంది ప్రశాంతి. కూచున్న వెంటనే ఏడవడం స్టార్ట్‌ చేసింది.‘ధీరజ్‌ చాలా పొసెసివ్‌గా మారిపోతున్నాడు. నవీన్‌ నాకు ఇప్పిస్తానంటే వద్దంటున్నాడు. అసలు నవీన్‌తో మాట్లాడితేనే మండిపోతున్నాడు.’’ ఇవే వాక్యాల్ని అటు ఇటు తిప్పి చాలాసేపు మాట్లాడి వెళ్లిపోయింది.తర్వాత ధీరజ్‌ నుంచి ఒకరోజు ఫోన్‌.‘‘ప్రశాంతి జాబ్‌లో చేరింది. ఆ నవీన్‌ ఆఫీస్‌లో’’‘‘అయితే ఏంటి?’’‘‘ఇప్పుడు దానికి నాకంటే వాడే ఎక్కువ’’‘‘అది ఇదని అమ్మాయిల్ని చీప్‌గా మాట్లాడకు. జాబ్‌ లేదని నీకు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌’’‘‘జాబ్‌ లేదనే నన్నొదిలేసింది. నవీన్‌కి మేనేజర్‌ పోస్టుంది. పైగా సేమ్‌ క్యాస్ట్‌. ఇంట్లో ప్రెషర్స్‌ ఉండవు. షికార్లకు నేను, పెళ్లికి వాడు...’’‘‘సైకోలాగా మాట్లాడకు’’‘ప్రేమిస్తే తెలిసేది నా పెయినేంటో’’ వెక్కిళ్లతో ఫోన్‌ పెట్టేశాడు.నెలరోజుల తర్వాత ప్రశాంతి,ధీరజ్‌ కొంచెం దూరంలో నిలబడి ప్రశాంతిని చూస్తున్నాడు. అసలు వాడు నవీన్‌ని చూడ్డానికొచ్చాడా? ప్రశాంతి కళ్లలో బాధని చూడ్డానికొచ్చాడా? లోపల వాడిలో శాడిస్టిక్‌ హ్యాపీనెస్‌ వుందా? ఏమోబయటపడ్డం లేదు. మనుషులంతా ఇంతే, లోపల ఏంఆలోచిస్తుంటారో . ఆలోచనలు మదపుటేనుగుల్లాంటివి. అవి మనల్ని తొక్కిపడేస్తాయి.వైకుంఠరథం నుంచి పాడెని దింపారు. నవీన్‌ని అందులోపడుకోబెట్టారు. మా ఇంట్లో ప్లాస్టిక్‌ కుర్చీలో కూచోడానికే ఇబ్బందిపడేవాడు. కుషన్‌ లేకపోతే వాడి వల్ల కాదు.వెదురుబద్దలపై కాసింత గడ్డి, పాడెలోని అసౌఖ్యం తెలిసే అవకాశం లేదు.‘గోవిందా’ అని అరుస్తూ పాడెని ఎత్తారు. ప్రశాంతి కుప్పకూలిపోయింది.‘‘శ్మశానానికి వెళదామంటావా?’’ అడిగాడు ధీరజ్‌.‘‘నేను వైకుంఠరథంలో వస్తా’’‘‘ఎందుకు కారుందిగా’’‘నువ్వు కారులో రా, శ్మశానం నుంచి కారులో వెళ్లిపోదాం’’నేను వైకుంఠరథంలో కూచున్నాను. చుట్టూ కొంతమంది గంభీరంగా, భావరహితంగా వున్నారు. ప్రశాంతితో పాటు చాలామంది కార్లలో బయలుదేరారు. రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్‌.వైకుంఠరథాన్నిభయంగా చూస్తున్నారు. చనిపోయింది తాము కాదనే ఆనందంతో పాటు, ఎప్పటికైనా తాము కూడా చనిపోవాల్సిందే అనే భయం వాళ్ల కళ్లలో కనిపిస్తోంది.హరిశ్చంద్ర వాటికలో రథం ఆగింది. కారులో నుంచి ప్రశాంతి దిగింది. కలలో నడుస్తున్నట్టుగా వుంది. జరుగుతున్నదంతా నిజం కాకపోతే బాగుండు అన్నట్టు చూస్తోంది.నిన్న రాత్రి వాళ్లు చాలా కబుర్లు చెప్పుకుని వుంటారు. ఈ సమ్మర్‌లో వెళ్లేయూరోప్‌ ట్రిప్‌ ప్లానింగ్‌ గురించి మాట్లాడి వుంటారు. నిద్రలేచే సరికి జీవితం మారిపోయింది.దహనవాటికల్లో ఒకదాని మీద నవీన్‌కుమార్‌ పేరు రాశారు.‘‘అదేంటి మీ ఆచారం దహనం కాదు కదా?’’ ఎవర్నో అడుగుతున్నాడు ధీరజ్‌.‘‘సిటీల్లో అవన్నీ ఎక్కడ కుదురుతాయి సార్, ఖననమంటే ప్లేస్‌ లేదంటున్నారు. కాదు కూడదంటే కాస్టీ›్ల చెబుతున్నారు. అందుకే ఇలా... ఖర్చుకి వెనుకాడకుండా గంధపుచెక్కలు కూడా తెప్పించాం.’’‘‘రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అని పడి చచ్చాడు. చివరికి ఆరడుగుల నేల కూడా దక్కలేదు వీడికి. గాలిలో కలిసిపోతున్నాడు’’ అన్నాడు ధీరజ్‌.ఎవరికి మాత్రం ఏం దక్కుతుంది? మార్కుల కోసం ప్రొఫెసర్లని కాకా పట్టినవాడు.. ఎందర్నో ఉద్యోగాల్లోంచి తీసేసినవాడు.. సాటివాడు ఒక మనిషేనని గుర్తించలేనివాడు... అంతా శాశ్వతమని నమ్మినవాడు... కట్టెలపై నిద్రపోతున్నాడు.

శవం చుట్టూ అందరూ తిరుగుతున్నారు. బంధువులెవరో నిప్పుపెట్టారు. చిన్నగా మంట... మొదట నెయ్యి, తర్వాత కిరోసిన్‌. మంటని ఎగదోశారు.అపురూపంగా చూసుకున్న శరీరం కాలిపోతోంది. జీవుడేమయ్యాడు? చిటపటమని చితిమంటలు. ప్రశాంతి నిర్వికారంగా చూస్తూ వుంది. రాబోయే ఇరవయ్యేళ్లకి సరిపడా ప్లాన్‌ చేశారు. పిల్లల్ని ఎప్పుడు కనాలి.. ఎలా పెంచాలి.. ప్లేస్కూల్‌ ఎక్కడ చేర్చాలి...స్కూలింగ్‌ తర్వాత కెరీర్‌ ఏంటి... ఇరవయ్యేళ్ల తర్వాత ఏ కంట్రీలో అవకాశాలు ఎక్కువుంటాయి..టప్‌మని శబ్దం.‘కపాలమోక్షం’ అంటున్నారెవరో..దహనవాటికకి కొంచెం దూరంలో ఎవరో ముసలమ్మ.. చేతిలో గిన్నె ఆడిస్తోంది. పురాతన బండరాళ్లలో కనిపించే ముడుతలు ఆమె మొహంలో. జీవితం కంటే మృత్యువునే ఎక్కువ చూసుంటుంది.‘‘దానం చేయకుండా వెళ్లకూడదు బాబూ..’’స్నేహితుడు చచ్చిపోతే క్యాబ్‌ ఖర్చుల గురించి ఆలోచించాను.. క్రూరత్వం నాలో వుందా? నగర జీవితంలో వుందా?పర్స్‌ తీసి రెండు ఐదువందల నోట్లు వెళ్లతో పట్టుకున్నా... ముసలమ్మ ఆశ్చర్యంగా చూసింది.గిన్నెలో వేశాను. శ్మశాన వైరాగ్యమంటే ఇదేనేమో!ధీరజ్‌ కారు తీశాడు.‘‘నేను రాను, నడిచి వెళతా’’ అన్నాను.‘‘నడిచా.. మీ ఇల్లెంత దూరమో తెలుసా’’‘‘నేను వెళ్లేది ఇంటికి కాదు.’’‘‘మరి’’దూరంగా మంటలు కనిపిస్తున్నాయి.గమ్యం అర్థమైంది. గమ్యం లేకుండా కాసేపు నడవాలనిపించింది. శ్మశానం కాంపౌండ్‌ గోడ దాటి వెనక్కి తిరిగి చూశాను.ఇల్లు ఇక్కడుంటే.. మనుషులంతా ఎక్కడెక్కడో వెతుకుతూ వుంటారు.
∙జి.ఆర్‌.మహర్షి 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా